top of page

ఇల వెలసిన దైవం


'Ila Velasina Daivam' written by Thalloju Padmavathi

రచన : తల్లోజు పద్మావతి

నిండైన విగ్రహం, నిజాయితీ, మంచితనం, మానవత్వం, మృదుస్వభావం, నిబద్ధత, బాధ్యత .. .

ఇంకా ఎన్నెన్నో! అన్నీ రంగరించి మనిషిగా చేస్తే.. అది మా నాన్న! మా జీవితాల్లో కీలక పాత్ర పోషించింది మా అమ్మ. ఆమె వెనక ఉండి నడిపించింది మాత్రం మా నాన్న! అలా మా చిన్న అన్నయ్య వినోద్ జీవితంలో ఆయన పోషించిన పాత్ర, నేను ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను.


మా అమ్మనాన్నలైన సుమిత్రమ్మ, రామేశ్వరగార్లకు.. మేము ముగ్గురం సంతానం. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు. మా మేనత్త భర్తను ఇల్లరికం తెచ్చుకోవడం వల్ల, వారి పిల్లలు తొమ్మిదిమంది, మా పెద్దనాన్న భార్య, మేము అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. ఉద్యోగరీత్యా అమ్మ, నాన్న వేరే ఊర్లో ఉండేవాళ్ళు. చిన్నవాళ్ళమైన నేను, వినోద్ అన్న వాళ్లతో పాటు ఉండేవాళ్ళం.


పెద్దలు మిగిల్చిపోయిన ఇల్లు, పొలాలు తప్ప ఆదాయం అంతగా లేకపోవడం, గంపెడు సంసారం కావడంవల్ల చిన్నప్పుడు మేము ఆర్థిక కష్టాలు అనుభవించాము. పచ్చడి మెతుకులు తిన్నా, ఉమ్మడి కుటుంబంలో సంతోషంగా ఉండేవాళ్ళం.


కానీ, విధి మమ్మల్ని చిన్నచూపు చూసింది. డిగ్రీ చదువుతున్న మా పెద్దన్న వేణుకు బ్లడ్ క్యాన్సర్ అటాక్ అయ్యింది. ఆ కాలంలోనే ఊరంతా అప్పులు చేసి, లక్ష రూపాయలు ఖర్చుపెట్టినా లాభం లేకపోయింది. ఆన్నయ్య ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. అందరం గుండెలవిసేలా రోదించాము. ఆడవాళ్లకు దేవుడిచ్చిన వరం ఏడుపు. దాంతో గుండెలోని బాధను కన్నీళ్లతో తోడేస్తారు. కానీ నాన్న ఆ దెబ్బనుండి కోలుకోలేక పోయారు. మెంటల్ గా బాగా డిస్టర్బ్ అయ్యారు.


మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందాన.... తహసిల్ ఆఫీస్లో సూపెరిండెంట్ గా పనిచేసే మా నాన్నగారు స్టాప్ కు జీతాలు ఇవ్వాల్సిన డబ్బులను( దాదాపు 40 ఏళ్ల కిందట లక్ష రూపాయలు) బీరువాలో సీజ్ చేసి, తన పరధ్యానంలో తాళంచెవి ఎవరికో ఇచ్చేశారు. అదే అదనుగా వాడు డబ్బులు కాజేశాడు. అమ్మ పుస్తెలతాడుతో సహా ఇంట్లో ఉన్న బంగారానికి రెక్కలు వచ్చాయి. అన్నీ అమ్మి ఆ గండం నుండి బయటపడ్డాం. మా ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది..


అప్పుడు నేను 2 వ తరగతి మరియు వినోదన్నయ్య 5వ తరగతి చదివేవాళ్ళం. ఆ పరిస్థితుల ప్రభావంవల్ల అన్నయ్యకు చదువు పైన ఆసక్తి పూర్తిగా సన్నగిల్లింది. మా లెక్కల మాస్టారు చాలా కోపిష్టి. ఒక్కొక్కరిని లేపి బోర్డుపైన లెక్కలు చేయమనేవాడు. చేయకపోతే విపరీతంగా కొట్టేవాడు. వారి భయానికి మా అన్న స్కూల్ మానేశాడు. ఎవరిని పల్లెత్తు మాట అనని మా నాన్న... మానసికంగా నలిగిపోయి ఉండడం వల్లనేమో, మొదటిసారిగా ‘బడికి వెళ్లను’ అన్నందుకు అన్నయ్య మీద చేయి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన అటు తిరిగి కళ్లనీళ్లు పెట్టుకోవడం నా దృష్టిని దాటిపోలేదు.


