top of page

కనువిప్పు



'Kanuvippu' - New Telugu Story Written By Yasoda Pulugurtha 

Published In manatelugukathalu.com On 11/08/2024

'కనువిప్పు' తెలుగు కథ

రచన: యశోద పులుగుర్త 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



ఆ రోజు శుక్రవారం. రైతు బజారులో కూరలు కొందామని వచ్చిన సరోజిని, తమ వీధి చివరలో ఉంటున్న శ్యామల మాటలకు తలెత్తి చూసింది.


"చక్కగా కొడుక్కి పెళ్లిచేసి కోడలిని తెచ్చుకుని ఉంటే నీకీ బాధ్యతలు ఉండేవి కాదుగా వదినా"?


కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకన్నట్లు ఈ శ్యామలకెందుకో తన స్వవిషయాలు. మాటలాడకపోతే బాగుండదని "దేనికైనా సమయం రావాలి శ్యామలా, కల్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆపడం ఎవరీ తరమూ కాదు. ఇంతకీ నీ కూతురు అత్తవారింటింటి నుండి ఏవో గొడవలు పెట్టుకుని వచ్చేసిందని, విడాకుల కోసం ప్రయత్నిస్తోందని వాళ్లూ వీళ్లూ అంటుంటే వెధవ చెవులు, ఎందుకు మనకీ విషయాలు అనుకుని చెవులు మూసుకుందామనుకున్నా చెవిలోకి దూరిపోతాయి. ముందు నా కోడలి విషయం కన్నా నీ కూతురి కాపురాన్ని చక్కది”ద్దనేసరికి శ్యామల ముఖం గంటుచేసుకుంటూ అక్కడనుండి వెళ్లిపోయింది.


"హమ్మయ్య వెళ్లింది మహాతల్లి” అనుకుంటూ అక్కడ కూరగాయల బండివాడితో....

"బాబూ కిలో బంగాళాదుంపలు ఎంత"?


" నలభై అమ్మా"!


"వంకాయలు కిలో ఎంతేమిటీ"?


"అవి కూడా అంతే నమ్మా"!


"టమాటాల ధర ఏమైనా తగ్గిందా బాబూ"? 


"లేదమ్మా అదే రేటు. కిలో నూటఏభై రూపాయలు". 


‘నీ మొహం మండా, ఎప్పుడూ అదేపాటా’ అంటూ మనసులో గొణుక్కుంటూ, "సరే, అన్నీ తలో పావూ ఇవ్వు"! 


సరోజిని కాయగూరలను ఎంచుతున్నట్లు నటిస్తూ అతను చూడకుండా గప్ చిప్ గా చేతికి అందినన్ని కూర గాయలను సంచిలో దోపేస్తూ "సరేలే బాబూ, ఇక్కడ బెండకాయలు లేనట్లున్నాయి, అలా వెళ్లి బెండకాయలు కొనుక్కుని వస్తా”నంటూ నెమ్మదిగా జారుకుంది. ఇలా తలో బండిదగ్గరా కూరగాయలు బేరంచేస్తూ వాడిని మాటల్లో పెట్టి గప్ చిప్ గా కూరగాయలు ఒక్కొక్కటీ నొక్కేస్తూ సంచీ నిండా కూరగాయలు నింపుకుని సంచీ బరువును అటూ ఇటూ మార్చుకుంటూ ఇంటిముఖం పట్టింది.


పిల్లికి కూడా బిక్షంపెట్టని సరోజినమ్మకు ఒకే ఒక కొడుకు పేరు అంజన్. ఆరు సంవత్సరాలనుండి ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతీ నెలా ఫస్ట్ తారీఖున బిళ్ల కుడుముల్లాగ కొడుకు జీతం వస్తుంటే దాన్ని వడ్డీలకు తిప్పుతుంది. ఇంట్లో ఒక భాగం అద్దెకిచ్చింది. అలాగే భర్త చనిపోతే భర్త తాలూకా పెన్షన్ అందుకుంటోంది. 

శ్యామల ఆ రోజు అలా అన్నప్పటినుండి సరోజిని మనస్సులో కొడుక్కి పెళ్లి చేస్తే కట్నం తాలూకా డబ్బు కూడా వస్తుంది, పైగా బంధువులూ, చుట్టుపక్కలవారూ కొడుక్కి ఎప్పుడు పెళ్లిచేస్తావంటూ ఆడిపోసుకుంటున్నారని గ్రహించి ఒకరోజు కొడుకుని అడిగింది. "ఒరేయ్ అంజూ నీకు పెళ్లి చేద్దామనుకుంటున్నాను, నీకు ఎటువంటి అమ్మాయిని చూడమంటావురా” అని.


