top of page

జమా- ఖర్చుల చిట్టా


'Jama Kharchula Chitta' written by Janardhan Amballa

రచన : అంబల్ల జనార్దన్

“ఆఫీసర్ గారై ఉండీ క్లర్క్ చేసే పని చేయడం నామోషీగా లేదూ? మేము చేసిన పనిని మీరు చెక్ చేయాలే తప్ప,లెడ్జర్ లో డెబిట్, క్రెడిట్ వౌచర్లు పోస్టు చేయడం మీ పని కాదు.” యూనియన్ లీడర్ వెక్కిరింత.

“ఇందులో నామోషీ ఏముంది? ఇది మన సంస్థ పని. దానికి మీరు ‘వర్క్ టు రూల్’ పాటిస్తే, ఆఫీసర్లమైన మేము ఆ పని పూర్తి చేసే బాధ్యత తీసుకోవాలి కదా? ఐనా మా ఆఫీసర్లకు మీలా వర్క్ టు రూల్ పాటించే వెసులుబాటు లేదు” నేను శాంతంగా జవాబిచ్చాను.

“ఎందుకు లేదు? మీరూ మా లాగా ఉద్యోగులే కదా? మా పాక్షిక సమ్మెను మీరిలా నీరుగార్చడం ఏం బాలేదు. మీ లాంటి మానేజ్ మెంట్ తొత్తుల వల్లే మా నిరసన వీగి పోయేట్టుంది. దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఏదో ప్రమోషన్ పై పక్క రాష్ట్రం నుంచి వచ్చారు కదా అని ఇన్నాళ్లు మీకు సహకరించాం. ఇక మీదట మీరు మా మరో రూపం చూస్తారు.” యూనియన్ లీడర్ హెచ్చరిక.

“మీ సహకారానికి ధన్యవాదాలు. మా ఆఫీసర్లకు మీలా లేబర్ చట్టాల రక్షణ లేదు. మేము కూడా మానేజ్ మెంట్ లో భాగం కాబట్టి, కస్టమర్లకు సేవ చేయడానికి అవసరమైనప్పుడు క్లరికల్ పనులు కూడా చేయాల్సి ఉంటుంది. లేకపోతే మా మీద క్రమశిక్షణ చర్య తీసుకుంటారు. రేపు మీరు కూడా ఆఫీసర్ అవుతారు. పరిస్థితిని అర్థం చేసుకుని నా బాధ్యత నెరవేర్చనివ్వండి” నాలో అదే శాంతం.

“మీరు ఇక్కడ ఎలా నెగ్గుకొస్తారో మేమూ చూస్తాం. ఈ ప్రమోషనొద్దు బాబోయ్, అని మీ సొంత రాష్ట్రానికి పరుగుపెట్టేలా చేస్తాం.” అని వేలెత్తి చూపుతూ వెనుతిరిగాడు ఆ యూనియన్ లీడర్. ఆ గండం నుంచి ఎలాగో గట్టెక్కాను. ఒకడుగు ముందుకేసి, స్థానిక మానేజ్ మెంట్ చేత వారి కొన్ని డిమాండ్లను ఒప్పుకునేలా ప్రయత్నం చేశాను. ఆ తర్వాతి రోజుల్లో నా ప్రవర్తనతో, వాళ్లచేతే ‘మంచి మానవత్వమున్న అధికారి’ అనిపించుకుని అక్కడ, నా మూడేళ్ల సర్వీస్ ముగించుకుని, ఇంకో ప్రమోషన్ పై, నా సొంత రాష్ట్రానికి తిరిగి వెళ్లాను. అలా నా నాలుగు దశాబ్దాల ఉద్యోగ పర్వం డెబిట్ క్రెడిట్ల మధ్యలోనే గడిచింది. అదేం ఉద్యోగమబ్బా? అని తలలో లేని పేన్లను గోక్కుంటున్నారా? మీ కంత శ్రమ అక్కరలేదు లెండి, నేనే చెప్పేస్తున్నాను. నేను వెలగబెట్టింది ఓ జాతీయ బ్యాంక్ లోని కొలువు.

