top of page

మనస్సు మెచ్చిన మగువ..!!

గమనిక : ఈ కథ మనతెలుగుకథలు.కామ్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సంక్రాంతి 2021 కథల పోటీలో ప్రత్యేక బహుమతి గెలుచుకుంది. ఎంపికలో పాఠకుల అభిప్రాయం కూడా పరిగణనలోకి తీసుకున్నాం.

'Manassu Mecchina Maguva' written by Lakshmi Kumar

రచన : లక్ష్మి కుమార్

"అమ్మా వెళ్ళొస్తా! అంటూ భుజానికి హ్యాండ్ బ్యాగ్ వేసుకొని బయలు దేరింది రూప".

జాగ్రత్తమ్మా! అంటూ ఆమె వెనుకే వచ్చి.. గేట్ దగ్గరకేసి.. రూప వైపే చూస్తూ కాసేపు అక్కడే నిలబడింది రూప వాళ్ళమ్మ రాజ్యలక్ష్మి .. రూప మాత్రం అడుగుల వేగాన్ని పెంచి, వీలైనంత తొందరగా ఈ నాలుగిళ్ళు దాటి పోవాలి, అన్నట్టు నడుచుకుంటూ మెయిన్ రోడ్ వైపు వెళ్తుంది. కానీ రోజూ లాగా ఆ కాలనీలో వాళ్లు , ఆమె వైపు చూసే అనుమానపు చూపులు మాత్రం బాధిస్తూనే ఉన్నాయి...


రాజ్యలక్ష్మి గారుండే ఇంటికి పక్క వీధిలో ఉన్న జగన్నాధం...

"విమలా అబ్బాయి బయలు దేరిన ఫ్లయిట్ కరెక్ట్ టైమ్ కే వస్తుందట. ఐదుగంటలకల్లా ఇంట్లో ఉంటానని, ఫోన్ చేసాడు' అని పెద్దగా చెప్తున్నాడు.

" అరె ఎన్ని సార్లు చెప్తారండీ.. వాడు నాకు గంట ముందే ఫోన్ చేసాడు.నన్ను ముందు వంట చేయనివ్వండి" అంటూ తన పనిలో ఉంది విమల...సాయంత్రం ఐదు గంటలకే విశ్వ తేజ వచ్చిన కారు ఇంటిముందు ఆగింది.


"విశ్వా! మీ బావ ఎయిర్ పోర్ట్ కి వస్తానన్నాడు రాలేదా "అంటూ విశ్వ చేతిలో సూట్ కేస్ అందుకున్నాడు జగన్నాధం.

" లేదు నాన్నా నేను వద్దని చెప్పాను. ఆల్రెడీ కంపెనీ వాళ్ళ కార్ ఉందిగా..' అని చెప్పి.. "అమ్మా..ఆకలి.,.. స్నాక్స్ ఏమైనా పెట్టు ముందు " అంటూ లోపలకు వచ్చాడు విశ్వ.

ప్లేట్ నిండా పెట్టిన వేడివేడి గారెలతో "ఈసారైనా నెల రోజులు ఉంటావా లేదా"అని అడిగింది విమల.

విశ్వ నవ్వుతూ "అలాగే" అని, అమ్మ చేతిలోని ప్లేట్ తీసుకున్నాడు.. కాసేపటికే విశ్వ ఫ్రెషప్ అవ్వగానే, విమల ఒక ఫైల్ తీసుకువచ్చి.. "విశ్వా.. చాలా సంబంధాలు వచ్చాయి.. అందులో బాగున్న అమ్మాయిల్ని వాళ్ల చదువులు చూసి ఒక 20 ఫోటోలు సెలెక్ట్ చేశాను రా.. ఇంక చూసుకోవాల్సిందే నువ్వే.. నీకు ఎవరు నచ్చితే వాళ్ళతో నాన్నగారు, నేను మాట్లాడుతాం " అంటూ ఫైల్ ముందు పెట్టింది..

"రేపు చూస్తాను లేమ్మా.."


