top of page
Writer's pictureRamya Namuduri

నల్లమల నిధి రహస్యం పార్ట్ - 24


'Nallamala Nidhi Rahasyam Part - 24' written by Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

‘నిధి కోసం ఆ నరేంద్రుడు నల్లమల అడవుల్లోకి వస్తున్నాడు’ అని తెలుసుకున్న మార్తాండ కనీవినీ ఎరుగని రీతిలో తనదైన ఒక కొత్త పద్ధతిలో ఒక కొత్త యుద్ధ వ్యూహాన్ని రూపొందించి, తన మిత్రుని మరణానికి బదులు తీర్చుకునేందుకు, ఆ నరేంద్రుని రాక కోసం ఎదురు చూస్తున్నాడు.

కత్తులు, ఈటెలు, బల్లెములు, గునపాలు, బాణాలు అన్నీ సిద్ధం చేసుకుని మగవారు, కారం పొడులు, కత్తి పీటలు, ఇంకా ఆ ఆదిమ వాసుల సంప్రదాయ పనిముట్లు చేతబట్టి ఆడవారు రాబోతున్న ప్రమాదాన్ని ఎదుర్కొడానికి సిద్దమయ్యారు.

ఆ కోయరాజు రాబోయే నరేంద్రుని సైన్యాన్ని ఎదుర్కోడానికి తాను రూపొందించిన ప్రత్యేకమైన వ్యూహం ప్రకారం తన ప్రజల్ని కొంతమందిని, శత్రుసైన్యం అడవుల్లోకి ప్రవేశించే మార్గం దగ్గర ఉన్న కొండ గుహలలో మాటు వేసి, శత్రుసైన్యం లోనికి రాగానే చేయవలిసిన పని చెప్పి, ఏమి జరిగినా సరే ధైర్యంగా పని పూర్తి చేయాలని చెప్పి, వారిని అక్కడికి పంపాడు. మిగిలిన వారిని దళాలు గా విభజించి, తన వ్యూహాన్ని వివరించాడు.

ఉత్తర, దక్షిణ దిక్కుల నుండి మార్తాండ స్నేహితులైన దళపతులు కూడా మార్తాండ వ్యూహం ప్రకారం శత్రువు సైన్యం రాక కోసం మాటు వేసి ఉన్నారు.

ఆ అడవిలో ఆణువణువూ తెలిసిన మెరుపులాంటి వేగం కలిగిన ఆ ఆదివాసి వీరులు ప్రాణాలకు తెగించి అయినా ఈ యుద్ధంలో ధర్మాన్ని గెలిపించాలని నిర్ణయించుకున్నారు.

***

కోయరాజు ఆదేశం ప్రకారం ఆ అడవుల్లోకి శత్రుసైన్యం ప్రవేశించే దారిలో ఉన్న కొండ గుహల్లో మాటువేసుకుని ఉన్న ఆదివాసులు, నరేంద్రుని సైన్యం లోపలికి వస్తూ ఉండగానే బాణాల వర్షం కురిపించేశారు.

కొండపైన ఉన్న మార్తాండ సైన్యం కింద ఉన్న నరేంద్రుని సైన్యంపై, తైలం కురిపించి, అగ్గి బాణాలు వేసేసారు. అలా ఆ నరేంద్రుని సైన్యం కొంత మంది అక్కడే చనిపోయారు.

వాళ్ళని వెంబడిస్తూ దాడి చేస్తూ ఉన్న వీరులు, ఆ నరేంద్రుని సైన్యం చేసే ప్రతిదాడికి సమాధానం చెబుతూనే వారి చివరి ఊపిరి వరకూ పోరాడి చాలా మందిని హతమార్చి, వారు కూడా వీరమరణం పొందారు.

