top of page
Writer's pictureKiran Vibhavari

కనువిప్పు



'kanuvippu' written by Kiran Vibhavari

రచన : కిరణ్ విభావరి

'కనువిప్పు' తెలుగు కథ


ఆఫీసుకు వెళ్లే భర్త కోసం, స్కూల్ కి వెళ్లే పిల్లల కోసం తన జీవితాన్ని ధారబోసింది భార్య.

కానీ ఆమె కష్టాన్ని అతను గుర్తించ లేదు.

అతను రిటైర్ అయ్యాడు.

కనువిప్పు కలిగింది.

భార్య మనసు గుర్తించడం మొదలుపెట్టాడు.

ఈ చక్కటి కథను యువతరం రచయిత్రి కిరణ్ విభావరి గారు రచించారు.


" రా..ధా... కాఫీ...!" నేను కేకవెయ్యడం ఇది మూడోసారి. రాధ ఇంకా నిద్రలేవనట్టుంది. ఎప్పుడూ నేను అడగక ముందే కాఫీ కప్పుతో ప్రత్యక్షం అయ్యే రాధ ఈ రోజెందుకో ఇంకా లేవలేదు. చదువుతున్న పేపర్ పక్కన పెట్టి, తన దగ్గరకు వెళ్ళాను.


హాయిగా నిద్రపోతూ ఉన్న తనని అలా చూస్తుంటే నిద్రలేపాలని అనిపించలేదు. 'ఆ మాత్రం కాఫీ నేను కలుపుకోలేనా!' అనుకుంటూ కిచెన్ లోకి వెళ్లాను.


మార్కెట్ నుండి తెచ్చిన కాఫీ డబ్బా, లేబుల్ తో సహా ఉండటంతో పెద్దగా వెతుక్కునే పని లేకుండానే కాఫీ పౌడర్ దొరికింది. అయినా అనుమానం తీరక వాసన చూసాను. చురుకైన పరిమళం గుప్పుమంది. ఇక పాలు, పంచదారతో పాటు రెండు కప్పుల కాఫీ కలిపి నా భార్యామణిని లేపేందుకు వెళ్ళాను.


రిటైర్మెంట్ జీవితమిచ్చిన వెసులుబాటు ఇది. ఉరుకుల పరుగుల జీవితాన్ని అనుభవించి, ఇక మనకోసం మనం బతికే కొత్త కాలమిది. నిన్నటి వరకు ఆఫీసు ఒత్తిడిలో నేను పరుగులు తీస్తుంటే, నావెనుకే అన్నీ తానై అమర్చి పెట్టిన నా రాధ, హాయిగా పడుకుని ఉంది. ఎంత కాలమయ్యిందో ఆమె ఇలా సేదదీరి! ఆమెనే చూస్తూ పక్కన కూర్చున్నాను.


ఆమె పెద్ద పెద్ద లోతైన కళ్ళ చుట్టూ నీడల్లా అలుముకొన్న నల్లని వలయాలు, ఈ నలభై ఏళ్ల వైవాహిక జీవితంలో ఎన్ని ఆటుపోట్లకు లోనైందో చెప్పకనే చెబుతున్నాయి.


"ఐ యాం సారి రాధ" ఆమె నుదుట పులుముకున్న తిలకాన్ని ప్రేమగా ముద్దడుతూ చెప్పాను.


ఆమె ఒక్కసారిగా కళ్ళు తెరిచి, అనుమానంగా చూసింది.


నా గడ్డం గుచ్చుకుందేమో, నన్ను వెనక్కి తోసి, "ఈ వయసులో ఇదేం చోద్యం" అంటూ లేచి కూర్చుంది.


నేను కాఫీ కప్పు అందించాను.

"అబ్బో..కాఫీనే.. మీరే..!!" అంటూ మూతి అష్టవంకర్లు తిప్పుతూ కాఫీ అందుకుంది.


"నన్ను లేపకపోయారా?" కాఫీ సువాసనలను ఆస్వాదిస్తూ అడిగింది.


నేను తొలిసారిగా పెట్టిన కాఫీ అది. పరిమళానికే మత్తు వదులుతోంది. జిహ్వ లాగేస్తోంది. తను తాగి, రేటింగ్ ఇచ్చేవరకు తాకకూడదని, తననే ఆతృతగా చూస్తూ ఉన్నాను.