తల్లి అంటే అమితమైన ప్రేమ అంజన్ కి. తండ్రి పోయిన తరువాత బాధ్యతలన్నీ తన భుజాలపై వేసుకుని ఎంతో పొదుపుగా సంసారం నడిపిస్తోంది. అటువంటి తల్లిని సుఖపెట్టాలని అతని ఉద్దేశ్యం. పెళ్లి చేసుకోవాలనీ తనకీ ఉంది. కానైతే పెళ్లి చేయమ్మా అంటే బాగుండదని "అప్పుడే నా పెళ్లికి తొందరేమిటమ్మా" అంటూ నసిగాడు.


"ఓసి పిచ్చి సన్నాసీ, వయసులో ఉన్నపుడే పెళ్లి చేసుకోవాలి, నీకేమి కావాలో కూడా తెలియని అమాయకుడివి. నీకు లక్షణమైన పిల్లను తెచ్చి పెళ్లిచేస్తా”నంటూ కొడుక్కి నచ్చచెప్పి ఒప్పించింది.


ఎవరో తెలుసున్న బంధువులు ఒక మంచి సంబంధం ఉందంటే వాళ్లతో మాట్లాడి కొడుకుని తీసుకుని పెళ్లి చూపులకు వెళ్లింది. 


పెళ్లివారు ఎంతో సాదరంగా ఆహ్వానించారు. "ముందు మంచినీళ్లు తీసుకోండి, ఫలహారాలు తీసుకొస్తాం" అన్నారు.

అంజన్ మొహమాటపడుతూ "ఇప్పుడు అవన్నీ ఎందుకండీ" అన్నాడు.


పెళ్లికూతురు తండ్రి "ఏం.. ఎందుకు వద్దంటున్నారు, కతికితే అతకదన్న పట్టింపులా" అంటూ హాస్యమాడాడు.


కొంతసేపటికి కమ్మని నేతివాసనతో ఘుమాయిస్తున్న సున్నుండలూ, పూతరేకులూ, జ్యూసీ గా నిగారింపుతో మెరిసిపోతున్న కాకినాడ కాజాలతోబాటూ వేడి వేడి అరటికాయ బజ్జీలు, మిర్చీ బజ్జీలు వీళ్లముందు పెట్టారు.


ఆ పరిసరాలలో ఎవరూ లేరని గ్రహించింది. కొడుకు తలొంచుకుని న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు. చటుక్కున కొన్ని స్వీట్స్ తన హేండ్ బేగ్ లో పడేసుకుంది.

ఈలోగా పెళ్లి కూతురి తల్లి శారద కాఫీలు తెచ్చి టీపాయ్ మీద పెడ్తూ "స్వీట్స్ తినండి సరోజిని గారూ, అలాగే ఈ బజ్జీలు కూడా!”


"కాజాలయితే అద్భుతంగా ఉన్నాయండీ, నోట్లో వేసుకోగానే మృదువుగా తేనెలా పాకం జాలువారుతోంది. మీరు చేసారా, లేక కొన్నారా? ఇటువంటి కాజాలు ఎప్పుడూ నా జన్మలో తినలేదంటే నమ్మండి. మీరు ఏమనుకున్నా ఫరవాలేదు శారదగారూ, నాకు మొహమాటం లేదు. వెళ్లేటప్పుడు కొన్ని కాజాలు ఎత్తుకుపోతాను". 


"అయ్యో ఎంత మాట సరోజిని గారూ, ఎత్తుకుపోవడం ఎందుకు, దర్జాగా తీసుకెళ్లచ్చు".

పెళ్లి చూపుల తతంగం పూర్తి అయింది. అబ్బాయి వాళ్లకూ, అమ్మాయి వీళ్లకూ నచ్చింది. ముహూర్తాలు పెట్టుకుందా మనుకుంటూ వీడ్కోలు తీసుకునే సమయంలో శారద రక రకాల స్వీట్లు చక్కగా పేక్ చేసి ఇచ్చింది. అక్కడ ట్రేనిండా అమర్చిన రక రకాల పండ్ల వైపే చూస్తూ సరోజిని "దారిలో తినడానికి పళ్లు కొనరా అబ్బా”యనేసరికి, "అయ్యో వదినగారూ కొనడం ఎందు”కంటూ అక్కడ ఉన్న పళ్లూ అన్నీ ఒక పెద్ద బేగ్ లో వేసి ఇచ్చింది. 


