top of page

నల్లమల నిధి రహస్యం పార్ట్ - 27


'Nallamala Nidhi Rahasyam Part - 27' written by Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

పూర్తిగా సూర్యోదయం అయింది.

ఆ దుష్టాత్మ బంధనాలు అన్నీ తెంచుకుని, వికటాట్టహాసం చేస్తూ తన పగ తీర్చుకునేందుకు బయలుదేరింది. శ్రీశైలం బయలుదేరిన సంజయ్ ను నీడలా వెంటాడుతూ వస్తూ ఉన్న ఆ దుష్టాత్మ సంజయ్ ను తాకడానికి ప్రయత్నం చేసి, సంజయ్ చేతికి ఉన్న రక్ష వలన అతన్ని తాకగానే నిస్తేజమై నిలబడిపోయింది.

సంజయ్ వేగంగా శ్రీశైలం వైపుగా సాగిపోతూనే ఉన్నాడు. ఒక నిమిషం తరువాత కోలుకున్న ఆ దుష్టాత్మ "అయ్యారే! వీనికి ఈ రక్ష ఉన్న కారణం చేత వీడిని నే తాకలేక పోతిని కదా! నేను వేరొక వాహకాన్ని ఎంచుకోవలేనా?” అనుకుంటూ తన దుష్ట శక్తి తో అజయ్ రక్త సంబంధీకులను చూస్తూ వారిలోని ఒకరిని తన వాహకంగా ఎంచుకుని, ఆ దిశగా తన పయనం మొదలు పెట్టింది.

***

సిద్ధాంతి గారు చెప్పిన విషయాలే సంజయ్ చెవుల్లో మారుమ్రోగుతూ ఉన్నాయి."రేపు రాబోయే సూర్యగ్రహణం 500 ఏళ్లకు ఒకసారి వచ్చే సంపూర్ణ సూర్య గ్రహణం. ఆ దుష్టాత్మ. మీ రక్త సంబంధీకులలో ఒకరిని ఆవహిస్తుంది. అలా ఆ దుష్టాత్మకి వాహకం అయిన వ్యక్తితో నీ అన్నయ్య తలపడనున్నాడు. అ ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడిలో ఉన్న ఖడ్గం మాత్రమే మీ అన్నయ్యని కాపాడగలదు" అంటూ సిద్ధాంతి గారు చెప్పిన ఒక్కోమాటను మననం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు సంజయ్.

***

కళ్ళముందర కనిపిస్తున్న సీతను చూసి, ప్రస్తుతంలోకి వచ్చాడు అజయ్. ఇప్పుడు అతనికి తన గత జన్మ అంతా గుర్తు ఉంది.

"ఏరా నాన్నా! ఏమైంది? మరియా.. మరియా.. అంటూ కలవరించావు? నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా?" అంటూ అడిగింది సీత.

"ప్రేమించానమ్మా! తనంటే నాకు ప్రాణం. తనకి నేనే లోకం. నాకోసమే.. కేవలం నాకిచ్చిన మాటకొసమే.. తను ఇన్ని జన్మలుగా నాకోసం ఆ అడవిలోనే ఎదురుచూస్తూ ఉంది" అంటూ కన్నీరు పెట్టుకుంటున్న అజయ్ ని దగ్గరకు తీసుకుని

"ఏమంటున్నావ్ నాన్నా.. జన్మలుగా వేచి ఉండడం ఏంటి? కల ఏమైనా వచ్చిందా?" అంటూ అనునయంగా అడుగుతోంది సీత.

ఇంతలో అజయ్ కి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ తో ఈ లోకంలోకి వచ్చాడు అజయ్.

ఫోన్ లిఫ్ట్ చేయగానే. " హలో సార్! నేను హెడ్ కానిస్టేబుల్ సూర్యం ని మాట్లాడుతున్నా..ఆ సింగా మన వాళ్ళని కొట్టి, అడవిలోకి పారిపోయాడు సార్" అన్నాడు.

" ఏం మాట్లాడుతున్నారు? వాడు అసలు కదల లేని పరిస్థితుల్లో పడి ఉంటే ఎలా లేచి పారిపోయాడు?" అంటూ గద్దించాడు అజయ్.

