#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్రరావు, #MattiloRathnaluUntayi, #మట్టిలో రత్నాలు ఉంటాయి, #TeluguStories, #తెలుగుకథలు
Mattilo Rathnalu Untayi - New Telugu Story Written By - Nallabati Raghavendra Rao Published In manatelugukathalu.com On 26/11/2024
మట్టిలో రత్నాలు ఉంటాయి - తెలుగు కథ
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
''అమ్మగోరు.. అమ్మగోరు.''.. తలుపు కొట్టి గట్టిగా పిలిచింది అప్పుడే వచ్చిన రత్తాలు.
తలుపు కొట్టిన శబ్దం కావడంతో వెళ్లి తలుపు తీసింది ఆ ఇంటి యజమాని 60 ఏళ్ల అమ్మా యమ్మ. సూరేకాంతం తన ఇంట్లో ఎప్పటినుండో చాకిరీ పనులు చేస్తు ఆరోగ్యం బాగుండక సెలవు పెట్టి ఆమె కూతుర్ని ఈరోజు నుండి పనిలోకి పంపిస్తున్నట్టు తెలుసు కనుక అమ్మాయిమ్మ ఆశ్చర్యంగా చూడలేదు.. ఆ వచ్చిన పిల్ల వైపు.
''నువ్వేనా రత్తాలు. తేగ తొక్కలాగ ఉన్నావు. నువ్వేం పని చేయగలవే. లోపలకు రా. ఇదిగో బుల్లె ఇవరంగా ఇను. సూరీడు పొడిచాడు లేదు అని చూడకుండా ఆరు గంటలకు పనిలోకి వచ్చే యాలా. వాకలి సుబ్బరంగా తుడిచి పేడ నీళ్లు చల్లాల. నీకు వచ్చిన రాకపోయినా కూతంతా ముగ్గు పెట్టాల. అదయ్యాక ఆ సందిలోంచి అలా చుట్టు తిరిగి గేదెల పాకలోకి రావాలా. అలా చూడు అక్కడ గేదెలు వేసిన పేడంత పోగెట్టి దాంట్లో కూసంత పొట్టు కలిపి అక్కడే పిడకలు వేయాలా.
అదయిపోయినాకా గదులన్నీ శుబ్బరoగా ఊడిసి పడేయాలి. ఓ పిల్ల.. ఇలారా నా కూడ. అదిగో ఆ నుయ్యి దగ్గర కూకొని పాత బట్టలన్నీ సబ్బు పెట్టి జాడించాలి.. శుబ్బరoగా పులమాల. ఖాళీగా కూకో మాకు. అది అయిపోయినాక అక్కడ ఎంగి లిసామాన్లు ఉన్నాయి చూడు అవన్నీ పీచుతో రెండుసార్లు తోమి కడిగి ఆరబెట్టి లోపల వంటిం ట్లో ఆరబెట్టాలి. తెల్ల గుడ్డ పుచ్చుకొని గదుల్లో బల్లలన్నీ తుడాల.
పండుగలు వస్తున్నాయంటే రెండు రోజులు ముంద రే ఇత్తడి సామాన్లు, స్టీలు సామాన్లు అన్ని శుబ్బ రంగా కడిగి ఆరబెట్టాలి. అర్థమైంది కదా ఇంకా చాలా ఉంటాయి . అప్పుడప్పుడు చెబుతూ ఉంటా లే. ఇంక పని మొదలెట్టు.'' అంటూ నడుము మీద చేతులు వేసుకొని వెళ్ళబోయింది లోపలకు అమ్మా యమ్మ.
''ఆగండి అమ్మగోరు ఇయ్యన్ని సేత్తున్నందుకు మా అమ్మకు నెలకి ఎంత ఇచ్చేవారండి. '' కళ్ళు పెద్దవి చేసుకొని ప్రశ్నించింది రత్తాలు.
''నీకెందుకే అయ్యన్ని ..పెద్దోళ్ళం మేము మేము చూసుకుంటాo.''
