'Nadi Odduna Allakallolam' - New Telugu Story Written By Yasoda Gottiparthi
Published In manatelugukathalu.com On 14/07/2024
'నది ఒడ్డున అల్లకల్లోలం' తెలుగు కథ
రచన: యశోద గొట్టిపర్తి
“అల్లంత దూరాన్నుంచి వస్తున్న బంధువులు అనే రాబంధువులు నవీన్ ని చంపటానికి కూడా వెనుక ముందు చూడరు. నిజానికి వాళ్ళు ప్రేమికులను కనుగొంటాము అనే గొప్ప ఉత్సాహం తో వస్తున్నారు. నవీన్, లతల ప్రేమకు అడ్డుపడుతూ, వారిని దురదృష్టవంతులుగా చేయడానికి, మనతో తలపడడానికి వస్తున్నారు.
ఆమె బంధువులనెల్లరినీ తుదముట్టించడం మన అదృష్టం అనుకోవాలి. తమ కూతుర్ని తమకు అప్పగిస్తామనే ఆశతో గొప్ప ఉత్సాహం తో ఇక్కడకు వస్తున్నారు.
కొన్నిరోజులనుండి ప్రేమికులను కాపాడిన ప్రియ
మిత్రులం మనం. వదరు బోతులు, దుర్భాషలాడేవారు, ఆస్తులను ఆక్రమించేవారు, అన్యాయ వర్తనులకు ప్రేమహృదయ ఆప్తుల గురించి వారికేం తెలుసురా” అంటున్న నవీన్ స్నేహితులు రవి, భరత్, సుమన్ కొండ ప్రాంతం లో చిన్న కుటీరం నిర్మించుకుని, నవీన్, లతల ప్రేమకు కాపలా దారులుగా కావలి కాస్తున్నారు.
నల్లమల అడవుల్లో మూడునెలలుగా నివసిస్తున్న నవీన్ గుట్టల ప్రాంతం లో పెద్ద శిలపై కూర్చుని లతతో కాలక్షేపం చేస్తున్నాడు. చెట్లలో దొరికే ఫలాలను, కంద మూలాలను వివరిస్తూ, విస్తారoగా ఉన్న పలురకాలైన వృక్షాలను, పుష్పాలను, వన్య మృగాలను చూపిస్తూ లతకు వాటి గురించి చెప్పాడు. తల్లి తండ్రి నుండి లత మనస్సును మరలించడానికి ఆమెను సంతోషపెట్టడానికి చేయగలిగిన ప్రయత్నమంతా చేస్తున్నాడు.
లతతో మాట్లాడుతూ, అక్కడ రమ్యమైన పుష్పాలతో విరాజిల్లుతూ, అపురూప పక్షిజాతులతో అలారారుతున్న గౌతమీ నదిని చూపించాడు. నవీన్.
"ఇలాంటి అందమైన ప్రదేశంలో నివసిస్తున్నందుకు నిజంగా దుఃఖిoచవలసిన కారణమoటూ ఏమిలేదు" అన్నది లత.
“పచ్చదనం, జల సమృద్ధి రెండూ కలిస్తే ఎక్కువగా ఉండి అందాలన్నీ దృశ్యాలుగా వచ్చి చేరుతాయి. అందువల్ల ఈ నదీ తీర ప్రాంతం లో ఉండే స్థలం లోనే నివాసం ఏర్పరచుకుంటే మంచిది” అంటూ కుటీరం ఏర్పాటు చేసాడు.
ఆ ప్రక్కనే నీలం రంగుల్లో తామర పుష్పాలతో రమణీయంగా ఉన్న సరస్సు ఉంది. నది నుండి హంసల సందడి, రకరకాల పక్షుల కల కలా రావాలు వినిపిస్తుండగా వేరొక ప్రక్కన నెమళ్ళు పురివిప్పి నాట్యాలు, వినసొంపైన ధ్వనులు సమీప పర్వత గుహలనుండి ప్రతిధ్వనులు వినిపిస్తున్నాయి.
“లతా! కొంచెందూరం లో తెల్లని కలువలున్న చంపాసరస్సు, అటు ప్రక్కగా నదిని చూడవచ్చు. జాలువారు జలపాతాలు పాలధారలుగా కనిపిస్తున్నాయి. నా దగ్గరలో ఉన్నట్టు నీలోనే వాటిని చూస్తున్నాను. పట్టణ రణగొణ ధ్వనులు, పారిపోయే పక్షులు, వాడిపోయిన పచ్చని చెట్లు, ఎండిపోయిన బీటలు వారిన చెరువులు, ధూళి దుమ్ము మచ్చుకైనా కానరాని చోటు మనకోసమే వచ్చిందా" అన్నట్లు ఉంది కదా” అన్నాడు నవీన్.
