#KotthapalliUdayababu, #కొత్తపల్లిఉదయబాబు, #నరుడిబ్రతుకునటన, #NarudiBrathukuNatana, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Narudi Brathuku Natana - New Telugu Story Written By - Kotthapalli Udayababu
Published In manatelugukathalu.com On 13/03/2025
నరుడి బ్రతుకు నటన - తెలుగు కథ
రచన : కొత్తపల్లి ఉదయబాబు
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
చదువుతున్న వార్తాపత్రిక టీపాయ్ మీద పడేసి బాత్ రూమ్ లో దూరాను. స్నానం చేస్తూ నేను చేయబోయే పాత్ర ఎలా ఉంటుందా అని వూహించుకుంటూ నాకున్న నాటకానుభవంతో గతంలో చేసిన పాత్రను గుర్తు తెచ్చుకుని నటిస్తూనే స్నానం పూర్తిచేసాను.
అహల్య పెట్టిన టిఫిన్ తిని కోడైరెక్టర్ కి ఫోన్ చేసాను.
''శుభోదయం సర్. డైరెక్ట్ గా షూటింగ్ స్పాట్ కి వచ్చేయండి సర్. మొత్తం కార్పొరేట్ కాలేజీలో షూటింగ్.. మీరు.. హీరోయిన్ హీరోగారు, స్నేహితులు.. టీజింగ్.. పిచ్చ కామెడీ సీన్లు.. సినిమాకి హైలెట్ సర్.. ఈ పాత్రతో మీరు సినీరంగంలో స్థిరపడిపోతారు. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ సర్." ఫోన్ కట్ అయింది.
"బయట తిళ్ళు తిని ఆరోగ్యం పాడుచేసుకోకండి. బాక్స్ లో పెరుగు అన్నము, నిమ్మకాయబద్ద పెట్టాను నంజుకోవడానికి. షూటింగ్ అయిన వెంటనే తిన్నగా బస్సెక్కి ఇంటికి రండి. ఏమిటో.. రిటైర్ అయి మూడు నెలలన్నా కాలేదు. హాయిగా కృష్ణారామా అనుకునే వయసులో ఆ స్టూడెంట్ ఎవరో.. సినిమా తీయడమేంటో, అందులో మిమ్మల్ని పిలిచి మరీ ఆ పాత్ర ఇవ్వడమేమిటో.. మీరు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు. అది మర్చిపోకండి. జాగ్రత్ర. నేను చెప్పేవిషయాలు బుర్రకెక్కుతున్నాయా?" అంది బాక్స్ చేతికి అందిస్తూ అహల్య.
''ఆ. సరే..'' అన్నానే గానీ నా దృష్టి అంతా ఈ రోజు పొందబోయే అనుభవం మీదే ఉంది. అసంకల్పితంగా అహల్య ఇచ్చిన టిఫిన్ బాక్స్ తీసుకుని బయల్దేరాను. బయల్దేరుతుంటే ఎడమ మోకాలు తనకు ఇష్టం లేనట్టు కలుక్కుమంది.
''నిన్ను భరించేవాడిని నేనే నే.. నాతో పెట్టుకోకు'' నా ఉత్సాహం దాన్ని హెచ్చరించింది.
********
నేను షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి చేరుకోగానే సమీర్ నన్ను గౌరవంగా ఆహ్వానించాడు యూనిట్ లో ఉన్న అందరికీ పరిచయం చేసాడు.
'నాకు చదువు చెప్పిన మాస్టారు' అని సమీర్ వాళ్ళకి పరిచయం చేశాడు. వాళ్ళందరూ 'అతివినయం ధూర్త లక్షణం' లా వంగి వంగి దండాలెట్టి మళ్ళీ నేను చూసేసరికి నన్ను గమనించనట్టు సిగరెట్ కాల్చేవాళ్ళు, హీరోయిన్ మీద పచ్చి జోకులు వేసుకునేవాళ్ళు, జేబులోంచి చీప్ లిక్కర్ తాగేవాళ్ళు.. కనిపించారు.
నేను వాళ్లకి ఉపాధ్యాయుడిని కాదుకదా అనుకుని సరిపెట్టుకున్నాను.
''మీరు అలా కూర్చోండి మాస్టారు. మీ పాత్ర వచ్చినప్పుడు పిలుస్తాను.'' అన్నాడతను.