'' నా లెక్క పెకారం అయితే రోజుకు 200 అండి. నెలకారువేలు ఇత్తున్నారా మీరు.''
''నీ ముఖం. దానికి నెలకు 600 ఇత్తున్నాను. అదే దానికి ఎక్కువ. పిల్లవి పిల్లలాగుండు. నోరు మూసు కుని పనిచేసుకో.'''
''రోజులు మారానీయండమ్మగోరు. ఈ యాల నుండి మీరు సెప్పినట్టు కుదరదండి . లేదంటే ఎల్లి పోతానండి.''
''ఎన్ని లెక్కలు చెబుతున్నావు. చూడ్డానికి పిచ్చుక పిల్లలాగా ఉన్నావు. ఇంతకీ నువ్వు ఏం చదివావే.''
''నాను బి ఏ సదివానండి.''
''అమ్మమ్మో. బి.ఏ. చదివావా అందుకనే అలా మాట్లాడుతున్నావ్. మా వాళ్ళలో ఎవరు పదవ తరగతి మించి చదవలేదు. సరేగాని పని తర్వాత చేద్దువుగాని ముందు నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడు ఇనాలని ఉంది.''
''మాటాడతానండి.. హాయ్ హాయ్ మాడతానండి.
బి.ఏ.బి.ఏ.బి.ఏ.బి.ఏ.. హాయ్.. అంతేనండి మరి.''
''ఓసి నీ జిమ్మడ. నీకు ఇంగ్లీషు రాదా.''
''మరి ఇదే కదండి ఇంగిలి పీసు అంటే..''
''ఏడిసావు యాబరాశి దాన.. నోరు మూసుకొని పని చేసుకో. లేదంటే పనిలోంచి తీసేస్తాను.
''ఇదిగో ఈ పని అంతా అయ్యాక కూతంత ఉప్మా ఉంటే పెడతాను. తినేసి మంచినీళ్లు తాగేసి మళ్ళీ పని మొదలుపెట్టు. అంతేకానీ ఏదో మినిస్టరుగారి లాగా... ఉప్మా మాడి పోయింది.. కొంచమే పెట్టారు.. అంటూ రూలు పాయింట్ లాగకు.''
''సరేగాని అమ్మగోరు ఉప్మా తిన్నాక కూసిన్ని టీ నీళ్లు పోస్తారా.''
''ఎందుకు పోయను. ఆర్లిక్స్ బోర్నవిటా కూడా కాశిస్తాను. ఆ తర్వాత సేమ్యా కూడా కాశిస్తానే. అందులో జీడిపప్పు కిస్మిస్ యాలకులు నెయ్యి కూడా వేసిస్తాను. నీకు బలంగా ఉండాలి కదా మధ్యాహ్నం పొట్టేలు కైమా కూర వేసి పెడతాను. రాత్రికి బొమ్మిడాయిలు ఇగురుతోటి శుబ్బరoగా అన్నం పెడతాను.
ఇదిగో నా బెడ్ రూమ్ లో ఏసీ వేసి డబల్ కాట్ మంచం మీద పడుకోబెడతానే పిల్ల. సరిపోద్దా ఇంకా ఏమైనా చేయమంటావా?''
''అమ్మో మీరింత మంచోరా అండి అమ్మగోరు. ఇట్టాగైతే పెళ్లయ్యాక నాకు పుట్టే పిల్లల్ని కూడా మీ ఇంటి దగ్గరే పనిలో పెడతానండి...అదేంటమ్మగారు అదేంటండమ్మ ఆ మూలనున్న దొడ్డుకర్ర చేతితో పట్టుకున్నారు.''
''ఎందుకా మా ఇంటిలో పని చేయడానికి ఓ పిచ్చి పిల్ల వచ్చింది . దాని వీపు మీద ఈ దుడ్డు కర్రతో రెండు తగిలిద్దామని.'' అంటూ నెమ్మదిగా రెండు దెబ్బలు వేసింది అమ్మాయమ్మ కొత్తగా పనిలోకి వచ్చిన రత్తాలు వీపు మీద.
