కలిసొచ్చిన కాలం
- Yasoda Pulugurtha
- Mar 27
- 7 min read
#YasodaPulugurtha, #యశోదపులుగుర్త, #కలిసొచ్చినకాలం, #KalisochhinaKalam, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Kalisochhina Kalam - New Telugu Story Written By Yasoda Pulugurtha
Published In manatelugukathalu.com On 27/03/2025
కలిసొచ్చిన కాలం - తెలుగు కథ
రచన: యశోద పులుగుర్త
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
రెండురోజులు లీవ్ తీసుకున్న తరువాత ఆఫీస్ కు వచ్చిన పరిమళ, సుప్రజ దగ్గరకు వస్తూనే "హాయ్ సుప్రజా" అంటూ విష్ చేసింది.
“హాయ్ పరిమళా ఏమిటీ సంగతులూ? చెప్పా పెట్టకుండా డుమ్మా కొట్టేసావు? ‘మార్చి’ ప్రొడక్షన్ మంత్ అని తెలిసీ కూడా లీవ్ పెట్టినందుకు మన డి.జి.మ్ నీ మీద ఒకటే ఫైర్ అవుతున్నారు. ‘ఏమైంది పరిమళగారి’ కంటూ నన్ను పిలిచి మరీ అడిగారు. మీ మామగారికి కాస్త అస్వస్తగా ఉందని చటుక్కున అబధ్దం ఆడేసాను. సారీ, పరిమళా!"
"ఫరవాలేదులే సుప్రజా, నన్ను రక్షించావు, థాంక్యూ!"
“అది సరేగానీ ఏమిటీ సడన్ గా?” అంటూ క్యూరియస్ గా అడిగింది సుప్రజ.
“మా అత్తగారూ మామగారూ నాలుగురోజుల క్రితం ఊరినుండి వచ్చారు. మా మరిదికి పెళ్లి సంబంధం వచ్చింది, పెళ్లి చూపులున్నాయి, రమ్మనమని చెపితే వచ్చేసారు. చెప్పానుకదా, ఈ సంవత్సరంలో అతనికి ఎలాగైనా సరే పెళ్లి చేసేయాలన్న తలంపులో ఉన్నామని.
మొన్న నివేద అనే అమ్మాయిని చూడడానికి వెళ్లాం. ఎంతో చక్కగా ఉంది అమ్మాయి. ఉద్యోగం చేస్తోంది కూడా. మా మరిదిని ఎలా ఉంది అని అడిగితే బాగానే ఉందన్నాడు. తనకు నచ్చినట్లుగా అతని మాటల్లో తెలుసుకున్నాం. సంతోషపడ్డాం.
మా అత్తగారికీ మామగారికీ మా మరిది కి తొందరగా పెళ్లిచేసేయాలన్న ఆలోచనలో ఉన్నారు. కానీ, తనకు ఏ సంబంధమూ నచ్చడం లేదు. ఇవాళా రేపు అబ్బాయిలకు అమ్మాయిలు కుదరడమే గగనమైపోతుంటే మా మరిదేమో వచ్చిన సంబంధాలని కాలదన్నుతున్నాడు. మా వారు కూడా సీరియస్ గా చెప్పారు. అడిగారు కూడా. పోనీ ఎవరినైనా ఇష్టపడ్డావా అని అడిగితే లేదని తలూపాడు. ఇప్పుడు వచ్చిన సంబంధాన్నైనా ఓకే చేస్తాడనుకుంటే నిన్న ఆఫీస్ నుండి వస్తూనే నాకా అమ్మాయి నచ్చలేదంటూ సీరియస్ గా చెప్పేసాడు.
ఈ లోగా బాస్ నుండి పిలుపురావడంతో, తరువాత మాట్లాడుకుందాం సుప్రజా అంటూ పరిమళ హడావిడిగా ఆయన కేబిన్ లోకి వెళ్లింది.
