top of page

గురుదక్షిణ


#సామాజికకుటుంబకథ, #గురువు, #గురుదక్షిణ, #TeluguInspirationalStories


'GuruDakshina' - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 25/09/2024

'గురుదక్షిణ' తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



కొడుకు రోహిత్ బీచ్ కి తీసుకెళ్లమని ముచ్చట పడుతుంటే భార్య రోహిణితో కలిసి కారులో బయలుదేరాడు మోహన్. ఎండ తగ్గినప్పటికీ వేడి ఎక్కువగానే ఉంది. సాయంకాలం నాలుగు దాటింది. ఇంకా గంట ప్రయాణం చెయ్యాలి. 


రోహిత్ కి దాహం వేస్తోందంటే అప్పుడు జ్ఞప్తికి వచ్చింది రోహిణికి ప్రయాణ తొందరలో వాటర్ బాటిల్ కారులో పెట్టలేదని. దారిలో ఎక్కడైన కొబ్బరిబోండాలు కనబడితే కారు ఆపమని మోహన్ కి చెప్పింది. 


 పల్లెటూరి మార్గం అవడంతో అక్కడక్కడ టీ బడ్డీలు, చిల్లర సామాన్ల దుకాణాలు కనబడుతున్నాయి తప్ప కొబ్బరి బోండాల దుకాణాలు కనబడటం లేదు. కాస్త ముందుకు వెళ్లిన తర్వాత ఒక రోడ్డు మలుపు వద్ద కొబ్బరిబోండాల బడ్డీ కనబడితే కారు పక్కకు ఆపి మోహన్, రోహిణి, రోహిత్ కారు దిగి బడ్డీ దగ్గరకొచ్చి మూడు లేత కొబ్బరిబోండాలు కొట్టమని చెప్పి నీళ్లు తాగుతున్నారు. తియ్యగా రుచిగా ఉన్నాయని మురిసిపోతూ.

 

రోహిత్ కొబ్బరిగుంజు కావాలంటే షాపతను కాళీ బొండాన్నిరెండు చెక్కలు చేసి కత్తితో లేత గుంజును తీసి ఇచ్చాడు. రోహిత్ ఆప్యాయంగా కొబ్బరి గుంజును తింటున్నాడు. ఇంతలో వారి ముందు నుంచి సుమారు యాబై సంవత్సరాల పెద్దాయన తల మీద తువ్వాలు కప్పుకుని చేతికర్ర సాయంతో వంగుతూ నడిచి వెళ్తున్నాడు. 


 నుదుటి మీద, చేతి మీద తెల్లటి బొల్లి మచ్చలున్న ఆయన్ని ఇదివరకు ఎక్కడో చూసిన జ్ఞాపకాలు వచ్చాయి మోహన్ కి. ధ్యానంగా చూసిన తర్వాత తనకి హైస్కూలులో తెలుగు నేర్పిన పట్టాభి రామారావు మాస్టారు మదిలో మెదిలారు. 


 వెంటనే ఆయన వెనుక వెళ్లిన మోహన్ "సార్, మీరు పట్టాభి మాస్టారు కదూ?" అన్నాడు ఆతృతగా. 


 ఈ రోడ్డు మీద తనని పేరు పెట్టి పిలుస్తోన్న అపరిచిత వ్యక్తిని గుర్తించలేక ఆశ్చర్య పోతూ ఆ పెద్దాయన "ఎవరు బాబూ, మీరు? గుర్తుకు రావడం లేదు".. ఆగి తల మీద తువ్వాలుతో మొహం తుడుచుకున్నాడు. 


 "నేను సార్, నా పేరు మోహన్. అగ్రహారం హైస్కూలులో మీరు తెలుగుపండిట్ గా పని చేసేటప్పుడు మాకు తెలుగు సబ్జ్యక్టు చెప్పేవారు. తెలుగు పద్యాలు, వ్యాకరణం, తెలుగుభాష మీద నాకున్న ఆసక్తిని గ్రహించి తెలుగు సాహిత్యం పట్ల శ్రద్ధ కలిగేలా ఎంతో ప్రోత్సహించారు. మీరు వేసిన పునాది తెలుగు భాష వైపు మనసు మళ్లి తర్వాత కాలేజీ, యూనివర్సిటీలో కూడా ఎన్నో కవితలు, వ్యాసాలు, కథలు రాసి రచయితగా పేరు సంపాదించాను. ప్రముఖ తెలుగు పత్రికలలో నా కథలకు ఎన్నోబహుమతులు వచ్చాయి. అంతా మీ చలవ " అంటూ భార్య రోహిణిని పరిచయం చేసి తన కుమారుణ్ణి చూపాడు. 