"లేదు ఇప్పుడు చూడు.. మళ్ళా రేపు ఒకసారి చూడు.. రేపు సాయంత్రానికి నువ్వు ఏదో ఒకటి ఫైనల్ చేయాలి.. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చెప్పి.. మళ్లా ఒక సంవత్సరం వాయిదా వేయించావు .. ఈసారి అలాంటి పప్పులు ఉడకవు.. నాకు కూడా ఓపిక లేదు విశ్వా.. వీలైనంత తొందరగా నీ పెళ్లి చేయడమే.. మా ముందున్న పెద్ద పని. అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది విమల.. విశ్వ ఫైల్ పక్కనపెట్టి.. మంచంపై వాలి పోయాడు... ఉదయం ఐదు గంటలకే మెలకువ వచ్చింది విశ్వకి.. అదే కాలనీలో ఉన్న తన ఫ్రెండ్ రామ్ కి ఫోన్ చేసి,

"అరేయ్ ఎక్కడున్నావ్.. వెంటనే ఇంటికి రా. జాగింగ్ కి వెళ్దాం" అని చెప్పాడు. కాసేపటికి రామ్ తో కలిసి.. నడక మొదలు పెట్టాడు విశ్వ.. ఇంతలో విశ్వ చూపు ఎదురుగా వస్తున్న రూపపై పడింది.. రూప విశ్వ, రామ్ ని చూసి తల క్రిందకు దించుకొని ఇంటివైపు నడిచింది.. ఆమె వారిని దాటి వెళ్ళిపోయినా విశ్వ వెనక్కి తిరిగి చూశాడు.

అది గమనించిన రామ్... "ఏంటి విశ్వా ! అమ్మాయి బాగుంది అని అనుకుంటున్నావా.. అమ్మాయి ఎంత బాగుందో.. క్యారెక్టర్ అంత బ్యాడ్" అని చెప్పాడు.

"విశ్వ ఒక్కసారి ఉలిక్కిపడి "నీకెలా తెలుసు" అన్నాడు.

"ఏమో! ఈ కాలనీలో ఎవరినడిగినా చెబుతారు... అమ్మాయి మార్నింగ్ స్కూల్ లో వర్క్ చేస్తుంది టీచర్ గా.. కాని రాత్రి సెవన్ ఓ క్లాక్ కి వెళ్లి.. మళ్ళా ఉదయం 5 గంటలకు ఇంటికి వస్తుంది.. ఇది రోజూ జరిగే పని. సాఫ్ట్ వేర్ అంటే షిఫ్ట్ లు ఉంటాయి... కానీ అమ్మాయి నార్మల్ డిగ్రీ కూడా కంప్లీట్ చేయలేదు అని తెలిసింది. మరి రాత్రి చేసే ఉద్యోగం ఏమంటుంది రా? కాలనీ వాళ్ళందరికీ ఈ అమ్మాయి మీద మంచి అభిప్రాయం లేదు. వాళ్లు కూడా ఈ మధ్య ఇక్కడ రెంటు కు వచ్చారు. వచ్చి ఒక నెల అయి ఉంటుంది. మన కాలనీ మీటింగ్లో.. ఈ అమ్మాయి గురించి డిస్కషన్ నడుస్తుందట.. ఓనర్ కి ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేయించాలని అనుకుంటున్నారట.. ఫ్యామిలీస్ ఉండేచోట.. ఇలాంటి వాళ్ళు వద్దు అంటున్నారు" అని చెప్పాడు రామ్. విశ్వ ఏం మాట్లాడలేదు. జాగింగ్ కంప్లీట్ అయి ఇంటికి వెళ్ళిపోయారు.. విశ్వ.. ఇంటికెళ్లి ఆరోజంతా.. కంపెనీ పని తో బిజీగా ఉన్నాడు..


సాయంకాలం ఫ్రెండ్ పార్టీ కి పిలిస్తే.. బయటకు బయల్దేరాడు విశ్వ.. అప్పుడే రూప.. మళ్లా బయటకు వెళ్తుంది. ఈసారి విశ్వ కూడా ఆమెను అనుమానంగానే చూశాడు.. రూప మాత్రం విశ్వ ని చూడకుండా మెయిన్ రోడ్ కి వెళ్ళిపోయింది..

పార్టీనుండి ఇంటికి తిరిగి వచ్చాక.. విశ్వ వాళ్ళ అమ్మని..

