top of page
Writer's pictureRavi Kumar Desaraju

గృహమేగా స్వర్గసీమ

గమనిక : ఈ కథ మనతెలుగుకథలు.కామ్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సంక్రాంతి 2021 కథల పోటీలో ప్రత్యేక బహుమతి గెలుచుకుంది. ఎంపికలో పాఠకుల అభిప్రాయం కూడా పరిగణనలోకి తీసుకున్నాం.

Gruhamega Swargaseema Written By Ravi Kumar

Desaraju

రచన :రవి కుమార్ దేశరాజు


రెండ్రోజుల నుంచి ఒకటే ముసురు. ఇళ్లు, రోడ్లు అన్నీ జలమయం అయిపోయాయి. కిటీకీలు, తలుపులు మూసేసి ఉన్నాయి. ఏవి తెరిచినా వర్షం రౌడీలా లోపలికి తోసుకు వచ్చేస్తోంది. న్యూస్ ఛానెళ్ల రూపంలో డ్రాయింగ్ రూంలోకి ప్రవేశించిన డ్రైనేజీ నీరు ఎప్పటిలాగే కంపు కొడుతోంది. టీవీలో ఒకటే హోరు, విలేఖరుల అరుపులు.. అవే దృశ్యాలు పదేపదే దొర్లిపోతున్నాయి. పెద్దాయన ఆలోచనలు కూడా అంతే, ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. ‘‘ఏం చదువులో ఏంటో, ఇంత వర్షంలోనూ స్కూళ్లు నడపాలా? పిల్లలు వచ్చే వేళకి వేడిగా బజ్జీలో, పకోడీలో వేస్తాను. అందాక టీ తాగండి’’ అంటూ పెద్దావిడ వచ్చి పెద్దాయన ఆలోచనలను చెదరగొట్టింది. ఆయనేమీ మాట్లాడకుండా టీ గ్లాసు అందుకున్నాడు.

కొడుకుతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని నాలుగు రోజుల క్రితమే వచ్చారు. వచ్చిన రోజు తమను తీసుకురావడానికి క్యాబ్ బుక్ చేశాడు కొడుకు. వీళ్లు ఇంటి కొచ్చేసరికి పిల్లలు స్కూళ్లకు పరిగెట్టారు. కొడుకూ, కోడలూ ఆఫీసుకు పరిగెట్టే ప్రయత్నంలో ఉన్నారు. వీళ్ల ముఖానికి కాసిని టీ నీళ్లు పోసి, వీళ్లు అవి తాగి కప్పు కింద పెట్టేలోగా ఇద్దరూ గుమ్మందాటేశారు. బహుశా, పిల్లలను తీసుకొచ్చే ఆటోవాడికి ఫోన్ చేసి చెప్పినట్టున్నారు. స్కూలు కాగానే పిల్లలు తిన్నగా ఇంటికే వచ్చేశారు. లేకపోతే డే కేర్ సెంటర్‌కు వెళ్లేవారు. అక్కడ వీళ్లని కాసేపు ఆడించి, స్కూల్లో చెప్పినవే మరోసారి చెప్పి, చదివించి.. హోం వర్కులు ఏమైనా ఉంటే చేయించి-పిల్లల్ని అలా చివరి బొట్టు వరకూ పిండేసి సాయంత్రం చీకటి పడ్డాక వచ్చే తల్లిదండ్రుల బళ్ల మీద, కార్ల మీద పిప్పిని పడేస్తారు. ఏ క్యాడ్బరీయో, ఫైవ్‌స్టారో ఇచ్చి పిల్లల్లో ఉత్సాహాన్ని కాస్త రగిలించి అందరూ బతుకు జీవుడా అంటూ ఇంటికి చేరతారు.