కాఫీ తాగిన మనిషల్లా ఒక్కసారిగా లేచి వాష్ బేసిన్ దగ్గర కాఫీ ఉమ్మి వచ్చింది. నాకు చిర్రెత్తుకొచ్చింది. ఇప్పుడిప్పుడే పని నేర్చుకుంటున్న పిల్లాడిని అలా అవమానించడం తగునా?


నేను పరుషంగా చూస్తూ ఉంటే, "తమరు తాగారా సార్?" వ్యంగ్యంగా ప్రశ్నించింది.


చిన్న పిల్లాడిలా తల అడ్డంగా ఊపాను. అన్నీ కరెక్ట్ గానే వేశాను. ఏదైనా తేడా కొట్టిందా? అనుకుంటూ తాగడానికి సంశయిస్తూ, కాఫీ మూతి దగ్గర పెట్టుకునే లోపు లాగేసుకుని కిచ కిచా నవ్వింది.


"ముసలి పిచ్చుక!" నేను అరిచాను. ఈ మధ్య కోపం వస్తే, నేను అనే మాట అదే.

"అబ్బో మీరో పడుచు కుర్రాడు మరి. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు నా మీదనా మీ తిక్క ప్రయోగాలు?" అంటూ కాఫీ తీసుకెళ్ళి, పారబోసింది.


నాకు మండింది. "ఏం లోపమ్మంటా నా కాఫీకి?" నేను అరిచినట్టే అడిగాను.

తానేం జవాబివ్వక, మరొక కాఫీ కలిపి నాకు అందిస్తూ, "దీన్ని కాఫీ అంటారు. దాన్ని కాదు" అంటూ మూతికి చెయ్యి అడ్డం పెట్టుకొని నవ్వింది. నేనా కప్పు పక్కన పెట్టేసి నా గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాను.


మరి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థికి తానెందుకు ఫెయిల్ అయ్యాడో చెప్పాలి కదా. నేను నా ప్రతి విద్యార్థినీ పక్కకు పిలిచి వారి లోపాలు వారికి వివరించి చెప్పి, సరిదిద్దే వాడిని.


కానీ రాధ అలా కాదు. నీ తప్పు నువ్వే తెలుసుకో అంటుంది. ఇప్పుడు నేను చేసిన తప్పు ఎలా తెలుసుకునేది. మొత్తం కాఫీ సింకు పాలు చేసిందిగా! డ్రైనేజీలో కూడా కలిసి పోయి ఉంటుంది నా కాఫీ. మొదటి సారి పెట్టిన నా కాఫీకి ఆ దుస్థితి చూసి రోషం పొంగుకు వచ్చింది.


"ఇదేనా నీ మొదటి తప్పిదం? ఇంకే తప్పు చెయ్యలేదా ?" ఎందుకో నా మనసు ఈ ఏకాంతంలో ఒక్కసారిగా నన్ను ప్రశ్నించింది.


"ఛీ..ఇంత చెండాలమైన కూర నేనెప్పుడూ తినలేదు. మా అమ్మను చూసి నేర్చుకో. అమృతంలా వండి పెడుతుంది." అమ్మ ముందే రాధను తిట్టడం లీలగా గుర్తుకు వచ్చి మనసు బరువెక్కింది.


తనకు మాత్రం బాధేసి ఉండదా? తనకీ వంట చేయడం అప్పట్లో కొత్తే కదా. కాస్త సహనంతో బాగుంది అని చిన్న అబద్దం నేను చెప్పుంటే, రాధ కూడా ఆ కూర తిన్నప్పుడు తన తప్పు తానే తెలుసుకునేది కదా. రాధే కరెక్ట్ మళ్లీ నా మనస్సు రాధనే సపోర్ట్ చేసింది.


ఆ ఒక్క అబద్దం నేను ఆడలేకపోయాను.. కానీ జీవితంలో ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పానో లెక్కే లేదు. అవి అబద్దాలు అని తెలిసి కూడా రాధ ఎప్పుడూ తనని నిలదీయలేదు. నా తప్పు నేనే తెలుసుకునే వరకూ మౌనంగా ఉండిపోయింది. కానీ తప్పు తెలుసుకున్నానా? నేను ఆలోచనల్లో పడ్డాను.


"ఏవండీ..ఈ సాయంత్రం తొందరగా ఇంటికి రండి. ఇద్దరం కలసి బజారుకు వెళదాం." తను ఎన్నో సార్లు అడిగింది.