"మన పక్క వీధి లో ఉన్న ఫ్యామిలీ..అదే ప్లాట్ నెంబర్ 20 లో ఎవరున్నారమ్మా?" అడిగాడు.. విమల ఒక్కసారి విశ్వ వైపు చూసి." ఆ ఇంట్లో ఎవరు ఉంటే మనకెందుకు.. తల్లి ఇద్దరు కూతుర్లు ఉన్నట్టున్నారు" అని అంది.

" అదే ఆ అమ్మాయి ఏం చేస్తుంది" అని అడిగాడు.

ఈసారి విమల మరింత భయంగా విశ్వ వైపు చూస్తూ" ఏమైంది విశ్వా! ఎందుకు అంత ప్రత్యేకంగా అమ్మాయి గురించి అడుగుతున్నావు" అంది.

"ఏం లేదమ్మా ! ఆమె గురించి రామ్ బ్యాడ్ గా చెప్పాడు'

"అవును రామ్ కరెక్టే చెప్పాడు.. అమ్మాయి రాత్రి పూట.. బయటకు వెళ్లి ఉదయమే వస్తుందని.. కాలనీ పార్క్ కి వెళ్ళినప్పుడు అందరూ అంటున్నారు.. రాత్రిపూట చేసే పనులు ఏముంటాయి.. సిగ్గు లేకపోతే సరి. అందంగానే ఉంటుంది కదా... బాగానే సంపాదిస్తుంది"ముఖం చిరాగ్గా పెట్టింది విమల..

ఇంక విశ్వ అంత కంటే ఎక్కువ ఏమీ అడగదలుచుకోలేదు..

తరువాత విశ్వ అక్క బావ కూడా ఇంటికి వచ్చి.. పెళ్లి సంబంధాల గురించి మాట్లాడారు.. విశ్వ మాత్రం.. "నేను ఎవర్ని సెలెక్ట్ చేసుకోను.. మీకు.. నాకు ఎవరైతే మంచిగా సరిపోతారు అనిపిస్తుందో వాళ్ళని చూడండి.. మీరే డిసైడ్ చేయండి నాకు ఏ ఫైలు వద్దు సరేనా!" అని గట్టిగానే చెప్పాడు.. ఇప్పుడు ఫైలు విశ్వా అక్క ముందుకు వెళ్ళింది.. అందరూ ఫైల్లో విశ్వకి సరిపడా అమ్మాయి కోసం వెతకడం మొదలు పెట్టారు..

వారం రోజుల్లో నాలుగు సార్లు రూప, విశ్వ కు కనిపించింది.. ఎందుకో విశ్వ కి.. అమ్మాయి గురించి తెలుసుకోవాలి అనిపించింది.. విశ్వా అమెరికాలో చేసే కంపెనీ బ్రాంచ్ ఇక్కడ కూడా ఉండడంతో.. ఒకసారి మీటింగ్ కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది... మీటింగ్ అయిపోయిన తర్వాత లెవెన్ ఓ క్లాక్ కి.. ఇంటికి బయల్దేరాడు విశ్వ.. ఇంటి దగ్గరలో కొచ్చేటప్పటికి మెయిన్ రోడ్ పై.. రాత్రి పన్నెండు గంటలకి.. రూప మెడికల్ షాప్ లో కనిపించింది.. ఏవో తీసుకుంటుంది.. విశ్వ మనసులో ఈ టైంలో ఈ అమ్మాయికి ఏమి అవసరం ఉంటాయి.. ఒకవేళ 'అదే తీసుకుంటుందా ఛీ..' అనుకున్నాడు.. కారు సైడ్ కి పెట్టి అక్కడే నిలబడి చూస్తున్నాడు.. రూప మెడికల్ షాప్ లో నుంచి బయటికి వచ్చేటప్పటికి ఆమె చేతిలో కొన్ని మెడిసిన్స్ కవర్లో ఉన్నాయి. అవి తీసుకుని రూప హడావిడిగా. పరుగులాంటి నడకతో వెళ్తుంది... విశ్వ కూడా ఆమెని కొంతదూరం అనుసరించాడు... ఆమె ఒక ఖరీదైన ఇంటి లోపలికి వెళ్లి పోయింది.

