top of page

నల్లమల నిధి రహస్యం పార్ట్ -14


'Nallamala Nidhi Rahasyam Part - 14' written by Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

సిద్ధాంతి గారి గదిలోకి వెళ్ళగానే అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఉలిక్కిపడ్డాడు సంజయ్.

గదికి మధ్యగా గాలిలోనే పద్మాసనం వేసుకుని కూర్చుని, ధ్యానం చేస్తున్న సిద్ధాంతి గారిని చూసి, సంజయ్ గుండె వేగం పెరిగిపోయింది.

ఆయన ఒక నిమిషం తరువాత కళ్ళు తెరిచి చూసేసరికి ఆయన కంటి నుండి ఒక కాంతి ఆ గది అంతా నిండిపోయింది. ఆ వెలుగుని చూడలేక, కళ్ళు మూసుకున్నాడు సంజయ్.

ఒక నిమిషం తరువాత, మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి, అక్కడే ఒక ఆసనం మీద కూర్చొని ఉన్న సిద్ధాంతి గారు, నవ్వుతూ సంజయ్ వంక చూస్తూ "ఇలా వచ్చి కూర్చో" అని చెప్పారు.

సంజయ్ కొంచెం ధైర్యం తెచ్చుకుని, "స్వామీ ! మా అన్నయ్య.." అంటూ చెప్పబోతుండగా

"ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నాడు. ఇకమీదట తానెవరో తనకు తెలియబోతోంది. అది తెలిసిన మరుక్షణం తనను మృత్యువు వెంటాడుతుంది. ఇదే విధి! వింత కథల వారధి.." అంటూ గంభీరంగా చెప్తూ ఉంటే..

"స్వామీ ! అసలు ఇదంతా ఏంటి? దయచేసి నాకు అంతా వివరంగా చెప్పండి. టెన్షన్ తో నా నరాలన్నీ తెగిపోతున్నాయి. అసలు మా అన్నయ్యని ఆ ఆకారం ఎందుకు చంపాలి అనుకుంటోంది? వాడి కళ్ళు నీలంగా ఎందుకు మారాయి? వాడికి దెయ్యం పట్టిందా?" అంటూ తను చూసే దెయ్యాల సినిమాలో రొటీన్ గా ఉండే స్టోరీస్ ఊహించేసుకుంటూ ప్రశ్నలు కురిపించేస్తున్నాడు.

సిద్ధాంతి గారు ప్రశాంతంగా ఒక నవ్వు నవ్వి, "నీ అన్న గురించి మాత్రమేనా? నీ గురించి కూడా తెలుసుకో. అంతా నేను చెప్పడం దేనికి? అంతా వివరంగా నీకే చూపిస్తా.. చూడు!" అంటూ తన గుండెలపై చేయి ఉంచి " అమ్మా.. జగన్మాతా!" అనుకుంటూ అదే చేయి తిరిగి సంజయ్ తలపై ఉంచారు.

అంతే ! సంజయ్ ఒక రకమైన ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాడు. అతను రాజుల కాలంలోకి వెళ్లిపోయినట్టు కనిపిస్తూ ఉంది.

(ఇక్కడినుంచి సంజయ్ ఏమి చూస్తున్నాడు అనేది నా మాటగా, నేను చెప్తున్నట్టు చదవండి )

సంజయ్ చూస్తున్నది 12 వ శతాబ్దం నుండి మొదలు అయ్యింది.

1289 లో కాయస్థ సేనాని అంబదేవుని తిరుగుబాటు అణచు ప్రయత్నములో రుద్రమదేవి మరణించింది. ప్రతాపరుద్రుడు సింహాసనమధిష్ఠించాడు. ఆ మహారాజు ప్రతాపరుద్రుని చూస్తూ ఉంటే సంజయ్ కి తనని తానే చూసుకుంటున్నట్లు అనిపిస్తోంది.

ప్రతాపరుద్రుని పరిపాలన కాలమంతా యుద్ధాలతోనే గడిచింది . ఆ యుద్ధాలు అన్నీ సంజయ్ కళ్ల ముందే జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంటే అతనికి తెలియకుండానే అతని రోమాలు నిక్క బొడుచుకుంటున్నాయి. అతను తనని తానే ప్రతాపరుద్రునిగా నమ్ముతూ జరిగినది అంతా చూస్తూ ఉన్నాడు.

