top of page
Original_edited.jpg

నీలి మబ్బుల చాటున

  • Writer: Yasoda Pulugurtha
    Yasoda Pulugurtha
  • Dec 18, 2024
  • 5 min read

#YasodaPulugurtha, #యశోదపులుగుర్త, #నీలిమబ్బులచాటున, #NeeliMabbulaChatuna, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

ree

Neeli Mabbula Chatuna - New Telugu Story Written By Yasoda Pulugurtha 

Published In manatelugukathalu.com On 18/12/2024

నీలి మబ్బుల చాటున - తెలుగు కథ

రచన: యశోద పులుగుర్త 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



"రమా! నాదో చిన్న కోరిక తీరుస్తావా?" అడిగాడు రాఘవ్.


రమ కంటిలో సన్నని కన్నిటి పొర. అది అతని కళ్లబడ కూడదనేమో కాస్త ప్రక్కకి తిరిగింది. 

బలహీనమైన అతని స్వరం లోని ఆర్ద్రత కు చలించి పోయిందో, ఇక ఇప్పుడు తీర్చకుంటే ఎప్పటికీ తీర్చలేనని బాధపడుతోందో తెలీదు. 


రమ వైపు నిశితంగా పరిశీలించి చూశాడు. 

కళ్ళ క్రింద నల్లటి వలయాలు. పీక్కుపోయిన ముఖం. 


'అసలు రోగి నేనా.. !? తనా.. !?' అని సందేహిస్తారు చూసిన వారెవరైనా. నేను కోరబోయే కోరిక, నా వరకూ సమంజసమే. రమ కూడా అర్థం చేసుకుంటుందనే నమ్మకం నాకుంది. 

మరి నా కోరిక, ఈ సమాజం దృష్టిలో నన్ను ఎలా నిలబెడుతుందొ తెలియదు. ఇంతకూ ఈ విషయాన్ని ఆమె ఎలా అర్థం చేసుకుంటుందో.. ! అసలు’సరే!' అంటుందో లేదో.. !? నా కోరిక తీరుతుందో! లేదో.. !' 


ఇలా ఆలోచిస్తూ నిట్టూర్చిన రాఘవ్  ను చూసి రమ దుఃఖాన్ని అదుపు చేసుకుని.. 

"మీరు దిగులు పడకండి. మీ కోరిక తీరుస్తాను. ఎప్పుడూ ఒకే ఒక్క కోరిక అనడమే తప్ప, ఆ కోరిక ఏంటో చెప్పరు. ఇప్పటికైనా చెప్పండి. నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. " దుఃఖం తో స్వరం కంపిస్తుండగా అంది రమ. 


రమను బాధపెడుతున్నాడని తెలుసు కానీ, తను ఈ విషయం లో బలహీనుడు. 

తనకు ఇప్పుడు రమను అభ్యర్థించటం తప్ప మరో గత్యంతరం లేదు. ఇక తన ఈ ఊపిరి సయ్యాటలు ఎన్నాళ్ళో తెలీదు. తీరని కోరికతో తన జీవితం తీరిపోవడం అతనికి ఇష్టం లేదు. 


భార్య రమ  అతని మరదలే కనుక, అతన్ని ప్రాణప్రదంగా ప్రేమించిన మనిషి కనుక.. 

‘ఆమె ని ఎలాగైనా ఒప్పిస్తాను’ అంటూ అతని చేతి లో తన చేయి వేసింది, ప్రమాణం చేస్తున్నట్లు. 


"రమా.. ! నిన్ను బాధ పెడుతున్నాను కదా! నేను ఎంత దుర్మార్గుడినో కదా! నా జబ్బు తో మాత్రమే కాదు. నా కోరిక తో కూడా నిన్ను బాధ పెడుతున్నాను." అంటూ రమ కళ్ళల్లోని భావాలను వెతికి చూసాడు రాఘవ్. 


@@


“మీరు సందేహించకండి బావా? మీ కోరికను తీర్చలేకపోయాననే బాధ నాకు మిగలనీయకండి దయచేసి”, కళ్లల్లో నుండి ఉబుకుతున్న కన్నీటి చుక్కలను బయటకు రానీయకుండా అణచివేసింది. 


“నీవు ప్రేమ మూర్తివని తెలుసును రమా, కానీ ఏదో తప్పు చేసానన్న భావం, నీతో పంచుకోలేని బలహీనతతో ఇంతవరకూ దాచిపెట్టాను”. 