ఇక అక్కడ్నించి టీవీలో కార్టూన్ షోలు చూస్తూనో, మొబైల్లో గేమ్స్ ఆడుతూనో పిల్లలు కాలం వెళ్లదీస్తూంటారు. ఇవేళ అందుకు భిన్నంగా జరిగే సరికి పిల్లలు ఆనందంలో తేలిపోయారు. దానికి తోడు వాళ్లు రాగానే నానమ్మ, తాతయ్యలు దగ్గరకు తీసుకుని ముద్దు చేశారు. ఊళ్లో కొన్న ప్లాస్టిక్ బొమ్మలేవో వాళ్ల చేతుల్లో పెట్టారు. ఆ పిల్లలు పిజ్జాలు, బర్గర్‌లపై చేసే ఖర్చుతో పోలిస్తే ఆ బొమ్మల ఖరీదు చాలా స్వల్పం. కానీ, అవి వారికెంతో నచ్చాయి. పిల్లలిద్దరూ కూడా టీవీ కోసం కొట్లాడుకోకుండా బొమ్మలతో గోలగోలగా ఆడుకున్నారు. ఈలోగా పెద్దావిడ బజ్జీలు వేసి తెచ్చింది. ఆయనకు ప్లేటులో పెట్టి ఇచ్చేసి, పిల్లల్ని పిలిచింది. వేడివేడి బజ్జీల్ని ఆ చేతులోంచి, ఈ చేతిలోకి; ఈ చేతిలోంచి, ఆ చేతులోకి వేసుకుంటూ చల్లార్చి, పిల్లలకు ఇచ్చింది. పిల్లలిద్దరూ కూడా వాటిని ఏదో గ్రహం నుంచి ఊడిపడిన అద్భుత పదార్థంలా చూస్తూ ‘‘చాల బాంది, ఏంటిది?’’ అంటూ పోటీపడి ఊదేశారు.

ఆమె ఎప్పటిలాగే సంతోషపడిందేగానీ; తనకు మిగల్చేదని నొచ్చుకోలేదు. కానీ, ఆలోచనలకు బజ్జీలను ఆసరా చేసుకుంటూ నెమ్మదిగా తింటున్న పెద్దాయన ఇదంతా గమనించాడు. తన ప్లేటులోంచి నాలుగు తీసి ఆమెకిచ్చాడు. ఆమె కంగారుగా ‘‘అయ్యో, నాకొద్దు. మీరు తినండి. ఈ శనగపిండి, నూనె.. అవీ నాకు అంతగా పడవు’’ అంటూ ఓ రెండు తీసుకుని మిగిలినవి వెనక్కిచ్చేసింది.

‘‘సర్లే.. ఏం కాదు, తిను’’ అన్నాడు ఆయన ‘నీ కుంటిసాకులు చాల్లే’ అన్న స్వరంతో.

‘‘మీకేం, మీరెన్నయినా చెబుతారు. అవస్థ పడేది నేను’’ అని మరో రెండు తీసుకుని మిగిలినవి ఆయన ప్లేట్‌లో వేసేసింది.

పిల్లల్ని ఆడించి, వారి అల్లరినీ, ఆటపాటలనీ ఆస్వాదించే సరికి చీకటిపడింది. పెద్దావిడ వంటింట్లోకి వెళ్లి చపాతీలకు పిండి తడిపి పెట్టి, కూరకు బంగాళ దుంపలు ఉడకబెట్టి వచ్చింది. పిల్లలకు ముఖాలు కడిగి, బట్టలుమార్చి, హోం వర్క్ ఉంటే చేసుకోమని కూర్చోబెట్టింది. వర్షం, ట్రాఫిక్ జామ్ వల్ల అనుకుంటా... కొడుకు కోడలు రోజూకంటే బాగా ఆలస్యంగా వచ్చారు. వాళ్లు వచ్చే సరికి చపాతీలు, కూర సిద్ధంగా ఉంచింది పెద్దావిడ. భార్యాభర్తలిద్దరూ ఫ్రెష్ అయ్యి, బట్టలు మార్చుకుని వచ్చారు.

‘‘ఆంటీ, ఇంత హెవీగానా.. నో ఐ కాన్ట్. రాత్రి పూట ఇలా తింటే ఇంకేమైన ఉందా?’’ అంటూనే కోడలు ఆవురావురుమంటూ టిఫిన్ కానిచ్చింది. పిల్లల్ని ఓసారి విష్ చేసి, స్కూలు వాళ్ల ఇచ్చిన సర్కులర్లపై పొట్టి సంతకాలు చేసి, ముద్దులు పెట్టి గుడ్ నైట్ చెప్పేసి తమ గదిలోకి వెళ్లిపోయిందామె.

వెళ్లే ముందు హాల్లో ఆగి ‘‘నాకు హెడేక్‌గా ఉంది. నువ్వు వాళ్లని కాసేపు మాట్లాడించి పడుకో’’అని అందరికీ వినబడేలా భర్తకు మాత్రమే చెప్పింది. టిఫిన్‌లు అయ్యాక ‘‘ఏంటి నాన్న సంగతులు’’ అంటూ తండ్రిని పలకరించి, మొబైల్ చూసుకుంటూ పక్కన కూర్చున్నాడు కొడుకు. పెద్దాయన ఏమీ మాట్లాడలేదు. కొడుకు అదేమీ పట్టించుకోకుండా మొబైల్‌లో మునిగిపోయాడు.