ఒక శుభ ముహూర్తాన మంచి కట్న కానుకలు ఇచ్చి ఆడపెళ్లివారు చాలా ఘనంగా పెళ్లి జరిపించి వారమ్మాయి వైదేహిని అత్తవారింటికి పంపారు.


సరోజిని కొత్త దంపతులచేత సత్యనారాయణ వ్రతం జరిపించాలని అనుకుంటూ ఊర్లో అందరినీ పిలిస్తే భోజనాలకు చాలా ఖర్చు అవుతుందని కొద్ది మందిని మాత్రమే పిలిచింది. వ్రతం పూర్తి అవగానే వారికి కాస్త కాస్త ప్రసాదం చేతిలో పెట్టి కోడలిచేత బొట్టు పెట్టిస్తూ "భోజనాలు ఏర్పాటు చేద్దామంటే వంట మనుషులు దొరకలేదు. నాకు కేటరింగ్ కు ఆర్డర్ ఇవ్వడం ఇష్టం లేదు. వాళ్లు మడిగా చేయరు, పైగా నిష్టగా చేసుకుంటున్న వ్రతమాయే" అంటూ కల్లిబొల్లి మాటలు చెపుతూ వాళ్లను సాగనంపింది. 


వైదేహి పుట్టింట్లో చాలా దర్జాగా పెరిగిన పిల్ల. పొద్దుట రెండు రకాల టిఫిన్ లు, మధ్యాహ్నం రెండు మూడు రకాల ఆధరవులతోభోజనం, సాయంత్రం తల్లి వేడిగా ఏవో స్నాక్స్ చేయడం, మళ్లీ రాత్రి భోజనం, ఇవిగాకా అప్పుడప్పుడు హొటల్స్ కు వెళ్లి తినడం అవీ ఉండేవి. 


తనకి ఏదైనా తినాలనిపిస్తే తల్లికి చెపితే వెంటనే చేసి పెట్టేది. తనకు వంటలు బాగా వచ్చు కూడా. కొత్త కొత్త వంటలు యూ ట్యూబ్ లో చూసి నేర్చుకుంది. కానీ ఇక్కడ అత్తగారు పొద్దుట రెండే రెండు ఇడ్లీలలో కాస్తంత పచ్చడి వేసి పెట్టడం, లేదా ఒక గరిటెడు ఉప్మా మాత్రమే పెడుతుంది. మధ్యాహ్న భోజనంలో ఒక స్పూన్ కూర, కాస్తంత పప్పు, మారు వడ్డించదు. అన్నీ సమానంగా సర్దేసేది. 


మూడు రకాల కాఫీలు. పొద్దుట ఆవిడ తాగే కాఫీ చిక్కని డికాషన్, పాలు వేసుకుని కలుపుకుంటుంది. ఇంక తరువాత లేచిన వాళ్లకు నీళ్ల కాఫీలే. కాఫీ సరిపోకపోతే కాసిని వేణ్ణీలు చటుక్కున కలిపేస్తుంది. అలాగే పప్పు, పులుసుల్లో కూడా. వైదేహి కు అత్తగారి పిసినారితనం అర్ధం అయింది. 

ఆరోజు శ్రీరామనవమి. దగ్గరున్న రామాలయంలో సంతర్పణ భోజనాలు పెట్టడం రివాజు. సరోజినికి ఇటువంటివి మహానందం.


 వైదేహి ని తీసుకుని గుడికి బయలదేరింది. వైదేహి పట్టుచీర కట్టుకుని తయారైంది. అత్తగారి చీరవైపు చూసింది. నాసిరకం చీర వెలిసిపోయింది కట్టుకుంది.

"అత్తయ్యా మీ చీర బాగాలేదు. మరోచీర కట్టుకోండి".


"ఈ చీరకేమే వైదేహీ! నారాయణపేట చీరట. ఆ మధ్య మా చెల్లెలింటికి వెడితే నిక్షేపంలా ఉన్న చీరలు పాతబడిపోయాయంటూ పనిమనిషికీ, వంటమనిషికీ ఇవ్వబోతుండే ఆపేసాను. అయిదారు సంవత్సరాలు వాడితేనే పాతబడిపోతాయా? భేషజం కానీ. కొడుకు సంపాదించి దీని చేతిలో పెడితే కన్నూ మిన్నూ కానకుండా ఓ....చీరలే చీరలే బీరువాలనిండా. కట్టకుండానే పాతబడిపోయాయంటూ చీరలన్నీ వాళ్లకీ వీళ్లకీ పంచేయడమేమిటని నేను తెచ్చేసుకుంటాను. మరో అయిదారేళ్లు వాడేస్తాను. నేను అసలు చీరలు కొనను. కొని బీరువాలనిండా దాచిపెట్టుకుంటే పిల్లలు పుట్టేయవుకదా"? 