''ఈలోగా నా పాత్రకు సంబంధించిన సంభాషణలు ఇస్తే ఒకసారి చదివేసుకుంటాను కదా.'' అన్నాను.
అతను తేలికగా నవ్వేసాడు. ''బలేవారు మాస్టారు. ఇపుడు రోజులు పూర్తిగా మారిపోయాయి. మీ షాట్ కు అయిదునిముషాలముందు డైలాగ్స్ ఉన్న కాగితం ఇస్తాం. ఒకసారి చదివేసుకుని చెప్పేయగలిగితే పర్లేదు. లేదా వెనకాల ప్రొమిటింగ్ ఇచ్చేస్తారు. అవి వింటూ మీరు పాత్రలోకి వెళ్ళిపోయి సంభాషణలు చెప్పేయడమే. ఈరోజుల్లో స్టేజి నాటకాలకి, టెలీఫిల్మ్స్, సీరియల్స్ కి అసలు సంబంధమే లేదు. మీరేం కంగారు పడవద్దు. నేను ఉంటానుగా మీ పక్కనే.'' అనేసి ఎవరో పిలవగా అటు వెళ్ళిపోయాడు సమీర్.
తరువాత ఒక గంటకి కాబోలు హీరో, హీరోయిన్, వాళ్ళ స్నేహితులుగా నటించే కుర్రాళ్ళు వచ్చారు.
ఆధునికంగా దుస్తులు వేసుకోవడం తప్ప మిగతా మన సహజ సాంప్రదాయ వాతావరణం నాకు అక్కడ పుటం వేసినా కనబడలేదు.
ఉద్యోగంలో చేరినప్పటినుంచి ప్రార్ధన సమయానికి వెళ్లకపోతే నా నరాల్లోంచి ఏదో తప్పు చేసిన బాధ వణుకు వచ్చేసేది.
చిన్నప్పుడు బడికి వెళ్ళేటప్పుడు మారాం చేస్తే.. అమ్మ అడిగింది ''పెద్ద అయ్యాకా ఏమవుతావ్?'' అని. అప్పటికి నాన్న చేసేది బడిపంతులు కాబట్టి 'బడిపంతులవుతా'' అన్నాను.
అమ్మ నవ్వి చిన్నమొట్టికాయ మొట్టి ''అయితే మంచి బడిపంతుడివి అవ్వు. గంపెడు పిల్లల్ని మాత్రం కనకు. అమ్మాయి, అబ్బాయి అంతే. సరేనా?'' అంది.
''సరే'' అని తలూపాను.
నాన్నగారికి ఆరోజుల్లో వచ్చే బడిపంతులు జీతంలో ఇంట్లో ఆరుగురం బతికేవాళ్ళం. ఇంటికి పెద్ద కొడుకుని నేను తరువాత తెలిసింది అమ్మ మా కడుపులు నింపడం కోసం రోజుకు అతిచిన్న వయసులోనే ఒక పూటే తినే అలవాటు చేసుకుందని. , దాంతో ఆమెకు రక్త హీనత వచ్చి అస్తమాను దగ్గుతోందని. నాన్న రెండుమూడు సార్లు తిట్టడం విన్నాను.
''సమయానికి తిండి తినకపోతే ఛస్తావ్. డాక్టర్ దగ్గరకి తీసుకెళ్తాను పద. మళ్ళీ రోగమొస్తే డబ్బుకు డబ్బు ఖర్చు'' అన్నారు.
''నేను ఏ డాక్టర్ దగ్గరకూ రాను. ఛస్తే చస్తాను. బడిపంతులని తెలిసి నలుగురు పిల్లలు అవసరమా.. మళ్ళీ చేస్తున్నది పదిమందికి నీతులు చెప్పే బడిపంతులు ఉద్యోగం. మనం ఏమిటి, మన స్థితి ఏమిటీ అని ఆలోచించుకోవద్దూ..'' అని అరిచింది అమ్మ.
ఆ వారం తర్వాతే నాన్నగారు వేసక్టమీ ఆపరేషన్ చేయించుకున్నారని నేను పెద్దయ్యాకా తెలిసింది. ఆమె దగ్గు బాధ చూడలేక చివరకు వూళ్ళో ఆర్. ఎం. పి. డాక్టర్ ని ఇంటికి తీసుకు వచ్చారు. ఆయన ఆమెను పరిశీలించి టి. బి. ప్రారంభస్థితిలో ఉందని మందులు వాడితే తగ్గిపోతుందని చెప్పాడు.
