top of page

కొత్త కెరటం! ఎపిసోడ్ 7


'Kotha Keratam Episode 7' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi

'కొత్త కెరటం! ఎపిసోడ్ - 7' తెలుగు ధారావాహిక

రచన: దినవహి సత్యవతి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


అచ్యుతాపురం గ్రామంలోని ఒక మోతుబరి రైతు రామయ్య, ఆయన భార్య జానకి. వారి కుమారుడు రాజేంద్ర, కోడలు కళ్యాణి. డెలివరీ కోసం అడ్మిట్ అయిన కళ్యాణి పరిస్థితి సీరియస్ అని చెబుతారు డాక్టర్లు. హాస్పిటల్ లో సూరజ్ అనే వ్యక్తి తారసపడతాడు రాజేంద్రకి. తాను రామయ్య గారి సహాయంతో చదువుకున్నానని చెబుతాడు అతను.


రాజేంద్ర భార్య క్షేమంగానే ఉందనీ, పుట్టిన బిడ్డ మరణించిందనీ చెబుతాడు డాక్టర్. తనకు కొడుకు పుట్టి రెండు రోజులే అయిందనీ, డెలివరీ కాగానే తన భార్య చనిపోయిందనీ చెబుతాడు సూరజ్. తాను అమెరికా వెళ్ళిపోతున్నట్లు చెబుతాడు. తన కొడుకును పెంచుకొమ్మని రాజేంద్రతో చెబుతాడు.


సమయం చూసుకొని భార్యకు నిజం చెబుతాడు రాజేంద్ర. ముందు బాధపడ్డా సూరజ్ కొడుకుని స్వంత బిడ్డలా చూసుకుంటానంటుంది అతడి భార్య కళ్యాణి.


రామయ్యకి మనవడితో అనుబంధం పెరుగుతుంది. స్కూల్ లో స్నేహితులు మనవడిని ఏడిపిస్తున్న విషయం తెలుసుకొని ధైర్యం చెబుతాడు రామయ్య. పరిస్థితులను ఎదుర్కోవడం నేర్పుతాడు.


ఇక కొత్త కెరటం! ఎపిసోడ్ - 7 చదవండి.


“ఇప్పుడు మనకి టార్చ్ లైట్స్ అవీ వచ్చేసాయి కదా. అయినా ఇప్పటికీ అక్కడక్కడా వాడుతున్నారు”


“ఊ....”


“ఆ కాగడా వెలుగులో ముత్తాతగారు ఊర్లో రాత్రంతా కాపలా తిరిగేవారుట”

“అమ్మో ఒక్కరూనా! భయంవేసేది కాదా మరీ?” భార్గవ కళ్ళు వెడల్పయ్యాయి.


“ఆయన దేనికీ భయపడేవారు కాదట. సుమారు పది పదిహేను ఇళ్ళదాకా జనాలు నివాసం వచ్చాక ఒక రాత్రి ముత్తాతగారు గస్తీ తిరుగుతుండగా ఒక తోడేలు గ్రామంలోని ఒక ఇంటిపై దాడి చేసి చిన్న పిల్లవాడిని ఎత్తుకుపోతూ ముత్తాతగారి కంట పడిందిట.”


“తోడేలంటే జాకాల్ కదా?”


“కాదు వుల్ఫ్”


“అవునవును మర్చిపోయాను. ఊ...అప్పుడేమైంది?”


“ఇసుమంతైనా జంకకుండా ముత్తాతగారు దానిని ఎదుర్కొని కాగడాతో అదిలించి తుపాకీ పేల్చేటప్పటికి తోడేలు బెదిరిపోయి పిల్లవాడిని వదిలేసి పారిపోయిందిట. ఆ పిల్లవాడికి వెంటనే ప్రాథమిక వైద్యం అందించి బ్రతికించారట”


“ఆయనకి వైద్యం కూడ తెలుసా?”


“ముత్తాతగారు డాక్టర్. గ్రామస్తులందరికీ ఉచితంగా హోమియోపతి వైద్యం అందించారు”


“హోమియోపతి అంటే?”


“వైద్యవిధానాలలో హోమియోపతి, ఆయుర్వేదం, అల్లోపతి, ప్రకృతి వైద్యమనీ చాలా రకాలు ఉన్నాయి. అందులో మన తాతగారు హోమియోపతి లో డిగ్రీ చదివారు”


“ఓ అలాగా. ఆ తర్వాత ఏమైంది?”


