top of page
Writer's pictureSesharathnam P V

ఈ నేల మనది... ఈ ఊరు మనది

గమనిక : ఈ కథ మనతెలుగుకథలు.కామ్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సంక్రాంతి 2021 కథల పోటీలో ప్రత్యేక బహుమతి గెలుచుకుంది. ఎంపికలో పాఠకుల అభిప్రాయం కూడా పరిగణనలోకి తీసుకున్నాం.

'Ee Nela Manadi Ee Vuru Manadi' written by Sesharathnam P V

రచన : P. V. శేషారత్నం

“ఇదిగో ముందే చెబుతున్నాను. నాచేత ఒట్టేయించుకున్నారు కనక మీఊరు వస్తున్నాను. అసలే నాకు కోపం ఎక్కువ.అక్కడేదయినా జరిగి నాకుగానీ తిక్కరేగిందంటే?” అన్నాడు మల్లేశం.

“ఏముంది? ఈసారి నిజంగానే ఎవరినో ఒకరిని వేసేసి మళ్లీ జైలుకెళ్లిపోతావు. అంతేగా?” నవ్వాడు చంద్రబోస్‌.

గంట క్రితం ఇద్దరికీ ఆ రైల్లోనే పరిచయమయింది.


చంద్రబోస్‌ మిలిటరీలో లెఫ్టినెంట్‌గా పనిచేస్తున్నాడు. సరిహద్దుదళంలో ఉంటూ అతడు చేసిన సాహసకార్యాలవల్ల దేశానికి పాకిస్థాన్‌ నుంచి ఎన్నోసార్లు ముప్పు తప్పింది. అందుకుగాను స్వయంగా రక్షణమంత్రి అభినందనలు కూడా అందుకున్నాడు.అంకితభావంగల ఆఫీసరుగా ఎన్నో అవార్డులు పొందాడు.మిలిటరీలో చేరి ఇన్నేళ్లయినా ఒక్క వారం కూడా సెలవు తీసుకోకుండా, అహర్నిశలు దేశ భద్రత కోసమే తాపత్రయపడే చంద్రబోస్‌ అంటే క్రిందివాళ్లకు గౌరవం. పైఅధికారులకు ఆదరం.


అటువంటి చంద్రబోస్‌కి ఒకసారి యుద్ధంలో, ప్రాణం కోల్పోతున్న ఓ సైనికుడు తన స్వంత ఊరును తలుచుకుని తలుచుకుని విలవిల్లాడడం చూసి మనసు కదిలిపోయింది. ఎందుకో ఉన్నట్టుండి అతనికీ తనస్వంత ఊరు చూడాలని మమకారం పుట్టింది.వెనక్కి గతంలోకి తిరిగినట్టు కూర్మాపురంలోని తన బాల్యంలోకి పరుగులు తీసింది చంద్రబోస్‌ మనసు.


పచ్చని చెట్లతో ఆకుపచ్చని రంగులో మెరిసిపోతున్న భూమి ....ఆనందంగా కిలకిలారావాలు చేసే పక్షులు... పచ్చిక బయళ్లలో మేసే పశువులు... ఊరి చివరి చెరువునిండా తామరపూలు... చెరువులో రెక్కలు విదుల్చుకుంటూ ఈదే పక్షులు...


ఓ పదేళ్ల అబ్బాయి పిల్లనగ్రోవి ఊదుకుంటూ, పచ్చని పొలాలగట్ల మీదుగా పరిగెత్తుతూ... దేవాలయం దాటి ...తర్వాత చెరువుగట్టుకు చేరి, చేతిలోని పుస్తకాల సంచీ గట్టున విసిరేసి..పై దుస్తులు విడిచి ...చెడ్డీతో చెరువులోకి దూకి... ఆనందంతో

కేరింతలు కొడుతూ... ఈదుతూ... మునకలు వేస్తూ తామరపూలు కోసుకుని, ఒడ్డుకు వచ్చి అక్కడ ఉన్న చెట్టు మొదట్లో పుట్టదగ్గర ఉంచి దణ్ణం పెట్టాడు.పుస్తకాల సంచీ భుజాన తగిలించుకుని మళ్లీ వెనక్కి పరిగెడుతూ దారిలోని ఆవు గంగడోలు నిమురుతూంటేఅది మోర ఎత్తి “అంబా” అంది ఆనందంతో... మళ్లీ పరిగెత్తుకు వెళ్తూంటే వాన.... దారిపొడుగునా ఆనందంతో పొలం పనులు చేసుకుంటున్న మనుషులు... వానవెలిసి మళ్లీ సూర్యకిరణాలు... ఏడురంగుల ఇంద్రధనస్సును తన్మయంగా చూస్తున్న కుర్రాడు...

