top of page

నీడలు నిజాలు

#Vijayasundar, #విజయాసుందర్, #NeedaluNijalu, #నీడలునిజాలు, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

ree

Needalu Nijalu - New Telugu Story Written By Vijayasundar

Published In manatelugukathalu.com On 15/08/2025

నీడలు నిజాలు - తెలుగు కథ

రచన: విజయా సుందర్


స్నానం చేసి బైటకు వచ్చిన వైదేహి, తలుపు గడియ వేసి, కిటికీ తలుపులు సరిగ్గా పడ్డాయో లేదో రెండుసార్లు లాగి చూసుకున్నది. అన్నీ పాత తలుపులు, చలికి ఒక్కోసారి బిగుసుకుపోయి, తలుపు పడకుండానే ఘడియ వేసెయ్యడం జరుగుతున్నదనుకుంటూ- 'అసలే పక్కన పనివాళ్లు పనులు చేస్తున్నార'నుకుంటూ. 


ఇంకో బాత్రూములో హరి, స్నానం చేసి వచ్చి, మొహం తుడుచుకుంటూ, 'ఈ చిన్నుగాడికి లెక్క ఇచ్చి చేస్తుండమన్నాను, వీడు చేస్తున్నాడా నన్ను ఇటు పంపించి వాడు అటు తుర్రుమన్నాడా. '.. అనుకుంటూ గదిలోకి దృష్టి సారించాడు. అంతే నిట్రాట అయ్యాడు!


తల వంచుకుని వెళ్ళిపోబోయాడు. ఇంతలో తమ ఫ్లాట్ వైపే వస్తున్న వాచ్మెన్ కనిపించాడు. అవును కదా వాడిప్పుడు హాల్లో తగిలించి ఉన్న కారు తాళాలు తీసుకువెళ్తాడు కారు తుడవడానికి. 'అమ్మో' అనుకుని గబగబా లోపలికి వచ్చి, చప్పుడు కాకుండా ఇంకోవైపుకి తిరిగి, బైటనుండి ఘడియ వేసేసాడు.. ఇంకా అంతకంటే ఎలా రియాక్ట్ అవాలో తెలియక. 


వాడు వచ్చేదాకా వదినగారు అక్కడే ఉంటారా లేదా అన్న మీమాంస ఆ క్షణాన తట్టలేదు. ఇంక తన టిఫిన్ మాట తలపెట్టకుండా బాంక్ కి వెళ్ళిపోయాడు. 


చీర కట్టుకోవడం అయిన వైదేహి, ఘడియ తీద్దామని ఇటు తిరిగేప్పటికి అసలు ఘడియ కింద పడిపోయి గొళ్ళెం మాత్రం ఊగుతున్నది. 'ఇదేమిటా, ' అనుకుంటూ, గోడగడియారంలో టైము చూసిన ఆమె, 'అమ్మో' అనుకుంటూ తలుపు తియ్యబోతే రాలేదు. 'ఇదేమిటీ' అనుకుంటూ గట్టిగా తియ్యబోతుంటే, భర్త రవి గొంతు, "ఆగు, ఎవరో ఘడియ వేశారు తీస్తున్నా" అంటూ వినిపించింది. 


తలుపు తీసిన భార్యతో రవి, "లోపల వేసుకోవాల్సిన ఘడియ బైట వేసున్నదేమిటే వింతగా" అన్నాడు. 


"ఏమో మరి". అంటున్న వైదేహితో, "ఏమో ఏమిటి, నువ్వు చీర కట్టుకుంటూ లోపల ఘడియ వేసుకోలేదా" అన్నాడు. 


"మీరు మరీను.. ఎందుకు వేసుకోనండీ? ఇదిగో ఘడియ ఎప్పుడు పాడయిందో. నేను వేసింది వేసినట్లే ఉన్నది.. కాకపోతే కింద" అన్నది. 


"మరి బైట ఎవరు ఘడియ పెట్టినట్లు? నేనిప్పుడే మొక్కల దగ్గరనుండి లోపలకు వస్తుంటే, అరుపులాంటి నీ పిలుపు వినిపించి తీసాను.. మరి".. ?


తనకి లోపల బోలెడంత పని ఉన్నది, ఈయన పంచాయతీ ఏమిటన్న విసుగులో, "అబ్బ.. చిన్నుగాడు ఆట పట్టించడానికి తలుపులు మూస్తూనే ఉంటాడు కదండీ.. వాడే అయ్యుంటాడు. మీరేమిటీ పెద్ద డిటెక్టివ్ లాగా ప్రశ్నలు?" అన్నది. 


"అమ్మా! నా కాలికి యాక్" అంటూ మారాము చేస్తున్న చిన్ను ప్రత్యక్షం. 