ఆ దెబ్బతో రత్తాలు పరుగున దొడ్లోకి వెళ్లిపోయి తన పనిలో నిమగ్నం అయిపోయింది.
**
''అమ్మగోరు మీ కాడ చాలా కాలం నుండి పనిసేస్తు న్నాను కదా. నాకు ఏదైనా బహుమతి ఇవ్వరా?'' దర్జాగా కూర్చుని టీవీ చూస్తున్న అమ్మాయమ్మ కాళ్లు నొక్కుతూ అడిగింది రత్తాలు.
''ఏం కావాలి ఈ ముఖానికి. పట్టు చీర ఇమ్మoటా వా'' ఎగతాళిగా అడిగింది అమ్మాయమ్మ.''
''అది కాదు అమ్మగోరు.. టీవీ లో అమ్మాయిలకు రెండు జానల పొడుగు చెక్కముక్కలు లాంటివి ఇస్తారు కదమ్మ. అలాంటివి మీ గదిలో మేడ మీద సాలా ఉన్నాయి కదా. అలాంటిది ఏదైనా ఇరిగి పోయినదైనా మీరు నాకు ఇచ్చినట్టు ఇచ్చి ఒక ఫోటో తీస్తే మా పేటలో అందరికీ పించకుందా మనమ్మ. చాలా మందికి మీరు అట్ట ఇచ్చినట్టు మీ ఇంట్లో శానా ఫోటోలు ఉన్నాయి కదమ్మా.'' ఆశగా అడిగింది రత్తాలు పెద్ద కళ్ళు చేసుకొని.''
''అలాంటి వాటిలను మెమొంటోలు అంటారే పిచ్చి దానా. నీ మొఖం తగలబెట్ట. మనిషి గుప్పెడు ఆశ బారెడు అన్నట్టు.. చాలా పెద్ద కోరికలే నీవి. నీ కోరికలు గుర్రాలు అయిపోతున్నాయి తింగరిదాన. ఆశకు హద్దు పెట్టుకొని.. నీ బతుకేదో నువ్వు బతుకు. లేదంటే కాలు జారి ఎక్కడో పడతావు నీ నెత్తికి బొప్పి కడుతుంది.
ఇలాంటి మెమొంటోలు చాలా గొప్ప వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తారు కానీ నీలాంటి ఏబ్రాసి దానికి కాదు. ముక్కు చీదుకోవడం రాదు ముక్కు వంకర దాన. అదిగో అంట్లు తోమేశావు కదా. మీ అయ్యగారు కాస్త బాగా తోమమను అంటున్నారు ..మళ్ళీ ఇంకొకసారి బాగా విమ్ము పౌడర్ తో తోమీ కడిగి ఆరబెట్టు. వెళ్ళు.
ఇదిగో.. రేపు నేను ఇంటి దగ్గర ఉండను. మా మహిళా సంఘాల వాళ్ళతో నాకు చాలా పని ఉంది. మీ అయ్య గారు కూడా ఏదో పనిమీద రేపు ఊరు వెళ్ళిపోతు న్నారు కనుక నువ్వు రేపు రావక్కర్లేద్దు.'' అంటూ చాలా కాగితాలు, ఫైల్స్ పట్టుకుని గబగబా మేడ మీదకు వెళ్ళి పోయింది ఎవరితోనో సెల్లో మాట్లాడుతూ.. ఆ ఇంటి యజమానురాలు అమ్మాయమ్మ.
బిక్క ముఖం వేసుకొని నాలుగు వంతులు ఏడుస్తు న్నట్టుగానే వెళ్ళిపోయింది ఆ ఇంటి దొడ్లోని పనిలోకి రత్తాలు.
***
పనిచేసే ఇంటికి వెళ్లిపోయిన రత్తాలు తన తాటాకు గుడిసెలో చిక్కిపోయిన నులక మంచం మీద పడు కుని.. ఏడుస్తూ ఆలోచిస్తుంది. దూరంగా ఆమె తల్లి మరో మంచం మీద దగ్గుతూ మూలుగుతూ పడు కుంది.