సుప్రజా, పరిమళా ఇద్దరూ ఒక కార్పొరేట్ సంస్తలో టెక్నికల్ విభాగంలో కలసి ఎనిమిది సంవత్సరాలనుండి పనిచేస్తున్నారు. ఇద్దరూ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో ఇంజనీరింగ్ చేసారు. ఒకటే డిపార్ట్ మెంట్ అయినందువల్ల చాలా క్లోజ్ గా ఉంటారు.
తరువాత లంచ్ టైమ్ లో కలుసుకున్నారిరువురూ. కంప్లీట్ చేయాలసిన ఆఫీస్ పనిగురించి చర్చించుకున్నారు. తరువాత సుప్రజ అడిగింది. “ఇంతకీ అమ్మాయి ఎందుకు నచ్చలేదని చెప్పాడు మీ మరిది?”
“అసలు ముందు చెపితే కదా? ఎందుకో రుస రుస లాడుతూనే ఉన్నాడు నిన్న ఆఫీస్ నుండి వచ్చినప్పటినుండి. నేనే వీలుచూసుకుని నెమ్మదిగా అడిగాను ‘ఏమైంది షణ్ణూ, ఎందుకంత సీరియస్ గా ఉన్నావు? ఏమిజరిగిం’దని?
ఇంక దాచడం ఎందుకనుకున్నాడో ఏమో, నెమ్మదిగా చెప్పాడు. ‘నివేద ఫోన్ చేసిందిట, ఫలనా చోటుకి వస్తారా మాట్లాడా’లంటూ.
సరే ఆ అమ్మాయి నచ్చింది కదా, కాసేపు వ్యక్తిగతంగా కలసి మాట్లాడుకోవచ్చని, ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకుని అప్పుడు ఓకే చెప్పుకుంటే బాగుంటుందని సరేనని ఆ అమ్మాయిని కలిసాడుట.
‘నేను పెళ్లి అయినా ఉద్యోగం చేస్తాను, ఎవరూ నన్ను ఉద్యోగం మానేయమనకూడదు. నాకు నచ్చినంతకాలం చేస్తాను, మీకు ఓకే నా’ అనేసరికి మా షణ్ణూ తనకేమీ అభ్యంతరం లేదన్నాడుట.
‘మీకు ఉండకపోవచ్చు, మీ అమ్మా నాన్నగారూ నాకు ఆంక్షలు పెట్టకూడ’దందట. ‘అదేమిటీ, మా వదిన కూడా జాబ్ చేస్తోంది, మా పేరెంట్స్ అలా అనర’న్నాడుట.
‘మీ నాన్నగారు రిటైర్ అయిపోయాకా, మీ అమ్మా నాన్నగారూ ఎక్కడ ఉంటారు, ఇప్పుడున్నఊర్లోనా, లేక ఇక్కడికే వచ్చేస్తారా శాశ్వతంగా’ అని అడిగిందిట.
‘ఇక్కడకే వచ్చేస్తారు, అన్నయ్య, నేనూ ఇక్కడే ఉన్నప్పుడు వాళ్లని ఆ పల్లెటూరులో ఉంచడం సబబుకా’దని అన్నాడుట.
ఆ అమ్మాయికి అందరూ కలసి ఒకే ఇంట్లో ఉండడం ఇష్టంలేదని, పెళ్లైనాకా వేరు కాపురం పెట్టి ఉండాలన్నది తన అభిమతమని, అత్తగారి మామగారి బాధ్యతలను తను తీసుకోలేనని చెప్పిందిట. షణ్ముఖ్ ఒక్క నిమిషం తెల్లబోయాడుట. అదేమిటీ, ఆ అమ్మాయి అప్పుడే కండిషన్స్ పెడుతోందని.
‘లేదు, నివేదా మా అమ్మా నాన్నా బాధ్యత, తనదే’నని ‘వాళ్లు మనతోనే ఉంటా’రన్నాడుట.
