'Nallamala Nidhi Rahasyam Part - 17' written by Ramya Namuduri
రచన : రమ్య నముడూరి
ప్రతాపరుద్రుడు సహజ మరణం చెందలేదు.
అప్పుడు ఏమి జరిగిందో సంజయ్ కళ్లముందే కదలాడుతోంది. కోపంతో ఊగిపోతున్నాడు సంజయ్.
అతని కంటి వెంట ధారగా కన్నీరు కారుతోంది. అది కోపంతో రగిలిపోతున్న అతని అశృధార.
అతని నోటి వెంట "ద్రోహి! నమ్మక ద్రోహి! నిన్ను వదలనురా! "అంటూ గంభీరమైన స్వరంతో వస్తోన్న మాటలు విన్న రామచంద్ర సిద్దాంతి గారు అలా కోపంతో ఊగిపోతున్న సంజయ్ తల వెంట్రుక సేకరించమని శిష్యుడ్ని ఆదేశించారు. అతను అలా చేయగానే, ఆ వెంట్రుకను ఒక మట్టి కుండలో పెట్టించి, దానిపై ఎర్రటి రవికల గుడ్డ కట్టించారు.
సంజయ్ ఇంకా ఆ ట్రాన్స్ లోనే ఉన్నాడు. అక్కడ ఏమి జరుగుతోందో అది మాత్రమే అతని కళ్ళకు కనిపిస్తోంది. అతను ఇంకా అదే ఊహలో ఉండగానే సిధాంతి గారు లేచి, అతని తలపై చేయ ఉంచి ఏవో మంత్రాలు చదువుతూ
"మహారాజా శాంతించు. ఇప్పుడు నీవు ప్రతాపుడవు కాదు. నువ్వు సంజయ్ వి. నీ అన్నగా మళ్ళీ పుట్టిన నీ మిత్రుడ్ని మృత్యువు ఆహ్వానిస్తోంది. అతని ప్రాణం కాపాడగలిగేది నువ్వు మాత్రమే. ఆ ఆత్మను అంతం చేయగలిగే మార్గం నీకే తెలుస్తుంది. అతన్ని కాపాడగలిగే మార్గం నీకే తెలుసు. ఆ దుష్టుడి ఆత్మను నాశనం చేసే మార్గం వెతుకు! నీకు కనిపిస్తోందా?" అడుగుతూనే ఉన్నారు సిద్ధాంతి గారు.
" లేదు.. ఆ దుష్టుడికి అంతం లేదు. నా మిత్రునికి మరణం పొంచి ఉంది. అతని అడుగులు, నా ఆశయం వైపు, అతని జీవితం మృత్యు దేవత కౌగిలి వైపు. ఆ దుష్ట ఆత్మ కు అంతం లేకపోవడం ఒక శాపం! దానికి పరిష్కారం.." అంటూ ఆ ట్రాన్స్ లొ ఉండే సమాధానం చెప్తున్నాడు సంజయ్.
"ఆ.. చెప్పండి! పరిష్కారం ఏమిటి?" అడుగుతూనే ఉన్నారు సిద్ధాంతి గారు.
ఇంతలో గాలి భయంకరమైన వేగంతో వచ్చి ఆ గదిలో మూసి ఉన్న తలుపులు భళ్ళుమని తెరుచుకున్నాయి. సంజయ్ ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.
అదేమీ సిద్ధాంతి గారికి వినపడనంతగా గాలి శబ్దం చేస్తూ ఆ గది అంతా భీకరమైన అరుపులు, ఏడుపులు మొదలయ్యాయి. సిద్ధాంతి గారు, సంజయ్ తప్ప, మిగిలిన వారంద రూ గాలిలోకి విసిరేయబడ్డారు. అయన తన తపో బలంతో సంజయ్ ని ట్రాన్స్ లోకి పంపి అజయ్ సమస్యకు పరిష్కారం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండడం వల్ల, లోపలికి చొరబడిన ఆ దుష్ట శక్తిని అడ్డుకోలేకపోతున్నారు.
అదే అదనుగా భావించిన ఆ దుష్టాత్మ, సిద్ధాంతి గారి ద్రుష్టి మరల్చడం కోసం, ఆయన శిష్యుడ్ని ఆవహించి, అతన్ని గాల్లోకి ఎగరేసి, అక్కడ ఉన్న ఒక పదునైన ఆయుధం మీద పడేలా చేస్తోంది.
అది గ్రహించిన సిద్ధాంతి గారు, వెంటనే సంజయ్ లొ ప్రవేశపెట్టిన శక్తిని తిరిగి కైవసం చేసుకుని, ఆ దుష్ట ఆత్మ పై ప్రయోగించగానే, ఆయన శిష్యుడు క్షేమంగా ఇవతల పక్కకు పడి, ప్రాణాలు దక్కించుకున్నాడు.
సంజయ్ పరిష్కారం తెలుసుకోకుండానే, ట్రాన్స్ లోంచి బయటకొచ్చేసాడు. ఆ దుష్టాత్మ తను అనుకున్న పని అయింది అన్నట్టు అక్కడనుండి సంతోషంగా వెళ్ళిపోయింది. సంజయ్ ట్రాన్స్ లోంచి బయటకొచ్చేసాడు. కానీ..
***
ఆ పాప ఇల్లంతా కలియచూస్తూ ఉండగా తన కళ్ళు ఒక దగ్గర ఆగిపోయాయి. కిటికీ అవతల ఎవరో తిరుగుతున్నట్టు కనిపించింది ఆ పాపకి. అదే విషయం చెప్పింది ఆ పాప మల్లి. వాళ్లు చూసే సరికి అక్కడ ఎవరూ లేరు.
కమల, మల్లిని కోప్పడి, "ఎవరూ లేరు అక్కడ. నీకు అస్తమానం ఎవరో ఒకరు కనిపిస్తూనే ఉంటారు." అంటూ తిట్టింది.
"అదేంటమ్మా పిల్లని తిడతావ్! ఏ పిల్లో వెళ్లి ఉంటుందిలే" అంటుంటే
"అది కాదండీ! ఈమధ్య ఇక్కడ పిల్లల్ని ఎత్తుకెళ్లి పోయే వాళ్ళు ఎక్కువగా తిరుగుతున్నారు. మొన్న నెలలోనే నలుగురు పిల్లలు కనిపించకుండా పోయారు. అందుకే దీన్ని బయట ఒంటరిగా వదలను. భయం చెప్పాలి కదా అని చెప్తే ఇలా అస్తమానం ఎవరో కనిపింఛారు అంటూ చెప్తోంది.” అంటూ మల్లి నెత్తి మీద మొట్టి , " వస్తానండీ ! ఏదైనా అవసరం ఉంటే చెప్పండి. మొహమాట పడకండి. ఇరుగు పొరుగు కదా1" అంటూ ఆమె పిల్లను తీసుకు వెళ్లిపోతుంటే
ఆ పిల్ల మాత్రం ఇంట్లోకే చూస్తూ "నే నిజమే చెప్పా అంటీ! అక్కడ.." అంటూ ఏదో అంటూ ఉంటే, ఆ పిల్ల తల్లి మళ్ళీ మొట్టి, తీసుకుని వెళ్ళిపోయింది.
***సశేషం***
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
> పుకారు
రచయిత్రి పరిచయం :
నా పేరు రమ్య
నేనొక గృహిణిని
మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు
రమ్య తెలుగు కథలు నల్లమల రహస్యం బాగుంది. నీకలం నుండి ఇంకా మంచి మంచి రచనలు రావాలని కోరుకొను చున్నాను. న్యూటన్.