"అదే మాకు అర్ధం కావట్లేదు సార్. ఒక్కసారిగా వాడికి ఏదో బలం వచ్చేసింది. వంకర పోయిన చేయ కూడా సరి అయిపోయింది. హాస్పిటల్ లోని స్టాఫ్ ని, నన్ను,మన కానిస్టేబుల్స్ ని కూడా కొట్టేసి, అడవిలోకి పారిపోయాడు సార్!" అంటూ చెప్పాడు సూర్యం.

"నేను వస్తున్నా.. " అంటూ అజయ్ లేచి మొహం కడిగేసుకుని, సీత వారిస్తున్నా వినకుండా హ్యాంగర్ కున్న చొక్కా వేసేసుకుని, గన్ తీసుకుని జీప్ ఎక్కి నల్లమల అడవుల వైపు బయలుదేరాడు.

అజయ్ కి తోడుగా. అతన్ని అనుసరిస్తూ మరియా కూడా ఉంది. సీత ప్రాణం విలవిలలాడుతోంది.

"దేముడా! నా బిడ్డని నువ్వే కాపాడాలి. తలకి గాయం అయినా లెక్క చేయకుండా ఆ క్రూరుడిని పట్టుకునేందుకు వెళ్ళిపోయాడు. ఆ సింగా తో నా కొడుకుకి విరోధం పెట్టావేంటి స్వామీ! విధి ఆడే ఆటకి నేను అలిసిపోయాను. నువ్వే నా బిడ్డని కాపాడాలి మల్లన్నా. " అంటూ ఏడుస్తోంది సీత.

ఇంతలో ఆమెకి సంజయ్ ఫోన్ చేసాడు. ఎలాగో ఓపిక తెచ్చుకుని, ఫోన్ లిఫ్ట్ చేసింది సీత.

"అమ్మా! నేను బయలుదేరాను. అన్నయ్యకి ఎలా ఉంది ఇప్పుడు?" అని అడిగాడు సంజయ్ డ్రైవింగ్ చేస్తూనే.

ప్రయాణంలో ఉన్న వాడికి ఈ విషయం చెప్తే కంగారు పడతాడని, కన్నీరు బలవంతంగా ఆపుకుని" బానే ఉన్నాడు నాన్నా! మీరు జాగ్రత్తగా రండి" అని చెప్తూ ఉండగానే

"అమ్మా! అన్నయ్యని బయటకు పంపకు. ఇవాళ, రేపు వాడ్ని ఇంట్లో ఉండేలా చూడు. నేను వచ్చేస్తున్నా కదా. అంతా నేను చూసుకుంటాను. వాడిని మాత్రం బయటకు వెళ్లనివ్వకుండా ఆపు అమ్మా!" అన్నాడు సంజయ్.

"అయ్యో. నీకు ఎలా చెప్పనురా! వాడు పొద్దున్నే వెళ్ళిపోయాడు. అది కూడా చాలా ప్రమాదకారి అయిన సింగా ని పట్టుకోడానికి!" అంటూ కూలబడి ఏడుస్తోంది.

ఆ మాట విన్న సంజయ్ కార్ ని కంట్రోల్ చేయలేక అదుపు తప్పాడు. ఆ ప్రమాదం లో అతని చేతిలో ఉన్న ఫోన్ కార్ లోనే కింద పడిపోయింది.

ఒక్కసారిగా సంజయ్ ఫోను కింద పడిపోయి, పెద్దగా శబ్దం వినిపించేసరికి. సీతకి గుండె ఆగిపోయినంత పని అయింది.

"సంజయ్! సంజయ్!” అంటూ అరుస్తూ ఏడుస్తూ ఉంది సీత. ఒక కొడుకు ప్రమాదాన్ని వెతుక్కుంటూ అడవుల్లోకి వెళ్ళి పోయాడు. ఇంకో కొడుకు ఏదో ప్రమాదంలో చిక్కుకుపోయాడు.

"భగవంతుడా! నా బిడ్డలు.." అంటూ సొమ్మసిల్లి పడిపోయింది సీత.

***సశేషం***రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య

నేనొక గృహిణిని

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు

23 views0 comments

Comments


bottom of page