ఆ అమ్మాయి ముఖం ఎర్రగా చేసుకుందిట. బహుశా తను చాలా అందంగా ఉన్నానని, షణ్ముఖ్ తను చెప్పిన షరతులకు అంగీకరిస్తాడని ఊహించుకుందేమో మరి. మరు క్షణం లేచినిలబడి అయితే మనిరువురి అభిప్రాయాలు కలవవంటూ, తనీ సంబంధానికి సుముఖంగా లేనని చెపుతూ వెళ్లిపోయిందిట.
అందుకే షణ్ణూ మూడీగా ఉన్నాడు. నేను ఊరుకోక ఏదో సర్ది చెప్పాలన్న ప్రయత్నంలో ‘నివేద చాలా చక్కగా ఉంది కదా షణ్ణూ, నేనూ మీ అన్నయ్యా ఉండగా మీ పేరెంట్స్ బాధ్యత ఇంటికి పెద్దవారిగా మాదే కదా. అత్తయ్యా మామయ్యా, మా దగ్గర ఉంటారు. నీవు నివేదను ఇష్టపడితే చేసుకోవచ్చుకదా’ అనేసరికి ఇంతెత్తున కోపంతో ఎగిరిపడ్డాడు.
పెళ్లి చేసుకోబోయేది నేను కదా, నీవిలాంటి సలహాలిస్తే నేనెప్పటికీ పెళ్లి చేసుకో’నని, అయినా ఇప్పట్లో తనకేమీ సంబంధాలు చూడద్దంటూ గట్టి వార్నింగ్ ఇచ్చి పడేసా”డంటూ చెప్పింది.
“సరేలే పరిమళా, మీ మరిదితో ఈ విషయంగురించి మరీ తర్కించకుండా ఊరుకోండి. కొంత గేప్ ఇవ్వండి. తరువాత చూడచ్చు. ఈలోగా ఎవరినైనా తను ఇష్టపడినా, ఏమో ఏరోజుకి ఏమి జరుగుతుందో ఎవరం చెప్పలేము కదా పరిమళా. ఇంతకంటే మంచి అమ్మాయి అతని జీవితంలోకి రావచ్చేమో”, అనగానే, “అదీ నిజమే సుప్రజా” అంటూ ఇద్దరూ తమ సీట్లలోకి వచ్చేసారు.
కాలం మరో ఆరునెలలు ముందుకు సాగింది.
పరిమళ మామగారు స్కూల్ టీచర్ గా రిటైర్ అయి ఆయన ఉంటున్న పల్లెటూరు నుండి వారి అబ్బాయిలు ఉంటున్న హైద్రాబాద్ కు వచ్చేసారు. పరమళకు కాస్తంత విశ్రాంతిగా ఉంటోంది. నాలుగేళ్ల మనవరాలిని వాళ్లు చూసుకోవడమే కాకుండా అయిదోనెల గర్భవతి అయిన పరిమళను చాలా అపురూపంగా చూసుకుంటున్నారు.
పరిమళ నెమ్మదితనం, అత్తగారి మామగారి పట్ల ఆమె చూపే గౌరవం వారికి ఎంతో తృప్తిగా అనిపిస్తుంది. చిన్నకొడుక్కి కూడా పెళ్లి అయిపోతే తమ బాధ్యత తీరిపోతుందనుకుంటే, ఆ కల్యాణ ఘడియలు ఎప్పుడు వస్తాయా అని అనుకుంటూ ఉంటారు. ఏ వయస్సులో జరగాల్సిన ముచ్చట ఆ వయస్సులోనే జరిగిపోవడం మంచిదని భావించే తల్లితండ్రులు మరి.