“ఏముంది అందరూ ముత్తాతగారి ధైర్యాన్ని మెచ్చుకున్నారట. ప్రభుత్వం కూడా ఆయనని సన్మానించిందట. వెంటనే గ్రామంలో ఒక పోలీసు పహరా ఏర్పాటు చేసారట. అది కాలక్రమేణా ఇప్పుడున్న పోలీస్ స్టేషన్ గా రూపాంతరం చెందింది”


“మన ఊళ్ళో పోలీస్ స్టేషనా! ఎక్కడుంది?”


“అసలు మన గ్రామంలోనే ఉండేది ఇంతకుముందు. ఈ మధ్యనే ఒక పెద్ద బిల్డింగ్ కట్టి అక్కడికి మార్చారు. ఇప్పుడు అచ్యుతాపురానికి చుట్టుప్రక్కల ఉన్న నాలుగైదు గ్రామాలకి కూడా అదే పోలీస్ స్టేషన్ అయింది”


“నేనెప్పుడూ చూళ్ళేదే?”


“ఈసారి వచ్చినప్పుడు చూపిస్తాలే. ఇంకా విను మరీ!”


“చెప్పండి చెప్పండి”


“ఆ తర్వాత ముత్తాతగారే స్వంత డబ్బులు ఖర్చు పెట్టి మన గ్రామంలో రోడ్డు వేయించారు. చిన్న స్కూలు కట్టించారు. ఒక చిన్న క్లినిక్ పెట్టి గ్రామస్థులకి ఉచిత వైద్యం కూడా చేసారు. అలా గ్రామం అభివృద్ధి చెందడానికి చాలా పాటుపడ్డారు. ఆయన సేవలకు కృతజ్ఞతగా మన గ్రామానికి ముత్తాతగారి పేరు పెట్టాలని ప్రభుత్వానికి విన్నపం చేసారట గ్రామస్థులు. అప్పటినుండీ అది అచ్యుతాపురమని పిలవబడుతోంది”


“అయితే తాతయ్యా ఆ చిన్న పిల్లవాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?”


“మన ఊర్లోనే. ఇప్పుడున్న గ్రామ మునసబుగారు ఆ పిల్లవాడే”


“అవునా ! భలే! అయితే ఒకసారి ఆయన్ని నాకు చూపిస్తారా ప్లీజ్” బ్రతిమిలాడాడు.


“తప్పకుండా. ఆయనను కలిసినప్పుడు నిశితంగా గమనించు. తోడేలు ఆయన చేతిని కరిచి పట్టుకున్నప్పటి పళ్ళ గాటు ఇప్పటికీ కనిపిస్తుంది”


“అమ్మో వింటుంటేనే భయమేస్తోంది తాతయ్యా” చేతులు రెండూ గుండెలకి దగ్గరగా చేర్చి చిన్నగా వణికాడు.


“నిజమేరా నాకూ అలాగే అనిపిస్తుంది ఎప్పుడు ఆ విషయాలు తలుచుకున్నా”


“ముత్తాతగారు నిజంగా గ్రేట్. హాట్స్ ఆఫ్ టు హిమ్. మీరు చెప్పిన విషయాలన్నీ మా ఫ్రెండ్స్ కి ఇప్పుడే చెప్తాను” తాతగారి బుగ్గ ముద్దు పెట్టుకుని తుర్రున పరిగెత్తాడు భార్గవ.


మనవడితో అచ్యుతాపురం గురించిన కథా విశేషాలు చెప్తుంటే తండ్రితో అనుబంధం జ్ఞప్తికి వచ్చి కళ్ళు చెమర్చాయి రామయ్యకి.


&&&


రాజేంద్ర ఆఫీసుకి బయలుదేరబోతుంటే ఫోన్ మ్రోగింది.

“కళ్యాణీ కొంచం చూస్తావా?” వంటింట్లో ఉన్న భార్యకి వినపడేలా చెప్పాడు.


“అవునా ఇక్కడ కూరలో పోపు మాడిపోతుందండీ మీరే చూద్దురూ ప్లీజ్”


ఇక తప్పదని వెళ్ళి ఫోన్ ఎత్తి “హలో” అన్నాడు.


“రాజూ నేను” క్రితం రోజే ఇక్కడనుంచి బయలుదేరి అచ్యుతాపురం వెళ్ళిన నాన్న ఇంత పొద్దున్నే ఎందుకు చేసారో అనుకుని “నమస్కారం నాన్నా. చెప్పండి ఈవేళప్పుడు చేసారేం?”


