top of page

నల్లమల నిధి రహస్యం పార్ట్ - 22


'Nallamala Nidhi Rahasyam Part - 22' written by Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

అజయ్ ముందుగానే తన టీం ని అలెర్ట్ చేయడంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు, అజయ్ ని, పిల్లల్ని హాస్పిటల్ కి తరలించారు.

సింగా ని, వాడి అనుచరుల్ని కూడా వాళ్ల పరిస్థితి చూసి, హాస్పిటల్ కే తీసుకెళ్లారు. ఆ గంజాయిని అంతా స్వాధీనం చేసుకున్నారు.

అజయ్ తలకి గాయం అవడంతో తలకి కట్టు కట్టారు. ఒక గంట తరువాత స్పృహ వచ్చింది అజయ్ కి. ఒక్కసారిగా పైకి లేవబోతుంటే నర్స్ వచ్చి "రెస్ట్ తీసుకోండి సార్!" అంటూ అజయ్ ని ఆపింది.

"అది కాదు సిస్టర్! నేను ఇక్కడికి ఎలా వచ్చాను? పిల్లలు.." అంటూ ఏదో మాట్లాడబోతుంటే

కానిస్టేబుల్ వచ్చి, "అందరూ సేఫ్ సార్! మీరిచ్చిన ఇన్ఫర్మేషన్ తో మేమంతా వచ్చేసాం సార్!" అంటూ ఉండగానే "మరి ఆ సింగా గాడు?" అన్నాడు అజయ్ వాడు ఎక్కడ తప్పించుకుపోయాడో అన్న కోపంతో.

"వాడా సార్! మీరు కొట్టిన దెబ్బలకి, అడుగు కూడా వేయలేని పొజిషన్లో పడి ఉన్నాడు సార్, వాడే కాదు. వాడి మనుషులు కూడా కదల్లేని పరిస్థితుల్లో పడి ఉన్నారు సార్.. మేము వచ్చేసరికి!" అన్నాడు ఆ కానిస్టేబుల్.

అజయ్ కి ఒక నిమిషం ఏమీ అర్థం కాలేదు. ‘అదేంటి..? నేను పడిపోయే టైంకి వాళ్లంతా బాగానే ఉన్నారుగా..’ మనసులో అనుకుంటూనే "మొత్తానికి పిల్లలు సేఫ్ కదా" అంటూ పిల్లల్ని చూడ్డానికి వెళ్లాడు .

పిల్లలందరూ కోలుకున్నారు. వాళ్ల పేరెంట్స్ అందరికీ సమాచారం అందడంతో అందరూ పరుగున హాస్పిటల్ కి వచ్చి, వాళ్ళ పిల్లల్ని తీసుకుని, సంతోషంతో అజయ్ ని దీవించారు.

మీరు చల్లగా ఉండాలి బాబు! అంటూ ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు అజయ్ ని ఆశీర్వదించి, వాళ్ళ వాళ్ళ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారు. అజయ్ మిగిలిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని, ఇంటికి బయలుదేరాడు.

***

అప్పటికే రాత్రి 11 అయిపోయింది. కొడుకు ఇంకా ఇంటికి రాలేదు అని కంగారుపడుతూ ఎదురుచూస్తోంది సీత. ఈలోగా సంజయ్ ఫోన్ చేసాడు ఆమెకు.

"అమ్మా! ఎలా ఉన్నావ్? అన్నయ్య ఎలా ఉన్నాడు?" అంటూ సంజయ్ అడుగుతూ ఉండగానే

"ఏమోరా చిన్నోడా! అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదు. వాడికి ఫోన్ చేస్తుంటే ‘స్విచ్ ఆఫ్’ అని వస్తోంది. నాకు చాలా కంగారుగా ఉంది. వాతావరణం కూడా బాగోలేదు" అంటూ సీత చెప్తూ ఉండగానే జీప్ వచ్చి ఆగింది.

"ఒరేయ్! అన్నయ్య వచ్చినట్లు ఉన్నాడు" అంటూ తలుపుతీసి చూసింది సీత.

తలకి కట్టుతో వస్తున్న అజయ్ ని చూసి," ఏమైంది నాన్నా?" అంటూ తన చేతిలోని ఫోన్ కింద పడేసి పరుగున వెళ్లి, కొడుకును పట్టుకుంది సీత.

తల్లి మాటలో ఏదో కంగారు, ఫోన్ పడిపోయి స్విచ్ ఆఫ్ అవడంతో సంజయ్ చాలా కంగారు పడిపోయి మళ్ళీ మళ్ళీ ఫోన్ ట్రై చేస్తూ ఉన్నాడు సీత కీ, అజయ్ కీ. కానీ ఇద్దరి ఫోన్ లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఏమి చేయాలో తెలియక కంగారు పడిపోతున్నాడు సంజయ్.