 పట్టాభి మాస్టారు తల గోక్కుంటూ తను రిటైర్మెంట్ అవకముందు పనిచేసిన అగ్రహారం స్కూలును గుర్తు చేసుకుంటు ఆ సమయంలో పంచాయతీ శెక్రటరీ రామనాథం గారితో ఉన్న పరిచయం, వారి అబ్బాయి మోహనరావు తన విద్యార్థిగా తెలుగు పట్ల ప్రత్యేక శ్రద్ధను గుర్తించి ప్రోత్సహించడం తర్వాత రామనాథం గారు ట్రాన్ఫరై వేరొక చోటికి వెళ్లడం లీలగా జ్ఞప్తికి వచ్చాయి.

 

"నువ్వు రామనాథం గారి అబ్బాయి మోహనరావువా! ఎంతో కాలమైనప్పటికీ నన్ను గుర్తు పట్టినందుకు ఆనందంగా ఉంది బాబూ! " అంటూండగా "మాస్టారూ, ఇంత ఎండలో కాలి నడకన ఎక్కడి నుంచి వస్తున్నారు?" అడిగాడు ఉత్సుకతగా. 


 "పక్క ఊరిలో తద్దినం భోజనం చేసి, చల్లబడిందని మెల్లగా ఇంటికి వెల్తున్నా" అన్నారు మాస్టారు. 


 "మీ ఇల్లు ఎంత దూరం మాస్టారూ!" అన్నాడు మోహన్. 


“ఈ మట్టి రోడ్డు మలుపు దాటి ఒక కిలోమీటరు లోపలికి వెళ్లాలి నాయనా, మెల్లగా నడుచుకుంటు వెళిపోతాను. "


 "ఉండండి, నా కార్లో మీ ఇంటి వద్ద దిగబెడతాను. రండి, కూర్చోండి" అంటూ కారు డోరు తెరిచాడు. 


 "నీ కెందుకు బాబూ, శ్రమ. ఇల్లు దగ్గరేగా. మెల్లగా నాలుగు అడుగులు వేస్తే చేరిపోతాను. " అన్నారు మాస్టారు. 


"అదేంటి సార్! సంవత్సరాల తర్వాత పూజ్యులు మిమ్మల్ని ఇలా కాకతాళీయంగా కలియడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ ఇల్లు చూపించడం ఇష్టం లేక ఇలా అంటున్నారా?" అన్నాడు నిష్టూరంగా మోహన్. భర్తకు వంత పాడింది రోహిణి. 


వారి ఆప్యాయ అభిమానాలకు పరవసించిపోయారు మాస్టారు. మోహన్ కారు ముందు తలుపు తియ్యగా పట్టాభి మాస్టారు, వెనుక సీట్లో రోహిణి, రోహిత్ కూర్చోగా ఆయన చెప్పిన దారంట కారు ముందుకు కదిలింది. 


మోహన్ మట్టి దారంట పది నిమిషాలు కారు నడపగా ఒక పాడుపడిన పెంకుటింటి ముందు ఆగింది. చుట్టూ పాకుడు పట్టి విరిగిపడిన ప్రహరీ గోడ, కర్ర తలుపు ఎదురు పడ్డాయి. 

 మామయ్య గారి గురించి ఎదురు చూస్తున్న వసంతకు గుమ్మం ముందు ఖరీదైన కారు ఆగడం చూసి ఆశ్చర్య పోయింది. 


 ఇంతలో పట్టాభి మాస్టారు, వెనక ఖరీదైన బట్టల్లో మోహన్, రోహిణి, రోహిత్ లోపలికి వచ్చారు. 


 గబగబా ఇంటి బయట వరండాలో పాత తరం వాలు కుర్చీ పక్కన రెండు ఐరన్ ఫోల్డింగ్ కుర్చీలు ఉంటే గుడ్డతో తుడిచి వేసి వాటి పక్కన కర్ర స్టూలు ఉంచింది. 


 "వసంత, నా కోడలు" అని మొహానికి బొట్టు లేకుండా సాదాచీరలో ఉన్న కోడలిని పరిచయం చేసారు మాస్టారు. 


నమస్కారం చేసింది వసంత. లోపలికి వెళ్లి పెద్ద చెంబుతో మంచినీళ్లు గ్లాసులు తెచ్చి అందరికీ నీళ్లు నింపి ఇచ్చింది. తర్వాత పెరట్లో పండిన బొబ్బాస పండు ముక్కలు పళ్లేల్లో తెచ్చి ఇచ్చింది. ఇంటి పరిస్థితి, పరిసరాలు చూసిన మోహన్ కి మాస్టారి ఆర్థిక పరిస్థితి అర్థమైంది. 


