లతాంత వాచారపము
- Sudarsana Rao Pochampalli

- Aug 30
- 9 min read
#SudarsanaRaoPochampally, #సుదర్శనరావుపోచంపల్లి, #LathanthaVacharapamu, #లతాంతవాచారపము, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #ఆటవెలది

Lathantha Vacharapamu - New Telugu Poems Written By - Sudarsana Rao Pochampally
Published In manatelugukathalu.com On 30/08/2025
లతాంత వాచారపము - తెలుగు పద్యాలు
రచన : సుదర్శన రావు పోచంపల్లి
1.)రంగు రంగు పూలు రమణుల కంటును
వంగి వంగి దెంపి వనిత కీయ
సంగ తేమి మాది సరిగను బట్టక
విరుల బాధ వినుడు విజ్ఞు లార
2.)సుంద రంబు గుండి సుపరిమ ళంబును
ఇచ్చు మమ్ము జూచి ఇంపు అనక
పూయ గానె మమ్ము పూజకు అనుకుంటు
విరుల బాధ వినుడు విజ్ఞు లార
3.)మేము జేయు పాప మేదియు లేదన
మాకు శిక్ష యేల మనుజు లార
ఆడు కోవ నీక అమ్మకు దరినిల్చి
విరుల బాధ వినుడు విజ్ఞు లార
4.)పంక మందు బుట్టి పరిమళ మబ్బిన
మమ్ము ద్రెంప బూన మనసు యేల
అమ్మ కొంగు చాటు అలరులు అనబోక
విరుల బాధ వినుడు విజ్ఞు లార
5.)జాతి యందు మేము జగమున గొప్పన
నీతి లేని జనులు నిమిష మైన
తల్లి చెంత నుండ దలచక ద్రెంపగ
విరుల బాధ వినుడు విజ్ఞు లార.
6.)భాద్ర పదము నుండె భద్రత కరువాయె
విరుల తోడ నాట విశద మవగ
అదియె ఆడ వారు ఆడెడు బతుకమ్మ
విరుల బాధ వినుడు విజ్ఞు లార
7.)సౌమ్య గంధ పుష్ప సౌగంద్య మొందను
శ్యామ లెంద రోను శ్రమయు జెంది
కంట కంబు లున్న కనియును ద్రెంపర
విరుల బాధ వినుడు విజ్ఞు లార
8.)విరుల మంటె మేము విపులన స్త్రీజాతి
ఆడ వారి బాధ అర్థ మైతె
మాకు రక్ష ణిచ్చి మరియింక గాపాడ
విరుల బాధ వినుడు విజ్ఞు లార
9.)సూది దార మొంది సూనము మొకొకటి
చేత బట్టి గ్రుచ్చు చేష్ట గనగ
మాకు ఎంత బాధొ మాన్యులె ఎరుగేరు
విరుల బాధ వినుడు విజ్ఞు లార
10.)తోట లోన మాలి తోయము బోయుచు
పూల పెంపు జేసి పున్నె మొంది
వాటి దెంప బూను వారలు ఎందరొ
విరుల బాధ వినుడు విజ్ఞు లార
11.)అలరు రుధిర మేను అత్తరు పన్నీరు
విరుల విలువ దెలిసి విషయ మెర్గి
మనసు ఉన్న మీరు మానుడు ద్రెంపుట
విరుల బాధ వినుడు విజ్ఞు లార
12.)మనిషి పేర్లు అన్ని మముబోలె ఉండగ
కమల పద్మ పుష్ప కడకు కుసుమ
అంత బాగ నచ్చ అరుల తెరువుయేల
విరుల బాధ వినుడు విజ్ఞు లార
13.)ఇంట శుభము జరుగ ఇంపన పూవులె
మంచి కార్య మన్న మరువ బోరు
విరులు లేక యున్న వివహము జేతుర
విరుల బాధ వినుడు విజ్ఞు లార
14.)గుడికి బోవు వారు గుప్పెడు పూవులు
సజ్జ నింపు కోని సాగు చుంద్రు
పూజ జేయ నుంద్రు పున్నెము అనుచును
విరుల బాధ వినుడు విజ్ఞు లార
15.)నాయ కుణ్ణి జేరి ననహార మేయుచు
వారి కోర్కె జెప్ప వరుస గట్టి
పేరు పేరు జెప్పి పేచీలు పడెదరు
విరుల వాధ వినుడు విజ్ఞు లార
16.)పర్వ దినము నందు పాడియు అంటును
గుమ్మ మందు పూలు గుచ్చి కట్టి
సంత సంబు నుంద్రు సంతుయు సతిపతి
విరుల బాధ వినుడు విజ్ఞు లార
17.)ఉగము యెంతొ సుంత ఉండగ నుండను
మాన వుండె మమ్ము మనసు లేక
జముని వోలె వచ్చి జంపుట తగునేల
విరుల బాధ వినుడు విజ్ఞు లార.
