top of page
Writer's pictureRamya Namuduri

నల్లమల నిధి రహస్యం పార్ట్ - 18


'Nallamala Nidhi Rahasyam Part - 18' written by Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

ఆ దుష్టాత్మ తను అనుకున్న పని అయింది అన్నట్లు అక్కడనుండి సంతోషంగా వెళ్ళిపోయింది.సంజయ్ పరిష్కారం తెలుసుకోకుండానే, ట్రాన్స్ నుంచి బయటకొచ్చేసాడు. కానీ అతని తల ముక్కలైపోతున్నట్టుగా తల నొప్పితో బాధపడిపోతూ "నాకు ఏమైంది? ఇంతసేపు ఏం జరిగింది?" అని అడిగాడు సంజయ్.

అతనికి ఇంతవరకు తను చూసింది ఏమీ గుర్తులేదు. ఇప్పుడు అతను కేవలం తన అన్నను కాపాడుకోడం కోసం వచ్చిన ఒక తమ్ముడు అంతే.అతనికి మంచినీళ్లు తాగించి, "ఏమీ కాలేదు, మీ అన్నయ్య ఎదుర్కోబోతున్న ప్రమాదాన్ని అరికట్టేందుకు నీ ద్వారా మార్గం వెతికాము" అని సిద్ధాంతి గారు చెప్తూ ఉండగానే,

"మరీ, దొరికిందా? ఇప్పుడు మా అన్నయ్య సేఫ్ గానే ఉన్నాడా? కానీ నాకేమి గుర్తులేదేంటి? నా ద్వారా వాడ్ని సేవ్ చేసే మార్గం దొరికిందా? ఎలాగా?" అంటూ ప్రశ్నల బాణాలు సంధిస్తూనే ఉన్నాడు సంజయ్.

"ఆగు బాబు! అన్నిటికీ సమాధానాలు తెలుస్తాయి. మీ అన్నయ్య ప్రస్తుతానికి క్షేమంగానే ఉన్నాడు. ఇక మీదట ఏం జరగబోతోందో అనేది విధి నిర్ణయం! ఐతే మా వంతుగా మీ అన్నయ్యను కాపాడే ప్రయత్నం చేస్తాము. నువ్వు ఇక వెళ్ళవచ్చు. నువ్వు ఎలాగో ఒక నాలుగు రోజుల్లో మీ అన్నయ్య దగ్గరకు వెళ్ళబోతున్నావు. వెళ్లే ముందు ఇక్కడికి వచ్చి వెళ్ళు" అని చెప్పి, ఇంకో మాట సంజయ్ మాట్లాడే లోగా ఆయన అక్కడ నుండి పూజా మందిరం దగ్గరికి వెళ్లి, పద్మాసనం వేసుకుని, ధ్యానంలోకి వెళ్లిపోయారు.

ఇక సంజయ్ కి అర్ధం అయింది అయన తన ప్రశ్నలకు ఇప్పుడు సమాధానము చెప్పరు అని.

సంజయ్, లేచి, బయటకు వచ్చి, ఫోన్ చూసుకున్నాడు.

అప్పటికే తన తల్లి నుండి చాలా మిస్డ్ కాల్స్ ఉండడంతో, ఆమెకు ఫోన్ చేసాడు.

***

ఆ పాప వెళ్లిపోయిన తరువాత మళ్ళీ వంట పనిలో పడింది సీత.

సంజయ్ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చెయ్యట్లేదు అని కంగారుపడుతోన్న సీత ఫోన్ రింగ్ అయింది.

ఆశగా తీసి చూసింది, సంజయ్ ఫోన్ అవ్వాలి అనుకుంటూ.

డిస్ప్లే చూసి, సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేసి,

"ఏరా నాన్నా! ఎలా ఉన్నవురా.. ఎందుకు పొద్దున్నుంచి ఫోన్ లిఫ్ట్ చేయలేదు? నువ్వు బానే ఉన్నావా నాన్నా?' అంటూ కంగారుగా అడిగింది సీత.

"హా మామ్! ఐయామ్ ఫైన్. అన్నయ్య ఎలా ఉన్నాడు?"

"వాడు డ్యూటీకి వెళ్లాడు. బానే ఉన్నాడు. ఇదిగో.. వాళ్ల జూనియర్ చూసి పెట్టిన ఇంట్లో దిగాము. పొరుగింటి ఆవిడా పరిచయం అయ్యిందిలే కానీ, నువ్వు పొద్దున్నుంచి ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు రా? " అని అడిగింది సీత.

