top of page

కొత్త కెరటం! ఎపిసోడ్ 6


'Kotha Keratam Episode 6' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi

'కొత్త కెరటం! ఎపిసోడ్ - 6' తెలుగు ధారావాహిక

రచన: దినవహి సత్యవతి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


అచ్యుతాపురం గ్రామంలోని ఒక మోతుబరి రైతు రామయ్య, ఆయన భార్య జానకి. వారి కుమారుడు రాజేంద్ర, కోడలు కళ్యాణి. డెలివరీ కోసం అడ్మిట్ అయిన కళ్యాణి పరిస్థితి సీరియస్ అని చెబుతారు డాక్టర్లు.


హాస్పిటల్ లో సూరజ్ అనే వ్యక్తి తారసపడతాడు రాజేంద్రకి. తాను రామయ్య గారి సహాయంతో చదువుకున్నానని చెబుతాడు అతను.


రాజేంద్ర భార్య క్షేమంగానే ఉందనీ, పుట్టిన బిడ్డ మరణించిందనీ చెబుతాడు డాక్టర్. తనకు కొడుకు పుట్టి రెండు రోజులే అయిందనీ, డెలివరీ కాగానే తన భార్య చనిపోయిందనీ చెబుతాడు సూరజ్.


తాను అమెరికా వెళ్ళిపోతున్నట్లు చెబుతాడు. తన కొడుకును పెంచుకొమ్మని రాజేంద్రతో చెబుతాడు సూరజ్.


హాస్పిటల్ కి వచ్చిన తన తలిదండ్రులకు సూరజ్ కొడుకునే తన కొడుకుగా చెబుతాడు రాజేంద్ర. సమయం చూసుకొని భార్యకు నిజం చెబుతాడు రాజేంద్ర. ముందు బాధపడ్డా సూరజ్ కొడుకుని స్వంత బిడ్డలా చూసుకుంటానంటుంది అతడి భార్య కళ్యాణి.

రామయ్యకి మనవడితో అనుబంధం పెరుగుతుంది.


ఇక కొత్త కెరటం! ఎపిసోడ్ - 6 చదవండి.


రాజేంద్ర చేస్తున్న ఉద్యోగం మారి, పదోన్నతిపై ఒక బహుళ జాతీయ కంపెనీలో చేరాడు. కళ్యాణి కూడా తాను చేస్తున్న కంపెనీలోనే ఉన్నత పదవి అధిరోహించింది.


ఆఫీసుకి దగ్గరగా ఉన్న, సుమారు మూడువందల ఫ్లాట్స్, రో హౌసెస్, విల్లాలున్న, ఆనందనిలయం కాలనీలోని ఒక మూడు బెడ్ రూముల విల్లా కొనుక్కున్నారు రాజేంద్ర దంపతులు.


కొడుకు గృహప్రవేశానికని హైదరాబాదు వచ్చారు రామయ్య.

కాలనీలోనే పేరొందిన సి. బి. ఎస్. ఇ. స్కూలు ఉండడంతో, ఎలిమెంటరీ స్కూలు దాటి హైస్కూలు చదువులకి వచ్చిన భార్గవని అందులో చేర్పించారు.


క్రొత్త స్కూలూ, క్రొత్త వాతావరణం, క్రొత్త ఫ్రెండ్స్ కీ అలవాటు పడడానికి ప్రయత్నం చేస్తున్నాడు భార్గవ.


ఆరవ తరగతి అర్థ సంవత్సర పరీక్షలు ముగిశాయి.

ఒకరోజు స్కూలునుంచి వచ్చీ రాగానే, తాతగారు నవ్వుతూ పలకరించినా బదులివ్వక ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయాడు భార్గవ.

‘ఎందుకలా ఉన్నాడో! స్కూలులో ఏదైనా జరిగుంటుందా?’ కలవరపడ్డారు రామయ్య.


ఏం చేయాలో పాలుపోక ‘అబ్బాయీ కోడలూ ఇంకా ఆఫీసునుంచి రాలేదు. భార్గవకి తోడు ఇంట్లో నేనున్నానే ధైర్యమో లేక ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటోందో తెలియదు కానీ ఈమధ్య ఇద్దరూ కొంచం ఆలస్యంగా వస్తున్నారు’ స్వగతంగా అనుకున్నారు.


కొంతసేపయ్యాక మనవడి గదిలోకి తొంగిచూసారు ఏం చేస్తున్నాడా అని!