18.) విందు లందు మరియు విరిబోడి సిగలోన
ఎందు జూడ నుండ ఎరుగ పూలె
అవస రంబు దీర అవియింక పెంటలొ
విరుల బాధ వినుడు విజ్ఞు లార
19.)మృదువు గాను ఉండి మృగనేత్ర జడలోన
అంద మెంతొ బెంచు అలరు లెన్నొ
మాప టేళ లందు మగువలు ప్రీతొంద
విరుల బాధ వినుడు విజ్ఞు లార
20.)పూల పాను పంటు పూలను పాన్పులొ
చల్లి వేసి యవ్వి చక్క గుండ
పొర్లి పొర్లి వాడ పొరకతొ నూడ్తురు
విరుల బాధ వినుడు విజ్ఞు లార
21.)తెమ్మె రందు మేము తేలుచు ఆడుచు
అమ్మ ఒడిన జేరి అలసి నట్టు
నిమ్మ ళంగ మేము నిదురించ ఛేదింత్రు
విరుల బాధ వినుడు విజ్ఞు లార
22.)పంట వృద్ధి జెంది ఫలములు ఈయను
కాంచ పూల తోనె కలుగు పంట
మందు జల్ల మేము మాడుచు బ్రతుకగ
విరుల బాధ వినుడు విజ్ఞు లార
23.)మధుర మైన తేనె మానుండె రాగను
విరుల విలువ మీకు విశద మవద
సుమము లేని చోట సుఖముయు కరువగు
విరుల బాధ వినుడు విజ్ఞు లార
24.)ఝుమ్ము ఝుమ్ము అంటు ఝుమ్మను నాదాలు
తేటు లన్ని వాలి తేనె దీయ
అట్టి తేనె మీకు అక్కర వచ్చేను
విరుల బాధ వినుడు విజ్ఞు లార
25.)పసిడి మోము పాప ఫల్యము వికసించు
నట్టు లుండు జూడ ననుచు బోల్చి
ముద్దు బెట్టు చెంతొ ముదమును జెందర
విరుల బాధ వినుడు విజ్ఞు లార
26.)పూల రకము లెన్నొ పుడమిన కనగను
ఏమి అంద మంటు ఎరుగు చున్న
గోట గిల్లి మమ్ము గోసకు గురిజేయ
విరుల బాధ వినుడు విజ్ఞు లార
27.)పాశ పాణి బుట్టె పద్మము నుండియె
ఆది లక్ష్మి గూడ అందు నుండె
ఏల పూల విలువ ఎరుగరు నరులింక
విరుల బాధ వినుడు విజ్ఞు లార
28.)కురుల యందు విరులు కూర్చుట న్యాయమ
ధరణి యందు మేము ధర్మ మనుచు
మంచి పరిమ ళమును మానక ఇత్తుము
విరుల బాధ వినుడు విజ్ఞు లార
29.)పూలు బేర్చి ఆడ పుణ్యము ఏమిటొ
గుమ్మ మందు మాల గుచ్చి వేసి
ఆడ వారు యేట ఆడర బతుకమ్మ
విరుల బాధ వినుడు విజ్ఞు లార
30.)ప్రకృతి యందు పూలె ప్రజలకు మేల్జేయ
విలువ నీయ బోక విరుల ద్రుంచ
చేతు లెట్లు వచ్చు చెప్పగ మీకును
విరుల బాధ వినుడు విజ్ఞు లార
31.)ఇంచు బోడి జూడ ఇంపని పూలను
కొంచె మైన మదిని కొంద లనక
మమ్ము ద్రెంపు చుంద్రు మహిలోన జూడను
విరుల బాధ వినుడు విజ్ఞు లార
32.)ప్రేత మందు గూడ ప్రేమంటు పూలను
చల్లు చుంద్రు జనము జగము నందు
మాదు గోస యెంత మాత్రము గనకుండ
విరుల బాధ వినుడు విజ్ఞు లార
33.)చేను చెల్క లందు చెప్పగ మేమేను
అంద మెంతొ గూర్చి ఆడు చుండ
మమ్ము ద్రెంప బూన మనసేల మీకింక
విరుల బాధ వినుడు విజ్ఞు లార.
