'Nallamala Nidhi Rahasyam Part - 15' written by Ramya Namuduri
రచన : రమ్య నముడూరి
వేగుల సమాచారం ప్రకారం, ఉలుఫ్ ఖాన్ తిరిగి దండెత్త బోతున్నాడు. వారు ఇప్పటికే తమ సమీపంలోకి వచ్చేసారు అని తెలుసుకున్న ప్రతాపరుద్రుడు, వారి దండయాత్రకు ఎక్కువ సమయం లేదు అని తెలుసుకుని, రాజ్య క్షేమం కోసం, తన రాజ్యంలోని విలువైన సంపదను అంతా ఒక పెద్ద భోషాణంలో పెట్టుకుని, నల్లమల అడవుల వైపు పయనం అయ్యాడు.
అదంతా సంజయ్ కళ్ల ముందు కదలాడుతూనే ఉంది.
ఆ మహారాజుతో పాటు కొంతమంది అంతరంగిక సైనికులు, నమ్మకస్తులైన మంత్రులు, శ్రేయోభిలాషులు మాత్రమే ఉన్నారు.
నమ్మకం అనే ముసుగులో ఉన్న ఒక ద్రోహి కూడా అందులోనే ఉన్నాడు.
కాకతీయ మహా సామ్రాజ్యపు సింహాసనం పరుల పాలు కావడానికి ముఖ్య పాత్ర పోషించబోతున్న ఆ నీచుడినే, ప్రతాప రుద్రుడు ఎక్కువగా నమ్ముతున్నాడు .
అలా వారి పయనం నల్లమల సరిహద్దుల నుండి దట్టమైన అరణ్యానికి ఆవల ఆనుకొని ఉన్న బలభద్రపురం సామంత రాజ్యానికి చేరుకుంది.
వీరి రాకను వేగుల ద్వారా తెలుసుకున్న ఆ నల్లమల కోయరాజు, ప్రతాపరుద్రుని సామంతుడు అయిన మార్తాండ వారికి ఎదురువెళ్లి, ఘనంగా కోయ సాంప్రదాయంలో స్వాగతం పలికాడు.
ఆ కోయరాజుని చూస్తోన్న సంజయ్ కళ్ళలో నుండి తనకు తెలియకుండానే కన్నీరు వచ్చేస్తోంది.
ఆ కోయరాజు అచ్చు తన అన్నలాగే ఉండడం అతన్ని భావోద్వేగానికి గురిచేసింది.
అప్పటికే, మేడారం యుద్ధం తరువాత కోయరాజులు కప్పం కట్టాల్సిన నియమాన్ని రద్దు చేయడం వలన ప్రతాపరుద్రుడు అంటే కోయరాజులు అందరూ ఒక్కటై ప్రాణం పెట్టేవారు.
అలాగే కోయరాజులు అన్నా, గిరిజనులు అన్నా మహారాజుకి ఎనలేని గౌరవం, నమ్మకం కలిగాయి.
ఆ కారణం చేతనే తన రాజ్య క్షేమం కోరి, తనకు అత్యంత ఆప్తుడు, నమ్మకస్తుడు అయిన కోయ సామంత రాజు మార్తాండకు ఈ బాధ్యత అప్పగించి తను యుద్ధభూమికి మృత్యువుకు ఎదురువెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు.
అదేమీ తెలియని మార్తాండ తన మహారాజుని సాదరంగా ఆహ్వానించి, మర్యాదలు చేసి, సత్కరించాడు. వారిద్దరూ రహస్యంగా మంతనాలు జరపడం కోసం, ఒక ప్రత్యేకమైన గదిలో సమావేశం అయ్యారు.
" సెలవీయండి మహారాజా! మీరు ఇంత దూరం శ్రమపడి వచ్చుటకు కారణం ఏమిటి? ఒక్క మాట ముందుగా చెప్పి ఉన్న యెడల, నేనే వచ్చి ఉండెడి వాడను కదా" అంటూ మార్తాండ మాట్లాడుతూ ఉండగానే ప్రతాపరుద్రుడు "మిత్రమా!" అని సంబోధించడంతో మార్తండకి చాలా ఆశ్చర్యం గాను, ఆనందంగాను అనిపించింది.
"మిత్రమా! మన రాజ్యాలు అన్నీ ఇప్పుడు విపత్కర పరిస్థితిని ఎదుర్కొనబోతున్నవి. ఆ నీచులు ఓరుగల్లును సమీపించుచున్నారు. నేను వారిని ఎదుర్కొనబోతున్నాను. యుద్ధంలో జయాపజయాలు ఆ కాకతీ మాతకే ఎరుక. విజయమో! వీరస్వర్గమో! ఏమైనను జరగవచ్చును కదా..
ఒకవేళ పరిస్థితులు మనకు ప్రతికూలంగా మారిన యెడల, నా రాజ్యం లోని ప్రజలు ఆ క్రూరుల చేతిలో బలి అయిపోతారు. వారి ధన,మాన, ప్రాణాలు ఆ నీచులు హరించుకుపోతారు. నేను ఎదుర్కోబోతున్న యుద్ధంలో జరగరానిది జరిగిన యెడల, నా రాజ్య సంపద, నా ప్రజలకు కాకుండా పోతుంది.
