top of page
Original.png

కాంబాబు - ఫార్టీ ప్లస్


నలభై వచ్చినా పెళ్లి కుదరకపోయిన కాంబాబు… కుదిరిన పెళ్లిలో జరిగిన సంఘటనలు నవ్వుల పండుగే!


Kambabu Forty Plus- Telugu Comedy Story | Veereswara Rao Moola

కాంబాబు - ఫార్టీ ప్లస్ - తెలుగు హాస్య కథ | వీరేశ్వర రావు మూల

Published In manatelugukathalu.com On 01/04/2026


కాంబాబుకి వయసు నలభై వచ్చినా పెళ్ళి సంబంధం కుదరలేదు. చాలా సంబంధాలు కాంబాబు సింగపూర్‌లో ఉండడం వల్ల తప్పిపోయాయి. కాంబాబుకి పెళ్ళి కాకపోవడానికి మరో కారణం "సోలో డాటర్ మరియు సోమచ్ క్యాష్" లాంటి సంబంధం కోరుకోవడమే!


తరువాత తెలిసినవాళ్ళ ద్వారా ఒక సంబంధం వచ్చింది. ఆ సంబంధం కామ్రేడ్ కమల. కమల కొన్నాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి బయటికి వచ్చింది. కమలకి తల్లి, తండ్రి లేరు. మేనత్త మంగలక్ష్మి ఉంది.

                  **********

కమలతో పెళ్ళిచూపులు ఏర్పాటయ్యాయి.

"వంట పని, ఇంటి పని ఆడవాళ్ళే చెయ్యాలా? మీ అభిప్రాయం?" అడిగింది కమల.

"సాధారణంగా వాళ్ళే చేస్తారు కదండీ."


"అనాదిగా ఆడదాన్ని వంట ఇంటికే పరిమితం చేయాలన్న మీ ఆలోచన, మీ బూర్జువా మనస్తత్వానికి అద్దం పడుతోంది."


"బూర్జువా" పదం విని కాంబాబు దడుచుకున్నాడు!


"కారల్ మార్క్స్ కాపిటల్ చదివారా?"


"ఇప్పుడే ఆ పేరు వింటున్నాను."


"మార్క్స్‌ని చదవలేదంటే మార్పు అంగీకరించని మీ ఫ్యూడల్ సంస్కృతి తెలుస్తోంది."


"ఓరి నాయనో ఇలా చావగొడుతోంది. 'బూర్జువా' అంటుంది. 'ఫ్యూడల్' అంటుంది."

అని నెత్తి మీద చేతులు పెట్టుకున్నాడు కాంబాబు.


"ఒక పాట పాడమ్మా" అడిగింది కాంబాబు తల్లి.


"నాంపల్లి టేసన్ కాడి రాజలింగో..." అని అందుకుంది. కాంబాబుకి స్పృహ తప్పింది.

               *******

ఏడాది తరువాత :

కాంబాబు అలియాస్ కామేష్ పెళ్ళి కుదిరిందని అతని మిత్రుడు వామనరావుకి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. కామేష్‌కి ఫార్టీ ప్లస్ వచ్చాక, మార్కెట్‌లో డిమాండ్ తగ్గాక డబ్బు యావ తగ్గి, డైవర్స్ కేస్‌ని పెళ్ళి చేసుకుంటున్నట్టు ప్రకటించి, మిత్రులకు మంచి పార్టీ అని ఊరించాడు. వామనరావు తనకు వచ్చిన మెసేజ్‌ని తన ముగ్గురు మిత్రులకు ఫార్వర్డ్ చేశాడు. ఇక అందరికీ పండగే అని ప్రకటించాడు. గున్న గున్న మామిడి డీజే సౌండ్‌కి తను గెంతుతానని, రాయల్ స్టాగ్ అంతు తేలుస్తానని అన్నాడు మిత్రులతో. పెళ్ళి విందులో పనసపొట్టు బిర్యానీ, చిల్లీ చికెన్, ఫిష్ ఫ్రై, వెజ్ మంచురియా మొదలైనవి లాగించి ఆ తరువాత బ్లెండర్స్ ప్రైడ్ ఫుల్ బాటిల్‌తో అవలీలగా లాగించి, 'కాంబాబు పెళ్ళికొడుకాయెనే, మా జీవితాలు విందు మందులతో పసందయ్యేనే' అని పాడుకుంటానని, అలా వామనరావు కలల అలల్లో తేలిపోతున్నాడు. మిత్రులు రమణ, రంగా ఎగిరి గంతేశారు. కాంబాబు పెళ్ళి మార్చి 15కి నిశ్చయమయ్యింది. జనవరి నుండి వామనరావు ఉద్రేకం పడుతున్నాడు.