34.)పూల యందు నుండు పుప్పొడె జీవము
మరల మరల మొక్క మహిలొ బుట్టి
పూలు బూయు చుండు పుడమిన పొలుపుగ
విరుల బాధ వినుడు విజ్ఞు లార.
35.)నలిన జుండు బుట్టె ననలొన దెలియగ
అతని తల్లి బుట్టె అందు లోనె
వేల్పు గన్న పూవె వెతలకు గురియాయె
విరుల బాధ వినుడు విజ్ఞు లార
36.)మధుర పాక మందు మంచిదనిగులాబి
అత్త రంటు జల్లి అమ్ము చుంద్రు
మనిషి తృప్తి పూర్తి మాపైనె దీరగ
విరుల బాధ వినుడు విజ్ఞు లార
37.)వివహ మందు బిల్వ విచ్చేయు వారికి
పూల అత్త రంటు బూసి ఇంక
కమ్మ నీరు పైన కలయను జల్లర
విరుల బాధ వినుడు విజ్ఞు లార
38.)శవము పైన గూడ జల్లుచు పూలను
పాడె మోయు చుంద్రు పదుగు రుండి
మేము లేని చోటు మేదిని గనలేరు
విరుల బాధ వినుడు విజ్ఞు లార
39.)దైవ పూజ జేస్తు దైవము పైనను
పూలు జల్లు చుంద్రు పున్నె మంటు
మనిషి పున్నె మొంద మాకేన తిప్పలు
విరుల బాధ వినుడు విజ్ఞు లార
40.) పంచ భర్తు కేమొ పతులందు భీముని
అలక పురికి యేగి అచట నున్న
చెంగ లువలు దేను చెప్పియు బంపెను
విరుల బాధ వినుడు విజ్ఞు లార
41.)కంట కంబు లున్న కడకును బురదలో
పెంట లోను ఐన పెరడు లోన
పూల వేట యెపుడు పుడమిన మనిషికి
విరుల బాధ వినుడు విజ్ఞు లార.)