నరేంద్రుని సైన్యం ఆ అడవిలో ముందుకు సాగింది. ఒక పది యోజనాలు వెళ్లారో లేదో ఒక్కొక్కరుగా గుర్రాలతో సహా ఊబిలోకి దిగబడిపోయి కొందరు, కర్రలు పాతిన గోతుల్లో పడి కొందరు మరణించారు. నరేంద్రుడు సైన్యానికి మధ్యగా ఉండడం వల్ల, వాడి చుట్టూ సైన్యం జాగరూకులై కాపాడడం వల్ల, ఆ నీచుడికి మాత్రం ఏమీ కాలేదు. వారందరు ఆ ఊబిని దాటుకుని ముందుకు వెళ్లారు. వారు ఇంకో యాభై యోజనాలు వెళ్లగా..

మార్తాండ వ్యూహం ప్రకారం ఉత్తర, దక్షిణ దిశల నుంచి ఆ నరేంద్రుని సైన్యానికి వెనకనుండి గొరిల్లా యుద్ధం చేసుకుంటూ మరికొందరు ఆదివాసులు, వారి సాంప్రదాయ ఆయుధాలైన విల్లంబులు, దంతాలు, వేట కత్తులు, కొడవళ్ళతో కర్కశంగా విరుచుకుపడ్డారు. వేల సంఖ్యలో ఉన్న నరేంద్రుని సైన్యంతో పదుల సంఖ్యలో ఉన్న మార్తాండుడి దళపతుల సైన్యం వీరోచితంగా పోరాడి, అసువులు బాసారు. అప్పటికే చాలా మంది వనం వీరులు వీర మరణం చెందారు. అయిదొందల మంది శత్రుసైన్యంతో వంద మంది సైన్యం కూడా లేని మార్తాండ తలపడనున్నాడు.

శత్రు సైన్యం, ఇంకా ఆ గూడేనికి రెండు యోజనాలు దూరంలోకి వచ్చేసరికి, ముందుగానే చెట్లపై మాటు వేసుకుని ఉన్న మార్తాండుడి సైన్యం బాణాలు సంధించారు. నరేంద్రుని సైన్యం కూడా ప్రతి దాడి చేస్తూ వారందరిని చంపేశారు. ఇక నరేంద్రుని సైన్యం మార్తాండుని వ్యూహాన్ని అంతా ఛేదించేశాం అనుకుంటూ గూడేనికి వెడుతూ ఉన్నారు. కానీ వారి రాజు నరేంద్రుని మనసులో మాత్రం భయం మొదలు అయింది. ఆ నీచుడి బుర్రలో కొత్త ఆలోచన తట్టింది.

"రెండు వేల మంది సైన్యంతో వచ్చిన నేను, ఐదువందల మంది సైన్యంతో మిగిలాను. మిగిలిన సైన్యంతో ముందుకు పోతున్నాను . కానీ, ఇప్పుడు కోపానికంటే, కుతంత్రమే సరి అయినది కదా!" అనుకుంటూ తన క్రూర స్వభావాన్ని అణుచుకొని, ఆలోచనలో మునిగాడు నరేంద్రుడు.

"ఇప్పుడు కావాల్సింది వాడి తల కాదు, నిధి! ఆ కోయరాజుని చంపేస్తే నిధి ఎక్కడ ఉందో తెలియదు. సైన్యాన్ని చూసి భయపడి నిధిని అప్పగించేస్తాడు అనుకున్న ఆ నరేంద్రునికి మార్తాండ యుద్ధ వ్యూహం చూసి ముచ్చెమటలు పట్టాయి.

"అయ్యారే! వీడి ప్రజలు తిరగబడితేనే నా సైన్యం సగానికి మించి ఎక్కువే పోయారు. అలాంటిది ఆ మార్తాండుడే దిగితే నేనైనా బ్రతుకుతానా? ప్రాణాలతో తిరిగి వెడతానా? ఇది నేను ఊహించని పరిణామం. ఇప్పుడు పట్టుకోవలిసింది జుట్టు కాదు. కాళ్ళు!" అనుకుంటూ ముందుకు సాగాడు నరేంద్రుడు సైన్యం పరిరక్షణలో.

