top of page

మౌనవ్రతం జిందాబాద్

#MounavrathamJindabad, #మౌనవ్రతంజిందాబాద్, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguStory, #తెలుగుకథ


Mounavratham Jindabad - New Telugu Story Written By - Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 27/03/2025

మౌనవ్రతం జిందాబాద్తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


"ఒరే మామ!...." పిలిచాడు అంజిబాబు.


సరాగాల సాంబయ్య అంజిబాబు మేనమామ. అతని తల్లి తాయారమ్మ తమ్ముడు.

మేనమామను అంజిబాబు ‘ఒరే’, అని ఎందుకు పిలిచాడంటే.....

సరాగాల సాంబయ్య అంజిబాబు కన్నా వయస్సులో రెండు సంవత్సరాలు చిన్న. కానీ శరీర ధారుఢ్యంలో, ఎత్తులో సాంబయ్య అంజిబాబు కన్నా రెండు రెట్లు జాస్తి.


"ఆహా!.... ఏం మర్యాద... ఏం మర్యాద!..." ఆశ్చర్యంగా అంజి ముఖంలోకి చూచాడు సాంబయ్య.


"ఏందిరా మామ, అలా చూస్తున్నావ్?" అడిగాడు అంజిబాబు.


"నీవు నన్ను సంబోధించిన విధానానికి అల్లుడూ!..."


"చూడూ, నీవు నాకంటే పెద్దోడివా?... చిన్నోడివా?"


"చిన్నవాడిని!"


"అందుకే అలా పిలిచాను!..."


"మనిద్దరం వున్నప్పుడు పిలిస్తే పిలిచావు. రేపు నీవు చూడబోయే అదే నీ పెండ్లి చూపుల సమయంలో, ఆ అమ్మాయి వారి ఇంట్లో అలా పిలవకురా!... నా పరువు పోతుంది" దీనంగా చెప్పాడు సరాగాల సాంబయ్య.


"పిలవనులే!... కానీ ఒరే మామా!...."


"అదుగో మళ్ళీ ఒరే!..." ఆశ్చర్యంతో అన్నాడు సాంబయ్య.


"ఇప్పుడు ఇక్కడ మనిద్దరమేగా వున్నాము!" ఆవేశంగా అన్నాడు అంజిబాబు.


"సరే!... ఎందుకు పిలిచావో చెప్పు!..."


"నాకు ఈ పెండ్లి చూపులు ఇష్టం లేదు!"


"ఆ మాటను నీవు నీ తండ్రి, నా బావ, మా అక్క భర్త దానాల దానయ్య గారితో చెప్పాలి కదరా!..."


"ఆ పని నాకు బదులుగా నీవు చేయాలి. రేపటి పెండ్లి చూపులను రద్దు చేయాలి మామా!..."

ప్రాధేయపూర్వకంగా చెప్పాడు అంజిబాబు.


"అది కుదరదు!...."


"ఎందుకు కుదరదు?" అంజిబాబు ప్రశ్న.


"మా బావ, మీ నాయన దానాల దానయ్య, తన నిర్ణయాన్ని మార్చుకోడు. వాళ్ళ ఇంటికి మనం రేపు వస్తున్నట్లు ఫోన్ చేసి కూడా చెప్పేశాడు" అసహనంగా అన్నాడు సాంబయ్య.


"ఓరే మామా!... నీకు దణ్ణం పెడతా!...." చేతులు జోడించాడు అంజిబాబు.


"శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు!...."


"ఒరే మామా!..." బిగ్గరగా అరిచాడు అంజిబాబు.


సరాగాల సాంబయ్య ఉలిక్కిపడ్డాడు.

"ఏమైందిరా!..."


"నేను పూర్తిగా చెప్పకముందే, ఒరే మామా!... ఏందిరా నీ ఆ వెధవ దీవెన" కోపంగా సాంబయ్య ముఖంలోకి చూచాడు అంజిబాబు.


"సరే!... నీవు చెప్పదలచుకొన్నది ఏమిటో చెప్పు!"


"నేను ముందే చెప్పేశా!... నాకు ఈ పెండ్లి చూపులు ఇష్టం లేదు. వాళ్ళ ఇంటికి పోవడం, వారు పెట్టింది తినడం, పిల్లను చూడటం, నీకు పాటవచ్చా, నాట్యం వచ్చా, ఎంతవరకు చదువుకొన్నావు, ఉద్యోగం చేస్తావా లేదా!... ఇలాంటి ప్రశ్నలడిగి ఆ పెండ్లి కూతురును హింసించడం నాకు ఇష్టం లేదు. మరో నాలుగు సంవత్సరాలు ఉద్యోగం చేయాలి. పది పావులు సంపాదించి చేర్చి పెట్టాలి. అప్పుడు ఆలోచిస్తా నేను నా పెండ్లి విషయాన్ని " ఆవేశంగా చెప్పాడు అంజిబాబు.


"ఓహో!... అల్లుడూ!... " చిరునవ్వుతో పిలిచాడు సాంబయ్య.


"ఏందిరా మామ?" వ్యంగ్యంగా అడిగాడు అంజిబాబు.


"ఇలారా!...." 


అంజిబాబు అతని దగ్గరకు జరిగాడు.

"నీ చెవిని నా నోటికి కరిపించు!"


"ఆఁ...!"


"చెప్పింది చెయ్యి. నీకు వివాహ విమోచన మంత్రోపదేశం చేస్తాను" చిరునవ్వుతో చెప్పాడు సాంబయ్య.

అంజిబాబు తన మామ చెప్పినట్లు చేశాడు.


