top of page

కొయ్య గుర్రం


'Koyya Gurram' New Telugu Story

Written By Gannavarapu Narasimha Murthy

కొయ్య గుర్రం తెలుగు కథ

రచన : గన్నవరపు నరసింహ మూర్తి

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

నేను క‌లెక్ట‌ర్‌గా ఈ కొత్త జిల్లాలో జాయినైన త‌రువాత అంద‌రు అధికారుల‌తో ఒక మీటింగు పెట్టాను. దానికి ఎస్పీ, జాయింట్ క‌లెక్ట‌రు, స‌బ్ క‌లెక్ట‌ర్లు, త‌హ‌సీల్దార్లు, డిఈఓ, ప్రాజెక్ట్ ఆఫీస‌ర్స్‌.. ఇలా అన్ని శాఖ‌ల అధిప‌తులు హాజ‌ర‌య్యారు..


మొద‌ట‌గా డిఈఓ ప్ర‌ద్యుమ్న మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం కొత్త‌గా చేప‌ట్టిన నాడు-నేడు ప‌ధ‌కం వ‌ల్ల

60 శాతం పాఠ‌శాల‌ల రూపురేఖ‌లు మారిపోయాయ‌నీ, ఇప్పుడు వాటిలో హాజ‌రు శాతం బాగా పెరిగింద‌నీ, మంచినీరు, కుళాయిలు, టాయిలెట్స్ లాంటి స‌దుపాయాల‌ను బాగా మెరుగు ప‌రిచామ‌నీ చెబుతూ ఆ మెరుగు ప‌రచిన పాఠ‌శాల‌ల ఫోటోల‌ను మీటింగుకి హాజ‌రైన అధికారుల‌కు చూపించాడు..


నేను ఆ ఫోటోల‌ను చూసి చాలా ఆశ్చ‌ర్య‌పోయాను. ఆ ఆల్బ‌మ్‌లో ఒక పేజీలో ఇది వ‌ర‌కు పాఠ‌శాల‌లు ఎలాగుండేవో, ఇంకో పేజీలో వాటిని మెరుగు ప‌ర‌చిన త‌రువాత ఎలాగున్నాయో రెండూ చూపించ‌డంతో వాటిలో మార్పు కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది.


ఆ త‌రువాత మిగ‌తా శాఖ‌ల అధికారుల‌తో ప‌నుల ప్రోగ్రెస్‌ని రివ్యూ చేసి మినిట్స్ త‌యారు చేయించి అన్ని శాఖ‌ల‌కు స‌ర్య్కులేట్ చేయించాను..


అలా వారం రోజులలో వివిధ మీటింగుల ద్వారా జిల్లా యొక్క స‌మ్ర‌గ రూపం నాకు అవ‌గ‌త‌మైంది.

ముస్సోరిలో మేము ఐఏయ‌స్ శిక్ష‌ణ పొందుతున్న‌ప్పుడు అక్క‌డ ప్రొఫెస‌ర్లు జిల్లా క‌లెక్ట‌రు యొక్క ప్రాముఖ్య‌త గురించి స్ప‌ష్టంగా చెప్పేరు.


దేశంలో ప్ర‌ధాన‌మంత్రి అంటే పీయ‌మ్‌, ముఖ్య‌మంత్రి అంటే సీయ‌మ్‌, అలాగే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటే డీయ‌మ్ దీన్నే కొన్ని రాష్ట్రాల్లో క‌లెక్ట‌ర్ అంటారు;ఈ ముగ్గురే ముఖ్య‌మైన వాళ్ళ‌నీ, దేశ‌పాల‌న అంతా వీళ్ళ చేతుల్లోనే ఉంటుంద‌నీ ఎన్నో ఉదాహ‌ర‌ణ‌ల‌తో స‌హా చెప్పేవారు.