రమణ, రంగా కూడా అడిగారు పెళ్ళికి అంత హైప్ అవసరమా అని.

"నీకు తెలియదురా మా ఫ్రెండ్‌షిప్. ఒకే కంచం. ఒకే మంచం. ఒకే బ్రాండ్. అలాంటిది ఇన్నాళ్ళకి వాడు ఒక ఇంటివాడవుతుంటే, నేను కాకపోతే ఇంకెవరు ఎగ్జైట్ అవుతారు? గున్న గున్న మామిడి..." అంటూ చిందులు తొక్కాడు వామనరావు.


" ఆపరా నీ గోల. టిక్కెట్లు సంగతి చూడు." అన్నాడు రమణ. 


" మన రంగా ఉన్నాడు గా" అన్నాడు వామనరావు. 


" తమరికి పాటలు. మాకు పాట్లు" అని విసుక్కున్నాడు రమణ. 


"ఇదేనా... ఇదేనా... స్నేహబంధం. నేస్తం సమస్తమని 'వాలి' పోయానే. ఇప్పుడు ఇలా చేస్తారా?" అని విచారంగా అన్నాడు వామనరావు.


"గోల చేయకు. నీకు కూడా టికెట్ తీస్తాను." అన్నాడు రంగా. మార్చి నెల వచ్చింది.

                                                            ******

మార్చి 14న ముగ్గురు మిత్రులు రైలులో భీమవరం చేరుకున్నారు. పెళ్ళి భీమవరం దగ్గరనున్న పల్లెటూరులో. కాంబాబు పెళ్ళి మార్చి 15 ఉదయం పది గంటలకి. రాత్రి హోటల్‌లో ఉండి ఉదయం వెళ్దామనుకున్నారు. రాత్రి హోటల్‌లో దొంగతనం జరిగి, రమణ మొబైల్ పోయింది. డబ్బు కూడా పోయింది. కాంబాబుకి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వస్తోంది. చచ్చి చెడి పల్లె వెలుగు ఎక్కి ఫంక్షన్ హాలుకి చేరుకున్నారు. ఆశ్చర్యంగా అక్కడ ఎవరూ లేరు. పెళ్ళివారి హడావిడి లేదు. 'ఎన్నాళ్ళో వేచిన ఉదయం' పాట మైకులో వినబడుతోంది. సెక్యూరిటీ తాపీగా సిగరెట్ కాల్చుకుంటున్నాడు.


" ఇక్కడ కామేష్ వెడ్స్ కనకవల్లి" అని ఉండాలి కదా అని బితుక్కు బితుక్కు మంటూ అడిగాడు వామనరావు. 


"అరే షాదీ నహీ హై, కాన్సిల్ హో గయా!" చెప్పాడు సెక్యూరిటీ.


" క్యోం ?" అడిగాడు రమణ. 


"పెళ్ళికూతురు లవర్ కే సాత్ భాగ్ గయీ (పెళ్ళికూతురు ప్రియుడితో పారిపోయింది)."


"వీడు హిందీలో ఏం బాధపడుతున్నాడురా?" అని వామనరావు అడిగాడు.


"పెళ్ళికూతురు తన ప్రేమికుడితో పారిపోయింది. పెళ్ళి రద్దయినది" అని అతను హిందీలో అన్నదానికి అర్థం వివరించాడు రంగా.

ఆ మాటలు విని వామనరావు మూర్చ పోయాడు. పది నిమిషాల తర్వాత లేచాడు. 

" ఎక్కడ ఉన్నాను? "

" హొటల్ తాజ్ బంజారా లో " వెటకారం గా అన్నాడు రంగా. 

"ఇవే తగ్గించుకుంటే మంచిది." అన్నాడు వామనరావు నీరసంగా.

                 **********

ముగ్గురు మిత్రుల దగ్గర కలిపి ఒక వంద రూపాయలు ఉన్నాయి. పాక హోటల్‌లో ఇడ్లీ తిని రోడ్డు మీదకు వచ్చారు. తిరిగి వెళ్ళడానికి డబ్బుల్లేవు.


 

ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే వారికి రొయ్యల నాయుడు లోకల్ కనపడ్డాడు.

"కుర్రాళ్ళు పొరుగురు వాళ్ళలా ఉన్నారు. ఓ సారి కదుపుదాం" అని పలకరించాడు.

