top of page

ముసుగు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.'Musugu' written by Kiran Vibhavari

రచన : కిరణ్ విభావరి

"గీతా నీకీ విషయం తెలుసా....మన హేమ కుమార్ సారు లేరు...పాపం సూసైడ్ చేసుకున్నారు" కవిత పరిగెత్తుకుంటూ వచ్చి రొప్పుతూ ఈ విషయం చెప్తుంటే మనసంతా చేదుగా అయ్యింది...


" ఏంటే నువ్వు చెప్పేది?? సరిగ్గా తెలుసుకున్నావా??" ఇంకా నమ్మకం కలగక దానిని అడిగాను.


" కళ్ళారా చూసి వచ్చాను...శవాన్ని పోస్టమార్టం చేసి తీసుకు వచ్చారు. వాళ్ళ అమ్మగారిని ఓదార్చడం ఎవరివల్లా కావట్లేదు..." కవిత చెప్పుకుంటూ పోతోంది.


"పాపం...సూసైడ్ కాదే...చంపేశారు...వాళ్ళే చంపేశారు" ఏదో లోకంలో ఉండిపోయాను.


"కాదే సూసైడ్ చేసుకున్నారు...పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారుగా" చెబుతున్న కవితకు అర్ధం కావట్లేదు నా అభిమతం. ఆయన మరణ వార్త విని అలాగే కూర్చుండి పోయాను. కదిలే ఓపిక కూడా లేకుండా పోయింది. కవిత కూడా వచ్చి పక్కన చేరి భుజం పై చేతులు చుట్టి ఓదార్చే ప్రయత్నం చేస్తోంది...


ఏం చెప్పను దానికి?? ఎలా చెప్పను?? నాలో విజ్ఞాన సముపార్జన తో పాటు, వివేకం ఎలా పెంచుకోవాలో తెలియజెప్పిన నా అభిమాన గురువు. చిన్న చిన్న విషయాలకు కృంగిపోకుండా బతుకు నావను ఒడుపుగా ఎలా నడపాలి ఉదాహరణతో నేర్పించిన ఆచార్యుడు.

ఓటమికి నేను కృంగి పోతే ఓదార్పు మాటలు చెప్పి నాలో చైతన్యం తెచ్చిన తండ్రి లాంటి వ్యక్తి. ఇలా ...ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నారు అంటే ...ఎందుకో నమ్మ బుద్ది కావట్లేదు. ఇది కలా నిజమా అనే సందిగ్ధంలో పడిపోయాను.


ద్రోణాచార్యుడికి అర్జునుడు ఎలాగో నేను ఆయనకు అలా. ఎన్నో వేడి వేడి చర్చలు, వాదోపవాదనలు మా మధ్య దొర్లేవి..ఒకవేళ నేను చెప్పే విషయంలో మంచి ఉంటే దాన్ని వినయంగా అంగికరించే సుగుణం ఆయన సొంతం.

బాగా గుర్తు. ఒకసారి 'ఎవరో ఐఏఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు' అన్న వార్త చదివి చాలా బాధ పడ్డారు.

"పాపం ఎంత అందంగా ఉన్నాడు? ఆయన భార్యా పిల్లల గురించి ఆలోచించలేదా?? ఈయన రాసిన ఎన్విరాన్మెంట్ అనే పుస్తకం చాలా బాగుంటుంది. సివిల్స్ రాసేవారు అది తప్పక చదువుతారు. పాపం అన్నీ ఉండి ఇలా చేసుకోవడం మూర్ఖత్వం. తప్పు జరిగితే ఎదిరించాలి. అంతే గానీ, ఇదా పరిష్కారం??" అన్నారాయన.

ఆయన నన్ను అడిగినప్పుడు, "ఇంతకీ ఆ ఐఏఎస్ అధికారి ఎందుకు తన జీవితాన్ని ముగించుకున్నారు సార్?" కుతూహలంతో అడిగాను.


"వ్యవస్థ మీద విరక్తి చెంది , ఆత్మహత్య చేసుకున్నాడమ్మా"


"మరి ఆయన చావుకి కారణం వ్యవస్థ కదా సార్"


"వ్యవస్థ లో మంచి చెడు రెండూ ఉంటాయి. అన్నింటికీ పరిష్కారం చావే అయితే ఈ ప్రపంచం ఎప్పుడో స్మశానం అయ్యేదమ్మా"


"మన వ్యవస్థ కూడా జపాన్ లాగా ఉంటే ఎంత బాగుండేదో కదా సర్" నేను ప్రశ్నించాను.