ప్రస్తుత రోజుల్లో అబ్బాయిలకు సకాలంలో పెళ్లి అయిపోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నారు తల్లితండ్రులు. నేటి అమ్మాయిలు ఎక్కువగా కెరీర్, ఉద్యోగం అంటూ పెళ్లిని వాయిదా వేయడం, తన కంటే అన్ని విధాలా యోగ్యతగల వరుడినే కావాలనుకోవడం, భాగస్వామి తనకు నచ్చినట్లుగా ఉండాలనుకోవడం లాంటి కొని ఖచ్చితమైన అభిప్రాయాలను ఏర్పరుచుకోవడంతో వివాహాలు ఆలస్యమైపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే పెళ్లిళ్లుకాక అవివాహితులుగా ఉండిపోతున్నారు. అలాగే అబ్బాయిలు కూడా సరైన అమ్మాయిలు దొరక్క బ్రహ్మచారులుగా మిగిలిపోతున్నారు.
సుప్రజ కు అత్తగారు లేరు. ఆవిడపోయి పది సంవత్సరాలు అయిపోయింది. సుప్రజకు పెళ్లై అత్తవారింటికి వచ్చేనాటికి ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్ చదువుతున్న ఆడపడుచు అక్షర బాధ్యతని మామగారు కోడలికి అప్పగించారు. తల్లిలేని పిల్ల, దాన్ని జాగ్రత్తగా చూసుకోమ్మా అంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నారు. మామగారు ఎంతో మంచివారు. ఆ తరువాత ఇంజనీరింగ్ పూర్తి చేసిన అక్షరకు కేంపస్ లో బెంగుళూర్ లో ఉద్యోగం వచ్చి అక్కడ చేరిపోయింది.
మామగారు కూతురికి పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తామంటే, ఇప్పుడే కాదు, మరో రెండు సంవత్సరాలు ఆగమని, తను కెరీర్ లో బాగా స్థిర పడాలని చెప్పింది. ఈ మధ్యనే ఒక సంవత్సరం క్రితమే హైద్రాబాద్ ఆఫీస్ కి పోస్టింగ్ వస్తే వచ్చేసింది.
మామగారు అక్షర పెళ్లి గురించి సుప్రజతో మాట్లాడుతూ, “సంబంధాలు చూస్తామంటే ఇప్పుడేమీ చూడొద్దంటుందేమిటమ్మా సుప్రజా. ఏమిటో ఈ మధ్య మరీ డల్ గా ఉంటోంది. తల్లి లేని పిల్ల, దాని మనసులో ఏముందో నీవే నెమ్మదిగా అడిగి తెలుసుకోమ్మా” అని చెప్పేసరికి ఒకరోజు అక్షరని అడిగింది, “ఇంకా ఎంత కాలం పెళ్లిని వాయిదా వేస్తావు అక్షరా” అని. మౌనం తప్పించితే సమాధానం లేదు. పోనీ ఎవరినైనా ఇష్టపడ్డావా అని ఎంత అడిగినా ఏమీ లేదంటూ తప్పించుకుంటోంది..
ఆ రోజు పరిమళ మరిది ఉదయం ఆఫీస్ కు తయారవుతూ "వదినా నీకో విషయం చెప్పాలి, ఇప్పుడు చెప్పమంటావా, లేకపోతే సాయంత్రం నీవు ఆఫీసునుండి వచ్చాకా చెప్పనా” అని అనేసరికి, “ఇప్పుడే చెప్పు షణ్ణూ, సాయంత్రం ఏవో పనుల హడావిడిలో బిజీగా ఉండి మరచిపోతే” అని చిలిపిగా అనేసరికి, “నేను ఒకమ్మాయిని ఇష్టపడుతున్నాను, నా ప్రేమగురించి ఆమెతో చెప్పాలంటేనే కాస్తంత బెరుగ్గా అనిపిస్తోంది..” తలదువ్వుకుంటూ అద్దంలోకి చూసుకుంటూ చెప్పాడు షణ్ణూ !
“ఎవరా అమ్మాయి షణ్ణూ?”
