top of page

నల్లమల నిధి రహస్యం పార్ట్ - 23


'Nallamala Nidhi Rahasyam Part - 23' written by Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

నిద్రలోకి జారుకున్న అంజలికి ఒక కల వస్తోంది. ఆ కలలో ఒక ముష్టివాడు కనిపిస్తున్నాడు. అతను అంజలికి ఏదో చెబుతున్నాడు. అదేమీ అంజలికి అర్ధం కావడం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం అంజలికి స్పష్టంగా వినిపిస్తోంది, అర్ధం అవుతోంది!

"ఓయ్ పిల్లా! ఆ రక్ష తీసి నీ ప్రియుడికి కట్టు. ప్రమాదం నీ ప్రేమను బలి తీసుకోబోతోంది. నీ ప్రియుడే ఆ దుష్టాత్మకి వాహకం కాబోతున్నాడు. వాడికి రక్ష కట్టు. నీ ఇంటి పొదల్లో నేనిచ్చిన రక్ష ఉంది. అది నీ ప్రియుడికి కట్టు. రెండు ప్రాణాలను కాపాడు" అంటూ ఆర్తిగా చెప్తూ ఉన్నాడు ఆ ముష్టివాడు.

అంజలికి వళ్లంతా చెమటలు పట్టేస్తున్నాయి.తన గొంతు తడి ఆరిపోతోంది. ఊపిరి ఆగి పోతున్నట్టుగా అనిపించి, ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. తను తన గదిలోనే ఉన్నాను అని ఊపిరి పీల్చుకుంది. హాల్ లోకి వెళ్లి, వాటర్ తాగి, కాస్త ప్రాణం కుదుటపడింది అనిపించాక, తనకొచ్చిన కల గురించి ఆలోచించసాగింది.

***

తనని తాను కోయరాజు రూపంలో చూస్తున్న అతని కళ్ళు, ఒక వెన్నెల బొమ్మని చూస్తూ ఆగిపోయాయి. అందమైన ఆ నల్లమల అడవి, ఉదయిస్తున్న సూర్యకిరణాల కాంతులతో వెలిగిపోతున్న వేళ..పచ్చని ఆ అరణ్యంలో కోయిలమ్మ గానానికి, నెమళ్లు పురి విప్పి నాట్యం చేస్తున్నాయి.

ఆ కోయిల గానం కంటే ముగ్ద మనోహరమైన గానంతో

"ప్రియతమా! నా ప్రియతమా! నీ రాకకై నా కన్నులు కాయలు కాసేనురా..

జగడాన గెలుపొంది రావేలరా..

నీ ప్రేమకై.. నీ ప్రేమకై.. జన్మలు వేచి ఉండనా.. మళ్ళీ మళ్ళీ జన్మించి నిన్నే చేరనా.." అంటూ పాడుకుంటూ కొండలమీద నుండి జాలువారుతున్న జలపాతం కింద జలకాలాడుతోంది, పాలరాతి బొమ్మకు ప్రాణం పోసినట్టు ఉన్న కోయ పిల్ల.

వడివడిగా అడుగులు వేసుకుంటూ ఆ సెలయేరులో కాలు పెట్టాడు మార్తాండ. నెమ్మదిగా ఆమెను చేరి వెనుక నుండి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఒక్కసారిగా అదిరిపడ్డ మరియా అంతలోనే మురిపెంగా సిగ్గుపడుతూ వెనక్కి తిరిగి, మార్తాండను గట్టిగా హత్తుకుని,

"ప్రియా. నీకు నూరేళ్లు. నిన్నే తలుచుకుంటూ ఉన్నాను. మన లగ్గం అయిన మరునాడే నువ్వు మేడారం పోతివి. ఆ జగడాన నీకేటైతాదొ అని దిగులుబడితిని. ఆ అమ్మ ఇష్టకామేశ్వరి.. నిన్ను క్షేమంగా నాకిచ్చింది" అంటూ కలువల్లాంటి కళ్ళనిండా నీరుతో సూటిగా చూస్తూ చెప్పింది మరియా.

"ఏడవమాకు మరియా! నీ రాజు వచ్చేసాడుగా! ఇక ఎన్నటికీ నిన్ను వీడి పోను. అరే! ఒకేల నా పానం పోయినా నీకోసమే మళ్ళీ పుట్టొస్తా గదే! " అంటూ మరియాను గట్టిగా హత్తుకున్నాడు.

"ఓ! ఉకో మామ! నీ పానం బోతే నే మాత్రం ఆయువుతో ఉంటనా? ఏంది నీ యాలాకోలం.." అంటూ కన్నీరు పెట్టుకుంది మరియా.

