top of page

కాలు మెుక్కుతా



'Kalu Mokkutha' written by Bhagavathula Bharathi

రచన : భాగవతుల భారతి

" సింహాచలరావు గారూ, ఏమండోయ్ సింహాచలరావు గారూ" పిలుస్తూ వచ్చాడు అహోబిలరావు .

గేటు తీసుకుంటూ, ఇంటికీ, గేటుకీ మధ్య అరకిలోమీటరు దూరం నడిచి అటూ, ఇటూ నాటి ఉన్న మెుక్కలను దాటుకుంటూ వరండా వరకూ వచ్చి"సింహాచలరావు " గారూ అని మళ్ళీ పిలిచాడు,

సింహాచలరావు భార్య బాన పొట్ట దమయంతమ్మ బైటి కొచ్చి " ఎవరూ? " అంది.

" అమ్మా! నేనమ్మా ! అహోబిలరావంటారు నన్ను. పక్కూరినుండి కాంట్రాక్ట్ పనిమీద ఈ ఊరొచ్చాను. అయ్యగారితో పని ఉండీ ~ లేరాండీ.... " మళ్ళీ అడిగాడు,

"ఉన్నారండీ. లోపలి కొచ్చి కూర్చోండి" అని దమయంతి లోపలికి ఆహ్వానించి మంచినీళ్ళిచ్చింది.

అహోబిలరావు సోఫాలో కూర్చున్నాడు.

దమయంతి లోపలికి వెళ్ళింది. ఒక్కడే అక్కడ మిగిలిన అహోబిలరావు చుట్టూ, గోడలకు ఉన్న చిత్తరువులు, వాల్

పెయిటింగ్స్, గమనిస్తూ లేచినిలబడి పరిశీలిస్తూ, ఇంట్లో తిరుగుతూ, యాధాలాపంగా పూజగదిలోకి తొంగిచూసాడు.

అంతే కొయ్యబారి పోయాడు. అక్కడ ఏం జరుగుతోందో అర్ధంకాక, నోటిమాట రాలా~

లోపల పూజగదిలో...

సింహాచలరావు దేవుడి ముందు పీట కూర్చుని ఎడమ కాలును నగ్నంగాచేసి, ప్రక్కగా జాపి వేరే పీటమీదపెట్టి ఆ కాలికి ప్రక్కగా కొబ్బరికాయ కొట్టి ,ఆ నీళ్ళతో తన ఎడమకాలు కడిగాడు.

కాలిని పొడిగుడ్డతో తుడిచాడు. కాలికి గంధం పట్టించాడు, దానిమీద పసుపు పూసాడు, కుంకుమ బొట్టు పెట్టాడు, పూలు జల్లాడు. అగరబత్తీలు వెలిగించి రెండు దేవుడికి త్రిప్పాడు, రెండుబత్తీలు కాలికి భక్తి శ్రధ్దలతో త్రిప్పాడు. ధూపంవేసాడు. కొబ్బరిచిప్పలు, అరటిపళ్ళూ, కాలికి నైవేద్యం పెట్టాడు.

దేవునికీ చేయి నైవేద్యంలా చూపించాడు, ఏవో మంత్రాలు చదివాడు. ప్రసాదం కళ్ళకద్దుకుని తిని, అన్నీ సర్దేసి పైకిలేచాడు. వెనుదిరిగాడు. ఇదంతా గుడ్లప్పజెప్పి చూస్తున్న అహోబిలం కెవ్వున అరిచి కళ్ళు తిరిగి పడిపోయాడు.

ఈ హటాత్సంఘటనకి సింహాచలరావూ బిత్తరపోయి కెవ్వుమన్నాడు. రెండు కెవ్వులూ ఏక కాలంలో విన్న దమయంతమ్మ వంటింట్లో గిన్నెలు భళ్ళున చప్పుడుచేస్తూ భారీ కాయం దొర్లించుకుంటూ వగరుస్తూ

పరుగున వచ్చింది. అప్పటికే అహోబిలరావును సోఫామీదికి చేర్చి, ఫాన్ వేసి సపర్యలు చేస్తున్నాడు సింహాచలం.