అప్పుడే వారికి ఊహించని రీతిలో ఉగ్రరూపంతో ఎదురు నిలబడ్డాడు మార్తాండ. నరేంద్రుడు గుర్రం పై నుండి దిగి, మార్తాండ దగ్గరికి వెళ్లి,

"మిత్రమా. ఎందుకు మనకీ జగడం చెప్పు! నిధి ఎక్కడ ఉందొ చెప్పి, నన్ను శరణు కోరు. మిగిలి ఉన్న ఈ ప్రజల్ని అయినా కాపాడుకో..ఢిల్లీ సుల్తాను మంచివాడు కానే కాదు. ఈ నిధి తెమ్మని ఆయనే పంపాడు. నేను నిమిత్త మాత్రుడను. మర్చిపోయావా.. నిధిని నీకు అప్పగించే రోజు నేను ఉన్నాను. మన స్వర్గస్తుడైన మహారాజు నన్నే నమ్మేవారు. ఆయన మరణం నన్ను ఇలా సామంతుడిగా మార్చేసింది. మనము ఒకరికొకరం సహాయం చేసుకుందాం. నిధిని నాకు అప్పగించు, నీ గూడెం ప్రజల్ని, నల్లమలలోని అన్ని వర్గాల కోయ దళపతుల్ని, మేడారం కోయ రాజుల్ని. స్వాతంత్రులని చేసేస్తాము. నిధిని మాకు అప్పగించేసేయ్. ఇక మనకి విరోధం వద్దు!" అంటూ మార్థండను నమ్మించే ప్రయత్నం చేసాడు.

అందుకు బదులుగా "ఉంగిలియే.. ఐనా కీర్చు.. ద్రోహి..తూ! నీ బ్రతుకు.. ఓరి ద్రోహి! రాజద్రోహి! నా పానం పోయినా గాని నీ పానం తీసే బోతా! తెలియదనుకుంటివా? నువ్ జేసిన ద్రోహం నే ఎరుగననుకుంటివా? ఆ మహారాజు నిన్నే గదరా నమ్మేటోడు! అన్నం పెట్టిన చేతినే నరికేటోడా! నిన్నేలరా బ్రతకనిచ్చేది? ఇదే నా ఆన! నీ పానం తీసి నా మారాజుకి ఇచ్చిన మాట తీరుస్తా " అంటూ నరేంద్రుని పై దాడి చేయబోయాడు.

అంతే! ఆ నీచుడి సైన్యం నరేంద్రుడిని తప్పించి, మార్తాండపై బాణాలు వేయసాగారు. ఆ కోయ ప్రజలు కూడా తమ రాజుకి రక్షణగా నిలిచి యుద్ధం మొదలు పెట్టారు. అయిదు వందల మంది నరేంద్రుని సైన్యం వేసే బాణాలకు ధీటుగా సమాధానం చెబుతూనే ఆ కోయ ప్రజలు మరణిస్తూ ఉన్నారు.

రామాయణంలో రాముడు, శూర్పణఖ తీసుకువచ్చిన పద్నాలుగు వేల మంది రాక్షసులను హతమార్చిన రీతిలో మార్తాండ గుండ్రంగా తిరుగుతూ బాణాలు సంధిస్తూనే ఉన్నాడు.

ఎలాగైతే రామచంద్రమూర్తి, తాను గాయపడుతూనే ఆ రాక్షసులను మట్టి కరిపించాడో అదే విధంగా మార్తాండ కూడా తనకి గాయాలు అవుతున్నా పట్టించుకోకుండా, వళ్ళంతా బాణాలతో రక్తం కారుతున్నా తన మిత్రుని మరణానికి బదులు కోరుకుంటూ.. ఐదు వందల మంది సైన్యాన్ని మట్టి కరిపించాడు.

ఇక అప్పటి వరకు సైన్యం మాటున నక్కి, ప్రాణాలు కాపాడుకున్న ఆ నరేంద్రుని బయటకు లాగి, చిత్రవధ చేసి, హింసించి, హింసించి అతని గుండెల్లో గునపం దింపేసాడు మార్తాండ!