జ్ఞాపకాల దొంతరలో చంద్రబోస్‌ మనసులో వసంతరాగం ప్రతిధ్వనించింది. పులకించిపోయాడు.

ఇకమీదట బ్రతికున్నంత కాలం తన ఊరివాళ్లతో ఏడాదికి నెలరోజులయినా గడపాలని నిశ్చయించుకున్న చంద్రబోస్‌, ఉత్సాహంగా స్వంత ఊరికి బయలుదేరాడు. ప్రయాణంలో తను మిలిటరీ ఆఫీసర్‌ని అని గొప్పలు చెప్పుకోవడం ఇష్టంలేక జనంతో మమేకమవుతూ గడ్డమయినా గీయకుండా సివిల్‌ దుస్తుల్లోనే రైలెక్కాడు.రైలు ప్రయాణంలో పరిచయమైన మల్లేశం చాలా చిత్రమయిన మనిషిలా కనిపించాడు చంద్రబోస్‌కి. మనిషి మంచివాడే కానీ కాస్త ఆవేశంపాలు ఎక్కువ.

మల్లేశానికి అది తనకు అన్యాయం జరిగింది, అనే ఉక్రోషం నుంచి పుట్టింది అని అర్ధంచేసుకున్న చంద్రబోస్‌.. ' మల్లేశం! పరిచయమై కొద్దిసేపే అయినా, ఎందుకో గాని నాకు నువ్వు ఆప్తుడుగానే కాక చాలా తెలివైనవాడివి కూడా అనిపిస్తోంది. అసలు నువ్వు జైలుకెలా వెళ్లావు?” అన్నాడు.


మల్లేశం మొహం ఎర్రగా కందిపోయింది. పళ్లు పటపటలాడించాడు. “నేనిపుడు మావూరు వెళ్లాలనుకుంటున్నది ఎందుకో తెలుసా సార్‌? ఇద్దరి పని పట్టేందుకు. ఒక స్వార్ధపరుడి తమ్ముడు మా ఊళ్లో ఓ అమాయకురాలయిన పేదపిల్లను ప్రేమనాటకంతో ముగ్గులోకి దింపి, అవసరం తీర్చుకుని ఆమెను తేనెమాటలతో చెరువుకట్టకు రప్పించి అందులోకి తోసేసాడు.

మర్నాడు ఆమె శవంపైకి తేలింది.దాంతో ఈ స్వార్ధపరుడు ఊరి పెద్దకు లంచం ఇచ్చి నామీదకు నెట్టేసాడు.”


“నీమీదకే ఎందుకు?” ఆశ్చర్యం ధ్వనించింది బోస్‌ కంఠంలో.


“నా దురదృష్టంకొద్దీ ఆ పిల్ల నాకు మరదలు. తల్లీతండ్రీ లేని ఆపిల్ల మాయింట్లోనే ఉంటోంది.ఆ నెపంతో ఆమెతో నాకు అక్రమసంబంధం దొంగసాక్ష్యాలతో నిరూపించి, ఆస్త్రీహత్య, భ్రూణహత్య, నేరాలకు నన్ను బాధ్యుడిని చేసి జైలుకి పంపించారు.అమాయకురాలైన నా భార్య అదంతా నిజమని నమ్మి ఆత్మహత్య చేసుకుంది.

నాలుగేళ్ల నాకొడుకును ఊళ్లోని మేస్టారుగారు చేరదీసి,చదివిస్తున్నారని మాత్రం తెలుసు... అందుకే వాళ్లమీద పన్నెండేళ్లుగా పగతో రగిలిపోతూనే వున్నాను.”


