top of page
Writer's pictureLV Jaya

వడ్డాణం పిచ్చి   

#అత్తగారికథలు #అత్తాకోడళ్ళకథలు


'Vaddanam Pichhi' - New Telugu Story Written By L. V. Jaya

Published in manatelugukathalu.com on 25/09/2024 

'వడ్డాణం పిచ్చి' తెలుగు కథ (అత్తగారి కథలు - పార్ట్ 7)

రచన: L. V. జయ

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



రాధ, తన అక్క కాంతం కొడుకు పెళ్ళికి వెళ్ళింది. పెళ్ళి జరుగుతున్నంతసేపూ, రాధ దృష్టంతా, పెళ్ళి మీదకంటే, కాంతం పెట్టుకున్న బంగారు వడ్డాణం మీదే ఉంది. కొడుకు తనకి వడ్డాణం కొన్నాడని చెప్పి, అందరికీ చూపిస్తూ కాంతం మురిసిపోతుంటే, తమ చిన్ననాటి రోజులు గుర్తువచ్చాయి రాధకి. రాధకి, కాంతానికి చిన్నప్పటినుండి వడ్డాణం పిచ్చి. ఏ వస్తువునైనా వడ్డాణంలాగ మార్చి, నడుముకి పెట్టుకుని మురిసిపోయేవారు ఇద్దరూ. ఎప్పటికైనా బంగారం వడ్డాణం పెట్టుకోగలమా అనుకునేవారు. 


'కాంతం కోరిక తీరిపోయింది. నాకూ తీరితే బాగుణ్ణు' అనుకుని, కాంతం పెట్టుకున్న వడ్డాణంలాంటిది తనకీ కొనమని భర్త మాణిక్యాన్ని అడిగింది రాధ. 


"మీ అక్కకైతే అన్నీ  బాధ్యతలు తీరిపోయాయి. కొడుకు సంపాదిస్తున్నాడు. ఏం కావాలంటే అది కొంటాడు. మనకున్న బాధ్యతలు మర్చిపోయావా? పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుంది నీ వ్యవహారం." అన్నాడు మాణిక్యాలరావు కోపంగా.


 'వడ్డాణం కొనమని ఈయన్ని ఇంకెప్పుడూ అడగకూడదు. నేను కూడా అక్కలాగే కొడుకుచేత కొనిపించుకుంటాను.' అనుకుంది రాధ.


కొన్నేళ్లలో, రాధ కొడుకు సమర్థ్ చదువు పూర్తయ్యి, ఉద్యోగం చెయ్యడం మొదలుపెట్టాడు. 'ఇప్పుడు సమర్థ్ ని వడ్డాణం కొనమని అడగచ్చు. వాడికి నేనంటే చాలా ఇష్టం. తప్పకుండా కొంటాడు.' అనుకుంది రాధ. రాధ.


 తన కోరికని చెప్పేలోపల, సమర్థ్, మాణిక్యాలరావుతో, "నాన్నా, మీరు రిటైర్ అయ్యే సమయానికి, మనకి ఊరిలో ఉన్న స్థలంలో, ఇల్లు కట్టించాలనుకుంటున్నాను. ఏమంటారు?" అని అడిగాడు. 


పుత్రోత్సహంతో పొంగిపోయాడు మాణిక్యాలరావు. "చూడు. సమర్థ్ ది ఎంత మంచి ఆలోచనో. మీ అక్క కొడుకు లాగ వడ్డాణం కొనిస్తాననలేదు. ఇల్లు కట్టించి ఇస్తానంటున్నాడు నాకు. కొడుకు అంటే ఇలా ఉండాలి." అన్నాడు రాధతో. 


'నిజమే, సమర్థ్ ది చాలా మంచి ఆలోచన.' అని సంతోషింది రాధ.  'ఇల్లు కట్టించడానికి చాలా ఖర్చు అవుతుంది. ఇల్లు కట్టించడం అయ్యాక, వడ్డాణం కొనమని అడుగుతాను'. అనుకుంది రాధ. 