 "మాస్టారూ, అగ్రహారం వదిలి ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? రిటైర్మెంట్ తర్వాత ఈ వృద్ధాప్యంలో ఇలా కష్టపడుతున్నారు.. మీకు వెనక సాయం ఎవరూ లేరా? ఏమిటీ స్థితి? " ప్రశ్నల మీద ప్రశ్నలు వేసాడు మోహన్ బాధగా. 


 బట్టతల మీద చెయ్యి నిమురుతు ఒక నిట్టూర్పు వదిలారుపట్టాభి మాస్టారు. 


 "ఏమి చెప్పమంటావు, మోహన్! నేను అగ్రహారంలో ఉద్యోగం చేస్తుండగానే మా స్వంత ఊళ్లో ఉన్న అమ్మనాన్న కాలం చేసారు. నాన్న గారి కోరిక మేరకు చదువుకుంటున్న ఒక్కగానొక్క కొడుకు ప్రకాష్ ను వైదీకంలోకి పంపేను. తాతగారికి సాయంగా ఉంటూ ఊళ్ళో పౌరోహిత కార్యక్రమాలకు వెళ్లి వస్తుండేవాడు. 


 ఊళ్ళో నాన్నగారికి ఉన్న మంచిపేరు వల్ల గౌరవప్రదంగా రోజులు గడిచిపోతున్నాయి. పెద్దల ఆస్థిపాస్తులు లేకపోయినా ఈ పెంకుటిల్లు మిగిలింది. నాన్న అమ్మ వృద్ధాప్యంతో కాలం చెయ్యగా పౌరోహిత బాధ్యత అబ్బాయి ప్రకాష్ మీద పడింది. మా బంధువుల అమ్మాయి వసంతను ఇచ్చి పెళ్లి చేసాము. 


వారికి కూతురు లలిత ఉంది. పక్క ఊరి స్కూలులో చదువుతోంది. నేను అగ్రహారం ఉద్యోగంలో ఉండగానే నా శ్రీమతి గుండెనొప్పితో బాధపడుతు చనిపోయింది. ఆమె వైద్యానికి చాల డబ్బు ఖర్చు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఒంటరి జీవితం, మనశ్శాంతి లేక నేను స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఇక్కడికి వచ్చేసాను. 


 ప్రకాష్ కి పౌరోహితం మీద వచ్చే ఆదాయం, నా పెన్షన్ డబ్బులతో ఉన్నంతలో రోజులు గడుస్తుండగా అనుకోని ఆపద వచ్చి పడింది. కోవిడ్ సమయంలో ప్రకాష్ కి కరోనా వైరస్ అంటుకుని ప్రాణాంతక సమయంలో పట్నంలో కార్పోరేట్ హాస్పిటల్లో ఎడ్మిట్ చేసి నా రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బు కొంత మనుమరాలి పెళ్లి కోసం బ్యాంకులో ఫిక్స్ డ్ చేసినవి కూడా ఖర్చు చేసినప్పటికీ దేవుడు కరుణించ లేదు. నన్నూ, వసంతను, లలితను అనాథలను చేసి వెళిపోయాడు" అంటూ భుజం మీద తువ్వాలుతో కళ్లు తుడుచుకున్నారు పట్టాభి మాస్టారు. పక్కన కోడలు వసంత మౌనంగా నిలబడింది. 


 తనకి విద్యార్థి దశలో తెలుగులో విద్యాబిక్ష పెట్టి గొప్ప రచయితగా సమాజంలో ఎదగడానికి దోహదపడిన పట్టాభి మాస్టారి దీన గాధ విన్న మోహన్ మనసు చలించిపోయింది. ఈ ఆపద సమయంలో ఆయనను ఆదుకోవాలని కృత నిశ్చయానికొచ్చాడు. 


మోహన్ తన జీవిత కథ చెబుతు "మాస్టారూ, నాన్నగారికి పట్నం ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నా కాలేజీ, యూనివర్సిటీ చదువులు పూర్తయి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఎగ్జామ్స్ లో సెలక్టయి సెంట్రల్ గవర్నమెంటు హోదా ఉద్యోగం ఢిల్లీలో వచ్చింది. రోహిణి నా సహాధ్యాయి. మా ఇద్దరి అభిరుచులు కలిసాయి. 