“వచ్చే నెలలో మన పక్కూర్లో జాతర జరుగుతుందిటరా. భార్గవ పుట్టాక ఇదే మొదటిది. వాడు ఎప్పుడూ చూడలేదు కదా. సరదాగా చూస్తాడు. అందరూ కలిసి ఓ పది రోజులు ఉండేలాగా రాకూడదూ”


“అలాగా. సరే నాన్నా. భార్గవకి నెలాఖరులో క్లాస్ పరీక్షలు. పైగా మా ఇద్దరికీ కూడా సెలవు దొరకాలి కదా. అన్నీ కుదిరితే తప్పక వస్తాము” అన్నాడు.


జాతర జరిగే సమయంలోనే రామయ్యగారి పుట్టినరోజు కూడా ఉండడంతో అన్నీ చూసుకున్నట్లు అవుతుందని అచ్యుతాపురం వచ్చారు కొడుకూ కోడలూ మనుమడూ.


ఆ మర్నాడు ఇంటి ముందున్న విశాలమైన మర్రి చెట్టుకి తాతగారు వేయించిన ఉయ్యాల ఊగుతున్నాడు భార్గవ.


ఇంతలో పెద్ద గాలి తెమ్మెర ఒకటి వీచి చెట్టు ఊడలు విపరీతంగా ఊగడంతో ఉయ్యాల కాస్తా ఇంకో పొడవాటి ఊడకి చిక్కుకుని ఆగిపోయింది.


“తాతయ్యా తాతయ్యా” భయంతో గావు కేకలు పెట్టాడు.


మాలి దగ్గరుండి తోటలో మొక్కలకి పాదులు తవ్విస్తున్న రామయ్య మనవడి అరుపులు విని “ఏమైందిరా?” అంటూ పరిగెత్తుకుని వచ్చి ఉయ్యాలలో ఇరుక్కుపోయిన మనవడిని చూసారు.

“తాతయ్య భయమేస్తోంది నన్ను క్రిందికి దింపండీ”


“నేవచ్చాగా భయపడకు. రా నెమ్మదిగా దిగు” ఉయ్యాలనుంచి దింపి దిమ్మె పైన కూర్చోబెట్టి “ఇవిగో ఈ మంచి నీళ్ళు త్రాగు భయం తగ్గుతుంది.”


గ్లాసందుకుని గటగటా నీళ్ళు త్రాగేసాడు.


“మిమ్మల్ని ఎప్పటినుంచో అడుగుతున్నాను ఈ మర్రి చెట్టు గురించి చెప్పమని. అప్పుడూ ఇప్పుడూ అంటున్నారేకానీ చెప్పనే లేదు” భయం తగ్గి అలక సాగించాడు.


“అలగకు మరీ. చెప్తా విను. ఈ మర్రి చెట్టు ఇక్కడ ఉండడానికి వెనుక ఒక కథ ఉంది” తోటమాలిని పిలిచి సూచనలు ఇచ్చి మనవడి ప్రక్కనే దిమ్మెపై చతికిలబడ్డారు.


“కథా! భలే భలే నాకు కథలంటే చాలా ఇష్టం” ఉత్సాహంగా తాతగారికి మరింత దగ్గరగా జరిగి కూర్చున్నాడు.


“ఈ చెట్టుని ఈ ఇల్లు కట్టినప్పుడు మా నాన్నగారు అంటే మీ ముత్తాత అచ్యుతరావుగారు నాటారు. నాకు అప్పుడు రెండేళ్ళ వయసట”


“ఊ...అంటే...” వేళ్ళ మీద లెక్కపెట్టి “ఈ చెట్టు వయసు ఇప్పుడు యాభై ఎనిమిదేళ్ళన్న మాట. వెరీ ఓల్డ్ ట్రీ మై గాడ్” నోరు వెళ్ళబెట్టి ఆశ్చర్యం వ్యక్తం చేసాడు.


“అవునురా చెట్టు నాటి సరిగ్గా యాభై ఎనిమిదేళ్ళైంది. అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావురా?”

“మీరు మొన్ననేగా అరవైయ్యవ పుట్టినరోజు జరుపుకున్నారు. దాన్నేదో అన్నారు నాన్న, ఏమిటబ్బా?” బుగ్గన వ్రేలేసుకుని దీర్ఘంగా ఆలోచించాడు.