ఏడ్చిఏడ్చి నిద్రపోయాడేమో భార్గవ బుగ్గలపై కన్నీటి చారికలు చూసి కలత మనస్కులయ్యారు.


సుమారు ఓ గంట తరువాత బయటకి వచ్చి, సోఫాలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్న తాతగారి ప్రక్కన కూర్చున్నాడు భార్గవ, ముఖం వ్రేలాడేసుకుని.


మనవడికి వేడి వేడి బోర్నవిటా కలిపిచ్చారు రామయ్య.

గటగటా త్రాగేసి గ్లాసు ప్రక్కన పెట్టి “థ్యాంక్స్ తాతయ్యా” అన్నాడు.


మనవడి నోట్లోంచి మాట వస్తే చాలు విషయం ఆరా తీద్దామని ఎదురుచూస్తున్న రామయ్య వాడ్ని దగ్గరకు తీసుకుని “ఏమైందిరా బాబూ నాకు చెప్పవూ?” ఆప్యాయంగా అడిగారు.

“మరేమో క్లాసులో నా వెనక బెంచీలో కూర్చున్న రోహిత్ నా చొక్కా మీద పెన్నుతో గట్టిగా గుచ్చాడు” వెనక్కి తిరిగి చూపించి మళ్ళీ ఏడుపు మొదలెట్టాడు.


“అయ్యో అదేమి ఆకతాయితనంరా?” భార్గవ చూపించిన చోట చొక్కా తొలగించి చూస్తే చిన్న గాయమైయ్యుంది.

గబగబా వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి శుభ్రం చేసి ఆయింట్మెంట్ వ్రాసి “మరి నువ్వు వద్దని చెప్పలేదా?” అన్నారు.


“చెప్పాను అయినా మళ్ళీ మళ్ళీ అలాగే చేసాడు. నాకు బోలెడంత ఏడుపు వచ్చింది”


“క్లాస్ టీచర్ కి చెప్పలేకపోయావా?”


“అమ్మో! అలా చెప్తే తర్వాత మళ్ళీ ఎక్కువ ఏడిపిస్తాడు”

“ఛ! ఛ! అలా ఎందుకు చేస్తాడ్రా?”


“నిజం తాతగారూ! నన్ను ఏడ్పించాడని చెప్పానే వాడే, ఇంతకుముందు ఒకసారి రమేష్ ని కూడా ఏడిపిస్తే, వాడేమో టీచర్ కి చెప్తే, ఆ తర్వాత వాడిని లంచ్ టైం లో పట్టుకుని కొట్టాడుట. ఇంకోసారి చెప్తే ఇంకా గట్టిగా కొడతానని బెదిరించాడుట”


“ఓరినీ! అలా అంటే రమేష్ ఊరుకున్నాడా?”


“ఏం చేస్తాడు మరి! వాడికి అసలే చాలా భయం”


“అయ్యో భయపడితే ఎలాగరా ధైర్యంగా ఉండాలిగానీ”


“ఏమో అదంతా నాకు తెలియదు తాతయ్యా”

అయోమయంగా ముఖం పెట్టాడు.


“ఊ.. సర్లే! వాడి సంగతి ప్రస్తుతానికి ప్రక్కన పెట్టి నీ సంగతి చెప్పు. ఇప్పుడేం చేద్దాం? పోనీ నన్ను గానీ అమ్మానాన్నలని గానీ స్కూలుకి వచ్చి మీ టీచర్ తో మాట్లాడమంటావా?”


“అమ్మో వద్దు వద్దు. టీచర్ కి కోపం వస్తే నాకు మార్కులు వెయ్యరు”


“ఊరుకోరా నువ్వు మరీను! టీచర్ ఎందుకు అలా చేస్తారు?”

“మీకు అస్సలేం తెలియదు తాతగారూ. ఈ స్కూల్లో అలాగే చేస్తారు. ఇందాక రమేష్ అని చెప్పానే వాడు తర్వాత పేరెంట్స్ కి చెప్పాడు. వాళ్ళేమో హెడ్ మాస్టర్ కి కంప్లైంట్ చేసారు. ఆయనేమో క్లాస్ టీచర్ ని పిలిచి కోప్పడ్డారు క్లాస్ సరిగ్గా చూసుకోవడం రాదని. కోపంతో టీచర్ తిరిగి రమేష్ నే దెబ్బలాడి వాడికి మార్కులు తగ్గించేసి ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ చేసారు”


“అయ్యో ఇదెక్కడ చోద్యంరా! నేనెక్కడా వినలేదు”


“ఇప్పుడు నేనేం చేయాలి తాతగారూ?” బిక్క ముఖం పెట్టాడు.


