top of page

మెరిసిన చిత్రం

#MallaKarunyaKumar, #మళ్ళకారుణ్యకుమార్, #MerisinaChitram, #మెరిసినచిత్రం, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

ree

Merisina Chitram - New Telugu Story Written By - Malla Karunya Kumar

Published In manatelugukathalu.com On 27/07/2025

మెరిసిన చిత్రం - తెలుగు కథ

రచన: మళ్ళ కారుణ్య కుమార్


"హాయ్ లాస్య, మేము వచ్చేశాం."


వాళ్ల పిలుపుతో తన ఆలోచన నుండి బయటకు వచ్చి, 

'వచ్చేశారా వీళ్లు!. ఇప్పటికే వున్న సమస్యలతో సతమతమవుతున్నాను. ఇప్పుడు వీళ్లు వచ్చారు. వీళ్లకు సేవలు చేయాలి.' నిట్టూర్చుతూ లేచి, 

"మామయ్య, అత్తయ్య ఎలా వున్నారు?. ఫోన్ చేసుండొచ్చు కదా, ఆయన్ను పంపించే దాన్ని."


"మాకు తెలుసు కదా తల్లి ఇక్కడకు ఎలా రావాలో. అందుకే ఫోన్ చేయలేదు. మీ పనుల్లో మీరు ఉంటారు కదా. ఇంతకీ మన బంగారాలు ఎక్కడ?.." అడిగాడు పరమేశం.


"ఇద్దరూ ఇంటిలోనే వున్నారు. లాలన కు తోడుగా లాలస కూడా వుంది." నెమ్మదించిన స్వరంతో చెప్పింది.


"సరే అయితే, మేము వెళ్ళి వాళ్లను చూసి వస్తాం."


"ఆగండి మామయ్య, ఇప్పుడే వచ్చారు కదా. ఫ్రెష్ అయ్యాక కలుద్దురు గానీ, ఇంతలో నేను మీకోసం వంట తయారు చేస్తాను. సమయం కూడా అవుతుంది కదా!." అని అంటూ అక్కడ నుండి కదిలింది లాస్య.


లాస్యను చూసిన వెంటనే ఆమె మానసిక స్థితి పసిగట్టి, "శ్రమ తీసుకోకు తల్లి, నేను అవన్నీ చూసుకుంటాను కదా. నీ ముఖం చూడు ఎలా వాడిపోయిందో?. నీకు విశ్రాంతి అవసరం." అనునయంగా అంది పార్వతి.


"సరే అత్తయ్య. ముందు మీరు ఫ్రెష్ అవ్వండి." అంటూ వాళ్ళ ఫ్రెష్ అవ్వడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసింది లాస్య.


కొంత సమయానికి ఫ్రెష్ అయ్యి వచ్చారు పార్వతి, పరమేశం. నేరుగా తమ మనవరాళ్లున్న గది లోపలికి చేరుకుంటూ, "ఏమిట్రా పిల్లలు ఎలా వున్నారు?." నవ్వుతూ అడిగాడు పరమేశం.


పరమేశం, పార్వతి ను చూసి నవ్వుతూ వేగంగా వచ్చి హత్తుకుంది చిన్న మనవరాలు లాలస. లాలన మాత్రం దిగులుగా ముఖం పెట్టుకొని చూస్తూ వుంది. లాలన ఏమి అనకుండా స్తబ్దుగా వుండడం చూసిన పరమేశం, 


 "ఏంటి మనవరాలా?, ఈ తాత తో ఎన్నో కబుర్లు చెప్పేదానిని ఫోన్లో!. ఇప్పుడు నేను ఎదురుగా వచ్చినా ఏమీ అనడం లేదు?. ఇంతలోనే మన స్నేహం విరిగిపోయిందా?.” తన కళ్లద్దాలు సరిచేసుకుంటూ అన్నాడు. 


పరమేశం మాటలకు తనలో వున్న దుఃఖం కట్టలు తెంచుకుంది. వెంటనే పరమేశాన్ని గట్టిగా వాటేసుకుంది లాలన. 