ఓ జాతీయ బ్యాంక్ లో గుమాస్తాగా మొదలుపెట్టి, అంచెలంచెలుగా ఎదిగి, నలభై ఏళ్ల తర్వాత జనరల్ మానేజరుగా పదవీ విరమణ చేశాను. నా సుదీర్ఘ సర్వీస్ లో కొన్నివేల వినియోగదారులు, కొన్ని వందల తోటి ఉద్యోగులు, నా జీవితంలోకి తొంగి చూశారు. నిజం చెప్పాలంటే నేనే వారి జీవితాల్లోకి చొచ్చుకుపోయాను. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలు చుట్టబెట్టాను. ఆయా వాతావరణాలకి అలవాటు పడ్డాను. ప్రతి పరిస్థితికి అనుగుణంగా నన్ను నేను మలుచుకున్నాను. ఫలితంగా ఉద్యోగంలో చేరిన నా తొలినాటి భావాలు పదవీ విరమణ వచ్చేసరికి ఎంతో మార్పుచెందాయి. కొన్ని ఆలోచనలైతే మొత్తం తారుమారయ్యాయి. అనుభవాల ఉలి నన్నో సుందర శిల్పంలా చెక్కింది. అలా అని, అన్నీ మంచి అనుభవాలే కలిగాయని మీరనుకుంటే, ‘తప్పు’ లో కాలేసినట్టే. చాలా తీయని జ్ఞాపకాలతో పాటు కొన్ని చేదు సంఘటనలు, అన్నంలో రాళ్లలా వచ్చి, మనసును కలచివేశాయి. ఇంతకు ముందు ఉటంకించిన సంఘటన అలాంటిదే. ఐతే మొత్తం మీద నా ఉద్యోగపర్వం విజయవంతంగానే ముగిసిందని చెప్పడంలో నాకెలాంటి సంకోచం లేదు. నా జీవిత బ్యాలెన్స్ షీట్ లో అప్పులకంటే ఆస్తులే ఎక్కువున్నాయి. ఖర్చులతో (డెబిట్లతో) పోలిస్తే జమలు (క్రెడిట్లు) ఎక్కువగానే ఉన్నాయి. ఆ పుటల్లోని కొన్ని ముఖ్యమైన ఎంట్రీలు మీతో పంచుకుంటున్నాను.

ఉద్యోగంలో చేరే దాకా ఎన్నో డెబిట్ ఎంట్రీలతో ఉక్కిరి బిక్కిరైన నాకు, జీవితంలో మొదటిసారి ఓ పెద్ద క్రెడిట్ ఎంట్రీ నా జీవిత పుటల్లోకి ఎక్కింది. అప్పటివరకు బ్యాంకులో దాచుకోదగ్గ డబ్బులేక, బ్యాంకు ఖాతా కూడా తెరువలేకపోయిన నాకు, అనుకోకుండా ఓ జాతీయ బ్యాంకులో ఉద్యోగావకాశం తలుపుతట్టింది. అప్పటికింకా డిగ్రీ కూడా పూర్తి చేయని నాకు ఉద్యోగం, అదీ ఓ జాతీయ బ్యాంకులో, ఏ ఉత్తర, దక్షిణాలు లేకుండా రావడానికి నా కృషికి, భగవంతుని అనుగ్రహం కూడా తోడైందని ఒప్పుకోక తప్పదు. ఐతే అక్కడ కూడా చిన్న మెలిక మొలకెత్తింది. నా డిగ్రీ రెండవ సంవత్సరాంత పరీక్షలు ఇంకా పదిరోజుల్లో ఉన్నాయనగా ఉద్యోగంలో చేరమని నియామక పత్రం లభించింది. ఉద్యోగం వచ్చిన సంతోషం ఓ వైపు కాగా, మరో పది రోజుల తర్వాత జరుగబోయే పరీక్షలకు సెలవు దొరుకుతుందో లేదో అనే భయం ఇంకో వైపు లాగ సాగింది. ఓ పది నిమిషాలు తర్జనభర్జన పడి, ఏమైతే అదవుతుందని తెగించి, నా సమస్య అక్కడి అధికారికి వివరించాను. సహృదయులైన ఆ ఆఫీసర్ గారు సానుకూలంగా స్పందించారు. పరీక్షలైన తర్వాత ఉద్యోగంలో చేరడానికి అనుమతించారు. ఐతే నా సీనియారిటీ ఓ నెలరోజులు వెనక్కి పోతుందని చెప్పారు. ఒక సంవత్సరం చదువు వృథా అవడం కంటే ఓ నెల సీనియారిటీ పోయినా పరవాలేదని మనసుకు నచ్చజెప్పుకొన్నాను. సంతోషంగా ఇంటికి బయలుదేరాను. విషయం చెప్పగానే ఇంట్లో వాళ్లు అంతెత్తున ఎగిరి పడ్దారు. చేతికందిన ఓ జాతీయ బ్యాంక్ ఉద్యోగావకాశం జారవిడుచుకున్నందుకు చీవాట్లు పెట్టారు. చదువు ఓ సంవత్సరం పోతే పోయింది, అంత మంచి ఉద్యోగం ఎవరైనా వదులుకుంటారా? అని కోప పడ్దారు. ‘ఓ నెల తర్వాత ఆ ఉద్యోగం ఇస్తారని గ్యారంటీ ఏమిటి? నీకు హామీ ఇచ్చిన ఆ ఆఫీసర్ బదిలీ ఐతే ఏంటి గతి? పొదలో ఉన్న రెండు పక్షులకంటే చేతిలో ఉన్న ఒక పక్షితో సరిపెట్టుకోకూడదా?’ అనే ఓ ఇంగ్లీషు సామెతను తెలుగులో ఉటంకించి హితబోధ చేశారు.