మాణిక్యాలరావు రిటైర్ అయ్యే సమయానికి ఇల్లు కట్టించి ఇచ్చాడు సమర్థ్. అందరినీ పిలిచి, ఘనంగా, గృహప్రవేశం చేసింది రాధ. గృహప్రవేశానికి, కాంతం పెట్టుకువచ్చిన వడ్డాణం చూసి,  'నాకు ఎప్పటికి వడ్డాణం వస్తుందో?' అని కుళ్ళిపోయింది రాధ. సొంత ఇల్లు కట్టించుకున్న ఆనందంపోయి, వడ్డాణం లేదన్న బాధ మిగిలింది రాధకి.  


'ఇల్లు కట్టించడం అయ్యింది కదా. ఇక వడ్డాణం కొనమని అడుగుతాను' అని రాధ తన కోరికని చెప్దానుకుంది. కానీ, ఈ సారి కూడా సమర్థ్ ఆలోచన వేరేగా ఉంది.  "నాన్నా, మీకు కార్ అంటే ఇష్టం కదా. లోన్ తీసుకుని కార్ తీసుకోవాలనుకుంటున్నాను." అన్నాడు సమర్థ్, మాణిక్యాలరావుతో. సరేనన్నాడు మాణిక్యాలరావు. 


'అన్నీ వాళ్ళ నాన్నకేనా? నాకేమి కొనడా? ఎప్పటికీ నా కోరిక తీరదా?' అన్న బాధతో , "రిటైర్ అయ్యి, ఇంట్లోనే ఉంటున్న మీ నాన్నకి కార్ ఎందుకు? లోన్ తీసుకుని మరీ కార్ కొనాల్సిన అవసరం ఏమీ లేదు. వద్దు" అని చెప్పింది రాధ. 


కొన్నాళ్లలో, సమర్థ్ కి, జాగృతితో పెళ్ళి కుదిరింది. సమర్థ్ పెళ్ళిలో, మంచి పట్టుచీర కట్టుకుని, కొత్త బంగారం వడ్డాణం పెట్టుకుని, తిరుగుతున్నట్టు కలలు రావడం మొదలయ్యింది రాధకి. 


'ఈ సారి ఎలాగైనా వడ్డాణం కొనిపించుకుంటాను. కొడుకు పెళ్ళిలో, కాంతం వడ్డాణం పెట్టుకుని గొప్పలుపోయినట్టు, నేను కూడా సమర్థ్ కొన్నాడని అందరికీ చూపిస్తాను.' అనుకుంది రాధ. 


మాణిక్యాలరావు, రాధ మనసుని చదివినట్టుగా, "పెళ్ళి ఖర్చులు చాలా ఉంటాయి. నేను దాచింది అంతా, వాడి చదువుకి, ఇంటి మీద పెట్టేసాను. వాడి పెళ్ళికి వాడే డబ్బు పెట్టుకోవాలి. నీ వడ్డాణం గురించి ఇప్పుడు వాడిని అడగకు." అన్నాడు. తట్టుకోలేకపోయింది రాధ. 


'నాకు వడ్డాణం ఎలా రాదో చూస్తాను.  ఏదిఏమైనా, సమర్థ్ పెళ్ళిలో వడ్డాణం పెట్టుకుంటాను' అని నిర్ణయించుకుంది రాధ. కానీ, ఎంత ఆలోచించినా, వడ్డాణం ఎలా కొనిపించుకోవాలో అర్ధం కాలేదు. అదే సమయంలో, పెళ్ళి మాటలకి రమ్మని, జాగృతి వాళ్ళ అమ్మ లతనుండి పిలుపురావడంతో, తన వడ్డాణం కల తీర్చుకునే అవకాశం దొరికింది రాధకి. 


పెళ్లిమాటల్లో, తన కొడుకు చదువు గురించి, చదువుకి అయిన ఖర్చు గురించి చాలా సార్లు చెప్పింది రాధ. రాధ ఎందుకు సమర్థ్ చదువు గురించి అన్నిసార్లు చెప్తోందో అర్ధంకాలేదు మాణిక్యాలరావుకి. రాధ ఇచ్చిన సూచన లతకి అర్ధమయ్యింది. "మా తరపున, చిన్న గిఫ్ట్ తీసుకోండి వదినగారు" అంటూ రాధ చేతిలో కొంత డబ్బు పెట్టింది లత. రాధ ఆనందానికి హద్దులు లేవు.   


