మూడుగదుల వాటా
- Srinivasarao Jeedigunta

- Jan 25
- 6 min read
#MuduGadulaVata, #మూడుగదులవాటా, #JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Mudu Gadula Vata - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao Published In manatelugukathalu.com On 25/01/2026
మూడుగదుల వాటా - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
“ఇదిగో రత్నం! కొద్దిగా వేడిగా కాఫీ యిస్తావా.. అలా వాకింగ్ వెళ్తాను తాగేసి” అన్నాడు వెంకట్రావు.
“ఉదయమే తాగేసారు గా, డాక్టర్ కాఫీ ఎక్కువగా తాగొద్దు అన్నాడు గుర్తులేదా” అంది వంటింట్లో నుంచి.
“గుర్తు వుంది. ఆనాడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నర్స్ ఏమంది..’ డాక్టర్ గారు కాఫీ త్రాగుతున్నారు, కొద్దిసేపు వెయిట్ చెయ్యండి’ అంది. అందుకే కాఫీ మంచిదే. కొద్దిగా యివ్వు” అన్నాడు.
“ఉదయం లేచింది దగ్గర నుంచి కాఫీ యివ్వడం, టిఫిన్ చేసి పెట్టడం, మళ్ళీ కాఫీ, వాకింగ్ నుంచి రాగానే నిమ్మకాయ నీళ్లు, ఆ తరువాత భోజనం, మళ్ళీ కాఫీ, రాత్రికి టిఫిన్.. యిదే నా బ్రతుకు. పెళ్ళైన రోజు నుంచి అడుగుతున్నాను ‘నా పేరున బ్యాంకులో అకౌంట్ తీసి ఒక లక్ష రూపాయలు వెయ్యండి, రేపు ఎటోచ్చి ఎటు పోయినా నన్ను ఆదుకుంటుంది’ అని, ఆధార్ కార్డు లో పేరు తప్ప ఏమీ లేదు నా పేరున” అంది రత్నం వేడి కాఫీ గ్లాస్ అందిస్తూ.
“ఎటోచ్చి ఎటు పోయినా అంటే నా పని అంతేనని డిసైడ్ అయిపోయావా, మా యింట్లో అందరూ ఎనభై దాటారు. నాకు యిప్పుడు అరవై” అన్నాడు వెంకట్రావు.
“అయ్యో ఎందుకండి సంక్రాంతి నాడు అశుభం మాటలు. నా అభిప్రాయం నాకంటూ చేతిలో కొంత డబ్బు ఉంటే చిన్న చిన్న వాటికి మిమ్మల్ని అడగక్కరలేదు అని, ఏమిటో ఈ మధ్య తెలుగు టీవీ సీరియల్స్ చూసి ఏమాట వాడాలో తెలియకుండా పోయింది. పొరపాటున ఎటోచ్చి ఎటు పోయినా అన్నాను. దేముడా క్షమించు తండ్రి. నీకు ఈ రోజు బియ్యం పర్వాన్నం వండి నైవేద్యం పెడ్తాను” అంది లెంపలు వేసుకుంటో.
“నేను అలా వాకింగ్ వెళ్లి వస్తాను, బజారు నుంచి ఏమైనా తీసుకుని రావాలా” అంటూ అల్మరా లో పర్సు లేకపోవడం చూసి “రాత్రి నా పర్సు యిక్కడ పెట్టాను ఏమైంది” అన్నాడు భార్య తో.
“అలా కనిపించేటట్లు పర్సు పెడితే ఏమన్నా వుందా? తెల్లారి లేస్తే పనివాళ్ళు యింట్లో తిరుగుతో వుంటారు.అందుకే తీసి నా దగ్గర దాచాను” అంది.
“మరి యింకా బ్యాంకు అకౌంట్ కోసం ఎందుకు గొడవా, మొత్తం క్యాష్ నీ దగ్గరే వుంచుకుని” అన్నాడు నవ్వుతూ వెంకట్రావు.
“సరే ఎంత ఇమ్మంటారు?” అంది రత్నం.
“ఎంత ఏమిటి.. ఆ పర్సు యిలా యివ్వు. బాగానే వుంది వరస” అంటూ భార్య చేతిలో పర్సు తీసుకుని వెళ్ళిపోయాడు.
‘ఏమిటో ఈ మనిషి. అంత డబ్బు చేతిలో వున్నా తన కోసం ఒక్కరూపాయి వాడు కోరు’ అనుకుంది రత్నం.
“ఏమిటి అప్పుడే వచ్చేసారు?” అంది భర్తని చూసి.