" బాగుంటుంది కానీ అన్ని విషయాల్లో జపాన్ని ఆదర్శంగా తీసుకోలేం అమ్మా. నీకు తెలుసా జపాన్లో అత్యాచారం చేసిన వారిపై ఎటువంటి శిక్ష ఉండదు. పైగా ఆడవారి వస్త్రధారణ పై వారి శరీర ఆకృతి పై బోలెడన్ని ఆంక్షలు పెడతారు."


"అవునా సార్ ..నిజంగా నాకు తెలియదు..జపాన్ చాలా గొప్ప దేశం అంటుంటే అలా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది." అమాయకంగా అడిగితే


"నేను చెప్పాను కదా ఏ దేశంలో అయినా మంచి చెడు రెండు ఉంటాయి. మంచిని పెంపొందిస్తూ చెడుకి వ్యతిరేకంగా పోరాటం చేయాలి" చేతిలో ఉన్న పుస్తకం పక్కన పెడుతూ చెప్పారు.


మా ట్యూషన్ లో చాలా మటుకు ఇవే ప్రశ్నలు ఉంటాయి. నాకన్నా మహా అయితే ఒక పది సంవత్సరాలు పెద్ద వయస్సు ఉంటుందేమో, ఎప్పుడూ ‘అమ్మా’ అంటూనే సంబోధిస్తారు. ఏ విషయాన్ని అడిగినా కూలంకషగా వివరణ ఇస్తారు. ఎప్పుడూ చేతిలో ఏదో ఒక పుస్తకం ఎప్పుడూ ఉంటుంది.


"ఇదే మీ ఆయుధం కదా సార్" అని నేను అడిగితే, " “విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటారు కదా అమ్మా! అందుకే వీలైనంత జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటాను." అని చిరు నవ్వు నవ్వారు.


అలాంటి మనిషి ఇలా ఈరోజు వివేకం మర్చిపోయి ఆత్మహత్య చేసుకున్నారు. వివేకం అంటే గుర్తుకు వచ్చింది. ఆయనకు వివేకానందుడు అంటే ఎంతో అభిమానం ఎప్పుడు ఆయన రాసిన పుస్తకాలు చదువుతూ ఉంటారు. ఒకసారి వివేకానందుడి చిన్న కథ చెప్పారు. అది ఇప్పటికీ నాకు బాగా గుర్తు.


ఒకసారి వివేకానందుడు గారు విదేశాల్లో మన ధర్మం మీద ఉపన్యాసం ఇస్తుంటే అసూయతో నిండిన ఒక వ్యక్తి కొన్ని పుస్తకాలతో వచ్చాడు. అతడు తెచ్చిన పుస్తకాలలో హిందువులు పవిత్రంగా భావించే భగవద్గీత ను అన్నిటికన్నా కింద ఉంచారు. వివేకానందుడి తో ఆ వ్యక్తి "చూసావా హిందూ స్వామి... మీ భగవద్గీత అన్నిటికన్నా కింద ఉంచాల్సిన పుస్తకం. దాని విలువ అన్నిటి కన్నా తక్కువ" అని వెటకారం చేశాడు.

అప్పుడు వివేకానంద నవ్వి అతని చేతిలోని భగవద్గీత ను తీసేశారు అప్పుడు పైనున్న మిగతా మతాల పుస్తకాలు అన్నీ కింద పడిపోయాయి.


"చూసావా నాయనా నా భగవద్గీతే అన్ని పుస్తకాలకు మూలం, ఆధారం. ఇది నీకు బాగా అర్థమైంది అనుకుంటా” అని చిరునవ్వుతో సమాధానమిచ్చారు.


ఇలాంటి కథలు అనుభవాలు ఎన్నో మా చర్చల్లో దొర్లేవి. "చదువు ఒక్కటే కాదు, వివేకం కూడా ఉండాలి. ఎవరైనా మనల్ని విమర్శిస్తే కూల్ డ్రింక్ బాటిల్ లాగ ఎగసి పడకుండా మంచినీళ్ళ బాటిల్ లాగ నిదానంగా సమాధానం చెప్పాలి" అని నాకు హితం చెప్పారు. ఆయన మాటల ద్వారా నన్ను నేను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాను కానీ నాకు ఎన్నో మాటలు చెప్పిన ఆయన, ఎవరో నిందించిన నిందకు ఇంత పని చేస్తారని ఊహించలేదు.