చేతి నుండి బాణం సంధించాను, ఇక అది తిరిగి వచ్చే అవకాశం లేదని వారికి అర్థమయ్యేలా చెప్పేసరికి నా తల ప్రాణం తోకకొచ్చింది. ఇక ఆ విషయానికి స్వస్తి పలికి నా పరీక్షలకు సన్నద్ధం కావడంలో నిమగ్నమయ్యాను. ఉద్యోగం వచ్చిన ఉత్సాహంతో శ్రద్ధగా చదివి, పరీక్షలు బాగా రాశాను. అవి పూర్తైన మర్నాడే బ్యాంకులో వాలిపోయాను. ఆ తర్వాత? పగలు దాదాపు ఒంటి గంట ప్రాంతంలో మొహం వేళ్లాడేసుకొని ఇంటికి వెళ్లాను. నన్ను ఆ స్థితిలో చూసి ఇంట్లో వాళ్లు ఆందోళన చెందారు. తలుపుతట్టిన అదృష్టదేవత మొహంమీదే తలుపుమూసినందుకు నిందించారు. మా అమ్మ మాత్రం “పర్వాలేదు కొడుకా! అంతకంటే మంచి నౌకిరీ నీకు రాసి పెట్టున్నదేమో? పొద్దుగాల్ల చాయి బిస్కిట్లు తిని పోయిన నువ్వు మల్ల ఏం తిన్నట్టు లేదు, మొకం జూడు ఎంత గుంజుక పొయిందో? సేయి కడుక్కొని రా. ఇంత సల్లవడి ఆరాం జెయ్యి.” అని పన్నీటిజల్లు కురిపించింది. ఎంతైనా అమ్మ అమ్మే కదా? కడుపునిండా తిని “ నేను బ్యాంకు నౌకిరిల సేరినా” అని గట్టిగా అరిచాను.

అప్పుడంతా అవాక్కయ్యారు. “బ్యాంకుల సేరినంటవ్, మల్ల పగలు ఇంటికచ్చినవేంది?” అందరూ మూకుమ్మడిగా అడిగారు. అప్పుడు, నా బనీనుకు, లేని కాలరెగిరేసి … “తినెతందుకచ్చిన. మాది, మన ఇంటికి దగ్గరున్న బ్రాంచి. అది రొండు పయిలీలల్ల(షిఫ్టుల్లో) పనిజేత్తది. పొద్దుగాల్ల తొమ్మిదినుంచి పన్నెండున్నరదాకా, అటెన్క పగలు మూడున్నర నుంచి యోడెగెదాకా. గిప్పుడు గొంత ఆరాం జేసి లేసి చాయిదాగి, మూడేంగ ఎల్తినంటె, మల్ల ఎనిమిది లోపలస్త” అని అసలు విషయం బయట పెట్టాను. అలాగే నా బ్యాగులోని మిఠాయి పొట్లం కూడా తీశాను. అప్పుడు? మా ఇంట్లో వాళ్లందరి కళ్లల్లో మెరుపు. ఆ ఆనందం ఇప్పటికీ నా కళ్లకు కట్టినట్టుంది. చేజారిపోయిందనుకున్న పెన్నిధి మళ్లీ చేతి కొస్తే ఆ సంతోషమే వేరు కదా! అలా నా ఉద్యోగ ప్రస్థానం, ఓ పేద్ద క్రెడిట్ తో మొదలైంది.

