top of page

లంచం

#SudhavishwamAkondi, #Lancham, #లంచం, #సుధావిశ్వంఆకొండి, #TeluguMoralStories, #నైతికకథలు


Lancham - New Telugu Story Written By - Sudhavishwam Akondi

Published In manatelugukathalu.com On 31/03/2025 

లంచం - తెలుగు కథ

రచన: సుధావిశ్వం ఆకొండి


కామేశం ఓ నెల క్రితం మంచి సెంటర్ లో ఒకచిన్న రెస్టారెంట్ తెరిచాడు.పెట్టిన  నెలరోజుల్లోనే కొంచెం కొంచెంగా వ్యాపారం బాగా సాగుతోంది. కానీ వచ్చే కస్టమర్స్ యొక్క వాహనాలు రెస్టారెంట్ ముందు పెట్టుకోనిస్తున్నందుకు అక్కడి పోలీసులు మామూళ్లు అడుగుతున్నారు. 


పోలీసులతో వ్యవహారం అని భయంతో వాళ్లడిగినంత ఇస్తున్నాడు కామేశం. అలాగే ఆహార నాణ్యత గురించి చెక్ చేసే అధికారికీ లంచం ఇస్తున్నాడు ఆహార నాణ్యత బాగుంనప్పటికీ. ఇవన్నీ పోనూ లాభాలు బాగానే వస్తున్నాయి. అందుకని అలాగే నడిపిస్తున్నాడు. 


అలా ఉండగా,  ఒకరోజు ఒక 70 ఏళ్ల వృద్ధ దంపతులతో కలిసి ఓ 40 ఏళ్ల వ్యక్తి వచ్చాడు. ఆ దంపతులు మెల్లగా నడుస్తుంటే,  ఈ వ్యక్తి గబగబా కామేశం కూర్చుని ఉన్న క్యాష్ కౌంటర్ వద్దకు వచ్చి  ఒక 500 నోటు కామేశంకు ఇస్తూ..

"మా నాన్న  చేతిలో ఈ నోటు పెట్టి, రండి  భోంచేయండి  అని అనండి ప్లీజ్" అంటూ అభ్యర్థించాడు. 


అది విన్న కామేశం ఆశ్చర్యపడి, "ఎందుకు అలా" అన్నాడు.

"తర్వాత చెబుతాను. మా నాన్న వచ్చేస్తున్నాడు ప్లీజ్" అని నోటు కామేశం చేతిలో పెట్టి, మళ్ళీ వెనక్కి ఆ దంపతుల దగ్గరికి వెళ్లాడు.


ఆ వృద్ధుడికి ఏదో చెప్పి మళ్ళీ కౌంటర్ వద్దకు తీసుకువచ్చాడు. అప్పుడు కామేశం ఆ వ్యక్తి చెప్పినట్లుగా  “ఇవి తీసుకుని భోంచేయండి' అనగానే  సంతోషంగా  ఆ డబ్బును తీసుకుని 'సరేలే'  అంటూ టేబుల్ వద్దకు వెళ్ళాడు ఆ వృద్ధుడు.


ఏంటో విచిత్రంగా ఉంది అని ఆలోచిస్తూ కూర్చున్నాడు కామేశం. వాళ్ళు ముగ్గురు భోజనం చేసాక, ఆ వృద్దులను అక్కడే కూర్చోబెట్టి, ఆ 40 ఏళ్ల వ్యక్తి భోజనం డబ్బు ఇవ్వడానికి కౌంటర్ వద్దకు రావడానికి లేచాడు. 


ఇంతలో అప్పుడే కామేశం వద్దకు మామూలు కోసం వచ్చిన పోలీసు  "వ్యాపారం బాగా పెరిగి, లాభాలు బాగా వస్తున్నాయి కదా! మామూలు పెంచేది లేదా" అంటున్నాడు కోపంగా. అనుకోకుండా అటుగా వెళుతూ, అప్పుడే వచ్చిన  ఆహార తనిఖీ అధికారి కూడా అదే మాటలు అంటున్నాడు. ఏదో సర్ది చెబుతున్నాడు కామేశం. 


ఇంతలో ఆ 40 ఏళ్ల వ్యక్తి వచ్చి కామేశానికి భోజనం డబ్బులు ఇచ్చాడు. అప్పుడు కామేశం ‘ఎందుకు అలా ముందు డబ్బులు ఇచ్చారు’ అంటూ తన సందేహాన్ని వెలిబుచ్చాడు.


  వెంటనే ఒక నిట్టూర్పు విడిచి, ఆ వ్యక్తి..

 "ఏమి చెప్పమంటారు? మా నాన్న గవర్నమెంట్ ఆఫీస్ లో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారు. ఉద్యోగం చేస్తుండగా లంచాలకు మరిగారు. ఎంతలా అంటే అది ఒక వ్యసనం గా మారి, ఇంట్లో కూడా డబ్బు చేతిలో పెడితేనే పొద్దున బ్రష్ చేసుకోవడం దగ్గర్నుంచీ, తినడం,పడుకోడం అన్ని పనులూ లంచం ఇస్తేనే చేయడం అలవాటుగా మారింది. అమ్మా, నేనూ ఈయనకున్న ఈ వ్యసనం వల్ల ఎంతో ఇబ్బంది పడ్డాము, పడుతున్నాం. 


ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే నాతో పాటు ఆవిడా ఇబ్బంది పడి, అసహ్యించుకుంటే కష్టం అని పెళ్లి కూడా చేసుకోకుండా ఏదో ఉద్యోగం చేసుకుంటూ వీళ్ళను చూసుకుంటున్నాను. మనిషి ఏదైనా చెడ్డపని చేయాలని అన్పించినప్పుడు విచక్షణ ఉపయోగించి, చేయకుండా కంట్రోల్ చేసుకోవాలి. 


అనుకోకుండా అలవాటు అయితే అది శ్రుతి మించక ముందే దాన్ని కంట్రోల్ చేయాలి.  లేదంటే మా నాన్నలానే అవుతారు. ఒకవేళ పట్టుబడి జైల్లో ఉంటే కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమవుతుంది? 


ఈ లంచగొండులు ఒక్కసారి వాళ్ళ కుటుంబం గురించి కూడా ఆలోచిస్తే బావుంటుంది  లంచాలకు అలవాటు పడేముందు. ఈ దేశం లో ఈ లంచాలకు అలవాటు పడడం ఎప్పుడు తగ్గుతుందో? " అంటూ నిట్టూర్చుతూ ఆ వృద్దులను తీస్కుని వెళ్ళిపోయాడు.


ఆ విషయం విన్న పోలీసు, ఆహార తనిఖీ అధికారి సిగ్గుపడ్డారు. ‘ప్రజల్లో ఎంత చులకనాభావం వస్తుందో కదా మేము తీసుకునే లంచాల వల్ల’ అనుకుని తల దించుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయారు. వారిలో కలిగిన మార్పు చూసి, తన వ్యాపారం సజావుగా సాగుతుంది అని కామేశం సంతోషించాడు.


  ###


సుధావిశ్వం ఆకొండి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

కలం పేరు సుధావిశ్వం. పూర్తి పేరు అనురాగసుధ. వృత్తి లాయర్. ప్రవృత్తి రచనలు చేయడం. ట్రావెలింగ్ కూడా!

 కొన్ని నవలలు, కథలు వ్రాయడం జరిగింది.  ప్రస్తుత నివాసం ఢిల్లీ.




Comments


bottom of page