ప్రకృతి అందాల్లో విహరిస్తున్న వృక్షాలన్నీ ఫల పుష్పాలతో నిండి ఉన్నాయి. సుగంధ పరిమళాలు వెదజల్లుతూ, సరస్సులు సుధారస తరంగిణులుగా ప్రవహిస్తూ భూదేవిని రకరకాల రంగురంగుల స్వర్ణా భరణాలతో అలంకరించినట్లుగా ఉంది.
‘చాలా దూరం వచ్చినట్టున్నాము లతా ! చీకటి పడేలోపు కుటీరం నుండి వెళ్ళిపోవాలి. మార్గం మధ్యంలో జంతువుల వల్ల హాని జరిగే ప్రమాదము ఉంద’ని వెనక్కి బయలు దేరారు.
నవీన్ స్నేహితులు సుదూరంగా అటు వస్తున్న పైకెగిసిన దుమ్ము ధూళి ని చూశారు. భయంతో పారిపోతున్న వన్యమృగాల అరుపులు వారికి వినబడుతున్నాయి. వారు దగ్గరికి చేరుతున్నట్లు గమనించి రవి చెట్టు పైకిక్కి చూడ సాగాడు.
తమ కోసం వెతుకుతున్నట్లు నవీన్ లతను పట్టుకోవడానికి వస్తున్నట్లు వారి చేతిలో ఆయుధాలున్నట్లు కనిపించలేదు. చెట్టు దిగి వచ్చి స్నేహితులతో ‘వారి వల్ల మనకు ప్రమాదమేమీ లేదు’ అని చెప్పాడు.
ముగ్గురూ ఊపిరి పీల్చుకున్నారు. కొండలు, గుట్టల్లో తిరుగుతు నివాసముండే ఆదివాసీ లలో ఒక జాతికి చెందిన చెంచులు అని తెలుసుకున్నారు. వారి చేతిలో పెద్ద కర్ర, చిన్న పంచెను గోచీ గా చుట్టుకుని, పైన ఆకులు చుట్టుకుని ఉన్నట్లు గమనించాడు. వీరిని చూచి దగ్గరగా వచ్చి పరీక్షగా చూస్తుంటే మాట్లాడే భాష అర్ధమౌతుందో లేదో అనుకున్నారు.
“ఓ దొరా! మీరు చదువుకున్నోళ్ల వలె కనిపిస్తున్నారు. ఇంత దట్ట మైన అడవుల్లో ఏమి చేస్తున్నారు? ఇక్కడ వన్యమృగాలు తిరుగుతుంటాయి. వెళ్లిపోండి దొరా! " అన్నారు.
తెలుగులోనే మాట్లాడడం తో..
“మేము చెట్లపై పరిశోధన చేయడానికి వచ్చాము రెండురోజులలో వెళ్లి పోతామ”ని చెప్పి, వారితో ఎక్కువ సమయం మాట్లాడితే తమపై ఏదైనా అనుమానం రావచ్చునేమోనని జాగ్రత్త పడ్డారు.
*****, *****
పరాంకుశం పెద్ద పేరున్న వ్యాపారస్తుడు. ఏకైక కూతురు లత. అల్లారుముద్దుగా పెరిగింది. తనకున్న ఆస్తిపాస్థులకు వారసురాలు. పెద్ద చదువులు అవసరం లేదని ఉన్న ఊళ్ళో డిగ్రీ వరకు చదివించాడు. పెద్ద చదువులు చదివిస్తే విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు, వ్యవహారంలో తెలివితేటలు సంపాదించుకోవడం లాంటివి వుంటాయని తన చెప్పుచేతుల్లో పెట్టుకోవాలని బిడ్డను ప్రేమగా చూచు కుంటుoటాడు.
కంటికి కన్నీళ్లు తెలవ కుండా పెంచాడు. భార్యనీ వంటింటికి, పడక గదికి మాత్రమే పరిమితం చేసాడు. ఇంట్లో పనిమనుషులు, వంట మనుషులు, బంధువులు, స్నేహితుల రాక పోకలతో ఎల్లప్పుడూ సందడిగా ఉండేది దగ్గరి బంధువు అబ్బాయితో కూతురు పెళ్లి జరిగితే తన వ్యాపారాలు చూచుకుంటూ ఇల్లరికం వుండే అల్లుడిని వెతకసాగాడు.