అమ్మ మందులు వాడుతున్నా సరే మా పిల్లలందరి పనులూ తానే చేసేది. 'నేను సాయం చేస్తానమ్మా' అంటే 'మగపిల్లాడివి నువ్వు ఈ ఆడంగి పనులు చెయ్యకూడదు. నీ తర్వాత తమ్ముడు, ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. ఒకవేళ నేను లేకపోతె అపుడు వాళ్ళ అందరి పనులు నువ్వే చెయ్యాలి. అర్థమైందా..
అలా చెయ్యాలంటే బడికి మొదటి గంట ముందే వెళ్ళాలి. అలాగే ఏరోజు పాఠాలు ఆరోజు చదువుకోవాలి. ఏ పనీ తరువాత చేద్దాం లే అనుకోకూడదు. రుతువులు ఆరు చూడూ. తమ బాధ్యత అన్నట్టు ఖఛ్చితంగా సమయం ప్రకారం వస్తాయి. వర్షం రోజున లేటుగా లేచి సూర్యుడు రాలేదు అనుకుంటాం. కానీ పగటి వెలుగు ఎలా వస్తుందనుకున్నావ్. ? ఆయన పని ఆయన సక్రమంగా చేయడం వలన. వసంత ఋతువు వస్తుందనగానే కోయిలలు కూయడం మొదలెడతాయి.
చెట్లు తమ ధర్మం ప్రకారం పూలు పోస్తాయి. రేపు పూద్దాం లే అనుకోవుగా.. ఈ ప్రపంచం లో సమస్త జీవరాసులూ తమ తమ ధర్మాలను సమయం ప్రకారం పాటిస్తాయి. చదువుకుని విఙ్నానం పెంచుకుంటున్న మనం ఆ పని చేయగలమా లేదా? చేయలేకపోతే ఈవేళ్టి నుంచే నువ్వు బడికి వెళ్లొద్దు.'' అంది అమ్మ.
''లేదమ్మా. ఈవేళ్టినుంచి నేను మొదటి గంటలోపే బడికి వెళ్తాను. ఈ అలవాటు ఎప్పుడూ మార్చుకోను. నీమీద ఒట్టు.'' అని అమ్మ తలమీద ఒట్టు వేసాను.
అమ్మ నన్ను గాఢంగా గుండెలకు హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఎందుకో అర్ధం కాలేదు. ఆరునెలలు తిరగకుండానే అమ్మ చనిపోయింది.
నాన్నగారు 'ఈవిడ మీ రెండో అమ్మ' అని ఒక ఆవిడని తీసుకువచ్చారు. ఆమెకు పిల్లలు పుట్టకపోవడం వల్ల కాబోలు మమ్మల్ని ప్రేమగా చూసేది. సొంతపిల్లల్లా సాకింది. తమ్ముడు, చెల్లెల్లు అయితే వాళ్ళకి అమ్మే గుర్తులేదు. నాకు మాత్రం అమ్మ, నేను చేస్తున్న ప్రతీపనిలోను గడియారంలో ముల్లుల్ని చూపుతూ కనిపించేది. ఆ శక్తే నేనూ ఉపాధ్యాయుడిని అయ్యేలా చేసింది. ఆ దృష్టే నన్ను ఉత్తమ ఉపాధ్యాయుడిగా నిలబెట్టింది.
నేను నేర్చుకున్న స్వీయ క్రమశిక్షణను పిల్లలందరూ పాటించేలా చూసుకుంటూ వచ్చాను. కానీ ప్రధానోపాధ్యాయుడిగా పదోన్నతి పొందాకా నాకు పిల్లల్ని పట్టించుకునే అవకాశం లేక పోయింది. అయినా ప్రతీరోజు ఉదయం ప్రార్ధనాసమయంలో నేను చెప్పే ప్రతీ అంశాన్నీ ''స్వీయ క్రమశిక్షణ''కు ముడి పెట్టి చెప్పడం మాత్రం మానుకోలేదు. ఉద్యోగ విరమణ ఆఖరి రోజున కూడా దాని ఆవశ్యకత చెప్పి మరీ ఆఖరి సంతకం చేసాను.