అసలు నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు మొదటినుండీ లేదు రమా.. మీ అమ్మా నాన్నా కొద్ది నెలల వ్యత్యాసంతో చనిపోవడంతో అమ్మ నిన్ను తీసుకు వచ్చేయడంతో మనం అంతా చిన్నప్పటినుండి కలసి పెరిగాం. యుక్త వయస్సు వచ్చినా నిన్ను ఎప్పుడూ నేను మరోలా ఊహించుకోలేకపోయాను. వైజాగ్ లో నా కాలేజ్ చదువు అప్పుడప్పుడు శెలవలకు రావడం వెళ్లిపోవడం. నీవు నా వైపు ఆరాధనగా చూసే చూపులు నాకు అర్ధం అయ్యేవికావు. నేను పి. జీ చేస్తున్నప్పుడు రాగిణి నా క్లాస్ మేట్. ఎప్పుడూ తన చదువు తప్పించి మరో ధ్యాస లేని రాగిణి అంటే ప్రేమ కలిగింది. నా చదువు పూర్తి అయిఁది. హైద్రాబాద్ లో ఉద్యోగం వచ్చిందని రాగిణికి చెప్పి నా ప్రేమ విషయం కూడా చెపుదామని ఆమెను కలిసాను. 


నేను ప్రేమిస్తున్నానని చెప్పగానే తాను పెళ్లికి అనర్హురాలని, తనకి పందొమ్మిది సంవత్సరాల వయస్సులోనే ఆమె దూరపు బంధువుల అబ్బాయితో వివాహమైందని, పెళ్లైన రెండు సంవత్సరాలకు అతను న్యుమోనియాతో చనిపోయాడని చెప్పింది. అయినా ఫరవాలేదన్నాను. మీ పెద్దవాళ్లు ఒప్పుకుంటే నాకు అభ్యంతరం లేదంది. 


అమ్మకీ విషయం చెపితే చాలా గొడవచేసింది. రమ ని తప్పించితే మరే అమ్మాయిని కోడలుగా స్వీకరించలేనని తెగేసి చెప్పింది. పైగా కులంకాని అమ్మాయి, నీ చెల్లెళ్ల పెళ్లిళ్లు కష్టమవుతాయని రమని చేసుకోపోతే తను చచ్చినంత ఒట్టని తెపుతూ నన్ను బలహీనుడుని చేసేసింది. రాగిణికి ఈ విషయం చెపితే నీవు నీ మరదలిని చేసుకోవడమే ఉత్తమం అంది. 


నీతో నా పెళ్లి నా ఇష్టంతో ప్రేమేయం లేకుండా జరిగిపోయింది. రాగిణికి కూడా హైద్రాబాద్ లో ఉద్యోగం వచ్చింది. రాగిణిని మరచిపోలేక పోయాను. అప్పుడప్పుడు తనను కలుసుకోవడంతో తిరిగి మా మధ్య బంధం బలపడింది. తప్పుచేస్తున్నానని ఆ సమయంలో అనుకోలేదు. నీతో ముభావంగా ఉండేవాడిని. ఆఫీస్ టూర్ అని చెపుతూ రాగిణి దగ్గర గడిపేవాడ్ని. మేమిద్దరం ఇష్టపూర్వకంగా కలుస్తూ ఉండేవాళ్లం. ఫలితం రాగిణి తల్లి అయింది. మాకు కూతురు పుట్టింది..”

 

అలసటతో మాట్లాడలేక కాసేపు మౌనంగా ఉండిపోయాడు రాఘవ్.. 


‘అవును బావా నీవంటే చాలా ఇష్టం గా ఉండేది చిన్నతనంలో. ఊహ వచ్చిన తరువాత నా కలల రాకుమారిడివే నీవే అన్నట్లుగా ఊహించుకునేదాన్ని. నన్ను చేసుకోవడం నీకిష్టం లేదని అప్పుడే ఎందుకు చెప్పలేకపోయారు బావా? మీరు నాకు ఈ విషయాన్ని అప్పుడే చెపితే నేను మీ పెళ్లి రాగిణితోనే అయేటట్లు చూసేదాన్నికదా అని మనసులో తలబోసింది’. 

‘కొద్ది సేపు గడిచాకా రాఘవ చెప్పడం కొనసాగించాడు..

 

“నేను రాగిణి దగ్గరకు వెడ్తున్నా అదివరకటి లాగ ఉండేది కాదు. ఎందుకో ముభావంగా ఏదో బాధను దిగమింగుకుంటున్నట్లుగా కనపడేది. ‘ఎందుకు అలా ఉంటున్నావని అడిగాను. ఏమీ లేదనేది’. 


ఒక వారం రోజుల తరువాత తనని కలవాలని వెళ్లాను. తను లేదు. పక్కింటి వాళ్లను అడిగితే రెండురోజుల క్రితమే ఆవిడ ఇల్లు ఖాళీచేసారని ఎక్కడకి వెళ్లిందో తెలియదన్నారు. ఆఫీసు లో వాకబు చేస్తే నెలరోజుల క్రితమే రిజైన్ చేసిందని చెప్పారు. 


ఎన్నిరోజులు చూసినా తన జాడ తెలియలేదు. ఏ సమాచారం లేదు తననుండి. రాత్రీ పగలు రాగిణి ఆలోచనలే. సంవత్సర కాలం నిర్వికారంగా గడచిపోయింది. సడన్ గా నా హృద్రోగ సమస్య, అనారోగ్యం, డాక్టర్ల మందులతో కాలం భారంగా నడుస్తున్న సమయంలో ఒకరోజు రాగిణి నుండి లెటర్ వచ్చింది. 


