top of page

నల్లమల నిధి రహస్యం పార్ట్ - 26


'Nallamala Nidhi Rahasyam Part - 26' written by Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

"రేపటి సూర్యోదయం అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది" అని గంభీరంగా బదులిచ్చాడు సంజయ్.

" సూర్యోదయం ఏమో కానీ సంజూ! తలచుకుంటుంటుంటే ఒళ్ళు జలదరిస్తోంది. నా జీవితంలో ఎప్పుడూ ఇంత భయంకరమైన కల రాలేదు. ఆ బిచ్చగాడు చెప్పినట్టే నీకు రక్ష కట్ట గలిగాను. ఇది ఎప్పటికీ తీయకు సంజూ! నీకేమైనా ఐతే మాత్రం నేను బ్రతకలేను" అంటూ సంజయ్ చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకుంది అంజలి.

" అంజలీ! నువ్వు మానసికంగా సిద్ధంగా ఉండు. నేను చెప్పే మాటలు గుర్తు పెట్టుకో. నాకూ నువ్వంటే చాలా ఇష్టం. కానీ మా అన్నయ్య అంటే ప్రాణం. ఒకవేళ వాడిని కాపాడే ప్రయత్నంలో నాకు ఏమైనా అయితే మాత్రం, నువ్వు నన్ను మర్చిపోయి, ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలి. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అంజలీ! ఇలాంటి ఒక పరిస్థితి వస్తుంది అని ముందే తెలిసి ఉంటే అసలు నేను నీ జీవితంలోకి వచ్చేవాడినే కాదు. తెలియదు కదా, విధి ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుతుందో! మళ్ళీ ఎప్పుడు విడదీసేస్తుందో ! అందుకే ముందుగానే చెప్తున్నా. నాకు ఏమైనా ఐతే.." అంటూ ఉన్న సంజయ్ పెదవులను తన పెదవులతో మూసేసింది అంజలి.

కాసేపు మౌనం తరువాత "నీకు ఏమీ కాదు సంజయ్! మీ అన్నయ్యకీ ఏమీ కాదు. అన్నిటికీ ఆ అమ్మవారే రక్ష. పైగా నీకు హనుమన్న రక్ష కూడా ఉంది. దయచేసి ఇంకెప్పుడూ ఇలా అనకు. ఏం జరిగినా నీతోటే నేనూను! నువ్వు లేని జీవితం నాకూ వద్దు. నువ్వు ఇలా మాట్లాడితే ఇప్పుడే నేను చచ్చిపోతాను " అంటున్న అంజలి మోముని చేతుల్లోకి తీసుకుంటూ

" ఐ లవ్ యూ అంజలి" అంటూ అంజలి కన్నీటిని తుడిచి, " వెళ్లు..కాసేపు పడుకో. రేపు మనము సిద్ధాంతి గారిని కలిసి, అటునుండి శ్రీశైలం వెళదాము. అన్ని సమస్యలకీ ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. ఎక్కువ ఆలోచించి, నీ చిన్ని బుర్ర బద్దలు కొట్టుకోకు. వెళ్ళు!" అంటున్న సంజయ్ ని పక్కనే ఉన్న దిండుతో కొట్టి, "నాది చిన్ని బుర్రా?" అంది అంజలి చిరుకోపం ప్రదర్శిస్తూ.

" ఇంత చెప్తే నీకు ఈ లాస్ట్ లైన్స్ మాత్రమే బాగా వినిపించాయి చూడు! హా హా హా" అంటూ నవ్వాడు సంజయ్.

"హమ్మయ్యా! నువ్వు నవ్వావు కదా! ఇంక హ్యాపీ నేను. సరే పడుకో. గుడ్ నైట్" అంటూ పైకి లేచి, సంజయ్ జుట్టు మొత్తం చేరిపేసి, ఒక్క పరుగులో తన గదిలోకి వెళ్ళిపోయింది అంజలి.

"పిచ్చి పిల్ల! " అనుకుంటూ తాను నిద్రపోయాడు సంజయ్.

***

"మరియా! నా మరియా! " అని కలవరిస్తూనే ఉన్న అజయ్ కి పక్కనే కూర్చుని తలనిమురుతూ తన బాధనంతా పాటగా మార్చి తన అమృత గళం నుండి వినిపిస్తోంది.

ట్రాన్స్ లోనే ఉండి, వారందరూ యుద్ధంలో చనిపోయిన తరువాత, ఆత్మగా మారిన మరియానే ఇప్పుడు చూస్తూ కన్నీరు కారుస్తున్న అజయ్ ని ఆ గంధర్వ గానం స్వర్గపుటంచుల్లో ఓలలాడిస్తూ, తన గుండెల్లో రేగే అగ్ని కీలల ఎడారి గ్రీష్మాన్ని చల్లబరుస్తోంది.

"ఓ.. నా.. ప్రాణమా!

నీకై నే వేచిఉంటినిరా..