“అంటే ఇప్పుడు నువ్వు నీ శత్రువులను చంపాలనుకుంటున్నావా?” సాలోచనగా అడిగాడు చంద్రబోస్‌.


“అవును ఆఊళ్లోని రైతులు, పనివాళ్లు, ఇంకా ఎందరో ఇప్పటికీ వాళ్ల స్వార్దానికి బలయి, ఆక్రోశిస్తూనే వున్నారని జైల్లో ఉండగా నన్ను చూడ్డానికొచ్చిన మావూరివాడొకడు చెప్పాడు.


ఊరికి వాళ్ల పీడ వదిలించేస్తాను.” మల్లేశం మొహం ఎర్రబడిపోయింది.


“వాళ్లు పోతే వాళ్ల కొడుకులో, తమ్ముళ్లో మరికొంతమంది తయారవుతారు. ఇలా చంపుకుంటూ పోతే దీనికంతమెక్కడుంది?”


“అంటే మీవుద్దేశ్యం వాళ్లను అలా క్షమించి వదిలెయ్యమనా?” కోపం మల్లేశం గొంతులో.


“అంతకంటె నీ పగను నీ తెలివితో ఊరి బాగుకోసం నిర్మాణాత్మకంగా ఉపయోగిస్తే?


అవును మల్లేశం... నిజానికి చంపాల్సింది మన దేశంలోని యువతను మతం పేరుతో ప్రలోభపెట్టి దేశంలో బాంబుబ్లాస్ట్‌లాంటి విద్రోహం తలపెట్టే శక్తులుగా తయారు చేయాలని చూస్తున్న 'ద్రోహులను....కానీ నువ్వు మన దేశంవాళ్లనే చంపుతానంటున్నావు.”


‘ దేశస్థులే అయినా జనం రక్తం తాగుతున్నవాళ్లు కదా వీళ్లు?”


“అందుకే అంటున్నాను. జనాన్ని చైతన్యం దిశగా నడిపిస్తే, నువ్వే వాళ్ల నాయకుడివి కావచ్చు. అపుడు పదవి పోయిన వీళ్లు చచ్చినవాళ్లతో సమానం కారా మల్లేశం?”


“మాటలతో కోటలు కట్టేస్తున్నారు మీరు. అయినా మీకేంసార్‌ ఎక్కడో ఆఫీసరుగా దర్జాగా బ్రతుకుతూ ఏడాదికోసారి వచ్చి గ్రామాన్ని బాగుచేసేయడం చిటికెలో వని అంటున్నారు కానీ, వాస్తవానికి అది ఎంత కష్టమో అనుభవిస్తేనే తెలుస్తుంది. అయినా జైలునుంచి వచ్చిన నన్ను జనం ఎందుకు నమ్ముతారు లెండి?” కాస్త అపనమ్మకం తొంగిచూసింది మల్లేశం మాటల్లో.


“నీ సత్ష్రవర్తనతో శిక్షాకాలానికి ముందే జైలునుంచి విడదలయ్యానంటున్నావుకదా! ఊరిని నీదారికి తెచ్చుకోగలిగే తెలివితేటలు సాహసం నీకున్నాయని నానమ్మకం.”

మల్లేశం ఆలోచనలో పడడం గమనించి, ఇనుము కాలుతున్నప్పుడే సుత్తి దెబ్బ వెయ్యడం సమంజసమని అనుకున్న చంద్రబోస్‌ “నువ్వు పదిమందికి సాయంచేస్తే ఆ భగవంతుడు నీకొడుకును చల్లగా చూస్తాడు మల్లేశం!” మందస్మితంగా అన్నాడు.

ఆ మాటతో ఆర్తితో తలెత్తిన మల్లేశం కళ్లనిండా నీరు. 'నేనెంతో ప్రేమించిన నా భార్య స్కృతిగా నాకు ఈలోకంలో మిగిలింది వాడొక్కడే. అందుకే జైల్లో అంత కఠిన శిక్షను భరిస్తూ కూడా ఇంతవరకు బ్రతికి వున్నాను.”