"మామ్! ముందు నేను చెప్పేది విను. నేను రామచంద్ర సిద్ధాంతి గారి ఇంటికి వచ్చాను పొద్దున్నే. ఆయన నా ద్వారా అన్నయ్య సమస్యకి పరిష్కారం తెలుసుకుంటాను అని నా తలపై చేయి పెట్టారు. ఆ తరువాత ఏమైందీ నాకు తెలియలేదు. నేను కళ్ళు తెరిచి చూసేసరికి, అయన మొహంలో విచారం కనిపించింది. ఆయన మాత్రం, ఇప్పుడిక వెళ్ళిపో. మళ్ళీ ఊరు వెళ్ళే ముందు వచ్చి కనిపించు అని చెప్పారు. ప్రస్తుతం అన్నయ్యకి ప్రమాదం ఏమీ లేదన్నట్టు చెప్పారు. వివరంగా చెప్పలేదు. ఐనా మళ్ళీ రమ్మన్నప్పుడు చెప్తారేమో. సరే! నువ్వు వాడ్ని కనిపెట్టుకుని ఉండు. నాకు కాలేజీకి టైం అవుతోంది. మళ్ళీ ఈవెనింగ్ చేస్తా మామ్! ఓకే నా.." అంటూ కాల్ కట్ చేసి, ఇంటి దారి పట్టాడు.

***

స్టేషన్ లొ అందరితోనూ పరిచయం అయ్యాక, ఊర్లో ఉన్న కేసెస్ ఫైల్స్ అన్నీ తన టేబుల్ పై ప్రత్యక్షం అయ్యాయి.

ప్రెసెంట్ అక్కడ ఉన్న కిడ్నాపింగ్ కేసెస్ పై అజయ్ దృష్టి సారించాడు.

వరుసగా నలుగురు పిల్లలు కిడ్నాప్ కి గురి అయ్యారు, వాళ్ల ఆచూకీ ఇంకా తెలియలేదు.

ఈ కేసెస్ కి సంబంధించిన అన్ని వివరాలూ అరగంటలో నా టేబుల్ పై ఉండాలి అని గర్జించాడు అజయ్.

అప్పుడే అక్కడికి పది మంది రౌడీలతో వచ్చాడు సింగా.

అతడ్ని చూస్తూనే అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ అందరూ భయపడిపోయారు .

అజయ్ మాత్రం ధైర్యంగా "ఎవరు నువ్వు?" అని అడిగాడు.

సింగా నేరుగా వచ్చి, అజయ్ ముందరే కాలు మీద కాలు వేసుకుని కూర్చుని, పది లక్షలు టేబుల్ మీదకి విసిరేసి,

"ఇవి తీసుకుని, నోరు మూసుకొని కూర్చో! ఇక్కడ ఏం జరిగినా చూసీ చూడనట్టు వదిలేస్తే, నీకు ముట్టేవి నీకు ముడతాయి. కాదని డ్యూటీ చేయాలనుకుంటే మాత్రం అడ్డంగా నరికేసినా అడిగే వాళ్ళు ఉండరు. ఇక్కడ నేను చెప్పిందే చట్టం. నేను చేసిందే న్యాయం. ఇక్కడ బ్రతకాలి అంటే నువ్వు పోలీస్ లా కాదు, నా బానిసలా బ్రతకాలి. లేదంటే చచ్చిపోతావ్! జర భద్రం" అంటూ పొగరుగా మాట్లాడుతూ ఉన్నాడు.

అజయ్ కి కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. పిడికిలి బిగించి, ఒక్కసారిగా సింగా మొహంపై ఒకటే గుద్దు గుద్దేసరికి, మొహం పచ్చడయిపోయింది. ముక్కులోంచి రక్తం కారుతోంది. అది చూసి, అతని రౌడీలు ముందుకొచ్చారు.

అందరికీ తన స్టైల్ లొ ఒక రౌండ్ వేసి, ఉతికి పంపించాడు అజయ్. ఊహించని విధంగా అజయ్ ఎదురు తిరగడంతో అవమానంతో రగిలిపోతూ "నీ అంతు చూస్తా! "అంటూ అరుస్తూ వెళ్ళిపోయాడు సింగా.

అది అంతా బయటనుండే చూసిన ఒక తల్లి మాత్రం, పరుగున వచ్చి అజయ్ కాళ్ల మీద పడి, "నా కొడుకుని ఆ రాక్షసుడి నుంచి కాపాడండి సార్" అంటూ ఏడుస్తోంది.

***సశేషం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య

నేనొక గృహిణిని

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు


23 views0 comments

Kommentare


bottom of page