“షష్టి పూర్తి”


“ఆ అదే అదే అందుకేగా మేము వచ్చాము ఇక్కడికి. మీకు రెండేళ్ళ వయసులో ఈ చెట్టు నాటితే అరవై మైనస్ రెండు యాభై ఎనిమిది కనుక చెట్టు వయసు అంత అని లెక్క వేసాను.”


“మంచి లెక్కల బుర్రరా నీది” మెప్పుకోలుగా మనవడి భుజం తట్టారు.


“సరేగానీ తాతయ్యా మర్రి చెట్టు గురించి తెలుసుకోవాలని ఉంది చెప్పండి ప్లీజ్”


“నేను కథ చెప్పేముందు ఈ చెట్టు గురించి నీకు తెలిసింది చెప్పు?”


“ఓ చెప్తా వినండి. ఈ చెట్టు చాలా పెద్దది. ఎన్నో సంవత్సరాలు ఉంటుంది. ఇంకా...” కాసేపు ఆలోచించి “తెలియట్లేదు తాతయ్యా” అసహాయతను వ్యక్తపరిచాడు.


“మర్రి చెట్టు గురించి తెలుసుకోవల్సిన ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. అప్పుడే ఈ చెట్టు ఇక్కడ ఎందుకు నాటారో నీకు అర్థమవుతుంది. మర్రి చెట్టుని వటవృక్షం అనీ, ఇంగ్లీషులో బాన్యన్ ట్రీ అనీ అంటారు. ఇది బాగా విస్తరించిన శాఖలతో అనేకమైన ఊడలతో పెరుగుతుంది”


“ఊడలంటే?”


“అదిగో చూడు చెట్టు మీదనుంచి క్రిందికి పొడవుగా వ్రేలాడుతున్నాయే అవే ఊడలంటే”

గబగబా అక్కడికి వెళ్ళి ఊడలు పట్టుకుని లాగి “అబ్బో చాలా బలంగా ఉన్నాయి తాతయ్యా” వగర్చాడు.


“మరేమనుకున్నావు. అందుకే నీ ఉయ్యాల దానికి కట్టాను. నువ్వు ఇంగ్లీష్ కార్టూన్ సినిమాలు చూస్తావు కదా టార్జాన్ ఒక చెట్టు మీదనుంచి మరో చెట్టు మీదకి ఎగిరి దూకడం”


”అవును అచ్చం మంకీలా”


“ఆ అదే! ఇలా ఊడలూ చెట్టు కొమ్మలూ పట్టుకునే ఒక చోటునుంచి ఇంకో చోటుకి గెంతుతూ వెళతాడు. ఊడలు చాలా బలంగా ఉంటాయి. ఎంత బరువైనా తీసుకుంటాయి. మర్రి కొమ్మలు, అదిగో పైకి చూడు, అలా ఆకాశంవైపు విస్తరిస్తాయి” అని చెట్టు క్రింద రాలి ఉన్నవేవో ఏరి తెచ్చి “ఇవిగో ఇవి చూడు” చేయి జాపారు.


“ఏమిటివి?”


“మర్రి గింజలు. పక్షులు మర్రి పళ్ళు తిని గింజలు విసిరేస్తే, అవి వేరే చెట్టు మీదా, భవనాలు వంతెనల పగుళ్ళు, రాళ్ళ సందులలో పడి మొలకెత్తి వాటి వ్రేళ్లు క్రమంగా భూమికి ప్రాకుతాయి”

“ఈ చెట్టు వల్ల మనకేం ఉపయోగం తాతయ్యా?”


“నువ్వు చెప్పు చదువుకున్నావు కదా”


“ఊ...చెట్లు నీడని ఇస్తాయి. పళ్ళూ పూలు ఇస్తాయి. చెట్లు ఊగితే మంచి గాలి వస్తుంది”


“భేష్! అలాగే మర్రి చెట్టు కూడా అన్ని దిశలా విస్తరించి వచ్చేపోయేవారికి చల్లటి నీడని ఇస్తుంది. ఇంకా వైద్యపరంగా కూడా అంటే మెడిసినల్ పర్పస్ లో కూడా దీనికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి”


“అందుకే ముత్తాతగారు ఈ చెట్టు ఇక్కడ నాటి ఉంటారు. కదా తాతగారూ!”