కాసేపు చూసి ‘‘ఇంక పడుకోరా. మళ్లీ పొద్దున్నే లేవాలిగా. అలసట తీరొద్దూ..’’ అంటూ పెద్దావిడ కొడుకును విముక్తుడ్ని చేసింది. వీకెండ్ వరకూ వీళ్ల వ్యవహారం ఇలాగే ఉంటుందని తెలిసిన పెద్దాయన పెద్దగా ఏమీ బాధపడలేదు. కాకపోతే, తన నిర్ణయం సరైనదే అని మరోసారి మనసులో అనుకున్నాడు. ఆ నిర్ణయాన్ని ప్రకటించడానికి వారాంతం వరకూ ఆగడానికి ఆయనకేమీ అభ్యంతరం లేదు. ఆయన నిర్ణయంతో తమ జీవితాలు తల్లకిందులవుతాయని తెలియకపోవడంతో కొడుకూ, కోడలూ ప్రశాంతంగా నిద్రపోయారు.

*** *** ***

‘‘ఇల్లు అమ్మేద్దామనుకుంటున్నా’’ అన్నాడు పెద్దాయన. శనివారం, అటు మధ్యాహ్నం, ఇటు పొద్దున్న కాని పదకొండు గంటల సమయాన. అప్పుడే లేచి టిఫిన్లు తింటున్న కొడుకూ, కొడలూ ముఖాలు చూసుకున్నారు.

‘‘ఊర్లోదా నాన్నా’’ అన్నాడు.

‘ఊర్లో ఇల్లు అమ్మేసి ఏం చేస్తారు? సారీ, ఏం చేస్తారు కాదు, ఎక్కడుంటారు? కొంపదీసి మా మీద పడరు కదా. ఏదో చుట్టుపు చూపుగా వస్తే బానే ఉంటుందిగానీ, ఇక్కడే తిష్ట వేస్తామంటే.. ఎలా? ఏం చేయాలి?’ అని ఆలోచనలో పడ్డారు కోడుకూ కోడలూ.'

‘‘కాదురా, ఇదే’’ అన్నాడాయన. కొడుకు బిత్తరపోయాడు. కోడలుకు వెంటనే పొలమారింది. దగ్గు కూడా వచ్చింది. తను ఖంగు తిన్న విషయం బయటపడేసరికి, ముఖం దాచుకోవడానికి నీళ్లు తాగే మిషతో కిచెన్‌లోకి వెళ్లిందామె. వాళ్లిద్దరూ పని చేస్తున్న కంపెనీలు మంచివే. వారి ఉద్యోగాలు కూడా మంచివే. కాకపోతే వారింకా స్టార్టింగ్ స్టేజ్ దాటి ఎదుగుదలకు పోటీ పడే క్రమంలో ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఫారిన్ ఛాన్స్ ల గురించిన వార్తలు వాళ్ల ఆఫీసుల్లో చక్కెర్లు కొడుతున్నాయి. వాటిని అందుకోడానికే వాళ్లు అర్రులు చాస్తున్నారు. ఒక్క ఛాన్స్ తగిలితే.. ఇక నెమ్మది, నెమ్మదిగా కంపెనీలో వేళ్లూనుకోవచ్చు. ఆ కంపెనీ కాదన్నా, వేరే కంపెనీలో ఉద్యోగం గ్యారెంటీ అన్న ధీమాలో ఉండొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన అలా అనడం ఇద్దరినీ సందిగ్ధంలో పడేసింది.

‘‘డబ్బేమైనా అవసరమైందా నాన్నా?’’ అని అడిగాడు. ఒకవేళ అవసరమైనా సర్దే పరిస్థితుల్లో లేరు. సగానికి పైగా తండ్రి సర్దితే, మిగిలిన మొత్తానికి బ్యాంక్ లోను తీసుకుని ఈ ఫ్లాట్ తీసుకున్నారు. వాస్తవానికి వేరే దగ్గర తక్కువ ధరలో డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ తీసుకోమని అన్నాడాయన. కానీ, తీసుకునేప్పుడు ప్రైమ్ ఏరియాలో తీసుకుంటే అన్నిటికీ అందుబాటులో ఉంటామన్నారు. డబుల్ బెడ్ రూం కాకుండా త్రిబుల్ బెడ్ రూమ్ తీసుకుంటే ఎవరైనా వచ్చినా పిల్లలకీ, తమకీ కూడా ఇబ్బంది ఉండదని వాదించారు. అప్పటికి వారికి అంది వచ్చే అవకాశాలపై నమ్మకంతో తలకుమించినదే అయినా, ఈ ఫ్లాట్ తీసుకున్నారు. కానీ, అనుకున్న అవకాశాలు ఇంకా ఊరిస్తున్నాయే తప్ప, అందిరావడం లేదు. ఓ పక్కన పిల్లల స్కూలు ఫీజులు, డబుల్ థమాకాలాగా డేకేర్ సెంటర్ ఫీజులు, పెరిగిన ఇతర ఖర్చులతో కొన్నిసార్లు ఈఎంఐ కూడా కట్టలేని పరిస్థితి.