అహోబిలం కళ్ళు తెరిచాడు, అతని ముఖంలోకి చూస్తూ అడిగాడు "ఏమండీ! అహోబిలరావు గారూ..ఎలాఉన్నారూ?” అని సింహాచలం అడగగానే...

మళ్ళీ కెవ్వున అరవబోయి విరమించుకున్నాడు అహోబిలం.

అప్పటికే పక్కింటి పాపారావు గబ్బిలం లా గుమ్మం దగ్గర వేళాడుతూ జరిగే తతంగమంతా చూస్తున్నాడు. చుట్టూ పరికించి చూసాడు అహోబిలం. ఎదురుగా ఫొటో...... లుంగీ ఎగ్గట్టి, పసుపుకుంకుమ పూలదండలతో అలంకరింపబడ్డ కాలు ఫొటో. మళ్ళీ కెవ్వున అరవబోయాడు.

అదను కోసం ఎదురు చూస్తున్న గబ్బిలం పాపారావు ఛెంగున నట్టింట్లోకి దూకి, పళ్ళికిలిస్తూ

"అనుకున్నా! అనుకున్నా! ఆ ఫొటో చూసి మళ్ళీ మీరు మూర్ఛకుపక్రమిస్తారనీ"

మళ్ళీ గార పళ్ళు కనిపించేటట్లు ఇకిలించాడు. ఏ పనిమీద వచ్చాడో కూడా మరిచిపోయిన అహోబిలరావు వెర్రిగా చూస్తూ, ‘ఏమిటిదంతా?’ అని అడగబోయాడు.

"అనుకున్నా! ఊహించా! మీరుఅడుగుతారనీ, నేను ఆ కథంతా చెప్పాలనీ కడుపుబ్బి పోయి చస్తున్నా. అందుకే ఎగురుకుంటూ వచ్చా! నేచెబుతా, నే చెబుతాగా! " అని కక్కేయాలన్నంత కడుపుబ్బు తో చెప్పడం మెుదలెట్టాడు గబ్బిలం పాపారావు.

~ ~ ~ ~ ~ ~

సింహాచలరావు, నేత్రానందరావూ అన్నదమ్ములు. నేత్రానందరావు చిన్నప్పటినుంచి, బాగా కష్టపడి చదివి పైకొచ్చి మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు.

సింహాచలానికి చదువు అబ్బలేదు. ముక్కు ఎగబీల్చుకుంటూ, మట్టలాగూలేసుకుని వీధులెంట తిరిగేవాడు. ఏ పనీ చేతకానివాడు అనీ, వెఱ్ఱి బాగులవాడనీ, అన్నగారే ఎలాగోలా తమ్ముణ్ణి కనిపెట్టుకునుండేవాడు

ఖర్చులకు డబ్బులూ అవీ ఇస్తూ, తమ్ముణ్ణి కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేవాడు.

వయసు ఆగదుగా.. దమయంతి తో పెళ్ళి చేసారు. ఇద్దరాడపిల్లలు పుట్టారు. ఇక కష్టాలు మెుదలు. ఏ పనీ చేతకాని సింహాచలం అన్నగారి సాయంతో ఏదో బడ్డీ కొట్టు పెట్టాడు. దాన్ని నడిపే తెలివికూడా లేక, అప్పులపాలై, ఆ బడ్డీ కొట్టులోనే గుమాస్తా అయ్యాడు.

