'Nallamala Nidhi Rahasyam Part - 20' written by Ramya Namuduri
రచన : రమ్య నముడూరి
ఆకాశం వైపు చూసిన అజయ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.
అక్కడ నీలి ఆకాశంలో తెల్లని మేఘాలు ఒకరినొకరు గాఢంగా కౌగిలించుకున్న కోయ జంట ఆకృతిలో కనిపించాయి.అది చూస్తూనే అజయ్ కళ్ళు ఆశ్చర్యంతో కూడిన ఉద్వేగంతో ఎర్రని రంగు సంతరించుకున్నాయి. ఒక్కసారిగా తనకి తన గత జన్మ తాలూకు జ్ఞాపకాలు ఒక వేవ్ లాగా కనిపిస్తూ ఉండగా..
ఆ మేఘాల మాటుగా మెరుస్తున్న సూర్యుని కిరణాలు నేరుగా ఎరుపెక్కిన అజయ్ కళ్ళను పొడిచాయి. ఆ కాంతిని చూడలేక కళ్ళు మూసుకున్న అతని రెప్పల నుండి జాలువారిన అశ్రువులు భూమిపై పడీపడగానే ఒక్కసారిగా భీకరమైన గాలి మొదలైంది. అంతవరకు ఎంతో ప్రశాంతంగా వీచిన గాలి ఒక్కసారిగా వేడెక్కింది. ఆ తెల్లని మేఘాలను తరిమేస్తూ ప్రేమ సందేశాన్ని ఛిద్రం చేస్తూ సూర్యుడిని మింగేసేలా నల్లని మేఘాలు గర్జిస్తూ ఆకాశాన్ని ఆవరించాయి.
" బాబూ అజయ్! వర్షం పడేలా ఉంది, పిల్ల తడిసిపోతుంది. లోపలికి రారా" అన్న సీత అరుపుతో ఈ లోకంలోకి వచ్చాడు. మల్లిని తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు.
కమల వచ్చి మల్లిని తీసుకుంది. సీత అజయ్ ని కమలకీ పరిచయం చేసింది.
ఆమెను పలకరిస్తున్నాడే కానీ అజయ్ మనసు ఆ మేఘాల మీదే ఉండిపోయింది. ఏదో గుర్తొచ్చి.. గుర్తు రానట్టు, లీలగా తెలిసి.. తెలియనట్టుగా మెదడు అంతా మొద్దుబారిపోయింది. వాతావరణం కూడా భీకరంగా మారిపోయి, కుండపోతగా వర్షం మొదలైంది. ఉన్నపళంగా మారిపోయిన వాతావరణం అజయ్ మనసులో గందరగోళం సృష్టిస్తోంది.
స్టేషన్ లొ ఉన్న సమస్యలతో పోరాడుతున్న అతన్ని ఆ తెల్లని మబ్బులు సేద తీర్చేలోగా నల్లని నీడలా.. మృత్యు దరహాసంలా.. సూర్యుడ్ని మింగేసి కుండపోత వర్షాన్ని కురిపిస్తున్న ఆ నల్లని మబ్బులు తనపై కక్ష కట్టినట్టు అనిపించింది అజయ్ కి .
"అయ్యారే! నీకోసం మేఘాలతో ప్రేమ సందేశం పంపినదా ఆ కోయ సుందరి ఆత్మ! పిచ్చిది. చచ్చినా నువ్వు పుట్టొస్తావని నిధికి కాపలా కాస్తోంది. నేనూ కావలి కాస్తున్నా! కోరిన సిరిని కైవసం చేసుకునే క్షణంలో నా ఊపిరి తీసిన నిన్ను చంపి నా పగ తీర్చుకుని, అప్పుడు నా ఇన్నేళ్ల తీరని కోరిక తీర్చుకుంటా! " అంటూ వికృతంగా నవ్వుతోంది ఒక దుష్ట ఆత్మ.
