top of page

మయోంగ్


'Mayong' New Telugu Article

Written By Mavuru Vijayalakshmi

'మయోంగ్' తెలుగు వ్యాసం

రచన: మావూరు విజయలక్ష్మి


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

“మయోంగ్! ఓ అద్భుతం! ఓ రహస్యం! ఓ గగుర్బాటు! ఓ భయం! ఓ భీభత్సం! ఊహకందని

ఊహాతీతశక్తి!”


ఆ గడ్డ మీద ఎదో శక్తి ఉంది. అలాగని అదేదో దేవాలయం కాదు. అక్కడికెళితే ఏవో వింత వింత శబ్దాలు వినపడతాయి. అలాగని అదేదో ఘోస్ట్ విలేజ్ కాదు. చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రశాంతతలోనే ఒళ్ళు గగుర్పొడిచే భయముంది. నిశ్శబ్దం లోనే లీలగా భయంకర శబ్దాలు.... అవి మనకు కూడా వినిపిస్తుంటాయి.


కాని ఆ శబ్డాలేంటో మాత్రం మనం చెప్పలేం. అసలా శబ్దాలు

ఎక్కడి నుంచి వస్తుంటాయో కూడా అర్థం కావు. అదే అద్భుత మాయాలోకం “మయోంగ్...”.


అదేదో మరో లోకంలో లేదు ఈ భూమ్మీదే మన దేశంలోనే ఉంది. అసోం రాజధాని గౌహతి కి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది మయోంగ్. ఈ గ్రామానికి మయోంగ్ అన్న పేరు రావడానికి ఒక కారణం ఉంది. ఇక్కడి జనాలు మాయలు చేస్తారు. మంత్రాలు వేస్తారు. ఇంద్రజాలంలో ఆరి తేరిన వారు.


అంతెందుకు ఇక్కడ అంతా మాయనే కాబట్టి ఈ ప్రాంతానికి మయోంగ్ అనే పేరు వచ్చింది. మయోంగ్ మారిగాన్ (మొరిగోన్) జిల్లాలో ఉంది. బ్రహ్మపుత్ర నది ఒడ్డున కొన్ని గ్రామాల సముదాయమే ఈ మయోంగ్. ఇక్కడ బ్లాక్ మేజిక్ తో

అందరినీ మాయ చేస్తారు. ఇంతలా ఇంద్రజాలం చేసే వారు ప్రపంచంలోనే ఎవరూ ఉండరేమో అనేది ఈ ప్రాంతీయుల గురించి ప్రపంచం చెప్పుకునే మాట. అందుకే మయోంగ్ ఒక పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. స్వదేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా ఎంతోమంది పర్యాటకులు మయోంగ్ మాయలు చూడ్డానికొస్తారు కూడా.


చిన్నపిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ళ వరకు అందర్నీ విపరీతంగా ఆకట్టుకునే అద్భుత మాయాలోకం హేరీపోటర్. హేరీపోటర్ సినిమాలు చూస్తున్నప్పుడు వా...వ్..

ఇలాంటి స్కూల్స్, ఇలాంటి ఊర్లు నిజంగా ఉంటే ఎంత బాగుంటుందో.... అనుకుంటాం. మరీ అచ్చంగా అలాగే కాకపోయినా ఆ హేరీపోటర్ మాయాలోకానికి చాలా దగ్గరగా కనిపించే ఒక మాయాలోకం, అద్భుత ప్రపంచం ఈ మయోంగ్.


ఊరి పేరు వెనుక కథ.


ఈ ప్రాంతం ఇప్పటిది కాదు పురాణకాలం నాటి ప్రదేశం. ద్వాపరయుగంలో తన క్రూరత్వంతో, మాయలు, మంత్రాలతో ఎంతోమంది సాధువులను, సజ్జనులను

వణికించినవాడు, సత్యభామ, శ్రీకృష్ణుల చేతిలో హతమయినవాడు, ప్రస్తుతం మనం జరుపుకుంటున్న దీపావళి పండుగకు కథానాయకుడు అయిన నరకాసురుని రాజ్యానికి రాజధాని అయిన ప్రాగ్జోతిషపురమే ఈ అసోం. ఆ అసోంలో కొంతభాగమే ఈ మయోంగ్.


