top of page

కొత్త కెరటం! ఎపిసోడ్ 8


'Kotha Keratam Episode 8' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi

'కొత్త కెరటం! ఎపిసోడ్ - 8' తెలుగు ధారావాహిక

రచన: దినవహి సత్యవతి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


అచ్యుతాపురం గ్రామంలోని ఒక మోతుబరి రైతు రామయ్య, ఆయన భార్య జానకి. వారి కుమారుడు రాజేంద్ర, కోడలు కళ్యాణి. డెలివరీ కోసం అడ్మిట్ అయిన కళ్యాణి పరిస్థితి సీరియస్ అని చెబుతారు డాక్టర్లు. హాస్పిటల్ లో సూరజ్ అనే వ్యక్తి తారసపడతాడు రాజేంద్రకి. తాను రామయ్య గారి సహాయంతో చదువుకున్నానని చెబుతాడు అతను.


రాజేంద్ర భార్య క్షేమంగానే ఉందనీ, పుట్టిన బిడ్డ మరణించిందనీ చెబుతాడు డాక్టర్. తనకు కొడుకు పుట్టి రెండు రోజులే అయిందనీ, డెలివరీ కాగానే తన భార్య చనిపోయిందనీ చెబుతాడు సూరజ్. తాను అమెరికా వెళ్ళిపోతున్నట్లు చెబుతాడు. తన కొడుకును పెంచుకొమ్మని రాజేంద్రతో చెబుతాడు.


సమయం చూసుకొని భార్యకు నిజం చెబుతాడు రాజేంద్ర. ముందు బాధపడ్డా సూరజ్ కొడుకుని స్వంత బిడ్డలా చూసుకుంటానంటుంది అతడి భార్య కళ్యాణి.


రామయ్యకి మనవడితో అనుబంధం పెరుగుతుంది. స్కూల్ లో స్నేహితులు మనవడిని ఏడిపిస్తున్న విషయం తెలుసుకొని ధైర్యం చెబుతాడు రామయ్య. పరిస్థితులను ఎదుర్కోవడం నేర్పుతాడు. అచ్యుతాపురానికి ఆ పేరెలా వచ్చిందో మనవడికి వివరిస్తాడు రామయ్య.

ఇక కొత్త కెరటం! ఎపిసోడ్ - 8 చదవండి.


“అన్ని చెట్లనీ కొట్టేసారు”


“అయ్యో” బాధగా ముఖం పెట్టాడు.


“అవును మరీ ఇల్లు కట్టాలంటే నేల త్రవ్వి పునాదులు వెయ్యాలి కదా! అలా వెయ్యాలంటే చెట్లు ఉంటే కుదరదు కదా! అందుకని కొట్టేయాల్సి వచ్చింది. మర్రి చెట్టు అప్పటికే చాలా పెద్దదిగా ఉందట. పోనీ అలానే ఉంచేద్దామంటే సరిగ్గా స్థలం మధ్యలో ఉండేటప్పటికి తప్పలేదట.”


ఉన్నట్లుండి గాలి రివ్వున వీచసాగింది. మబ్బులు దట్టంగా కమ్మేసాయి.


“వానొచ్చేలా ఉంది పద లోపలికి వెళదాము” మనవడిని తన గదికి తీసుకుని వెళ్ళి పుస్తకాల అల్మైరా లోంచి ఒక పుస్తకం తెచ్చి చేతిలో పెట్టి “ఇదిగో నే ఇందాక చెప్పిన పుస్తకం.”


“మరి కథో?”

“ఇది చదువుతూ ఉండు. ఆలోగా నేను కాస్త కాఫీ త్రాగి విశ్రాంతి తీసుకుని వస్తాను”


“ఓకే” పుస్తకం తెరిచాడు.


అరగంట తరువాత వచ్చిన తాతగారితో “మీరు చెప్పినట్లే మర్రి చెట్టుకి ఎన్ని ఉపయోగాలున్నాయో అబ్బ!” అన్నాడు.