నాకా బజారుకు వెళ్లి, ఆ మురికి మార్కెట్ లో కూరగాయల సంచులు మోసుకుంటూ రావడం అస్సలు నచ్చదు. తనకేమో ఇంట్లో కుదరని మా ఏకాంతం బయట వెతుక్కోవాలనే ఆరాటం.


"అబ్బే.. ఈ సాయంత్రం చాలా పని ఉంది రాధ. పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా. పిల్లలకు ఎక్స్ట్రా క్లాసులు తీసుకోవాలి" నేను తరచుగా చెప్పే సాకు.

"ఎన్ని సార్లు ఎక్స్ట్రా క్లాసులు ఉంటాయండి? ఎక్స్ట్రా జీతం కూడా ఇస్తారా?" తనూ ఎప్పుడూ అడిగే ప్రశ్న.

"ఎక్స్ట్రా క్లాసులు తీసుకోవడం నా బాధ్యత. దానికి డబ్బులేవీ ఉండవు. ఎందుకర్థం చేసుకోవు? ఎన్ని సార్లు చెప్పాలి?" నేనిలా చిరాకు పడటం కూడా మామూలే.


"అవును బాధ్యత నిర్వహణకు జీతం ఉండదు కదా!" తను ఎప్పుడూ తలదించుకుని చెప్పే మాటల సారం నాకిప్పుడు అర్థం అవుతోంది.


ఎన్నో బాధ్యతల బరువును మోస్తూ, జీతం లేని కూలీగా మా ఇంటిల్లిపాదికీ సేవలు చేసింది. ఏనాడూ సెలవు తీసుకోలేదు. కాదు కాదు తామే సెలవు ఇవ్వలేదు. అయినా ఇంటిని, సంసారాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు తన రక్తాన్ని ధార పోసింది.


అందం అంటే గుర్తుకు వచ్చింది ఆమెకు సంబంధించినవన్నీ నాకు అందంగా ఉండాల్సిందే. లేదంటే నాలోని కవికి ప్రేరణ కరువే కదా.


ఉదయాన్నే లేచి , నా ఇంటి ముంగిట వివిధ భంగిమల్లో అందమైన రంగవల్లులు వేసి, ఆపై తలారా స్నానం చేసి, నుదుటిన ఇంత తిలకం దిద్ది, కొప్పులో కనకాంబర మాలతో కస్తూరి పరిమళంతో, ఆమె కాలి అందియలు చేసే సునిశిత ధ్వనులతో నాకు కాఫీ అందించే నా రాధ నా భావుకతను వెయ్యింతలు చేసేది.


ప్రకృతి కాంతతో మమేకమవుతూ, సూర్యోదయపు అందాలను కళ్ళల్లో బందిస్తూ, వెచ్చని కాఫీ గొంతులో పడుతూ ఉంటే, అది భూతల స్వర్గమే కదా! "కానీ ఆ స్వర్గానికి రాధ ఎప్పుడైనా నోచుకుందా?" మళ్లీ నా మనస్సు నన్ను ప్రశ్నించింది.


లేదు..ఎప్పుడూ ఉరుకుల పరుగుల జీవితమే తనది. పొద్దున్నే ఇల్లూ వాకిలి చిమ్మి, ఇంటిని అలంకరించే పనంతా ముగించి, ఇంటిల్లపాదిని నిద్ర లేపి, అందరి అవసరాలు తీర్చి, పూజలకు నైవేద్యాలు సిద్దం చేసి, కారియర్లు కట్టి, మమ్మల్ని మా నెలవులకు పంపి, ఇంట్లో తానొక్కతే ఒంటరిగా మేమొచ్చే వరకూ చకోర పక్షిలా ఎదురు చూస్తూ, మాకోసం మళ్లీ అన్ని సిద్ధం చేసి, మేము రాగానే కర్తవ్యోన్ముఖురాలై అన్నీ అమర్చి పెట్టే జీతం లేని కూలీ. కాదు కాదు "మా "ఇంటికి నమ్మిన బంటు.


"ఇదే జీవితాన్ని నువ్వొక హోటల్ లో గడిపితే, ఒక్కరోజుకైనా నీ జీతం సరిపోతుందా? " నా మనస్సు నన్ను ప్రశ్నించింది.


