కనువిప్పు
- Neeraja Prabhala
- Mar 15
- 2 min read
#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #కనువిప్పు, #Kanuvippu, #TeluguKathalu, #తెలుగుకథలు

Kanuvippu - New Telugu Story Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 15/03/2025
కనువిప్పు - తెలుగు కథ
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
అప్పుడే బడినుంచి ఇంటికి వచ్చిన రవి, తల్లి జయ ఇచ్చిన స్నాక్స్ తిని, పాలు త్రాగి ఆడుకోవటానికి వెళ్ళాడు. జయ సాయంత్రం వంట పనులలో బిజీగా ఉంది.
ఆటలనుంచి రవి రాగానే "అమ్మా! ఆకలేస్తోంది. త్వరగా అన్నం పెట్టు" అంటాడు. ‘పిచ్చి వెధవ. ఆకలికి అసలు ఆగలేడు బిడ్డ’ అనుకుంది. భర్త శ్రీకాంత్ కూడా ఆఫీసు నుంచి వచ్చి భార్య ఇచ్చిన టీ త్రాగుతూ కాసేపు టి. వి. చూస్తున్నాడు.
ఇంతలో హఠాత్తుగా రవి "అమ్మా" అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు.
"ఏమైందిరా రవీ ! " అంటూ తల్లిదండ్రులు ఇద్దరూ గాభరాగా వచ్చి రవిని దగ్గరకు తీసుకున్నారు.
"కడుపులో నెప్పి" అంటూ పొట్టను పట్టుకొని విలవిల లాడసాగాడు. ఇంక ఇంటికి తాళం వేసి రవిని డాక్టరు వద్దకు తీసుకెళదామని ఆటోను పిలిచి ఆటోలో హాస్పిటల్ కు బయలుదేరారు శ్రీకాంత్, జయ. ఆటో కొంత దూరం వెళ్ళగానే "ఏప్రిల్ ఫూల్. మిమ్మల్ని ఫూల్ చేద్దామని అన్నాను నాన్నా ! మీరిద్దరూ నిజమని నమ్మేశారు. నాకేం కడుపు నెప్పి లేదు అమ్మా!" అన్నాడు రవి.
ఇద్దరూ ఒక్కసారిగా త్రృళ్ళిపడి ఆటోని వెనక్కి తిప్పించి ఇంటికి చేరారు రవితో.
రవి చేసిన పనికి ఇద్దరికీ పట్టరాని కోపం వచ్చినా తమాయించుకుని వాడిని దగ్గరకు పిలిచి "హాస్యం అన్ని వేళలా మంచిది కాదు. ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయద్దు. ఒకవేళ నిజంగా అయినా ఎవరూ నమ్మరు. నీకేమైపోయిందో అని ఎంత కంగారు పడ్డామో తెలుసా! ఇంక ఎప్పుడూ ఇలాంటివి సరదాగా కూడా చేయవోక" అని మందలించారు.
ఇద్దరూ రవికి ఏమీకాలేదని ఊపిరి పీల్చుకున్నారు. ఆరాత్రి అందరూ భోజనాలు చేసి పడుకున్నారు.
ఆమరుసటి రోజు యధావిధిగా కార్యకలాపాలు ముగించుకుని రవిని బడి వద్ద దింపి శ్రీకాంత్ ఆఫీసుకు వెళ్ళాడు.
మధ్యాహ్నం రవి క్లాసు టీచర్ సరళ శ్రీకాంత్ కు ఫోన్ చేసి రవి కడుపులో నొప్పి అంటున్నాడని చెప్పింది. శ్రీకాంత్ కు క్రితం రోజు రవి చేసిన అల్లరి పని గుర్తొచ్చి టీచరుకు జరిగింది చెప్పి "వాడు మళ్లీ ఆటపట్టిస్తున్నాడు. వాడిని జాగ్రత్తగా చూడండి. బడి అయినాక హాస్పిటల్ కు తీసికెళతాను. ఇప్పుడు ఆఫీసులో ఉన్నాను. ఆఫీసు అయ్యాక బడికి వస్తాను" అని ఫోన్ పెట్టేశాడు.
శ్రీకాంత్ చెప్పిందంతా విని సరళ కూడా రవి సరదాగా ఆటపట్టిస్తున్నాడనుకుని "కాసేపు పడుకో రవీ! తగ్గి పోతుంది" అని చెప్పింది.
కాసేపటికి "టీచర్! టీచర్! బాగా నెప్పిగా ఉంది." అని రవి మెలికలు తిరుగుతుంటే ఆవిడ కంగారుపడి ప్రిన్సిపాల్ కు చెపితే ఆయన రవిని హాస్పిటల్ లో జాయిన్ చేసి శ్రీకాంత్ కు ఫోన్ చేశాడు.
"రవిని దగ్గరలో ప్రశాంత్ హాస్పిటల్ కు తీసికెళ్ళండి. నేను ఇప్పుడే వస్తున్నా" అని హడావిడిగా హాస్పిటల్ కు బయలుదేరాడు శ్రీకాంత్.
డాక్టరు రవిని టెస్ట్ చేసి "ఇది అపెండిసైటిస్. అర్జంటుగా ఆపరేషను చేయాలి" అని చెప్పాడు.
శ్రీకాంత్ "సరే చేయండి." అనగానే డాక్టరు రవికి ఆపరేషన్ చేశాడు.
జరిగిన విషయం భార్యకు ఫోన్ చేసి చెప్పాడు శ్రీకాంత్. గాభరాగా వెంటనే హాస్పిటల్ కు వచ్చింది జయ. రవిని ఆపరేషన్ ధియేటర్ నుంచి రూమ్ లోనికి మార్చారు. మత్తుగా కళ్ళు మూసుకుని బెడ్ మీద పడుకుని ఉన్న కొడుకును చూసి తల్లడిల్లారు శ్రీకాంత్, జయ. కాసేపటికి రవి కళ్లు తెరిచి నెమ్మదిగా జరిగింది అర్ధం చేసుకున్నాడు.
రవి తలమీద చేయి వేసి నిమురుతూ "చూశావా రవీ! నిన్న నీవు సరదాగా అన్నావు. ఈరోజు నిజంగా నీకు కడుపునెప్పి వచ్చినా మేమెవరమూ నమ్మలేదు. ఎంత సీరియస్ అయిందో చూడు. హాస్యానికి కూడా ఒక హద్దు ఉంది. అది అన్నివేళలా మంచిది కాదు. ఇంకెప్పుడూ ఇలా ప్రాణాలతో చెలగాటమాడద్దు. సమయానికి హాస్పిటల్ కు తీసుకురాబట్టి బ్రతికావు." అన్న తల్లి తండ్రి మాటలకు కనులనుంచి నీరుకారుతుండగా "అమ్మా, నాన్నా! నన్ను క్షమించండి. ఇంకెప్పుడూ చేయను. మిమ్మల్ని బాధ పెట్టను " అన్న రవిని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు శ్రీకాంత్, జయ.
.. సమాప్తం ..

-నీరజ హరి ప్రభల
Profile Link
Youtube Playlist Link
Comments