ఈ ఊరికి మయోంగ్ అని పేరు రావడానికి చాలా కథలే చెప్తారు. ఈ ప్రాంతానికి మహాభారత కాలానికి సంబంధం ఉంది. పాండవులలో ఒకడైన భీముడి కుమారుడైన

ఘటోత్కచుడికి సంబంధించిన రాజ్యం, ఇప్పటి మాయోంగ్ ప్రాంతంలోనే ఉండేదట. ఘటోత్కచుడు పెనుమాయల్ని చిటికలో చిత్తుచిత్తు చేసే మాయగాడు. అలాంటి

ఘటోత్కచుడు తన సైనికులకు, తన అనుయాయులకు కూడా ఈ మయోంగ్ లోనే శిక్షణ ఇప్పించి, వారినా విద్యల్లో ఆరితేరేలా చేసేవాడట.


పూర్వం ప్రపంచంలో ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి మర్మ విద్యలు, మాయా విద్యలు నేర్చుకోడానికి ఇక్కడికి వచ్చేవారట. అలా మహాభారతం కాలం నుంచి ఇప్పటి వరకు ఆ వంశస్తులు మాయలు చేస్తూనే ఉన్నారట.


అందుకనే అప్పటినుంచి ఈ ప్రాంతంలో మంత్రగాళ్ళు స్థిరనివాసం ఏర్పరచుకుని తమ మంత్ర విద్యను తరతరాలుగా కొనసాగిస్తున్నారని అక్కడి వారు చెప్తారు. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ప్రాంతం మంత్ర విద్యలకు ఒక విశ్వవిద్యాలయంగా చెప్పుకుంటారు. బ్లాక్ మేజిక్ కాపిటల్ ఆఫ్ ఇండియా అని, లేండ్ ఆఫ్ బ్లాక్ మేజిక్ అని కూడా చెప్పుకుంటారు.


అందుకే మాయలకు మారుపేరైన ఈ ప్రాంతానికి మయోంగ్ అనే పేరొచ్చినట్టు కొందరు చెప్తుంటే, కొంతమంది వాదన ప్రకారం ఈ ప్రాంతానికి మాయా అనే సంస్కృత పదం

నుండి ఈ పేరు వచ్చినట్లు మరో కథనం. దీనిని భారతదేశ చేతబడుల రాజధాని అని అంటారు. ఈ ప్రాంతానికి మయాంగ్ అన్న పేరు రావడం వెనుక అనేక కథనాలు

ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా మౌచోంగ్ వంశానికి చెందిన వారు ఇక్కడ ఎక్కువ మంది నివశించడం వల్లే ఆ పేరు వచ్చినట్లు చెబుతారు. మరికొంతమంది మా ఎర్

ఆంగో అనే దేవత పేరుమీద ఈ ప్రాంతానికి మయాంగ్ అన్న పేరు వచ్చినట్లు చెబుతారు.


చుట్టూ పచ్చటి అడవులతో, కొండకోనలతో ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా వుండే ఈ ప్రాంతం అందానికి మారుపేరుగా చెప్పొచ్చు. అయితే ఊళ్లోకి అడుగుపెడితే మాత్రం ఒళ్ళు గగుర్పొడిచే భయానక క్షుద్రవిద్యను ప్రయోగించే మంత్రగాళ్ళతో నిండివుంటుంది.


పూర్వకాలంలో మాయలు, ఇంద్రజాలం, క్షుద్రపూజలు నేర్చుకునేందుకు ఈ ప్రాంతానికి చాలా మంది వచ్చేవారట. పూర్వకాలంలో అతి శక్తివంతమైన క్షుద్రవిద్యలు నేర్చుకోవడానికి ఇక్కడ నరబలులు కూడా చాలా జరిగేవని

అంటారు. కానీ ప్రస్తుతం మాత్రం అలాంటివేవీ జరిగినట్టు ఆధారాలు లేవు.


