top of page

నల్లమల నిధి రహస్యం పార్ట్ -16


'Nallamala Nidhi Rahasyam Part - 16' written by Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

"మిత్రమా! మరిచిపోకు.. మాట ఇచ్చావు.. నా దేశ ప్రజల నిధి.. ఈ దేశ సంపద.. ఆ నీచులకి దక్కకూడదు. నా ప్రజలు ఆకలితో అలమటించకూడదు. నేను తిరిగి రావచ్చు, రాకపోవచ్చు! నా ప్రజల భవిష్యత్తు నువ్వు కావాలి మిత్రమా!" అంటూ ఓరుగల్లుకి తిరిగి ప్రయాణం అయ్యాడు.

కానీ ప్రతాపుడు మార్తాండకు రహస్యంగా చెప్పింది అంతా విన్న నమ్మకద్రోహి నరేంద్రుడు నిధి కోసం, కాకతీయ సామ్రాజ్య పతనం కోసం, తన ప్రణాళిక తను రూపొందించుకున్నాడు.

విశ్వాసంగా ఉంటున్నట్టు ప్రతాపరుద్రుణ్ణి నమ్మిస్తూనే శత్రువులకు ఓరుగల్లు కోట రహస్యాలు, సైనిక సంఖ్య గురించిన లోటు పాట్లు ఇతర అంతరంగిక వ్యవహారాలు, యుద్ధ వ్యూహల గురించి ఇక్కడి రహస్యాలన్నీ దొంగచాటుగా చేరవేస్తూ ఉండేవాడు. నిధి గురించి మాత్రం వారికి ఏ మాత్రం తెలియకుండా జాగ్రత్త పడేవాడు.

ఇదేమీ తెలియని ఆ మహారాజు యుద్ధానికి సన్నద్ధం అవుతున్నాడు.

సరిగ్గా ఒక నెల రోజుల్లో మహా సైన్యముతో తిరిగివచ్చిన ఉలుఘ్ ఖాన్ తో తలపడిన ప్రతాపరుద్రుని సేనలు వీరోచితంగా పోరాడినా, పరాజయము తప్పలేదు. కాకతీయ నాయకులలో తలెత్తిన అనైక్యత, ఈర్ష్యాద్వేషాలు కూడా ఓటమికి కారణాలయ్యాయి.

ప్రతాపరుద్రుడు, కటకపాలుడు, గన్నమ నాయుడు మరియు పెక్కు సేనానులు బందీలయ్యారు. ప్రతాపరుద్రుణ్ణి బంధించిన ఉలుఘ్‌ఖాన్, వరంగల్ లోనే ఉంచితే ప్రమాదమని విశ్వాసపాత్రులైన ఖాదిర్ ఖాన్, ఖ్వాజా హాజీలకు ఆయన్ను ఢిల్లీకి తరలించే బాధ్యతను అప్పగించాడు. అయితే ప్రతాపరుద్రుడు మార్గమధ్యంలోనే కన్నుమూశాడు.

సుల్తాను సైన్యం ప్రతాపరుద్రుని ఢిల్లీ తీసుకు వెళుతుండగా మార్గమధ్యాన సోమోద్భవ (నర్మదా నది) తీరంలో ఆయన కన్నుమూశాడు.

ప్రతాపరుద్రుడు సహజ మరణం చెందలేదు.

అప్పుడు ఏమి జరిగిందో సంజయ్ కళ్ళ ముందరే కదలాడుతోంది. కోపంతో ఊగిపోతున్నాడు సంజయ్.

***

కిచెన్ లో కూర మాడిపోతున్న స్మెల్ వచ్చింది.

"అయ్యో!" అనుకుంటూ వెళ్లి, స్టవ్ ఆఫ్ చేసే సరికి, మళ్ళీ ఆ బొమ్మ శబ్దం మొదలైంది. సీతకి భయంతో చెమటలు పట్టేస్తున్నాయి. గుండె వేగం పెరుగుతోంది . విసిరేసిన బొమ్మ శబ్దం మళ్ళీ హాల్ లొ నుండే వినిపిస్తోంది. భయం భయంగా అడుగులు వేస్తూ ముందుకు వెడుతోంది సీత.