నా ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ -''మాస్టారూ. రెడీగా ఉన్నారు కదా. హీరో హీరోయిన్ల షాట్స్ తీస్తున్నారు. అవి అయిపోయిన వెంటనే మీ షాట్స్ ఉంటాయి. అందాకా అలా వెళ్లి మిగతా ఫ్లోర్స్ చూసిరండి. అక్కడ కూడా షూటింగ్లు జరుగుతున్నాయి. సమీర్ మీతో చెప్పమన్నాడు'' అన్నాడు ఎవడో కుర్రాడు వచ్చి.
''అలాగే బాబు. అవసరమైతే ఫోన్ చెయ్యమను. నేను ఎక్కడ ఉన్నా వచ్చేస్తాను.'' అని అటువైపు నడిచాను నేను. ఒక ఫ్లోర్ నిశ్శబ్దంగా ఉంది.. అక్కడ అన్ని కత్తులు, కటార్లు, కిరీటాలు, విగ్గులు, .. జానపద సినిమాలు తీసే ఫ్లోర్ అనుకుంటా.. బోసిగా దుమ్ము కొట్టుకు పోయి ఉంది. ఒక కుర్రాడెవడో ముఖం మీద ఎర్రటి తుండుగుడ్డ వేసుకు పడుకున్నాడు, . ఇంకో ఫ్లోర్ లోకి వెళ్తే ఏదో కొత్త సినిమా కొత్త వాళ్ళతో తీస్తున్నట్టున్నారు. పాట షూటింగ్ అనుకుంటా.. వెనకాల స్టెప్పులు వేసే మంద అంతా ఒకే రకమైన డ్రెస్ లో సాధన చేస్తున్నారు.
ఇంకా పిలుపు రాలేదు కదా అని ఫ్లోర్ లోంచి బయటకు వచ్చి చుట్టూ పెద్ద చపటా ఉన్న విశాలమైన మావిడి చెట్టు కింద కూర్చున్నాను. దూరంగా సమీర్ హీరో ఫ్రెండ్స్ గా నటిస్తున్న కుర్రాళ్ళచేత రిహార్సల్స్ చేయిస్తున్నాడు. హీరో హీరోయిన్లు చేతిలో డైలాగ్ పేపర్స్ చదువుకుంటున్నారు. మరో మూడు నిముషాల్లో డైరెక్టర్ షాట్ రెడీ చెప్పడంతో అందరూ పొజిషన్ లోకి వచ్చారు.
సమీర్ ని దూరం నుంచి చూస్తూనే ఆలోచనలో పడ్డాను నేను. సమీర్ నా దగ్గర చదివిన రోజుల్లో మున్సిపల్ బిల్ కలెక్టర్ కొడుకు. ఎనిమిదవ తరగతిలో నేను పనిచేస్తున్న పాఠశాలలో చేరాడు. చాలా అందగాడు. అతన్ని స్కూల్ హ్యాండ్సమ్ అని పిలిచేవారు. ఆరోతరగతి నుంచే అమ్మాయిలూ అతని చూపు తనమీద పడితే చాలు అన్నట్టుగా అతని చుట్టూ గుంపులుగా ఉండేవారు.
అయితే అది తాను మొదట్లోనే తీవ్రంగా ఖండించాడు. తల్లి తండ్రులను పిలిచి విషయం చెప్పాడు. వాళ్ళు కొడుకునే సమర్థిస్తూ 'అలా అంటారేంటి సారూ. ఏదో చిన్నపిల్లలు.. కుర్రవేషాలు ఈ వయసులో కాకపోతే ఎపుడూ వేస్తారు చెప్పండి. మీరూ చూసి చూడనట్టు ఊరుకోండి సర్. మీకిష్టం లేకపోతే చెప్పండి. ఏదో చదువు బాగా చెబుతారని విని ఈ స్కూల్లో వేశాం. ఆడు బాగా చదవకపోతే మాకు కబురుచేయండి అంతే గానీ ఇంకోసారి ఇలా అనవసరమైన విషయాలకి కబురు సెయ్యమాకండి. "అని వెళ్లిపోయారు.
దీనికి ఏంచెయ్యలా అని ఆలోచించాను. పిల్లల్ని కొట్టడం నేరమైపోయింది. ఉపాధ్యాయులమీద తల్లితండ్రులే స్వయంగా వచ్చి దాడి చేస్తున్నారు.. లేదా అవమానిస్తున్నారు లేదా పోలీసు కంప్లయింట్ ఇస్తున్నారు. దానిని అలుసుగా తీసుకుని విద్యార్థులు ఉపాధ్యాయులపట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. దానికి తోడు కొద్దికాలంగా సమాజాన్ని బలంగా ప్రభావితం చేస్తున్న వినోద వ్యాపార మాధ్యమమైన సినిమాలో ఉపాధ్యాయ పాత్రల్ని, అధ్యాపక పాత్రల్ని చాలా హీనంగా చూపిస్తున్నారు. కనీసం పదవ తరగతి అయినా ఆ అబ్బాయి పాసయ్యే జాగ్రత్త తీసుకుంటే తరవాత ఏమైతే మనకేంటి? అనుకుని ఒక నిర్ణయానికి వచ్చాను.
