top of page

నల్లమల నిధి రహస్యం పార్ట్ - 25


'Nallamala Nidhi Rahasyam Part - 25' written by Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

పచ్చని ఆ అరణ్యం నెత్తుటి రంగు పులుముకుని, వైతరణి నదిలా ప్రవహిస్తూ..

ఆదిమ వాసుల స్వామి భక్తికి, ఎనలేని తెగువకు, నమ్మక ద్రోహి దురాశకు మధ్య జరిగిన యుద్దానికి సాక్షిగా నిలుస్తూ, అమరులైన ఆ అడవి బిడ్డలకి కన్న తల్లి లాంటి ఆ వన దేవత పెడుతున్న కన్నీరే అరణ్య రోదనగా నిలిచిపోయింది.

ఆ యుద్ధం అంతా తన కళ్ళ ముందరే కదలాడుతుంటే నిద్రలోనే అదే ట్రాన్స్ లో ఉండే, ఆవేశంతో రగిలి పోతున్నాడు అజయ్.

"మరియా! నా మరియా! " అంటూ కలవరిస్తున్న అతని కంటి వెంబడి కన్నీటి వర్షం కురుస్తోంది.

పక్కనే ఉండి అజయ్ తలను నిమురుతున్న మరియా

"ప్రియా! నే ఉన్నా. ఆత్మనై నీ పక్కనే ఉన్నా.. జన్మలు వేచి నీకై మిగిలిఉన్నా..

ఒకప్పటి మన ప్రణయ కావ్యాన్నే పదే పదే చదువుకుంటూ.. ఆనాటి మన ప్రేమ మాధుర్యాన్ని ఆలాపనగా మళ్ళీ మళ్ళీ పాడుకుంటూ.. నీకిచ్చిన మాటకై వేచి ఉన్నా..

ఇది ప్రకృతి విరుద్ధం అని తెలిసినా నీలో కలిసిపోయే వరం కోరుకుంటున్నా!" అంటూ ఆ ఆత్మ ఘోషిస్తూనే ఉంది.

***

తనకి వచ్చిన కల గురించే ఆలోచిస్తూ ఉన్న అంజలి ఎలాగో ధైర్యం చేసుకుని పెద్దగా శబ్దం రాకుండా మెయిన్ డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వెళ్ళింది. చుట్టూ చూస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెడుతోంది అంజలి. గాలి వేగంగా వీస్తూ ఆమెను ఇంకా భయపెడుతోంది. కీచురాళ్ళు అరుస్తూనే ఉన్నాయి. ఆ ఇంటి చుట్టూ ఉన్న చెట్లు ఆ గాలి వేగానికి అటు ఇటు ఊగుతూ భయానికే భయాన్ని రుచి చూపించేటట్టు ఉంది ఆ వాతావరణం. ఆ తాయత్తు కోసం, ఇంటి పొదల్లో వెతుకుతున్న అంజలిపై ఒక్కసారిగా నల్లని పిల్లి వచ్చి పడింది. ఒక్కసారిగా జరిగిన ఆ ఘటనకి హడలిపోయిన అంజలి. కెవ్ మని అరుస్తూ ఆ పొదల్లోకి పడిపోయింది. ఆ అరుపుకి భయపడి అంజలి తల్లి బయటకు వచ్చింది. అలాగే, నిద్ర పోకుండా కూర్చున్న సంజయ్ కూడా కిందకి వచ్చాడు. వాళ్లిద్దరూ వచ్చి చూసేసరికి పొదల్లో పడి ఉన్న అంజలి కనిపించింది.

అంజలి వాళ్ళ అమ్మ అంజలిని పైకి లేపి, "ఏమైందే! నువ్వు ఇక్కడ పడి ఉన్నావేంటి?" అని అడిగింది.

అంజలిని ఆ టైం లో అక్కడ చూసిన సంజయ్ కి కూడా ఒక్క నిమషం గుండె జారిపోయింది.

సంజయ్ వైపు చూస్తోన్న అంజలి భుజాలు పట్టుకుని ఊపేస్తూ "ఏమైందో చెప్పమంటే అలా నిలబడి చూస్తావేంటే?" అంటూ అడుగుతోంది ఆ అమ్మాయి తల్లి.

"ఏదో అలికిడి ఐతే దొంగోడు వచ్చాడేమో! అని చూస్తుంటే నన్ను ఈ పొదల్లోకి తోసేసి , పారిపోయాడమ్మా" అని అబద్ధం చెప్పింది అంజలి.

సంజయ్ కి అంజలి చెంప పగల కొట్టాలనిపించింది. దొంగోడు వస్తే ఈ ఝాన్సీ రాణి గారు పట్టుకోడానికి వచ్చినట్టుంది అనుకుంటూ "ఏంటి అంజలి! ఒక ఫోన్ చేసి చెప్తే నేనొచ్చి చూసేవాడ్ని కదా. నువ్విలా బయటకు రావడం ఏంటి? వాడు నిన్ను ఏమైనా చేసి ఉంటే.." అంటూ కోప్పడ్డాడు సంజయ్.