ఆ కాలంలో సెవెంత్ క్లాస్ లో బోర్డ్ ఎగ్జామ్స్ ఉండేవి. "స్కూల్ కి వెళ్లక పోయినా పర్లేదు, డైరెక్ట్ గా ఎగ్జామ్స్ రాయి" అని అన్నయ్యకు చెప్పి నాన్న ఎగ్జామ్ ఫీజ్ కట్టాడు.


ఫ్యాన్లు లేని కాలం! మార్చిలో ఇంట్లో వేడికి పడుకోలేక, అందరం మేడపైన పడుకున్నాం. మరుసటిరోజు ఉదయం 9 గంటలకు అన్నయ్యకు ఎగ్జామ్ ఉంది. తనను పరీక్షకు తయారుచేయడానికి నిద్ర లేపుదామని నాన్న మేడ పైకి వచ్చారు. తనని ఎలాగైనా ఎగ్జామ్ కు పంపుతారని భయపడి అన్నయ్య మెట్ల డోర్ దగ్గర నాన్న ఉన్నారని మేడ పైనుంచి ఒక్కసారిగా కిందికి దూకి, అక్కడినుండి పడుతూ లేస్తూ పారిపోయాడు. మా అందరివి పై ప్రాణాలు పైనే పోయాయి. నాన్న చాలా భయపడిపోయారు. తనను కని పెట్టడానికి మేమంతా తలో దిక్కు పరిగెత్తాము. నాన్నగారైతే సైకిల్ తీసుకొని, ఐదు కిలోమీటర్ల దూరం తొక్కుతూ మా పొలం దగ్గరికి వెళ్లి చూశారు. అక్కడ చెట్టు కింద ఏడుస్తూ కూర్చున్న అన్నయ్యను చూసిన తర్వాతనే ఆయనకు ప్రాణం తెరిపిన పడింది. ఇంకెప్పుడూ స్కూల్ కి వెళ్ళమని చెప్పనని, తనని సముదాయించి ఇంటికి తీసుకుని వచ్చాడు. ఆ రోజుతో ఆన్నయ్య తన చదువుకు స్వస్తి పలికాడని అనుకున్నాం.


చదువు ఒక్కటీ పక్కన పెడితే, మిగతా అన్ని విషయాల్లో తను చాలా చురుకు. మార్కెట్ కెళ్ళి కూరగాయలు తేవటం, నీళ్లు మోయడం, చెట్ల పెంపకం.. .. ఒకటేమిటి చివరికి పొయ్యిలోకి కట్టెలు కూడా గొడ్డలితో కొట్టి ఇంటికి తెచ్చేవాడు. మేమందరం తను చేసే పనులను మాత్రమే చూశాము. కానీ, తనలో దాగిన అభిరుచిని మొదట కనిపెట్టింది మా నాన్న!


మా అన్నలో ఓ అద్భుతమైన చిత్రకారుడు దాగున్నాడు. ప్రకృతిలో అందమైన దృశ్యం తన కళ్ళ ముందు ఆవిష్కృతమైతే చాలు.. ప్రతి పిచ్చి కాగితం కాన్వాసుగా మారేది, పెన్సిల్ ముక్క కుంచై అందమైన చిత్రాలు జాలు వార్చేది. వాటిని భద్రంగా ఒక పాత పెట్టెలో దాచుకునే వాడు.