మ‌న దేశంలో వివిధ రాష్ట్రాల్లో 600 జిల్లాలున్నాయ‌నీ, వీటి అభివృద్ధి అంతా క‌లెక్ట‌ర్ల చేతులో ఉంటుంద‌నీ, కాబ‌ట్టి క‌లెక్ట‌ర్ అనేవాడు దేశ అభివృద్ధికి చుక్కాని లాంటి వాడ‌నీ, ఒక ఐయ్యేయ‌స్ యొక్క ప‌రిపాల‌న నైపుణ్యం అత‌ను క‌లెక్ట‌ర్‌గా ప‌ని చేస్తున్న‌ప్పుడే బ‌య‌ట‌ప‌డుతుంద‌నీ చెప్పేవారు..


అటువంటి క‌లెక్ట‌ర్ ప‌ద‌విలో ప‌నిచేసే అవ‌కాశం నాకిప్పుడు క‌లిగింది. ప్ర‌తీ ఐయ్యేయ‌స్ యొక్క క‌ల క‌లెక్ట‌ర్ ఉద్యోగం.. జీత‌భ‌త్యాలు సామాన్యంగానే ఉన్నా ఈ ప‌ద‌వికి ఉండే అధికారాలు, పేద‌ప్ర‌జ‌ల‌కు సేవ చేసే అవ‌కాశాలు ఇందులో చాలా ఎక్కువ‌.. క‌లెక్ట‌ర్ జిల్లా అనే యంత్రానికి ఇరుసు లాంటి వాడ‌నీ, జిల్లాని ప‌రిపూర్ణంగా అభివృద్ధి చెయ్యాలంటే ప్ర‌తీ క‌లెక్ట‌ర్ జిల్లాలోని అన్ని ప్రాంతాలు మ‌రీ ముఖ్యంగా అన్ని గ్రామాలలో విస్తృతంగా ప‌ర్య‌టించాల‌నీ మా శిక్ష‌ణ‌లో చెప్ప‌డం నాకిప్పుడు గుర్తుకు వ‌చ్చింది.


వెంట‌నే నేను డిఈవో గారిని పిలిపించి మ‌ర్నాడు జిల్లా ముఖ్య‌ప‌ట్నానికి దూరంగా ఉండే మారుమూల ప‌ల్లెల్లోని పాఠ‌శాల‌ల‌ను త‌నిఖీ చేద్దామ‌నీ చెప్పాను..


అనుకున్న‌ట్లుగానే మ‌ర్నాడు నేను, డిఈవో, స‌బ్ క‌లెక్ట‌ర్ ల‌తో క‌ల‌సి పాఠశాలల తనిఖీ కి బ‌య‌లుదేరాము.. మేము వెళ్ళే ఊళ్ళు జిల్లాకి వంద కిలోమీట‌ర్లు దూరంగా ఉన్న మండ‌లాలకు చెందిన గ్రామాలు;


మేము మండ‌ల కేంద్రానికి చేరుకునే స‌రికి తొమ్మిది గంట‌లైంది.. మేము ఈ మండ‌లంలోని గ్రామాల‌ను ఎంచుకోవ‌డానికి కార‌ణం ఇక్క‌డ ఉన్న చిన్న న‌దులు.. రెండు న‌దుల మ‌ధ్య చాలా గ్రామాలున్నాయి. ఈ గ్రామాల‌కు వెళ్ళాలంటే ఏర్లు దాటాలి.. వేస‌విలో అయితే నీరు పెద్ద‌గా ఉండ‌దు కానీ వ‌ర్షాకాలం అయితే ప‌డ‌వ‌ల్లో వెళ్ళ‌క త‌ప్ప‌దు..


నా ఇన‌స్పెక్ష‌న్ గురించి ఎవ్వ‌రికీ చెప్ప‌వ‌ద్ద‌నీ నేను ముందుగానే మా అధికార్ల‌కు చెప్ప‌డంతో మేము వ‌స్తున్న‌ట్లు మండ‌ల త‌హ‌సీల్దార్‌ రామారావుకి తప్ప ఇంకెవ్వరికీ తెలియ‌దు..