గతంలో ఇక్కడ మనుషులను కూడా మాయం చేసేవారట. మాయం అయిపోయిన వారిని ప్రత్యక్షం చేసేవారట. ఇక్కడి మంత్రగాళ్లు మాయలు చేస్తున్నప్పుడు చూడడానికి వచ్చి జనాల్ని మాయ చేసేవారట. తర్వాత కుటుంబ సభ్యులు వేడుకుంటే మళ్లీ మాయం అయిపోయిన వారిని ప్రత్యక్షం చేసేవారట. ప్రస్తుతం మాయలు చేస్తున్న వాళ్ల తాతల కాలంలో ఇలా జరిగేదని కథలు కథలుగా చెప్తారు.


అంతేకాదు బ్లాక్ మ్యాజిక్, చేతబడి లాంటివి ఎలా చేయాలో అప్పటి కాలం వారు కొన్ని గ్రంథాలు కూడా రాశారు. ప్రకృతిలోని శక్తులను ఎలా దక్కించుకోవాలి... ప్రకృతితో ఎలా మెలగాలి... ప్రకృతితో ఎలా స్నేహం చేయాలి... ఇలాంటి ప్రకృతి రహస్యాలన్నీ ఆ గ్రంధాలలో రాసి ఉన్నాయని చెప్తారు.


ఈ విషయాల గురించి ఆ వంశాల వారసులకి పూర్తిగా తెలియకపోయినా కొన్ని మాయలు మాత్రం నేర్చుకొని వాటితో ఇప్పటికీ ఇక్కడ మాయలు చేస్తూ ఉన్నారట ఆ వంశస్తులు. నిజానికి ఇక్కడి మాయగాళ్లకు ప్రపంచంలో ఎవరూ సాటి రారనేది అందరూ చెప్పుకునే మాట. చివరికి ఇక్కడ ఉండే చిన్నపిల్లలు కూడా మంత్ర విద్యలను అభ్యసిస్తారు.


ఇప్పటికీ చాలామంది ఈ మంత్రాల యొక్క గుట్టు

విప్పడానికి రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారట. ఇక్కడ మంత్రవిద్యలను అభ్యసించే మంత్రగాళ్ళను 'బెజ్ లేదా ఓజ' అని అంటారు. కేవలం బ్లాక్ మేజిక్ మాత్రమే కాదు

ఇదంతా విని ఇక్కడ కేవలం మాయలు, మంత్రాలు, బ్లాక్ మేజిక్ మాత్రమే ఉంటుంది అనుకుంటే పొరపాటే.


జబ్బులను నయం చేస్తారు. అనారోగ్యాన్ని పారదోలతారు.

మయోంగ్ ప్రజలకు కేవలం బ్లాక్ మ్యాజిక్ మాత్రమే కాదు కొన్ని జబ్బులను నయం చేసే విషయాలపై కూడా మంచి పట్టు ఉంది. వీళ్లు చాలా రకాల జబ్బులను చిటికెలో

నయం చేయగలరట. ఒక్క మంత్రం వేస్తే చాలు ఎలాంటి జబ్బు అయినా క్యూర్ అయిపోతుందట. ముఖ్యంగా నొప్పులను తగ్గించడంలో వీరికి వీరే సాటి అంటారు.


వీరు ఒక రాగి పళ్లెం తీసుకుని మొదట ఏవేవో మంత్రాలు చదివి దాన్ని మీకు ఏ ప్రాంతంలో నొప్పి ఉంటుందో అక్కడ అతికిస్తారు. దానికి ఎలాంటి లేపనాలు పూయరు కానీ మీ శరీరానికి ఆ పళ్ళెం అతుక్కుపోతుంది. తర్వా త కొన్ని

మంత్రాలు చదువుతారు. అంతే.. మీ కాళ్ల నొప్పులు, నడుం నొప్పి ఇంకా తదితర నొప్పులన్నీ తగ్గిపోతాయట. అంతేకాదు ఎవరైనా దొంగతనం చేస్తే వాళ్లు ఎవరు, వారు ఎక్కడున్నారో కూడా కనిపెట్టగలరట వీరు.