సమీర్ కు మంచిగా చెబుతూనే, అవసరం అయినా చోట ప్రోత్సహిస్తూ, తప్పు చేసున్న చోట సున్నితంగా హెచచరిస్తూ పరీక్ష పాస్ అయ్యేలా ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల అతను ఉత్తీర్ణుడై కాలేజీలో చేరాడు. అక్కడితో అతని పట్ల నా బాధ్యత తీరిపోయింది. తర్వాత తన కల నెరవేర్చుకోవడం కోసం ఇంట్లో డబ్బు నగలు దొంగతనం చేసి హైదారాబాద్ వచ్చేసి ఓ అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర ముందు లైట్ మాన్ గా చేరి అంచెలంచెలుగా ఎదిగి ఈ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ కు చేరాడట. ఈ కష్టం లో కడుపునిండా తిన్న రాత్రిళ్ళు కన్నా, తినని రాత్రులే ఎక్కువ అని చెప్పాడు. సెలవులకు మరల తన ఊరు వచ్చినప్పుడు ఒకసారి వచ్చి తనని కలిసి విషయాలన్నీ చెప్పాడు.
''నేను రిటైర్ అయ్యాక ఒక్క సినిమాలో అయినా నటించాలనే నా కోరిక తీరేలా నువ్వు కొంచం సహకరించవయ్యా చాలు'' అని అడిగాడు తానూ నటన మీద ఉన్న ఆసక్తి కొద్దీ. దాని ఫలితమే ఈ రోజు ఈ విధంగా షూటింగ్ కి రావడం.
"షాట్ రెడి సర్. ఎక్కడున్నా వచ్చేయండి." అని సమీర్ ఫోన్ చేసాడు. ఉత్సాహంగా షూటింగ్ స్పాట్ చేరుకున్నాను.
నన్ను చూస్తూనే దర్శకులు కాబోలు అడిగాడు. ''స్కూల్ మాస్టర్ పాత్రధారి ఈయానేనా?''
''అవును సార్. నాకు చదువు చెప్పిన సార్. ఏ పాత్రకైతే సహజంగా ఉంటారని మీకు చెప్పాను కదా సార్'' అన్నాడు సమీర్. దాదాపు ముప్పయి రెండేళ్లు ఉంటాయి అతనికి.
నేను ''నమస్తే సార్'' అన్నాను.
''సరే.. ఆయనకీ ఏంచెయ్యాలో, ఎలా చెయ్యాలో వివరించు'' అని మిగతా టెక్నీషియన్ కి సూచనలు ఇవ్వసాగాడు.
సమీర్ నన్ను ప క్కగా తీసుకొచ్చి నాతో అన్నాడు. ''మాస్టారు. ఈ సన్నివేశంలో పాఠశాలలో మీరు మీ సీట్లో కూర్చుని పని చేసుకుంటున్న సమయంలో ఒక తండ్రి వచ్చి ''నా కూతురు( అంటే హీరోయిన్ అన్నమాట) క్లాసులో లేకుండా.. ఒక కుర్రాడితో( అంటే హీరోతో అన్నమాట) పార్క్ లో కనిపించింది. మీరు ఏం పర్యవేక్షిస్తున్నారు?'' అని అడుగుతాడు. దానికి సమాధానం గా మీరు ఏదో చెప్పబోతుంటే 'మీమీద పోలీసు కంప్లైంట్ ఇచ్చాంలే. వాళ్ళు వచ్చి తేలుస్తారు'' అని అతను హేళనగా అన్నప్పుడు, అతని బంధువులు కోపంతో ఊగిపోతూ "ఇలాంటి బాధ్యతలేని ఉపాధ్యాయుల్ని ఏంచేసినా పాపం లేదు. ఎంతో నమ్మకంతో పిల్లల్ని వీళ్ళదగ్గర చేర్పిస్తుంటే వాళ్ళు ఏమీ పట్టించుకోరు. వాళ్ల జీతాలు వాళ్ళకి ముఖ్యం. ఇలాంటి వాళ్లను ఊరికే వదిలిపెట్టకూడదు. కొట్టండి.. కొట్టండి.." అంటూ కుళ్ళిన కోడిగుడ్లు, టమాటాలతో కొడతారు.