మనవరాలు వాటేసుకోవడంతో, కాసేపు మౌనంగా ఉండి పోయాడు. కొంత సమయం తర్వాత,


 "బంగారు తల్లి ఏమైంది రా?. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు?. నీకు ఏదైనా జరిగితే ఈ తాతయ్య,నాన్నమ్మ ఏమైపోయేవారు?. నీ సమస్య ఏమిటో మాతో చెప్పుకోవాలనిపించలేదా?." ఆమె తల నిమురుతూ అడిగాడు పరమేశం.


తాత మాటలకు తనలో వున్న దుఃఖం కన్నీటి ద్వారా కరిగి బయటకు వచ్చేసింది. 

మనవరాలను ఓదారుస్తూ, "సరే, మనం బయటకు వెళ్దాం. అంతా ఒక్కసారి తిరిగి వద్దాం. అప్పుడు నీకు ఈ బాధ తగ్గుతుంది." అని అంటూ లాలన, లాలస తో కలిసి బయటకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు పరమేశం.


పరమేశం పిల్లలతో బయటకు వెళ్తున్నాడని తెలిసి,


"నాన్న! ఈ సమయంలో బయటకు వెళ్లడం మంచిదంటారా?. అసలే లాలన కండిషన్ బాగాలేదు. మీకు కూడా ఈ ప్రాంతం కొత్త కదా?." అని అన్నాడు రంజిత్.


"ఏంట్రా పుత్రరత్నం!, కొన్నేళ్ళు ఈ హైదరాబాద్ లో వుండే సరికి నీకు కొమ్ములు వచ్చాయా?. గుర్తు తెచ్చుకో నీ ఉన్నత విద్య చదివే రోజుల్లో నేనే నీకు ఈ మహానగరం మొత్తం తిప్పి చూపించాను. ఇప్పుడు నాకు నా మనవరాళ్లు తోడున్నారు కదా ఏమి కాదులే. వాళ్లను నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావా?. ఏరా పిల్లలు చూశార్రా మీ నాన్న ఎలా మాట్లాడుతున్నాడో!, మనం బయటకు వెళ్లి మొత్తం తిరిగొచ్చి మనకు అన్నీ తెలుసని నిరూపిద్దాం, ఏమంటారు?." అని అన్నాడు పరమేశం.


పరమేశం మాటలు లాలన దుఃఖం ఛాయలను మెల్లమెల్లగా చెరిపేస్తున్నాయి. లాలన మోములో చిన్న ఉత్సాహపు వెలుగు వికసిస్తుంది.


"అలాగే తాతయ్య, మీరు చెప్పిందే చేద్దాం ముందు మనం బయటకు వెళ్దాం." అని తాతయ్య చెయ్యి పట్టుకు లాగింది లాలస తుంటరిగా.


"అలాగే, అలాగే. మీ నాన్నమ్మకు, అమ్మకు ఒక మాట చెప్పి వెళ్దాం." అని అంటూ భార్య దగ్గరకు, కోడలు దగ్గరకు వెళ్లి విషయం చెప్పాడు.


'వచ్చారో లేదో వాళ్లను బయటకు తీసుకు వెళ్తున్నాడు ఇతను. ఇప్పటికే వాళ్ల పోరు తట్టుకోలేక పోతున్నాను. వాళ్ళను ఇలా తిప్పితే క్రమశిక్షణ లేకుండా తయారవుతారు.' అని తనలో అనుకుంటూ తనకు ఇష్టం లేకపోయినా అంగీకరించింది లాస్య.


"పార్వతి!, నువ్వు లాస్య కు తోడుగా వుండు. మేము మళ్ళీ వేగంగా వస్తాం." అని చెప్పి మనవరాళ్లు తో బయటకు వెళ్ళాడు పరమేశం.


"ఇప్పుడు చెప్పు లాలన, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు?. ఆత్మహత్య మహాపాపం తెలుసా?."


చెప్పాలా, వద్దా అని సందిగ్ధం లో వుంది లాలన.


"నీ మనసులో బాధ చెప్పుకోక పోతే నాకు ఎలా తెలుస్తుంది?. అయినా అంత నిర్ణయం తీసుకోవడానికి నీకున్న బాధలు ఏమిటి?." లాలన వైపు చూస్తూ అడిగాడు పరమేశం.


