'Musali Bidda' New Telugu Story Written By Kotthapalli Udayababu
'ముసలి బిడ్డ' తెలుగు కథ
రచన : కొత్తపల్లి ఉదయబాబు
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ఒకటో తారీకు ఉదయం 7:00 కల్లా తలుపు కొట్టి లోపలికి ప్రవేశించినటువంటి తండ్రి రావణశర్మను చూస్తూనే ఏడుపు మొహం పెట్టి ఆహ్వానించారు రెండో కొడుకు ప్రకాశం, కోడలు పద్మిని.
"ఏం అమ్మాయి? మీ అమ్మగారు, నాన్నగారు అంతా బాగున్నారా? "అడిగారాయన నేరుగా కామన్ బాత్రూంలోకి వెళ్తూ.
"బాగున్నారు మావయ్య. మీ ఆరోగ్యం ఎలా ఉంది?" అడిగింది పద్మిని ఆయన కాళ్లు కడుక్కున్నాక, తుడుచుకోవడానికి టవల్ ఇవ్వడానికి సిద్ధంగా నిలబడి.
"అంతా శుభ్రంగా ఉన్నారు. ఏరా చిన్నకొడకా.. ఎలా ఉన్నావ్?"
ఆయన కాళ్ళు కడుక్కుని వచ్చి కోడలి చేతిలో టవలందుకుంటూ కొడుకుని అడిగాడు.
"బానే ఉన్నాను నాన్న. ఎన్ని మందులు వాడినా మోకాళ్ళ నొప్పులే తగ్గట్లేదు"
"అలాగా. ఏ కొడుకు ఇంటికెళ్ళినా అన్నీ రోగాలే.. అందరికీ రోగాలే.. ఎక్కడ చూసినా కల్తీ తిళ్ళే మరి. అమ్మాయి.. నేను వస్తానని తెలుసుగా. టిఫిన్ ఉందా.. పెట్టు. లేదంటే హోటల్ నుంచి తెప్పించు. ఒరేయ్ చిన్నోడా! ఇదిగోరా 15000. నా నెలఖర్చు. జేబులో పెట్టుకో. ఇంకా కావలిస్తే మొహమాట పడకుండా అడుగు. " అని చిన్న కొడుకు చేతికి డబ్బులు ఇచ్చి, "నా గదిలో మంచం మీద పక్కా అవి శుభ్రంగా దులిపి వేసావా అమ్మ? " అని అడిగారు కోడల్ని.
"అన్నీ సిద్ధమే మావయ్య. రండి. టిఫిన్ చేసి రెస్ట్ తీసుకోండి. వంట చేసేస్తాను. " అని డైనింగ్ టేబుల్ వైపు దారి తీసింది చిన్న కోడలు. ఆయన కోడల్ని అనుసరించాడు.
********
రావణ శర్మ గారి వయసు 85 ఏళ్లు. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు ఆయనకు. పిల్లల చదువుల కోసం, ఎన్నో ఏళ్లుగా ఉన్న ఊళ్లోనే, పిల్లలు అందరూ కలిసి ఉంటారని పెద్ద స్థలాన్ని కొనుక్కొని, అందులో సర్వీస్ లో ఉండగానే బ్రహ్మాండమైన డాబా కట్టాడు. పిల్లలు, మనవలందరితో వేసవి సెలవుల్లో ఇద్దరు కొడుకులూ కుటుంబ సమేతంగా వచ్చేవారు. వాళ్లకి వీలైనన్ని రోజులు ఉండేవారు.
విశాలమైన ప్రాంగణంలో పెరట్లో మామిడి, కొబ్బరి చెట్లు అనాస, రాచఉసిరి, పనస, అరటి, సపోటా అన్ని రకాల చెట్లు ఉండేవి. పిల్లలందరూ అలా వస్తారని తెలిసి ప్రతి సంవత్సరం వరూధినమ్మగారు శ్రేష్టమైన గుంటూరు ఎండు మిరపకాయలు కొని కారాలు, ఆవాలు పిండి కొట్టించి పెరట్లో మామిడి చెట్ల నుంచి పరువానికి వచ్చిన మామిడికాయ కోయించి, పిల్లలు శ్రమ పడకుండా ఏటికేడాది సరిపోయేలా ఆవకాయ, మాగాయ, మెంతికాయ పెట్టి సిద్ధంగా ఉంచేది.