అప్పుడే బయటి నుంచి వస్తున్న హీరో హీరోయిన్లు మిమ్మల్ని చూసి పకపకా నవ్వుతారు. అది చూసి మిగతా వారందరూ నవ్వుతారు. ఇది సర్ సన్నివేశం." అన్నాడు సమీర్. ఆ సన్నివేశం వింటుంటే ఒక్క క్షణం గుండె ఆగిపోయినంత పనైంది నాకు.
గత పదేళ్లుగా చలన చిత్రాలలో ఉపాధ్యాయులని, అధ్యాపకులను విద్యార్థులు కొందరు ఏకవచనంతో సంభోదిస్తూ, అసభ్య పదజాలంతో నిందిస్తూ, మాట్లాడకూడని మాటలు పంచ్ లు విసురుతూ, జాతి నేత అయిన ఉపాధ్యాయుని సమాజంలో అట్టడుగు వర్గాల దగ్గర్నుంచి ధనిక వర్గం దాకా హీనాతిహీనంగా చిత్రిస్తున్నారు. ఆనాటినించి ఉపాధ్యాయుడు దాదాపుగా కళ పేరుతో హత్య చేయబడుతూనే ఉన్నాడు. మళ్లీ అటువంటి పాత్ర ఈ చిత్రంలో నా వృత్తికి అన్యాయం జరుగుతూంటే ఆత్మవంచన చేసుకుని నటించడం అవసరమా? ఇలాంటి చిత్రాలు టీనేజ్ పిల్లల మనసులపై ఎంత ప్రభావం చూపిస్తాయి?
సెప్టెంబర్ 5వతేదీన డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం ఆర్భాటంగా జరిపి, మిగిలిన 364 రోజులు ఉపాధ్యాయుణ్ణి జీవశ్చవాన్ని చేసి ఆడిస్తున్న ఈ సమాజంలో ఈ పాత్ర నాకు అవసరమా?ఈవయసులో 'నటన అంటే నటరాజుసేవ ', అని భావించే నేను ఇంత హీనపాత్రలో నటించాలా? అలా అనుకోగానే నాకు గుండెల్లో సన్నటి నొప్పి మొదలైపోయింది. చమటలతో బట్టలు తడిసిపోతుంటే "బాబు సమీర్" అంటూ గుండె పట్టుకుని కిందకు కూలబడిపోయాను.
"సర్ ఏమైంది.." అంటూ గట్టిగా పట్టుకున్నాడు సమీర్.
"గుండెల్లో నొప్పిగా అనిపిస్తోంది బాబు. నన్ను.. నన్ను.. ఇంటికి పంపించేయి" అన్నాను హీనస్వరంతో.
సమీర్ వెంటనే తన ఇద్దరు స్నేహితుల్ని నన్ను ఆటోలో ఇంటి దగ్గర ఏర్పాటు చేశాడు.
"ఇంకానయం. స్పాట్ లో ఛస్తే మన ప్రాణానికి చుట్టుకునేది"ఎవరో అంటున్నారు. నన్ను ఇంటిదగ్గర వాళ్లు బాధ్యతగా దింపి వెళ్ళిపోయారు. "ఏమైందండి" కంగారు పడిపోయింది అహల్య.
వాళ్లు పూర్తిగా వెళ్ళిపోయారు అని నిర్ధారించుకున్నాకా నిత్యజీవితంలో అప్పటివరకు గుండెనొప్పి వచ్చినట్టు నటించిన నేను దీర్ఘంగా శ్వాస తీసుకుని పడకకుర్చీలో సుఖంగా వెనక్కివాలాను.
"నా నటనకు పిచ్చెక్కి ఇంటికి పంపేశారు. ఈవయసులో మనకివి పడవోయ్", అన్నాను మర్మగర్భితంగా నవ్వుతూ.
"మంచిపని చేశారు. పీడావదిలింది. వేడి వేడి కాఫీ తెస్తాను ఆగండి"అంటూ ఉత్సాహంగా లోపలకి వెళ్లిన అహల్యని చూస్తూ "నా నైతిక బాధ్యతను నిర్వహించే శక్తిని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు స్వామీ" అని కళ్ళు మూసుకున్నాను.