“నా టీమ్ మేట్.. సంవత్సరం నుండి నా టీమ్ లోనే పనిచేస్తోంది.. బాగుంటుంది, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది.. కానీ ప్రపోజ్ చేయాలంటేనే భయంగా ఉంది.. ఒకవేళ ' నో ' అంటే ? 'ఆమెకి నామీద ఉన్నది ప్రేమో, స్నేహమో అర్థంచేసుకోలేని స్థితిలో ఉన్నానొదినా. ఈరోజు ఏ విషయమూ తేల్చేసుకోవాలనుకుంటున్నాను..”
“మంచి నిర్ణయమే షణ్ణూ, ఒక వేళ ఆ అమ్మాయి నీ ప్రపోజల్ ను ఏక్సప్ట్ చేయకపోతే మరీ దేవదాసులా అయిపోకు.. ఇవన్నీ లైఫ్ లో కామన్. ఆల్ ది బెస్ట్” అంటూ విష్ చేసింది పరిమళ.
######
ఆఫీస్ కు మౌనంగా తయారవుతున్న తన ఆడపడుచునే చూస్తూ సుప్రజ "ఎందుకంత డల్ గా ఉంటున్నావు అక్షరా ? ఏదైనా సమస్య ఉంటే నాతో షేర్ చేసుకోవచ్చుకదా?”
“నీతో చెప్పాలనే అనుకుంటున్నాను వదినా. నేను మా టీమ్ లీడ్ ఒక అతన్ని ప్రేమిస్తున్నాను. అతనికి నాపై ఎటువంటి అభిప్రాయముందో తెలియదు. కానీ అతను లేకపోతే నా జీవితానికే అర్ధం లేదనిపిస్తోంది.. ఒకోసారి ఎంతో చనువుగా ఉంటూనే, మరొకసారి ఆమడ దూరంలో ఉన్నట్లుగా అనిపిస్తాడు.. నేను ముందస్తుగా అతని టీమ్ లోనే చేరానా, ఏమిటో కొత్తగా అయోమయంగా ఉండేది నా వర్క్.. కోడింగ్ చేసేటప్పుడు ఎన్నో తప్పులొచ్చేవి.. అయినా ఎంతో కూల్ గా, నాపట్ల కేరింగ్ చూపిస్తూ ప్రవర్తించే అతని పట్ల ఆకర్షితురాలైనాను.. కానీ అతనిపై ఉన్న ప్రేమను ఎలా వ్యక్తపరచాలో అర్ధమవడంలేదు.. నేనే ముందర ప్రపోజ్ చేస్తే, ఒకవేళ అతనికి నేనంటే ఆ ఉద్దేశ్యం లేక 'నో 'చెపితే ? అది ఎంత ఎంబ్రాసింగ్ గా ఉంటుంది వదినా ?”
“అలా ఆలోచిస్తూ ఎన్నిరోజులు మధనపడ్తావు అక్షరా ? అతనే ముందుగా నిన్ను ప్రపోజ్ చేయాలని ఎక్కడా లేదు.. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో, ఒకవేళ అతను నీ ప్రపోజల్ ని ఏక్సప్ట్ చేయకపోతే లైట్ గా తీసుకో.. అతను లేకపోతే నా జీవితానికి అర్ధమే లేదన్నావ్ ? తప్పమ్మా ? ఆ మాటను వెనక్కి తీసుకుంటానని మాటి”వ్వంటూ ఆడపడుచు చేత ఒట్టువేయించుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పింది..
మరునాడు ఉదయం ఆఫీస్ లో సుప్రజా, పరిమళా కేంటిన్ లో కలుసుకున్నారు.. ఇద్దరి ముఖాలలో ఆనందం దౌత్యమౌతోంది.. ముందర పరిమళే, "ఏయ్ సుప్రజా నీకో శుభవార్త” అనగానే “నేనూ నీకొక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను"..
