మకర సంక్రాంతి విశిష్టత
- Sudha Vishwam Akondi

- 4 days ago
- 3 min read
#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #TeluguArticle, #MakaraSankranthiVisishtatha, #మకరసంక్రాంతివిశిష్టత

Makara Sankranthi Visishtatha - New Telugu Article Written By Sudhavishwam Akondi Published in manatelugukathalu.com on 15/01/2026
మకర సంక్రాంతి విశిష్టత - తెలుగు వ్యాసం
రచన: సుధావిశ్వం ఆకొండి
సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. మకర రాశిలోకి ప్రవేశించిన రోజును మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటాం!
మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. ఆ తరువాత కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులలో సూర్యుడు కొనసాగినంత కాలము ఉత్తరాయణ కాలం.
పూజలకు, సాధనలకు, ఆధ్యాత్మిక కృషికి అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము ఈ ఉత్తరాయణ పుణ్య కాలం.
కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గరినుండి మొదలై, ఆ తరువాత సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనూరాశులలో సూర్యుడు కొనసాగినంత కాలము దక్షిణాయణ కాలం. ధ్యానానికీ, అర్చనకు, యోగానికీ, దీక్షలకు, బ్రహ్మచర్యానికి, నియమ నిష్టలకు అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయణ కాలం. పన్నెండు నెలల సంవత్సర కాలములో ఆరు నెలల దక్షిణాయణము దేవతలకు ఒక రాత్రి, ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్య కాలము. ఈ కాలంలో శరీరం వదిలిపెడితే ఉత్తమలోకాలు కలుగుతాయని చెబుతారు. కనుకనే ఇచ్ఛా మరణ వరం కలిగిన మహానుభావుడైన భీష్ముడు, అంపశయ్యపై ఉండి కూడా, ఉత్తరాయణము వరకూ ఎదురు చూసి ఉత్తరాయణము ప్రవేశించిన తర్వాత తనువును చాలించాడు. అంతటి గొప్ప కాలం ఇది.
ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేయు ఏ దానమైన శ్రేష్టమైనదని చెప్పబడింది. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు మొదలయినవి దానం చేస్తారు. ఇవి కాక ఈ కాలంలో గోదానం చేస్తే దాని ఫలితంగా స్వర్గ లోక ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు.
సంక్రాంతి పండుగ రోజు ముందు నుండే ముఖ్యమైన సంప్రదాయంగా ఇంటిముందు రంగవల్లులు తీర్చిదిద్దడం ఉంది. అందమైన రంగులతో వేసిన ముగ్గులు ఇంటికి అందాన్ని ఇవ్వడమే కాదు. పాజిటివ్ ఎనర్జీ ని కలిగిస్తాయి. మరో అంతరార్థం కూడా ఉంది. పూర్వం ఆవుపేడతో ఇంటి ముందు కళ్ళాపు జల్లి ముగ్గులు వేసి, ఆవుపేడతో గొబ్బెమ్మలు తయారుచేసి, ముగ్గు వద్ద పెట్టడం ఆచారంగా వస్తూ ఉంది. ఇంకా రకరకాల పిండివంటలు చేస్తారు.
రాళ్ళూ రప్పలూ లేకుండా ఒక పద్ధతిలో ఆవుపేడతో అలకబడిననేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతం. ఒక పద్ధతిలో పెట్టిన చుక్కలు రాత్రి వేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం. చుక్కల చుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్ళలో ఇమిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పడికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం. ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్య స్థానానికి సంకేతం.