సమాప్తం
కొత్తపల్లి ఉదయబాబు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు : కొత్తపల్లి ఉదయబాబు పుట్టిన తేదీ : 01/07/1957 విద్యార్హతలు : M.Sc., M.Ed., M.phil (maths) నిర్వహించిన వృత్తి : ప్రధానోపాధ్యాయులు
తల్లి తండ్రులు : శ్రీ కొత్తపల్లి గంగాధర్ శర్మ, విశ్రాంత హెడ్ పోస్ట్-మాస్టర్ స్వర్గీయ శ్రీమతి సుబ్బలక్ష్మి. భార్య : శ్రీమతి సూర్యకుమారి కుమార్తె : చి. సౌ. గుడాల సుబ్బ లక్ష్మి సంతోషిత , M.B.A. w/o లక్ష్మికాంత్ – లాయర్ మనుమరాలు : చి. లక్ష్మి పూర్ణ సాధ్వి కుమారుడు : చి. హనుమ గంగాధర్ శర్మ , సాఫ్ట్-వేర్, h/o చి.సౌ.తేజశ్రీ మనుమలు : చిరంజీవులు గహన్ ముకుంద, ఋషిక్ వశిష్ట.
*వృత్తి పరంగా :
*జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల పోటీలలో వివిధ అంశాలలో బహుమతులు, క్విజ్,సాంకేశృతిక కార్యక్రమాల నిర్వహణ, న్యాయ నిర్ణేతగా వ్యవహిరించిన అనుభవం.
*పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2002 లో తొలిసారిగా ఐదుగురు విద్యార్థులకు నూటికి నూరు మార్కులు రావడం ఆ సందర్భంగా అరకాసు ఉంగరం బహుమతిగా అందుకోవడం ఒక చక్కని ప్రోత్సాహం, ఉత్సాహం. అలా మొత్తం సర్వీసులో నూటికి నూరు మార్కులు దాదాపు తొంభై మందికి పైగా విద్యార్థులు పొందగలగడం వృత్తిపరంగా సంతృప్తిని కలిగించిన విషయం.
*జిల్లా స్థాయిలో అధికారికంగా నిర్వహించిన భౌతిక శాస్త్ర,గణిత శాస్త్ర సదస్సులకు రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించడం.
*జిల్లా ఉమ్మడి పరీక్షల సంస్థకు అయిదు సంవత్సరాలపాటు ఎక్కువమంది విద్యార్హులు గణితంలో ఉత్తీరర్ణతాశాతం పొందదానికి అవసరమైన విజయ సూచిక, విజయ సోపానాలు... పుస్తకాలను ప్రభుత్వం తరపున రూపొందించుటలో ''గణిత ప్రవీణుడు''గా వ్యవహరించడం.
*ఆకాశవాణిలో కథానికలు, నాటికల ప్రసారం,అవగాహనా సదస్సులలో పాల్గొనడం, రేడియో నాటక కళాకారునిగా మూడు సంవత్సరాలు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పాల్గొనడం..మొదలైనవి
ప్రవృత్తి పరంగా :
*కథా రచయితగా రచనలు :
1. అందమైన తీగకు...! - 25 కధల మాలిక (2003) 2. చిగురు పిట్టలు* - నానీల సంపుటి (2007) 3. ఉదయబాబు మాస్టారి' కధానికలు - ఉదయకిరణాలు (2015) 4. అమ్మతనం సాక్షిగా... కవితా సంపుటి (2015) 5. నాన్నకో బహుమతి - 16 కథల సమాహారం (2019-.) జీ.వి.ఆర్. కల్చరల్ అసోసియేషన్ వారు నిర్వహించిన కథాసంపుటుల పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన కథల సంపుటి) 6. ఆయన మా నాన్నగారు ( దీర్ఘ కవిత - త్వరలో )
నవలలు : 1 . లేడీ సింగర్ (2 భాగాలు )
2 . మనసు చేసిన న్యాయం(ప్రతిలిపి వారు మార్చి 2202 లో నిర్వహించిన ధారావాహికల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందినది)
ప్రేరణ : నాన్నగారు...ఆయన నాటక రచయిత,దర్శకుడు,ఉత్తమ నటుడు(18 నాటక పరిషత్తులలో)
*సామాజిక సేవ : రక్తదాన కార్యక్రమం లో, లయన్స్ క్లబ్ వారి కార్యక్రమాలలో విరివిగ పాల్గొనడం .