ఇంక వైదేహి చిరాగ్గా, "వెధవా ఎక్కడ తొక్కి వచ్చావు? ఇప్పుడే స్నానం చేసేడ్చ్చాను" అంటూ వాడి రెక్క పట్టుకుని బాత్రూంలోకి ఈడుచుకుపోయింది. 


'మరి చిన్ను ఇంట్లో లేకపోతే ఘడియ ఎవరు వేసినట్లు? ఎందుకు వేసినట్లు ? అంటే వైదేహి వేసిన ఘడియ కింద ఉన్నదంటే, తలుపులు తెరుచుకున్నాయా? ఆ తెరుచుకున్న తలుపులు మూసినదెవరు? ఎందుకు నేనింత ఆలోచిస్తున్నాను? అవును లోపల మనిషి బట్టలు మార్చుకుంటు ఉండగా, బైట ఘడియ వేసి ఉండటం వింతకాదా మరి?' రవి ఆలోచనల ప్రవాహం ఆగట్లేదు. 


హరి ఇంటినుండి బైటపడి బాంకుకి వెళ్లి ఆకలివేస్తుంటే అప్పుడు గుర్తుకొచ్చింది తను టిఫిన్ తిని రాలేదని. టిఫిన్ తెమ్మని ప్యూన్ కి చెప్పి పని మొదలు పెట్టబోతూ ఉండగా గుర్తొచ్చి, ఇంటికి ఫోన్ చేసాడు. ఎన్నిసార్లు మోగినా ఎవరూ తియ్యలేదు.. ఎక్కడికి వెళ్లారు అంతా?' అనుకుని, మళ్ళీ 'అన్నయ్య ఆఫీసుకి వెళ్ళాలి కదా.. వాడు లోపలికి వచ్చి తీసి ఉంటాడులే'. అనుకుని ఇంక పనిలోపడిపోయాడు. 


ఇక్కడ వైదేహి భర్త పనులు, పిల్లవాడి పనులు చూసి, వాళ్లద్దరికీ టిఫెన్లు పెట్టి, భర్థకి లంచ్ బాక్స్ ఇచ్చి కంపెనీకి పంపి, పిలవాణ్ని ఇంటిపక్కన నర్సీరీలో దింపి వచ్చింది. ఇంటికొచ్చి దేవుడి ప్రసాదం నోట్లో వేసుకుని తను టిఫిన్ తినడానికి కూర్చున్నది. హాట్ బాక్స్ లో మిగిలిన ఇడ్లీలు చూసి, 'ఇదేమిటీ ఇన్ని మిగిలాయి.. పనిమనిషికిచ్చే 4 ఇడ్లీలే కదా ఉండాలి? కొంపదీసి హరి తినలేదా ఏమిటి" అనుకుని ఫోన్ చేసింది. ఎంతసేపు చేసినా ఎంగేజే వచ్చేప్పటికి ఇంక ఊరుకున్నది. 


***

ఆఫీసులో పని చేస్తున్నాడన్న మాటే గానీ రవి మనసు మనసులో లేదు. 'బైట ఘడియ హరి వేసాడా? అంటే అప్పుడు తలుపులు తెరిచే ఉన్నాయా? ఉంటే వైదేహి ఏ పరిస్థితిలో ఉన్నది? అసలు ఘడియ వెయ్యాలంటే గదిదాకా రావాలి కదా.. అంటే ఏమిటి హరి ఉద్దేశం? అసలు పయిన తమ బాత్రూములో చెయ్యాల్సిన మనిషి తన భార్య కిందదాకా వచ్చి ఎందుకు చేసిందో.. అంటే నేనామాలోచిస్తున్నాను.. ఛీ.. ఛీ' పయిన బాత్రూములో రాత్రికిరాత్రి నల్లా పాడయిన సంగతి అప్పుడు గుర్తు రాలేదు రవికి. 


రవి మనసులో ఏమున్నదో గానీ, ఆ రోజు ఇంటికి వెళ్ళాక కూడా అందరి మీద చిర్రుబుర్రలాడాడు. హరి, 'ఓరినీ మొన్న హాస్యంగా మొదలైయి అనుకోకుండా డ్రెస్సింగ్ గురించి వచ్చి అన్నయ్య డ్రెస్ గురించి కొంచెం ఎక్కువగా నెగటివ్గా కామెంట్చేశానని అప్పుడే చాలా కోపం వచ్చింది.. దాన్ని ఇంకా సాగదీస్తున్నాడా.. ఇదివరకు లేని చాదస్తం వచ్చిందే అన్నయ్యకి. ' అనుకున్నాడు. 