తనకి ఒవేరియని కేన్సర్ ఆఖరిదశలో ఉందని, ఎక్కువ రోజులు బ్రతకనని వ్రాసింది. రమ కు అన్యాయం చేసిన ఫలితంగా దేవుడు తనకీ శిక్ష విధించడం న్యాయమేనని, పాపను ఒక స్నేహితురాలికి అప్పగించానని వ్రాసింది. స్నేహితురాలి ఫోన్ నంబర్ ఇచ్చింది. తనను చూడడానికి రావద్దని మరీ కోరింది. అయినా నేను కదలలేని స్తితిలో ఉన్నాను”

 

అలసటతో తను చెప్పాలనుకున్న విషయం చెప్పలేక నిస్రారణగా వాలిపోయాడు. 

వారం రోజులు రాఘవ ఆరోగ్య పరిస్తితి మరీ సీరియస్ అయింది. ఆరోజు ఉదయం కాస్తంత మాట్లాడగలుగుతున్నాడు. 


“రమా ఇలా దగ్గరకు వచ్చి నా దగ్గర కూర్చోవూ” అంటూ అర్ధ్రంగా పిలిచాడు. 


“బావా, మీరు ఎక్కువ మాట్లాడకండి. ఇదిగో మిమ్మలని చూడాలని నాగపూర్ నుండి శ్రీలత వచ్చారు”. 


శ్రీలత వెంట ఒక నాలుగు సంవత్సరాల పాప, ముద్దుగా అందంగా ఉంది. 

రాఘవ్ కి తనను తాను పరిచయం చేసుకుంటూ రాగిణి ఫ్రెండ్ నని చెప్పింది. 


“మీ మిసెస్ రమగారు ఫోన్ చేస్తే వచ్చాను రాఘవ్ గారూ. మీ గురించి రాగిణి అంతా చెప్పింది”. 


రమవైపు సాలోచనగా చూసాడు. 


“బావా కంగారు పడకండి. మీరు నాకు ఏమి చెప్పాలనుకున్నారో, నా నుండి ఏమి కోరుకుంటున్నారో అర్ధం చేసుకోలేని అమాయకురాలిని కాదు”. 

‘’ఇందులో నా తప్పూ ఉంది. మిమ్మలని పిచ్చిగా ప్రేమించి మీరే కావాలని కోరుకుని మీకు ఇష్టంలేకపోయినా బలవంతంగా నా వాడిని చేసుకోవడం”. ఎంత స్వార్ధపరురాలినో అనుకుంటూ ఉంటాను. 


బావా! ఒకసారి మీ డైరీలు తప్పని తెలిసినా చదివాను. మీ మౌనం వెనుక ఏమిదాగి ఉందో తెలుసుకోవాలన్న ఉత్సుకతో. మీ జీవితంలో రాగిణి అనే అమ్మాయికి స్తానం ఉందని, మీకు ఒక పాప కూడా ఉందని తెలిసింది. బాగా ఏడ్చాను. కానీ ఆలోచిస్తే మీరు ఆమెను ప్రేమించడం, పెళ్లిచేసుకోవాలనుకోవడంలో తప్పేముందని అర్ధం చేసుకున్నాను. ప్రేమించడం తప్పుకాదు. అత్తయ్స బలనంతం మీద నన్ను పెళ్లి చేసుకున్నారు. రాగిణిని మరచిపోలేకపోయార’. 


నాకు అన్యాయం చేయకూడదనుకుంటూ నాకూ మీ ప్రేమను అందించారు. నాకు మీ విషయం తెలుసునని మీకు చెప్పి మిమ్మలని చిన్నపుచ్చి, మీ తప్పుని కసితీరా కడిగిపారేయాలని అనుకోలేదు. శారీరకంగా మానసికంగా నలిగిపోతున్న మిమ్మలని బాధ పెట్టలేని మానవత్వం నన్ను మౌనం వహించమని పదే పదే హెచ్చరించింది. రాగిణి మీకు రాసిన లెటర్ కూడా చదివాను బావా. ఫోన్ చేసి శ్రీలతను నేనే పిలిపించాను. అన్నట్లు శ్రీలత వెంట ఉన్న పాపెవరో తెలుసా? మీ ఇరువురి ప్రతిరూపం, మీ కన్న కూతురు. ఇక నుండి ఆ పాప మన కూతురే బావా. మన బాబు శ్రీకర్ కి చెల్లెలు. పాపను నా కన్న కూతురిగా చూసుకుంటాను బావా, నన్ను నమ్మండి. మీరు నా నుండి కోరేది ఇదే కదా బావా?”


అవునంటూ తలూపాడు. 


తను చేసిన తప్పుని సమాజం హర్షించక పోయినా రమ అర్ధం చేసుకుంది. రమ మంచితనం పట్ల అతని హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. మనస్సు తేలికపడింది. ఈ జీవితానికీ ఆనందం చాలనుకుంటుండగా అతని కళ్లు శాశ్వతంగా మూతపడ్డాయి. 



***

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం :  

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.


ree


ree




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page