మేము అక్క‌డికి చేరుకోగానే త‌హ‌సీల్దార్‌ రామారావు వ‌చ్చి మాకు కాఫీలు తెప్పించాడు. నేను కాఫీ తాగుతూ అత‌నితో మండ‌లంలో పాఠ‌శాల‌ల వివ‌రాల‌న్నీ అడిగి, రెండు న‌దుల మ‌ధ్య ఉన్న గ్రామాల‌కు తీసికెళ్ళ‌మ‌నీ చెప్పాను.


రామారావు "సార్‌! ఇప్పుడు ఏట్లో పెద్ద‌గా నీళ్ళు లేవు. వేస‌విలో మ‌న‌వాళ్ళు మ‌ట్టితో ఏటిక‌డ్డంగా రోడ్డు వేస్తారు. దాని మీద నుంచి మ‌నం జీపులో ఏరు దాటి అవ‌త‌లి వైపు గ్రామాల‌కు వెళ్ళ‌వ‌చ్చు" అని చెప్పాడు.


మేము వెంట‌నే రెండు జీపుల్లో ఏరు దాటి అవ‌త‌లి వైపుకి వెళ్ళాము. ఏరు దాట‌గానే రెండు కిలోమీట‌ర్ల దూరంలో వామ‌న‌పురం అనే గ్రామం ఉంది. అక్క‌డ ప్రాథ‌మిక పాఠ‌శాల ఉంద‌నీ రామారావు చెప్ప‌డంతో మొద‌ట ఆ గ్రామానికి బ‌య‌లుదేరాము..


పావు గంట త‌రువాత మేమందరం ఆ ఊరు చేరుకున్నాము. ఊరు మొద‌ట్లోనే జీపు నాపి పాఠ‌శాల‌కు న‌డుచుకుంటూ వెళ్ళాము. ఆ పాఠ‌శాల‌ను కూడా నాడు-నేడులో అభివృద్ధి చేసిన‌ట్లు డిఈవో ప్ర‌ద్యుమ్న చెప్పాడు. ఫ‌ర్లాంగు దూరం ఉంద‌న‌గానే స్కూలు భ‌వ‌నం ప‌చ్చ‌టి చెట్ల మ‌ధ్య అందంగా క‌నిపించ సాగింది. ద‌గ్గ‌రికి వెళ్ళేస‌రికి మ‌రింత అందంగా ఉందా భ‌వ‌నం. ప్ర‌ద్యుమ్న ముందుగా పాఠ‌శాల‌లోకి ప్ర‌వేశించాడు. అత‌ని వెన‌క మేమంతా వెళ్ళాము.. స్కూలు ఎల్ అక్ష‌రం ఆకారంలో నిర్మించ‌బ‌డింది. మొత్తం ఎనిమిది గ‌దులు.. వాటిలో ఐదు త‌ర‌గ‌తి గ‌దులు, ఒకటి పిల్ల‌ల గ్రంధాలయానికి , ఇంకొకటి లేబ‌రేట‌రీ కోసం, మిగ‌తా గ‌ది ఉపాధ్యాయుల కోసం కేటాయించబడ్డాయి; చ‌క్క‌టి రంగుల‌తో, చుట్టూ ప్ర‌హ‌రీ గోడ‌తో చాలా బాగుంది అక్క‌డి వాతావ‌ర‌ణం. స్కూలు లోప‌ల విద్యార్థులు ఆడుకునేందుకు పెద్ద స్థ‌లం ఉంది.. అందులో చాలామంది పిల్లలు ఆడుకుంటూ క‌నిపించారు.. ఎదురుగా టాయిలెట్లు, ఇంకొక ప‌క్క వాట‌ర్ ఫిల్ట‌ర్‌, చుట్టూ గోడ‌ల మీద ఆక‌ర్ష‌ణీయ‌మైన చిత్రాలు, మ‌ధ్య‌ మధ్య లో మంచి నీతులు బోధించే సూక్తుల‌తో ఆక‌ర్ష‌ణీయంగా తీర్చి దిద్దారు ఆ పాఠ‌శాల‌ను.