అంకిత భావంతో అటు ఉద్యోగం, ఇటు చదువు, అనే జోడు గుఱ్ఱాలపై స్వారీ ప్రారంభించాను. ఏడేళ్లలో ఉదయపు కాలేజీలో గ్రాడ్యుయేషన్, ఎల్ఎల్.బి. తో పాటు, బ్యాంకు పరీక్షలైన సి.ఎ.ఐ.ఐ,బి, రెండు భాగాలు పూర్తి చేశాను. అదే సంవత్సరం నన్ను ఆఫీసర్ ప్రమోషన్ వరించింది. అప్పటివరకు కేవలం సీనియారిటీ ద్వారా ఇచ్చే ప్రమోషన్లలో కొంత శాతం మెరిట్ ద్వారా కూడా ఇవ్వాలని నిర్వాహక మండళి మరియు కార్మిక సంఘం, ఒక అవగాహనకు వచ్చాయి. ఆ విధి విధానాల ప్రకారం నాకు బ్యాంక్ లో జరిగిన మొట్టమొదటి మెరిట్ పరీక్షకు హాజరయ్యే అవకాశం వచ్చింది. అందులో కూడా నా ఖాతాలో క్రెడిట్ ఎంట్రీ పడింది. నా రొట్టె విరిగి నేతిలో పడింది. ఐతే ఆ నెయ్యి, గుజరాత్ లో ఉందని తేలింది. అది కాస్తా డెబిట్ అని నిరాశపడ్డా, కాలక్రమంలో దాన్ని క్రెడిట్ గా మార్చుకోవడంలో కృతకృత్యున్నయ్యాను. గుజరాత్ లో పని చేసిన మూడేళ్లలో రాష్ట్రమంతటావ్యాపించిన , ఆ బ్యాంకు యొక్క ఇరవై ఒక్క బ్రాంచీల్లో పనిచేసే అవకాశం కలిగింది. పనిలో ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందిన నన్ను, రిలీవింగ్ బ్రాంచ్ మానేజరుగా పంపేవారు. అంటే ఆ రాష్ట్రంలోని ఏ బ్రాంచ్ మానేజర్ సెలవుపై వెళ్ళినా నా లాంటి వాళ్లని రిలీవర్లుగా పంపేవారు. ఆ బ్రాంచ్ లో అంటీ అంటనట్టుండకుండా నేను, రోజువారీ విధులు నిర్వహిస్తూనే పెండింగ్ పనులు కూడా చక్కబెట్టేవాణ్ణి. స్థానిక ప్రజలతో మమేకమై వారి ఇబ్బందులు, ఇక్కట్లు తీర్చడానికి ప్రయత్నం చేశాను.

ఇంట్లో డబ్బులు దాచుకునేవారిని ఒప్పించి, వారిని బ్యాంక్ లో ఖాతాలు తెరిచి, ఆ ఖాతాల్లో తాము పొదుపు చేసిన డబ్బును జమ చేసేలా ఒప్పించాను. ఓ గ్రామీణ బ్రాంచ్ లోని అనుభవం ఇప్పటికీ నన్ను పులకింపజేస్తుంది. అది నలభై ఏడేళ్లక్రితం నాటి మాట. అప్పుడు గ్రామాల్లో సెల్ ఫోన్లు కావు కదా, మామూలు ఫోన్లు కూడా లేని పరిస్థితి. అలాంటి ఓ గ్రామీణ బ్రాంచ్ కి నన్ను రిలీవింగ్ ఆఫీసర్ గా పంపారు. ఆ బ్రాంచ్ లో అప్పుడు, ముగ్గురంటే ముగ్గురే ఉద్యోగులు. బ్రాంచ్ మానేజర్- కం- అకౌంటెంట్, క్లర్క్- కం- కాషియర్, ప్యూన్- కం- వాచ్ మన్. దాదాపు ఐదు వందల గడపలున్న ఆ ఊర్లో, ఒక్కటంటే ఒక్క టెలిఫోన్ కూడా లేదు. జిల్లా కేంద్రంలో ఉన్న మా పై ఆఫీసుకి ఏ సందేశం పంపాలన్నా, దాదాపు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రానికి మనిషిని పంపడమొక్కటే మార్గం. లేకపోతే పోస్ట్ ద్వారా ఉత్తరాలు పంపడం. బ్రాంచ్ లో మాకు తరచూ మా పై ఆఫీసును సంప్రదించే అవసరం పడేది. అప్పుడు సైకిల్ పై మా ప్యూన్ ని పంపి ఆ పనులు చక్కబెట్టుకునేవాళ్లం. ఆ పరిస్థితిని చూసి నేను వెంటనే టెలిఫోన్ విభాగంతో ఉత్తరాల పరంపర మొదలుపెట్టాను.