వాళ్లకిష్టమైనన్ని రోజులు ఉండి, ఈ ఊరగాయలు, అప్పడాలు, వడియాలు అన్నీ తీసుకుని నగరాలకు వెళ్లిపోయేవారు. పిల్లలు పదవ తరగతిలో ఉండగా రెండో కొడుకు తన ప్రైవేటు కంపెనీ ఉద్యోగం పోవడంతో, అమ్మానాన్నలిద్దర్నీ ఇల్లు అమ్మేసి హైదరాబాద్ వచ్చేసి తమ దగ్గరే ఉండిపొమ్మని, తన వాటా డబ్బిచ్చేస్తే పిల్లల్ని పై చదువులు చదివించుకుంటానని కోరాడు. అలా చేస్తే పిల్లలు అవసరాలకు డబ్బు సాయం చేసినట్టు ఉంటుందన్న ఉద్దేశంతో ఉన్న ఊర్లో ఇల్లు అమ్మేసి భార్యాభర్తలిద్దరూ నగరానికి చేరారు.
మగ పిల్లలతో పాటు సమానంగా ఆడపిల్లలకు కూడా ఆస్తులు సమాన హక్కు అని ఆనాటి ముఖ్య మంత్రి ఎన్టీ రామారావు గారు ప్రకటించిన వార్త విని రావణ శర్మ గారు చాలా సంతోషించాడు. తన కష్టార్జితాన్ని ఆరు భాగాలు చేసి ఎవరి సొమ్ము వాళ్లకి అప్పగించి ఒక వాటా తన పేరా, మరొక వాటా భార్య పేరా ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. మిలిటరీ క్రమశిక్షణకు మారుపేరుగా గవర్నమెంట్ కాలేజీకి ప్రిన్సిపాల్ గా చేసి రిటైర్ అయిన ఆయనికి పెన్షన్ కూడా లక్ష దాకా వస్తుంది.
పిల్లలందరినీ కూడా అంతటి క్రమశిక్షణతోనే పెంచాడాయన. ఆయనంటే వాళ్ళందరికీ హడల్. ఆయన క్రమశిక్షణ అంటే ఎలా ఉండేదంటే, కొడుకులు తెల్లవారు ఝామున అయిదు గంటలకే నిద్రలేవాలి. ఆరు గంటలవరకు చదవాలి. చదివింది చూడకుండా రాసి అప్పగించాలి. రాసిన దాంట్లో తప్పులొస్తే ఒక్కొక్క పదం పదేసి సార్లు చూచి కాపీరాయాలి.
ఉదయం ఆరునుంచి ఏడూ గంటలలోగా వ్యాయామం చేయాలి. చమటలు పట్టిన శరీరాలను తండ్రికి చూపించాలి. ఆయన అనుమతి ఇచ్చాకా స్నానం చేసి దేవుడి దగ్గర హనుమాన్ చాలీసా చదివి చద్దెన్నం తిని తొమ్మిది గంటలవరకు చదవాలి. ఆ రెండుగంటల్లో చేసిన పని సాయంత్రం ఆయన కాలేజీనుంచి వచ్చాకా చూపించాలి. వీటిల్లో ఏ పని ఎవరు మానేసినా వాళ్ళకి ఆపూట చద్దెన్నం 'కట్. ' అలాంటి క్రమశిక్షణ ఆయనది.
మనవలందరూ బాగా చదువుకుని మంచి కంపెనీలలో ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఏ కొడుకు ఇంట్లో శుభకార్యాలు జరిగితే ఆ కొడుకు ఇంట్లో ఉన్నంతకాలం ఉండడం, తర్వాత మరో కొడుకు ఇంట్లో శుభకార్యం అయితే అక్కడికి వచ్చి ఉండడం అలవాటుగా మారింది భార్య భర్తలిద్దరికీ. తమ కొడుకులకు, కూతుళ్లకు పెళ్లిళ్లు అవడంతో రావణశర్మ గారు, వరూధినమ్మ గారు భారంగా తోచారు మగపిల్లలకి.