కొంత సమయానికి నోరు విప్పింది లాలన, "తాతయ్య అందుకు కారణం అమ్మే, ఎప్పుడూ నాకు మార్కులు తక్కువస్తున్నాయని. నేను బాగా చదవడం లేదని తిడుతూ వుంటుంది. చదువని ఒక్కమాట తప్ప ఆమె ఎన్నడూ ప్రేమగా నన్ను దగ్గరకు తీసుకోలేదు. నా ఫీలింగ్స్ ఆమె తో చెప్పుకుందామని చూస్తే ఎప్పుడూ బిజీగా వున్నానని చెప్తుంటుంది. నాన్న సంగతి అంటావా అతని లోకంలో అతను వుంటారు. ఈ ఒంటరి తనం భరించడం నా వలన కావడం లేదు తాతయ్య."


"ఇంత చిన్న విషయానికి అంత పెద్ద నిర్ణయం తీసుకుంటావా?."


"మరి ఏమి చెయ్యమంటారు తాతయ్య?. ఇంటిలోనే కాక స్కూల్ లో కూడా నాకు చదువు రాదు, నేను ఎందుకు పనికి రానని అంటుంటారు. రోజూ ఈ మాటలు విని విని ఈ జీవితం మీద విరక్తి పుట్టింది. అందుకే ఈ నిర్ణయం."


'ఎంత క్షోభ అనుభవించకపోతే ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఈ పసి మనుసు. ఏమిటో ఈ రోజుల్లో పెద్దలు, పిల్లలు?. పెద్దలు దేని వెనుక పరుగు పెడతారో తెలియదు?. పిల్లలు చిన్న విషయాల్ని కూడా జీర్ణించు కోలేక ఇలా అర్ధాంతరంగా జీవితాన్ని బలి చేసుకోవడానికి చూస్తున్నారు!.' అని అనుకుంటూ స్థానిక ఆలయం వైపుకు కదిలాడు.


"తాతయ్య ఏమిటి ఆలయానికి తీసుకు వచ్చావు?." ఆశ్చర్యంతో అడిగారు ఇద్దరూ.


"చెప్తాను రండి." అని తనతో పాటు తీసుకు వెళ్తూ, ఆలయం ముందు వున్న షాప్ దగ్గర దేవుడికి కావాల్సిన ప్రసాదం కొనడానికి ఆగాడు.


"తాతయ్య, తాతయ్య. మేము తీసుకుంటాం." అని ఇద్దరూ పరమేశం దగ్గర డబ్బులు తీసుకొని షాప్ కు వెళ్ళారు.


"రేయ్, రాములు నువ్వా?. ఈ షాప్ లో ఏమిటి?." తమకు బాగా పరిచయం వున్న పిల్లాడు రాములు ను అక్కడ చూసి ఆశ్చర్యంతో అడిగారు.


"ఈ షాప్ మాదే, ఈరోజు మా అమ్మకు బాగాలేదని నేను ఇక్కడ వున్నాను."


"మరి నీ ఐస్క్రీమ్ బండి?."


"అది సెలవు రోజుల్లో మాత్రమే నేను తిప్పుతాను. మిగతా రోజుల్లో మా నాన్న తిప్పుతారు."


"అయినా నువ్వు గ్రేట్ రా, ఇన్ని పనులు చేస్తున్నావు." అని వాళ్లకు కావాల్సినవి కొని డబ్బులు ఇచ్చి అక్కడి నుండి పరమేశం దగ్గరకు చేరుకున్నారు.


పరమేశం పక్కనే వుంటూ మొత్తం గమనిస్తూనే ఉన్నాడు. పిల్లలు దగ్గరకు రావడం తో వాళ్లను తీసుకొని ఆలయం లోపలికి వెళ్లి దైవ దర్శనం చేసుకొని, ప్రసాదం స్వీకరించి తిరిగి బయలుదేరారు. 


ఆలయం బయట ఒకామె తాటి ముంజులు అమ్ముతూ కనిపించింది. మనవరాళ్లు వాటిని చూసి ముచ్చట పడటం తో పరమేశం వాటిని కొన్నాడు. వాటికి డబ్బులు చెల్లిస్తూ,

"అమ్మ, ఈ వయసులో మీరు ఇంత కష్ట పడటానికి కారణం ఏమిటి?." అడిగాడు పరమేశం.