“సరే నీకిష్టమైతే ముందే అనుకున్నట్టు నాతో మావూరు రా. ఈలోగా నువ్వేం చెయ్యాలో ఆలోచించుకునేందుకు నీకు కాస్త వ్యవధి దొరుకుతుంది. తర్వాత మీవూరెళ్లు...పద మనం బస్టాండుకెళదాం.” ఏమనుకున్నాడోయేమో మల్లేశం చంద్రబోస్‌ని అనుసరించాడు.


బస్టాండులో అప్పుడే ఆగిన బస్సు లోంచి జనం దిగుతున్నారు. మల్లేశంతో బస్టాండులో అప్పటికే టీ తాగడం పూర్తి చేసిన చంద్రబోస్‌ 'ఈబస్సు కూర్మాపురం వెళ్తుందికదా!రెండు టికెట్లు దొరుకుతాయా?” అని ఊదుకుంటూ టీ తాగుతున్న కండక్టర్‌ని అడిగాడు.


అతగాడు తలయినా తిప్పకుండానే “ఆ... వెళ్లికూర్చోండి. ఐదునిమిషాల్లో బయలుదేరుతుంది.” అన్నాడు బిస్కెట్‌ని కొరుకుతూ.


మల్లేశం ఉలిక్కిపడ్డాడు. “మీది కూర్మాపురమా సార్‌?”


“అవును ఏం? అక్కడా నీకు శత్రువులున్నారా?” నవ్వాడు చంద్రబోస్‌.


“కాదు నాది ఆవూరే.” ఈసారి విస్తుపోవడం చంద్రబోస్‌ వంతయింది. అయినా నిలదొక్కుకుంటూ “సంతోషం. పదవెళ్లాం. నాకు మరో మనిషి అండ దొరికిందన్నమాట.”


ఈసారి ఎర్రమట్టితో బురదగొట్టుకు పోయినట్టున్న బస్సును చూసి చిరాకెయ్యలేదు మల్లేశానికి.


రెండురోజులుగా ప్రయాణంలో నిద్ర సరిగ్గా లేకపోయినా బస్సు పరిగెడుతుంటే కదిలిపోతున్న ఊళ్లను, మనుషులను, అపురూపంగా రెప్పవెయ్యకుండా చూస్తున్నాడు మల్లేశం.


తను జైలుకి వెళ్లి పన్నెండేళ్లయిపోయింది. సగంలో ఆపేసిన చదువును ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ అక్కడే చివరకి ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేయడమే కాకుండా మెకానిక్‌గా శిక్షణ పొందుతూ, జైలు అధికారులతో ఎన్ని ప్రశంసలు పొందాడో గుర్తొచ్చేసరికి కండలు తిరిగిన అతని బలమైన భుజాలు గర్వంతో ఉప్పాంగాయి.


బస్సు ఏదో ఊళ్లో ఆగి కదలబోతుంటే వెనకనుంచి ఓ యువకుడు పిల్లలతో కలిసి పరిగెత్తుకు వస్తూండడం గమనించిన మల్లేశం కండక్టర్‌కు చెప్పాడు. 'అయ్యో మిమ్మల్ని చూడలేదు ప్రకాశంమాస్టారూ! అదిగో అక్కడ సీట్లన్నీ ఖాళీనే. వెళ్లి కూర్చోండి.”


వాళ్లంతా చంద్రబోస్‌ మల్లేశంల వెనక సీట్లలో కూర్చున్నారు. పిల్లలు వాళ్ల మాస్టారితో బస్సు నడుస్తున్నంతసేపు వాదోపవాదాలు చేస్తూంటే ఆసక్తిగా వింటూ నవ్వుకున్నాడు మల్లేశం.


“మాస్టారూ ఇవాళ మీ పుట్టినరోజుకదా! హేపీబర్త్‌ డే టూ యూ!'రాజుతో బాటు పిల్లలంతా ఒక్కొక్కరుగా ప్రకాశానికి షేక్‌ హేండ్‌ ఇచ్చారు. 'మరి నాకేం బహుమతి ఇస్తారు.” అన్నాడు నవ్వుతూ ప్రకాశం. పిల్లలు తెల్లమొహం వేసారు.


మా క్లాసులో ఎవరి పుట్టిన రోజయినా మేం మొక్కలే బహుమతిగా ఇస్తుంటాం. నాపుట్టినరోజుకి వచ్చిన మొక్కలను సిటీలో మా ఇంటి రూఫ్‌ మీద తోటలా వేసాను.” అన్నాడు రాజు అనే ఓ కుర్రాడు చురుగ్గా.