ఓ జాతీయ బ్యాంక్ లావాదేవీలకు ఫొన్ ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ప్రభుత్వ టెలిఫోన్ ప్రాంతీయ కార్యాలయానికి రాశాను. దాని కాపీలు, రాష్ట్ర రాజధాని టెలిఫోన్ కేంద్రానికి, కేంద్ర టెలిఫోన్ మంత్రిత్వ శాఖకు, మా ప్రాంతీయ కార్యాలయానికి పంపాను. ప్రభుత్వ కార్యాలయాల పనితనం తెలుసు కాబట్టి, ప్రతి వారం ఓ రిమైండర్ పంపాను. అక్కడి నా డ్యూటీ ముగియగానే వేరే బ్రాంచ్ కి రిలీవింగ్ బ్రాంచ్ మానేజర్ గా వెళ్లాను. ఓ నెల రోజుల తర్వాత, వేరే ఓ బ్రాంచ్ కి రిలీవర్ గా వెళ్లడానికి, జిల్లా కేంద్రంలోని బస్ స్టాప్ లో బస్సుకై వేచి ఉన్నాను. అప్పుడొకతను.. “సర్! నమస్కారం. మా ఊరికి టెలిఫోన్ వచ్చింది.” అతని కళ్లలో మెరుపు. అప్పుడు ట్యూబ్ లైట్ వెలిగింది, అతను నేను అంతకుముందు పనిచేసిన బ్రాంచ్ లో ఓ కస్టమర్. అంటే నా ప్రయత్నం సఫలమైందన్న మాట. అతనిలాగే ఇంకెంతమంది నన్ను జ్ఞాపకం చేసారో? మరో క్రెడిట్ నా ఖాతాలో పడింది. ఇంకో అనుభవం… నేను మరో రాష్ట్రంలో ఓ కొత్త బ్రాంచ్ తెరిచి, దానికి మొదటి మానేజరుగా వెళ్లాను. అప్పుడు వ్యాపారం పెంచేందుకు కొన్ని నిబంధనలను సడలించాల్సి వచ్చింది. ఎవరు గుర్తుపట్టేవారు (ఇంట్రొడ్యూసర్) లేకపోయినా ఖాతాలు తెరవాల్సి వచ్చింది. ఇప్పుడంటే కె.వై.సి.(నో యువర్ కస్టమర్) నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి, కాని అప్పుడు రూల్స్ అంతగా పాటించేవారు కాదు. అలా తెరిచిన ఓ ఖాతాలో అక్కడికి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతీయ జీవిత భీమా కంపెనీ వారిచ్చిన చెక్ జమ చేసి, హాస్పిటల్లో కట్టడానికి అర్జంటుగా, దానిలో సగం డబ్బు వెంటనే ఇవ్వమని ప్రాధేయపడ్డాడు ఓ కస్టమర్. అతని అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని, మానవతా దృక్పథంతో నా అధికారాన్ని ఉపయోగించి, అతని చెక్ ఇంకా పాస్ కాకపోయినా, బ్యాంక్ దస్తావేజులపై సంతకం తీసుకుని, అతనడిగిన డబ్బు సర్దుబాటు చేశాను. రెండు వారాల తర్వాత, ఆ సెంటర్లో అసలు భారతీయ జీవిత భీమా శాఖ లేనే లేదని, మేము కలెక్షనుకు పంపిన బ్యాంకు నుండి ఆ చెక్కు తిరిగి వచ్చింది. అంటే భారతీయ జీవిత భీమా పేరుతో చెక్ ముద్రించి మోసం చేశారన్న మాట. వెంటనే ఆ కస్టమర్. ఖాతాలో ఇచ్చిన చిరునామాకు మనిషిని పంపగా ఆ అడ్రసులో అలాంటి వ్యక్తి ఎవరూ లేరని తేలింది. ఇక చేసేదేం లేక, బ్యాంక్ రూల్స్ ప్రకారం