అలాంటప్పుడు కూడా తండ్రి ఏమీ అనలేదు. ఊర్లో వున్న బ్యాంకుకు వెళ్లి అకౌంట్‌లో ఈఎంఐకి అవసరమైన మొత్తం జమ చేసేవాడు. అలాంటిది, ఇప్పుడెందుకిలా హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నాడో వారికి అర్థం కాలేదు.

‘‘డబ్బు కోసం కాదు, మీకు ఇల్లు అనవసరం అనిపిస్తోంది’’ అన్నాడు. భార్యాభర్తలిద్దరూ ముఖాలు చూసుకున్నారు. పెద్దాయన అంతకుమించి ఏమీ మాట్లాడలేదు. ఎవరూ అడిగే ధైర్యం చేయలేదు. ఇదే విషయం ఆలోచిస్తూ ఎవరి పనులు వారు చక్కబెట్టుకున్నారు సాయంత్రం వరకూ. సాయంత్రం పిల్లల్ని గేటెడ్ కమ్యూనిటీ అయిన తమ అపార్ట్ మెంట్ ఆవరణలోనే ఉన్న స్విమ్మింగ్ పూల్‌కు తీసుకుని వెళ్లాడు. కొడుకు, మనవళ్లతోపాటు ఆయన కూడా వెళ్లాడు. పిల్లలు పూల్‌లో దిగి తోటి పిల్లలతో కలిసిపోగానే, మొబైల్‌లో మునిగిపోయే ప్రయత్నం చేస్తున్న కొడుకును ‘‘రా, అలా నాలుగు అడుగులు వేద్దాం’’ అని తీసుకెళ్లాడు.

తండ్రితో ఏకాంతంగా మాట్లాడాలని ఉన్నా, అడిగే ధైర్యం లేక ఊరుకున్న కొడుకు.. మనసులో ఎగిరి గంతేసి, బయటికి మాత్రం మామూలు అడుగులు వేశాడు.

*** *** ***

‘‘మీ పనులు, ఉద్యోగాలు.. హడావిడి అర్థం చేసుకోగలను. కానీ, ఇంటిని మరీ ఇంత నిర్లక్ష్యం చేస్తే ఎలా? ఎక్కడికక్కడ బూజులు వేళాడుతున్నాయి. విడిచిన బట్టలు సరే, ఆ బుట్టలో వేస్తున్నారు. ఉతికిన బట్టలు ఎప్పటి నుంచో ఇలా సోఫాల్లోనే పడి ఉంటున్నాయి. వాటిని ఉతుక్కుని ఉపయోగమేమైనా ఉందా? పిల్లల పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, క్రేయాన్స్, ఆట బొమ్మలు ఏవైనా ఒక్క దగ్గర ఉన్నాయా? ఎప్పుడో కొనిపడేసిన ధనియాలు, అటుకులు, ఎండు కారం పొడి.. ఒకటేమిటి ఎన్నో, ఎక్స్‌ పేయరీ డేట్ అయిపోయి, పురుగులు పట్టిపోయాయి. అయినా, పట్టించుకునేది లేదు’’

‘‘టైముండటం లేదు, ఆంటీ’’

‘‘అందరికీ అదే టైము కదమ్మా. మీరంతా చదువుకున్నవారు. డెడ్‌లైన్ల మీద పని చేసేవారు. మీరే అలా అంటే ఎలా? ఈ ఇల్లు మీది కాదా? ఆ ఓవెన్ చూడు, ఎంత దుమ్ము కొట్టుకుపోయి ఉందో. దాని లోపల కిచెన్ నేప్కీన్స్ పెట్టారు. ఏం, ఇంట్లో ఇంకెక్కాడా అల్మారాల్లేవా? అన్ని అల్మర్లు ఉండగా అందులో ఎందుకు పడేశారో నాకు అర్థమే కావడం లేదు. ఇక ఆ శాండ్‌విచ్ మేకర్‌ని ఎప్పుడూ క్లీన్ చేసిన పాపాన పోయినట్టు లేదు. లోపలన్నీ అంటుకుని చీమలు పట్టాయి. ఇంక సింక్ కింద బొద్దింకల గురించి చెప్పనే అక్కర్లేదు’’

ఆమె పొగరబోతు కోడలు కాదు. అలాని, అణిగిమణిగి వుండే రకం కూడా కాదు. కానీ, అర్థం చేసుకుని, అవగాహనతో నడుచుకుంటుంది. అత్తగారు ఎత్తిచూపే విషయాలేమీ అబద్ధాలు కాదు. అలాగే, ఆవిడ కూడా తనను సాధించడానికి అవన్నీ ఏకరవు పెట్టడం లేదని కూడా ఆమెకు తెలుసు.

