top of page

లక్ష్మణ లేఖ.. 



'Lakshmana Lekha' - New Telugu Poem Written By M. Laxma Reddy

Published In manatelugukathalu.com On 18/06/2024

'లక్ష్మణ లేఖ..' తెలుగు కవిత

రచన: M. లక్ష్మా రెడ్డి


సరిగానే చదివారు... 

లక్ష్మణ రేఖ తెలుసు మనకి...

ఇది లక్ష్మణ లేఖ 


సీతమ్మ తల్లి పాద పద్మములకు.. నమస్సులతో

ఎలా ప్రారంభించాలో తెలీని..

అసలు ఈ లేఖ సందర్భం 

ఈ క్షణం వరకు నాకే అర్థం కాని

సంకట స్థితిన..


మీ మానసిక ఆందోళన అర్థమై.. కానీ 

నాకే ఎలా ప్రతిస్పందించాలో అర్థమవక..

మిమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం..

ఎదురుపడి మీ మౌనాన్ని భరించే శక్తి లేక..

నా ఎద స్పందన.. నా మనసు భావన ఈ లేఖ...


ఏంటో..  అన్నయ్య కనబడుట లేదు..

తన జాడకై..

నేను అటూ ఇటూ అని అన్నివైపులా..

 వెతికినా కనబడక ..

 కనీసం మాట కూడా వినబడక..

గుండె విలవిలలాడ..

ఒక సన్నని నవ్వు..నాకు మాత్రమే వినబడి..

అది అన్నయ్యది అని నాకు మాత్రమే బోధపడి..

కన్నెత్తి .. మీ వైపు చూడడం దోషమని ఆగిపోయా..


లీలగా తెలుస్తుంది . మీ వెనకే అన్నయ్య దాక్కుని

నాతో పరాచికాలు ఆడుతున్నారని..

నేనెంత వెతికినా ఇంకా..ఎక్కడ తను కనబడేది ..

మీ హృదయ సామ్రాజ్య చక్రవర్తికి వేరే స్థానం ఎందుకు..

ఈ ఆలోచన తట్టకే.. 

జగజ్జేత రాముని కోసం...నే వెతకడం ..

ఇప్పుడు నా పెదాలపై  సన్నని నవ్వు... 


ప్రేమతో కూడిన ఓ  ఓటమి భావన వల్ల...

నా అన్నయ్య కదా . నా ప్రేమ నాది..

కానీ మీ ప్రేమ...అనంతం..

అన్నయ్య మీ ప్రేమలో సదా బందీనే..

మీ మనసు దాటి అన్నగారు రాలేరు..

తను లేక మీ ఘడియ కూడా గడవదు .

లక్షణం..  మీ జంట..

సలక్షణం.. మీ బంధం..


మీకు అన్నయ్య పక్కనే ఉన్నాడు.. ఉంటాడు..

మాకెల మరీ... సీతమ్మ..

రాముడంటేనే.. చిరునవ్వు వదనం కదా..

మాకోసం .. మీరు వాటిని మీ చిరునామా 

కింద జమేయచ్చుగా..


రామ్ అంటేనే . . ప్రేమ

మా కోసం .. అన్న ప్రేమని కూడా 

మీరే ప్రసాదించే భాగ్యం కల్పించరా..


రాముడంటేనే.. ఓ బాధ్యత..

మా కోసం మీరు.. ఆయన బాధ్యతని కూడా

అవలీలగా మోసేయరా..


మిము చూడలేని.. అశక్తత మాది..

మిము గాంచలేని..  బంధం మాది..

మీ వెనకే దాగి..మమ్ము అల్లరి పెడుతున్న

మా అన్నగారిని ఎలా వీక్షించడం..


ఏమీ పరీక్ష..

అన్నని చూడాలని..

అన్ననే చూడలేని..

సీతమ్మ.. ఇదే నా వేదన..

 అన్నగారికోసం ఆవేదన..


ఈ జగంలో..

ఇది అర్థం అయ్యేది మీ ఒక్కరికే..

నా బాధ .. 

నా మనో వ్యాకులత కనబడేది మీ మనసుకే..


సీతా అని మిము ప్రేమించే నా అన్న...

లక్ష్మణా అని వాత్సల్యంతో పిలిచే నా అన్న..

మీతోనే..మాకు మాత్రమే తెలిసిన సత్యం ఇది..


రామునికి సీతా హృదయాన్ని మించి 

సాంత్వననిచ్చే ప్రదేశమేది..

రామునికి సీతా సాంగత్యాన్ని మించి

ఆనందాన్నిచ్చే దేశమేది..


మీ లోకంలో.. మీతో సరదాగా..

మీ ఊహల్లో..మీతో నవ్వుతూ..

మీ ఆశల్లో.. అనుక్షణం నడిపిస్తూ .

మీ బంధాల్లో..సదా కనబడుతూ..

మీ బాధ్యతల్లో.. అగుపడని తోడుగా

కరిగే మీ క్షణాల్లో ..

కదిలే హృదయ కణాల్లో..

కదిలే మీ కలంలో 

కరిగే ఈ కాలంలో


సీతారాముడు సదా..

ఇక మీతోనే కదా..

మీ ఆజ్ఞ కై..

ఏళ్ల వేళలా..

మీ గుమ్మం అవతల...

వేచి ఉండే..

అన్నయ్య ప్రేమలో... 

లక్ష్మణుడు..

***

M. లక్ష్మా రెడ్డి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నేను లక్కీ.. లక్మారెడ్డి 

రసాయన శాస్త్ర బోధన వృత్తి.. ప్రైవేటు కళాశాలే సుమా..

అడపా దడపా.. కలం కాగితం కనబడగానే...మనసు మాటలు అక్షరాల రూపంలోకి దొర్లి.. మనసు తేలిక అవుతుంది...ఆ ప్రయాసలోనే.. ఆ ప్రహసనం లోనే.. నా కవితలు.. చిన్ని కథానిక లాంటి నాలుగు పంక్తులు..

నచ్చితే..ఒకాట చెప్పండి.. ఇంకోటి రాస్తాను..

నచ్చకుంటే భేషుగ్గా చెప్పండి... ఇంకాస్త పద్ధతిగా రాస్తాను...

ధన్యవాదాలు...


44 views1 comment

1 Comment


చాలా బావుంది.

Like
bottom of page