సక్రమంగా వ్యాపారం తో అక్రమ వ్యాపారం చేసే వారితో చేతులు కలప సాగాడు. వ్యాపారంలో వ్యక్తులు సాహసో పేతమైన అవకాశాన్ని అందిపుచ్చు కోవడానికి
భయపడుతారు. ఒకవేళ తాను విఫలమైతే విమర్శలను ఎదుర్కోవలిసి వస్తుందేమోనని భయపడుతారు. ఇలాంటి సందర్భాల్లో విమర్శ కలిగించే భయం, విజయం సాధించాలన్న ప్రగాఢ వాంఛ కన్న బలంగా పనిచేస్తుంది.
బంధువులు స్నేహితులు "నీ కేమన్నా పిచ్చా, మరీ అంత డబ్బుకు అత్యాశ పడకు జనం నవ్విపోతారు" అంటూ విమర్శిస్తారేమోనను భయం తో కొందరిని భాగస్వాములుగా చేర్చుకుని వ్యాపారం కొనసాగించాడు.
అదే అతనికి ముప్పుగా సంక్రమించింది. ఉన్న వ్యాపారాలతో పాటు అడవి జంతువులను అక్రమ మార్గంలో విదేశాలకు తరలించే వారితో లావాదేవీలు జరపడం మొదలుపెట్టాడు. చట్టవిరుద్ధంగా అక్రమ మార్గంలో తరలించే కలప, చేపలకన్నా, ఎక్కువ మాదక ద్రవ్యాలున్న చెట్ల సంపదను, వాటినుండి వచ్చే ఆకులు, పూలు, పండ్లు లాంటివి సమీకరించి వివిధ దేశాలకు తరలించడం, ఎక్కువగా గిరాకీ ఉన్న ఏనుగు దంతాలు, పులి చర్మాలు, జంతువుల కొమ్ములు వాటితో తయారైన వస్తువులకు మార్కెట్లో మంచి ధరలకు అమ్ముతూ, దేశమంతటా వ్యాపారం జోరుగా సాగుతున్న సమయంలో విదేశీ డాలర్లతో పై ఎత్తులో కొనసాగింది.
దట్టమైన కొండలు, గుట్టలు ప్రాంతం లో జంతువులను మచ్చిక చేసుకుని వాటి సహాయం తోనే సేకరించిన అడవి సంపదను చెట్లమార్గంలో కాలి బాటన కొంతవరకు ప్రయాణించి రోడ్డు మార్గం చేరుకుంటారు. వ్యాపారంలో భాగస్వామి అయిన ధనార్జన్ పరంకుశం తో సన్నిహితం గా ఉంటూనే, ఆయన ఆస్తి పాస్థులపై కొడుకు నవీన్ ని ఎరగా వేసాడు.
వేసవి సెలవులు కళాశాలలు మూసివేయడంతో, యువత ఖాళీగా వుంటున్నారని కళాశాలల్లో సమాజసేవ పరంగా వృద్దాశ్రమాలకు, అనాధాశ్రమాలకు చెట్లు నాటించటం, విశ్రాంతి గదులను శుభ్రం చేయించడం, ఆహార పదార్ధాలు, మందులు సమకూర్చడం లాంటివి కొడుకు నవీన్ ద్వారా కొంతమంది కాలేజీ పిల్లలకు స్ఫూర్తి నిచ్చాడు.
లతతో పాటు కొందరు మహిళలు కూడా పాల్గొన్నారు. నవీన్ చురుగ్గా పాల్గొంటూ, వృద్ధులకు దగ్గరుండి సేవలు చేయడం లతకు బాగా నచ్చింది. తనకు తోడుగా ఉంటే అమ్మ నాన్నలను వృద్ధాప్యం లో తనలాగే చూచుకుంటాడని ఆలోచన వచ్చింది. అతనిపై ప్రేమ చిగురించడానికి అదొక కారణమైంది. ఇద్దరి మనసులు ఒక్కటయ్యాయి.