"కుర్రాళ్ళు ఏ వూరు తమరిదీ?"

"పొరుగురు" అన్నాడు వామనరావు తిక్కగా.

"నువ్వుండు. మాది హైదరాబాద్. పెళ్ళికి వచ్చాం" అన్నాడు రమణ.

" అదే కామేష్ వెడ్స్ కనకవల్లి పెళ్లేనా?" 

" అదేనండి." 

"అదే పెళ్ళికి నేనూ వెళ్ళాను. సరిగ్గా తాళి కట్టే సమయానికి బైక్ మీద ఒక చాకు లాంటి కుర్రాడు వచ్చాడు."

"ఆపండి" అన్నాడు అచ్చు సినిమాల్లో లాగే. అంతే ఈ పిల్ల చెంగున లేడిలా గెంతి బైక్ ఎక్కడమేమిటి, ఫుల్ రైజింగ్‌లో బండి వెళ్ళిపోవటమేమిటి అన్నీ రెప్పపాటులో జరిగిపోయాయి." అని మొత్తం కథ చెప్పాడు రొయ్యల నాయుడు.

"సార్ మా దగ్గర డబ్బుల్లేవు వెనక్కి వెళ్ళడానికి."

చెప్పాడు రంగా దీనంగా ముఖం పెట్టి. 

"ఎటు వెళ్ళాలి?" అడిగాడు నాయుడు లంక పొగాకు చుట్ట వెలిగించుకుంటూ.


" హైదరాబాద్ "


"ఓ పని చేయండి. నేను చెప్పిన పని చేస్తే మిమ్మల్ని హైదరాబాద్ పంపే పూచీ నాది."

"ఏం చేయాలో?" అడిగాడు వామనరావు.


"మాది నాలుగు వేల కొబ్బరికాయ ఉంది. లెక్కపెట్టాలి. మా పనోళ్ళు లేరు. సమయానికి కనబడ్డారు. ఫుడ్‌కి లోటుండదు. మటన్ బిర్యానీ. రొయ్యల పులుసు." చెప్పి ఆగాడు.


"పెళ్ళిలో ఫలహారం అనుకుంటే 'పనికి ఆహార పథకం' అయ్యిందేమిటిరా?" నెత్తి మీద చేతులుంచుకుని అన్నాడు వామనరావు.


"ఫోన్లు పని చేయడం లేదు. ఎయిర్‌టెల్ సాంకేతిక సమస్య అట. ప్రస్తుతం మనకు రొయ్యల నాయుడు తప్ప దిక్కు లేదు." చెప్పాడు రమణ.


"గూగుల్ పే, ఫోన్ పేలు పని చేయడం లేదు" అన్నాడు రంగా.


ముగ్గురూ రొయ్యల నాయుడు ఇంటికి వెళ్ళారు. 


                                                      ********

ముగ్గురూ కొబ్బరికాయలు లెక్కపెడుతున్నారు. అలవాటు లేని పని కదా, వామనరావు చేతులు కందిపోయాయి. పన్నెండు గంటల సమయంలో నాయుడి పనిమనిషి, షీలా టీ పట్టుకుని వచ్చింది.


షీలా షేపులన్నీ "షకీలా"లా ఉంటాయి.

టీ ఇస్తుంటే అలా చూస్తూ ఉండిపోయాడు వామనరావు. 


"షీలాతో పెట్టుకుంటే, కరెంట్ షాక్ కొట్టిన కాకి అవుతావు. లెక్క కానీ..." అని హెచ్చరించాడు నాయుడు.

 

రెండు గంటలకి నాయుడు పెట్టింది తిని బస్ స్టాండ్‌కి ఎలా వెళ్ళాలి అని అడిగారు. షేర్ ఆటో కుదిర్చాడు నాయుడు.

షేర్ ఆటోలో కొంత దూరం వెళ్ళాక, చేపలు అమ్మే చంచల ఎక్కింది. 

వామనరావు పక్కనే కూర్చుంది. చంచల భారీకాయం. నోట్లో కిళ్ళీ నములుతోంది.

వామనరావు నలిగిపోతున్నాడు. మత్స్య పరిమళం, చంచల స్వేద పరిమళం రెండూ వామనరావుని ఉక్కిరిబిక్కిరి చేశాయి.


"వామనరావుకి లేడీస్ పక్క సీటు. ఎంజాయ్ చేయి" అన్నాడు రమణ చిన్న గొంతుతో.

వామనరావు గుర్రుగా చూశాడు.


చంచల వామనరావు తో మాటలు కలిపింది. 

