top of page

నల్లమల నిధి రహస్యం పార్ట్ - 28


'Nallamala Nidhi Rahasyam Part - 28' written by Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

"సంజయ్! సంజయ్!” అంటూ అరుస్తూ ఏడుస్తూ ఉంది సీత. ఒక కొడుకు ప్రమాదాన్ని వెతుక్కుంటూ అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఇంకో కొడుకు ఏదో ప్రమాదంలో చిక్కుకుపోయాడు.

"భగవంతుడా! నా బిడ్డలు.." అంటూ సొమ్మసిల్లి పడిపోయింది సీత. ఒక నిమిషం తరువాత ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చిన మల్లి, సీతను చూసి "అమ్మమ్మా! అమ్మమ్మా! లే.." అంటూ లేపడానికి ప్రయత్నం చేసి, సీత లేవకపోయేసరికి పరుగున వెళ్లి, వాళ్ళ అమ్మని తీసుకువచ్చింది. కమల సీత పరిస్థితి చూసి, మొహంపై నీళ్లు జల్లి, పైకి లేపి కూర్చోబెట్టింది.

"ఏమైంది అమ్మా! ఇలా పడిపోయారే? వంట్లో బాగోలేదా? హాస్పిటల్ కి వెళ్దామా? మీ అబ్బాయికి ఫోన్ చేయమంటారా?" అంటూ అడుగుతోంది కమల.

" ఎవరికి చేస్తావమ్మా కమలా! ఒక కొడుకేమో ఆ నీచుడ్ని వెతికి పట్టుకునేందుకు అడవుల్లోకి వెళ్ళి పోయాడు. ఇక్కడికి వస్తున్న నా చిన్న కొడుకు నాతో ఫోన్ మాట్లాడుతూ కారు నడుపుతూ ఉండగా కారుకి ఏదో ప్రమాదం జరిగినట్టు శబ్దం వినిపించిందమ్మా! " అంటూ బోరుమని ఏడుస్తోంది సీత.

"అయ్యో! మీరు ఏడవకండి అమ్మా! ఏమీ కాదు. ఉండండి.." అంటూ గబగబా వెళ్లి గ్లూకోస్ కలిపి తెచ్చి, సీతకు బలవంతంగా తాగించింది. సీత కొద్దిగా కోలుకుని సంజయ్ కి ఫోన్ చేసింది. ఫోన్ రింగ్ అవుతోంది. సీత గుండె వేగంగా కొట్టుకుంటోంది.

"ఫోన్ తియ్యి నాన్నా! సంజయ్.. "అంటూ వెక్కి వెక్కి ఏడుస్తోంది సీత. ఒక్కో రింగ్ కీ సీత గుండె ఆగి, ఆగి కొట్టుకుంటోంది.

ఆమె మొర దేముడు ఆలకించినట్టు ఫోన్ లిఫ్ట్ చేసి, "హలో." అంటూ ఒక గొంతు వినిపించింది.

సీతకి కన్నీరు రెట్టింపు అయింది.

ఆ దేవునికి మనసులోనే వేల వేల నమస్కారాలు తెలుపుకుంది ఆ తల్లి మనసు.

"హలో! అమ్మా! హలో.. వినిపిస్తోందా?" అంటూ రెట్టించిన గొంతు విని "చిన్నాడా! నా బంగారు తండ్రీ! నీకేం కాలేదుగా నాన్నా?" అంటున్న ఆ తల్లి గొంతులోని దుఃఖాన్ని అర్థం చేసుకున్న సంజయ్ " అమ్మా. నాకేమి కాలేదు. కార్ కంట్రోల్ తప్పి లారీని గుద్దేయబోయి. నేను టర్న్ తిప్పేసరికి చెట్టును గుద్దేయబోయాను. కానీ ఏదో మాయ చేసినట్టు ఒక్క క్షణంలో బ్రేక్ షార్ప్ గా పడి, తప్పించుకున్నాం" అంటూ చెప్పాడు.

" మరి.. ఆ శబ్దం వినే సరికి నీకు ఏమైందో అని.." అంటూ ఆ మాట ఇంక పూర్తి చేయలేక గొంతు పూడుకుపోయింది పాపం ఆ తల్లికి.