దీనికి తోడు తల్లి, తండ్రి ఉన్నారన్న వంకతో తమ ఆడపడుచులు, భర్త పిల్లలతో పదేసి రోజులు పిల్లలతో సహా వచ్చి వెళ్లడం కోడళ్ళకి నచ్చని విషయంగా మారింది.
అయితే కొడుకులు, కోడళ్ళు అంతా ఉద్యోగ విరమణ చేసేసిన వారే. మంచి చదువులు చదువుకొని ఇంకా మంచి ఉద్యోగాలు సంపాదించుకొని, ఉద్యోగ విరమణ అనంతరం సొంత అపార్ట్మెంట్లు కొనుక్కొని చివరకు హైదరాబాదులో స్థిరపడ్డారు. దాదాపు అందరూ ఒకే కాలనీలో రెండు మూడు గల్లీల తేడాగా ఉంటున్నారు. పెళ్లిళ్లు, పుట్టినరోజులు, బారసాలలు, నోములు, వ్రతాలలో సరదాగా కలుస్తారు. మనసులో ఏముందో తెలియదు గానీ ముఖాల మీద రంగులు పులుముకుని కలుసుకున్నప్పుడు మాత్రం కౌగిలించుకున్నంత ఆప్యాయత ఒలకబోస్తారు.
వయసు మీద పడడంతో వరూధినమ్మగారు మంచాన పడి మూడు నెలలు జరగకుండానే మరణించారు. ఆవిడ పోయిన 13 రోజున తండ్రిని ఎవరు చూడాలి అన్నది వాళ్ళకి ప్రశ్నగా తయారైంది. మధ్యాహ్నం అందరి భోజనాలు అయ్యాక ముసలాయన పడుకున్నారు. అప్పుడు నలుగురు పిల్లలు ఒకే చోట చేరి చర్చలు మొదలు పెట్టారు.
"నేను ఆడపిల్లని.. ఈడ పిల్లని కాదు కదా. ఏ పండక్కో పబ్బానికో అయితే పిలిచి భోజనంపెట్టి పంపించగలను. అయినా నా మొగుడు రిటైర్ అయి, ఇంట్లోనే ఉన్నాడు. ఇద్దరు ముసలాళ్ళకి చాకిరీ చేసే శక్తి నాకు లేదు. అయినా తండ్రి బాధ్యత ఎప్పుడూ కొడుకులదే" అని తప్పించేసుకుంది పెద్ద కూతురు.
"నీకు పిల్లల బాధ్యత తీరిపోయిందక్కా. నాకు మా అత్త, మావలే కాకుండా వాళ్ళ అమ్మ బాధ్యత కూడాను. కొంపంతా ముసలి వాసనలు, చాకిరీతో ఛస్తున్నాను అనుకో. ఆ బాధ తప్పించుకోవడానికి నాన్నగారు ఉన్న చోటికి వచ్చి పదిరోజులు వండిపెడతా వీలయితే. లేకపోతే నా వల్ల కాదు. "అనేసింది రెండో కూతురు.
" అయితే మీ ఇంట్లో ఆరు నెలలు, మా ఇంట్లో ఆరునెలలు ఉంచుకుందాం రా!" అన్నాడు పెద్దకొడుకు, రెండో కొడుకుతో.
వెంటనే రెండో కోడలు అంది. " ఏంటి ఆరు నెలలు ఉంచుకునేది? రేపొద్దున మా పిల్లలకి ఏమైనా అవసరాలు వస్తే వాళ్ళు పిలిస్తే వాళ్ళ ఇళ్ళకి వెళ్లాలి కదా. మాకు కుదరదు బావగారు. నోరు విప్పి చెప్పరేంటండి మొద్దురాచ్చిప్పలా "అంది తన భర్తతో.
"అవునన్నయ్యా. నా పెళ్ళాం చెప్పింది నిజమే. " నసిగాడు రెండోకొడుకు.