తనని పట్టుకుని ఏడుస్తున్న తల్లితో "ఏమీ కాలేదమ్మా! చూడు.. నేను బాగానే ఉన్నాను. అంటూ అజయ్ చెప్తూనే ఉన్నాడు. కానీ సీత అజయ్ కి అయిన గాయం చూసి, భయపడి ఏడుస్తోంది. తల్లి మనసు కదా మరి!

"అమ్మా! నే బానే ఉన్నా.. ఏడవకు." అంటూ తల్లిని పట్టుకుని, ఇంట్లోకి వెళ్లి కూర్చున్నాడు అజయ్.

సీత మంచినీళ్లు తేవడానికి వెళ్ళింది.

అక్కడే గుమ్మం దగ్గర పడి ఉన్న సీత ఫోన్ తీసుకుని, స్విచ్ ఆన్ చేసాడు.

ఒక్క నిముషంలో సీత ఫోన్ రింగ్ అయింది.

సంజయ్ నుండి కాల్ వస్తోంది.

లిఫ్ట్ చేసాడు అజయ్.

"హలో.. అమ్మా! ఏమయింది? ఎందుకు నువ్వు ‘ఏమైంది నాన్నా?’ అని అరిచావ్? అన్నయ్య.. అన్నయ్యకి ఏమీ అవ్వలేదు కదా.." అంటూ కంగారు పడిపోయి అవతల మాట్లాడుతున్నది ఎవరో కూడా తెలుసుకోకుండా అడిగేస్తున్నాడు సంజయ్.

"ఒరేయ్! నేనే రా. అమ్మ కాదు. మాట్లాడే గ్యాప్ ఇవ్వకుండా ఏంటి ఆ కంగారు! ఇలా తయారయ్యావేంటిరా? నేను బాగానే ఉన్నాను. తలకి చిన్న గాయం అయింది. అది చూసి అమ్మ భయపడిపోయింది" అంటూ అజయ్ చెప్పాడు.

"రేయ్! అన్నయ్య.. ఒక్క నిమషం గుండె ఆగిపోయిందిరా! నువ్వు బాగున్నావ్ కదా! నాకంతే చాలు. ఇంతకీ ఆ గాయం ఎలా అయింది?" అన్నాడు సంజయ్.

"ఏమి లేదురా! చిన్న ఆక్సిడెంట్.. అంతే! రెండు రోజుల్లో తగ్గిపోతుంది కానీ, నువ్వు ఎల్లుండా బయలుదేరేది?" అడిగాడు అజయ్.

"కాదురా!ప్లాన్ మారింది. నేను రేపు బయలుదేరుతున్నా. మా కాలేజీ వాళ్ళు టూ డేస్ లో వస్తారు." అన్నాడు సంజయ్.

"అదేంటిరా?మరి లీవ్ ఇస్తాడా మీ ప్రిన్సిపాల్?" అన్నాడు అజయ్.

‘లీవ్ ఇవ్వకపోతే జాబ్ మానేస్తా’ మనసులో అనుకుని

"ఇచ్చాడు రా. మన ఇంటి ఓనర్ ఆంటీ శ్రీశైలం దర్శనానికి వస్తున్నారు. ‘మేము ఇద్దరం ఆడవాళ్ళమే కదా! నువ్వెలాగో శ్రీశైలం వెళ్లే పని ఉంది అన్నావ్ కదా. మాతో వస్తావా? మా కారులో వెళ్దాం. అంజలి కొంత దూరం నువ్వు కొంత దూరం డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోవచ్చు’ అని అడిగింది ఆంటీ" అని చెప్పాడు సంజయ్.

"ఓకేరా. జాగ్రత్తగా రండి. స్లో గా డ్రైవ్ చెయ్. ఓకే నా?" అని ఒక అన్నగా తమ్ముడి క్షేమం కోరి చెప్పాడు.

"సరే అన్నయ్య! ఉంటా మరి" అని కట్ చేసాడు సంజయ్.

సీత అజయ్ కి అన్నం తినిపిస్తూ " అసలు ఈ దెబ్బ ఎలా తగిలింది నాన్నా? "అని అడిగింది.

అదే అమ్మా! ఈ ఊర్లో పిల్లల్ని ఎత్తుకెళ్లి, అడవిలో గుహలో పెట్టి, గంజాయి తయారు చేసే పనిలో పెట్టి, ఆ చిన్నపిల్లలతో వెట్టి చాకిరీ చేయిస్తున్న సింగా ని, వాడి మనుషుల్ని పట్టుకుని, పిల్లల్ని విడిపించాను. ఆ జగడం లో నాకూ దెబ్బ తగిలింది. పిల్లలు సేఫ్ అమ్మా." అంటూ సంతోషంగా చెప్పాడు అజయ్.