"భీమవరం కొరమీనులు రుచిగా ఉంటాయి."


వామనరావు మాట్లాడలేదు.

"ఎండుచేప రుచి చూత్తారేటి?" అని చిన్న చేపని నోట్లో పెట్టింది.


"ఎంతసేపటికి ఆటో బస్ స్టాండ్‌కి వెళుతుంది?" అరిచాడు వామనరావు.


" ఇంకో పావు గంట"


                   **********

షేర్ ఆటో బస్ స్టాండ్‌కి చేరింది. జైలు నుండి విడుదలైన ఖైదీలా బయటపడ్డాడు వామనరావు.


రాత్రి దాకా బస్సు లేదన్నాడు ఎంక్వయిరీలో. అందరూ కలిసి 1/3 బిర్యానీ తిన్నారు.

"ఇదే మన కాంబాబు ఇచ్చిన విందు" అన్నాడు రమణ.


"పయనించే ఓ చిలుకా, ఎగిరిపో పాడైపోయెను గూడు." అందుకున్నాడు రంగ.


"కల ఇదని నిజమిదని తెలియదులే బ్రతుకింతేనని" అని వామనరావు అందుకున్నాడు.


వీళ్ళని చూసి ఒకాయన, 'పాపం భోజనం చేయలేదేమో' అని రూపాయి నాణెం విసిరాడు వీళ్ళ వైపు.


 రాత్రి తొమ్మిది గంటలకు భీమవరం నుండి హైదరాబాద్ వెళ్ళే బస్సు బయలుదేరింది. 


                                      **********

ఏడాది తరువాత :


కామేష్ నుండి వామనరావుకి ఫోన్ వచ్చింది.

" నేను కాంబాబు ని" 


"అయితే ఏమిటి?"


"జరిగిన దానికి సారీరా."


"ఎందుకు? నీ పెళ్ళి నీ ఇష్టం."


"ఆ పెళ్ళి తెగతెంపులు చేసుకోవడానికి ఆరు నెలలు పట్టింది."

 

"ఇంకో గుడ్ న్యూస్. మళ్ళీ పెళ్ళి కుదిరింది."


"నేను రాను."


"ఈసారి హైదరాబాద్‌లోనే."


"నీకు ఇబ్బంది ఉండదు. కారు పంపుతాను."


"అయితే గున్న గున్న మామిడి..." అంటూ చిందులేశాడు వామనరావు.


                                            **********

రాజధాని గార్డెన్స్ ఫంక్షన్ హాల్: కొత్తపేట


కాంబాబు వెడ్స్ సునయన. అక్షరాలు విద్యుత్ కాంతిలో మెరుస్తున్నాయి. గిఫ్ట్ తీసుకుని లోపలికి వెళ్ళాడు వామనరావు.

వామనరావు రిసెప్షన్ వైపు వెళుతున్నాడు.


ఎవరో కాంబాబు బామ్మలా ఉంది. ఇలా అంటోంది "ఈసారి వీడి పెళ్ళి కుదరకపోతే ప్రజాపిత బ్రహ్మకుమారీల్లో జాయిన్ అవుతానన్నాడు."


"ఆ బాల్య వివాహాలే నయం అనుకుంటా. పడి ఉంటారు పిల్లకాయలు. ఇప్పటి కాలంలో మూడు రోజుల ముచ్చట తీరకముందే, మావిడాకులు వాడకముందే విడాకులు అంటున్నారు. కలికాలం" అని ఇంకో ముసలావిడ బుగ్గలు నొక్కుకుంది.


కాంబాబు వామనరావుని చూసి కౌగిలించుకున్నాడు.

"ఇతనే నా బెస్ట్ ఫ్రెండ్" అని భార్యకి పరిచయం చేశాడు.


వామనరావు కాంబాబుకి కాబోయే భార్యని చూశాడు. వెంటనే స్పృహ తప్పాడు. ఎందుకంటే పెళ్ళికూతురు గతంలో వామనరావుని ప్రేమించిన అమ్మాయి కాబట్టి!


                  సమాప్తం  


వీరేశ్వర రావు మూల  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

క‌వి, ర‌చ‌యిత‌. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా ప‌నిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో క‌థ‌లు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వంద‌కు పైగా క‌విత‌లు వివిధ వెబ్ ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిత‌మ‌య్యాయి.నిధి చాల సుఖమా నవల సహరి డిజిటల్ మాసపత్రిక లో ప్రచురణ జరిగింది. 


#TeluguComedyStory, #తెలుగుహాస్యకథ







Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page