“ఏదీ కొన్ని చెప్పు చూద్దాం”


“మర్రి చెట్టు బార్క్, లీవ్స్, బడ్స్, ఫ్రూట్స్ ఇంకా మిల్క్...అన్నిటినీ ఆయుర్వేద మెడిసిన్ లో వాడతారట. ఇంకా మీరు ఇందాక చెప్పారే మర్రి ఊడలని, వాటితో బ్రష్ చేసుకుంటే టీత్ ప్రాబ్లమ్స్ రావట! ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయి తాతగారూ”


“అబ్బో ఈ కొంచం టైమ్ లోనే చాలా చదివేసావురా”


“మీరన్నది కరెక్ట్ తాతయ్యా బుక్ చదువుతుంటే బాగా అనిపించింది. స్టోరి బుక్స్ కొనివ్వండి చదువుతాను”


“అబ్బో! అబ్బో! నువ్వు చదవుతానంటే అంతకంటేనా” సంబరపడ్డారు.


“మరి ఇప్పుడు కథ చెప్తారా?”


“ఆ! అవును కథ ఇంకా పూర్తవలేదు కదూ! ఎక్కడిదాకా చెప్పాను”


“ఇల్లు కట్టడానికి అడ్డం అని మర్రి చెట్టు కొట్టేసారన్నారు”


“అవునవును. అదేం విచిత్రమో కానీ అదే రోజు రాత్రి ఎటువంటి సూచనా లేకుండా పేద్ద గాలివానా తుఫానూ వచ్చి ఊరంతా మునిగిపోయిందట. అందరూ భయపడిపోయారట. నాకైతే విపరీతమైన జ్వరం వచ్చిందట”


“అమ్మో” భార్గవ కళ్ళల్లో భయం.


“అవునురా ముత్తాతగారు ఏళ్ళనాటి మర్రి చెట్టు కొట్టించినందుకే అలా జరిగిందని ముత్తవ్వకి భయం వేసి నాకు జ్వరం తగ్గితే ఇల్లు కట్టిన తరువాత ఇంటి ముందు మళ్ళీ మర్రి చెట్టు నాటుతానని దేవుడికి దణ్ణం పెట్టుకుందట. అంతే! చిత్రంగా ఎవరో చేత్తో తీసేసినట్లుగా ఆ మర్నాడే నాకు జ్వరం తగ్గిపోయిందట.”


”నిజంగా అలా జరుగుతుందా తాతయ్యా?”


“నాకూ తెలీదురా ముత్తాత నాకు చెప్పారు నేను నీకు చెప్తున్నాను.”


“మీరు చెప్పిన దాని గురించి ఆలోచిస్తే నాకోటి అనిపిస్తోంది తాతయ్యా”


“ఏమనిరా?”


“సైన్స్ లో చదువుకున్నాను మొక్కలకి కూడా ప్రాణం ఉంటుందని. అవి గాలిలోని కార్బడైయాక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ వదిలి మనకెంతో మేలు చేస్తాయని. పేపర్ కూడా చెట్టునుంచే తయారవుతుందట. చెట్లవల్లనే వర్షాలు కురుస్తాయని. ఇలా ఇంకో ఎన్నో! అలాంటప్పుడు వాటిని అకారణంగా నరికి వేస్తే నేచర్ కి కోపం వస్తుంది కదా. అందుకే అలా జరిగిందేమోనని”


“ఏమోరా మరి అయ్యుండొచ్చు. వృక్షో రక్షతి రక్షితః మనం చెట్లని కాపాడితే అవి మనల్ని కాపాడతాయి అంటారు. ఈ ఇల్లు కట్టడం పూర్తవగానే ముత్తాతగారు ఒక మర్రి చెట్టు తెచ్చి ఇదిగో ఇక్కడ ఇలా వేసారు. అదే ఇప్పుడు పెద్దదై మా భార్గవకి చల్లని నీడని ఇస్తోంది. చూసావా”


“అవును తాతయ్యా. ముత్తాతగారు గ్రేట్”


ఆ మర్నాడు కాఫీ ఫలహారాలు అయ్యాక “అమ్మాయ్ అలా పొలం దాకా వెళ్ళొస్తానమ్మా” కోడలికి చెప్పి, ప్రక్కనే కూర్చుని డ్రాయింగ్ వేసుకుంటున్న మనవడిని “నాతో మన పొలాలకి వస్తావా?” అని అడిగారు.


“ఇప్పుడా! సరే ఉండండి ఈ వేస్తున్న డ్రాయింగ్ పూర్తి చేసి వస్తాను. ఇంకొంచమే ఉంది”


“ఏం వేస్తున్నావురా?” ఆసక్తిగా అడిగారు.


“చెప్తాను ఉండండి. అమ్మయ్య అయిపోయింది. ఇదిగో చూడండి” చార్ట్ తెచ్చి చూపించాడు.