ఎంత కాదన్నా ఇది మా ఇల్లే. నాది, మా అమ్మా నాన్నది, నా పిల్లలదీనూ. ఎందుకంటే ఎన్నో సార్లు తన మీద కోపంతో తన పుట్టింట్లో వదిలి రాలేదూ! పాపం ఆ పుట్టిల్లు కూడా తనిది కాదాయే. వారు కూడా తనని మళ్లీ మా దగ్గరే దింపి వెళ్ళేవారు. ఇంతకీ తన ఇల్లెంటో తెలియక పోయినా ఈ ఇంటిని అందంగా తీర్చి దిద్దిన రాధను తల్చుకుంటే అప్రయత్నంగానే కన్నీటి చుక్క జాలువారింది.


"ఛీ మగవాడిని. నేనేడ్వడమా?" నాలో పాతుకు పోయిన జాడ్యం నా అశ్రువులను నా చేత తుడిపించింది. అయినా ఎందుకో బరువెక్కిన గుండెతో ఉండలేకపోతున్నాను. కన్నీటి చుక్కలు వరస కట్టి, గుండెల్లోని పశ్చాత్తాపం కన్నీళ్ళతో కారిపోతూ ఉంది.


తన తప్పేమీ లేకున్నా, తనని నేను నానా మాటలు అన్న రోజు , రాధ కూడా ఇంతే ఏడ్చింది.


మంచం పక్కనే ఉన్న మా ఫ్యామిలీ ఫోటో చేతుల్లోకి తీసుకుని రాధ చిత్రాన్ని ఆప్యాయంగా తడిమాను. కెంపుల్లా మెరిసేటి ఆ బుగ్గలు నా ముద్దులతో పాటు, నా అహంకారపూరిత దెబ్బలూ అనుభవించాయి.


"అమ్మ చేసిన తప్పేంటి నాన్న?" చిత్రంలో నా పక్కనే నిల్చున్న చిన్నోడు నన్ను ప్రశ్నిస్తున్నట్టు అనిపించింది.


"నువ్వే రా.. నీవల్లే మీ అమ్మను కొట్టాను రా" నేను వాడిని చూస్తూ అన్నాను.


అవును వాడి మూలానే మొదటి సారి రాధ మీద చేయి చేసుకున్నాను. అదే ఆఖరిసారి అయినా కూడా ఎందుకో నాకా సంఘటన ఎదలో రగిలే జ్వాలలా ఎప్పుడూ నన్ను కాలుస్తునే ఉంటుంది.


తన ఆశల్ని ,కలల్ని అన్నిటినీ బలవంతంగా లాగేసి తనను తానే మర్చిపోయేలా , తనకంటూ అస్తిత్వాన్ని మిగల్చకుండా, కట్టు బానిసను చేసి పడేసాను.


మా పెళ్ళైన కొత్తలో రాధ కూడా జాబ్ చేసేది. పెద్దోడు కడుపున పడ్డాక మానేసినా, చిన్నోడు పుట్టి, కొంత నడకలు నేర్చాక మళ్లీ జాబులో కొనసాగింది. ఆమె చేసే ఉద్యోగం నా లెక్చరర్ గిరీ అంత పెద్దది కాకున్నా, ఆమె జీతం డబ్బులు నాకూ అక్కరకు వచ్చేవని నేను ఒప్పుకున్నాను. అయినా ఆమె జాబు చెయ్యడానికి నా పర్మిషన్ ఎందుకో నాకు తెలియదు. కానీ ఆవిడ నన్ను బతిమాలి, బుజ్జగించాకే ఒప్పుకున్నాను.


మా పెద్దోడు చదివే స్కూల్లోనే ఒక ఎలిమెంటరీ టీచరుగా చేసేది. పొద్దున్నే లేచి ఇంటి పనంతా ముగించి, చిన్నొడిని అమ్మ దగ్గర వదిలి, తను పెద్దోడితో కలిసి స్కూలుకు వెళ్లిపోయి, మళ్లీ సాయంత్రం రాగానే అలసట అనే మాటే లేకుండా అన్నీ సమకూర్చి పెట్టేది.


కాలం కలకాలం ఒకేలా ఉండదన్నట్టు, ఓ రోజు మా అమ్మ చేతిలో నుండి మా చిన్నోడు జారీ , గుమ్మానికి కొట్టుకుని నుదుటిన పెద్ద దెబ్బ తగిలి , రక్తం ఏరులా పారుతోంది అని కాలేజ్ లో ఉన్న నాకు మెసేజ్ రాగానే హుటాహుటిన బయలు దేరాను. అప్పటికే రాధ కూడా స్కూల్ నుండి వచ్చేసి, ఆసుపత్రి ముందు పడిగాపులు కాస్తూ నిల్చుంది.