ఇంకొక దృక్పథంలో గీతలు స్థితశక్తికి (స్టాటిక్ ఫోర్స్), చుక్కలు గతిశక్తి (డైనమిక్ ఫోర్స్)కు సంకేతాలని, ముగ్గులు శ్రీ చక్ర సమర్పణా ప్రతీకలని శక్తి ఆరాధకులు చెబుతారు. ఇక వివిధ ఆకారాలతో వేసే ముగ్గులు, విల్లు పునర్వసు నక్షత్రానికీ, పుష్పం పుష్యమీ నక్షత్రానికీ పాము ఆకారము ఆశ్లేష కూ, మేక, ఎద్దు, పీత, ఇలాంటివి మేష, వృషభ, మిధున, కర్కాటకరాసులకూ, తొమ్మిది గడుల ముగ్గు నవగ్రహాలకూ సంకేతాలుగా చెప్పవచ్చు.
పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్ళైన గోపికలకు సంకేతంగా చెబుతారు. ఈ పేడ ముద్దల తలమీద కనుపించే రంగుల పూలరేకులు, పసుపు కుంకుమలు ఆ గోపికలందరూ భర్తలు జీవించియున్న పునిస్త్రీలకు సంకేతం. ఆ గోపికా స్త్రీల రూపాలకు సంకేతమే గోపీ+బొమ్మలు= గొబ్బెమ్మలు. మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణ భక్తి తమకూ కలగాలని ప్రార్థిస్తుంటారు. దీనిని సందే గొబ్బెమ్మ అంటారు. గొబ్బెమ్మలు పొద్దున పూట ముగ్గులో ఉంచి, దానిపై గుమ్మడి పూలుతో అలంకారం చేస్తే చాలా అందంగా ఉంటుంది.
సంవత్సరంలో మిగిలిన రోజులలో నల్ల నువ్వులు వాడరు. కాని సంక్రాంతి పర్వదినాన మాత్రం నల్లనువ్వులతో మరణించిన పితృదేవతలందరికీ తర్పణములివ్వడం ఎక్కువగా చేస్తుంటారు. సంక్రాంతి పర్వదినాలలో వారి వారి ఆచార సంప్రదాయాలను అనుసరించి ఈ కార్యక్రమము చేస్తుంటారు. ఈ రోజు బూడిద గుమ్మడికాయ దానము ఇస్తారు.
మట్టితో ఒక బొమ్మను (సంక్రాంతి పురుషుడు), తన వాహనాన్ని తయారుచేసి ఆ వాహనంపై సంక్రాంతి పురుషుడు వస్తాడని ప్రయత్నించి నమ్మకం. ప్రతి సంవత్సరం వేరు వేరు వాహనాల పై ఈ పురుషుడు వస్తాడు. ఏ వాహనాన్ని ఎక్కి వస్తే, ఆ వాహనానికి ఆ సంవత్సరం ఎక్కువ నష్టమని ఒక నమ్మకం. మేళ తాళాలను చేసి, సంక్రాంతి మూడు రోజుల్లో పూజలు చేస్తారు.
గొబ్బిళ్ళతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించి ఇళ్ళు కళకళలాడుతూ ఉండగా, హరిని కీర్తిస్తూ హరిదాసు రావడం, భగవంతుడే వచ్చినట్లుగా ఆనందిస్తూ ఆయనకు బియ్యం వేస్తారు. ఆయన తలమీద మంచి గుమ్మడికాయ ఆకారంలో గల పాత్ర గుండ్రముగా ఉండే భూమికి సంకేతం దాన్ని తలమీద పెట్టుకొని ఉండటం శ్రీ హరి అయిన తానే భూమిని ఉద్దరిస్తున్నానని (ఉత్+దరించు= తలమీద పెట్టుకోవడం) అని చెప్పే దానికి సంకేతం. హరినామ కీర్తన చేస్తూ రావడం తను ఏ భోగాలకూ లొంగను కేవలం హరినామ సంకీర్తనకే వచ్చే వాడిననీ తనకు తమపర భేదాలు లేవనీ అందుకే ప్రతి ఇంటికీ తిరుగుతూ వస్తాడనే సంకేతం కనిపిస్తుంది.
మూపురం శివలింగాకృతిని గుర్తుచేస్తూ శివునితోసహా తను సంక్రాంతి సంబరాలకు హాజరయ్యానని చెప్పే సంకేతం ఆ గంగిరెద్దు. ఆవు లేదా ఎద్దు ఇంటి ముందు ముగ్గులో నిలిచిందంటే ఆ నేల ధర్మబద్దమైనదని అర్థమని పండితులు చెబుతారు. ఆ నేల ఆవుకి సంకేతం ఆ నేలనుండి వచ్చిన పంటకు సంకేతం ముంగిట నిలిచిన వృషభం. మీరు చేసే దానమంతా ధర్మబద్దమేనంటూ, దానిని మేము ఆమోదిస్తున్నామని ఇంటింటికీ తిరుగుతుంటారు వృషభ సహిత శంకర పరివారం.
ఇక ఈ పండుగ పిల్లలందరికి చాలా ప్రత్యేకమైన పండుగ. ఎందుకంటే పిల్లలు అరోజు పొద్దుటి నుండి సాయంత్రం వరకు గాలిపటాలను తోటివారితో పోటీలు పడుతూ పైకి ఎగరేసి, ఆనందంగా గడుపుతారు.
గాలిపటాలు ఎగురవేయడం పిల్లల్లో జీవితంలో గొప్ప స్థాయిని సాధించడానికి ఆరోగ్యకరమైన పోటీతత్వం ఉండాలనే సంకేతాన్ని ఇస్తుంది.
అభిమాన పాఠకులు అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు 💐💐💐
సుధావిశ్వం

-సుధావిశ్వం




Comments