"పోనీ మా పెళ్లికి మా అమ్మా వాళ్లూ పెట్టిన చీరలున్నాయి కదా అత్తయ్యా. అందులో ఏదేనా తీసి కట్టుకోండి. మీరే అన్నారు కదా, దాచుకుంటే పిల్లలు పుడతాయా అని".


"ఓసి వైదేహీ, నా తెలివి గురించి తెలిస్తే డంగైపోతావు. ఆ చీరలన్నీ కొత్తవే కదా, వాయిదాల పధ్దతిలో తెలుసున్న వారికి అమ్మేసాను. నాకు ఎవరైనే చీరలు పెడితే అలాగే చేస్తాను". 


వైదేహి అలా గుడ్లప్పగిస్తూ చూస్తూండిపోయింది. 

గుడికి బయలదేరారు అత్తాకోడళ్లిద్దరూ. "అత్తయ్యా చెప్పులేసుకోరా"?


"అయ్యో వైదేహీ నీవూ వేసుకోకమ్మా, అసలుకే నీవి కొత్త చెప్పులాయ్. గుడిలో చెప్పుల దొంగలుంటారు".


"అయితే ఈ రోడ్ మీద రాళ్లు గుచ్చుకుంటుంటే ఎలా నడుస్తారు? గాజు పెంకులూ, ఇనప మేకులూ కాలిలో గుచ్చుకుని సెప్టిక్ అయితే కాలు మొత్తం తీసేయవలసి వస్తుంది".


"ఆ మరీ వింతపోకడాలు నీవన్నీ. చిన్నప్పుడు నాకు అసలు చెప్పులంటేనే తెలియదు. అప్పుడేమీ జరగనిది ఇప్పుడు జరుగుతుందా? చెప్పులుపోతే మళ్లీ కొనుక్కోవాలంటే మాటలా? మాయదారి ప్రభుత్వం, ఈ బడ్జెట్ లో చివరకు చెప్పులు ధరలుకూడా పెంచి పడేసింది".


''నడు నడు భోజనాలు పెట్టేస్తారు. ముందు వరసలో కూర్చుంటే అన్నీ వస్తాయి మన విస్తళ్లలోకి. ఆఖరున ఉంటే అన్నీ అడుగూ బుడుగే”.


అప్పటికే ఒంటిగంట అయిందేమో గుడిలో పంక్తి భోజనాలకు అరిటాకులు పరుస్తున్నారు. వడ్డనలు జరుగుతున్నాయి. భోజనాలు చేస్తూండగా అత్తగారు బూరెలు నాలుగైదు సార్లు మారువడ్డించుకుంటూ రహస్యంగా ఆవిడ బేగ్ లో వేసుకోవడం చూసిన వైదేహికి అత్తమీద అసహ్యం వేసింది.


ప్రతీ నెల భర్త తాలూకా పెన్షన్ అందుకుంటున్న సరోజిని లైఫ్ సర్టిఫికిట్ సబ్ మిట్ చేయాలని ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలోనున్న బేంక్ కు వెళ్లి రావాలని బయలదేరింది. కొడుకు "ఆటోలో వెళ్లి రామ్మా" అంటే "సరేనంటూ" ఆటో ఎక్కకుండా నడుచుకుంటూ వెళ్లి పని పూర్తిచేసుకుని మళ్లీ తిరిగి నడక సాగించింది. 

ఆ నెల వడ్డీలు తాలూకా సొమ్ము ఎంత వస్తుందోనని మెదడులో లెక్కలు వేసుకుంటూ నడుస్తోంది. ఎదురుగా ఒక గుంటలో చూసుకోకుండా కాలు వేసేసరికి తూలి బోర్లా పడిపోయింది. నలుగురూ గుమిగూడారు. ఎడం కాలు ఖరేలు మంది. అడ్రస్ అడిగి ఆమెను లేపి ఆటోలో కూర్చోపెట్టి ఆటోవాడిని జాగ్రత్తగా తీసుకెళ్లమని చెప్పారు.