నన్ను చూడగానే చంటి పాపలా చుట్టుకుపోయి ఏడ్చింది.


కానీ నేనేం చేశాను?! ఆ మెలిపడుతున్న తల్లి హృదయానికి బాసటగా నిలవాల్సింది పోయి, అందరూ చూస్తున్నారన్న ఇంగితం లేకుండా తన చెంప చెళ్లుమనిపించాను.


ఆమె అయోమయంగా చూసింది. తనకూ చేతులు ఉన్నాయి. అదే ఉక్రోషంతో తనూ నన్ను ఒక్క దెబ్బ వేసుంటే, నాలోని అహంభావి చచ్చి ఉండేవాడు. కానీ తానలా చెయ్యలేదు.


ఏమైందని చూపులతోనే బేలగా ప్రశ్నించింది.


"నీ వల్లే నా కొడుకిలా చావుబతుకుల మధ్య ఉన్నాడు. పిల్లల్ని వదిలి నువ్వు దేశాలు ఏలడానికి ఉజ్జోగం వెలగబెట్ట బట్టీ, వాడిలా దెబ్బలు తిన్నాడు. కొడుకుని కనిపారేస్తే సరిపోద్దా.. వాడిని జాగ్రత్తగా చూసుకోనవసరం లేదా! " నేను తారా స్థాయిలో అరుస్తూ ఆమెను నిందించాను. నాకొడుకు తన కొడుకు కాదన్నట్టు. నేనేదో త్యాగం చేసినట్లు తనని అనరాని మాటలు అన్నాను.


ఆసుపత్రిలో జనాలందరూ మమ్మల్నే చూస్తుంటే, రాధ తలదించుకు నిల్చుంది.


"అయ్యా..నా కొడుకుకి కూడా దెబ్బలు తగిలాయి . నేను ఉద్యోగం చెయ్యను. వాడినే కనిపెట్టుకు ఉన్నా, అయినా మెట్ల మీద నుండి జారిపోయాడు. ఏదీ మన చేతుల్లో ఉండదు కదా అయ్యా.. దాన్నే ప్రమాదం అంటారు కదా..."అంటూ ఇంకేదో చెబుతూ, ఎవరో ఒకావిడ కలగజేసుకోజూసింది. నేనావిడ మాట్లాడుతుండగానే మధ్యలో వెళ్ళిపోయాను.


ఆ తర్వాత మా చిన్నోడు ప్రాణాలతో బయట పడ్డాడు కానీ కనుబొమ్మ మీద లోతైన గాటు మిగిలిపోయింది. ఇప్పటికీ ఆ గాటును చూస్తూ రాధ తనని తాను నిందించుకుంటూ ఉంటుంది.


కానీ ఆ గాటుతో పాటు మిగిలిపోయిన తన లోటును మాత్రం బయటకెన్నడూ తలచుకోలేదు.


చిన్న పిల్లలకి చదువు చెబుతూ , తన కాళ్ళ మీద తాను నిలబడాలని ఎంతగానో ఉవ్విళ్ళూరిన రాధ ఆశల కాళ్ళు నిర్దాక్షిణ్యంగా నేను విరగ్గొట్టాను.


రాధ ఉద్యోగం మానేసి, ఇంటి పట్టునే ఉండి నన్ను, నా తల్లిదండ్రులను, నా పిల్లలను కనిపెట్టుకుని సేవలు చేస్తేనే తనని ఏలుకుంటానని తెగించి చెప్పడంతో, ఆమె పుట్టింటి వారు నచ్చజెప్పిన మాటలతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి, మొత్తానికే మాకు అంకితం అయిపోయింది.


తన ఆశలు, ఆశయాలు, కలలు, చివరికి తన అసిత్వాన్నీ బలవంతంగా లాగేసుకుని, ఆ పిచ్చిదానికి ఏమీ మిగల్చకుండా, ఇంటిని కాపాడుకోవడమే ఆనందం అన్నట్టు తనని ఏమార్చి, మేము మా లక్ష్యాలు సాధించుకున్నాం. తనని ఆలంబనగా చేసుకొని, జీవితపు శిఖరాలు అధిరోహించాం. కానీ మా మజీలిలో ఆమె స్థానం మాత్రం ఏదో మూల పడేసి, ఇది నీ బాధ్యత. ఆ బాధ్యతను చక్కగా నిర్వర్తించావు అంటూ మెచ్చుకోలు బహుమతిగా పడేస్తే, ముసి ముసిగా నవ్వుతూ మురిసిపోయే ముసలమ్మ అయిపోయింది.