''నాను ఎందుకు పుట్టానో నాకే తెలవదు. ఆశలన్నీ ఆవిరై ఆకాశానికి ఎల్లిపోతున్నాయి. ఎంకటలక్ష్మి ఆల్ల నాన్న కూడా పెద్దపట్నం ఎల్లిపోయి అంచక్కా బతుకు తుంది. మరేమో రాములక్క శానా పెద్ద సెల్లు కొను క్కుంది. ఆ కాలవగట్టు కాంతాలు సెవులకు బంగారు దుద్దులు సేయించుకుంది.
అమ్మాయమ్మ అమ్మగోరు అన్నట్టు నాను పిచ్చిదాన్ని. నా యాబ్రాసి ముఖం తగలబెట్టేయాలి. నాయి పెద్ద కోరికలే.. అమ్మగోరు అన్నట్టు నన్ను దుడ్డు కర్రతో కొట్టాలి అమ్మగోరు.. సితక కొట్టియ్యండి. అప్పుడు కాని నాకు బుద్ధి రాదు. నేకపోతే.. నేనేంటి.. అమ్మ గోరు నాకు ఆ పెద్ద సెక్కముక్కలు ఇచ్చి ఫోటో తీయిం చు కోవడం ఏంటి?? పిచ్చిదాన్ని... పిచ్చిదాన్నే''''. తల మంచాన్ని వేసి కొట్టుకుంటూ నిద్రలోకి జారిపోయిం ది రత్తాలు.
**
మర్నాడు
ఆదివారం
తెల్లవారింది.
తల్లికి కాసిన గంజి నీళ్లు తాగించి తను కూడా తాగి
అలా గోదారి ఒడ్డున నడుస్తూ... దూరంగా కొందరు ఆడవాళ్లు కనిపించడంతో నెమ్మదిగా నీరసంగా అక్కడకు చేరుకుంది.
అక్కడకు వచ్చిన ఆడవాళ్లు తీసుకోవడానికి రంగు రంగుల పౌడర్స్ బేసిలో వేసి సిద్ధంగా ఉన్నాయి. అక్కడ ముగ్గుల పోటీ జరుగుతున్నట్టు రత్తాలు గ్రహిం చింది.
ఎవరో వచ్చి ఆమెకు టి ఇచ్చి ఏదో అడిగారు. ఆమె తల ఊపింది.. సరదాగా రంగు పౌడర్లు పట్టుకొని పోటీ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి తనకు తోచిన ముగ్గు పెట్టి గబగబా మళ్లీ బయటకు వచ్చేసి నిలబడింది. ఇంకెవరో వచ్చి ఆమెకు కాగితంలో వేసి కొంచెం ఉప్మా పెట్టారు. ఆశగా ఆబగా తినేసింది.
గంట గడిచింది.
లౌడ్ స్పీకర్ లో పేరు వినపడుతుంది. అది తన పేరే.
కానీ తను కాదు ఏమో. రత్నాలు లాంటి రత్తాలు వేరే ఒకరు ఉండవచ్చునేమో కదా.
''రత్తాలు అట..రత్తాలు ఎవరు ..ఎక్కడ రత్తాలు.. ఎవరు రత్తాలు..రత్తాలు కి ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైస్ వచ్చింది.. మహిళా సంఘఅధ్యక్షురాలు అమ్మా యమ్మగారు అనౌన్స్ చేసేసారు. ఎక్కడ రత్తాలు..''
జనంలో గలాటా.
ఆ ప్రైజ్ వచ్చిన రత్తాలు నేనే అని గ్రహించింది రత్తాలు.
సంబరం అంత ముఖం చేసుకుని.. వేదిక దగ్గరకు నడుస్తుంది అమ్మాయమ్మగారి గారి చేతుల మీదుగా మొదటి బహుమతి ఆరువేల రూపాయల క్యాష్ మరియు అతిపెద్ద మెమొంటో అందుకోవడానికి.
సమాప్తం
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు
Comments