అందుకనే ‘‘క్లీన్ చేసే వాళ్లని పిలిపిద్దామనుకున్నాం ఆంటీ. ఏ వారానికి ఆ వారం కుదరక, అలా తయారైంది’’ అంది నెమ్మదిగా.

‘‘కుదరడం లేదంటే, ఎప్పటికీ కుదరదు. ఇల్లు తీరు చూస్తే మీకు కుదిరేలోపు ఇంకెంత నాశనమవుతుందో అనిపిస్తోంది. సరే, అవన్నీ అంటే ఎవరినో పిలిపిస్తావ్, క్లీన్ చేయిస్తావ్. మరి ఫ్రిజ్ సంగతి? దానికంటే నిండు చూలాలు నయం. అసలు ఏమున్నాయో లోపల చూసే వీలు కూడా లేదు. అంతా ఇలా వుంటే కడుపు నొప్పులు, వికారాలు రమ్మంటే రావా మరి? మళ్లీ వాటి కోసం డాక్టర్ల చుట్టూ తిరగడం; దొరికీ దొరకని సెలవులన్నీ వాటికే ఖర్చయిపోవడం. ఆలోచించు, ఇదంతా ఒక సర్కిల్‌లా అనిపించడం లేదు‘‘ అంది.

‘‘ఆంటీ.. ఏదో ఒకటి చేస్తాం. ప్లీజ్ ఇంక వదిలేయండి. మీరవన్నీ చెబుతుంటే నాకేంటో భయంగా అనిపిస్తోంది. అయినా, ఎంతసేపూ వంటిల్లేనా?‘‘ అంది కాస్త బుంగమూతి పెట్టి.

అలా అనడంలో ‘మీ అబ్బాయి అసలు ఇల్లు పట్టించుకోవడం లేదు’ అనే ఆరోపణ ఉంది. ‘‘వంటిల్లే చూశా, ఇలా ఉంది. ఇక బెడ్రూమ్‌లోకి వెళితే ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో అని ఆగిపోయా’’ అంది నవ్వీనవ్వకుండా.

కోడలు మాత్రం గట్టిగా నవ్వేసి, ‘‘అంతేం లేదులెండి. ఇద్దరం పొద్దున పోయి ఉద్యోగాలు చేసుకొచ్చి, ఈ పిల్ల పిశాచాలను సముదాయించే సరికే.. తల్లో ప్రాణం తోకకు వస్తోంది. అన్నట్టు తోక అంటే గుర్తొచ్చింది. కాస్త, నా జుట్టు సంగతి చూడండి ఆంటీ. ఎలా ఊడిపోతోందో’’ అని ఆమె దగ్గరగా వెళ్లి కూర్చుంది.

‘‘మీరు ఏదో షోకు అనుకుని పార్లర్లకు వెళ్లి అడ్డమైన స్ప్రేలు కొట్టించుకుంటారు. పాడవక ఏమవుతుంది జుట్టు’’ అంటూ అల్మాండ్ ఆయిల్ చేతిలో వేసుకుని కోడలు జట్టు పాయలు తీయడం ప్రారంభించింది అత్తగారు.

*** *** ***

‘‘చలి, వాన, ఎండ వంటి ప్రకృతి సంబంధిత ఇబ్బందుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి మన పూర్వీకులైన ఆది మానవులు మొదట గుహల్లో నివసించడం ప్రారంభించారని అంటారు, తెలుసా?’’ అన్నాడాయన. పెద్దాయన ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థంకాక, అయోమయంగా చూశాడు కొడుకు.