చెరిగిపోని బాసనై.. చెదిరిపోని కలనై..

ప్రాణం లేని శిలనై.. కరిగిపోని కాలాన్నై..

ఓ ..నా.. ప్రాణమా!

నీ ప్రేమను బంధించుకున్న నా హృదయం ఇక స్పందించలేదురా..

నీ రూపం దాచుకున్న నా కన్నులు ఇక చూడలేవురా..

నీ కౌగిలిలో కరిగిపోయే నా దేహం ఇక కదలలేదురా..

మనము కలిసి నడిచిన ఈ అడవి నేడు చిన్నబోయెరా..

మన జంటని దీవించిన ఆ అమ్మవారు మూగబోయెరా..

ఆ సెలయేరు మన కోసం ఎదురు చూసేరా..

ఆ పూదోట పూలన్నీ రాలిపోయేరా..

రాకాసి కాలం విడదీసేరా.. పచ్చని అడవి తల్లి ఎర్రబడెనురా..

ఓ.. నా.. ప్రాణమా!

నేను మాత్రం నీకోసం వేచి ఉంటిరా..

నీ బాస కోసం ఎదురుచూస్తారా..

జన్మాలు వేచయినా కావలుంటరా..

మరి నాకోసం జన్మనెత్తి రావేలరా..

ఈ చిన్నదాన్ని ప్రేమనే మరిచినావురా..

ఓ..ఓ..ఓ.. నా.. ప్రాణమా! రా.. రా.. రావేలరా!రావేలరా!రావేలరా!"

అంటూ ఆ అడవి అంతా వినిపించేలా పాడుకుంటూ తిరుగుతున్న మరియా కనిపిస్తోంది అజయ్ కళ్లలో.

ఇంతలో నరేంద్రుని కొడుకు, ఒక వంద మంది సైన్యంతో ఆ అడవిలోకి వచ్చాడు. నిధి ఉన్న నీలగిరి కొండల వైపుగా వెడుతున్నాడు. అప్పుడు మరియాకి గుర్తు వచ్చింది, చనిపోయే ముందు నరేంద్రుడు తన పెంపుడు పావురంతో నిధి తాలూకు రహస్యాన్ని ఎవరికో వర్తమానం పంపడం!

ఒక్క సారిగా మరియా ఆత్మ దిక్కులు పిక్కటిల్లేలా అరిచింది. ఆ గర్జనకి ఆ అరణ్యంలో వాతావరణం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. పున్నమి వెన్నెల బొమ్మలా బంగారు కాంతితో వెలిగిపోయే మరియా ఒక్కసారిగా భయంకరమైన ఆకారంలోకి మారిపోయింది. ఆ అకారాన్ని చూస్తుంటే అజయ్ కి గుండె వేగం పెరిగిపోతోంది. వికృత రూపంలోకి మారిపోయిన మరియా ఆ సైన్యాన్ని మొత్తం చిత్తు చిత్తు చేసి, వాళ్లందరినీ పరిగెత్తించింది. ఎవర్నీ ఆ అడవి దాటనీయకుండా సమాధి చేసేసింది.

అలా ఆనాటి నుండి ఈనాటి వరకూ ఆ నల్లమల అడవుల్లో దాగిన ఆ నిధిని దక్కించుకోవాలని దురుద్దేశంతో వచ్చిన వారందరని మృత్యుదేవతకి కానుకగా ఇచ్చి, ఆ నిధికి కాపు కాస్తున్న మరియా కనిపించింది అజయ్ కళ్ళకి. తను ఆత్మగా మారినా తన శక్తితో నిధికి కావలి ఉండి, జన్మలుగా తనకోసం ఎదురు చూస్తోంది అని అజయ్ గా జన్మించిన మార్తాండకు అర్ధం అయింది.

ఇదంతా చూస్తున్న అజయ్ కళ్ళకి ఒక దుష్టాత్మ కూడా కనిపించింది. మరియా చావుకి కారణం అయిన నరేంద్రుడిని చనిపోయే ముందు మరియా శాపం పెట్టడం కనిపిస్తోంది. కొన ఊపిరితో ఉన్న మరియా మాటలు అస్పష్టంగా వినిపిస్తూ ఉండగా వళ్లంతా చెమటలు పట్టేస్తూ

తీవ్రమైన ఉద్వేగానికి లోనవుతున్నాడు.

"రేయ్! నిన్ను వదలనురా.. నిన్ను వదలను. నిన్ను నాశనం చేస్తా! నీ అంతు చూస్తా" అంటూ ఊగిపోతున్న అజయ్ చేతులు తన మంచానికి ఆనుకుని ఉన్న టేబుల్ పై ఉన్న గ్లాస్ ని తాకి, ఆ గ్లాస్ కింద పడిపోయింది.

ఆ శబ్దానికి అక్కడికి వచ్చిన సీత కొడుకు పరిస్థితి చూసి చాలా కంగారు పడిపోయింది.