ఆ డబ్బు నేనే కట్టాల్సి వచ్చింది. ఆ డెబిట్ ఎంట్రీతో బుద్ధి తెచ్చుకొని, మరెన్నడూ బ్యాంక్ నిబంధనలను అతిక్రమించలేదు, ఇంకో గ్రామీణ బ్రాంచ్ లో మరో అనుభవం. ఓ చిన్న కిరాణా కొట్టుకి నా లోన్ మంజూరీ అధికారంతో కొంత అప్పు సాంక్షన్ చేశాను. అది విడుదల చేసే ముందు తనిఖీకి వెళ్తే ఆ కస్టమర్ దయనీయ పరిస్థితి చూసి చాలా బాధ కలిగింది. సరుకులు లేక, ఆ కొట్టు బోసిపోయి ఉంది. అప్పుడు, ఊళ్లోని మా తాతయ్య రూపం కళ్ల ముందుకొచ్చింది. ఆయన కూడా పెట్టుబడి లేక తన కిరాణా కొట్టులో సరుకులు సరిగ్గా నింప లేకపోయేవాడు. షావుకారి వడ్డీ కట్టడంలోనే ఆయన జీవితం తెల్లారిపోయింది. ఆ పరిస్థితి మా కస్టమర్ కి రాకూడదని వెంటనే మంజూరు చేసిన మొత్తం అతని ఖాతాలో జమ చేశాను. అప్పుడతను కళ్లలోకి నీళ్లు తెచ్చుకొని నా కాళ్లపై పడ్డాడు. నేను అతన్ని లేవనెత్తి హత్తుకున్నాను. వ్యాపారం బాగా పుంజుకుంటే ఇంకా ఎక్కువ మొత్తం అప్పుగా మంజూరు చేస్తానని మాటిచ్చాను. అలాంటి బడుగు జీవుల దీవెనలే నా ఖాతాలో క్రెడిటై నా పురోభివృద్ధికై దోహదపడ్డాయని గట్టిగా నమ్ముతాను. నిజాయితీకి మించిన ధర్మం లేదని నా భావన. ఇంకో అనుభవం నా మనసులో చెరగని ముద్ర వేసింది. ఓ మొండి బకాయి వసూలుకి వెళ్తే ఆ అసామి లేడు. ఆయన భార్య, కొడుకు ఉన్నారు. జనప మిల్లులో పనిచేసే మా బకాయదారుని కంపెనీ మూత పడిందనీ, ఎదో కూలిపనికి వెళ్లాడని చెప్పిందతని భార్య. అలాగే తన కొడుక్కి ఇంటర్ మీడియేట్ లో ఫస్ట్ క్లాస్ వచ్చిందని చెప్పిందామె. ఆమె కళ్లల్లో ఓ మెరుపు. భవిష్యత్తు పట్ల విశ్వాసం కనిపించాయి నాకు. వెంటనే నా జేబులోంచి వంద రూపాయలు తీసి ఆ అబ్బాయికి ఇచ్చాను. ‘బాకీ వసూలుకి వచ్చి, మీరే ఎదురు డబ్బు ఇచ్చారేంటి సర్?’ అన్నాడు నా సహోద్యోగి. ‘ముందు మనం మనుషులం, ఆ తర్వాతే అధికారులం’ అని అతనికి సర్ది చెప్పాను. ఉద్యోగ పర్వంలో మెట్టు, పై మెట్టు, ఎక్కేకొద్దీ రోజువారీ బ్రాంచ్ బాధ్యతలు తగ్గి, కొన్ని బ్రాంచులపై ఆజమాయిషీ చేసే అవకాశం వచ్చింది. అప్పుడు కొంత మంది పెద్ద వ్యాపారులతో లావాదేవీలు జరిపే పరిస్థితి తలెత్తింది. వారు తమ అలవాటు ప్రకారం వేసిన ఎముకలు తోసేసి, వారిని సాగనంపి, బ్యాంక్ పట్ల విశ్వాసంతో పని చేయడం వల్ల, నా హయాంలోని లోన్లు నిరర్థకం(ఎన్.పి.