ఒకరోజు మా నాన్నగారు ఆఫీసు నుండి ఇంటికి వస్తూ, తన చేతిలో ఉన్న కవర్ను నాకు ఇచ్చి, "ఇది అన్నయ్యకు ఇవ్వు" అని చెప్పాడు. అందులోకి ఆతృతగా తొంగి చూసిన మా అన్నయ్య కళ్ళల్లోని వెలుగు ఇప్పటికి నాకు గుర్తుంది. అందులో.. . ఒక వైట్ పేపర్స్ బండిల్, రెండు బ్రష్ లు, కొన్ని కలర్ బాటిల్స్.. , మా అన్నయ్య ఆనందానికి అంతే లేదు. సంతోషంతో పరిగెత్తుకెళ్లి నాన్నను కౌగిలించుకొని థాంక్స్ చెప్పాలనుకున్నాడు. కానీ, నాన్న దగ్గర మాకు అంత చనువు ఉండేది కాదు. ఆయన మితభాషి!అదే మూల కారణం.


కేవలం కష్టపడి సంపాదించి తెచ్చిన జీతం అమ్మ చేతిలో పెట్టడం వరకే నాన్న పని! మా అవసరాలన్నీ అమ్మే చూసేది. ఇలాంటి అదనపు ఖర్చులు అంటే అసలు ప్రోత్సహించేది కాదు. అందుకే ఆవిడకి తెలియకుండా నాన్న జీతం రాగానే మా కోసం ఇలాంటి చిన్న చిన్న ఖర్చులు చేసేవారు. కాకపోతే ఎవరికీ డైరెక్టుగా ఇచ్చేవాడు కాదు. ఆయన ముభావం మాలో కొద్దిపాటి భయాన్ని మిగిల్చింది.


ఆ చిన్న సంఘటనతో మా అన్నయ్యలో విపరీతమైన మార్పు వచ్చింది. చిత్రలేఖనం తో పాటు స్క్రిప్ట్ రైటింగ్(డ్రాయింగ్) పైన కూడా దృష్టి సారించాడు. కొద్దిమంది స్నేహితుల పరిచయంతో బ్యానర్స్ రాయడం మొదలు పెట్టాడు. మెల్లిగా సంపాదన మొదలైంది.


కానీ, తనలో ఏ మూలో తన చదువుతో నాన్నను సంతోష పెట్టోచ్చు అనే చిన్న ఆశ మనసును తోలిచేది. తన సంపాదనతో డైరెక్ట్ గా టెన్త్ బోర్డు ఎగ్జామ్స్ ఫీజు కట్టి రాశాడు. ఒకవైపు తన పని చేసుకుంటూనే టెన్త్ క్లాస్ తో పాటు ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కూడా పూర్తి చేశాడు. తన డిగ్రీ సర్టిఫికెట్ నాన్నకు చూపించిన రోజు ఆయన సంతోషం వర్ణనాతీతం.


తాను ఎంచుకున్న ఫీల్డ్ లో డెవలప్ కావాలంటే సిటీ సరైన ప్లేస్ అని ఆలోచించాడు ఆన్నయ్య. దానికి నాన్న మద్దతు కూడా తోడైంది. తన సంపాదన, కొంత నాన్న ఇచ్చిన డబ్బులు కలిపి తీసుకొని హైదరాబాద్ ప్రయాణమయ్యాడు మా అన్నయ్య.


వినోద్ అన్న గురించి మాట్లాడేటప్పుడు రెండో అన్నయ్య సురేష్ తాను చేసిన త్యాగం గురించి కూడా మీకు చెప్పాలి. అప్పటికే MCom పూర్తి చేసిన మా సురేష్ అన్న, హైదరాబాద్ లాంటి మహానగరంలో వినోదన్న ఒక్కడే బతకలేడని తలచి తాను చేయాలనుకున్న ఉద్యోగం కూడా కాదనుకుని, వినోదన్నతో పాటు హైదరాబాదుకు ప్రయాణమయ్యాడు. ఇద్దరు కలిసి ఒక చిన్న రూం తీసుకొని పెయింటింగ్ మొదలుపెట్టారు. అంచెలంచెలుగా ఎదుగుతూ.. . నాన్నకున్న మంచి పేరును రెట్టింపు చేశారు.