ఆటోలోనుండి కిందకు దిగలేకపోతున్న తల్లిని చూసి గబ గబా కొడుకూ కోడలూ ఆటోదగ్గరకు వెళ్లి తల్లి ని ఇద్దరూ పట్టుకుని ఇంట్లోకి తీసుకొచ్చారు. "ఏమైందమ్మా" అని కొడుకు అడిగేసరికి చెప్పక తప్పలేదు. కొడుకు తల్లిని బాగా కోప్పడ్డాడు "నీకు పిసినారితనం ఎక్కువ అవుతోందంటూ". ఎక్సరే లు అవీ తీసాకా డాక్టర్ కాలువిరిగిందని నిర్ధారణ చేస్తూ పెద్ద సిమెంట్ కట్టువేసి ఆరువారాలు మంచం దిగకూడదంటూ ఆదేశించాడు. 


ఇంక వైదేహి కొంగు బిగించింది. వంటిల్లంతా ఘుమ ఘుమలాడే రక రకాల టిఫిన్స్, వంటలూ చేసేస్తుంటే సరోజిని తట్టుకోలేకపోతోంది. "ఇన్ని వంటలు ఎందుకు వైదేహీ, వంట నూనె ధర ఎలా పెరిగిపోయిందో తెలుసా?, అంటూ" సాదించడం మొదలు పెట్టింది. కొడుకుని పిలిచి వైదేహికి చెప్పమంది. 


" ఏమిటమ్మా చక్కగా చేసి పెడుతుంటే తినకుండా ఓ పొదుపో పొదుపో అంటూ బాధపడిపోతున్నావు"? డాక్టర్ చెప్పాడు కూడా, నీవు మంచి ఆహారం తింటేనే తొందరగా లేచి నడవగలవని. ఇప్పుడైనా బాగా తినమ్మా, వైదేహి నీకోసమే అంత కష్టపడుతుంటే నీవలా మాటి మాటికీ అంటుంటే తను బాధ పడుతుంది". 


వైదేహి అత్తగారి సాదింపులూ అవీ వింటూనే ఉంది. ఆ రోజు అత్తగారి గదిలోకి వచ్చి మధ్యాహ్నం భోజనం కంచం అత్తగారి మంచానికి దగ్గరగా ఉన్న టీపాయ్ మీద పెట్టి అత్తగారి గది కిటికీ తలుపులన్నీ బార్లా తెరిచింది. పక్కవాళ్ల పోర్షన్ కిటికీలోనుండి బాగా కనపడుతుంది.


"అదేమిటి వైదేహీ, అన్నం ఒక్కటీ పెట్టావు, ఆధరవులు ఏవీ" అంటూ అడిగింది. 


"ఆధరవులు ఎందుకత్తయ్యా? నేనొక బ్రహ్మాండమైన ఐడియా ఆలోచించాను. పక్కవాళ్లు గుత్తొంకాయ కూర సాంబారు చేసుకుంటున్నారు. వాటి వాసనలు తెరిచిన ఆ కిటికీ గుండా వస్తున్నాయి కదా. వాటిని ఆస్వాదిస్తూ ఆ వంటలను తలచుకుంటూ, వాటితోటే తింటున్నాననుకుంటూ ఆ అన్నాన్ని తినేయండి. బోలెడు డబ్బు ఆదా మన”కంటూ అక్కడ నుండి వెళ్లిపోయింది.


ఆరోజు మధ్యాహ్నం శ్యామల వచ్చింది. "నిన్ను చూసిపోవాలని వచ్చాను, ఎలా ఉన్నావదినా" అంటూ పరామర్శించింది.


ఏవో అవీ ఇవీ మాటలాడుతూ "సావిత్రి కుటుంబంతా ఎవరికీ చెప్పకుండా రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేసారు వదినా. నీకు తెలియదు కదూ"?

"ఏ సావిత్రి శ్యామలా"? 


 "అదే ఆ నల్ల సావిత్రి"!


"ఆవిడ కొడుకు ఏదో బిజినస్ చేస్తున్నాడుట కదా. పీకల లోతు అప్పులో మునిగిపోయాడుట. అప్పులాళ్లందరూ వచ్చి తన మీద తిరగపడతారన్న భయంతో రాత్రికి రాత్రి కుటుంబం మొత్తం ఇల్లు ఖాళీచేసి పరారీలో ఉన్నారుట. నీవు మంచానపడ్డావు, నీకోమాట చెప్పినట్టు ఉంటుందని వచ్చా”నంటూ జారుకుంది.