తన కొడుకూ ఇలాగే ఉంటాడేమో! నిట్టూర్చాడు మల్లేశం.


'మేడమీద పూలతోటా?వింతగాఉందే?నీ అయిడియా చాలా బావుంది రాజూ. కాని... నీరు???



“మాయింటి పైకప్పులమీంచి పడినపుడు పట్టిన వాన నీటిని మొక్కలకు పోస్తాం. లాన్‌లు తడుపుతాం. టాయ్‌లెట్లు శుభ్రం చేసుకుంటాం. మాపనిమనిషి వాటితో గిన్నెలు కూడా శుభ్రం చేస్తుంది.”


వెరీగుడ్ రాజూ! నువ్వు సెలవులకి వచ్చినపుడల్లా మాకు కొత్త ఐడియాలు ఇస్తున్నావు. ప్రకాశం మాటలకి పిల్లలంతా సంతోషంతో చప్పట్లు కొడుతుంటే కండక్టరు, తక్కిన ప్రయాణీకులూ కూడా చేతులు కలిపారు.


ఇంతలోనే బస్సు వెళ్తున్న దారిలో ...ఓ ఆవు బాధతో నేలమీద దొర్లుతుంటే కదిలిపోయారు పిల్లలంతా.


మల్లేశం ఇంక ఆగలేక వాళ్ల సంభాషణలో కలగజేసుకున్నాడు. “'పట్నాల్లో పశువుల గడ్డి పెంచేందుకు ఎక్కడ చోటుంది?


అందుకే మనం నిర్లక్ష్యంగా 'పెంటమీద పారేసిన ప్లాస్టిక్ కవర్లు తిని కడుపులో విష వాయువులు పుట్టి మన స్వార్ధంవల్ల భరించలేని బాధతో ఇలా నరకయాతన అనుభవిస్తూ చచ్చిపోతాయి.”


పిల్లలు మూకుమ్మడిగా “అయితే ఈ ఆవు ఇప్పుడు చచ్చిపోతుందా?” బాధపడిపోయారు.


“అలా బాధపడేకంటె ఓ మంచిపని చేస్తే ఫలితముంటుందికదా! ఈరోజునుంచీ మీరు ప్లాస్టిక్ వాడకండి.


మీపుస్తకాల సంచీ నుంచి, లంచ్‌ బాక్సు పెట్టుకునేవరకు అన్నీ గుడ్డ సంచులే వాడండి.యింట్లో కూరగాయలకీ మీ పెద్దవాళ్లతో ఇలాంటివే వాడించండి.”


మల్లేశాన్ని సమర్ధించాడు ప్రకాశం మాష్టారు. బాగా చెప్పారు సార్‌. మనవల్ల ఏ మూగజీవికీ అపకారం కలగ కూడదు.”అన్నాడు.


ఇదంతా గమనిస్తున్న చంద్రబోస్‌, శభాష్‌! ఊళ్లోకి అడుగు పెట్టకుండానే సంస్కరణలు మొదలుపెట్టావన్నమాట.” అన్నాడు.


ఇంతలో మధ్యలో ఎక్కిన నరసింహం అనే 'పెద్దాయనని రాజు పలకరించాడు. “తాతయ్యా! పట్నంలో చదువుకోవడానికి ఇక్కడనుంచి ఎడ్లబండిలో వెళ్లినవాడిని మంచి బస్సులో ఇలా వస్తున్నానంటే మన ఊరు ఎంత బాగుపడిందో చూసావా!”


పెద్దాయన కంఠానికి దగ్గు అడ్డుపడింది." ఏం బాగునాయనా! అటుచూడు ఈదారిలోనేరా మీనాన్న చిన్నప్పుడు స్కూలు ఎగ్గొట్టి ఈతకొట్టి ఆనందించే చెరువుండేది. ఆ చెరువుగట్టు నే ఓ పాముల పుట్ట ఉండేది.


ఎప్పుడో అవన్నీ భూకజ్ఞాదారుల పొట్టల్లోకి వెళ్లిపోయాయిరా రాజూ! ఈ ఊరి ప్రెసిడెంటు ఉన్నాడే మహా ఆశపోతురా.”