జాగృతి ఇంటినుండి బయటకి రాగానే, బంగారం షాపులో అడుగుపెట్టింది రాధ. జాగృతి ఇంట్లో ఎందుకు అన్నిసార్లు కొడుకు చదువుగురించి చెప్పిందో అర్ధం అయ్యి, తలపట్టుకుకూర్చున్నాడు మాణిక్యాలరావు.  


సమర్థ్, జాగృతిల పెళ్ళిలో, కొడుకు పెళ్ళి కంటే, తను పెట్టుకున్న వడ్డాణాన్ని ఎక్కువగా  చూసుకుంటూ, సవరించుకుంటూ, మురిసిపోయింది రాధ. కాంతం కూడా వడ్డాణం పెట్టుకుని వచ్చింది పెళ్ళికి. ఈ సారి రాధకి, కాంతాన్ని చూసి, కుళ్లురాలేదు. పైగా, కాంతానికి వడ్డాణం చిన్నదై, దాని వెనక పురికోసు తాడు కట్టుకోవడం చూసి అందరూ, పురికోసు వడ్డాణం అని అందరూ వెక్కిరిస్తుంటే, అందరితో పాటు, రాధ కూడా నవ్వింది. కాంతం, రాధ నవ్వడాన్ని చూసింది. 


పెళ్ళి తరువాత, జరిగిన సత్యనారాయణవ్రతానికి, కాంతం తన వడ్డాణాన్ని పెట్టుకోలేదు. 'ఎందుకు కాంతం వడ్డాణం పెట్టుకోలేదా?' అని ఆలోచిస్తున్న రాధతో, "నేను నా వడ్డాణాన్ని నా కోడలికి ఇచ్చేసాను. వడ్డాణాలు లాంటివి చిన్నవాళ్ళు పెట్టుకుంటేనే బాగుంటుంది. నువ్వు కూడా నీ కోడలికి ఇచ్చేయి." అంది కాంతం. 


'కాంతం తన ఉక్రోషాన్ని ఈ రకంగా  బయటపెట్టుకుందన్నమాట.' అనుకుంది రాధ. అక్కాచెల్లెళ్ళ వడ్డాణం పిచ్చి గురించి తెలిసిన బంధువులందరూ, ఇప్పడు ఏం జరగబోతోందా అన్నట్టు చూసారు.  


రాధ, తన వడ్డాణాన్ని తీసి, కొత్తకోడలు జాగృతి కి ఇస్తూ, 'ఎవరి వస్తువు వాళ్ళ దగ్గరకే చేరుతుందేమో? నాకు వడ్డాణం పెట్టుకునే అదృష్టం లేదేమో? ఏం చేస్తాం?' అని బాధపడింది. 


"అత్తయ్యగారు, నాకు ఈ వడ్డాణం వద్దండి. ఇది మీకే బాగుంది. అయినా, నాకు బంగారం మీద అంత మోజు లేదు." అన్న జాగృతి మాటలు అమృతంలా వినపడ్డాయి రాధకి. 


జీవితంలో ఎవ్వరూ, ఎప్పుడూ  తన వడ్డాణం మీద హక్కు చూపించకుండా ఉండేందుకు, "ఈ వడ్డాణం, నా తరువాత, నా మనవరాలు, నా కొడుకు కూతురికి చెందుతుంది." అని అందరిముందూ ప్రకటించి, 'ఇక ఇది పూర్తిగా నాకే సొంతం.' అని మురిసిపోయింది రాధ.


***


L. V. జయ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : LV జయ

నా పేరు LV జయ. 
https://www.manatelugukathalu.com/profile/jaya

నాకు చిన్నప్పటి నుండి తెలుగు కథలు, పద్యాలూ, సాహిత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం. 
ఏ విషయాన్ని అయినా సరదాగా తీసుకునే అలవాటు. అదే నా కథల రూపంలో చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.

ధన్యవాదాలు



67 views0 comments

Comments


bottom of page