అప్పటికి టైం 5 :30 అవుతోంది. సూర్యుడు అప్పుడే కొద్ది కొద్దిగా చీకటి నిండిన లోకంలో వెలుగు దారులు వేసుకుంటూ ఉదయిస్తున్నాడు.

సీత అజయ్ ని గట్టిగా ఊపుతూ లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉంది.

కాసేపటికి అజయ్ ట్రాన్స్ లోంచి బయటకొచ్చి “మరియా!” అంటూ ఉలిక్కి పడి లేచాడు.

"మరియా ఏంటి నాన్నా! ఏమైనా పీడ కల వచ్చిందా?" అంటూ కంగారుగా అడుగుతోంది సీత.

కళ్ళ ముందు కనిపిస్తున్న సీతను చూసి ప్రస్తుతం లోకి వచ్చాడు అజయ్. ఇప్పుడు అతనికి తన గత జన్మ పూర్తిగా గుర్తు ఉంది.

***

అప్పటికే సంజయ్, సిధాంతి గారి ఇంటికి చేరిపోయాడు.

తను ఇప్పుడు శ్రీశైలం వెళ్ళబోతున్నాడు కాబట్టి, ముందుగా తనని కలవమన్నారని, సిద్ధాంతి గారిని కలవడానికి వెళ్లాడు. సూర్యోదయం అయ్యేందుకు ఇంకా ఒక్క నిమషం ఉంది అనగానే సంజయ్ ని లోపలికి పిలిచి, అన్ని విషయాలు వివరంగా చెప్పారు.

"నరేంద్రుని ఆత్మ పగతో నీ అన్న కోసం ఎదురుచూస్తోంది.

మీ అన్నయ్య జాతకం ప్రకారం పాతికో ఏడాది వచ్చిన నాటి నుండి మృత్యు గండం పొంచి ఉంది. ఆ గండాన్ని తనకు అనువుగా మార్చుకుని, ఆ దుష్టాత్మ, మీ అన్నయ్యను అంతం చేయడానికి ప్రయత్నం చేస్తోంది. కానీ ఇప్పటి వరకూ అది మీ అన్నయ్యను ఏమీ చేయకుండా నీడలా వెంటాడుతూ ఉంది. ఎందుకంటే అది ఒక ప్రత్యేకమైన ఘడియ కోసం ఎదురుచూస్తూ ఉంది కాబట్టి” అని కొన్ని విషయాలు సంజయ్ కి చెప్పారు సిద్ధాంతి గారు.

ఆ విషయాలు వింటూ ఉంటే సంజయ్ కి వళ్ళు జలదరించింది.

"మృత్యు గండం, అతన్ని మృత్యు దిశగా నడిపిస్తోంది. ఆ మృత్యువును ఎదుర్కునేందుకు తగిన విధానం అంతా సంజయ్ కి చెప్పి,

"నీ అన్నను కాపాడుకోడానికి నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేయి. నా ప్రయత్నం నేను చేస్తా!" అని చెప్పారు సిద్దాంతి గారు.

సిద్ధాంతి గారు చెప్పిన విషయాలు పదే పదే మననం చేసుకుంటూ తన అన్నను కాపాడుకునేందుకు శ్రీశైలం బయలుదేరాడు సంజయ్.. అంజలి, అంజలి తల్లితో కలసి.

***

సంజయ్ వెళ్ళగానే సిద్దాంతి గారి శిష్యుడు

"గురువుగారూ! ఇప్పుడు ఆ అన్నాతమ్ములు ఇద్దరూ ప్రమాదం నుండి గట్టెక్కుతారు కదా " అని అడిగాడు.

"బ్రహ్మ రాతను తప్పించడం ఎవరి తరం కాదు. అజయ్ జాతకంలో మృత్యువు తాండవం చేస్తోంది. కాపాడుకోవాలని ఆ తమ్ముడి ఆరాటం, మంచిని గెలిపించేందుకు మన పోరాటం.

అంతా విధి లిఖితం. ఇద్దరూ రక్షించబడతారో, ఇద్దరూ బలి అయిపోతారో లేక ఇద్దరిలో ఒకరే మిగులుతారో..అంతా విధి నిర్ణయం. మానవ మాత్రులుగా మనము చేయగలిగినది మనము చేద్దాం. ఆపైన ఆ జగన్మాత కరుణ!" అంటూ తను చేయవలసిన క్రతువు గురించి శిష్యులకు ఆదేశాలు ఇచ్చి, తను ధ్యానం లోకి మునిగిపోయారు.

పూర్తిగా సూర్యోదయం అయింది.

ఆ దుష్టాత్మ బంధనలు అన్నీ తెంచుకుని, వికటాట్టహాసం చేస్తూ తన పగ తీర్చుకునేందుకు బయలుదేరింది.

***సశేషం***


రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య

నేనొక గృహిణిని

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు




27 views0 comments
bottom of page