కాసేపటికి ఇంకొక కార్ కూడా లోపలికి వెళ్ళింది.. కారులోంచి ఎవరో నీట్ గా టక్ చేసుకున్న ఒక ఆయన దిగి లోపలికి వెళ్ళాడు.. విశ్వ కి ఏమీ అర్థం కాలేదు.. కానీ అప్పటికే అక్కడ ఉన్న సెక్యూరిటీ.. విశ్వ వైపు అనుమానంగా చూశాడు.. ఇంక ఎక్కువ సేపు అక్కడే ఉంటే మంచిది కాదని.. ఇంటికొచ్చేసాడు..


"గేట్ శబ్దం కావడంతో.. రాజ్యలక్ష్మి గారు బయటకు వచ్చారు.. ఎదురుగా నిలబడిన విశ్వాాన్ని చూసి ఎవరు కావాలి బాబు అని అడిగింది.. మీరే కావాలి అంటూ..లోపలికి రావచ్చా అని అడిగాడు.. " కొంచెం మొహమాటం తోనే.. రా బాబు అంది.

విశ్వ లోపలికెళ్ళగానే గోడకి పెద్ద సైజు లో ఉన్న ఒక ఫోటో ను చూస్తూ ఎవరండీ అని అడిగాడు.

"ఆమె ఏమీ చెప్పకుండా.. కూర్చో బాబు.. మంచినీళ్లు తీసుకుంటావా.. అని అడిగింది.

"వద్దండి, ప్లీజ్ నేను మీ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను.....మేము పక్క వీధిలోనే ఉంటాము. ఏదైనా సహాయం కావాలన్నా.. తప్పక చేస్తాను... మీ అమ్మాయి ఏం జాబ్ చేస్తుంది" అని అడిగాడు...

"సహాయం ఏమీ వద్దు బాబు.. కనీసం ఇన్ని రోజులకి ఒకరైనా మా ఇంటికి వచ్చారు అదే మాకు చాలు.."

ఇంతలో గదిలో చదువుకుంటున్న దీప బయటకు వచ్చి.. 'ఆ ఫోటోలో ఉంది మా నాన్నగారండి. మా అక్క పేరు. రూప శ్రీ.. అక్క డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉండగానే నాన్నగారు చనిపోయారు.. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ కావడంతో.. నా చదువు ఆపడం ఇష్టంలేక.. అక్కే టీచింగ్ జాబ్ చేస్తుంది" అని చెప్పింది.

కానీ విశ్వకి తాను ఆశించిన సమాధానం ఏమీ దొరకలేదు.. "ఆంటీ, అంకుల్ ఏం చేసేవారు" అని అడిగాడు విశ్వ.

" అప్పటికే వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ.. వ్యవసాయం చేసేవారు బాబు.. గత రెండేళ్లుగా పంటలు బాగా నష్టాలు వచ్చాయి.. ఈ సంవత్సరం మొత్తం పంట పోయింది.. అప్పులు బాగా పెరిగిపోవడంతో.. ఆయన బలవంతంగా ప్రాణం తీసుకున్నాడు.. నా బిడ్డల్ని అనాధల్ని చేసి పోయారు .. అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది...

విశ్వ ఏమీ మాట్లాడకుండా ఆమె వైపు చూస్తున్నాడు..

రాజ్యలక్ష్మి.. దుఃఖం ఆపుకుని.. ఎ"వరో నీలాంటి వాళ్ల దయవల్ల.. ఉన్న చిన్న ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చి.. దగ్గర బంధువు సహాయంతో ఈ సిటీకి వచ్చామయ్యా.. నా కూతురేమో.. పగలూ రాత్రీ కష్టపడి. చెల్లెలికి ఫీజులు కడుతుంది.."

" అంటే రాత్రి కూడా జాబ్ చేస్తుందా.." అనడిగాడు విశ్వ.

" అక్క రాత్రి పూట.. ఒంటరిగా ఉన్న పెద్దాయన దగ్గర, సహాయం కోసం ఉంటుంది.. ఆయన ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉన్నారు. పెద్దాయన భార్య చనిపోయారు... ఈయన అమెరికాకు వెళ్ళను.. నా భార్య చనిపోయిన ఇంట్లోనే నా ప్రాణం పోవాలని పట్టుపట్టారట..చేసేదిలేక ఆయన్ని చూసుకోడానికి ఒకామెను ఏర్పాటు చేశారంట. ఐతే అనుకోకుండా వాళ్ళ కొడుక్కి యాక్సిడెంట్ ఐతే, ఆమె తప్పని సరి అయి ఉరికెళ్లారు. ఇప్పుడు పగలు చూసుకోడానికి ఒక ఆంటీ దొరికారు. ఇంక రాత్రి అక్క చూసుకుంటుంది. ఆయన వాష్ రూమ్ కి వెళ్లాలన్నా చేయి పట్టుకొని తీసుకెళ్లాలి.. కాలుకి ఆపరేషన్ అవ్వడం వల్ల, టైమ్ ప్రకారం మందులు కూడా ఇవ్వాలండి. అంటూ ఆపకుండా చెప్పింది దీప ..