మల్లేశం చంద్రబోస్‌తో ఆవేశంతో అన్నాడు. చూసారా సార్‌ నేను చెప్పలేదూ!ఇంకా ఆ పెంచలయ్యే ప్రెసిడెంటయివుంటాడు. అవునా 'పెద్దాయనా?”


“అవును బాబూ! డబ్బుతో ఓట్లు కొనేస్తాడు. ఇన్స్‌ పెక్షన్‌కొచ్చే ఆఫీసర్లని లంచాలతో కొనేస్తాడు. అప్పటి చెట్లన్నీ కొట్టేసారు... చెరువునూ పూడ్చేసి, ఇదిగో ఇలా ఇళ్ల స్థలాలుగా చేసి అమ్మేసారు. చూడండి అక్కడ ఎన్ని ఇళ్లు లేచాయో?”


“అయ్యో నేనింకా చెరువులో ఈత కొడదామనుకున్నానే! అవునుగానీ తాతయ్యా! అప్పట్లో నువ్వు పాముకాటుకి మందువేసేవాడివటగా!” రాజుమాటల్లో విచారంతోబాటు కుతూహలం.


“అప్పట్లో ఆ మూలికలు పక్క అడవిలో దొరికేవి. ఇప్పుడా అడవీ, చెట్టూ, పుట్టలూ మూలికలూ ఏవీ?


“అంటే అభివృద్ధి పేరుతో పంటపొలాలు తోటలు చెట్లు, అడవులు అన్నీ కొట్టేస్తున్నారన్నమాట. మన పంచప్రాణాలను మనమే నాశనం చేసుకుంటున్నాం కనుకనే ప్రకృతి గతి తప్పి ఇంతగా ఎండలు... తుఫానులు, వరదలు, భూకంపాలు.” అన్నాడు మల్లేశం ఆవేశంగా.


“అవున్నాయనా! అసలు ఇంతకు మునుపు ఏనాడన్నా సునామీలు ఎరుగుదుమా?రెండేళ్లక్రితం అయితే ఊళ్లోకి ఎరువుల ఫాక్టరీకూడా వచ్చి దాని రసాయనాలు చెరువులో కలిసి ఆ మధ్య చేపలు వివరీతంగా చచ్చిపోయి ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఇపుడు చెరువే లేదనుకో.” నరసింహంగారి గొంతులో బాధ సుళ్లు తిరిగింది.


“అయ్యో ! మరి అభివృద్ధి జరిగేదెలా తాతయ్యా?” అన్నాడు రాజు విస్మయంగా.


“అభివృద్ధి అంటే ఉన్నవాటిని నాశనంచేసుకోవడం కాదు రాజూ!”

“అవును రాజూ! ఎటు తిరిగీ అన్నివిధాలా చెడిపోతున్నది రైతే…


ఊరి ప్రెసిడెంటు లంచాలు తిని చూపిస్తున్న దొంగలెక్కల వల్ల వ్యవసాయదారుడికి అనావృష్టితో పంటలు పండకపోయినా, అతివృష్టితో పంటలు నాశనమయినా పన్నులు మాత్రం కట్టక తప్పడం లేదు. ఏంచేస్తాం?”


“మల్లేశం! వింటున్నావా ఎలావుందో ఇప్పుడు మన ఊరు?” చంద్రబోస్‌ ప్రశ్నకు నిర్లిప్తంగా సమాధానమిచ్చాడు మల్లేశం.


“ఏవూరు చూసినా ఏమున్నది గర్వకారణం?చెట్లు కొట్టేస్తున్న మనుషులు... పచ్చని చేలూ...మాయమై... బీడు పడిపోయిన భూమి... నీళ్లు రాని నల్లాలు... చెత్తతో నిండి దుర్గంధం వెదజల్లే చెత్త కుప్పలు.


ప్లాస్టిక్‌ కవర్లు తిని కడుపుబ్బి బాధపడుతున్న పశువులు. పొగలు వెదజల్లుతున్న వాహనాలు... పొగచూరిన ఆస్పత్రులు. జాగా మార్చాలి సార్‌! కానయితే ఆశాదీపాలయిన ఈ పిల్లలద్వారానే ఏదైనా సాధించొచ్చునేమో అనిపిస్తోంది.”