సింగా అనే పేరు వినగానే సీత కళ్ళు ఎరుపెక్కాయి. కానీ అజయ్ పరిస్థితి చూసి, ఇప్పుడు ఏమీ చెప్పకూడదు అనుకుని ఊరుకుంది.

అజయ్ భోజనం చేసి, మందులు వేసుకుని తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు.

సీతకి మాత్రం నిద్రపట్టట్లేదు. "నా కొడుకు చుట్టూ ఏం జరుగుతోంది? చరిత్ర పునరావృతం అవుతోంది. విధి మళ్ళీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఆ సింగాతో వీడికి విరోధం ఏంటి? భగవంతుడా? వీడికి ఏమీ కాకుండా చూడు తండ్రి!" అంటూ ఆ తల్లి మనసు మౌనంగా రోదిస్తోంది.

ఆ తల్లి బాధ తాను చూడలేను అనుకుందో ఏమో నిద్రాదేవి ఆమె రెప్పలను తాకి, మత్తుగా జోకొట్టింది.

చంద్రుడు మబ్బుల మాటున దాగుడుమూతలు ఆడుతూ. నక్షత్రాలతో నిశీధి నింగి వెలిగిపోతున్న వేళ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. చల్లగా వీస్తోంది.

ఆ గాలి వేగానికి, అజయ్ గది కిటికీ తలుపులు తెరుచుకున్నాయి. ఆ గాలి తనని తాకుతూ ఉంటే. ఇంకా మత్తుగా నిద్రపడుతోంది అజయ్ కి. ఆ గాలిలో మల్లెల పరిమళం విరబూస్తోంది.

చందమామే నింగి నుండి. మబ్బుల నిచ్చెన వేసుకుని దిగిందా అన్నంత అందంగా పసిడి కాంతులతో వెలిగిపోతూ. వెన్నెల కురిపించే కలువల్లాంటి కళ్ళతో, తన ప్రియుణ్ణే చూస్తూ, అతని తలపై ప్రేమగా నిమురుతోంది మరియా.

గాఢ నిద్రలో ఉన్న అజయ్ ఒక రకమైన ట్రాన్స్ లోకి జారుకుంటున్నాడు. అతని కళ్ళకి మసక, మసకగా తానొక కోయరాజులా కనిపిస్తున్నాడు. పూర్తిగా అక్కడ కనిపిస్తున్న ఆ రూపం తనను తానే కోయరాజు మార్తండగా గుర్తు తెస్తోంది. లీలగా. ఒక్కొక్కటిగా. తన గత జన్మ జ్ఞాపకాల్లోకి జారుకుంటున్న అతని కళ్ళు ఒక వెన్నెల బొమ్మను చూస్తున్నాయి.

***

రేపు తను తన సంజయ్ తో కలిసి శ్రీశైలం వెళ్తున్నాను అన్న ఆనందంలో నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతోంది అంజలి. తల్లి నిద్రపోతే కాసేపు సంజయ్ తో మాట్లాడాలి అని ఎదురుచూస్తోంది తను. గదిలోకి వెళ్లి, ఆమె పడుకుంది అని నిర్ధారించుకుని సంజయ్ కి ఫోన్ చేసింది. ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకుంటూ ఉండిపోయారు.

అంతసేపు సంజయ్ తన అన్నకు పొంచి ఉన్న ప్రమాదం గురించి, సిద్ధాంతి గారు చెప్పిన విషయాల గురించి అంజలి కి చెప్పి, ఎంతో బాధపడ్డాడు. తను చెప్పగలిగే ధైర్యం చెప్పి, సంజయ్ ని ఓదార్చింది అంజలి. అప్పటికే చాలా రాత్రి అవ్వడంతో సంజయ్ తో మాట్లాడుతూ.. మాట్లాడుతూ.. నిదురలోకి జారుకుంది అంజలి.

"పిచ్చి పిల్ల!మాట్లాడుతూనే పడుకున్నట్టుంది" అనుకుని సంజయ్ ఫోన్ కట్ చేసి పడుకున్నాడు.

నిద్రలోకి జారుకున్న అంజలికి ఒక కల వస్తోంది. ఆ కలలో ఒక ముష్టివాడు కనిపిస్తున్నాడు. అతను అంజలికి ఏదో చెబుతున్నాడు. అదేమీ అంజలికి అర్ధం కావడం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం అంజలికి స్పష్టంగా వినిపిస్తోంది, అర్ధం అవుతోంది.

అదేంటి అంటే..(😝 రేపు చెపుతాను )

***సశేషం***


రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య

నేనొక గృహిణిని

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు25 views0 comments

Comments


bottom of page