“ఎంత బాగా వేసావురా మన మర్రి చెట్టుని ఊడలతో సహా. అయితే నీకు ఈ కళ కూడా వచ్చన్నమాట భేష్!”


డ్రాయింగ్ చార్ట్ తన గదిలో జాగ్రత్త పెట్టి వచ్చి “పదండి” అన్నాడు.


“వెళ్ళి అమ్మకి చెప్పిరా. లేదంటే నీకోసం వెతుక్కుంటుంది”

వంటింట్లో పని చేసుకుంటున్న తల్లికి చెప్పి, చేతిలో మంచి నీళ్ళ సీసా, ఒక బాక్స్ తో వచ్చి “అమ్మ ఇచ్చింది” అన్నాడు.

“మంచిదేలే మళ్ళీ అక్కడ ఆకలి తాతయ్యా అంటూ నసుగుతావు” మనవడి చేయి పట్టుకుని పాలేరు కట్టిన బండి ఎక్కి బయలుదేరారు.


ఊరు చివరకి వచ్చాక “భార్గవా చూడు అదిగో అక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయే వరుసగా అక్కడవరకూ మన పొలాలే” చేతితో చూపించారు.


“ఎంత బాగున్నాయో” నలుప్రక్కలా చూసి “వాళ్ళేం చేస్తున్నారు?” దూరంగా కనిపిస్తున్న కూలీలను చూపిస్తూ అడిగాడు.


“ధాన్యం తూర్పార పడుతున్నారు”


“అంటే?”


“అలా చేయడంవలన పండిన వరి ధాన్యంలోంచి గడ్డి పరకలూ, దుమ్మూ వగైరా పోయి శుద్ధమైన ధాన్యం మాత్రం మిగులుతుందన్నమాట. ఆ ధాన్యంలోంచి బియ్యం వస్తాయి. అవే మనం వండుకుని తింటాము”


“అబ్బా! అంత పని ఉంటుందా?”


“మరేమనుకున్నావు? ఇక్కడ పల్లెల్లో రైతులు కష్టపడితేనే పట్నంలో ఉండేవారికి అన్నీ అందుతున్నాయి”


భార్గవ ఏదో అనబోయేంతలో “అమ్మా! అబ్బా! బాబోయ్” కేకలు విని వడివడిగా అటు కదిలారు రామయ్య.


తాతగారిని అనుసరించాడు మనవడు.

దగ్గరికి వెళ్ళి చూడగా పని చేస్తున్న వాళ్ళల్లో ఒకడికి తేలు కుట్టిందని తెలిసింది. వీళ్ళు వెళ్ళేటప్పటికే పాక్కుంటూ పోతున్న తేలుని చంపేసారు తతిమ్మావాళ్ళు.


ప్రక్కన ఉన్న వాళ్ళకి చెప్పి చేయించకుండా, వాళ్ళు వారిస్తున్నా వినక, స్వయంగా తాతగారే ఆ పాలేరు కాలుకి చకచకా వైద్యం చేయడం భార్గవని అత్యంత ఆశ్చర్యానికి గురిచేసింది.

పాలేరు గాయం శుభ్రం చేయడం దగ్గరనుంచి కాలుకి కట్టు కట్టడం దాకా శ్రద్ధగా గమనిస్తూ ఉండిపోయాడు.

పొలంనుంచి ఇంటికి వెళ్ళీ వెళ్ళగానే తల్లిదండ్రులతో, పాలేరుకి తేలుకుట్టిన ఉదంతంతో సహా, విశేషాలన్నీ గుక్క తిప్పుకోకుండా చెప్పేసి ఊపిరి పీల్చుకున్నాడు!


“ఏం నాన్నా వాడు చెప్పినది నిజమేనా? పాలేరు కాలు పట్టుకుని మీరు వైద్యం చేయడమేమిటీ మరీనూ! ఎవరికైనా చెప్పి చేయించవచ్చుగా?” అసహనం వ్యక్తపరిచాడు రాజేంద్ర.