"అయితే ఇదంతా నాకే పట్టిందా? ఆయన చేత ఇల్లు అమ్మించేసి సమాన వాటా తీసుకున్నప్పుడు ఏమయ్యాయి ఈ తెలివితేటలు? అందరూ సమాన వాటాలు తీసుకున్నప్పుడు సమానంగా ఆయనని చూడాల్సిందే " కోపంగా అరిచాడు పెద్దకొడుకు.
"అయితే ఆయనకీ పెన్షన్ వస్తోందిగా. ఏ వృద్ధాశ్రమంలోనో చేరిపొమ్మందాం" అన్నాడు రెండో కొడుకు.
"ఒరేయ్! నలుగురు పిల్లలు ఉండి, ఆయన ఆస్తి సమానంగా పంచుకొని, ఏ ఒక్కరూ చూడక పోతే చాలా తప్పురా " అన్నాడు పెద్ద కొడుకు.
"అందుకే ఇంటికి పెద్ద కొడుకు నువ్వే కాబట్టి, రేపు తలకొరివి పెట్టేది కూడా నువ్వే. ఆయన్ని నీ దగ్గరే ఉంచేసుకో. నేను ఎలాగా నీ భుజం మీద చెయ్యేసి' మమ' అని వెనకాల ఉండే వాడినే " టక్కున అన్నాడు రెండో కొడుకు.
"ఒరేయ్ తప్పురా.. అలా మాట్లాడకూడదు రా. రేపు నీ పిల్లలు నిన్ను అలాగే విభజించేస్తే భరించగలవా? "
"అప్పటి పరిస్థితి అప్పుడు చూసుకుంటా అన్నయ్యా. కొడుకులు లేకపోతే కూతుళ్లే తలకొరివి పెడుతున్నారు ఈ రోజుల్లో. వారూ లేకపోతే డబ్బిస్తే వచ్చి నటించే జనాలు బోలెడుమంది ఈరోజుల్లో " అన్నాడు రెండో కొడుకు.
"ఎదుటివారికి అయితే ఒక నీతి మనకైతే ఒక నీతి అన్నది చాలా తప్పురా. ఆయన పరాయి వాడు కాదు. మన కన్న తండ్రి. ఆయన ఆ క్రమశిక్షణతో పెంచబట్టే జీవితంలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేసి ఈరోజు సుఖంగా బతుకుతున్నాం. అమ్మ పెద్దగా చదువుకోలేదు. తండ్రిగా ఆయనే పట్టించుకోకపోతే మన బతుకులు ఖచ్చితంగా ఇలా ఉండేవి కాదు" అన్నాడు పెద్దకొడుకు బాధగా.
ఇక లాభం లేదని నెమ్మదిగా హాల్లోకి వచ్చారాయన. "ఏమిరా. రాత్రికి ప్రయాణాలుగా. అమ్మ పోయి 13 వరోజు. బతికి ఉన్న నాన్నని పంచుకుంటున్నారా? ముక్కలు చేసుకుంటున్నారా?" పడక కుర్చీలో కూర్చుంటూ అడిగారాయన.
"అబ్బే.. అలాంటిది ఏమీ లేదండి.. ఏవో పోసుగోలు కబుర్లు.. అంతే. " మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ అంది రెండో కోడలు.
"నేను టీ తాగి బయటికి వెళ్లి వస్తాను. ఎవరూ బయటికి వెళ్ళకండి. " అని వాష్ రూమ్ కి వెళ్లి వచ్చి చొక్కా వేసుకున్నారాయన. పెద్దకోడలు ఇచ్చిన టీ తాగి బయటకు వెళ్లి అరగంటలో వచ్చేసారు. ఆయనతో పాటు ముగ్గురు మిత్రులు వచ్చారు.. ఒకరు ఆయనకు బాల్య స్నేహితుడు, దస్థావేజుల లేఖరి అయినటువంటి సుబ్బరాయ శర్మ గారు. మరొకరు తన గురువుగారి కుమారుడు, తన కింద ఎకనామిక్స్ లెక్చరర్ గా పనిచేసిన రంగనాయకులు గారు. తనతో కలిసి చదువుకున్న బాల్య స్నేహితుడు శ్రీధరంగారు మూడవ వ్యక్తి.