కానీ ప‌ది గంట‌ల‌ప్పుడు త‌ర‌గ‌తిలో ఉండ‌వ‌ల‌సిన విద్యార్థినీ విద్యార్థులు బ‌య‌ట ఎందుకు ఆడుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. ఈలోగా ఒక ఉపాధ్య‌యుడు మ‌మ్మ‌ల్ని చూసి ప‌రిగెత్తుకొని వ‌చ్చీ మాకు న‌మ‌స్కారం పెట్టాడు. అప్పుడే బెల్ మోగి ఆడుకుంటున్న పిల్ల‌లంతా త‌ర‌గ‌తి గ‌దుల్లోకి వెళ్ళిపోతూ క‌నిపించారు.


నేను వెంట‌నే ప్ర‌ధానోపాధ్యాయుడి గ‌దిలోకి వెళ్ళాను. నా వెన‌క అధికారులు, బ‌య‌ట క‌నిపించే ఆ ఉపాధ్యాయుడు వ‌చ్చారు.

నేను ఆ ఉపాధ్యాయుడితో "మీ పేరు" అనీ అడిగాను..

"సార్‌! నా పేరు వెంక‌ట‌రావు. ఇక్క‌డ ప్ర‌ధానోపాధ్యాయుడిని" అని చెప్పాడు.

"ఇక్క‌డ ఎంత‌మంది ఉపాధ్యాయులు ప‌నిచేస్తున్నారు?"

"సార్‌.. నాతో స‌హా న‌లుగురు."


"మ‌రి మిగ‌తా ముగ్గురు ఏరి?"

"సార్‌! వాళ్ళు ఈరోజు రాలేదు.."


"శ‌ల‌వు పెట్టారా?" అంటూ టేబుల్ మీదున్న రిజిస్ట‌ర్ని తీసి చూసాను..

అందులో మూడు రోజుల నుంచి వాళ్ళ సంత‌కాలు లేవు.

"మూడు రోజుల నుంచి వాళ్ళ సంత‌కాలు లేవు. శ‌ల‌వు పెట్టారా వాళ్ళు.. పెడితే శ‌ల‌వు చీటీలు ఏవి ?" అని అడిగాను.


ఈ లోగా డీఈఓ, ఎం ఈ ఓ ఇద్ద‌రూ రిజిస్ట‌ర్ని చూసారు..

ఐదు నిముషాల్లో నాకు ప‌రిస్థితి అర్థం అయింది. జిల్లా కేంద్రానికి దూరంగా ఉంద‌ని కొందరు ఉపాధ్యాయులు పాఠ‌శాల‌కు హాజ‌రు కావ‌టం లేదు.. వెంట‌నే డిఈఓ తో "ప్ర‌ద్యుమ్నా! ఈ గైర్హాజ‌రవుతున్న ఉపాధ్య‌యాయుల్ని స‌స్పెండ్ చెయ్యండి. వాళ్ళ‌కు స‌హ‌క‌రిస్తున్న హెడ్మాస్ట‌ర్ కి ఛార్జి మెమో ఇవ్వండి. ఈ ప‌రిస్థితికి కారణ‌మైన మీ మండ‌ల విద్యాధికారిని కూడా స‌స్పెండ్ చెయ్యండి" అని చెప్పి బ‌య‌ట‌కొచ్చాను..


ఆ త‌రువాత త‌ర‌గ‌తి గ‌దుల్లోకి వెళ్ళి పిల్లలతో "ఉపాధ్యాయులొస్తునారా?" అని అడిగితే వాళ్ళు ఏక కంఠంతో.. "అందరూ రారు" అని చెప్పారు.. వాళ్ళ‌ని నేను పాఠ్య‌పుస్త‌కం లోని కొన్ని ప్ర‌శ్న‌ల‌డిగితే చాలామంది స‌రియైన స‌మాధ‌నం చెప్ప‌లేదు..