ఈ విపత్కర పరిస్థితుల్లో మీ కోయరాజుల సాయం నాకు కావాలి. జరగరానిది జరిగిన యెడల, నా రాజ్య సంపద, నా ప్రజలకు చేరాలి. మాటియ్యి మిత్రమా!నేను నా రాజ్యపు విలువైన సంపదనంతా ఈ భూషణంలొ పెట్టి తెచ్చాను. ఇది నా రాజ్య ప్రజల సంపద. నా రాజ్య ప్రజలు, మీవంటి సామంత రాజులు, ఎవ్వరూ కూడా ఆ నీచుల దురాగతాలకు, ఆకలి చావులకు బలవ్వకుండా ఈ నిధి సాయపడాలి . దీనిని నీ వద్ద భద్రపరుచు.
నా ప్రజలకే ఉపయోగించుము. నాకు మాట ఇవ్వు మిత్రమా!"అంటూ పైకి లేచాడు.
ఆయన లేచిన వెంటనే మార్తాండ కూడా పైకి లేచాడు.
మార్తాండ తన తలపై చేయి వేసుకుని, " మహారాజా! నేను నమ్మే కొండదేవర మీద ఆన! మీ పాదాలపై ఆన! నా ప్రాణానికి ప్రాణమైన ఈ నల్లమలపై ఆన! ఆ ఇష్టకామేశ్వరి అమ్మవారిపై ఆన! ఈ మార్తాండ కంఠంలొ ఊపిరి ఆగేంత వరకూ మీ పట్ల విశ్వాసంతో, నిబద్ధతతో ఉండెదను. మీ మాట ప్రకారం, మీరు తిరిగి వచ్చు వరకూ ఈ నిధిని సంరక్షించెదను "అంటూ ప్రతిజ్ఞ చేసాడు.
ఆ మాట విన్న ప్రతాప రుద్రుడు సంతోషంగా తన రాజ్యమునకు ప్రయాణమవుతూ
"నేనిక వెళ్లెదను" అంటూ ముందుకు వెడుతూ వెనక్కి తిరిగి,
"మిత్రమా.. మరిచిపోకు.. మాట ఇచ్చావు.. నా దేశ ప్రజల నిధి, ఈ దేశ సంపద, ఆ నీచులకి దక్కకూడదు. నా ప్రజలు ఆకలితో అలమటించకూడదు. నేను తిరిగి రావచ్చు.. రాకపోవచ్చు.. నా ప్రజల భవిష్యత్తు నువ్వు కావాలి మిత్రమా!" అంటూ ఓరుగల్లుకి తిరిగి ప్రయాణం అయ్యాడు.
కానీ ప్రతాపుడు మార్తాండకు రహస్యంగా చెప్పింది అంతా విన్న నమ్మకద్రోహి నరేంద్రుడు నిధి కోసం, కాకతీయ సామ్రాజ్య పతనం కోసం, తన ప్రణాళిక తను రూపొందించుకున్నాడు.
***
వింత శబ్దం చేస్తూ ఉన్న ఆ బొమ్మను దూరంగా విసిరికొట్టి, ఊపిరి పీల్చుకుంది సీత.
ఆమెకు అర్ధం కాని విషయం ఏమిటి అంటే ఆ బొమ్మ అసలు అక్కడికి ఎలా వచ్చింది అని!
ఆమె అలా ఆలోచించుకుంటూనే సంజయ్ కి మళ్ళీ ఫోన్ చేసింది.
వాళ్ళు శ్రీశైలం చేరినప్పటి నుండి ఇది ఇరవయ్యో సారి ఆమె సంజయ్ కి ఫోన్ చేయడం!
"అబ్బా! వీడికేమైంది? వీడు చూస్తే ఇలాంటి ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టాడు. చిన్నోడేమో ఫోనే ఎత్తడు. వాడికి ఏమీ కాలేదు కదా " అంటూ కంగారు పడిపోయి కూర్చుంది సీత.
ఈలోగా కిచెన్ లో కూర మాడిపోతున్న స్మెల్ వచ్చింది.
"అయ్యో!" అనుకుంటూ వెళ్లి, స్టవ్ ఆఫ్ చేసే సరికి, మళ్ళీ ఆ బొమ్మ శబ్దం మొదలైంది.
సీతకి భయంతో చెమటలు పట్టేస్తున్నాయి. గుండె వేగం పెరుగుతోంది. విసిరేసిన బొమ్మ శబ్దం మళ్ళీ హాల్ లొ నుండే వినిపిస్తోంది.
భయం భయంగా అడుగులు వేస్తూ ముందుకు వెడుతోంది సీత.
***
సశేషం
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
> పుకారు
రచయిత్రి పరిచయం :
నా పేరు రమ్య
నేనొక గృహిణిని
మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు
Comentarios