వైదేహి, "హు.. ఎప్పుడూ ఆయన మా వాళ్ళని అంటుంటే నిన్న ఒళ్ళు మండి తనన్న మాట పట్టుకుని చూడు మొహం ఎలా గంటు పెట్టుకున్నారో ' అనుకున్నది. 


'ఈ నాన్నెప్పుడూ ఇంతే. ఈ సారి కూడా ఆ బాబీ గాడి లాంటి షూస్ కొనరుట. ఎంత కోప్పడ్డారో ఇందాక అడిగితే' చిన్ను గాడి చింత. 


***

పొద్దున రవి స్నానం చేసి షర్ట్ వేసుకుంటున్నాడు.. హరి ఆ రూమ్ ఎదురుకుండా నిలబడి, " అరేయ్ చిన్ను! నిన్న లెక్క ఇచ్చి చేస్తుండరా అంటే నేను స్నానం చేసి వచ్చేప్పటికే తుర్రుమన్నావు వెధవా" చెవి మెలిపెడుతున్న బాబాయి పెద్ద విలన్ లా తోచాడు చిన్నుకి. 'అసలే నాన్న షూస్ కొనను అంటుంటే ఇప్పడు ఇది కూడా విన్నారంటే, ఇంక ఎప్పటికీ కొనరేమో ' అంతే హడావుడిగా, "లేదు బాబాయ్ నేను అక్కడే ఉన్నాను. బీరువా పక్కనున్నా" అంటూ అబద్ధం చెప్పేసాడు. 

"ఓరి వెధవా వేలెడు లేవు, లెక్క చెయ్యకపోగా అబద్దాలు కూడానా? ఏం వదినా నువ్వు వచ్చేప్పటికి వీడు గదిలో ఉన్నాడా, ? ", అన్నాడు. 


రవి కి వైదేహి ఏమన్నదో వినపడలేదు.. చిక్కు ప్రశ్న సగం విడిపోయినట్లయింది. ఇంతలో వైదేహి, "వాడు ఆ గదిలో లేనేలేడు నేను స్నానం చేసి వచ్చేప్పటికి" అన్నది. 


ఈ మాటలు ఇంకా తేనె కురిపించింది. ఎంత స్వచంగా నిన్నటి గురించి మాట్లాడుకుంటున్నారు.. వాకిలి తలుపు మీద చప్పుడు చేసి, కారు తాళాల కోసం లోపలికి వచ్చిన వాచ్మాన్ మొత్తం చిక్కు ప్రశ్నకు సమాధానమయ్యాడు.. హరిగాడు బైట ఘడియ ఎందుకు వేసాడో తెలిపి!


నీడలు మాయమై నిజాలు తేటతెల్లమయ్యాయి.. కానీ రవి మనసులో అపరాధభావం అలజడి కలిగించింది!


***

విజయా సుందర్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



ree

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/vijayasundar

నా పేరు వారణాశి వెంకట విజయలక్ష్మి. కలం పేరు 'విజయాసుందర్'. నేను ముఖపుస్తక మాధ్యమాలలో రచనలు చేస్తుంటాను. గత 5 సంవత్సరముల నుండియే నేను వ్రాస్తున్నాను. ప్రముఖ ముఖపుస్తకము భావుకలో రెండు గొలుసు కథలు, రెండు సీరియల్స్, అనేక కథలు వ్రాసాను. పలు పోటీల్లో పాలుపంచుకుని అడపా దడపా బహుమతులు గెలుచుకున్నాను. భావుకథసలు పేరిట అచ్చు అయిన పుస్తకంలో నా కథ ' బాజా భజంత్రీలు' ఈనాడు పుస్తకపరిచయంలో చోటు చేసుకున్నది. 'కథాకేళి', 'ప్రియమైన నీకు, పిల్లలు చెప్పిన పాఠాలు' పుస్తకాలలో న కథలు అచ్చు అయ్యాయి. 'భావుక' లో 'బిజ్జు బామ్మ కబుర్లు' అనే శీర్షిక కొన్నాళ్ళు నడిపాను.మన కథలు మన భావాలు, ముఖపుస్తకం లో కూడా ఎన్నో కథలు రకరకాల కాన్సెప్ట్స్ కి తగ్గ రచనలు చేస్తూ ఉంటాను.

'లీడర్', 'ఉదయం', ఇంకా కొన్ని వెబ్ పత్రికలలో నా కథలు చాలా అచ్చయ్యాయి, పలువురి ప్రశంసలు అందుకున్నాయి. నా సాహితీ ప్రయాణంలో పలువురు సీనియర్ రచయితల సూచనలను అంది పుచ్చుకుంటూ నా రచనలను మెరుగు పర్చుకునే దిశలో ప్రయాణిస్తున్నాను. నమస్సులు!


Comments


bottom of page