“అయితే ముందర నీవే మొదలుపెట్టావుగా, చెప్ప”మంటూ తొందరచేసింది సుప్రజ.
ఇద్దరూ కాఫీ తెచ్చుకుని కూర్చొన్నారు టేబిల్ కి ఎదురెదురుగా. వేడి వేడి కాఫీని సిప్ చేస్తూ, “మా మరిది షణ్ణూ తన టీమ్ మేట్ ఒక అమ్మాయిని ప్రేమించాడుట. అక్షర అనే అమ్మాయికి నిన్ననే తన లవ్ ని ప్రపోజ్ చేసాడుట.. సంవత్సరం నుండి షణ్ణూ పెళ్లిమాట ఎత్తితే చిర్రుబుర్రు లాడుతున్నాడని చెప్పానా, ఇదీ విషయం.. ఆ అమ్మాయి అక్షర కూడా ఓకే చెప్పిందిట.”
“ఏమిటేమిటీ ? షణ్ణూ మీ మఱిదా ? ఆ అమ్మాయి అక్షర అంటున్నావు?”
“అవును అక్షర, ఏం?” అంటూండగానే, సడన్ గా పరిమళ మెదడులో ఏదో ఫ్లాష్ వెలిగింది.. “అక్షర మీ ఆడపడుచు పేరేకదూ సుప్రజా?”
“పేరే కాదు మహాతల్లీ, మా ఆడపడుచే..”
“అవునూ, మీ అక్షర పనిచేసేది బెంగుళూర్ లో కదా ?”
“ఓ, సారీ”, నెత్తిమీద చిన్నగా కొట్టుకుంటూ, “అప్పుడెప్పుడో చాలా రోజుల క్రితం ఇక్కడ హైద్రాబాద్ లోనే ఉద్యోగం చేస్తోందని చెప్పావు కదూ? మరచిపోయానే బాబూ.”
“అవునే పరిమళా. బెంగుళూర్ నుండి వచ్చేసి ఇక్కడ హైద్రాబాద్ కాగ్నిజెంట్ ఆఫీస్ కు మారిపోయి సంవత్సరం అయిపోయింది. మీ మరిది ఎక్కడ వర్క్ చేస్తున్నాడో నీవు ఎప్పుడూ చెప్పలేదు, అయినా మన మధ్య ఎప్పుడూ ఆ టాపిక్ రాలేదు. ఇప్పుడు నీవు అక్షర, షణ్ణూ అని చెపుతుంటే ఆడబోయిన తీర్థం ఎదురవడమంటే ఇదే అనుకున్నాను..”
“నిన్ననే మా ఆడపడుచు కూడా షణ్ణూ తో ఎలా తన ప్రేమ విషయాన్ని తెలియచేయాలా అని తటపటాయిస్తుంటే నేనే ధైర్యం చెప్పి ప్రోత్సహించాను పరిమళా.”
“ఓ వాట్ యే వండర్ సుప్రజా!”
“నిన్న సాయంత్రం అక్షర ఆఫీస్ నుండి వస్తూనే ఆనందంతో నన్ను చుట్టేసుకుంటూ షణ్ణూనే ముందుగా తనని ప్రపోజ్ చేసాడని, తనుకూడా అతని పట్ల కల తన ఇష్టాన్ని చెప్పేసానని ఓ సంబరపడిపోయింది తెలుసా.”
“షణ్ణూ అక్షర పేరుచెప్పినా మీ ఆడపడుచే అయి ఉంటుందన్న ఆలోచనే నాకు రాలేదు సుప్రజా.”
“నాకూ అంతేకదా పరిమళా. ఇప్పుడు నీవు పేర్లు చెపుతుంటేనే నాకూ కన్ ఫర్మ్ అయిందే. మీ మరిది, మా ఆడపడుచు చక్కని జంట కాబోతున్నారంటే భలే ధ్రిల్లింగ్ అనిపిస్తోంది కదూ!”