‘‘చదువుకున్నవాడివి ఇవన్నీ నీకు తెలియవని కాదు. ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి కదా. వాళ్లు కూడా అలాగే మొదలు పెట్టారు. తరువాత కొన్నేళ్లకు ఒకరికోసం ఒకరుగా, అనుబంధాలకు ఆలంబనగా ఒక కుటుంబానికి ఒక ఇల్లు అనేది ఏర్పడింది. అలా మార్పులు చెందుతూ నేటి ఆధునిక గృహాలుగా మారడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఆ గృహాలను స్మార్ట్ హోమ్‌లుగా కూడా చాలామంది మార్చుకుంటున్నారు. కానీ, ఇళ్లు ఆధునికీకరణ చెందుతున్న కొద్దీ వాటిల్లోంచి అనుబంధం, ఆత్మీయత, అనురాగం, వాత్సల్యం లాంటివన్నీ కనుమరుగై పోతున్నాయి. కేవలం వస్తువులతో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మాత్రమే ఇళ్లు విలసిల్లు తున్నాయి. మీరంతా ఆ హంగులూ, ఆర్భాటాల ఆరాటాల్లో పడి ఏం కోల్పోతున్నారో గమనించలేక పోతున్నారు’’ అంటూ ఒకసారి ఆగి కొడుకు వైపు చూశాడాయన. ‘మేటర్ చాలా సీరియస్’అని ముందే అనుకోవడం వల్ల అతను తండ్రి మాటలను శ్రద్ధగానే వింటున్నాడు.

తండ్రి తన వైపు చూడటంతో ‘‘అన్నీ అంత ఖరీదైనవేం కాదు నాన్నా! అదీగాక అవన్నీ ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఉండేవే’’ సమర్థించుకోవడం కోసం మాత్రమే కాదు, తప్పేంటో తనకి అర్థం కాకపోవడంతో అలా అన్నాడు.

‘‘అదేరా, నేను చెప్పేది. అందరిళ్లలో ఉంటున్నాయి కాబట్టి మనింట్లో కూడా ఉండాలి. ఒకరిని చూసి ఒకరు పోటీ పడి వినియోగ ప్రపంచంలో వ్యాపారులకు లాభాలు అందిస్తున్నారు. ఒక మాట చెప్పు-నువ్వు ఇంట్లోని హోం థియేటర్‌లో సినిమా చూసి ఎన్నాళ్లయ్యింది? లేక ఏళ్లా? నువ్వు, నీ భార్య, పిల్లలు కలిసి పడుకునేది రెండు బెడ్ రూముల్లో, కానీ ఏసీలు మూడు బెడ్రూముల్లో. అది చాలదన్నట్టు హాల్లో కూడా. కిచెన్‌లో ఒకటే తక్కువ. మీ ఇద్దరూ ఎలాగూ స్మార్ట్ ఫోన్స్ లోనే బతుకుతారు. పిల్లలు కూడా తరచూ పాత ఫోనుల్లో గేమ్‌లు అవీ ఆడుతూనే ఉంటారు. అలాంటప్పుడు అంత పెద్ద స్మార్ట్ టీవీ ఎందుకురా? అలంకరణ కోసం కాకపోతే?’’ పెద్దాయన ఆవేదన అతనికేమీ అర్థం కాలేదు.

అనవసరంగా అన్నిటినీ తప్పుబడుతున్నాడనే అనుకున్నాడు. దాంతో కాస్త అసహనం ధ్వనించే గొంతుతో ‘‘ఉన్నాయి కదాని, అన్నిటినీ, అస్తమాను వాడతామని కాదు నాన్నా. అవసరమైనప్పుడు వాడతాం. అదీగాక, ఇవేవీ లేకపోతే నలుగురిలో ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు కూడా చాలాసార్లు వినే వుంటావు ‘రోమ్‌లో రోమన్‌లా ఉండాల’ని..’’ అంటున్న కొడుకు వాక్యం పూర్తి కాకుండానే.. ‘‘మనకు అవసరమైన సామెతలు బాగానే గుర్తుంటాయిరా’’ అన్నాడు, వెక్కిరింతగా. అని, చిరునవ్వుతో ఓసారి కొడుకు ముఖంలోకి చూసి ‘‘నలుగురికీ ఉన్నాయి కదాని, ఆ వస్తువులన్నిటినీ తెచ్చి పేర్చుకుంటాం. కానీ, ఆ నలుగురితో మనం ఎప్పుడైనా కలిసి ఉన్నామా? ఇరుగుపొరుగుతో కష్టసుఖాలు పంచుకుంటున్నామా?’’ అంటున్న పెద్దాయన వాక్ప్రవాహానికి అడ్డంపడుతూ.. ‘‘ఏంటి నాన్నా, ఎప్పుడూ లేనిది అలా మాట్లాడుతున్నారు? సిటీలో అలాంటివన్నీ ఉంటాయా? మా పక్క ఫ్లాట్‌లో ఉన్నాయన్నే నేను ఒకట్రెండు సార్లు చూశా. మిగిలినవాళ్ల సంగతి కూడా అంతే. అంతా, బిజీ లైఫ్’’