తాను చేసిన పని కొడుక్కు నచ్చలేదని గ్రహించి “చూడు రాజూ వాళ్ళు మనల్ని నమ్ముకుని బ్రతుకుతున్నారు. ఇలా చేయండి అలా చేయండని ఎవరికో చెప్పి చేయించడంకంటే, వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మనం ఒక అడుగు ముందుకు వేసి సహాయం చేస్తే తప్పేంకాదు. అది వాళ్ళ మనసుల్లో నిలిచిపోతుంది ఎప్పటికీ. మనల్ని మనుషుల్లా చూసి ఆదుకునే వాళ్ళూ ఉన్నారన్న ఆలోచనే వాళ్ళకి ఎంతో సంతోషాన్నీ బలాన్నీ ఇస్తుంది. కృతజ్ఞతతో నిండిన వాళ్ళ మనసులనుంచి వచ్చే దీవెనలే మనకి శ్రీరామరక్ష అవుతాయి”


తండ్రి చెప్పిన మాటల వెనుక నిజాన్ని గుర్తించాడేమో మౌనంగా ఉండిపోయాడు రాజేంద్ర.


వారి వాదన విని ‘అయ్యో పాలేరు గురించి అనవసరంగా చెప్పానా’ అనుకున్నా, వారి సంభాషణ అంతా విన్నాక, ‘అబ్బ! ఎంత బాగా చెప్పారు తాతయ్య. నేనూ పెద్దయ్యాక తాతగారిలాగానే అవుతాను’ ధృఢంగా అనుకున్నాడు భార్గవ.

తాతగారి ప్రతీ మాటా వాడి మనసులోకి చొచ్చుకునిపోయి అంతరంగంలో గాఢమైన ముద్ర వేసింది.


నాలుగు రోజుల తరువాత ప్రక్క ఊర్లో జాతర మొదలైంది.

ఆరోజు పెద్దలందరూ ఉదయమే లేచి గబగబా తయారవుతుంటే “అమ్మా మనం ఎక్కడికి వెళుతున్నాము?” అడిగాడు.


“జాతరకి” భార్గవని రెడీ చేసి తాతగారి దగ్గరికి వెళ్ళమని పంపించింది.


పాలేరు బండి కట్టిన బండిలో బయలుదేరారు నలుగురూ!

“జాతర అంటే?” తాతగారి ఒళ్ళో కూర్చుని అడిగాడు.


“ఊ...చెప్పాలంటే ఒక విధంగా మీ ఊళ్ళో ఆ మధ్యన జరిగిన ఎగ్జిబిషన్ లాంటిదన్న మాట”


“ఏముంటుంది అక్కడ?”


“తినబోయేముందు రుచి ఎందుకురా! ఇంకాసేపట్లో చూస్తావుగా”


మాటల్లోనే జాతర జరిగే ప్రదేశానికి చేరుకున్నారు.

“తాతయ్య చెయ్యి పట్టుకుని నడు. అస్సలు వదలకు సరేనా?” కొడుకుని హెచ్చరించింది కళ్యాణి.


“నేను చూసుకుంటాలేమ్మా కంగారుపడకు” కోడలికి అభయమిచ్చి మనవడి చేతిని తన చేతిలో బిగించారు.

ఎటువైపు చూసినా ఇసక వేస్తే రాలనంత జనం. గ్రామంలోని స్నేహితులు కూడా కనిపించి పలకరించారు భార్గవని.

తాతగారితో కలిసి జాతరలో తిరుగుతూంటే భలే మజాగా అనిపించింది.


జాతరలో రంగు రంగుల బొమ్మలతో ఎన్నో కొట్లు చూసి ఉత్సాహంతో గంతులు వేస్తూ “తాతయ్యా బండి బొమ్మ కొనండి, ఏనుగు బొమ్మ కొనండి” అంటూ మారాము చేసి కొనిపించుకున్నాడు.


ఒకచోట పింక్ కలర్ లో ఉన్న పదార్థాన్ని అమ్మడం చూసి “తాతయ్యా అదేమిటి?” అన్నాడు.


“పీచు మిఠాయి”


“ఏం చేస్తారు దానితో?”


“తింటారు. చాలా బాగుంటుంది కొనిపెట్టనా?”


“ఓ!”

పీచు మిఠాయి ఒక పుల్లకి చుట్టి ఉంది. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయింది. వింతగా రుచిగా అనిపించి “భలే బాగుంది తాతయ్యా. ఇంకోటి కొనిపెట్టరా” బ్రతిమిలాడాడు.


“నువ్వు తినే ఐస్క్రీం కంటే బాగుందేమిటిరా?” నవ్వుతూ మరోటి కొనిపెట్టారు.