ఆ కన్నీరు తుడుస్తూ "ఇక ఏ ఉపద్రవాలు రావు. ఆ మారాజు మారిపోయి, తప్పు తెలుసుకుని, సమ్మక్క భక్తుడయ్యిండు. అంతే గాదు. మన కోయ రాజులందరికీ కప్పం రద్దు చేసిండు. ఇక మనకి, ఆ మారాజుకి స్నేహం అయినాది. మన అమరవీరుల త్యాగ ఫలం వృధా పోలేదు మరియా. ఇక మన ప్రజలు సంతోషంగా సంబరాలు చేసుకునే రోజులు వచ్చినాయి " అంటూ మరియాకి ధైర్యం చెప్పి, స్నానం చేసి, ఇద్దరూ కలిసి, సుచిగా ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడికి వెళ్లి, భక్తిగా దండం పెట్టుకున్నారు.

మరియా అమ్మవారి ఉపాసకురాలు. ఆమె చిన్నప్పటి నుంచి ఆ అడవిలో ఎవరికి ఏ అనారోగ్యం వచ్చినా తన చేత్తో పసరు మందు ఇస్తే తగ్గిపోయేది. ఆ గూడెం లోని ప్రజలు ఆమెను ఒక దేవతగా చూసేవారు. ఇప్పుడు ఆమె ఆ కోయదొర భార్య. మరి ఇప్పుడు ఆమెను మరింత గొప్పగా చూసుకునేవారు ఆ ప్రజలు. ఆ తల్లి ఆశీర్వాదం తీసుకుని, కోయ ప్రజలను సమావేశ పరిచాడు మార్తాండ.

ఆదివాసులు యుద్ధంలో అమరులయ్యారు కనుక మన మహారాజు ప్రతాపరుద్రుని ఆదేశం ప్రకారం ఈనాటి నుంచి రెండేళ్లకి ఒకసారి జరిగే సమ్మక్క, సారలమ్మ జాతర కోసం మన అదివాసులం అందరం కూడా బెల్లం ముద్దలు, సమర్పించుకోవాలని తీర్మానం చేసి సంబరం జరిపించాడు. ఆరోజు అంతా ఆ కోయ ప్రజలు, తమ రాజు క్షేమంగా తిరిగి వచ్చినందుకు సంబరాలు చేసుకున్నారు. ఆరోజురాత్రే కోయసంప్రదాయంలో మరియా, మార్తాండ ఒక్కటి అయ్యారు. ఒకటే ప్రాణం, ఒకటే లోకంగా ప్రేమగా సాగిపోతోంది వారి జీవితం.

***

‘విధి రూపంలో పెను విషాదం దాపరించబోతోంది’ అని తెలియక ఎంతో ఉల్లాసంగా ఉన్న మార్తాండ దగ్గరికి ఒక రోజు రాత్రి అనుకోని పరిస్థితుల్లో మహారాజు ప్రతాపరుద్రుడు, అతని అంతరంగిక సైన్యం ఒక పెద్ద భోషాణంతో వచ్చారు.

ఢిల్లీ సుల్తానుతో జరగబోయే యుద్ధంలో తనకి జరగరానిది ఏమైనా జరిగితే ఆ నిధిని తన రాజ్య ప్రజల క్షేమం కోసం ఉపయోగించమని మాట తీసుకుని వెళ్లిన ఆ మహారాజు, నమ్మక ద్రోహి కారణంగా ఆ యుద్ధంలో పరాజయుడయి, బంధీగా ఢిల్లీకి తరలించబడుతుండగా మరణించాడు.

ఆ విషయం వేగుల ద్వారా తెలుసుకున్న మార్తాండ. ఆ నమ్మక ద్రోహి నరేంద్రుడు, నీతి మంతుడైన ప్రతాపరుద్రుని మరణానికి కారణం అని తెలుసుకుని కోపంతో రగిలిపోయాడు. నిధి కోసం ఆ నరేంద్రుడు నల్లమల అడవుల్లోకి వస్తున్నాడు అని తెలుసుకున్న మార్తాండ కనీవినీ ఎరుగని రీతిలోతనదైన ఒక కొత్త పద్ధతిలో ఒక కొత్త యుద్ధ వ్యూహాన్ని రూపొందించి, తన మిత్రుని మరణానికి బదులు తీర్చుకునేందుకు, ఆ నరేంద్రుని రాక కోసం ఎదురు చూస్తున్నాడు.

***

ఇదంతా అజయ్ కళ్లలో కనిపిస్తూ ఉంది.

అలాగే సిద్ధాంతి గారికి కూడా నరేంద్రుడు నల్లమల అడవుల వైపుగా తన సైన్యంతో దండెత్తడానికి వెళ్లడం కనిపిస్తోంది.

***

యుద్ధభూమిలో కలుద్దాం.😀

లెట్స్ బ్యాంగ్ విత్ ద వార్ ఎపిసోడ్.😃

***సశేషం***


రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య

నేనొక గృహిణిని

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు



28 views0 comments
bottom of page