top of page

కాకమ్మ కబుర్లు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి





'Kakamma Kaburlu' written by Kiran Vibhavari

రచన : కిరణ్ విభావరి

ఎందుకో కానీ నాకు చిన్నప్పటి నుండీ కాకి అంటే భలే ప్రీతి. కాకి గోల అని మా బామ్మ తిట్టినప్పుడో, కాకి రంగు అని మా అమ్మ వెక్కిరించినప్పుడో, లేదా కాకి బంగారం అని నా మేధస్సును మా నాన్న ఎద్దేవా చేసినప్పుడో కాదు.. కాకిని చూసిన ప్రతిసారీ నాకది ముద్దొస్తుంది.

కాకి మా ఇంటి గోడ మీద గూడు కట్టుకుని, ప్రతీ పాడు పనిలో నన్ను ఇరికించే నా అన్నల తలల మీద అది పొడుస్తూ వెళుతుంటే, నాకు వాళ్ళ మీదున్న పగ అది సాధించినట్టు భలే ముచ్చటగా ఉండేది. కానీ ఏం చేస్తాం..ఈ ఇంట్లో నాకు విలువ లేనట్టే వాటికీ విలువలేదు. దాని గూడును మొత్తం తీసి పడేశారు. కానీ నా కాకి కూడా నాలాగే మహా మొండిది. మరునాడే మళ్లీ ఇంకో గూడు కట్టుకుని, మా వాళ్ళను కావు కావుమంటూ వెక్కిరించింది. ఈసారెందుకో మా వాళ్ళు సర్ధుకుపోయి , దాని గూడు జోలికి పోలేదు. బహుశా దాని గూడు తొలగించగానే మా బామ్మ కాలుజారి పడడం వల్ల కాబోలు. అయినా ఆవిడ పడటం వెనుక నా నిర్లక్ష్యమే కారణం అని తెలిస్తే ఆ కాకితో పాటు గూడు లేని వాడినై, నేనూ వీధుల్లో పడి కావు మనాల్సి వచ్చేది.


కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు కానీ, మా తోబుట్టువులందరిలో నేనే కాకి రంగు కావడం వల్ల మా వాళ్లకెందుకో నేను నచ్చేవాడిని కాను. పైపెచ్చు నా స్వరం కూడా కాకి నుండే అరువు తెచ్చుకున్నట్టు, నేను అమ్మా అని పిలిచినా అదో తిట్టులా వినిపించి, నాకు వాతలు పడేవి.


మా ఇంటికి కొత్త బంధువులు ఎవరొచ్చినా, నన్ను మా ఇంటి పని పిల్లాడిగానో, లేదా దత్తత తీసుకున్న పిల్లాడిగానో చూస్తుంటే బాధేసినా, నిజం తెలుసుకున్నాక, నా అమాయక చూపులకు వారు బాధ పడి, మా అన్నల కన్నా నాకో రూపాయి ఎక్కువిచ్చి వెళ్ళేవారు. నా రంగు నాకా మేలు చేసేది.


కాకంటే ఎంతిష్టమో, పావురాన్ని చూస్తే నాకంత అయిష్టం. మాసిపోయేలా ఉండేటి దాని తెల్లటి తెలుపు చూస్తే, ఎందుకో దాన్ని కూడా ఏ బురదలోనో ముంచి తీయాలి అని అనిపించేది.

నేను రోజూ ఆరుబయట విసిరే అన్నం మెతుకులు కాకులతో పాటు పావురాలు తినేవి. కానీ భయం భయంగా ఎవరో తరుముకొస్తున్నట్టు ఉండే ఆ పావురాలను ఇలా విదిలిస్తే చాలు ఎక్కడికో ఎగిరిపోయేవి. వాటినలా విదిలిస్తూ భయపెట్టడం నాకో కాలక్షేపం. కానీ నా కాకులు అలా కాదు..దర్జాగా మేడమీద ఆరేసిన అప్పడాలు, వడియాలు మా ముందుకే తెచ్చుకుని అవి తింటుంటే, మా ఇంట్లో ఆడోళ్ళు తిట్టుకుంటున్నా నాకు మాత్రం భలే ముచ్చట గొలిపేది.