“నేను చెప్పినట్లు చేస్తావా మరి?”


“ఓ తప్పకుండా” కన్నీళ్ళు తుడుచుకుని శ్రద్ధగా వినసాగాడు.


“ఎవరైనా నిన్ను కవ్వించాలని ఆటపట్టించాలని చూసినప్పుడు అసలు ఏడవకు. తర్వాత ధైర్యంగా వాళ్ళతో మాట్లాడు. ఎందుకు ఏడ్పిస్తున్నారని అడుగు. సరదాగా చేసాం అన్నారనుకో నువ్వూ సరదాగా తీసుకుంటానని చెప్పు. కానీ మళ్ళీ మళ్ళీ అలా చేస్తే ఒప్పుకోననీ వాళ్ళని నువ్వు స్నేహితులుగా భావిస్తున్నాననీ చెప్పు.

ఒకవేళ నీతో స్నేహం చేయడం ఇష్టం లేకపోతే మానేయమను కానీ అలా మళ్ళీ చేస్తే పెద్దవాళ్ళకి చెప్పి తగిన చర్య తీసుకోవాల్సి వస్తుందనీ సీరియస్ గా చెప్పు. విన్నారా సరేసరి వినకపోతే ఏం చేయాలో ఆలోచిద్దాము”


“అంతేనంటారా తాతయ్యా అలా చెప్తే వాళ్ళకి కోపం రాదుగా?”


“న్యాయంగా రాకూడదు మరి. నువ్విప్పుడు చిన్న క్లాసులో ఉన్నావు. ముందు ముందు ఇలాంటి సంఘటనలు ఎదురైతే ఏం చేయాలో నీకూ తెలియాలి కదా! అస్తమాటూ ఎవరో ఒకరు వచ్చి నిన్ను కాపాడరు కదా! నిన్ను నువ్వే కాపాడుకోవడం నేర్చుకోవాలి”


“మీరు చెప్పినట్లే చేస్తాను. థ్యాంక్స్ తాతయ్యా. అవునూ మీకివన్నీ ఎలా తెలుసు?”


మనవడి అమాయకపు ప్రశ్నకి నవ్వొచ్చినా పెదవులమాటున అదిమి “నేనూ చదువుకున్నాను. ఆ తర్వాత మీ నాన్నా చదువుకున్నాడు. అప్పుడూ ఇలాంటివి జరిగేవి. స్కూలులో చదువుకునేటప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అన్నిటికీ బెంబేలెత్తి పోయి ఏడుపు మంత్రం పఠించకూడదు”


“ఏడుపు మంత్రమా! మీరు భలే తమాషాగా మాట్లాడతారు తాతయ్య” చప్పట్లు కొడుతూ నవ్వేసాడు భార్గవ.


‘వీడి నవ్వు ముఖం ఎంత అందంగా ఉంటుంది. కళ్ళల్లో కూడా నవ్వు ప్రతిఫలించి ముఖమంతా వెలుగు నిండుతుంది సుమా! ఇప్పటివరకూ నేను గమనించలేదేమీటీ’ అనుకున్నారు రామయ్య.


ఆ తర్వాత రాజేంద్ర కళ్యాణీ వచ్చేవరకూ తాతామనవడూ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసారు.


తాతగారు సాహస వీరుల గాథలు చెప్తుంటే ఆసక్తిగా విన్నాడు భార్గవ.

&&&


బాల్యం దాటి ఇప్పుడిప్పుడే యుక్తవయస్సులో అడుగు పెడుతున్నాడు భార్గవ.


మనుమడంటే పంచప్రాణాలు రామయ్యకి. భార్య దూరమయ్యాక ఆవిడ వంతు ప్రేమానురాగాలని కూడా మనవడి పైన కురిపించారు. అడపాదడపా వచ్చి మనుమడిని చూస్తేగానీ ఆయనకు తోచదు.


అటు భార్గవకీ తాతగారంటే మహా మక్కువ.