“కరెక్ట్ గా చెప్పావురా మనవడా. మర్రి చెట్టు గురించీ దాని ఉపయోగాల గురించి వ్రాసిన పుస్తకం నా వద్ద ఉంది ఇస్తాను. అది చదివితే నీకు ఇంకా బాగా తెలుస్తుంది”


“మీరే చెప్పండి తాతయ్యా. పుస్తకం చదవడమంటే బోరు” విసుగ్గా ముఖం పెట్టాడు.


“అదే తప్పు. పుస్తకం ఒక మంచి ఫ్రెండ్. మంచి పుస్తకాలు చదివితే జ్ఞానం పెరుగుతుంది. కాలక్షేపం అవుతుంది. చిన్నప్పటినుండే చక్కగా ఇలాంటి అలవాట్లు చేసుకున్నావనుకో, అందువల్ల కలిగే విజ్ఞానం పెద్దయ్యాక నీకెప్పుడైనా ఉపయోగపడుతుంది”


“తర్వాత చదువుతాను కానీ ముందు కథ చెప్పండి”


“నువ్వు పుస్తకం చదువుతానని ప్రామిస్ చేస్తేనే కథ చెప్తాను. లేదంటే చెప్పను” అలిగినట్లు ముఖం పెట్టారు.


“అమ్మో అలా అనొద్దు నాకు కథలంటే చాలా ఇష్టం. సరే మీరు చెప్పినట్లే చేస్తాను”


“ప్రామిస్!”


“ప్రామిస్” తాతగారి చేతిలో చెయ్యి వేసాడు.


“మా భార్గవ మంచి బాలుడు” బుగ్గపుణికి ముద్దు పెట్టుకుని “ఇక ఇప్పుడు కథ విను మరి”

ఉత్సాహంగా ముందుకు వంగి చెవులు రిక్కించాడు.


“ఇక్కడ ముత్తాతగారు ఇల్లు కడదామనుకున్నప్పుడు ఈ స్థలమంతా రకరకాల మొక్కలతో నిండిపోయి ఉందట. వాటి మధ్యగా మర్రి చెట్టు కూడా ఉందట.”


“అయితే ఆ చెట్లన్నీ ఏం చేసారు?”

========================================================================

ఇంకా వుంది..


========================================================================

దినవహి సత్యవతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ దినవహి సత్యవతి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/dsatya

పేరు: దినవహి సత్యవతి

విద్య : బి.టెక్., ఎం.సి.ఎ. ;

వృత్తి : విశ్రాంత కంప్యూటర్ సైన్స్ లెక్చరర్.

ప్రవృత్తి : రచనా వ్యాసంగం.

సాహితీ ప్రయాణంలో నేటివరకూ కథలు, కవితలు(వచన, పద్య, మినీ), నవలలు, గజల్స్, పంచపదులు, పద్యాలు, శతకములు, వ్యాసములు, పద ప్రహేళికలు, లఘు నాటికలు, పంచతంత్రం కథలు, నానీలు, హంసికలు, హైకూలు, సిసింద్రీలు, తెలుగు దోహాలు వంటి వివిధ ప్రక్రియలలో రచనలు చేయడం జరిగింది.


పలు దేశీయ, అంతర్జాల పత్రికలు, బ్లాగులు, ATA & NYTTA జ్ఞాపికలలో రచనలు ప్రచురితమైనవి.

గుర్తింపు : చైతన్య దీపికలు కథా సంపుటీలోని ‘దీక్ష’ కథ మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 12 వ తరగతి విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశంగా తీసుకొనబడింది.

పలు కథా, కవితా, పద్య సంకలనములలో కథలు & కవితలు ప్రచురితమైనవి.

ఆటవెలది ఛందస్సులో ‘మధుర సత్య శతకం’ వ్రాయడం జరిగింది.

6 గొలుసుకట్టు నవలలలో భాగస్వామ్యం చేయడం జరిగింది.

ముద్రితములు: ‘చైతన్యదీపికలు’ (బాలల కథల సంపుటి) & ‘ఇంద్రధనుస్సు’ (సప్త కథా సంపుటి) &

గురుదక్షిణ (కథల సంపుటి ) ; ‘పంచతంత్రం కథలు’ (బొమ్మల బాలల కథల సంపుటి);

పంచామృతం!(సత్య! పంచపదులు)


స్వీయ బ్లాగు(My Blog) : “మనోవేదిక” : Blog – id: http://satya-dsp.blogspot.in


113 views0 comments

Commenti


bottom of page