“ఈ రోజు హరిదాసులు, గంగిరెద్దులు వస్తాయిగా. యింటి దగ్గరికి వాటిని చూడటం నాకు బాగా యిష్టం” అన్నాడు.
“అవును కదా, ఎంతైనా బంధుప్రీతి” అని మెల్లగా అంటున్న భార్యని చూసి “అందుకేగా నిన్ను పెళ్లి చేసుకుంది” అన్నాడు కోపంగా.
యిలా సాగుతోంది వీళ్ళ సంసారం. వీళ్ళకి యిద్దరు పిల్లలు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ పరాయి రాష్ట్రము లో వుంటున్నారు.
వెంకట్రావు రత్నం దంపతులకి పెళ్లి అయిన దగ్గర నుంచి ఉంటున్న యిల్లు వదిలి కొడుకుల దగ్గరికి వెళ్ళటం యిష్టం లేదు. ఇంటి ఓనర్ కూడా అప్పుడప్పుడు కొద్దిగా అద్దె పెంచడమే కాని వీళ్ళని యిల్లు ఖాళీ చెయ్యమని ఎప్పుడు అనలేదు.
“ఎన్నాళ్ళు అని ఈ రెండు బెడ్ రూమ్స్ లో ఉంటాము. పిల్లలు వస్తే కష్టముగా ఉంటోంది అని కూడా మీకు ఆలోచన రాలేదా” అంది భర్తకి అన్నం వడ్డిస్తో.
“ఎప్పుడో ఒకసారి వచ్చే పిల్లల కోసం పెద్ద ఇల్లు తీసుకోవటం ఎందుకే, అదీకాక మన హౌస్ ఓనర్ మంచివాడు. పిల్లలకు, వున్న రెండు గదులు యిచ్చి మన హల్ లో పడుకుందాం. ముసలాళ్ళం ఎక్కడ పడుకున్నా ఒక్కటే” అన్నాడు.
భర్త కి చెప్పి లాభం లేదు అనుకుని కొడుకులకి చెప్పి వాళ్ళ చేత మొగుడికి చెప్పించింది.
“ఎందుకు రా యిప్పుడు ఇల్లు మారడం. ఈ సామాను అంతా సద్ది యింకో ఇంటికి తీసుకుని వెళ్లడం మా వల్ల కాదు. మీ అమ్మకి నడుం నొప్పి.. నాకు చేతులు వణకడం.. మీకు తెలుసు కదా. అయినా మీ అమ్మ ఏది చెప్పినా వెంటనే తల ఊపి నాకు ఫోన్ చేసేయడమేనా” అన్నాడు వెంకట్రావు.
“వాళ్ళు సెలవు చూసుకుని వచ్చి సామాను కొత్త ఇంటికి చేరుస్తారు. ముందు మీరు ఇల్లు చూడండి” అంది.
కొద్ది రోజుల తరువాత భార్య రత్నం ని తీసుకుని వెళ్లి “ఇదే యిల్లు. బాగుందా” అన్నాడు.
“ఇండిపెండెంట్ హౌస్ ఎందుకండి రెంట్ ఎక్కువ ఉంటుందేమో” అంది యిల్లు చూసి మొక్కలు కూడా పెంచుకోవచ్చు అంటూ.
నాకు యిప్పుడు వున్న యిల్లు మారడం యిష్టం లేదు. నీ పోరు పడలేక మా స్నేహితుడిని అడిగితే, ‘వేరే యిల్లు ఎందుకు రా. మేము అమెరికా వెళ్తున్నాము. గ్రీన్ కార్డు వుంది కదా, ఈ యింట్లో నువ్వు వుండు’ అన్నాడు. ‘దీపం పెడితే చాలు నీకు తోచినంత అద్దె యివ్వు, పెద్దగా అద్దె మీద ఆశ పెట్టుకోలేదు, యిల్లు పాడు కాకుండా వుంటే చాలు’ అన్నాడు.”
“మీకు మంచి స్నేహితులు కూడా వున్నారు అన్నమాట. సరే పిల్లలకు చెప్పి రమ్మంటాను సామాన్లు సద్దటానికి” అంది రత్నం.
పిల్లలు అసాధ్యులు. వచ్చి సామాన్లు సద్ది, ట్రక్ లో వేసుకుని కొత్త ఇంటికి తీసుకొని వెళ్లి ఒక సోఫా నాలుగు కుర్చీలు కూడా కొని హాలు లో వేసారు.
“మీరు ఏ పని సరిగ్గా చెయ్యరు కదా, ఏదో మూడు గదులు వున్న యిల్లు చూడమంటే డూప్లెక్స్ హౌస్ చూసారు. యిప్పుడు రోజూ మేడ మెట్లు ఎక్కలేక నడుం పడిపోతోంది” అంటూ గట్టిగా అరుస్తున్న భార్య మీద వెంకట్రావు కి పిచ్చ కోపం వచ్చింది.