"ఏమి చేస్తాను బాబు, ఆ పై వాడు నా రాత ఇలా రాసాడు. నా కొడుకు, కోడలు కరోనాలో చనిపోయారు. వాళ్లకు ఒక బిడ్డ. వాడి బాగోగులు చూసుకునే బాధ్యత నాదే కదా బాబు. వాడికి కాస్త ఊతం దొరికే వరకు నాకు ఈ బాధ్యత తప్పదు కదా." అని అంది ఆమె. 


ఆమె మాటలు విని, "సరే వస్తానమ్మా." అని చెప్పి, అక్కడ నుండి మనవరాళ్లు ను తీసుకొని ముందుకు కదిలాడు.


 "పిల్లలు ఇంతకు ముందు రాములు, ఇప్పుడు ఈ అవ్వ మనకు ఎదురుపడ్డారు కదా!. వాళ్ల నుండి మీరేమి గ్రహించారు?" అడిగాడు పరమేశం.


సమాధానం చెప్పకుండా చూస్తూ వున్నారు.


"సరే నేను చెప్తాను వినండి. ఆ అవ్వ తన మనవడు కోసం కష్టపడుతోంది. రాములు తన తల్లితండ్రులకు తోడుగా తనకు కష్టమైనా ఇష్టం తో ఆ వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ, చదువుకుంటూ వున్నాడు. చూసారా వాళ్ళు కష్టాన్ని జయించడానికి మాత్రమే చూస్తున్నారు. కానీ కష్టం వచ్చిందని తమ జీవితం చాలించాలనుకోవడం లేదు. వాళ్ళ కష్టం ముందు మీకున్న కష్టం ఏపాటిది?.


 సమాజం నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. ఒకవేళ మనకు ఏదైనా కష్టం వస్తె, చెడు ఆలోచనలు వస్తె మన చుట్టూ వున్న వారిని నిశితంగా పరిశీలిస్తే మనకు మనకు ఏదైనా పాఠం బోధపడుతుంది. 


అలాగే గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదివితే వాళ్ళు కష్టాలను ఎదుర్కొని ఎలా ముందుకు సాగారో మనకు తెలుస్తుంది. ఇప్పటికైనా అర్ధం అయిందా జీవితం అంటే ఏమిటో?. ముఖ్యంగా ప్రాణం విలువ ఏమిటో?. చిన్న పిల్లలు మీకు ఎక్కువ చెప్పినా అర్ధం కాదు. కానీ ఒక విషయం గుర్తు పెట్టుకొని జీవితం లో ప్రతి క్షణం కూడా ఒక సవాలు తో కూడుకున్నది. వాటిని అధిగమిస్తూ మనం ముందుకు సాగాలి. 


లాలన నువ్వు ఇంటికి వెళ్లి అమ్మకు క్షమాపణలు చెప్పు. నీ కారణంగా ఆమె ఎంతో బాధపడుతుంది. ఆమె నీతో సరిగ్గా మాట్లడకపోవడానికి ఆమెకు ఉద్యోగ బాధ్యతలు వున్నాయి కదా. వాటి తో సతమతం అవుతుంది మీ అమ్మ. ఆమె ఉద్యోగం చేయబట్టే కదా మీకు ఎటువంటి శ్రమ లేకుండా హాయిగా వున్నారు. వీలు కల్పించుకొని ఈ సారి నువ్వే ఆమెతో మాట్లాడు. ఆమె ఒక ప్రొఫెసర్ కాబట్టి నీకు చదువు అర్దం కావడం లేదని చెప్పు. ఆమె చూసుకుంటుంది. మీ ఇద్దరి సమస్యలు తీరిపోతాయి." అని అన్నాడు పరమేశం.


పరమేశం మాటలు కు ఇద్దరూ అంగీకరించారు. ఇంటికి వెళ్ళిన వెంటనే తల్లిని ఇద్దరూ హత్తుకొని క్షమాపణలు చెప్పారు. హఠాత్తుగా ఇద్దరూ హత్తుకోవడం తో ఆమె ఆశ్చర్యపోయి, ప్రేమతో వాళ్లను గట్టిగా ఆలింగనం చేసుకుంది.