సాంబయ్య ఓ పదిసెకండ్లు అతని చెవిలో ఏదో మంత్రోపదేశం చేశాడు. జరిగి.... "ఎలా వుంది మంత్రం!..." నవ్వుతూ అడిగాడు సాంబయ్య.


"ఓరే మామా!... నీవు రియల్లీ గ్రేట్ మామా!..." సంతోషంగా చెప్పాడు అంజిబాబు.

*

మరుదినం అమ్మాయి వారి ఇంటికి, అంజిబాబు, మేనమాన సరాగాల సాంబయ్య, జనకమహారాజు దానాల దానయ్య, వారి అర్థాంగి అంబిక పిల్లను చూచేదానికి వెళ్ళారు.

అమ్మాయి పేరు కాంచన, తండ్రి తాటిమట్టల తాతారావు, తల్లి తరంగిణి, అమ్మాయి సోదరుడు చిన్నినాయన, అంజిబాబు బృందాన్ని వారు ఆదరాభిమానాలతో ఆదరించారు.


అంజిబాబు బృందం పెండ్లి కూతురు ఇంటికి చేరక ముందు, పెండ్లి కూతురు కాంచన ఆమె తల్లిదండ్రులతో...

"అమ్మా!... నాన్నా!... నేను చెప్పేది వినండి!..." అంది.


"చెప్పమ్మా!..." అడిగాడు తాటిమట్టల తాతారావు.


"నేను అబ్బాయిని ఐదు ప్రశ్నలు అడుగుతాను. నా ప్రశ్నలకు నా మనస్సున వున్న జవాబులు ఆ అబ్బాయి చెబితే, పాస్.. లేకపోతే ఫెయిల్ సరేనా!" అడిగింది కాంచన.


"సరే!... తల్లీ అలాగే!... మాకు కావలసింది నీ సంతోషమే కదమ్మా!..." నవ్వుతూ చెప్పింది తల్లి తరంగిణి.


పెండ్లి కొడుకు బృందానికి, పెండ్లి కూతురు తల్లి టిఫిన్ పెట్టారు. పెండ్లి కూతురు కాంచన, అందరికీ కాఫీ గ్లాసులను అందించింది.

తర్వాత....

"అల్లుడూ!... అమ్మాయిని నీవు ఏమైనా అడుగుతావా!..." చిరునవ్వుతో అడిగాడు మేనమామ సరాగాల సాంబయ్య.


పెండ్లి కొడుకు అంజిబాబు తలాడించాడు.

వధువు తండ్రి, తల్లి... అమ్మాయి కాంచన ముఖంలోకి చూచారు.

కాంచన సిగ్గుతో తలవంచుకొని ప్రక్క గదిలోనికి వెళ్ళింది.

"ఊ వెళ్ళు!..." అన్నాడు మేనమామ సాంబయ్య.


వరుడు అంజిబాబు ఆ గదిలో ప్రవేశించాడు.

వధువు కాంచన బి.ఎస్సీ ఫస్ట్ క్లాసులో పాసైంది. వరుడు అంజిబాబు ఎం.కామ్ గోల్డ్ మెడలిస్టు.

క్షణంసేపు అంజిబాబు ముఖంలోకి చూచింది కాంచన.

చిరునవ్వుతో ఆమె ముఖంలోకి చూచాడు అంజిబాబు.

"నేను మిమ్మల్ని ఐదు ప్రశ్నలు అడుగుతాను" మెల్లగా చెప్పింది కాంచన.


తలాడించి జేబునుంచి ఒక కాగితాన్ని తీసి అంజి, కాంచన చేతికి అందించాడు.

కాంచన కాగితాన్ని విప్పి చూచింది.


"నాకు ఉబ్బసం వ్యాధి ఉంది. డాక్టర్ నాకు ఇచ్చిన సలహా, వారానికి మూడు రోజులు ఆది, బుధ, శుక్ర... సంవత్సర కాలం మౌన వ్రతం పాటించాలి. నీ రోగానికి అదేమందు అని చెప్పారు’ అని వ్రాసి ఉంది.


కాంచన ఆశ్చర్యంతో అంజిబాబు ముఖంలోకి చూచింది. కాంచన వేగంగా ఆ గది నుండి హాల్లోకి వెళ్ళిపోయి, అమ్మా నాన్నలతో మరో గదిలో ప్రవేశించింది. తన చేతిలో కాగితాన్ని తన తండ్రి చేతికి ఇచ్చింది. వారు చదివారు. ఆశ్చర్యంతో నోరు తెరిచారు. భర్త చేతిలోని కాగితాన్ని అర్థాంగి లాక్కొని చదివింది. ఆమె కూడా ఆశ్చర్యంతో నోరు తెరిచింది.


కాంచన హాల్లోకి ప్రవేశించి....

"నాకు మీ అబ్బాయి నచ్చలేదు" చెప్పి వేగంగా తన మేడమీద గదికి వెళ్ళిపోయింది.


వరుని తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు.


"బావా!... అక్కా!... సినిమా అయిపోయింది. లేవండి, ఇంటికి పోదాం" అన్నాడు సరాగాల సాంబయ్య.


’ఒరే మామా!... నీవు జిందాబాద్‍రా!....’ నవ్వుకొంటూ లోన అనుకొన్నాడు వరుడు అంజిబాబు.


దానాల దానయ్య గారు, అర్థాంగి అంబిక, బిక్కముఖాలతో హాలునుండి బయటికి నడిచారు.

వారి వెనకాల వరుడు మేనమామ సరాగాల సాంబయ్య ’మౌన వ్రతం జిందాబాద్’ నవ్వుతూ అనుకొని అల్లుడి ముఖంలోకి చూచాడు. అంజిబాబు ఆనందంగా నవ్వాడు.


సమాప్తి


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


Comments


bottom of page