రాజ్యాన్ని విస్తరించి రాజ్యపాలనలో పెక్కు సంస్కరణలు చేశాడు ప్రతాపరుద్రుడు. గద్దె ఎక్కినప్పటినుండి ఎన్నో యుద్ధాలు చేయాల్సి వచ్చింది. కొన్నిసార్లు రాజ్య క్షేమం కోసం కానుకలు సమర్పించుకుని ఖిల్జీ క్రూరత్వం ముందు రాజ్యాన్ని కాపాడుకోవాల్సి వచ్చింది.

క్రీ. శ. 1320 లో ఢిల్లీ రాజకీయాలలో పెద్ద మార్పు వచ్చింది. ఖిల్జీ వంశం పోయి తుగ్లక్ వంశం అధికారంలోకి వచ్చింది. ఘియాజుద్దీన్ తుగ్లక్ సుల్తానయ్యాడు.

ఇదే అదనుగా చూసి ప్రతాపరుద్రుడు వార్షిక కప్పం ఆపివేస్తాడు. లోగడ సుల్తానుకప్పగించిన బీదర్ కోట మరలా ఆక్రమిస్తాడు. కోపగించిన ఘియాజుద్దీన్ తన కొడుకు ఉలుఘ్ ఖానును ఓరుగల్లుపై దండయాత్రకు పంపుతాడు.

దారిలో గల బీదర్, కోటగిరి లోబరుచుకొని ఓరుగల్లు కోట ముట్టడించాడు. ఎంత ప్రయత్నించినా కోట స్వాధీనము కాలేదు. అయిదు నెలల ముట్టడి తర్వాత విఫలుడైన ఉలుఘ్ ఖాన్ ఢిల్లీ మరలి పోయాడు. ప్రతాపరుద్రుని నాయకుల, సేనల ధైర్యసాహసములకు, పోరాట పటిమకు ఇది ఒక మచ్చుతునక.

ఇక ఉపద్రవము లుండవని భావించిన ప్రతాపరుద్రుడు యుద్ధంలో జరిగిన నష్టాలను పూడ్చుకొనక ఉపేక్షించాడు. కోటకు మరమ్మతులు చేయించలేదు. సామగ్రి సమకూర్చు

కోలేదు.

కానీ వేగుల సమాచారం ప్రకారం ‘ఉలుఫ్ ఖాన్ తిరిగి దండెత్తబోతున్నాడు. వారు ఇప్పటికే మన సమీపంలోకి వచ్చేసారు’ అని తెలుసుకున్న ప్రతాపరుద్రుడు, వారి దండయాత్రకు ఎక్కువ సమయం లేదు అని తెలుసుకుని, రాజ్య క్షేమం కోసం, తన రాజ్యంలోని విలువైన సంపదను అంతా ఒక పెద్ద భోషాణంలో పెట్టుకుని, నల్లమల అడవుల వైపు పయనం అయ్యాడు.

అదంతా సంజయ్ కళ్ల ముందు కదలాడుతూనే ఉంది.

***

హాల్ నుంచి వినిపించిన వింత శబ్దం ఏమిటా అని భయం భయంగా అడుగులు వేస్తూ ముందుకు వెడుతోంది సీత. ఆ భయంలో తన గుండె చప్పుడు తనకే వినిపిస్తూ ఉంది.

హాల్ లోకి వెళ్లేసరికి ఆ శబ్దం ఆగిపోయింది.

ఇదేంటి అనుకుంటూ హాల్ అంతా కలియజూస్తున్న ఆమె గుండెలు అదిరిపోయేలా మళ్ళీ ఆ శబ్దం వినిపిస్తోంది. ఉలిక్కిపడి గుండెలు చేతిలో పట్టుకుని చుట్టూ చూస్తున్న ఆమె కళ్ళు, ఆ శబ్దం వస్తున్న వైపున ఆగిపోయాయి.

అక్కడ ఒక ఆట బొమ్మ కనిపించింది. కీ ఇస్తే శబ్దం చేసే ఆట బొమ్మ అది. సీత వెళ్లి, ఆ బొమ్మ కీ ఆపేసి, దూరంగా విసిరికొట్టింది.

కానీ ఆమెకు అర్థం కాని విషయం ఏంటంటే..

***

సశేషం


రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య

నేనొక గృహిణిని

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు

27 views0 comments
bottom of page