‘‘అవున్రా బిజీ లైఫే. కానీ, దేని కోసం ఆ బిజీ. సంపాదన కోసం, అంతేగా? ఆ సంపాదన ఎందుకు అంటే, ‘మరింత సుఖంగా బతకడానికి’అని ఆత్మవంచన చేసుకుంటారు. వాస్తవానికి ఆ సంపాదన మరిన్ని వస్తువులు కొనుక్కుని ఇంటినీ, ఒంటినీ అలంకరించుకోవడానికి. పండగలకీ, పబ్బాలకీ వచ్చే బంధువులకీ; వీకెండ్‌లకీ, కిట్టీ పార్టీలకీ వచ్చే ఇరుగుపొరుగులకీ మీ డాబూ దర్పం చాటుకోవడానికి. అంతకుమించి ఏమీ లేదా?’’

‘‘పోనీ అంతే అనుకో నాన్నా’’ అన్నాడు, ఏమని వాదించాలో అర్థంకాక. కాసేపు ఆగి ‘‘అయినా, నేనేం చేసినా నీకు తప్పుగానే ఎందుకు కనిపిస్తోందో అర్థం కావడం లేదు’’అన్నాడు నిష్టుర స్వరంతో.

పాకెట్‌లోంచి రుమ్మాలు తీసి ముఖం తుడుచుకుంటూ ‘‘అక్కడే పొరబడుతున్నావ్’’ అంటూ అటూఇటూ చూశాడు. ఓ పక్కగా ఓ బెంచీ ఖాళీగా కనిపించింది. వాళ్లుంటున్న గేటెడ్ కమ్యూనిటీలోని వయోవృద్ధుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన బెంచీలవి. కాస్త ఎడంగా ఉన్న ఓ బెంచీపై కూర్చుంటూ ‘‘నువ్వు చేసినవి ఏవీ తప్పులు కాదు. నిజమే, నలుగురి మధ్యా ఉంటున్నప్పుడు వారందరితో సమానంగా తూగాలి, తూగుతున్నావు. నేననేది అక్కడితో సరిపోదని’’ అన్నాడు పెద్దాయన. తండ్రి ముఖంలోకి అనుమానంగా చూశాడు కొడుకు. కొడుకు చూపును గ్రహించిన పెద్దాయన చిరు కోపం ప్రదర్శిస్తూ ‘‘ఏంట్రా, నాకేమైనా రోగమొచ్చిందనుకుంటున్నావా? లేక మతిభ్రమించి మాట్లాడతున్నా అనుకుంటున్నావా? అలా చూస్తున్నావ్?’’ అన్నాడు.

‘‘అదేం లేదులేగానీ, కాసేపు తప్పంటావ్, కాసేపు కాదంటావ్.. అసలింతకీ ఏమంటావ్’’ అన్నాడు, తన అంత్యప్రాసలకే తానే నవ్వుతూ. పెద్దాయన వెంటనే ఏమీ మాట్లాడకుండా ఆలోచనలో పడ్డాడు. తర్వాత దీర్ఘంగా నిట్టూర్చి కొడుకు వైపు చూసి ‘‘ప్రాణం కావాలా? స్వర్గం కావాలా? అని అడిగితే ఏం కోరుకుంటావ్‌రా’’ అన్నాడు.

‘‘నాన్నా..’’ అన్నాడు కొడుకు కంగారుగా.

‘‘అబ్బబ్బే, ఏం లేదు, కంగారుపడకు. ఊరికే అడిగా. స్వర్గం ఎంత గొప్పదైనా, మనం ప్రాణాన్నే కోరుకుంటాం కదా. అలాగే, అలంకరణలు, హంగులు స్వర్గంలాంటివి. అందరినీ ఆకర్షిస్తాయి. కానీ, ఇల్లూ, ఇంట్లోని మనుషులు మన ప్రాణంలాంటివిరా. రోజులో కాసేపైనా పెళ్లాం, బిడ్డలతో హాయిగా గడపకపోతే మనం ప్రాణంతో ఉండీ ఉపయోగం ఏముందీ. స్వర్గం అనుకుంటున్న ఇంట్లోని వస్తువులన్నిటినీ వినియోగంలో పెట్టండి. అంతా కలిసి హోం థియేటర్‌లో సినిమా చూడండి. మోడ్రన్ కిచెన్‌లోని ఆధునిక సామాగ్రిని ఉపయోగిస్తూ ఇద్దరూ కలిసి కనీసం డిన్నర్ ప్రిపేర్ చెయ్యండి. మామూలు ఆటలు ఎలాగూ ఆడలేరు. వీడియోగేమ్‌లైనా, పిల్లలతో కలిసి కాసేపు ఆడండి. వాళ్లాడుతున్న గేమ్‌లు ఎలాంటివో అర్థమవుతుంది.