“అనిపిస్తోందీ! నీబోటిగాళ్లు పూనుకుని ఊళ్లను బాగుచేస్తే మరింకేం? శుభం... హమారా భారత్‌ మహాన్‌.” ఉత్సాహం ఉరకలు వేసింది చంద్రబోస్‌ కంఠంలో.


కండక్టరు మల్లేశం భుజంమీద చెయ్యేసి కుదిపాడు. “దిగండి సార్‌... ఇదే కూర్మాపురం.” చంద్రబోస్‌ కోసం నవ్వుతూ వెనక్కి తిరిగిన మల్లేశానికి అతను కనిపించలేదు. కండక్టర్‌ చెప్పాడు. “మీరు నిద్రపోతున్నారుకదా... మీతో వచ్చినాయన మేనమామను చూసి నాలుగురోజుల్లో కూర్మాపురం వస్తానని, మీరు లేచాక చెప్పమని ముందు ఊళ్లో దిగిపోయారు.”


ఆనందరావు మాస్టారి నీడలో చక్కగా చదువుకుంటున్న పదహారేళ్ల కొడుకు చంద్రాన్ని చూడగానే మల్లేశం మనసు పొంగిపోవడంతోబాటు శాంతించింది.


మాస్టారు ముందుగానే ఏదో ఒకరోజు తండ్రి వస్తాడని చెప్పడం వల్లనో,యేమో బిడియంగానే అయినా మల్లేశం చేతుల్లో వాలిపోయాడు చంద్రం. కొడుకు గాత్రస్పర్శాసుఖంతో మల్లేశం మనసు కాస్త కుదుటపడినా, మాస్టారి ద్వారా ఊళ్లోని రాజకీయాలు ప్రజల స్థితిగతులు ఏమీ మారలేదని అర్ధమయింది మల్లేశానికి.


నాలుగు రోజుల తర్వాత మాస్టారితో సహా ఊళ్లో జనసమూహమంతా పొలిమేరకు చేరుకోవడం ఆ జనంలో కలకలం... చూసి విస్తుపోయాడు మల్లేశం.


“ఎంత జనమో! ఊరుఊరంతా పూలదండలతో ఇక్కడే ఎదురు చూస్తోంది. పట్నాలను తగలబెట్టింది చాలక పల్లెను ఉద్ధరించాలనే మిషతో ఎవరన్నా రాజకీయ నాయకుడు వస్తున్నాడా మాస్టారూ!” అన్నాడు మల్లేశం వెటకారంగా.


“ఛ కాదు.వస్తున్నాయన మన కూర్మాపురం హీరో.” అన్నారు మాస్టారు.


“నాకు తెలియని హీరో ఎవరబ్బా ఈ ఊళ్లో?” విస్తుపోయాడు మల్లేశం.


“మీరెప్పుడో ఈ ఊరు వదిలేసారు కనుక మీకు తెలిసుండదు. ఈయన ఈఊళ్లోనే పుట్టి పెరిగి మిలిటరీలో చేరి, లెప్టినెంటయి, పాకిస్తాన్‌కు పక్కలో బల్లెమయ్యారు.


ఏడాది క్రితం సెలవులకు వచ్చినపుడు ఊళ్లోని పిల్లల్ని పోగుజేసి వారిలో “హమారా భారత్‌ మహాన్‌ అంటూ దేశభక్తిని నూరిపొయ్యడమే కాకుండా ప్రకాశం అనే మాస్టారిద్వారా ఊరిబాగుకోసం పచ్చదనానికి పిల్లల్లో చైతన్యాన్ని రేకెత్తించారు. ఊరు ఈమాత్రమైనా బాగుందంటే చంద్రబోస్‌ గారే కారణం. "అన్నారు ఆనందరావు ఎంతో భక్తితో.


“ఆ చంద్రబోసా?... ఆయన నాతోనే వచ్చారుగా. మనవూరి హీరోనని చెప్పకుండా నన్నింతదూరం తీసుకొచ్చారన్నమాట. నా కొడుకును నిశ్చింతగా ఇంక ఆయన చేతుల్లో పెట్టేస్తాను. ఊరంటే ఎంత ప్రేమో ఆయనకి.” మల్లేశం మనసు పొంగిపోయింది.