పరాంకుశం లతకు పెళ్లి సంబంధాలు చూస్తూ పెళ్లిచూపుల ఏర్పాటు చేయడం మొదలు పెట్టాడు. తనకు నచ్చని మగాడిని పెళ్లి చేసుకుని బాధ పడేకంటే, నవీన్ ని పెళ్లి చేసుకుని సుఖపడడం మేలని తలచి పెళ్లి చూపుల రోజే ఇంటి నుండి పారిపోయి నవీన్ ఇంటికి వచ్చి తల దాచుకుంది.
అదే అదనుగా తీసుకుని ధనార్జున్ లత విషయం ఎవరికీ తెలియకుండా తన ఇంట్లోనే దాచిపెట్టాడు. పరాంకుశం తన మనుషులతో వెతికించ నారంభించాడు. అవసరమైతే పోలీసుల సహాయం తీసుకుంటానని చెప్పడం తో తన మీదకు వస్తుందేమోనని ఆలోచించాడు. వ్యాపార పరం గా పరిచయమున్న కొండలు, గుట్టలలో కుటీరం ఏర్పరిచి అక్కడ నవీన్, లత ను దాచిపెట్టి, తోడుగా నవీన్ ముగ్గురు స్నేహితులను కూడా కాపలాదారులుగా ఉండేట్లు ఏర్పాటు చేసాడు. ఈ విషయ మంతా నవీన్, లత లకు చెప్పి ఒప్పించాడు. కొన్ని రోజుల్లో పరాంకుశం ను ఒప్పించి పెళ్లి చేయొచ్చు అనుకున్నాడు. తండ్రి ధైర్యం తో నవీన్ సరే అన్నాడు.
లత కనిపించక పోవడంతో దిగులుతో అనారోగ్యం పాలయ్యాడు. కష్టం తెలియని కూతురు ఎంత కష్టపడుతుందోనని భార్య ఏడవడంతో అతని హృదయం ద్రవించింది. పోలీసుల ద్వారా బిడ్డకోసం గాలింపు చర్యలు చేపట్టాడు. పట్నం చుట్టూ, తెలిసిన ఇళ్లలోనూ, వ్యాపార భాగస్వాముల ఇళ్లలోనూ వెతికించాడు. ధనార్జున్ పై అనుమానంతో వ్యాపారo లో నుండి తొలగించాడు.
*************, ****
చెట్ల పరిరక్షణ, పరిశోధన పేరుతో కొందరు మనుషులు గుట్టల్లో తిరుగుతున్నారని కోయ గూడెంలో నివసించే చెంచులు కొందరు గ్రామాల్లోకి వచ్చి స్థానిక ప్రజలకు విషయమంతా తెలియ చేసారు. దానితో పోలీసులు అడవుల్లో వెతుకుతుండగా అడవిజంతువుల అక్రమ వ్యాపారం జరుగుతున్నట్టు, అడవి సంపద విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు, జీపుల్లోను కొన్ని వాహనాల్లోనూ మూటలుగా కట్టి పూలు పండ్లు, గంధపు చెక్కలు, జంతువుల దంతాలు, చర్మాలు మొదలైనవి అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలుసుకున్నారు. దారికాచి కస్టడీ లోకి తీసుకున్నారు.
ఆ సంఘటనలతో నవీన్, లత ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని తప్పించుకునే ప్రయత్నం లో ఉండగానే.. పోలీసుల తుపాకీ శబ్దాలతో రావడం చూసి లోపలనే గడ గడ వణి కి పోసాగారు.
"బయటికి వచ్చి లొంగిపోండి" అని గట్టిగా అరుపులు వినేసరికి స్నేహితుడు రవి చేతులెత్తి బయటికి వచ్చాడు. వెంటనే అరెస్ట్ చేసి వివరాలడిగి అందరిని జీపులో ఎక్కించి స్టేషన్ కి తీసుకెళ్లారు. ముఠా నాయకుడు ధనార్జున్ ఇంటిపై దాడి చేసి అతన్ని అరెస్ట్ చేసారు.
కొడుకుని ఎరగావేసి ఆస్తిని దక్కించుకుని వ్యాపారం లో పరాంకుశం ను కేసులో ఇరికించేద్దామనుకున్నాడు కానీ తనే బలి అయ్యాడు. రెండు ఏండ్లు కఠిన కారాగార శిక్షకు అర్హుడు అయ్యాడు.
నవీన్, లత పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేస్తూ ధనార్జున్ రాకకై వేచి యున్నారు.
శుభం
యశోద గొట్టిపర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి
హాబిస్: కథలు చదవడం ,రాయడం
Comments