“అయినా మనకింత మంచి ఆలోచన ముందరే ఎందుకు రాలేదంటావ్?”
“చెప్పనా సుప్రజా, ఏ టైమ్ కి జరగాల్సింది ఆ టైమ్ లోనే జరుగుతుంది కాబట్టి.”
“అవునూ నీకో సంగతి చెప్పాలే సుప్రజా, మరచిపోయా నింతసేపూ. మా షణ్ముఖ్ మీ అక్షరని అడిగాడుట. పూర్వం జరిగిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ..
మా అమ్మా నాన్నా ఎప్పటికీ మన దగ్గరే ఉండడంలో నీకేమైనా అభ్యంతరం ఉందా అని అడిగాడుట. ఉమ్మడి కుటుంబం లో ఉండడం నీ కిష్టమేనా అని.”
“ఆహా ఏమందిట మా ఆడపడుచు?”
“ఆ మాటకి మీ అక్షర ఏడ్చేసిందిట. పిచ్చి పిల్ల. చదువుకుంటున్న రోజుల్లోనే తల్లిని కోల్పోయానని, అమ్మ ని తనకు కాబోయే అత్తగారిలో చూసుకోవాలన్నది తన కోరికని, అందరూ సరదాగా కలసిమెలిసి ఉండడం తన కిష్టమని చెప్పిందిట.”
“నిజమే పరిమళా. అక్షరది మంచి మనసు. ఎదుటివారిని తన వారిగా అభిమానిస్తుంది. పెద్దవారిని గౌరవిస్తుంది.
పోనీలే, ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కదూ సుప్రజా!”
“అయినా ఇద్దరికిద్దరే అనిపించింది సుప్రజా. 'అక్షరది ప్రేమో, స్నేహమో అర్థంచేసుకోలేని స్థితిలో షణ్ణూ, అతనిపై ఉన్న ప్రేమను తెలుపలేని స్థితిలో అక్షర, పాపం ఇద్దరూ ఎంత మధనపడి ఉంటారో కదా!”
“నిజమే పరిమళా, ప్రేమను వ్యక్తపరచడానికి ఇద్దరూ సంకోంచించారు. ఎందుకంటే భయం. ఎదుటి వ్యక్తి తన ప్రేమను అంగీకరిస్తే ఫరవాలేదు. లేదంటే అప్పటివరకు తమ మధ్యనున్న పరిచయం, స్నేహం ఎక్కడ పాడవతాయోనన్న భయం.
అదీగాక ఒకే ఆఫీసులో, ఒకే టీమ్ లో రోజూ ఒకరి ముఖం మరొకరు చూసుకోవాలంటే ఎంత బిడియంగా ఉంటుంది!” కమ్ ఫర్ట్ గా పనిచేయడం కష్టం కూడాను. పోనీలే, ఇరువురి ప్రేమా గెలిచింది. ‘వన్ సైడ్ లవ్’ కాలేదు. ఇద్దరి జీవితాలలో తొందరలో పెళ్లి బాజాలు మోగబోతున్నాయంటే ఇంతకంటే ఆనందం ఏముంటుంది?”
“బాగా చెప్పావు సుప్రజా. కాలం కలసిరానంతవరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధానే. మన ఎదురుగానే అన్నీ పెట్టుకుని వ్యర్థ ప్రయత్నాలు చేస్తూంటాం ఒక్కోసారి. ఆలోచిస్తుంటే ఎంత మూర్ఖత్వం అనిపిస్తుంది.”
“ఓకే, పరిమళా, ఇంక ఆలోచించకు. చాలా సేపైంది మనం మాటల్లోపడి. బాస్ మనకోసం ఎదురుచూస్తూ ఉండచ్చు, పద” అనుకుంటూ ఇరువురూ తమ విభాగంలోకి అడుగు పెట్టారు.
***
యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం :
నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.


Comments