“యిల్లు చూసే దాకా ప్రాణం తీసి యిప్పుడు వంకలు పెట్టి నెపం నా మీదకి తోస్తున్నావు. బుద్దిలేకుండా ఆ అరుపులు ఏమిటి, ఒక పక్కన నేను ఫోన్ లో ఆఫీస్ వాళ్ళతో మాట్లాడుతున్నాను అని కూడా ఆలోచన రాదు” అంటూ దులిపేసాడు.
రత్నం మాత్రం ఏమీ తక్కువ తినలేదు మొగుడు ఒకటి అంటే తను రెండు అని “యిహ నుంచి మీతో మాట్లాడితే ఒట్టు” అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది.
“మంచిది, యిల్లు ప్రశాంతం గా ఉంటుంది” అన్నాడు.
రెండో సారి కాఫీ లేదు, ఏమి వండాలో అడగటం లేదు చిక్కుడు కాయలు తెచ్చి టేబుల్ మీద పడేసింది. ఓహో అయితే యిప్పుడు నేను చిక్కుడుకాయలు వలవాలి అన్నమాట అనుకుంటూ ఆ పనిలో పడ్డాడు. చూద్దాం నేను కూడా మాట్లాడను, యిప్పుడు ఒకరినుంచి ఒకరికి కావలిసింది ఏమీలేదు అనుకున్నాడు.
రాత్రి అవగానే తన దిండు, దుప్పటి తీసుకుని మేడ మీద రూంలోకి వెళ్ళిపోయాడు. ‘ఎవ్వరిని సాధిద్దాం అని పైన గదిలోకి వెళ్లిపోయారు, అర్థరాత్రి షుగర్ పడితే తేని నీళ్లు కలిపి ఎవ్వరు యిస్తారో చూస్తాను’ అనుకుంది రత్నం.
వీళ్ళు మాట్లాడుకోకుండా ఉండటం వారం రోజులు దాటింది. ఆయన మాట్లాడితే బాగుండును అని రత్నం, భార్య మాట్లాడితే బాగుండును అని వెంకట్రావు అనుకోవడమే గాని ఎవ్వరు ముందుకు రాకుండా భీష్మించుకుని కూర్చున్నారు.
“ఏమిటి నాన్నా ఈ వయసులో అమ్మా మీరూ యిలా తగాదా పడి మాట్లాడుకోకుండా ఉండటం, మూడు గదులు యిల్లు తీసుకుంది మీరిద్దరూ చెరో గదిలో పడుకోవడానికా” అన్నాడు పెద్దకొడుకు ఫోన్ చేసి.
“ఈ మాట మీ అమ్మని అడగాలిసింది. ఒకటే చాదస్తం, ఏ మాట పడితే ఆ మాట అంటోంది నన్ను, ఎవ్వరు లేనప్పుడు ఆంటే సరే అనుకుంటాను, నేను ఎవ్వరితోనైనా ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు సూర్యకాంతం లా అరుస్తో వుంటుంది. దానితో నాకు బీపీ పెరిగి నేను అరవడం..
లాభం లేదురా. నువ్వు వచ్చి కొన్నాళ్ళు మీ అమ్మని నీ దగ్గరికి తీసుకుని వెళ్ళు. మీ అమ్మ అరుపులకి నాకు గుండెల్లో బ్లాక్స్ ఎక్కువ అయ్యి ఏమవుతానో అని భయంగా వుంది. ఈ వారం నుంచి నా టిఫిన్, నా కాఫీ నేనే చేసుకుంటున్నాను, యిహ వంట కూడా నేనే చేసుకోగలను, త్వరగా వచ్చి మీ అమ్మని కాని లేదంటే నన్ను గాని ఎవ్వరినో ఒక్కరినే తీసుకుని వెళ్ళు” అన్నాడు వెంకట్రావు.
“ఏమిటో నాన్నా మీ గొడవలు. సరే. వచ్చే వారం వస్తాను, అమ్మని తీసుకుని వెళ్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్తే నా పరిస్థితి కూడా మీలా అవుతుంది” అన్నాడు.
“పర్సు కూడా మీతోపాటే పెట్టుకుంటే ఎలా, యింట్లోకి కొన్ని వస్తువులు కావాలి” అని మెసేజ్ పెట్టింది భర్తకి.
“నేను పడనప్పుడు నా డబ్బులు ఎందుకు, నీ కొడుకుని అడుగు డబ్బులు పంపమని” అని వెంకట్రావు తిరుగు మెసేజ్.