"అలా అడుగు బాబూ! ఏదో టైం బాగుండి, దీనికి ఏమీ కాలేదు బాబూ! ఏమీ అనుకోకపోతే ఈ పూటకి నువ్వు హాల్ లో పడుకోకూడదుకూడదూ! వాడు మళ్ళీ వస్తాడేమో. "అంది పాపం ఆ పిచ్చి తల్లి.

సంజయ్ కి అర్ధం అయింది. ఇది అంజలి ప్లానే అని. కానీ ఎందుకు అనేది అర్ధం కాలేదు.

అందరూ లోపలికి వెళ్లిపోయారు. తల్లి పూర్తిగా నిద్రలోకి జారుకుంది అని నిర్ధారించుకుని, తను వెళ్లి సంజయ్ ని లేపి, అతని చేతికి రక్ష కట్టేసింది. సంజయ్ కి ఏమీ అర్ధం కాలేదు.

"ఏంటి అంజలి! ఏంటి ఇది? నాకెందుకు కట్టావ్?" అంటూ ఉండగానే

"నువ్వు ఇంకేమి మాట్లాడకు సంజయ్. ఇది నువ్వు ఎప్పుడూ తీయకు. అసలు ఏమి జరిగిందో తెలుసా! నీతో మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా నాకు ఏదో మత్తు గాలి సోకినట్టుగా నిద్రపట్టింది.

ఆ నిద్రలో నాకు ఒక ముష్టివాడు కనిపించాడు. అతనేదో చాలా చెప్పాడు. నాకు అవేమీ స్పష్టంగా వినిపించలేదు. కానీ కొన్ని మాటలు వినిపించాయి, అర్ధం అయ్యాయి.

"నీ ప్రియునికి రక్ష కట్టు. ఇప్పుడే వెళ్లి వెతుకు. నీ ఇంటి పొదల్లో పదిలంగా ఉన్న ఆ రక్ష తీసి నీ ప్రియునికి కట్టు. రెండు ప్రాణాలు కాపాడు. ఆ దుష్ట శక్తికి నీ ప్రియుడు వాహకం అయిపోతే ప్రళయం తప్పదు. వెళ్ళు! తులసి కోట మీదకు విసిరివెయబడ్డ ఆ రక్ష నీ తల్లి తీసి, పొదల్లోకి విసిరేసింది. వెళ్ళు. వెతికి తీయి. నీ ప్రియుడ్ని కాపాడుకో! తెలవారకుండా ఆ రక్ష కట్టకపోతే ప్రళయం! సర్వ నాశనం! సృష్టి వినాశనం!" అంటూ చెప్తూ చెప్తూ అదృశ్యం అయిపోయాడు. వెంటనే ఆ కలలోనే నిన్ను ఒక నల్లటి ఆకారం ఆవహించినట్టు నీ కళ్ళు ఎర్రటి నిప్పుల్లా అయిపోయినట్టు, నువ్వు మీ అన్నయ్య పీక కొరికి రక్తం తాగేస్తున్నట్టు..ఇంకా నా నోటితో చెప్పలేను. అలా కనిపించింది ఆ కలలో. వెంటనే ఉలిక్కి పడి లేచాను. అదంతా కలే అని వదిలేద్దామన్నా.అందులో ఆ మనిషి నీకు ప్రమాదం అని చెప్పడంతో అసలు ఆ తాయత్తు ఉందొ లేదో చూద్దామని బయటకు వచ్చాను. ఉంటే పైకి వచ్చి, నీకు రక్ష కట్టొచ్చు అనుకున్నాను. ఇంతలోనే ఒక నల్లని పిల్లి వచ్చి మీద పడడంతో భయపడి అరుస్తూ పొదల్లోకి పడిపోయాను. అప్పుడే నా చేతికి ఈ రక్ష దొరికింది.

వెంటనే పైకి వచ్చి నీకు రక్ష కడదాం అనుకున్నాను. కానీ నే అరిచిన అరుపుకి, మీ ఇద్దరూ వచ్చేసారు. దేవుని దయ వల్ల నీకు రక్ష కట్టేసాను. సంజూ! నాకు వచ్చిన కల నిజం. మరి మీ అన్నయ్య పరిస్థితి ఏంటి?" అంటూ ఉన్న అంజలి మాటలకి

"రేపటి సూర్యోదయం అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది " అని బదులిచ్చాడు సంజయ్.

రేపటి సూర్యోదయం కోసం ఎదురుచూద్దాం!😄

***సశేషం***


రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య

నేనొక గృహిణిని

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు



29 views0 comments
bottom of page