ఆమాటలకు విస్తుబోయిన ఆనందరావు మాస్టారేదో అనబోయేంతలో జనంలో కలకలం ఎక్కువయింది. “మిలిటరీ వ్యాన్‌ వచ్చేసింది. సుభాష్‌చంద్రబోస్‌ గారికి జై” అని అరవడం మొదలెట్టారు ఊరిజనం. జనం వ్యాన్‌ని చుట్టుముడుతుంటే అందులోంచి దిగిన జవాన్లు జనాన్ని పక్కకు తప్పుకోమని ఒక పెద్ద బాక్సును దింపారు. కాసేపయ్యాక జనాన్ని తోసుకుంటూ బాక్సులోని ఆ వీరుని

మొహాన్ని చూసిన మల్లేశం ఒళ్లు జలదరించింది. “అది చంద్రబోస్‌ దేహం.”


“ఊరికొక్కడుంటే చాలు ఇలాంటి మహాత్ముడు... మన ఊరు ఎంతలో బాగుపడేదని?”


“క్రితం ఏడాది ఊరికి ఎంత చేసాడు బిడ్డ. నిన్న వారి మేనమామ ఊరునుంచి వస్తోంటే మాయదారి లారీ మింగేసిందిట.”


కొనప్రాణంతో కొట్టుకుంటూ కూడా ఇక్కడి మట్టిలోనే కలసిపోవాలని తన అంత్యక్రియలు కూర్మాపురంలోనే చెయ్యమన్నాడుట మన చంద్రబోస్‌... ఊరినెంతగా ప్రేమించాడో నాతండ్రి.”


“ఆయన మిలిటరీ వాడుకదా! అందుకే సైనిక లాంఛనాలతో అప్పగిస్తున్నారు.”


ఆమాటలు వింటూ చేష్టలుడిగిపోయిన మల్లేశాన్ని ఓదార్చేందుకు కొడుకు చంద్రంతో సహా ఎవరికీ శక్తి చాలలేదు.


రెండురోజులుగా చెంపలమీదుగా కారుతున్న కన్నీటిని తుడుచుకోకుండా చంద్రబోస్‌ సమాధివద్దే కూర్చుండిపోయిన మల్లేశం చేతిలో ఎవరో ఓ గులాబీపువ్వును పెట్టారు. ఉలిక్కిపడి మల్లేశం తల పైకెత్తాడు...కొడుకు చంద్రం...


చంద్రం కళ్లల్లో చంద్రబోస్‌ ప్రతిబింబాన్ని చూసి ఉలిక్కిపడ్డాడు.


ఏదో సందేశం మోసుకొచ్చినట్టుగా మల్లేశం చెవివద్ద ఈలలు వేస్తున్నట్టు వీస్తున్న గాలి...


“ఈ ... నే...ల... మ...న...ది...ఈ ...ఊ...రు...మ...న...ది...హ..మా..రా...భా...ర...త్‌.... మ...హా...న్‌...”


వెంటనే ప్రకాశం మాస్టారిచ్చిన దోసెడు పూలను సుభాష్‌ చంద్రబోస్‌ సమాధిపై సమర్పిస్తూ “చంద్రబోస్‌గారూ! మీరు నన్నింతదూరం దగ్గరుండి తీసుకురావడంలో అంతరార్థం నాకిపుడర్ధమయింది సార్‌. నాకొడుకు సాక్షిగా మీకు మాట ఇస్తున్నాను.


ఇకమీదట నా పగను కాదు...మీకిచ్చిన మాటను తప్పకుండా నిలుపుకుంటాను. ఈ ఊరు మనది. ఈ నేల మనది. నాలాంటివారెందరో అలా అనుకుంటేనే మీరు కోరినట్టు హమారా భారత్‌ మహాన్‌గా నిలుస్తుంది.” అన్నాడు మల్లేశం కళ్లు తుడుచుకుంటూ.

+++


రచయిత్రి పరిచయం : P. V. శేషారత్నం



85 views0 comments

留言


bottom of page