తల్లీతండ్రీ ఇద్దరూ ఉద్యోగస్తులే కావడంతో, సమయం గడిపేందుకు ఎవరూ లేక, తాతగారు వచ్చారంటే చాలు క్షణం కూడా వదలడు. ఆయన ఇలా గ్రామం వెళ్ళగానే అలా ఫోన్ చేసేస్తాడు వెంటనే వచ్చేయండంటూ.


సంవత్సరాంతపు పరీక్షల మధ్యలో ఒకరోజు విరామం వస్తే ఫోన్ చేసి “తాతయ్యా ఎప్పుడు వస్తున్నారు హైదరాబాదు?” అడిగాడు భార్గవ.


“ముందు నీ పరీక్షలు కానివ్వరా. ఇప్పుడే వస్తే చదువు మానేసి నాతో కబుర్లలో పడతావు. ”


“ఓకే తాతాయ్యా. బై” ఫోన్ పెట్టేసి మర్నాటి పరీక్షకి తయారీ మొదలుపెట్టాడు.


వాగ్దానం చేసినట్లే మనవడి పరీక్షలు ముగిసిన రెండో రోజే వచ్చేసారు రామయ్య.


“తాతయ్యా” గబ గబా ఎదురెళ్ళి కావలించుకున్నాడు.

తాతామనవల పరస్పరానురాగం చూసి ‘ఇది ఏనాటి బంధమో!’ అనిపించి కళ్ళు చెమర్చాయి కళ్యాణికి.

మర్నాడు సెలవ దినమైనా ఉదయమే లేచి గబగబా తయారై పేపర్ చదువుతున్న తాతగారి ప్రక్కనే వచ్చి కూర్చున్నాడు భార్గవ.


“తాతయ్యా అన్నట్లు మీకొక విషయం తెలుసా?” తాను చెప్పబోయేదానికి ఉపోధ్ఘాతంగా అన్నాడు.


“నువ్వు చెప్పకుండా ఎలా తెలుస్తుందిరా! మనవడా”


“అబ్బా జోకులెయ్యకుండా వినండి తాతయ్యా! ఒకరోజు హిస్టరీ టీచర్ పాఠం చెప్తూ అచ్యుతాపురమనే ఒక ఊరు ఉందనీ అది ఒక వ్యక్తి పేరు మీద పెట్టారనీ చెప్పారు. మన ఊరు పేరు కూడా అచ్యుతాపురమే అని నాకు చటుక్కున గుర్తొచ్చింది. టీచర్ చెప్పిందీ మన ఊరూ ఒక్కటేనా తాతయ్యా?”


“అవునురా. ”


“ఆ పేరు ఎవరిది తాతయ్యా?”


“మీ ముత్తాతగారు అంటే మా నాన్నగారిది. ఆయన పేరు అచ్యుతరావు”


“వావ్! నిజంగానా తాతయ్యా! మా ముత్తాతగారి పేరుతో ఒక ఊరు. భలే న్యూస్. మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను. వాళ్ళు నమ్మనే నమ్మలేరు. నేనే నమ్మలేకపోతున్నాను”


ఉత్సాహంతో గెంతులు వేసాడు.

సంతోషంతో పొంగిపోతున్న మనవడిని మురిపెంగా చూసి “మన ఊరు గురించి ఒక చక్కటి కథ కూడా ప్రచారంలో ఉంది” అన్నారు.


“భలే! ఆ కథ చెప్పరా ప్లీజ్.. ” తాతగారి గడ్డం పట్టుకుని బ్రతిమిలాడాడు.


“చెప్తాగానీ ముందు నువ్వా గెంతులు మానేసి బుద్ధిగా ఇలా కూర్చో”


ఠక్కున అల్లరి ఆపేసి తాతగారు చెప్పే కథ కోసం చెవులు రిక్కించాడు.


“మన ఊర్లో మొట్ట మొదటగా కట్టిన ఇల్లు ముత్తాతగారు కట్టిన మన ఇల్లే. ”


“వాట్! మన ఇల్లా. అది కట్టి ఎన్నాళ్ళైంది?”


“యాభై ఐదు సంవత్సరాలైంది”


“ఓ! మై గాడ్! అయినా ఇంత క్రొత్తగా ఎలా ఉంది?”