ఎ.) కాలేదు. పై అధికారుల నుండి ఎంత ఒత్తిడి వచ్చినా బ్యాంక్ కు నష్టం కలిగించే పని ఏదీ చేయలేదు. ఐతే దాని వల్ల చంబల్, అస్సాం లోని బ్రాంచ్ లకు పనిష్మెంట్ ట్రాన్స్ ఫర్ కు లోనయ్యాను. ఐనా కృంగిపోకుండా, కుటుంబాన్ని మా స్వస్థలంలో ఉంచి, నేనొక్కణ్ణే ఆయా బ్రాంచుల్లో విధులు నిర్వహించాను. అలా కుటుంబ జీవితానికి దూరమై బ్యాంక్ ఉద్యోగానికే జీవితం అంకితం చేశాను. అవి డెబిట్ ఎంట్రీలైనా వాటిని కూడా నా ఖాతాలోని భాగాలుగా చేసుకొని, ముందుకు పోయాను. పై మానేజ్ మెంట్ తో, వినియోగదారులతో, తోటి ఉద్యోగులతో సంప్రదింపులు, ఘర్షణలు, సంఘర్షణలు నన్ను ఏ పరిస్థితినైనా తట్టుకొనేలా రాటుదేల్చాయి. బడుగు బలహీన వర్గాలకై ఎన్నో పథకాలు రూపొందించి, వాటి అమలుతో ఎన్నో కుటుంబాల అభివృద్ధి కై తోడ్పడేలా చేశాయి. నొప్పింపక తానొవ్వక తప్పించుకొని తిరుగమని’ బద్దెన కవి చెప్పిన హితబోధను ఒంటబట్టించుకొని, నా సర్వీసంతా అలాగే పాటించాను. అందుకే మచ్చలేకుండా రిటైరై, ఇప్పుడు, రిటైర్ మెంట్ మొత్తం మ్యూచువల్ ఫండ్ లలో మదుపు చేసి, ఆ డివిడెండ్ తో, పెన్షన్ డబ్బులతో హాయిగా జీవితం వెళ్లదీస్తున్నాను. బ్యాంక్ ఉద్యోగం అంటే కేవలం జమా - ఖర్చుల చిట్టా కాదు, అది ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపే బృహత్కార్యం. షావుకారు అప్పుల ఊబిలో కూరుకుపోతున్న వారిలో ఆత్మ విశ్వాసం నింపి వారి జీవితం, అభివృద్ధి పథాన నడిపించే అద్భుత పనిముట్టు. నేను రిటైరై ఏళ్లు గడుస్తున్నా, ఇప్పటికీ కొంత మంది నాకు వారి విజయాలకు నేనూ ఓ కారణం అని ఉత్తరాలు రాస్తుంటారు. వారి వ్యాపార వృద్ధికై నన్ను సలహాలు అడుగుతారు. అది నా విశ్రాంత జీవితంలో కొత్త వెలుగులు నింపుతుంది. అలా నా ఖాతాలో ఇంకా క్రెడిట్ ఎంట్రీలు పడుతూనే ఉన్నాయి. జీవిత నౌక, ఒడుదుడుకులు లేకుండా సాఫీగా నడవడానికి ఇది చాలు. డెబిట్ ఎంట్రీలకు కృంగిపోకుండా, క్రెడిట్ ఎంట్రీలకు పొంగిపోకుండా ఎలా వచ్చిన పరిస్థితులను అలాగే ఎదుర్కొంటూ, నిజాయితీతో, మానవత్వ విలువలు పాటిస్తూ, వాటి మధ్య ముందుకు సాగడమే పరమావధి అని నేను గట్టిగా నమ్ముతాను. ‘మన అంతరాత్మకే మనం జవాబుదారీ’ అని భావిస్తూ అడ్డదారులు తొక్కకుండా ఉంటే మున్ముందు అదే మనల్ని కాపాడుతుంది. కష్టసుఖాలు కావడిలో కుండలని భావిస్తూ, అవరోధాలను అవకాశాలుగా మలచుకొని విజయాల వైపు పయనించడమే మనం చేయాల్సింది. అది బ్యాంక్ ఉద్యోగమైనా, ఇంకే ఉద్యోగమో లేక ఉపాధి ఐనా మన జీవిత జమా - ఖర్చుల పట్టికలో ఆస్తులు, అప్పుల కంటే ఎక్కువే ఉండాలి.