ఇక్కడ ప్రజలు క్షుద్రదేవతలను సంతృప్తి పరచటానికి ప్రతిసంవత్సరం మయోంగ్ - పోబిటోరా అనే పండుగను కూడా చేసుకుంటారు. ఆ పండుగరోజు గ్రామంలో

ఆడ,మగ,చిన్న,పెద్ద అందరూ ఒక చోట చేరి వారి క్షుద్రదేవతలను స్తుతిస్తూ పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ కల్లు,మాంసం వంటి పదార్థాలను నైవేద్యంగా

పెడతారు. ఆ తరువాత ఊరు మొత్తం తిరుగుతూ రంగులు జల్లుకుంటూ సంబరాలు చేసుకుంటారు.


ఈ వూరిలో ఒక మ్యూజియం కూడా వుంది. దీన్ని మయోంగ్ సెంట్రల్ మ్యూజియంగా పిలుస్తారు. ఈ మ్యూజియంలో పూర్వకాలంలో అక్కడ మంత్రగాళ్ళు ఉపయోగించిన

వస్తువులను టూరిస్ట్ ల సందర్శనార్ధం వుంచారు.

సినిమా కూడా వచ్చింది


ఎక్కడ ఏ ప్రత్యేకత కనబడినా... వినబడినా వెంటనే అక్కడికి చేరిపోతారు సినిమావాళ్ళు. మరి ఇక్కడ ఇంత స్టఫ్ ఉన్నపుడు సినిమా వాళ్ళ కన్ను పడకుండా ఉంటుందా... అందుకే ఈ మయోంగ్ మీద సినిమాలు కూడా వచ్చాయి. ఈ విశేషాలన్నీటి మీద ఓ డాక్యుమెంటరి కూడా తీశారు ఫిల్మ్ మేకర్ ఉత్పల్ బోర్పూజరి. 2011లో ఈయన అక్కడికి వెళ్లాడు. అక్కడి పరిస్థితులను మొత్తం అధ్యాయనం చేసి ఒక డాక్యుమెంటరినీ కూడా తీశాడు. 53 నిమిషాల విడిది ఉండే ఈ డాక్యుమెంటరీలో మయోంగ్ ప్రజల స్థితి గతులన్నీ వివరించేందుకు ప్రయత్నించాడు.


******* సమాప్తం *******

మావూరు విజయలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast Link

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

నమస్తే...

నేను మావూరు. విజయలక్ష్మి.(విశాఖపట్నం). M,A.Music చదువుకున్న నేను ఆల్ ఇండియా రేడియో, రెడ్ ఎఫ్ ఎమ్ లలో రేడియో జాకీగా పనిచేసి, ఇప్పుడు ఫ్రీలాన్సర్ గా న్యూస్ చానల్స్ కి వాయిస్ ఆర్టిస్ట్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాను. ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, వనిత, వనితాజ్యోతి, పల్లకి, నవ్య, చిత్ర, వార, మాస, దిన పత్రికలలోను, ఈనాడు, సాక్షి పత్రికల ఆదివారం పుస్తకాలలోను, సంచిక సహరీ లాంటి వెబ్ పత్రికలలోనూ నా కథలు, వ్యాసాలు ప్రచురించబడ్డాయి. మహానటి, కలకంఠి నవలలు ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి. అయితే వీటన్నిటికీ కారణం నేనేం రాసినా ఏదో పెద్ద రచయిత్రిని అయిపోయానని మురిసిపోయి ప్రోత్సహించిన అమ్మా, నాన్నగారు మావూరు. అన్నపూర్ణమ్మ, సాంబమూర్తి గార్లు... ముఖ్యంగా నేను ఓ నాలుగు లైన్లు రాసినా నేనేదో పెద్ద నవల రాసినట్టు సరదా పడిపోయి ప్రోత్సహించిన మా అన్నయ్య డాక్టర్ మురళీమోహన్.

ఇప్పుడు మన తెలుగు కథలు లో నన్ను కూడా ఒక రచయిత్రిగా చేర్చిన మనతెలుగు కథలు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.31 views0 comments

Comments


bottom of page