42.)పూలు పూలు అంటు పురుషులు మగువలు
చేను చెలుక లందు చేత నైన
విధము దెచ్చి పేర్చు విధమేను బతుకమ్మ
విరుల బాధ వినుడు విజ్ఞు లార
43.)ఎన్ని పర్వ ములన ఎరిగియు యున్నను
అలరు పండు గనగ అదియె గొప్ప
అనుచు దలచు చుంద్రు ఆడుచు బతుకమ్మ
విరుల బాధ వినుడు విజ్ఞు లార
44.) తోర ణాలు పెక్కు తొయ్యలి గట్టేను
ఇంటి ద్వార మందు ఇంపు గంటు
సూది గ్రుచ్చ బాధ సుమములు బడుచుండ
విరుల బాధ వినుడు విజ్ఞు లార
45.)అధిక నిదుర బోవ అమ్మయె మేల్కొల్పి
చదువు లందు శ్రద్ధ చాల జూప
మంద లించు సుతుల మంచిగ జెబుతును
మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి
46.) పంచ బాణు కుండు ఫల్యపు బాణము
తపసు భంగ పరుచ తామర తూపరి
విరుల బాణ మేయు విజయము సాధించ
విరుల బాధ వినుడు విజ్ఞు లార
47.)మల్లె మొగ్గ పువుగ మారక ముందరె
తలలొ బెట్ట బూను తరుణు లరయ
తొంద రేల అంత తొయ్యలు లందున
విరుల బాధ వినుడు విజ్ఞు లార
48.)వియ్య మందు నాడు విరులును ఫలములు
వివహ మందు గూడ విరులు వాడ
ఆలు మగలు కూడ అలరులె ఆనాడు
విరుల బాధ వినుడు విజ్ఞు లార
49.)మంది రంబు నందు మగువలు అడుగిడి
అలరు లెన్నొ దెచ్చి అర్చ నంటు
అంత రాత్ము పూజ అనుచును జేతురు
విరుల బాధ వినుడు విజ్ఞు లార
50.)పెళ్ళి పిల్ల జేయ పెద్దగ పూదండ
కొప్పు నిండ ఉండ కోమ లపుడు
అంద మెంతొ కాన అలరుల మహిమేను
విరుల బాధ వినుడు విజ్ఞు లార
51.)పొద్దు గుంక నుండ పొలతులు పూదండ
తలలొ బెట్టు కోని తనివి దీర
రాత్రి గడుపు చుంద్రు రమణుతొ కులుకుచు
విరుల బాధ వినుడు విజ్ఞు లార
52.)రాజు రాణి రాగ రహదారి పొడవున
పూల బాట వేసి పురము నందు
జయము జయము అంటు జనులంత పొగడగ
విరుల బాధ వినుడు విజ్ఞు లార
53.)మొక్క లందు పూలు మొగ్గలు తొడుగగ
చక్క గున్న వంటు చాన మురిసి
నిక్కి నిక్కి ద్రెంపు నింపుతు బుట్టలు
విరుల బాధ వినుడు విజ్ఞు లార
54.)ఊరి జాత రందు ఉవిదలు అందరు
సిగలొ పూలు బెట్టి సిరులు గురియ
అమ్మ వారి మొక్క అరిగేరు ప్రతిసారి
విరుల బాధ వినుడు విజ్ఞు లార
55.)సుమము ఏది ఐన సుందర రూపము
పరిమ ళంబు యెంతొ పరిఢ విల్లు
మనిషి వాడు పూలు మందులు జేయను
విరుల బాధ వినుడు విజ్ఞు లార
56.) ధర్మ కార్య మేది ధామము జరుపగ
తొలుత విరుల కొరకె తొయ్య లెతుకు
ఫల్య మంటు లేక ఫలితము లేదంటు
విరుల బాధ వినుడు విజ్ఞు లార
57.)మొదటి రేయి నాడు మోదము జెందుచు
ఆలు మగలు జేర ఆత్ర మెరుగ
పట్టె మంచ మునకు ఫల్యముల్భూషించు
విరుల బాధ వినుడు విజ్ఞు లార
58.))తల్లి చెంత మేము తలదాచు కొనుచుండ
తలిరు బోణు లొచ్చి తట్ట మనక
మమ్ము ద్రెంప బూను మాతల్లి ఒడినుండి
విరుల బాధ వినుడు విజ్ఞు లార
59.)మల్లె మొల్ల జాజి మాకును పలుపేర్లు
ఎంతొ సొంపు గాను ఎగురు చుండ
మాకు బతుకు క్షణమె మనుషులు ద్రెంపగ
విరుల బాధ వినుడు విజ్ఞులార
60.)రాత్రి వేళ లందు రమణులు వలపుతొ
అలరు లల్లి దండ అంద మనుచు
కురుల యందు దురిమి కులుకుచు ఉందురు