-------------x-------------x--------------x-------------------

గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


రచయిత పరిచయం : డా. అంబల్ల జనార్దన్‌





తల్లి దండ్రులు : అంబల్ల నర్సవ్వ, అంబల్ల నర్స్మయ్య

జననం : 9 నవంబరు, 1950.

చదువు : ఆంధ్ర ఎడ్యుకేషన్‌ సొసైటీ వారి ఉన్నత పాఠశాల, ముంబయి నుండి ఎస్‌.ఎస్‌.సి.- మార్చ్‌-1967

యం.కాం., ఎల్‌ ఎల్‌.వీ.,(ముంబయి విశ్వవిద్యాలయం) సి.ఏ.ఐ.ఐ.బి. (ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌

బ్యాంకింగ్‌ & ఫైనాన్స్‌)

సొంతఊరు :పోస్ట్‌: ధర్మోరా, మోర్తాడ్‌ మండలం, నిజామాబాద్‌ జిల్లా.-503 311 తెలంగాణ రాష్ట్రం. పుట్టిన్నుండి ముంబయిలో నివాసం.

ఉద్యోగ ప్రస్థానం :మార్చి, 1970 లో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో మొదలై, బాంబే మర్కంటైల్‌ బ్యాంక్‌, ప్రెస్మన్‌ కార్పొరేట్‌

గ్రూప్‌, కాస్మాస్‌ బ్యాంక్‌, మార్గంలో పయనించి, ఎప్రిల్‌ 2007 లో దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుండి “హెడ్‌-క్రెడిట్‌-

ఎడ్మినిస్టేషన్‌” గా పదవీ విరమణ. ఆ తర్వాత కొన్ని సంస్థలకు ఆర్థిక సలహాదారునిగా సేవలు.

సాహిత్య ప్రస్థానం ; 1ఆరు కథా సంపుటాలు, మూడు కవితా సంపుటాలు, ఒక వ్యాస సంపుటి, ఒక మోనోగ్రాఫ్‌ ప్రచురణ.

2. స్వీయ కథల ఇంగ్లీష్‌, హిందీ, మరాఠీ మరియు ఒడియా సంపుటాలు ప్రచురితం. (గుజరాతీ కథా సంపుటి ముద్రణలో)

3. “అంబల్ల జనార్దన్‌ కథలు” కథా సంపుటిపై పరిశోధనకు గాను యూనివసిటీ ఆఫ్‌ హైద్రాబాద్‌ వారిచే శ్రీ గుడుగుంట్ల

ఆంజనేయులు గారికి యం.ఫిల్‌. ప్రదానం.

4. ఒక కథ, అసామీ భాషలోకి అనువాదమయింది. కొన్ని కథలు, కవితలు వివిధ సంకలనాల్లో చోటు చేసుకున్నాయి.

బిరుదులు ; “ముంబయి తెలుగు రత్న, “ముంబయి కథా కెరటం” ” మరియు “సాహిత్య రత్న”

పురస్కారాలు : పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారంతో సహా, మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్య ప్రదేశ్‌, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌

రాష్ట్రాల్లోని ఎన్నో సాంఘిక, సాహిత్య సంస్థల ద్వారా సన్మానాలు. 2012 లో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా

“మహారాష్ట్రలో తెలుగువారు” మోనోగ్రాఫ్‌ రాసినందుకు గాను, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సన్మానం.

5. దాదాపు రెండు దశాబ్దాలుగా కొన్ని కథలు, మహారాష్ట్ర ప్రభుత్వంచే ప్రచురింపబడిన తెలుగు మరియు మరాఠీ 8వ, 9వ, 10వ, 11వ

మరియు12 వ తరగతి పుస్తకాలలో పాఠ్యాంశాలు.

ఓ కథ “శ్రీకారం” యూనివసిటీ ఆఫ్‌ హైద్రాబాద్‌ వారు ఎం.ఏ. విద్యార్థుల పాఠ్యాంశంలో చేర్చారు.

6. కాకతీయ విశ్వవిద్యాలయం, తెలంగాణ విశ్వవిద్యాలయం తో సహా కొన్ని సాహితీ సదస్సుల్లో పత్రాల సమర్పణ.

నేషనల్‌ వర్చువల్‌ యూనివర్సిటీ ఫర్‌ పీస్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ వారిచే గౌరవ డాక్టరేట్‌ పట్టా ప్రధానం - 2019




41 views0 comments

댓글


bottom of page