కాకి బుద్ధి
- Kandarpa Venkata Sathyanarayana Murthy
- Feb 4
- 3 min read
#KakiBuddhi, #కాకిబుద్ధి, #Kandarpa Murthy, #కందర్ప మూర్తి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Kaki Buddhi - New Telugu Story Written By Kandarpa Murthy Published In manatelugukathalu.com On 04/02/2025
కాకి బుద్ధి - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
సరయు నదీ తీరంలో బదరీ వనంలో తపస్సుకు అనువైన ప్రదేశం కోసం వెతుకుతుండగా ప్రశాంతంగా చక్కటి ఆహ్లాదకరంగా ఉన్న వటవృక్షం కింద ఏకాంబర స్వామి నడుముకు గావంచా చుట్టుకుని తపస్సుకు కూర్చున్నాడు.
ఆ వటవృక్షం మీద అనేక రకాల పక్షులు నివాసముంటున్నాయి. వాటిలో కాకి కూడా ఉంది. పక్షి జాతులన్నిటిలో కాకికి ఉన్న వక్రబుద్ధి మరే పక్షికీ లేదు.
పరిశుభ్రంగా ఉన్న ప్రదేశాల్ని మలిన పర్చడం.. ముఖ్యంగా తెల్లని వస్తువుల్ని కలుషితం చెయ్యడం, ఇతర పక్షి గూళ్లను పీకి కూలదోయడం దాని చెడ్డగుణాలు. సృష్టిలో బ్రహ్మ పుట్టించిన సాధారణ కాకి చాల చిలిపి పక్షి కాని ప్రతి సృష్టిగా విశ్వామిత్రుడు ప్రాణం పోసిన నల్ల కాకి ఎంతో సౌమ్యంగా ఉంటుంది. అది మానవాళిలో తక్కువగా సంచరిస్తుంది.
చెట్టు కింద మౌనంగా తపస్సు చేసుకుంటున్న మునీశ్వరుణ్ణి చూసిన సాధారణ కాకి తన దుష్టబుద్ధి అమలు చెయ్యాలనుకుంది. సరిగ్గా ముని నెత్తి మీద పడేలా రెట్ట వేసింది. ముని పైకి చూస్తాడనుకుంది. ఎటువంటి చలనం లేదు.
కాకికి ఉక్రోషం వచ్చింది.. కాకికి పట్టుదల పెరిగి ఎలాగైనా ముని తపస్సు భంగం చెయ్యాలనుకుంది. మళ్లీ రెట్ట వేసింది. ముని మౌనంగా ఉన్నాడు. తన పక్క కోపంగా చూసి చెయ్యి విసురుతాడనుకుంది కాకి. అటువంటిది ఏమీ జరగలేదు.
కాకి అక్కసుతో రోజూ ముని శిరస్సు మీద దుర్ఘంధ పూరిత మలిన రెట్టలు వేస్తూనే ఉంది. ముని శరీరం మీద రెట్టలన్నీ కుప్పలుగా మారి క్రిములు పుట్టి పెరుగుతున్నాయి. వాటిని తినడానికి అనేక పక్షులు ముని చుట్టూ సంచరిస్తున్నాయి. కాని ముని ఏకాగ్రత చెదర లేదు.
కాకిలో మునీశ్వరుని మీద కక్ష పెరిగింది. ముని భుజాల మీద వాలి గట్టిగా అరవడం, ముళ్ల కంపలు ముక్కుతో కరిచి తెచ్చి వెయ్యడమే కాకుండా ముఖం, భుజాలు, వీపు అలా శరీరం అంతా రెట్టలతో నింపేసింది. ముని మాత్రం ప్రశాంతంగా తపస్సు కొనసాగిస్తున్నాడు.
చెట్టు కింద జుత్తు జడలు కట్టి తపస్సు చేసుకుంటున్న రుషిని చూసి చెట్టు పైన ఉన్న మిగతా పక్షి సముదాయంలో రామచిలుకలు వంటివి ఆహారంగా రకరకాల ఫలాలు తెచ్చి పెట్టి సాయం చేస్తే దుర్భుద్ది కాకి మాత్రం ఆయన తపోభంగానికి భుజాల మీద వాలి చెవుల దగ్గర బిగ్గరగా
అరిచి గోల చేసేది.
ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ తపస్సును ఆటంక పరచలేకపోయింది కాకి. రోజులు గడుస్తున్నాయి. కాకి ముసలిదై ఆరోగ్యం క్షీణించి ఆహారం కూడా తెచ్చుకోలేని స్థితి కొచ్చింది.
ఒకరోజు మునీశ్వరుడు తపస్సు ముగించి దగ్గరలో ప్రవహిస్తున్న సరయు నదిలో తల నుంచి పాదాల వరకు శరీరమంతా కాకి వేసిన మలిన రెట్టల్ని నీటితో శుభ్ర పరచుకుని ప్రకాశవంతమైన శరీర కాంతితో చెట్టు దగ్గరకు వచ్చాడు.
ముసలితనంతో నీరసించి ఉన్న కాకి పశ్చాత్తాపంతో ముని దగ్గరకు వచ్చి చెట్టు మీదున్న ఇతర పక్షులు పళ్లు ఫలాలు తెచ్చి తపస్సుకి సహకరిస్తే, తను మాత్రం దుర్భుద్ధి దుశ్చేష్టలతో బాధ కల్గించానని వాపోయింది. తన తప్పుల్ని మన్నించమని వేడుకుంది.
ముసలి కాకి దీనావస్థను చూసి ముని ఓదారుస్తూ " నీ సహజ నైజంతో వ్యవహరించి నాకు మేలే చేసావు. రోజూ నువ్వు నా శిరస్సు, శరీరంపై వేసిన మలిన రెట్టలు కుప్పలుగా మారి కీటకాలు పుట్టి కొన్ని పక్షుల ఆకలి తీరింది. దాని వల్ల నాకు పుణ్యఫలం దక్కింది.
నా శరీరానికి లేపనంగా మారి చలి వేడి నుంచి రక్షణ కల్గింది.. అందువల్ల నీ చేష్టల వల్ల నాకు మంచే జరిగింది. నువ్వు చేసిన ఉపకారానికి బదులుగా నీకొక వర మిస్తున్నాను. భూమండలం మీద మనుషులు జరిపే పితృ కర్మల్లో పిండ ప్రధానాలు తినడానికి మీ కాకి జాతినే ఆహ్వానిస్తారని ఆశీర్వదించి వెళిపోయాడు.
చూసారా, బాలలూ! అపకారం చేసిన కాకికి మునీశ్వరుడు కోపగించుకోకుండా ఉపకారం చేసాడు. కాబట్టి తప్పు చేసిన వార్ని క్షమించి వారిలో మార్పు తేవాలి.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
Comments