విరుల బాధ వినుడు విజ్ఞు లార
61.)పల్లె లందు గూడ పడతుల జూడగ
పొలము పనులు జేస్తు పొంక మనుచు
బంతి పూలు తలలొ భద్రంగ బెడ్దురు
విరుల బాధ వినుడు విజ్ఞు లార
62.)తేటు లన్ని వాలి తెచ్చిన తేనెను
తియ్య నంటు మనిషి తినుచు నుండు
కనరు పూల వలన కలిగెను తేనని
విరుల బాధ వినుడు విజ్ఞు లార
63.)అలరు దండ లల్లి అధిదైవ మునకును
ఉదయ మందె లేచి ఉవిద కోటి
కోవె లందు నొసగు కోర్కెలు ఈడేర
విరుల బాధ వినుడు విజ్ఞు లార
64.)పుడమి నందు మనిషి పున్నెము పొందను
విరుల వాడు చుంద్రు విప్రు లడుగ
నోము వ్రతము లెన్నొ నోచుచు వారలు
విరుల బాధ వినుడు విజ్ఞు లార
65.)బాప నయ్య తాను బాగుండ రెండేసి
జన్మ లొంద బూను జగము నందు
పూల గోల వినడు పున్నెము ద్విజుకెట్లు
విరుల బాధ వినుడు విజ్ఞు లార
66.)పూల కొరకె సత్య పూనెను అలకంటు
పారి జాత పూవు పట్టు కొచ్చి
కృష్ణు డీయ సతికి కృంగెను ఈర్షతొ
విరుల బాధ వినుడు విజ్ఞు లార.
67.)ఒక్క నాడు ఐన ఒనరగ గనబోడు
పుడమి నందు మనిషి పూల గోల
పూలు వాడు కుంటు పున్నెము తనకని
విరుల బాధ వినుడు విజ్ఞు లార
68.)మల్లె మొగలి గంధ మరియుననగులాబి
మంచి నీటి లోన మరుగ నుండ
అత్త రంటు జేయ అదియెంత నరకమొ
విరుల బాధ వినుడు విజ్ఞు లార
69.)ఫల్య మందు నుండె పన్నీరు దీతురు
చల్ల గుండు నెపుడు చల్లు చుండ
మేము నీట మరుగ మేలగు మీకేమొ
విరుల బాధ వినుడు విజ్ఞు లార
70.)శవము మోయు చుండ శవముపై పూలనె
చల్లు చుంద్రు జూడ జనము అపుడు
మాకు నిత్య చావె మానవు లందున
విరుల బాధ వినుడు విజ్ఞు లార
71.)జాత కాలు జనులు జాగ్రత్త పడనెంచి
దీర్ఘ కాల మందు దీప్తి జెంద
క్షణము ఐన మేము క్షాంతిని బ్రతుకొద్ద
విరుల బాధ వినుడు విజ్ఞు లార
72.)జనులు జాత కాలు జాగ్రత్త గనుచుంద్రు
దీర్ఘ కాల మందు ధిషణి బతుక
క్షణము ఐన మేము క్షాంతిని బ్రతుకొద్ద
విరుల బాధ వినుడు విజ్ఞు లార
73.)పెళ్ళి నాడు వధువు ప్రేంఖణ మెక్కగ
అలరు లెన్నొ దెచ్చి హవణి జేయ
విరుల పరిమ ళాలె విందని పించేను
విరుల భాధ వినుడు విజ్ఞు లార
74.)మనిషి పరవ శించ మాధుర్య పరిమళం
విరుల నుండె వచ్చు వినగ కనగ
బుద్బు దంబె పుడమి పూలది బతుకైన
విరుల బాధ వినుడు విజ్ఞు లార
75.)దివ్వె లందు పర్వ దినమని తలచుచు
విరుల వాడ కంబె విరివి గుండు
దండ లల్లి బంతి దర్వాజ గడ్దురు
విరుల బాధ వినుడు విజ్ఞు లార
76.)అంద రింట జూడ ఆనంద పడుచును
పండు గంటు జేయ ఫల్య మేను
జాస్తి వాడు చుంద్రు జగమున జనులంత
విరుల బాధ వినుడు విజ్ఞు లార
77.)ఏమి శాప మేమొ ఎరుగను లేమింక
జనము పర్వ దినము జరుపు కొనగ
సుమము పొందు బాధ సుంతయు గాదన
విరుల బాధ వినుడు విజ్ఞు లార
78.)కుత్తు కందు సూది గ్రుచ్చుతు దారము
గొంతు వరకు గ్రుచ్చి గోస మాది
వినక నుంద్రు జనము విధిరాత వక్రించ
విరుల బాధ వినుడు విజ్ఞు లార
79.)యుగము లెన్నొ గడువ యుక్తపు బతుకన
పూలు ఎరుగ బోవు పుణ్య భూమి
నరులు సుఖము జెంద ననలకు నరకమే
విరుల బాధ వినుడు విజ్ఞు లార.