మా మేరేజి నాన్నగారు ఉండగానే జరిగింది. తర్వాత ఆయన కూడా కాలం చేసారు. మేము ఢిల్లీలోనే కాపుర ముంటున్నాము. మా వారసుడు రోహిత్ మన తెలుగు సాంప్రదాయాలతో పెరుగుతున్నాడు. మేము నార్తులో ఉన్నా మన తెలుగు కట్టూ బొట్టూ ఆహార వ్యవహారాలు పాటిస్తుంటాము. ఇదంతా మీ పెద్దలు నేర్పిన విద్య. 


రోహిణి పిన్ని గారి అమ్మాయి మేరేజికని శలవు తీసుకుని మన ప్రాంతానికి రోహిత్ తో రావడం, వాడికి ఇక్కడి పల్లె వాతావరణం, నచ్చడంతో శలవు పొడిగించి సముద్ర బీచ్ చూస్తానంటె ఇటు రావడం అనుకోకుండా మిమ్మల్ని ఇలా కలియడం ఆనందంగా ఉంది. మేము బీచ్ కార్యక్రమం మరో రోజు పెట్టుకుంటా”మంటూండగా, పదేళ్ల మాస్టారి మనుమరాలు లలిత సాంప్రదాయ బట్టలు లంగా పరికిణితో పుస్తకాల బేగ్ తో ఇంటికి వచ్చింది. 


 గుమ్మం ముందు పెద్ద కారు, లోపల ఖరీదైన బట్టల్లో కొత్త వ్యక్తులను చూసి బిడియంతో లోపలికి వెళిపోయింది.  పట్టాభి మాస్టారు మనుమరాలిని దగ్గరకు పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని మోహన్ కుటుంబాన్ని పరిచయం చేసారు. 


 వారు మాట్లాడుతుండగానె వసంత వేడి వేడి ఉప్మా అరిటాకు పళ్లెంలో స్పూన్లతో తెచ్చి పెట్టింది. చెంబుతో తాగేనీరు తెమ్మంటే లలిత లోపలికెళ్లింది. వసంత వేడి వేడి కాఫీ కప్పులతో ప్రత్యక్షమైంది. రోహిత్ కి వేరుగా పాలు తెచ్చింది. అందరి ఫలహారాలు పూర్తయాయి. 


 చివరగా మోహన్ ఆనందిస్తూ "మాస్టారూ, కాకతాళీయంగా మీరు ఇలా కలియడం, రేపే టీచర్స డే కూడా రావడం సంతోషకర విషయం. మీరు మా మాట మన్నించి రేపు కుటుంబంతో పట్నంలో మా ఇంటికి రావాలి. నేను కారు తీసుకుని వస్తాను. నన్ను మీ అబ్బాయి ప్రకాష్ గానే భావించండి. మీ కష్టసుఖాల్లో మాకు భాగం కల్పించండి. ఇంటిని రిపైర్ చేయిస్తాను. మీ మనమరాలి చదువు

బాధ్యత, భవష్యత్తు గురించి చింత వద్దు" అని భరోసా ఇచ్చాడు.. 


“రేపు ఉదయం నేను వచ్చేసరికి అందరూ సిద్ధంగా ఉండండి. " అని లలితను దగ్గరకు తీసుకుని

ఆప్యాయంగా బుగ్గ నిమిరాడు. రోహిత్ ను పరిచయం చేసాడు. నిరంతరం మీతో సంప్రదింపుల్లో ఉంటానని మాట ఇచ్చాడు. 


 వసంత తమలపాకుల్లో పసుపు కుంకుమ అరటి పళ్లు పెట్టి లలిత ద్వారా ఇప్పించింది. వారి ఆప్యాయతకు రోహిణి పరవసించిపోయింది. 


 మాస్టారు, వసంత, లలిత గుమ్మం వరకు వచ్చి కారులో మోహన్ కుటుంబానికి వీడ్కోలు చెప్పేరు. 


 అనుకోని అతిథుల్లా ఇంటికి మోహన్ కుటుంబం రావడం, హోదా ఉద్యోగాల్లో ఉన్నా వారి ఆప్యాయతలు, వినయ విధేయతలు ఉపాధ్యాయ దినం సందర్భంగా ఇంటికి పిలిచి గురుదక్షిణగా అందరికీ బట్టలు పెట్టి కానుకలతో సన్మానించడం ఒక కలలా అనిపించింది పట్టాభి మాస్టారికి. 


 సమాప్తం  


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


 పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

   కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.




50 views1 comment

1 comentario



@చెన్నూరిసుదర్శన్

• 2 hours ago

కథ, కథనం, పఠనం బాగున్నాయి. అభినందనలు- చెన్నూరి సుదర్శన్

Me gusta
bottom of page