వాళ్ళని చూసి గదిలోకి సర్దుకోబోయారు కొడుకులు కోడళ్ళు.
" ఒక్కళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్లడానికి వీల్లేదు. ఇది నా భవిష్యత్తు సమస్య. బంధువుల మధ్యలోనే విషయం తేల్చుకోవచ్చు. అలా చేస్తే మన కుటుంబ పరువంతా అభాసు పాలయిపోతుంది. వీళ్ళు ముగ్గురూ నాకు, మీకు కూడా తెలిసిన మన కుటుంబ ఆత్మీయ మిత్రులు. అందుకే స్వయంగా వెళ్ళి వారిని తీసుకువచ్చాను. " అని పిల్లలతో అన్నారు.
అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నాక.. "మిత్రులారా. ఇవాళ రాత్రికి పిల్లలు అందరు వెళ్ళిపోతున్నారు. వీళ్ళలో ఏ ఒక్కరూ నన్ను తమతో తీసుకు వెళ్ళడానికి సిద్ధంగా లేరు. ప్రతి ఒక్కళ్ళు పనికిరాని వస్తువుగా, అనవసరమైన బరువుగా భావిస్తున్నారు. ఇంతమంది సమక్షంలో నా భవిష్యత్తు ఏమిటో మిత్రులుగా మీరు ముగ్గురూ నిర్ణయిస్తే ఆ ప్రకారం నడుచుకుంటాను. " అన్నారాయన. ఎవరి నోట మాట లేదు. ఒకరి ముఖాలు చూసుకున్నారు.
వెంటనే సుబ్బరాయ శర్మ గారు అందుకున్నారు. "పిల్లలూ.. మీ అందరికీ మేం ముగ్గురం తెలుసు. ఇది మీ ఇంటి సమస్య కాదు. కొన్ని కుటుంబాలలో వృద్ధాప్యంలో తల్లి పోయిన తండ్రుల సమస్య. తండ్రికి కేవలం ఒకే ఒక కొడుకు ఉంటే ఇలాంటి సమస్య తలెత్తదు. పిల్లలు ఎక్కువ మంది ఉన్నప్పుడే తండ్రి పెద్ద సమస్య అయి కూర్చుంటాడు.
దేవుడు మన చేతికి ఐదేసి వేళ్లిచ్చాడు. వాటిలో ఏ ఒక్క వేలు లేకపోయినా మనం ఇబ్బంది పడుతూనే పని చేస్తాం. అయిదువేళ్ళు ఏ యంత్రంలోనోపడి నలిగిపోతే ప్రత్యామ్నాయం వెతుక్కుంటాం గానీ ఆ చేతిని నరికేసుకోము. వృద్ధులు చంటి పిల్లలతో సమానం అంటారు. మీ పిల్లల్లో మరొకరిగా భావించి తండ్రిని చూడవలసింది పోయి ఎవరి మటుకు వారు మీదారి చూసుకుంటే, భార్య పోయి, కొమ్మలు నరికేసిన చెట్టులా వున్న ఆయన్ని వదిలేసి వెళ్లిపోవడం ఎంతవరకు న్యాయం?
ఆ రోజుల్లో కుటుంబాలు కళకళలాడుతూ ఉండేవి. ఎంత ఎక్కువ మంది పిల్లలు ఉంటే అంత గొప్పగా చెప్పుకునేవారు. నలుగురు పిల్లల్ని కని బాధ్యతగా పెంచి, పెళ్లిళ్లు చేసి సమాజానికి నలుగురు ప్రయోజకుల్ని అందించగలిగారంటే ఆ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి తీరాలి. ఇదే మన భారతీయ కుటుంబ వ్యవస్థ ధర్మం. ఆ ధర్మాన్ని రేపు మీ పిల్లల విషయంలో మీరు నిర్వర్తిస్తారు. దురదృష్టవశాత్తు విజ్ఞానం వెర్రితలలు వేసి, నేను, నా సుఖం అనేటువంటి స్వార్థం ప్రతి ఒక్కరిలోనూ పాతుకుపోతున్న దురదృష్టకర వ్యవస్థకు మనం చేరాం.