సంతోషంతో కళకళలాడినప్పుడేగా ఇల్లు ఇలలో స్వర్గమయ్యేది?’’ అన్నాడాయన వివరంగా. అంతసేపు నెలకొన్న గందరగోళం తొలగిపోయి, కొత్త స్పృహ కలగడంతో తండ్రి వైపు చూసిన కొడుకు కళ్లలోని చెమ్మ ఆ సంధ్య వెలుగులో తళుక్కుమంది. చాలాసేపు ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. కొడుకులోని భావావేశాన్ని ఓరగా గమనిస్తున్నాడు తండ్రి. తండ్రి ఏం చెబుతున్నాడో అర్థమై, అపరాధ భావనలో పడ్డాడు కొడుకు. ‘‘ఆధునిక విలాసాలనీ, అత్యాధునిక సాంకేతికతనీ మానవత్వంతో మేళవించడమే మనం ఇప్పుడు చేయాల్సిన లేదా చేయగలగిన పని. ఎందుకంటే 'గృహమేగా స్వర్గసీమ' ’’ అన్నాడు ఊరడిస్తున్నట్టుగా, కొడుకు చేతిని ఆసరాగా అందుకుని బెంచీ మీంచి పైకి లేస్తూ తండ్రి.


రచయిత పరిచయం :

పుట్టింది, పెరిగింది గోదావరి జిల్లాల్లో, విద్యాభ్యాసం శ్రీకాకుళం జిల్లాలో, ఉద్యోగరీత్యా స్థిరపడింది హైదరాబాద్‌లో. వృత్తిరీత్యా జర్నలిస్టు. జనవరి, 2000లో మొదటి కవితా సంపుటి ‘ఒకేఒక్క సామూహిక స్వప్నావిష్కరణ’, డిసెంబర్ 2019లో ‘దుర్గాపురం రోడ్’ కవితా సంపుటాలు వెలువరించారు. ‘దుర్గాపురం రోడ్’ కవితా సంపుటికి ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు, పాతూరి మాణిక్యమ్మ జాతీయ స్థాయి స్మారక సాహిత్య స్ఫూర్తి పురస్కారం ప్రకటించారు. తరచుగా కవిత్వం, అరుదుగా కథలు, అలవోకగా పుస్తక పరిచయాలు, వ్యాసాలు రాస్తారు. అప్పుడప్పుడు సాహితీ ప్రముఖుల ఇంటర్వ్యూలు, అనువాదాలు కూడా చేస్తుంటారు.



1,107 views1 comment

15 commentaires


Padmasri Mitnala
Padmasri Mitnala
15 janv. 2021

Katha chala bagundandi n chala baga rasaru. Very nice

J'aime

Amulya Chandu
Amulya Chandu
09 janv. 2021

కథ చాలా బాగుంది.... నైస్ సర్

J'aime

Geeta Madhavi Kala
Geeta Madhavi Kala
04 janv. 2021

కథ చాలా బాగా రాసేరు దేశరాజు గారూ!

J'aime

Mandarapu Hymavathi
Mandarapu Hymavathi
03 janv. 2021

కథ బాగుంది.ఆధునిక మానవ జీవితాన్ని అభివర్ణించిన కథ.మానవ సంబంధాల కన్నా వస్తువులకే ప్రాముఖ్య మివ్వడాన్నిచెప్పిన విధానం బాగుంది.చదివించే మంచి శైలి.కవి, రచయిత దేశరాజు గా రికి అభినందనలు.

J'aime

kraop58
03 janv. 2021

మనిషి సాటి మనుషులకంటే నిర్జీవ వస్తువుల పట్ల అనవసర బంధాలు పెంచుకున్న కారణంగా ఆత్మీయతలు

క్రమంగా కనుమరుగవుతున్నాయి.

సమకాలీన సామాజిక నేపథ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను

కథారూపంలో చదువరులకు అందించి రచయిత కృతకృత్యులయ్యారు.

కథలో కుదురుకున్న పాత్రలు, సందర్భోచిత సంభాషణలు పాఠకులను ఆలోచింపచేస్తాయి. కవి, రచయిత, అనువాదకుడు , సమీక్షకుడు దేశిరాజు రవి గారి నుంచి మరిన్ని మంచిరచనలు అభిలషిస్తూ...

శుభకామనలతో....

పొలమరశెట్టి కృష్ణారావు , ఉప్పల్ ,

హైదరాబాద్.


J'aime
bottom of page