“బాబూ ! భోజనం చెయ్” అంటూ ప్లేట్ అందించింది సీత.
"నేను మళ్ళీ వస్తా!" అంటూ కమల, మల్లిని తీసుకుని వెళ్లిపోతూ ఉంటే.
"నేను అంకుల్ దగ్గర ఉంటాను! " అంటూ వచ్చీరాని మాటలతో ముద్దుగా అడిగింది మల్లి.
"పోనిలే! ఉండనియ్యమ్మా. మా వాడితో కలిసి అన్నం తింటుంది. నువ్వు వెళ్లి మిగతా పని అంతా చూసుకుని రా. ఇక్కడే ఉంటుందిలే" అంటూ కమలను పంపించేసింది సీత.
ముద్దు ముద్దుగా మాట్లాడుతూన్న మల్లిని చూసి, అజయ్ కి కొంచెం రిలీఫ్ గా అనిపించింది.
"మామ..మామ.." అంటూ అజయ్ తో కలిసిపోయింది మల్లి.
అలా మల్లిని చూస్తూ. ఆ పాపతో కలసి అన్నం తినేసి, మళ్ళీ స్టేషన్ కి జీప్ లొ బయలుదేరాడు అజయ్.
***
ధ్యానం నుండి కళ్ళు తెరిచిన సిద్ధాంతి గారి కళ్ళలో ఒక కొత్త వెలుగు! సమస్యకు పరిష్కారం దొరికే దిశగా ఆయన చేసిన తొలి ప్రయత్నం ముందుకు సాగే దిశగా ఆయన అడుగులు పడుతున్నాయి.
సంజయ్ తనను తాను ప్రతాప రుద్రునిగా నమ్మి, ఉద్వేగానికి లోనైన క్షణంలో తను సేకరించిన వెంట్రుకను ఉంచిన మట్టికుండ వైపుగా ఆయన నడుస్తున్నాడు. ఒక ప్రత్యేకమైన క్రతువును చేసేందుకు గాను ఏర్పాట్లు చేయాల్సిందిగా శిష్యులను ఆదేశించి. ఆ జగన్మాతను ప్రార్ధించి, ఆయన అందుకు సిద్ధం అవుతున్నారు. సమస్య ఎక్కడ మొదలు అయిందో అక్కడే దాని అంతం కూడా ఉంటుంది. అందుకే ఆ సమస్య మొదలైన చోటుకి మనోవేగంతో పయనమై ఆ సమస్య అంతం తెలుసుకుని వచ్చే ప్రయత్నంలొ తానే ఒక సమిధ కాబోతున్నారు ఆయన!
***
కిడ్నాప్ అయిన పిల్లల్ని పట్టుకునేందుకు అజయ్ వేసిన ప్లాన్ లొ భాగంగా అతని టీం సింగా మనుషుల్ని మారువేషాలతో ఫాలో అవుతున్నారు. సింగా ఇంటికి దూరంగా కొంత మంది అతనికి అనుమానం రాకుండా ముష్టి వాళ్ళలా మారి, పగలు, రాత్రి రిక్కీ చేస్తున్నారు.
అదే రోజు సాయంత్రం కొద్ది కొద్దిగా చీకట్లు కమ్ముకుంటున్న వేళ..
సింగా, అతని అనుచరులు జీప్ లొ నల్లమల అడవుల వైపుగా పయనమయ్యారు.
మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ ఇచ్చిన సమాచారంతో అజయ్ సింగాకి ఏమాత్రం అనుమానం రాకుండా అతన్ని అనుసరిస్తూ తను కూడా ఆ నల్లమల అడవుల్లో కాలు పెట్టబోతున్నాడు..
ది యాక్షన్ గేమ్ స్టార్ట్స్ నౌ! 😁
***సశేషం***
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
> పుకారు
రచయిత్రి పరిచయం :
నా పేరు రమ్య
నేనొక గృహిణిని
మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు
Comentarios