"మనమెప్పుడూ నిజాన్ని అబద్ధం గా అబద్దాన్ని నిజం గా నమ్ముతూ బతికేస్తాము. ఇప్పుడు నువ్వు కదలకుండా కూర్చుని ఉన్నావు అని అనుకుంటే అది అబద్ధం. ఎందుకంటే భూమితోపాటు నువ్వు కదులుతున్నావు. అది నిజం. చావనేది చేదైన నిజం. కానీ మనం మరణమే లేదన్నట్టు అబద్ధంతో బతికేస్తున్నాం" అని వేదాంతం చెప్పిన మనిషి, ఒక చిన్న అబద్ధం మూలాన చనిపోయాడు.


నన్ను ఎవరైనా ఆకారణంగా నిందించినప్పుడు నేను బాధపడితే, "సూర్యుడిని మబ్బులు కొద్దిసేపు కప్పి ఉంచగలవు. అలానే నీ వ్యక్తిత్వం మంచిదనే నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది. మనల్ని ఎవరో ఏదో అన్నారని ఏడుస్తూ కూర్చోక సమాజానికి ఉపయోగపడే పని చెయ్యు. గుర్తుంచుకో... నిన్ను విమర్శించే వాళ్ళు ఉన్నారంటే నువ్వు ఏదో గొప్ప పని చేస్తున్నావని.

సద్గురు జగ్గీ వాసుదేవ్ వంటి వారినే నిందిస్తారు... ఇక నువ్వు ఎంత?? నీ బాధ చూసి 70 శాతం మంది భలే అయ్యింది అని సంతోషిస్తారు. 30 శాతం మంది అసలు నీ బాధని పట్టించుకోరు." అని నన్ను ఓదార్చిన మనిషి ఈరోజు ఇలా నిర్జీవంగా పడి ఉన్నాడు.


కన్నీళ్లతో తడచి ముద్దయిన కనురెప్పల్ని భారంగా మోసుకుంటూ ఆయన ఇంటి వైపు అడుగులు వేశాను.

వేలాది మంది ఆయన కోసం కంటతడి పెడుతున్నారు. వారిలో చాలామంది అమ్మాయిలే ఉన్నారు. దీన్ని బట్టే అర్థమవుతోంది ఆయన మీద పడిన నింద నిజం కాదని. నిందలు సులువుగా వేసేస్తారు. కానీ ఆ నిందలు భరించలేని ప్రాణం గాలిలో కలిసిపోయింది.


"నేను చేసిన తప్పేంటి రా" అని ప్రశ్నిస్తున్న ఆయన కళ్ళను చూస్తూ ఏడ్చే ఓపిక కూడా నశించి ఆయన పార్ధివ దేహం పక్కన అలా మౌనంగా కూర్చుండిపోయాను.


ఆ అమ్మాయి కోసం పోరాటం చేసిన జనాలు ఏరి? మూగ బోయిన ఈ ప్రాణం కోసం ఉద్యమాలు ఎందుకు చేయట్లేదు? ఆ అమ్మాయి నా స్నేహితురాలే కదా. పేరు కల్పన... పేరుకు తగ్గట్టు ఏదైనా కల్పించగలదు. నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇలా జరుగుతుందని అది కూడా ఊహించి ఉండదేమో! ఏదో భావావేశంలో ఆయన మీద ఆ నింద వేసింది. అది కూడా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుందేమో కదా తను చేసిన పనికి. చిత్రంగా దాని మీద సానుభూతి వస్తోంది. అవును మనిషిని బలి తీసుకున్నా అనే గిల్టీ ఫీలింగ్ తో జీవితాన్ని ఎలా గడపగలదు?? ఇలా ఆలోచించడం కూడా ఆయన పెట్టిన విద్యే కదా.


" గీతా ...నన్ను చాలా కొట్టారమ్మా....నేను చేసిన తప్పేంటి అమ్మా?' వారి అమ్మగారిని , నన్ను అడిగారు. మాకు ఓదార్చడానికి కూడా మాటలు రాలేదు. బంధువులు తలో మాటా అంటూ దూరం జరిగినా, ఇరుగు పొరుగువారు ఇది నిజమే కాబోలు అని కళ్లతోనే ఆయన్ని చంపేస్తున్నా, నేను మాత్రం ఆయన్ని నమ్మాను. ఆయన ఎలాంటి వారో నాకు తెలుసు. అందుకే అమ్మా నాన్నా వద్దని చెప్పినా వినకుండా జైలు నుండి బెయిల్ మీద బయటకి వచ్చిన ఆయన్ని వెంటనే కలుసుకున్నాను.