ఆత‌రువాత ప‌క్క‌నే ఉన్న వ‌రాహ‌పురం వెళ్ళాము. అక్క‌డా స్కూలు భ‌వ‌నాలు, వ‌స‌తులు బాగున్నా ఇద్ద‌రు ఉపాధ్యాయులు గైర్హాజ‌రు అయ్యారు; అలా సాయంత్రం వ‌ర‌కు ప‌ది గ్రామాల్లోని పాఠ‌శాల‌లు త‌నిఖీ చేస్తే అన్ని పాఠ‌శాల‌ల్లో ఉపాధ్యాయులు గైర్హాజ‌రుతోపాటు పాఠాలు కూడా స‌రిగ్గా చెప్ప‌ని విష‌యాలు బ‌య‌ట పడ్డాయి.


గైర్హాజ‌రైన ఉపాధ్యాయులంద‌ర్నీ స‌స్పెండ్ చేసి జిల్లా కేంద్రానికి బ‌య‌లుదేరాము. దార్లో డిఈఓ ప్ర‌ద్యుమ్న‌ను "మీరు స్కూళ్ళ‌ను త‌నిఖీ చేస్తున్నారా?" అని అడిగితే అత‌ను నీళ్ళు న‌మిలాడు.


"మిస్ట‌ర్ ప్ర‌ద్యుమ్నా‌? మీ బాధ్య‌త‌ని మీరు స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌టం లేదు. 'య‌థా రాజా త‌థా ప్ర‌జా' అన్న‌ట్లు మీలాగే మీ మండ‌లాధికారులు, ఉపాధ్యాయులు కూడా ప్రవర్తిస్తున్నారు. ప్ర‌భుత్వం విద్య కోసం కొన్ని వేల‌కోట్లు ఖ‌ర్చు పెడుతుంటే మీ శాఖ చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. వాళ్ళంతా ప‌నిచెయ్య‌కుండానే జీతాలు తీసుకుంటూ విద్యార్థుల‌కు స‌రిగ్గా విద్య‌ను బోధించ‌టం లేదు.. ఇది ప్ర‌జ‌ల‌కు,సమాజానికీ చేస్తున్న‌తీర‌ని ద్రోహం.. మిమ్మ‌ల్ని స‌రెండ‌ర్ చేసేస్తాను" అని అత‌న్ని గ‌ట్టిగా మంద‌లించాను.


ఆ త‌రువాత మేము బ‌య‌లుదేరాము. దార్లో ఏటి ఒడ్డున వున్న గోవ‌ర్ధ‌న‌పురం అనే పల్లె లో ఒక ఇంట్లో వంద‌మంది విద్యార్థులకు ఒక‌త‌ను విద్య‌ను బోధిస్తూ క‌నిపించాడు.

నేను అక్క‌డ జీపుని ఆపి ఆ బోధిస్తున్న మేస్టారుని పిలిచాను. అత‌ను బ‌య‌ట‌కొచ్చి నాకు న‌మ‌స్కారం పెట్టారు.


"మీరెవ‌రు? ఈ విద్యార్థులంతా ఎవ‌రు?" అని అడిగాడు అత‌న్ని.


"సార్‌.. నేను రెండేళ్ళ వ‌ర‌కు ఇదే ఊళ్ళో ప్ర‌ధానోపాధా్య‌యుడిగా ప‌నిచేసి ప‌ద‌వీ విర‌మ‌ణ చేసాను. నా పేరు వివేకానంద‌. వాళ్ళంతా చుట్టుప‌క్క‌ల పాఠ‌శాల‌ల్లో చ‌దువుతున్న విద్యార్థులు.. వీళ్ళ‌కి సాయంత్రం పూట నేను, నా కొడుకు ట్యూష‌న్లు చెబుతున్నాము" అని చెప్పాడు.