"మిత్రమా! నీ చావుకి బదులు తీర్చుకున్నాను. కానీ నా ఊపిరి కూడా ఆగిపోతోంది. నిధిని నీ రాజ్యానికి చేర్చినా, ఆ నీచుల పాలు అవుతుంది . నువ్వే తిరిగి రావాలి. నువ్వొచ్చే నాడే నేనొస్తా! మళ్ళీ పుట్టొస్తా" అంటూ కుప్పకూలిపోబోతున్న మార్తాండను పొదివి పట్టుకుంది మరియా.

"మామ.. మామ..ఉన్ పానం.. నిల కుండా.. మామా! మామా! ఉన్ కురియా!” (మామా . మామా. నేను వచ్చేస్తా. నేను సచ్చిపోతా!)" అంటూ మరియా మార్థండ పై పడి ఏడుస్తోంది.

"ఉఫియే.. కింగలిచ్చు.. ఐనా. పుట్టి్యోవ్హ్. హ కెజిఫ్. సఫుజీవ్.. గుజగ్బక్, ఊహజకజేన్ క్కలజూహబ్ కాల్కమ్.

(మళ్ళీ పుడతా. నే నిధి కోసం తిరిగి వస్తా! నీ శక్తులతో నిధి కి కాపలా ఉంటాను అని మాట ఇవ్వు మరియా. ఇప్పుడు మన రాజ్యం ఆ నీచుల చేతిలోకి వెళ్ళిపోయింది. నిధి ఇప్పుడు బయటకు రాకూడదు. మన మహారాజు ఆశయం ఈ దేశ భవిష్యత్తు! తిరిగి వస్తాం. దేశం కోసం మళ్ళీ పుడతా! అంతవరకు నీలగిరి కొండ గుహలలో సొరంగ మార్గాన దాచి ఉంచిన నిధిని నీవు కావలి కాయాలి. మాటివ్వు మరియా!" అంటూ కన్నుమూశాడు ఆ యోధుడు.

“మామ.. మామా!” అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తున్న మరియాకి మాత్రమే ఇప్పుడు ఆ నిధి రహస్యం తెలుసు.

మార్తాండ మరియాకు చెప్పిన మాటలు కొన ఊపిరితో ఉండగా విన్న నరేంద్రుడు తనకి ఆ కోయ భాష వచ్చు కనుక వాళ్లు మాట్లాడుకున్న మాటల్లో దాగి ఉన్న నిధి రహస్యం, తన పెంపుడు పావురంతో ఎవరికో వర్తమానం పంపాడు. అది గమనించిన మరియా ఆ నిధి రహస్యం తెలియకూడదు అని ఆ పావురాన్ని పట్టుకోవడానికి పరిగెడుతుండగా అక్కడే ఉన్న బల్లెముతో మరియా కడుపులో పొడిచి, తను చనిపోయాడు నరేంద్రుడు.

చనిపోతూ చనిపోతూ ఆ నీచుడు నరేంద్రుడిని శపించింది మరియా.

"ఓ దుష్ఠుడా! నమ్మకద్రోహీ! నేను చనిపోయినా ఆత్మనై నిధికి రక్షణగా నిలిచెదను. నీవునూ నా వలె ఆత్మవై సంచరించెదవు గాక! నీ ఆత్మకి విముక్తి కలగాలంటే నా నాధుని మరు జన్మములో అతని చేతిలోనే..ఇది ఆ ఇష్టకామేశ్వరి అమ్మవారిపై ఆన !" అంటూ మరణించింది మరియా.

పచ్చని ఆ అరణ్యం నెత్తుటి రంగు పులుముకుని, వైతరణి నదిలా ప్రవహిస్తూ ఆదిమ వాసుల స్వామి భక్తికి, ఎనలేని తెగువకు, నమ్మకద్రోహి దురాశకు , మధ్య జరిగిన యుద్దానికి సాక్షిగా నిలుస్తూ అమరులైన ఆ అడవి బిడ్డలకి కన్న తల్లి లాంటి ఆ వనదేవత పెడుతున్న కన్నీరే అరణ్య రోదనగా నిలిచిపోయింది.

***సశేషం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.




రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య

నేనొక గృహిణిని

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు


35 views0 comments

Comments


bottom of page