భయం అంటే తెలియని ఏకైక పక్షి కాకి. పావురాలు మాత్రం చెడ్డ పిరికివి. అచ్చం మా ఇంట్లో వారిలాగే. అస్తమానం అన్నిటికీ భయాలే..ఉద్యోగం పోతుందేమో అని భయం, ఇంటి ఓనర్ ఇల్లు ఖాళీ చెయ్యమంటాడేమో అని భయం, జబ్బు చేస్తుందని భయం..మా భవిష్యత్ ఎలా ఉంటుందనే భయం.. అబ్బా... మన చేతుల్లో లేని వాటి అన్నిటి మీదా భయాలే. ఈరోజున, ఈ క్షణాన్ని హాయిగా జీవించాలని వారికి ఉండదు.

ఎందుకో ఇలా భయపడే వారిని ఇంకా భయపెట్టడం నాకు భలే సరదా. ఒకసారి నా స్నేహితుడు రవి గాడిని బెదిరించా. వాడు భయపడి, పారిపోయి ఒక రాయికి గుద్దుకుని పడి దెబ్బలు తగిలించుకున్నాడు. తప్పు వాడిదే. వాడెందుకు భయపడటం?! అయినా తిట్లు నాకే..


నేనూ పావురంలా ఎక్కడ బడితే అక్కడ సర్దుకుపోను. కాకిలా నాకంటూ నిర్దిష్ట ఆవాసం, సదుపాయాలు ఉండాల్సిందే. మనిషన్నాక , ఈ జీవితాన్ని భయపడుతూ, ఏడుస్తూ బతకడం ఎందుకు అని నా అభిప్రాయం. జీవించేది కొంత కాలమైనా కాకిలా దర్జాగా జీవించాలి.

ఒక కాకికి కష్టం వస్తే, అన్నీ వచ్చి ఓదారుస్తాయి. సమిష్టిగా కష్టాన్ని ఎదుర్కుంటాయి.

తన వారికోసం ప్రాణాలు వదలడానికి కూడా వెనుకాడని కాకులు ఇచ్చిన ఈ స్పూర్తితో సైన్యంలో చేరిపోయానిప్పుడు. శత్రువు నాకు మేడ మీది వడియంలాగో, కలుగులో దాక్కున్న ఎలుకలాగో కనిపిస్తుంటే, కాకిలా వాడ్ని పొడుచుకు తినాలని భలే ఆశగా ఉంది. ఏం చేస్తాం నావన్నీ కాకి బుద్దులే!

***శుభం***

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : కిరణ్ విభావరి

నేను ఇప్పటి వరకూ 33 కథలూ, 4 కవితలూ రాశాను. నేను రాసింది నాలుగు కవితలే అయినా అన్నిటికీ విశిష్టమైన బహుమతులు అందుకున్నాను. NATA, NATS, జాషువా కవితా పురస్కారాన్ని అందుకున్నాను. కథల పోటీలలో కూడా తెలుగు తల్లి కెనడా అవార్డ్, స్వేరో టైమ్స్ పత్రిక వారి పోటీలో ప్రథమ బహుమతి, mom'spresso వెబ్సైట్ లో అత్యుత్తమ బ్లాగర్ గా, ఇంకా మరెన్నో పోటీల్లో బహుమతులు పొందుకున్నాను. నా కథలు ప్రముఖ పత్రికల్లో ప్రచురితం అయ్యి, ఎందరో పాఠకుల మన్ననలు పొందాయి. ముఖ్యంగా నేను రాసిన కాఫీ పెట్టవు కథ social media లో వైరల్ అయ్యి, ప్రముఖ FM radio లో, అల్ ఇండియా రేడియోలో ప్రసారం అయ్యింది.

Saho, విశాలాక్షి, సినీ వాలి పత్రికల పోటీలలో ప్రథమ బహుమతి వచ్చింది. మల్లె తీగ కవితల పోటీలో విశిష్ట బహుమతి అందుకున్నాను. కొత్త వెలుగు అనే కథల సంకలనం ప్రచురించాను


92 views0 comments
bottom of page