ఈ గొడవలో పడి యిద్దరు మందులు సరిగ్గా వేసుకోకపోవడంతో వెంకట్రావు కి షుగర్, బీపీ పెరిగి తన గదిలోనుంచి కిందకి రావడం మానేసాడు ఆరోజు..
ఏమైంది ఈయనకి తొమ్మిది గంటలు అయినా కాఫీ కలుపుకోవడానికి కూడా రాలేదు, ఏమిటో ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా ఈయన చేసే పనులకి అరవడం తప్పడం లేదు అనుకుంటూ మేడ మీద కి వెళ్లి భర్త పడుకున్న గది తలుపు కొద్దిగా తెరిచి చూసింది.
మంచం మీద మనిషి కనిపించకపోవడం బాత్రూం నుంచి గట్టిగా డోక్కుంటున్న అరుపులు విని కంగారుగా తలుపు తట్టి, “ఏమైంది వొంట్లో బాగుండలేదా” అంది తను భర్త తో మాట్లాడటం లేదు అనే విషయం మర్చిపోయి.
తలుపు తీసుకుని నీరసంగా బయటకు వచ్చి “అవును. రాత్రి నుంచి యిదే పరిస్థితి” అన్నాడు.
“సరే రండి. జీలకర్ర తేనే యిస్తాను, తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్దాం, నాకు ఆరోగ్యం బాగుండలేదు, అయినా మీలాగా కంగారు పడ్డానా? అందుకే అనేది.. ఏదీ తెలియదు అని” అంటూ భర్త చెయ్యి పట్టుకుని మెట్లు మెల్లగా దింపి సోపాలో కూర్చోపెట్టింది.
“నువ్వు అన్నది నిజమే, ఈ వయసులో మెట్లు దిగడం కష్టమే. ఒక్కసారి దిగే సరికి నాకు కష్టం అనిపించింది. అలాంటిది రోజుకి నాలుగు అయిదు సార్లు పైకి క్రిందకి దిగుతో వుంటావు” అన్నాడు.
రత్నం ఏమి జవాబు ఇవ్వకుండా తేనే జీలకర్ర పొడి కలిపి తీసుకుని వచ్చి యిచ్చింది. “ఏమిటో ఎంత వద్దనుకున్నా గొడవలు అవుతున్నాయి మన ఇద్దరికి. అదివరకు రెండు గదులు ఇల్లే నయ్యం, నేను అరిచినా మీరు పట్టించుకునే వారు కాదు, ఈ మూడు గదుల యిల్లు అచ్చిరాలేదు. మీరు కూడా తిరిగి అరుస్తున్నారు” అంది రత్నం.
భార్య వంక చూసి “మళ్ళీ పాత ఇంటికి వెళ్ళిపోదామా, తిట్టుకున్నా, ఒక్కటే పడక గది కాబట్టి మళ్ళీ మాట్లాడుకునే వాళ్ళం.. యిల్లు విశాలం కాదు, మనసులు విశాలం గా వుంటే చాలు. యింకా ఎన్నాళ్ళు కలిసి ఉంటామో తెలియదు, అప్పుడు ఎవరో ఒకరు ఒంటరిగా ఉండక తప్పదు, యిప్పుడే తగవులడుకుని ఓకే యింట్లో ఒంటరిగా ఉండటం ఎందుకు” అన్నాడు.
“అవునండి, మనం ఒక ఒప్పందంకి వద్దాం, నేను అరిచినప్పుడు మీరు మాట్లాడకుండా ఉండాలి, అలాగే మీరు అరిస్తే నేను మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళిపోతాను” అంది.
“సరే చూడు ఎవ్వరో ఫోన్ చేస్తున్నారు” అన్నాడు. ఫోన్ తీసుకుని ‘పెద్దాడు’ అంటూ “ఏరా అబ్బాయి, ఎలా వున్నావు” అంది రత్నం.
“అమ్మా! ఈ రోజు సాయంత్రం వస్తున్నా నిన్ను నాతో తీసుకుని వెళ్ళడానికి, బట్టలు సద్దుకుని రెడీగా వుండు” అన్నాడు.
“అక్కర్లేదు రా, నేను మీ నాన్న కలిసి వచ్చే నెల నీ దగ్గరికి వస్తాము లే” అంది.
“అయితే మీరు మాట్లాడుకుంటున్నారా” అన్నాడు.
“అవునురా, ముప్పై అయిదు సంవత్సరాల బంధం మాది” అని కొడుకుతో అంటున్న భార్యని చూసి నవ్వుకున్నాడు వెంకట్రావు.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.






Comments