top of page

నల్లమల నిధి రహస్యం పార్ట్ - 19


'Nallamala Nidhi Rahasyam Part - 19' written by Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

ఊహించని విధంగా అజయ్ ఎదురు తిరగడంతో అవమానంతో రగిలిపోతూ "నీ అంతు చూస్తా! " అంటూ అరుస్తూ వెళ్ళిపోయాడు సింగా.

అది అంతా బయటనుండి చూసిన ఒక తల్లి మాత్రం పరుగున వచ్చి, అజయ్ కాళ్ల మీద పడి "నా కొడుకుని ఆ రాక్షసుడి నుండి కాపాడండి సార్! " అంటూ ఏడుస్తోంది.

"లేవండి! ఎవరమ్మా మీరు ? మీ కొడుక్కి ఏమైంది? " అంటూ ఆమెను పైకి లేపాడు అజయ్.

ఆమె ఏదో చెప్పబోయే లోగా ఇంకో ముగ్గురి తల్లిదండ్రులు కూడా వచ్చి, చేతులు జోడించి అజయ్ ముందు దీనంగా నిలబడి ఉన్నారు.

"అయ్యా! మా అబ్బాయి నాలుగు నెలల క్రితం కిడ్నాప్ అయ్యాడు. నా కొడుకులాగే ఇంకో ముగ్గురు పిల్లలు కూడా కిడ్నాప్ అయ్యారు. కానీ వాళ్ళని 'ఈ సింగానే ఎత్తుకెళ్లాడు' అని అందరికీ తెలుసు. కానీ వాడికి భయపడి మీ పోలీసులు కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. పిల్లల్ని ఎత్తుకెళ్లే బ్యాచ్ వీడి మనుషులే. వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లి, ఏం చేస్తున్నారో తెలియదు. నాలాగే, పిల్లలను దూరం చేసుకున్న ఈ తల్లిదండ్రులు కూడా, నాలుగు నెలలుగా ఈ స్టేషన్ చుట్టూ, తిరిగి తిరిగి అలిసిపోయారు. ఎవరూ మా బాధ పట్టించుకోలేదు. మీరైనా మా పిల్లల్ని కనిపెట్టి, మాకు అప్పగించడయ్యా! " అంటూ ఆమె, ఆమె వెనకే వచ్చిన వారు అజయ్ ముందు మోకరిల్లారు.

అజయ్ వాళ్లకి నచ్చచెప్పి, ‘మీ పిల్లల్ని ఎలాగైనా వెతికి మీ దగ్గరకి చేరుస్తాను . ఆ సింగా ఆట కట్టిస్తాను’ అని వారికి మాట ఇచ్చి పంపాడు.

అక్కడ ఉన్న ఒక కానిస్టేబుల్ అజయ్ కి ఆ కిడ్నాప్ అయిన పిల్లల వివరాలు అందిస్తూ. "సార్! ఆ సింగా చాలా చెడ్డవాడు సార్. వాడికి భయపడి ముందు ఉన్న ఎస్. ఐ వాడి దగ్గర లంచం పుచ్చుకుని, కేసు ముందుకు పోనివ్వలేదు సార్. పాపం మీరైనా సరైన దారిలో వాళ్ళకి న్యాయం చేయండి సార్. మీరు ఎలా చెప్తే మేము అది చేయడానికి సిద్ధం సార్." అన్నాడు.

"ఇప్పుడు మనము తొందరపడకూడదు. పిల్లలు వాడి దగ్గరే ఉన్నారు అని ఆమె అంటోంది. మనము తొందరపడితే ఆ పిల్లల్ని వాడు ఏమైనా చేయొచ్చు.

మనము ఒక ప్లాన్ ప్రకారం వాడ్ని ఫాలో అయ్యి, వాడి కథ ముగించాలి " అని తన ప్లాన్ అమలుపరచడం మొదలుపెట్టాడు.

***

సంజయ్ వెళ్ళిపోగానే సిద్ధాంతి గారు ధ్యానంలొ ఉండగా ఆయన చాలా అలజడికి గురి అయ్యాడు.

"ఒక ప్రాణం, ఒక ద్రోహం , ఒక శాపం..

ఒక ఆశయం, ఒక వాగ్దానం, ఒక నిరీక్షణ..

ఇది పరిష్కారం లేని సమస్యనా? కాదు. నీ పరిశోధన సరి అయిన దిశగా నడిపించు! సమాధానం నువ్వే అవుతావు " అంటూ ఆయనకు జగన్మాత మాటలు వినిపించాయి.

కళ్ళు తెరిచి చూసేసరికి అయన శిష్యులంతా ఆయన చుట్టూ చేరి ఉన్నారు.

ఆయన కళ్ళలో ఒక కొత్త వెలుగు. సమస్యకు పరిష్కారం దొరికే దిశగా ఆయన చేసిన తొలి ప్రయత్నం ముందుకు సాగే దిశగా ఆయన అడుగులు పడుతున్నాయి.

***

సంజయ్.ఇంటికి చేరే సరికి, టైం చూస్తే 12 అయింది.