" అప్పటికే విశ్వ మనస్సులో ఏదో మూల ఉన్న అనుమానపు మంచు తెరలు కరిగిపోయాయి.

" బాబు.. టీ తీసుకో" అంటూ టీ కప్పు విశ్వ చేతిలో పెట్టింది రాజ్యలక్ష్మి.

" నేను ఎంత వద్దన్నా వినలేదయ్యా.. . మూడు నెలలే. తరువాత ఆంటీ వచ్చేస్తారు, ఈ మూడు నెలలు పెద్దాయన్ని చూసుకుంటే చెల్లెలు సంవత్సరం ఫీజ్ కట్టొచ్చమ్మా" అని వెళ్తుందయ్యా.. అని విశ్వ చేతిలో టీకప్పు తీసుకుంది...


"ఇది కూడా స్కూల్లో టీచర్ ఎవరో చెప్తే, ఆళ్ల కొడుకులతో మాట్లాడి మారూపను పెట్టించారు. అలా వచ్చిన డబ్బులతో ఇలా అద్దె కట్టుకొని బతుకుతున్నాం"అని కళ్ళ నీళ్లు తుడుచుకుంది.

"మరి ఈ విషయం ఇక్కడ ఎవరికి తెలియదా ఆంటీ... " అన్నాడు.

"మొదట్లో వారం రోజులు పక్క వాళ్ళు బాగానే మాట్లాడేవారు.. తరువాత మా అమ్మాయి రాత్రి పూట వెళ్లడం చూసి.. అందరూ మాట్లాడం మానేశారు. నేనూ ఆడదాన్నే కదా... నాకు అర్థం అయింది... ఏ ఇంటికని వెళ్లి చెప్పను.. నా కూతురు ఏ తప్పు చేయడం లేదని..!! వచ్చే దుఃఖాన్ని దిగ మింగుకుంటూ చెప్పింది రాజ్యలక్ష్మి..

"మీరేం బాధ పడకండి అన్నీ సర్దుకుంటాయి... ఏదయినా అత్యవసరం ఐతే ఫోన్ చేయండి" అని వెళ్ళిపోయాడు విశ్వ.

విశ్వ కు చాలా ఆనందం గా ఉంది. తాను ఏదయితే కోరుకున్నాడో అదే జరిగింది. ఎందుకంటే రూప అమాయకపు మొఖం తన మనస్సులో మొదటి సారి చూసినప్పుడే చెరగని ముద్ర వేసుకుంది..

"ఆ రోజు విశ్వా వాళ్ళిల్లు అక్క బావ రాకతో హడావిడిగా ఉంది." ఏంటమ్మా ఇంత అర్జంటుగా రమ్మన్నావ్.. "

" ఏం చెప్పను.. విశ్వా ఉండుండి చాలా గొప్పదాన్ని చేసుకుంటానంటున్నాడు... వీడికి ఎంత చెప్పినా అర్ధం కావట్లేదు.. ఈ కాలనీ లో మీ నాన్నా నేను తలెత్తుకునేదెలా.. అంటూ ముక్కు చీదుకుంది విమల.

"అమ్మా తొందరపడకు , ఎవరేమునుకుంటే నీకెందుకు?ఆ అమ్మాయి ఏ తప్పు చేయనప్పుడు" అంది విశ్వ అక్క.

" ఏ తప్పు చేయలేదు అని నీకు నాకు తెలిసినా ఇక్కడెవరూ నమ్మరు.. ఐనా మీరెళ్ళి చూసొచ్చారా? నువ్వు వాడికి వంత పాడకు.." అని కూతుర్ని గట్టిగానే అడిగింది. అమ్మ కోపాన్ని చూసి ఇంకెవరూ ఏమీ మాట్లాడలేదు.. తరువాత అక్కా, బావ కూడా వెళ్లిపోయారు.