ఈ అకస్మాత్తు మార్పు కారణం ఏమిటో అన్నది లాస్య కు కొద్దిక్షణాల్లో అర్ధం అయిపోయింది. 'ఇదంతా అత్తయ్య, మామయ్య కారణంగానే జరిగింది. వాళ్ల వలనే కొన్ని గంటల్లో ఇక్కడ వాతావరణం మార్పులు వచ్చాయి. నేను ఉన్నతి స్థితిలో వుండడానికి కారణం మామయ్యే కదా, నిజం తెలిసి కూడా నేను అజ్ఞానురాలుగా ప్రవర్తించాను. నిజానికి అందరూ కలిసి వుంటే ఎంత బాగుంటుంది. నేను ఏదేదో అనుకొని ఇన్నాళ్ళు మామయ్యను, అత్తయ్య ను దూరం చేసుసుకున్నాను.


నిజానికి పెద్దవాళ్ళ అంటేనే వారధి కదా. నవ్య తరం తప్పుల్ని తెలిపి సరైన మార్గంలో నడిపించే వారధి వాళ్ళు. నిజం గ్రహించక వాళ్ళను దూరంగా పెట్టి మనం ఒంటరిగా ఈ బ్రతుకు ప్రవాహంలో సతమతం అవుతాం. ఇక మీదట అయినా వాళ్ళకు గౌరవం ఇవ్వాలి. వాళ్ళు తప్పించి నన్ను నన్నుగా పలకరించే మనుషులు నాకు ఎవరు వున్నారు?.' అని తనలో అనుకుంటూ తన అత్తమామల ప్రాముఖ్యత తెలుసుకుంది.

"అత్తయ్య, మామయ్య మిమ్మల్ని క్షమాపణ అడిగే హక్కు కూడా నాకు లేదు. నేను మిమ్మల్ని తక్కువుగా చూసాను." చేతులు జోడిస్తూ అంది లాస్య.


"తల్లి, పిల్లలకు డబ్బు, చదువు ఎలాగూ ఇస్తాము. వాటితో పాటు సమస్యల్ని తట్టుకునే శక్తి, కాస్త తల్లితండ్రుల ప్రేమ కూడా ఇవ్వాలి. అన్నీ ఇచ్చినప్పటికే కొందరు అవన్నీ మరిచిపోయి తల్లితండ్రులను విడిచి పెట్టేస్తున్నారు. మరి ఇవ్వక పోతే? ఈ ప్రశ్న కు సమాధానం నువ్వే వెతుక్కో!. ఇకనైనా వాళ్ళ కోసం కాస్త సమయం కేటాయించు. నీకు కూడా కాస్త రిలాక్స్ వస్తుంది." అని నవ్వుతూ చెప్పాడు పరమేశం.


ఇంతలో లాలస కెమెరా తీసుకు వచ్చింది, "తాతయ్య, తాతయ్య, ఒక స్వీట్ మెమరీ క్రియేట్ చేద్దామా?. మన అందరం కలిసి ఫోటో దిగుదాం." అని అంటూ హడావుడి చేసింది.


"సరే మనల్ని ఫోటో ఎవరు తీస్తారు?." ఆశ్చర్యంగా అడిగాడు పరమేశం.


"మరేం ఫర్వాలేదు. ఇది ఆటోమేటిక్ సిస్టమ్ ఇదే తీస్తుంది." అంటూ దాన్ని సరైన చోట పెట్టి మొత్తం అందరినీ దానికి ఎదురుగా నిల్చో బెట్టింది.


 కొంత సమయంలో కెమెరా క్లిక్ మని లైట్ వేస్తూ శబ్దం చేసింది. 

వెంటనే వెళ్ళి ఆ కెమెరా తీసుకొని వచ్చి ఆ ఫోటో చూసింది.


"తాతయ్య!, చిత్రం మెరిసిపోతుంది!, ఈ చిత్రంలో నువ్వు ఇంకా మెరిసిపోతున్నావు కుర్రవాడిలా!." అని నవ్వుతూ అంది లాలస.


లాలస మాటలకు అక్కడ అందరి మోములో నవ్వులు వికసించాయి!.


"అమ్మ గడుగ్గాయి!. నన్నే ఆటపట్టిస్తావా?." అని మురిసిపోతూ ఆప్యాయంగా లాలస ను హత్తుకున్నాడు పరమేశం.


 సమాప్తం


మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

నా పేరు మళ్ళ కారుణ్య కుమార్అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.

విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.

సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.


Commentaires


bottom of page