ఈనాడు సంఘంలో నాకున్న గౌరవం, నా కొడుకులు అందుకున్న హోదా, మా అమ్మానాన్న మలి దశ హాయి వీడ్కోలు...ఇవన్నీ తన సహకారం తోనే సాధ్యం అయ్యాయి. నిజానికి ఈ సమాజం సవ్యమైన దిశలో నడుస్తున్నందుకు నా రాధలాంటి, ఎందరో నిశ్శబ్ద కార్మికులైన గృహిణులు కారణం కాదూ! ఇవన్నీ వారు పెట్టిన బిక్షే కదా! అయినా ప్రతీ పైసాకి మమ్మల్ని అడిగే బిచ్చగత్తేలను చేసేసాం.


నా వి.ఆర్ చెక్కు గాలికి రెపరెపలాడుతూ, నన్ను మరింత వెక్కిరించింది. ఇన్నేళ్ళు ఒక్క లీవు లేకుండా జాబు చేయగలిగానంటే, దానికి కారణం రాధ కదూ! నన్నూ నా కుటుంబాన్ని కాపాడుతూ, ఆమె చేసిన సేవల ఫలితమే కదా. ఈ చెక్కు అందిన వెంటనే ఆమెకివ్వకుండా, కొడుకు వ్యాపారం కోసం దాచి పెట్టాను. నిజానికి ఆమైనా వాడికే ఇస్తుంది. అయినా ఆమెకు మాట మాత్రమైనా చెప్పక, అంతా నా శ్రమ దానమే అన్నట్టు నేనే ముఖ్య కర్తను అవ్వాలని అనుకున్నాను.


నేను చేసిన తప్పులను, నేనీ ప్రపంచం విడిచి వెళ్లేలోపైనా సరిదిద్దుకోవాలి. ఒక నిశ్చయానికి వచ్చి,

కన్నీళ్లు తుడుచుకున్నాను. నా రాధను ఆమె జీవితం ఆమె జీవించేలా చెయ్యాలి. తనలో అడుగంటిన ఆశలను సజీవంగా మార్చాలి. ఇన్నాళ్లూ ఆమె నుండి లాక్కున్న దానిని ఆమెకు తిరిగివ్వాలి. ఆమె విలువ ఆమెకు తెలిసేలా చేయాలి. ఆమె చేతుల మీదగా, ఆమె విలువను నిలుపుతూ ఇప్పించాలి.


ఈ ఏకాంతం నాలో అకస్మాత్తుగా రేపిన అంతర్మథనం, నన్ను పరిశుద్దున్ని చేసింది. నా పాపాలను కడిగేసుకునే వెసులుబాటు కల్పించింది. ఒక్క కాఫికే నాలో జ్ఞానోదయం అయిపోయిందా అని ఎవరైనా అడిగితే నేను చెప్పేది ఒక్కటే. ఋషిపుంగవుల ఓకే మాటకు రత్నాకరుడు వాల్మీకిగా మారినప్పుడు, నాలో ఆత్మ విమర్శ కలగడానికి ఒక్క క్షణం చాలదా! అయితే నన్ను నేను మార్చుకోడానికి కొంత సమయం పడుతుందేమో! కానీ ఈ దేహం మట్టిలో కలిసిపోయే లోపు నన్ను నేను మార్చుకుని తీరాలని దృఢంగా నిర్ణయించుకున్నాను.


"ఏవండోయ్..శ్రీవారు.. టిఫిన్లు వద్దా!! పెసరట్టు , అల్లం చట్నీ. అదిరిపోయింది. అలక చాలించి బయటకు దయచేయండి.." తలుపు కొడుతూ రాధ కేక వేసింది.

నేను మొహం కడుక్కుని, తలుపు తీసి, ఆవిడ మొహం చూడకుండా, టేబుల్ మీద పెట్టిన పెసరట్టు తినడం స్టార్ట్ చేసాను.