80.)మధుర తేనె గ్రోలి మధుకర జాలము
విరుల హాని తలుచు విధము లేదు
నరక మంటె మాకు నరులేను జూపగ
విరుల బాధ వినుడు విజ్ఞు లార
81.)సౌమ్య గంధ మునకు సరితూగు మొగలియు
కంట కంబు లెన్నొ కలిగి యుండ
వాటి జాడ లెతికి వదులరు నరులన
విరుల బాధ వినుడు విజ్ఞు లార
82.)సూది తోడ గుచ్చి సుకుమార మనకను
మాది బతుకు ఎపుడు మంట గలిపి
నరక మంటె ఏదొ నరులేను చూపేది
విరుల బాధ వినుడు విజ్ఞు లార
83.)బతుకు బాగు జేయు బతుకమ్మ అనుకుంటు
ఆడ వారు గూడి ఆడు చుంద్రు
తల్లి చెంత నుండ తరలించి బూవుల
విరుల బాధ వినుడు విజ్ఞు లార
84.)ప్రకృతి మనిషి కొసగె ప్రాణము గాపాడు
వరము విరుల రూపు వసుధ యందు
అలరు శాప మన్న అదియెను గాబోలు
విరుల బాధ వినుడు విజ్ఞు లార
85.)సౌమ్య గంధ మనగ సౌరభ మీయనె
పండు కాయ లేవి పండ బోవు
అయిన వాడు చుంద్రు హవణింపు కొరకని
విరుల బాధ వినుడు విజ్ఞు లార
86.)మమ్ము వాడి మరుడు మంటల పాలాయె
తాను బతుక డాయె తనర మమ్ము
బతుక కుండ జేసె బడరుడి కోపాన
విరుల బాధ వినుడు విజ్ఞు లార
87.)సూర్య చంద్రు లనగ చుట్టాలు ఐనను
రాత్రి పగలు మాకు రక్ష ణేది
మనిషి దృష్టి పడగ మాకింక దిగులేను
విరుల బాధ వినుడు విజ్ఞు లార
88.)పరిమ ళాలు ఇచ్చి పరిపూర్ణ సుఖమీయ
జనులు తృప్తి గనరు జగము నందు
మమ్ము వాడి తుదకు మార్జని పనియంద్రు
విరుల బాధ వినుడు విజ్ఞు లార
89.)వాలి జంపు నాడు వాడెను రాముడు
విరుల దండ యొకటి విజయ మొంద
అనుజు మెడల వేసి అరినింక గుర్తించ
విరుల బాధ వినుడు విజ్ఞు లార
90.)బండి నిండ పూలు బతుకమ్మ కనితెచ్చి
అలరు పండు గనుచు ఆడి పాడి
ఆట ముగియ గానె అంభస్సు విడుతురు
విరుల బాధ వినుడు విజ్ఞు లార
91.)వేల్పు లైన మెడలొ వేతురు పూదండ
ముగ్గు రమ్మ లైన ముదము తోడ
విరుల హార మేసి విహరించు లోకాలు
విరుల బాధ వినుడు విజ్ఞు లార
92.)కనుము పండు గంటె కర్షకు లందరు
పసుల పూజ జేయ పాళె మందు
కట్టు చుంద్రు పూలు కంబళి మెడలోన
విరుల బాధ వినుడు విజ్ఞు లార.