"మాస్టారు గారూ! ఇప్పుడు ఏట‌వ‌త‌ల ఉన్న ప‌ది ఊళ్ళ‌ను నేను త‌నిఖీ చేసాను. ఏ పాఠ‌శాల‌లోనూ ఉపాధ్యాయులు లేరు.. పాఠ‌శాల‌కు ఒక‌రూ, ఇద్ద‌రే క‌నిపించారు.. పూర్వంలా కాకుండా ఇప్పుడు పాఠ‌శాల భ‌వ‌నాల‌ను, అందులోని వ‌స‌తుల‌ను ఎంతో డ‌బ్బు వెచ్చించి మెరుగు ప‌రిచాం. అయినా విద్యార్థుల‌కు స‌రియైన విద్య అంద‌టంలేదు. అందుకే వాళ్ళంతా మీ ద‌గ్గ‌రికి విద్య కోసం వ‌స్తున్నారు? దీనికి కార‌ణం ఏమిటి? ఎందుకు ఈ ఉపాధ్యాయులంతా ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు?" అని అడిగాను.


"సార్‌! ప్ర‌భుత్వం పాఠ‌శాల‌ల భ‌వ‌నాల‌ను, వ‌స‌తుల‌ను మెరుగు ప‌రుస్తూ వాటిని అంద‌మైన కొయ్య గుర్రాల్లా త‌యారు చేసింది. కొయ్య‌గుర్రం చూడ‌టానికి అందంగా ఉంటుంది. కానీ ముందుకు ప‌రిగెత్త‌లేదు. పాఠ‌శాల‌కు ముఖ్యం నిబ‌ద్ధ‌త క‌లిగిన ఉపాధ్యాయులు. వాళ్ళు మంచి బోధ‌కులైతే జ్ఞాన‌జ్యోతుల్ని వెలిగించి మంచి విద్యార్థుల‌ను త‌యారు చేస్తారు. ఉపాధ్యాయుడు ఒక దీపంలా జ్వ‌లించాలి. అప్పుడే అత‌ను వేల దీపాల‌ను వెలిగించ‌గ‌ల‌డు. అప్పుడే పాఠ‌శాలలు రాణించి అంద‌రికీ విద్యా గంధాన్ని పంచుతాయి . లేక‌పోతే అవి మూలవిరాట్టులేని గుడుల‌వుతాయి. నిర్ధూమ ధామాల‌వుతాయి. కాబ‌ట్టి ప్ర‌తీ రోజూ ఉపాధ్యాయులు పాఠ‌శాల‌ల‌కు వ‌చ్చేట‌ట్లు చూడండి. మంచి జ్ఞాన‌తృష్ణ, నిబ‌ద్ధ‌త క‌లిగిన ఉపాధ్యాయుల‌ను నియ‌మించండి. హాజ‌రు కాని ఉపాధ్యాయుల మీద చ‌ర్య‌లు తీసుకోండి. అందుకు త‌గ్గ యంత్రాంగాన్ని ప‌టిష్ట‌ప‌ర‌చండి. అప్పుడే ఆ కొయ్య గుర్రాలు నిజ‌మైన తురంగాల్లా దౌడు తీస్తాయి.. ఆ గుర్రాలు ప‌రిగెత్తాలంటే మంచి రౌతులుండాలి. అటువంటి రౌతుల్ని నియ‌మించండి" అని చెప్పాడ‌త‌ను.


అత‌ని మాట‌ల్లో అంత‌రార్థం నాకు బోధ‌ప‌డింది. క‌ర్త‌వ్య బోధ‌న వినిపించింది. ఆ సమయంలో అతను నాకు ఓ మార్గదర్శిలా కనిపించాడు; ఒక విధంగా నేనేం చెయ్యాలో అత‌ను దిశా నిర్దేశం చేసాడ‌నిపించింది. రేప‌ట్నుంచే ఆ ప‌ని మొద‌లెట్టాలి.


జీపు వేగంగా వెళుతోంది. నా ఆలోచ‌న‌లు పాఠ‌శాల‌ల‌ను జ్ఞాన‌మందిరాలుగా మార్చే దిశ‌గా అంతే వేగంగా ప‌రిగెడుతునాయి.

(స‌మాప్తం)

గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.


94 views0 comments
bottom of page