తెలుగు సాహిత్యానికి సేవ : తెలుగు సాహితీ సమాఖ్య లో కార్యకర్తగా, సంయుక్త కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా తెలుగు సాహిత్యానికి విశేష కృషి , జిల్లా స్థాయిలో ర్యాలీల నిర్వహణ ...అష్టావధానం, త్రీభాషా శతావధానం లలో పృచ్చకునిగా 46 సంవత్సరాలపాటు ప్రతీ నెల సాహితీ స్రష్టల ప్రసంగాలు...విద్యార్హులకు వివిధములైన పోటీల నిర్వహణ,
పత్రికా రంగం లో : వ్యంగ్య చిత్రకళ లో పలు కార్టూన్లు వేయడం. :*1999 - జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు - పశ్చిమ గోదావరి జిల్లా*
2000 - యువసాహితీ సహస్రాబ్ది అవార్డు - ఆంద్ర ప్రదేశ్ సాంస్కృతిక సమాఖ్య 2011 - సోమేపల్లి సాహితీ పురస్కారం 2016 - గోదావరి మాత అవార్డు - ఉంగుటూరు ఎం.ఎల్.ఎ, శ్రీ గన్ని వీరంజనేయులుగారి చే- గణపవరం - పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎం.ఎల్.ఎ. శ్రీ వి.వెంకట శివరామరాజు గారి చే ''ఉగాది పురస్కారం*
పాలకొల్లు - కళాలయ సంస్థవారిచే " కధాభారతి" బిరుదు ప్రదానం.
*జన విజ్ఞానవేదిక - భీమవరం వారిచే " ఉగాది పురస్కారం" ....సుమారు నూటికి పైగా సన్మానాలు సత్కారాలు...ఇంకా ఎన్నో..
Youtube :1. తెలుగు కథను ప్రపంచ వ్యాప్తం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం "Mastaru Kadhalu 'in' Telugu " ఛానెల్ ద్వారా నా కథలతో పాటు దాదాపు 25 మంది రచయితల కథలు (ఈనాటికి 420 కధల ఆడియో వీడియోలు)చదివి వీడియోలుగా మలుస్తూ ఉచిత సేవగా అందించడం జరుగుతోంది.
2.KUBDevotionalWorld అనే ఛానల్ ద్వారా శ్రీ భగవద్గీత 700 శ్లోకాలను ప్రతీరోజు 5 శ్లోకాలను భావాలతో సహా వీడియోలుగా చదివి అందించడం జరుగుతోంది.
3. UDAYABABUMathsBasics యు ట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యార్థులకు గణితంలో మౌలిక భావనల బోధన
ప్రస్తుత నివాసం : 2010 లో సికింద్రాబాద్ సైనిక్ పురి లో స్థిరనివాసం ఏర్పరచుకుని ఇప్పటికీ కధా రచయితగా, బాలల కథారచయితగా కొనసాగడం.
చివరగా నా అభిప్రాయం :
ఇప్పటికీ నా కవితా ప్రస్తానం, కధా సాహితీ సేద్యం కొనసాగుతోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం లో చెట్టు నాకు ఆదర్శం.
కవిగా రచయితగా తమ సాహితీ ప్రస్తానం కొనసాగిన్చాదలుచుకున్న యువత అంతా పాత సాహిత్యాన్ని బాగా చదవాలి. 'వెయ్యి పేజీలు చదివి ఒక్క పేజీ రాయి' అన్న ఒక మహాకవి వాక్యాలు స్పూర్తిగా తీసుకుని నిన్నటి రచన కన్నా, నేటిది, నేటి రచన కన్నా రేపటిది మరింత మెరుగుపరచుకుని ఈ రంగం లో తమకంటూ ఒక ప్రత్యెక స్థానాన్ని ఏర్పరచుకోవాలని, ఆ దిశగా వారి సాహితీ ప్రస్తానం కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ.. ...సాహిత్యాభినందనలు.
కొత్తపల్లి ఉదయబాబు
సికింద్రాబాద్
కథకు,ఉపాధ్యాయుడి పాత్రకు న్యాయం చేశారు
@harinathraokoruprolu1988
• 2 hours ago
Good Story Especially Teachers to watch this. Present situationloo students alaa vuntaaro kudaa teliya chasaaru. It's nice Story