"ఏ..డ్చా...రా?" నా మొహంలో మొహం పెట్టీ గుడ్లప్పగించి నన్ను చూస్తూ సాగదీస్తూ అడిగింది. నా మనసును భలే కనిపెట్టేసింది నా జీవన సహచరి. ఆమె చూపుల్ని తప్పించుకుంటూ నేను మొహం తిప్పుకున్నాను. అమాంతం తనని హత్తుకుని సారీ చెప్పాలని అనుకున్నా, ఇంకా ఏదో అహం నన్ను అడ్డుకుంటోంది. ఇన్నేళ్ళు నాతో సహవాసం చేసిన నా అహంకారం అంత తొందరగా పోయేలా లేదు.


నేనేం బదులివ్వకుండా, పెసరట్టు తినడం ముగించాను.

"అయ్యో రామా..ఏంటి కాఫీకే ఏడుస్తారా? ఇదేం చోద్యం?" బుగ్గలు నొక్కుకుంది.


ఆ చేతులు పట్టుకుని, ఇంతకాలం ఇన్ని సేవలు చేసినందుకు "థాంక్స్" చెప్పాలనుకున్నా ఎందుకో మాట పెదవి దాటటం లేదు. తప్పును ఒప్పుకోవాలంటే ధైర్యం ఉండాలి. అదీ తన తప్పు తానుగా తెలుసుకున్నప్పుడు, ఆ పశ్చాత్తాపం గుండెల్ని పిండేస్తుంటే చాలా నిబ్బరం కావాలి.


ఆవిడింకా నన్ను అయోమయంగా చూస్తూ, నేను తిన్న కంచం అందుకోడానికి ఓపిక లేకున్నా మోకాలు పట్టుకుని నిల్చుంది. నేను కంచం తీసుకుని వెళ్తుంటే లాక్కోబోయింది. నేనివ్వలేదు.


"ఇక నుండి నా పనులు నేనే చేస్తా, నా బట్టలు నేనే ఉతుక్కుంటా, నా కంచం నేనే కడుక్కుంటా.. "ముక్కుపుటాలు ఎగరేస్తూ చెప్పాను. అదేమీ కోపంతో కాదు. నాలో గూడు కట్టుకున్న అపరాధ భావనతో చెప్పాను.


అవును మరి నాకూ కాళ్లూ చేతులూ ఉన్నాయి. నాకూ బలం ఉంది. అయినా నా పనులన్నీ ఆమె చేస్తుంది. చిన్నప్పుడు అమ్మ చేసేది. ఇప్పుడు రాధ. స్త్రీ ఎప్పుడూ పురుషుడికి సేవలు చేస్తూ ఉండాలా? నన్ను నేను ప్రశ్నించుకుంటూ, కంచం కడిగి పెట్టాను.


రాధ రాగాలు తీస్తోంది.. నేను ఆమె మీద అలిగానట.


ఎలా చెప్పను తనకి? నా మీద నేనే అలిగానని. నన్ను నేను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానని...

***శుభం***

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : కిరణ్ విభావరి

నేను ఇప్పటి వరకూ 33 కథలూ, 4 కవితలూ రాశాను. నేను రాసింది నాలుగు కవితలే అయినా అన్నిటికీ విశిష్టమైన బహుమతులు అందుకున్నాను. NATA, NATS, జాషువా కవితా పురస్కారాన్ని అందుకున్నాను. కథల పోటీలలో కూడా తెలుగు తల్లి కెనడా అవార్డ్, స్వేరో టైమ్స్ పత్రిక వారి పోటీలో ప్రథమ బహుమతి, mom'spresso వెబ్సైట్ లో అత్యుత్తమ బ్లాగర్ గా, ఇంకా మరెన్నో పోటీల్లో బహుమతులు పొందుకున్నాను. నా కథలు ప్రముఖ పత్రికల్లో ప్రచురితం అయ్యి, ఎందరో పాఠకుల మన్ననలు పొందాయి. ముఖ్యంగా నేను రాసిన కాఫీ పెట్టవు కథ social media లో వైరల్ అయ్యి, ప్రముఖ FM radio లో, అల్ ఇండియా రేడియోలో ప్రసారం అయ్యింది.

Saho, విశాలాక్షి, సినీ వాలి పత్రికల పోటీలలో ప్రథమ బహుమతి వచ్చింది. మల్లె తీగ కవితల పోటీలో విశిష్ట బహుమతి అందుకున్నాను. కొత్త వెలుగు అనే కథల సంకలనం ప్రచురించాను






177 views0 comments

Comments


bottom of page