షుగర్ మహమ్మారి మెుదలయింది . పిల్లలు పెరుగుతున్నారు. ఇంతలో ఎక్కడో హడావుడిలో చిన్నమేకు కాలిలో గుచ్చుకుంది. చిన్నదే కదా అనుకున్నారు. అది పెరిగి పెనుభూతమై కాలంతా వాచి చీముపట్టి, బురబురలాడి కాలుతీసేయాలేమో అనే పరిస్థితి కొచ్చింది. అందులో షుగరూ, ఆర్థిక మాంద్యం కూడానాయె !

ఏం చేయాలీ? ఎవరో సలహా ఇచ్చారు,

సెల్ ఫోన్ వాట్సాప్లో ఆర్ధిక సహాయంకోసం అర్ధిస్తూ మెసేజ్ పెట్టమని.

" ఆ, ఈరోజుల్లో అంత దానకర్ణులా? మాఖర్మ ఇలా కాలిపోయింది. ఇక మాగతి అధోగతే. నేనూ నాపిల్లలూ దిక్కులేని వాళ్ళమైపోతాం" పిల్లల్ని దగ్గరెట్టుకుని రాగాలు

మెుదలెట్టింది దమయంతమ్మ.

ఎవరో ధైర్యంచేసి సెల్లోంచి వాట్సప్ ఫార్వర్డ్ మెసేజ్ పెట్టారు. ఒకరినుండి ఒకరికి పాకి మూడురోజులు గడిచాక వచ్చాయీ~ మనియార్డర్లూ, డబ్బు.. కుప్పలుతెప్పలే, దేశంలో ఇంతమంది దయామయులున్నారా? అని ఆశ్చర్యపోయేంతలా!

మీడియా ఇలా మంచికీ ఉపయోగ పడుతోందా?అనేంతలా?! సింహాచలాన్ని హైదరాబాదు తీసుకెళ్లి హాస్పిటల్ లో చేర్పించి, మంచి వైద్యం చేయించి, వచ్చిన సొమ్మంతా లెక్కబెట్టి, తమ్ముడి పేరుమీద ఫిక్సెడ్ చేయించి, కొన్ని వడ్డీలకు త్రిప్పి, వచ్చిన డబ్బుతో, చక్కని ఇల్లు కట్టించి, ఆడపిల్లలకు చదువులు చెప్పించి, పెళ్ళిళ్ళు చేసి, ఓ దారి ఏర్పాటుచేసారు అన్నగారు.

నిజంగా ఆయనకూడా ధర్మరాజే.

వచ్చిన సొమ్మంతా దిగమింగకుండా జాగ్రత్త

చేసాడు. దమయంతమ్మ తెలివి తెచ్చుకుని మెుగుణ్ణి కాంట్రాక్ట్ వ్యాపారం లోకిదింపి , తను బావగారి సలహాలు తీసుకుంటూ, వెనకాల తానే చక్రంతిప్పుతూ , పిల్లలకు ఓ దారి ఏర్పరచి ఈరోజు ఈ స్థాయి కొచ్చారు.

అదీకధ. అందుకే " కాలునిలిపిన జీవితం" అనుకుంటూ, ఆ కాలికి త్రికాలముల యందూ, పూజాదికములు కావిస్తుంటాడు." అని ముగించాడు గబ్బిలం పాపారావు.

కథంతా విని ఆశ్చర్యం నుండి తేరుకున్న అహోబిలరావు అమాయకంగాఅన్నాడు~

" కాలికి పూజా పురస్కారాలు చేయటం కాదండీ, మీ కాలు నయం కావడానికి ఎంతోమంది దానకర్ణులు సాయం జేసారే !వారందరికీ రోజూ పేరుపేరునా శ్రధ్దాంజలి ఘటిస్తే వారిబుుణం తీరి పుణ్యం వస్తుంది. పాపం వారంతా" ~~ మాట పూర్తి కాలేదు

"ఆ~శ్రధ్దాంజలా?"

ఈ సారి మూర్ఛపోవడం

సింహాచలరావు వంతయింది.

~ ఐపోయింది ~

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం

ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.

ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో

బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.


124 views0 comments

Comments


bottom of page