93.)మకర సంకు రాత్రి మగువలు ఎందరొ
బంతి పూలు గృచ్చి బయట ఇంట
సరబ డందు గట్టి సంతోష పడుచుంద్రు
విరుల బాధ వినుడు విజ్ఞు లార
94.)అలతి కాల బతుకు అలరుల దవనిన
అంత కొంత గూడ అంద కుండ
మాన వుండు విరుల మహిబత్క నీయరు
విరుల బాధ వినుడు విజ్ఞు లార
95.)పూలు పాప మేమి పుడమిన జేసెను
మనిషి బెట్టు హింస మాను టెట్లు
క్షణము కాల మైన క్షాంతిన బతుకొద్ద
విరుల బాధ వినుడు విజ్ఞు లార
96.)మంచి పరిమ ళంబు మధువుయు నిండుండ
సారఘంబు గ్రోల సరఘ లొచ్చి
సూన హాని జేయ సుంతయు దలుపవు
విరుల బాధ వినుడు విజ్ఞు లార
97).మహిలొ జీవు లందు మానవ జీవులు
శ్రేష్ట మనగ నుండ శ్రేయ మేది
తలువ కుండ నుంద్రు ధరణిన సుమమందు
విరుల బాధ వినుడు విజ్ఞు లార
98.)సురభి యందు పూలు సుకుమార సౌగంధ
మరయ నున్న గూడ మనుజు లెపుడు
గుండె లోన సూది గుచ్చుచు పీడింత్రు
విరుల బాధ వినుడు విజ్ఞు లార
99.) పూలు చెట్టు మీద పూయుచు ఉండగ
మదిలొ సంత సించి మాన వుండు
విరులు ద్రెంప బూను విడువక చెట్టుపై
విరుల బాధ వినుడు విజ్ఞు లార
100.) పర్వ దినము నాడు పడతులు హర్షించి
సుమము లందున స్పృహ సుంత గల్గ
విడువ బోరు ఇంక విరులను ద్రెంపగ
విరుల బాధ వినుడు విజ్ఞు లార.
101.)మొక్క లందు పూలు మొగ్గలు తొడుగగ
పూవు లన్ని పూర్తి పూయ కున్న
గోట గిల్ల నుంద్రు గోసలు ఎరుగరు
విరుల బాధ వినుడు విజ్ఞు లార
102.)అలరు ఆయు వన్న అదియెంతొ లిప్తము
అంత గూడ బతుక ఆగ కుండ
పూయు తడవు ద్రెంపు పూవుల మనుజులు
విరుల బాధ వినుడు విజ్ఞు లార
103.)కొమ్మ చాటు నుండ కొమ్మలు జూచుచు
వెతికి వెతికి మేము వెరచు చుండ
అన్ని పూలు ద్రెంపి ఆనంద పడెదరు
విరుల బాధ వినుడు విజ్ఞు లార
104.)ఏమి పాప మేమొ ఎరుగము మేమింక
మాకు శాప మేల మహిలొ జూడ
అర్థ ఆయు వుండి అసువుల కెసరంద్రు
విరుల బాధ వినుడు విజ్ఞు లార
105.)ముప్పు ముందె దెలిసి ముళ్ళను గలిగుండ
వాటి జూసి గూడ వదల కుండ
జనము ద్రెంప నుంద్రు జాలియు గనకను
విరుల బాధ వినుడు విజ్ఞు లార.
106.)దైవ పూజ కైతె దైన్యము వీడుతు
పూలు గూడ తమకు పున్నె మంటు
హర్ష మొందు చుండు హరిసేవ కర్పించ
విరుల బాధ వినుడు విజ్ఞు లార
107.)పేరు ఏల వచ్చె పెద్దగ పూలకు
జాతి యందు పూలె జగము నందు
శ్రేష్ట మనుచు నుండ శ్రేయము మాకేది
విరుల బాధ వినుడు విజ్ఞు లార
108)పుష్ప జాతి జూడ పుడమిన శ్రేష్టము
నిష్ప్ర యోజ నంబు నిశ్చ లందు
క్షణము క్షణము భయము క్షాంతిన గనగను
విరుల బాధ వినుడు విజ్ఞు లార
***
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.




Comments