సరోజిని మెదడులో వేయి విమానాల విస్ఫోటకం. నాలుగు నెలల క్రితం నూటికి అయిదు రూపాయల వడ్డీ మీద లక్షరూపాయలు సావిత్రి తన దగ్గర అప్పు తీసుకుంది. ఆ లక్షరూపాయలూ గోవిందా అన్న మాట. నీ పిసినారితనమే నిన్ను ఈ దుస్తితికి తెచ్చిందని అంతరాత్మ తనని హేళన చేస్తుంటే ఆవేదనగా తలదించుకుని కూర్చున్న సరోజిని వైదేహి పిలుపుతో ఉలిక్కి పడుతూ తలెత్తింది. ప్లేట్ లో వేడి వేడి పకోడీలు, నెయ్యితో ఘుమ ఘుమ లాడుతున్న రవ్వకేసరి ని అత్తకు అందించింది. మౌనంగా అందుకుంది. 


"తింటూ ఉండండి అత్తయ్యా కాఫీ తెస్తా”నని వంటింట్లోకి వెళ్లింది.


వైదేహి పెట్టిన ఫలహారం తినబుధ్ది కాలేదు. డబ్బు పోయిందని తెలియగానే దుఖం తన్నుకొచ్చేస్తోంది. 

"ఒరేయ్ అంజూ, వైదేహీ ఒక్కసారిటురం”డంటూ వాళ్లను పిలిచింది తన గదిలోకి.


"ఏమైందమ్మా” అంటూ అంజూ వచ్చాడు.


వైదేహి కాఫీ తో వచ్చిఅక్కడే నిలబడింది.

దీనంగా కనపడుతున్న తల్లి కళ్లల్లో ఆగకుండా కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి.


"ఇప్పటివరకూ బాగానే ఉన్నారు కదా అత్తయ్యా, ఇంతలో ఏమైంది"?


"నేను దుబారా చేస్తున్నానని కంటతడి పెడ్తున్నారా? కడుపునిండా మనకిష్టమైన తిండి, బట్ట కట్టుకోకుండా పీనాసితనం ఎందుకత్తయ్యా? పీనాసిగా ఉన్నవాళ్లే ఏదో ఓరోజున ఎవరిచేతుల్లోనో ఘోరంగా మోసపోతారు".


"నిజమే వైదేహీ లక్షల కంటే విలువైన మాట చెప్పావు. నా పిసినారితనంతో మీ అందరి నోళ్లనూ కట్టేసాను. ఫలితం లక్షరూపాయలు గంగలో కలసిపోయింది. ఆ సావిత్రమ్మ కొడుక్కి లక్షరూపాయలు వడ్డీకిస్తే అప్పుల్లో మునిగిపోయి రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేసారుట". 


"అయినా అవేం పనులమ్మా? రోజూ టీవీ లోనూ న్యూస్ పేపర్లలోనూ ఇటువంటి వార్తలు చూస్తూకూడా ఎవరినీ అడగకుండా ఎలా చేసావు ఇటువంటి కక్కుర్తి పని"?


"అవునత్తయ్యా తక్కువ వడ్డీ అయినా బేంక్ లో ఫిక్సెడ్ డిపాజిట్ చేసుకుని ఉంటే మన డబ్బు క్షేమంగా ఉండేదికదా! ఇంకా ఎవరెవరికి వడ్డీలమీద అప్పులిచ్చారో చెప్పండి. నేను వెళ్లి వసూలుచేసుకొస్తాను". 


వైదేహి కున్న జ్ఞానం తనకి ఉండి ఉంటే ఆ లక్షా తన చేయి జారకుండా ఉండేది. ఆమెలో పశ్చాత్తాపం చోటుచేసుకుంది.


"ఇకనుండి ఈ ఇంటి వ్యవహారాలు, డబ్బు వ్యవహారాలు అన్నీ మీ ఇద్దరికీ అప్పగిస్తున్నాను. ఇకనుండి ఇటువంటి అప్రాచ్యపు పనులు చేయనురా అంజూ" అనేసరికి "అత్తయ్యా! ఎంత చక్కటి మాట చెప్పారు, రాత్రికి స్పెషల్ వంటలు చేస్తా”ననేసరికి అక్కడ నవ్వుల వాన విరిసింది.

 -- సమాప్తం--


యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :  

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.






54 views0 comments

Comentários


bottom of page