ఒకరిని చూసి మరొకరు బాధ్యతలు వదిలించుకునే వాళ్ళే తప్ప, తనకా పరిస్థితి వస్తే ఎలాగా అని ఆలోచించుకునే వాళ్ళు తక్కువైపోతున్నారు. ఎందుకంటే తమకు ఆ పరిస్థితి రాదు అని వాళ్ళ నమ్మకం. సరే అసలు విషయానికి వద్దాం. ఇదిగో వంద రూపాయల ప్రామిసరీ నోట్.
‘మా నాన్నగారితో మాకు సంబంధం లేదు’ అని మీరందరూ వ్రాసి సంతకాలు పెట్టండి. లేదా అందరూ ఆయనను సమానంగా చూడదల్చుకున్నారా.. అలా రాయమంటే అలా రాస్తాను. దాన్నిబట్టి ఆయన ఏ విధంగా తన జీవితాన్ని నిర్దేశించుకుంటారో ఆయనే చూసుకుంటాడు. మీ నాన్నగారి ఆస్తి అమ్మినప్పుడు మనవలతో సహా వచ్చి మీరందరూ ఎలా సంతకం పెట్టారో.. ఇప్పుడు కూడా మేజర్లయిన మీ పిల్లలందరితో సహా సంతకాలు పెట్టాలి. ఇది ఆరు కాపీలు తీయించి ప్రతి ఒక్కళ్ళు భద్రపరచుకోవాలి.
కొడుకులు ఇద్దరూ ఆయన్ని సమానంగా ఆరేసి నెలలు ఖచ్చితంగా చూడాలి. పండుగలకు మాత్రం కూతుళ్లు ఆయనను తమ ఇంటికి ఖచ్చితంగా ఆహ్వానించాలి. ఆయన ఎవరింట్లోనూ ఉచితంగా ఉండడు. తన పోషణభారం మీ మీద పడకుండా మీకు ఆర్థిక సాయం చేస్తాడు. మీరు ఆయనకు చేయవలసిందల్లా ఆప్యాయతగా అన్నం పెట్టడమే. ఆయన ఉన్నంతకాలం మీకు మరో బిడ్డ అదనంగా పుట్టాడని భావించడమే.
మీ అందరికీ సమ్మతమైతే రెండో ప్రపోజల్. ఏ ఒక్కరి మనసుకి కష్టం కలిగినా మొదటి ప్రపోజల్. ఏదైనా సరే.. ఖచ్చితంగా పేపర్ మీద రాసి సంతకాలు పెట్టాల్సిందే. మీ నిర్ణయం ఏమిటో చెబితే అలా చేద్దాం. "
చెప్పడం ముగించారు సుబ్బరాయ శర్మ గారు.
“ఇందులో ఆలోచించాల్సింది ఏమీ లేదు అంకుల్. మా బాధ్యతను మాకు స్వచ్ఛంగా గుర్తు చేశారు. మీరు రెండో ప్రపోజల్ రాయండి. మేము సంతకాలు పెడతాం. " అన్నాడు పెద్దకొడుకు.
అందరూ తమ తప్పు తెలుసుకున్నట్టుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని "అవును అంకుల్.. అన్నయ్య మాటే మా మాట " అన్నారు. మరో గంటలో రెండో ప్రపోజల్ తో స్టాంప్ పేపర్లు సిద్ధమయ్యాయి. అందరూ సంతకాలు చేశారు.
కథా ప్రారంభం జరిగింది!