అలా అడుగులో అడుగు వేసుకుంటూ హాల్ లోకి వెళ్లిన సీతకి ఏడుస్తూ ఎదురు వచ్చింది ఒక పాప.

"నా బొమ్మ ఇది! ఎందుకు విసిరేసావ్? చూడు ఎలా విరిగిపోయిందో.." అంటూ ఏడుస్తోంది ఆ పాప.

చూడ్డానికి నాలుగేళ్లు ఉంటాయేమో! బంగారు ఛాయతో మెరిసిపోతూ,నేరేడు పళ్ళలాటి మెరిసే కళ్ళతో, బూరెల్లాంటి బుగ్గలతో, ముద్దుకే ముద్దొంచేంత ముద్దుగా ఉన్న ఆ పాపను మురిపెంగా ఎత్తుకుని, కన్నీళ్లు తుడిచి ముద్దు పెట్టుకుంది సీత.

"ఎవరు పాపా నువ్వు? ఇది నీ బొమ్మ అని తెలియక విసిరేసాను. సారీ! నీకు కొత్త బొమ్మ కొనిపెడతాను ఏడవకు." అంటూ ఊరుకోబెట్టింది సీత.

మల్లీ! మల్లీ! అంటూ ఆ పాపను వెతుక్కుంటూ ఒక ఆమె వచ్చింది.

సీత ఆమెను చూస్తూ " ఈ పాప మీ పాపనా అమ్మా?" అంది.

ఆవిడ " అవునండీ! " అంటూ ఆ పాపను తీసుకుని,

"కొత్తగా వచ్చినట్టు ఉన్నారు. నా పేరు కమల, ఇది నా కూతురు మల్లి. మేము పక్క ఇంట్లోనే ఉంటాం. ఆడుకుంటూ, ఆడుకుంటూ ఇటు వచ్చేసింది. ఏమీ అనుకోకండి." అంటూ ఉండగానే

"అయ్యో! పర్లేదమ్మా.. మేము ఇవాళే వచ్చాము.

నా పేరు సీత. మా అబ్బాయికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడ స్టేషన్ లొ ఎస్. ఐ. ఇవాళే డ్యూటీలొ జాయిన్ అయ్యాడు. " అంటూ చెప్తూ ఉండగా..

ఆ పాప ఇల్లంతా కలియచూస్తూ ఉండగా.. ఆ పాప కళ్ళు ఒక దగ్గర ఆగిపోయాయి.

***సశేషం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

> పుకారు

> సంక్రాంతి -కొత్త అల్లుడు

> పాపం పండిన రోజు

> మరణాన్ని జయించి బ్రతుకుదాం

> నల్లమల నిధి రహస్యం పార్ట్ -1

> నల్లమల నిధి రహస్యం పార్ట్ -2

> నల్లమల నిధి రహస్యం పార్ట్ -3

> నల్లమల నిధి రహస్యం పార్ట్ -4

> నల్లమల నిధి రహస్యం పార్ట్ -5

> నల్లమల నిధి రహస్యం పార్ట్ -6

> నల్లమల నిధి రహస్యం పార్ట్ -7

> నల్లమల నిధి రహస్యం పార్ట్ -8

> నల్లమల నిధి రహస్యం పార్ట్ -9

> నల్లమల నిధి రహస్యం పార్ట్ -10

> నల్లమల నిధి రహస్యం పార్ట్ -11

> నల్లమల నిధి రహస్యం పార్ట్ -12

> నల్లమల నిధి రహస్యం పార్ట్ -13

> నల్లమల నిధి రహస్యం పార్ట్ -14

> నల్లమల నిధి రహస్యం పార్ట్ -15

రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య

నేనొక గృహిణిని

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు





21 views0 comments
bottom of page