" చెప్పమ్మా నేను చేసిన తప్పేంటి?? ఆ అమ్మాయి దేవాలయం లాంటి క్లాసు రూములో వాడిని ముద్దు పెట్టుకుంటే , ఇదేంటని మందలించాను. బయట ఎవరికైనా చెబితే ఆమె పరువు పోతుంది.. తెలిసీ తెలియని వయస్సు వారిది అని ఎవ్వరికీ చెప్పలేదు. అలాంటి నా మీద ..." ఆయన గొంతు మూగబోయింది.


ఆమె వేసిన నిందలో నిజా నిజాలు తెలుసుకోకుండా , ఆయన్ని నడి రోడ్డులో అందరూ కలిసి కొట్టారు. ఎంత పరువుగా బతికిన వ్యక్తి!! ఆ అమ్మాయి చెప్పిన మాటలు నమ్మి, చట్టాన్ని చేతిలో తీసుకుని ఇలాంటి చర్యలకు దిగితే పర్యవసానం ఇలానే ఉంటుంది.


"ఒక అమ్మాయి తనపై లైంగకదాడి జరిగింది అని చెప్పిన వెంటనే డాక్టరును, మానసిక నిపుణులను సంప్రదించాలి. నిజం నిరూపణ అయ్యాక నేరస్తుడిని అరెస్టు చేయాలి. ఇదే కదా చట్టం చెప్పేది. మరి ఏక పక్షాన నిర్ణయం తీసుకుని శిక్షించడానికి వాళ్లకేం అధికారం ఉంది. కట్టలు తెంచుకున్న ఆవేశం కారణం కావొచ్చు. మనం సాధారణ మనుషులం కదా. మన కళ్ళ ముందు ఒక తప్పు జరిగితే అది నిందించడానికి ముందు ఉంటాము. కానీ మన తప్పులను మనం ఒప్పుకోము.." ఆయన చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.


ఎవరో అమ్మాయి తనను బస్సులో ఏడిపించాడని ఒక అబ్బాయిని అందరి కళ్లముందు పట్టుకు తన్నింది. ఆ తర్వాత అది కేవలం పబ్లిసిటీ కోసం ఆమె చేసిన పని అని తెలిసాక ఈ మాటలు చెప్పారు ఆయన. పాపం ఆ అబ్బాయి లాగే కుమార్ సార్ జీవితం ముగుస్తుందని అప్పుడు తెలియలేదు. తప్పుడు ఆరోపణలకు ఇంకో జీవితం నేలరాలింది.

***శుభం***

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : కిరణ్ విభావరి

నేను ఇప్పటి వరకూ 33 కథలూ, 4 కవితలూ రాశాను. నేను రాసింది నాలుగు కవితలే అయినా అన్నిటికీ విశిష్టమైన బహుమతులు అందుకున్నాను. NATA, NATS, జాషువా కవితా పురస్కారాన్ని అందుకున్నాను. కథల పోటీలలో కూడా తెలుగు తల్లి కెనడా అవార్డ్, స్వేరో టైమ్స్ పత్రిక వారి పోటీలో ప్రథమ బహుమతి, mom'spresso వెబ్సైట్ లో అత్యుత్తమ బ్లాగర్ గా, ఇంకా మరెన్నో పోటీల్లో బహుమతులు పొందుకున్నాను. నా కథలు ప్రముఖ పత్రికల్లో ప్రచురితం అయ్యి, ఎందరో పాఠకుల మన్ననలు పొందాయి. ముఖ్యంగా నేను రాసిన కాఫీ పెట్టవు కథ social media లో వైరల్ అయ్యి, ప్రముఖ FM radio లో, అల్ ఇండియా రేడియోలో ప్రసారం అయ్యింది.

Saho, విశాలాక్షి, సినీ వాలి పత్రికల పోటీలలో ప్రథమ బహుమతి వచ్చింది. మల్లె తీగ కవితల పోటీలో విశిష్ట బహుమతి అందుకున్నాను. కొత్త వెలుగు అనే కథల సంకలనం ప్రచురించాను
82 views0 comments

Comments


bottom of page