ఫ్లెక్స్ మిషన్ కొనుక్కొని తమకున్న నిబద్ధత, మంచి పేరుతో ఆర్డర్లు సంపాదించుకున్నారు. వందలతో మొదలైన వారి సంపాదన, ఇప్పుడు లక్షలకు చేరుకుంది. ఇద్దరికీ అనువైన భార్యలు, ముత్యాల్లాంటి పిల్లలు, చక్కని జీవితాన్ని అనుభవిస్తున్నారు.


అడుగడుగున మా వెనకే ఉండి నడిపించిన మా నాన్నగారు ఐదు సంవత్సరాల క్రితమే తన 82 వ ఏట కాలం చేశారు. ఆయన చివరిరోజుల్లో మా అన్నలు ఆయనకు చేసిన సేవ "న భూతో న భవిష్యత్"అనొచ్చు. ఆయన శవయాత్ర ఓ మినిస్టర్ ను తలపించింది. ఆయన పాడే మోసెందుకు ఊరంతా ముందుకొచ్చారు. కంట నీరు పెట్టని మనిషి లేడంటే నమ్మండి. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మేమంతా మా మెట్టినింట్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నాం. "కేవలం మంచితనమే శాశ్వతమని" మా పిల్లలకు కూడా ఉద్భోద చేస్తూ ఉంటాం.


మా అందరికన్న ఎక్కువగా ఆయన జ్ఞాపకాలతో తల్లడిల్లే మా అమ్మగారు.. . ప్రతి ఏడాది తన సంవత్సరికానికి మేమంతా తప్పక రావాలని కండిషన్ పెట్టింది. ఆయన బతికున్నప్పుడు ప్రతి దసరాకి కలిసేవాల్లం. మమ్మల్ని చూడగానే ఆయన కళ్ళల్లో ఒకలాంటి మెరుపు తొణికిసలాడేది. తన సంవత్సరికం రోజు అందరం మా పొలం దగ్గరున్న ఆయన సమాధి దగ్గరికి పొద్దున్నే వెళతాం. అక్కడే వంటలు, భోజనాలు, ఆయన జ్ఞాపకాల కబుర్లు, ఆటాపాటా .. . పొద్దు పోయేదాకా ఆయన దగ్గరే గడిపి, గుండెనిండా ఏడాదికి సరిపడా జ్ఞాపకాల అనుభూతులు నింపుకొని, తిరుగు ప్రయాణమౌతాము.


ఒక కొడుకుగా తల్లిదండ్రుల సేవలో తరించాడు. ఇల్లరికం తెచ్చుకున్నా అక్కాబావను కడదాకా ఆదరించిన ఆదర్శ మూర్తి. అన్న చనిపోతే పిల్లలు లేని వదినకు తల్లి స్థానాన్ని ఇచ్చి కంటికి రెప్పలా చూసుకున్నాడు. తన జీవితకాలంలో కట్టుకున్న ఇల్లాలిని పల్లెత్తుమాట కూడా అనని దేవుడులాంటి మా నాన్న పిల్లలం మేమని సగర్వంగా లోకానికి ఎలుగెత్తి చాటుతున్నాం. నాన్నంటే ఇల వెలిసిన దైవం!

***శుభం***

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం :

నా పేరు తల్లోజు పద్మావతి. చింతపట్ల పద్మా రమేష్ అనే పేరుతో రచనలు చేస్తుంటాను.ఇప్పటి వరకు పది కవితలు , ఐదు కథలు అచ్చయ్యాయి.వందకు పైగా కవితలు,ఇరవైకి పైగా కథలు వ్రాయడం జరిగింది. పుట్టింది కల్వకుర్తి(మహబూబ్నగర్ జిల్లా,తెలంగాణ). తల్లిదండ్రులు సుమిత్రమ్మ, రామేశ్వరయ్య గార్లు. భర్త పేరు రమేష్ బాబు, గవర్నమెంట్ టీచర్. నాకిద్దరు అబ్బాయిలు పెద్దవాడు సూర్య(ఇంజనీరింగ్ ఫైనల్),చిన్నోడు పృథ్వి (డిగ్రీ ఫస్ట్ యియర్). రచనలతో పాటు, చిత్రలేఖనం , పాటలు పాడటం, కొత్త వంటలు చేయడం, కుట్లు, అల్లికలు నా హాబీలు.

58 views0 comments

Comments


bottom of page