సమాప్తం
కొత్తపల్లి ఉదయబాబు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు : కొత్తపల్లి ఉదయబాబు పుట్టిన తేదీ : 01/07/1957 విద్యార్హతలు : M.Sc., M.Ed., M.phil (maths) నిర్వహించిన వృత్తి : ప్రధానోపాధ్యాయులు
తల్లి తండ్రులు : శ్రీ కొత్తపల్లి గంగాధర్ శర్మ, విశ్రాంత హెడ్ పోస్ట్-మాస్టర్ స్వర్గీయ శ్రీమతి సుబ్బలక్ష్మి. భార్య : శ్రీమతి సూర్యకుమారి కుమార్తె : చి. సౌ. గుడాల సుబ్బ లక్ష్మి సంతోషిత , M.B.A. w/o లక్ష్మికాంత్ – లాయర్ మనుమరాలు : చి. లక్ష్మి పూర్ణ సాధ్వి కుమారుడు : చి. హనుమ గంగాధర్ శర్మ , సాఫ్ట్-వేర్, h/o చి.సౌ.తేజశ్రీ మనుమలు : చిరంజీవులు గహన్ ముకుంద, ఋషిక్ వశిష్ట.
*వృత్తి పరంగా :
*జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల పోటీలలో వివిధ అంశాలలో బహుమతులు, క్విజ్,సాంకేశృతిక కార్యక్రమాల నిర్వహణ, న్యాయ నిర్ణేతగా వ్యవహిరించిన అనుభవం.
*పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2002 లో తొలిసారిగా ఐదుగురు విద్యార్థులకు నూటికి నూరు మార్కులు రావడం ఆ సందర్భంగా అరకాసు ఉంగరం బహుమతిగా అందుకోవడం ఒక చక్కని ప్రోత్సాహం, ఉత్సాహం. అలా మొత్తం సర్వీసులో నూటికి నూరు మార్కులు దాదాపు తొంభై మందికి పైగా విద్యార్థులు పొందగలగడం వృత్తిపరంగా సంతృప్తిని కలిగించిన విషయం.
*జిల్లా స్థాయిలో అధికారికంగా నిర్వహించిన భౌతిక శాస్త్ర,గణిత శాస్త్ర సదస్సులకు రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించడం.
*జిల్లా ఉమ్మడి పరీక్షల సంస్థకు అయిదు సంవత్సరాలపాటు ఎక్కువమంది విద్యార్హులు గణితంలో ఉత్తీరర్ణతాశాతం పొందదానికి అవసరమైన విజయ సూచిక, విజయ సోపానాలు... పుస్తకాలను ప్రభుత్వం తరపున రూపొందించుటలో ''గణిత ప్రవీణుడు''గా వ్యవహరించడం.
*ఆకాశవాణిలో కథానికలు, నాటికల ప్రసారం,అవగాహనా సదస్సులలో పాల్గొనడం, రేడియో నాటక కళాకారునిగా మూడు సంవత్సరాలు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పాల్గొనడం..మొదలైనవి
ప్రవృత్తి పరంగా :
*కథా రచయితగా రచనలు :
1. *అందమైన తీగకు...! - 25 కధల మాలిక (2003) 2. *చిగురు పిట్టలు* - నానీల సంపుటి (2007) 3. ఉదయబాబు *మాస్టారి' కధానికలు* - ఉదయకిరణాలు (2015) 4. *అమ్మతనం సాక్షిగా*... కవితా సంపుటి (2015) 5. *నాన్నకో బహుమతి* - 16 కథల సమాహారం (2019-.) జీ.వి.ఆర్. కల్చరల్ అసోసియేషన్ వారు నిర్వహించిన కథాసంపుటుల పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన కథల సంపుటి) 6. ఆయన మా నాన్నగారు ( దీర్ఘ కవిత - త్వరలో )
నవలలు : 1 . లేడీ సింగర్ (2 భాగాలు )
2 . మనసు చేసిన న్యాయం(ప్రతిలిపి వారు మార్చి 2202 లో నిర్వహించిన ధారావాహికల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందినది)
ప్రేరణ : నాన్నగారు...ఆయన నాటక రచయిత,దర్శకుడు,ఉత్తమ నటుడు(18 నాటక పరిషత్తులలో)
*సామాజిక సేవ : రక్తదాన కార్యక్రమం లో, లయన్స్ క్లబ్ వారి కార్యక్రమాలలో విరివిగ పాల్గొనడం .