" విశ్వా ఒక్కడే బిల్డింగ్ పైకెళ్లి, రూప బయటకు వస్తుందేమో అని ఆమె ఇంటివైపే చూస్తున్నాడు.. " విశ్వాా! అన్న జగన్నాధం పిలుపుతో.. "ఆ. చెప్పండి నాన్నా" అంటూ ఇటు తిరిగాడు..

" విశ్వాా నీకు నిజంగా ఆ అమ్మాయి అంతగా నచ్చిందా" అని అడిగాడు.

" అవును నాన్నా.. నా మనస్సుకు నచ్చింది ఆమె" అన్నాడు.

" సరే కానీ అమ్మకోసం కూడా ఆలోచించు" అని చెప్పి వెళ్ళిపోయాడు.

"ఆ రోజు జగన్నాధం గారు రూప పనిచేసే, స్కూల్ కి వెళ్లి రూప తో విశ్వ గురించి చెప్పారు.

రూప " నాకు పెళ్లిచేసుకునే ఆలోచన ఇప్పుడే లేదు" అని చెప్పి వెళ్ళిపోయింది..

"రూప ఇంటికి రాగానే వాళ్ళమ్మకి జరిగిందని చెప్పింది.

" అలా ఎందుకు చెప్పావమ్మా.. ఇక్కడందరు నిజం తెలుసుకోకుండా నిన్ను అనుమానించారు.. నీ గురించి చెడుగా చెప్పినా నమ్మకుండా నిజం తెలుసుకోడానికి మన ఇంటి దాకా వచ్చాడమ్మా.... నేను నీ గురించి ఏమి చెప్పకముందే ఏం సహాయం కావాలని అడిగాడు. కట్టుకున్న పెళ్ళాన్ని అనుమానించే ఈ రోజుల్లో ఇలాంటి వాడు నిన్ను కోరుకోవడం.. నీ అదృష్టం.. ఆలోచించు" అని చెప్పింది రాజ్యలక్ష్మి..

" ఆ తరువాత ఒక రోజు రూప ఇంట్లో ఉండగానే , విమల వాళ్ళింటికి వచ్చి "రూపా! నువ్వు రూపం లోనే కాదమ్మా, గుణం లో కూడా చాలా ఉన్నతంగా ఉన్నావు. ఇంత చిన్న వయస్సులోనే నీ ఓర్పు, సహనం నేను అర్ధం చెసుకోలేక పోయాను.... మా విశ్వ మనస్సు మెచ్చిన మగువ నువ్వేనమ్మా.. అంటూ దగ్గరికి తీసుకుంది... వెనుకనే విశ్వ నవ్వుతూ ఆమె అందమైన, అమాయకపు ముఖాన్ని చూస్తున్నాడు.... ఈసారి రూప ఇంకేమి మాట్లాడకుండా సిగ్గుతో తల క్రిందికి దించుకుంది...రచయిత్రి పరిచయం :

కలం పేరు :లక్ష్మి కుమార్

పేరు : వరలక్ష్మి.గోపరాజు

వృత్తి : హై స్కూల్ టీచర్ (మాథ్స్ )

ప్రవృత్తి : కధలు, వ్యాసాలు వ్రాయడం, చదవడం. ముంగట ముగ్గు నా మరో రచన ఈ మధ్యన వ్రాసిన" దరి చేరిన నావ ", "ఊరికి నీళ్ళొచ్చాయి ' ప్రతి లిపి లో ప్రచురించ బడ్డాయి.తెలుగు భాష అన్నా గోదావరి అన్నా చాలా ఇష్టం

నివాసం : హైదరాబాద్

స్వస్దలం : రాజోలు


229 views3 comments

3 commentaires


ధన్యవాదములు 🙏🙏

J'aime

Shashi GS
Shashi GS
17 janv. 2021

Kadha chala bavundi. Great message for youth . Thank you lakshmi kumar gaaru

J'aime

కధ చాలా బావుంది. ఎవరి గురించయనా, పూర్తి గా తెలుసుకోకుండా, నిర్ణయానికి రాకూడదనే విషయాన్నీ చాలా చక్కని కధ రూప లో వివరించారు,రచయిత

J'aime
bottom of page