“దానికంటే చాలా బాగుంది. ఇలాంటిది నేనెప్పుడూ తినలేదు”


“అవును ఎలా తింటావు, మీ ఊర్లో ఇలాంటివి దొరకవుగా మరి” పట్నవాసపు పిల్లలు ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు ఎన్నో కోల్పోతున్నారనుకుని నిట్టూర్చారు.


పీచు మిఠాయి తినేసి మోటర్ సైకిలు బొమ్మ ఒక చేత్తో గట్టిగా పట్టుకుని మరో చేత్తో తాతగారి చేయి పట్టుకుని నడుస్తున్న వాడల్లా ఠక్కున ఆగిపోయి “వాళ్ళేం చేస్తున్నారు?” చూపుడు వ్రేలితో చూపించాడు.


ఆ వైపు చూసిన రామయ్యకి ఒక పెద్ద బల్లపైన ముగ్గురు మనుషులు చేతులు కదుపుతూ మాట్లాడుతూంటే క్రింద చాలామంది నిలబడీ కూర్చునీ చూస్తుండడం కనిపించింది.

“నాటకం వేస్తున్నారు”


“నాటకం అంటే?”


“ఇద్దరూ లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి, అదిగో అలా ఎత్తైన ప్రదేశం పై నిలబడి ఏదైనా కథని కానీ జోకులుగానీ చూసేవాళ్ళకి అర్థమయ్యేలా యాక్షన్ చేసి చూపిస్తే అదే నాటకం”


“అంటే సినిమాలాగానా?”


“కాదు. నాటకాన్ని డైరెక్ట్ గా చూడగలము. ఇలా ఎక్కడైనా వేయచ్చు. సినిమా ఇలా చూడగలమా?”


“ఊహు”


“ఇంక ముందుకి వెళదామా?”


“వద్దు నాకు నాటకం చూడాలని ఉంది”


రాజేంద్రకి చెప్పి నాటకం జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళి ఖాళీగా ఉన్న కుర్చీలలో కూర్చున్నారు.


“బల్ల పైన మాట్లాడుతున్నారే వాళ్ళని ఏమంటారూ?”

========================================================================

ఇంకా వుంది..


========================================================================

దినవహి సత్యవతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ దినవహి సత్యవతి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/dsatya

పేరు: దినవహి సత్యవతి

విద్య : బి.టెక్., ఎం.సి.ఎ. ;

వృత్తి : విశ్రాంత కంప్యూటర్ సైన్స్ లెక్చరర్.

ప్రవృత్తి : రచనా వ్యాసంగం.

సాహితీ ప్రయాణంలో నేటివరకూ కథలు, కవితలు(వచన, పద్య, మినీ), నవలలు, గజల్స్, పంచపదులు, పద్యాలు, శతకములు, వ్యాసములు, పద ప్రహేళికలు, లఘు నాటికలు, పంచతంత్రం కథలు, నానీలు, హంసికలు, హైకూలు, సిసింద్రీలు, తెలుగు దోహాలు వంటి వివిధ ప్రక్రియలలో రచనలు చేయడం జరిగింది.


పలు దేశీయ, అంతర్జాల పత్రికలు, బ్లాగులు, ATA & NYTTA జ్ఞాపికలలో రచనలు ప్రచురితమైనవి.

గుర్తింపు : చైతన్య దీపికలు కథా సంపుటీలోని ‘దీక్ష’ కథ మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 12 వ తరగతి విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశంగా తీసుకొనబడింది.

పలు కథా, కవితా, పద్య సంకలనములలో కథలు & కవితలు ప్రచురితమైనవి.

ఆటవెలది ఛందస్సులో ‘మధుర సత్య శతకం’ వ్రాయడం జరిగింది.

6 గొలుసుకట్టు నవలలలో భాగస్వామ్యం చేయడం జరిగింది.

ముద్రితములు: ‘చైతన్యదీపికలు’ (బాలల కథల సంపుటి) & ‘ఇంద్రధనుస్సు’ (సప్త కథా సంపుటి) &

గురుదక్షిణ (కథల సంపుటి ) ; ‘పంచతంత్రం కథలు’ (బొమ్మల బాలల కథల సంపుటి);

పంచామృతం!(సత్య! పంచపదులు)


స్వీయ బ్లాగు(My Blog) : “మనోవేదిక” : Blog – id: http://satya-dsp.blogspot.in
97 views0 comments

コメント


bottom of page