తెలుగు సాహిత్యానికి సేవ : తెలుగు సాహితీ సమాఖ్య లో కార్యకర్తగా, సంయుక్త కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా తెలుగు సాహిత్యానికి విశేష కృషి , జిల్లా స్థాయిలో ర్యాలీల నిర్వహణ ...అష్టావధానం, త్రీభాషా శతావధానం లలో పృచ్చకునిగా 46 సంవత్సరాలపాటు ప్రతీ నెల సాహితీ స్రష్టల ప్రసంగాలు...విద్యార్హులకు వివిధములైన పోటీల నిర్వహణ,
పత్రికా రంగం లో : వ్యంగ్య చిత్రకళ లో పలు కార్టూన్లు వేయడం. :*1999 - జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు - పశ్చిమ గోదావరి జిల్లా*
*2000 - యువసాహితీ సహస్రాబ్ది అవార్డు - ఆంద్ర ప్రదేశ్ సాంస్కృతిక సమాఖ్య* *2011 - సోమేపల్లి సాహితీ పురస్కారం* *2016 - గోదావరి మాత అవార్డు - ఉంగుటూరు ఎం.ఎల్.ఎ, శ్రీ గన్ని వీరంజనేయులుగారి చే- గణపవరం - పశ్చిమ గోదావరి జిల్లా *ఉండి ఎం.ఎల్.ఎ. శ్రీ వి.వెంకట శివరామరాజు గారి చే ''ఉగాది పురస్కారం*
*పాలకొల్లు - కళాలయ సంస్థవారిచే " కధాభారతి" బిరుదు ప్రదానం*.
*జన విజ్ఞానవేదిక - భీమవరం వారిచే " ఉగాది పురస్కారం" ....సుమారు నూటికి పైగా సన్మానాలు సత్కారాలు...ఇంకా ఎన్నో..
Youtube :1. తెలుగు కథను ప్రపంచ వ్యాప్తం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం "Mastaru Kadhalu 'in' Telugu " ఛానెల్ ద్వారా నా కథలతో పాటు దాదాపు 25 మంది రచయితల కథలు (ఈనాటికి 420 కధల ఆడియో వీడియోలు)చదివి వీడియోలుగా మలుస్తూ ఉచిత సేవగా అందించడం జరుగుతోంది.
2.KUBDevotionalWorld అనే ఛానల్ ద్వారా శ్రీ భగవద్గీత 700 శ్లోకాలను ప్రతీరోజు 5 శ్లోకాలను భావాలతో సహా వీడియోలుగా చదివి అందించడం జరుగుతోంది.
3. UDAYABABUMathsBasics యు ట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యార్థులకు గణితంలో మౌలిక భావనల బోధన
ప్రస్తుత నివాసం : 2010 లో సికింద్రాబాద్ సైనిక్ పురి లో స్థిరనివాసం ఏర్పరచుకుని ఇప్పటికీ కధా రచయితగా, బాలల కథారచయితగా కొనసాగడం.
*చివరగా నా అభిప్రాయం :*
ఇప్పటికీ నా కవితా ప్రస్తానం, కధా సాహితీ సేద్యం కొనసాగుతోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం లో చెట్టు నాకు ఆదర్శం.
కవిగా రచయితగా తమ సాహితీ ప్రస్తానం కొనసాగిన్చాదలుచుకున్న యువత అంతా పాత సాహిత్యాన్ని బాగా చదవాలి. 'వెయ్యి పేజీలు చదివి ఒక్క పేజీ రాయి' అన్న ఒక మహాకవి వాక్యాలు స్పూర్తిగా తీసుకుని నిన్నటి రచన కన్నా, నేటిది, నేటి రచన కన్నా రేపటిది మరింత మెరుగుపరచుకుని ఈ రంగం లో తమకంటూ ఒక ప్రత్యెక స్థానాన్ని ఏర్పరచుకోవాలని, ఆ దిశగా వారి సాహితీ ప్రస్తానం కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ.. ...సాహిత్యాభినందనలు.
కొత్తపల్లి ఉదయబాబు
సికింద్రాబాద్
Comments