ఆఫ్టర్నూన్ క్లాసెస్ రెండు గంటలకు కావడంతో మళ్ళీ ఫ్రెష్ అయి, కరెంట్ కుక్కర్ లొ రైస్ పెట్టుకుని, బాల్కనీలోకి వెళ్లి తన కొలీగ్ తో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు.

తన వెనకనే అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి, సంజయ్ కళ్ళు మూసింది అంజలి.

"హ్మ్మ్! వచ్చేసావా అంజలీ! "అంటూ ఆమె చేతులు పట్టుకుని ఆమె వైపు తిరిగి, నెత్తి మీద ఒక మొట్టికాయ వేసాడు సంజయ్.

"మీ మామ్ లేరుగా! కాలేజీకి వెళ్లకుండా ఇంట్లో ఏం చేస్తున్నావ్?" అంది అంజలి.

"వెళ్తా ఆఫ్టర్నూన్. కానీ నువ్వేంటి ఇలా వచ్చేసావ్? కింద మీ అమ్మ చూస్తే మన విషయం తెలిసిపోతుంది" అంటూ ఉంటే

"ఏం పర్లేదు. పెళ్లి చేసేస్తారు. ఒక పని అయిపోతుంది " అంటూ నవ్వింది అంజలి.

ఆ నవ్వుకి బాబు మనసు కొంచెం తేలిక పడింది.

"నువ్వేమీ కంగారు పడక్కర్లేదు. ‘పాపం పిల్లాడు ఒక్కడే ఉన్నాడు, ఏం వండుకుంటాడు’ అని అమ్మే కర్రీ ఇచ్చి రమ్మని పంపింది" అంటూ తను తెచ్చిన కూర గిన్నె టేబుల్ పై పెట్టి, సంజయ్ కి దగ్గరగా వచ్చి, అతని జుట్టు అంతా చేరిపేసి, ఆమెను పట్టుకోవడానికి వస్తున్న సంజయ్ ని తోసేసి, నవ్వుకుంటూ కిందకి వెళ్ళిపోయింది.

***

లంచ్ టైం అవడంతో ఇంటికి వచ్చాడు అజయ్. అతను వచ్చేసరికి, మల్లి ఆరుబయట నవ్వుకుంటూ ఆడుకుంటోంది. ఆ పాపను చూసేసరికి అజయ్ కి చాలా ముచ్చటగా అనిపించి, ఎత్తుకుని ఆడిస్తూ, ‘నీ పేరేంటి?’ అని అడిగాడు.

సీత అప్పుడే బయటకొచ్చింది. పాప ని ఎత్తుకుని ఉన్న అజయ్ ని చూస్తూ. "వీడికి పెళ్లి చేసి ఉంటే. ఈ పాటికి ఇంత పిల్ల ఉండేదేమో! ఎన్ని సంబంధాలు చూసినా వీడికి నచ్చట్లేదు. అసలు వీడి కోసం పుట్టిన పిల్ల ఎక్కడ ఉందొ? " అనుకున్నది.

సీత అలా అనుకుంటూ ఉండగా మరియా ఆత్మ తన ప్రియుని రాక తెలుసుకుని ఉప్పొంగిపోతోంది.

“నిను చూసే క్షణం కోసం జన్మలు వేచి ఉన్నా..

బాసలు చెరిగిపోయినా,

కలలు కల్లలు అయినా,

కలువకన్నులు కాలి పోయినా,

చంద్రోదయం కోసం వేచి ఉన్నా..

ఊపిరి ఆగే క్షణమే నీలో కలిసిపోయే వరం కోరా..

అది తీరదు అని తెలిసినా ఆత్మనై మిగిలి ఉన్నా..

ఇచ్చిన మాట కోసం నీవు.. ప్రేమించిన నీకోసం నేను..

నీ రాక నాకు తెలిసినా నువ్వు నన్ను చేరే క్షణం ఆత్మనని తెలిసి నన్ను ఈసడించుకోవు కదా ప్రాణమా!" అనుకుంటూ ఘోషిస్తు, తమ గత జన్మ ప్రణయాన్ని గుర్తుచేస్తూ అజయ్ కి ప్రేమ సందేశం పంపింది మరియా ఆత్మ.

అప్పటివరకు నవ్వుతూ పిల్లని ఆడిస్తున్న అజయ్ కి ఒక్కసారిగా మనసంతా ఒక విధమైన భారంతో నిండిపోయింది. తనను ఎవరో పిలుస్తున్నట్టు, తన కోసం ఎవరో ఎదురు చూస్తున్నట్టు అనిపించింది. ఒక్కసారిగా వాతావరణంలో ఏదో మార్పు మొదలైంది. గాలిలో ఏదో పరిమళం అజయ్ మనసుకు ప్రశాంతత చేకూరుస్తోంది.

ఇంతలొ మల్లి, అజయ్ ని "అంకుల్! అటు చూడు.." అంటూ ఆకాశం వైపు చూపించింది.

ఆకాశం వైపు చూసిన అజయ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అక్కడ..

***సశేషం***


రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య

నేనొక గృహిణిని

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు


18 views0 comments

Comments


bottom of page