“ఎలా అంటే మరి అయిదేళ్ళకొకసారి దానికి బాగులు చేయించీ, రంగులు వేయించీ కాపాడుకుంటూ వచ్చాను కనుక”


“ఓ! అలాగా”


“అవును. లేకపోతే ఈ పాటికి పాడుపడిన ఇల్లులా తయారై ఉండేది”


“గ్రేట్ తాతగారు. ఊ.. తర్వాత కథ చెప్పండి”


“ముత్తాతగారు ఆ ఇల్లు కట్టినప్పుడు చుట్టు ప్రక్కల అంతా అడవిలాగా ఉండేదిట. ఆయన చాలా ధైర్యవంతులు.


అప్పట్లో ఆయన వద్ద ఒక తుపాకీ కూడా ఉండేదిట”


“అమ్మో తుపాకీనా? అలా ఎవరైనా తుపాకీ ఉంచుకోవచ్చునా?”


“ఆత్మరక్షణార్థం అంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం గవర్నమెంట్ లైసెన్స్ తీసుకుని ఉంచుకోవచ్చును”


“ఓహో!”


“ఇల్లు పూర్తై ఆయన నివాసం ఉండడం చూసి నెమ్మది నెమ్మదిగా అక్కడ స్థలాలు కొన్నవాళ్ళందరూ ఇళ్ళు కట్టడం ఆరంభించారట. అప్పట్లో అక్కడ అడవి జంతువుల భయం ఎక్కువగా ఉండేదిట. అందుచేత రాత్రి కాగానే ముత్తాతగారు ఒక చేతిలో తుపాకీ మరొక చేతిలో కాగడా పట్టుకుని రాత్రి తెల్లవార్లూ గ్రామం అంతా గస్తీ తిరిగేవారట”


“కాగడా అంటే?”


‘చాలామటుకు తెలుగు పదాల అర్థాలు తెలిసినా ఇలాంటి క్లిష్ట పదాలకి అర్థాలు తెలియవు వీడికి’ అనుకుని “ఒక చిన్న లావుపాటి కర్ర చివర గుడ్డ చుట్టి మంట పెడతారు. అది వెలుగునిస్తుంది. అప్పట్లో కరెంటు అంతగా లేదు కదా అందుకని అలాంటివి వాడుతుండేవారు”


“అవి ఇప్పుడు లేవా?”

========================================================================

ఇంకా వుంది..


========================================================================

దినవహి సత్యవతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ దినవహి సత్యవతి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/dsatya

పేరు: దినవహి సత్యవతి

విద్య : బి.టెక్., ఎం.సి.ఎ. ;

వృత్తి : విశ్రాంత కంప్యూటర్ సైన్స్ లెక్చరర్.

ప్రవృత్తి : రచనా వ్యాసంగం.

సాహితీ ప్రయాణంలో నేటివరకూ కథలు, కవితలు(వచన, పద్య, మినీ), నవలలు, గజల్స్, పంచపదులు, పద్యాలు, శతకములు, వ్యాసములు, పద ప్రహేళికలు, లఘు నాటికలు, పంచతంత్రం కథలు, నానీలు, హంసికలు, హైకూలు, సిసింద్రీలు, తెలుగు దోహాలు వంటి వివిధ ప్రక్రియలలో రచనలు చేయడం జరిగింది.


పలు దేశీయ, అంతర్జాల పత్రికలు, బ్లాగులు, ATA & NYTTA జ్ఞాపికలలో రచనలు ప్రచురితమైనవి.

గుర్తింపు : చైతన్య దీపికలు కథా సంపుటీలోని ‘దీక్ష’ కథ మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 12 వ తరగతి విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశంగా తీసుకొనబడింది.

పలు కథా, కవితా, పద్య సంకలనములలో కథలు & కవితలు ప్రచురితమైనవి.

ఆటవెలది ఛందస్సులో ‘మధుర సత్య శతకం’ వ్రాయడం జరిగింది.

6 గొలుసుకట్టు నవలలలో భాగస్వామ్యం చేయడం జరిగింది.

ముద్రితములు: ‘చైతన్యదీపికలు’ (బాలల కథల సంపుటి) & ‘ఇంద్రధనుస్సు’ (సప్త కథా సంపుటి) &

గురుదక్షిణ (కథల సంపుటి ) ; ‘పంచతంత్రం కథలు’ (బొమ్మల బాలల కథల సంపుటి);

పంచామృతం!(సత్య! పంచపదులు)


స్వీయ బ్లాగు(My Blog) : “మనోవేదిక” : Blog – id: http://satya-dsp.blogspot.in


118 views0 comments
bottom of page