"అమ్మా! నేను బాగానే ఉన్నాను. మేము మళ్లీ స్టార్ట్ అవుతున్నాం. అన్నయ్య కి ఫోన్ చేస్తూనే ఉన్నాను. వాడి ఫోన్ కలవట్లేదు. వాడు ఇంటికి రాగానే కాళ్ళు చేతులు కట్టేసైనా సరే! ఇంట్లోనే ఉండేలా చేయి. వాడికి రేపు సూర్య గ్రహణం చాలా ప్రమాదకరం. అదంతా నేను వచ్చాక చెప్తాను. అవును గానీ అమ్మా.. వాడి చేతికి నేను కట్టిన రక్ష ఉంది కదా?" అని అడిగాడు సంజయ్.

"ఉంది నాన్నా! కానీ ఇప్పుడు దాని గురించి ఎందుకు అడుగుతున్నావు?" అని అడిగింది సీత.

"అమ్మా! ఐతే ఇంక కంగారు పడకు. ఆ రక్ష ఉన్నంతవరకూ వాడికి ఏమీ కాదు. నేను సాయంత్రానికల్లా ఇంట్లో ఉంటాను. రేపటి గ్రహణంలోగా నేను వచ్చేస్తాను కాబట్టి, వాడి మీద ఈగని కూడా వాలనివ్వను. నేను వస్తున్నా అమ్మా!" అంటూ ఫోన్ పెట్టేసి, తన పయనం మొదలుపెట్టాడు సంజయ్.

అతని మాటలు ఆ తల్లికి ధైర్యాన్ని ఇస్తే అతనే ప్రాణంగా బ్రతుకుతున్న అంజలి మాత్రం తన సంజయ్ కి ఏమవుతుందో అన్న భయంతో బిగుసుకుపోయింది. అంజలి తల్లి మాత్రం "మనము అసలు శ్రీశైలం చేరుతామా? లేక దారిలోనే కైలాసానికి పోతామా? పోయి పోయి ఇతన్ని కార్ నడపమన్నాను చూడు. దేముడా!"అనుకుంటోంది మనసులో.

***

ఒక కొడుకు క్షేమంగా ఉన్నాడు అని తెలిసిన ఆ తల్లి కొద్దిగా కోలుకుని దేవుని పటం చూస్తూ "మల్లన్నా! నా బిడ్డలని చల్లగా చూడు స్వామి. చిన్నోడు క్షేమంగా ఇంటికి రావాలి.పెద్దోడికి ఆ సింగా నుంచి ప్రమాదం తప్పాలి." అంటూ మొక్కుకుంటోంది. కమల, ఆమెకు ధైర్యం చెపుతూ సాయంగా కూర్చుంది.

***

సింగాని వెతుకుతూ దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయాడు అజయ్.

ఆ అడవి అంతా చూస్తూ ఉంటే అజయ్ కి తన గత జన్మ జ్ఞాపకాలన్నీ.. గత జన్మలో యుద్ధంలో జరిగిన దారుణమైన ఘటనలు ఒక్కొక్కటిగా కళ్ళముందు కదలాడుతున్నాయి.

ఆదివాసి వీరుల, వీరోచిత యుద్ధం.. నరేంద్రుని సేనల కుతంత్రం..ఆనాటి మారణహోమానికి రక్తసిక్తమైన ఆ పచ్చని అరణ్యం, అన్నీ తనకి ఇప్పుడే జరుగుతుందా అన్నట్టుగా. తను చూస్తోంది అంతా నిజమా.. భ్రమా అన్నట్టుగా ఒక విధమైన ఉద్వేగంతో ఉన్న అజయ్ నోటి నుండి. "ఉంగిలియర్! ఉఫిచిట్ హులెకర్! అంగలియా కోచత్! టీజెలక్సవ్.." అంటూ ఆ గత జన్మలో తన మాతృ భాష అయిన ఒకనాటి శక్తి కోయల భాష మాట్లాడుతూ ఉగిపోతున్నాడు.

అజయ్ కళ్ళు నీలంగా మారాయి. ఒక్కసారిగా వాతావరణం అంతా భయంకరంగా మారిపోయింది. నల్లటి మబ్బులు ఆకాశాన్ని కప్పేసాయి. ఈదురు గాలులతో ఆ అరణ్యం అత్యంత భయానకంగా మారిపోయింది. దానికి తోడు నక్కల ఏడుపు ఇంకా భయంకరంగా వినిపిస్తోంది. ఉద్వేగంతో ఉగిపోతున్న అజయ్ వెనకనే నీడగా నిలబడి వికృతంగా నవ్వుతోంది సింగా ని ఆవహించిన దుష్టాత్మ.

***సశేషం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలు :


రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య. నేనొక గృహిణిని

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు


23 views0 comments
bottom of page