top of page
Writer's pictureDr. Rama Mohana Rao Munaga

నేను పిసినారోణ్ణి


కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి





'Nenu Pisinaronni' written by Dr. M. Rama mohana Rao

రచన : Dr. M. రామ మోహన రావు

'వాగ్దేవి అంత్యోదయ ఫౌండేషన్’ తో నాకు చాలా అనుబంధం వుంది. వాళ్ళు ఏ ఆసరాలేని అంగవైకల్యంతో వున్న చిన్న పిల్లలను తమ ఆశ్రమంలో చేర్చుకుంటారు. వారికి సరైన చికిత్స చేయిస్తారు. వాళ్లకి ఏ రకమైన విద్యాబుద్ధులు సరిపోతాయో గమనించి, దానికి అనుగుణంగా వాళ్ళను చదివిస్తారు. ఇలా వాళ్ళ జీవితానికి కూడా ఒక సార్ధకత ఉందని నిరూపించారు. ఈ ఆశ్రమంలో చేర్చుకోబడిన పిల్లలు చదువులో ఎంతో ఉత్తీర్ణతను సాధించి, గత పది సంవత్సరాలలో ఐ ఐ టి, ఐ ఐ ఎం, ఐ ఏ ఎస్ లాంటి కోర్సులు కూడా పూర్తి చేశారు.

అందులోని విద్యార్థులు అందరూ ఆడపిల్లలే. ఎంతోమంది స్వచ్ఛంద సభ్యులు వారి ఆలనా పాలనా చూస్తూ ఆర్థికంగాను, సమయం వెచ్చించటంతోనూ వాళ్లకు తోడుగా నిలుస్తూ ఆశ్రమ నిర్వహణకు సహకరిస్తున్నారు.

అది ‘వాగ్దేవి అంత్యోదయ ఫౌండేషన్’ రజతోత్సవ వ్యవస్థాపక దినోత్సవం. నేను కూడా దాంట్లో పాల్గొన్నాను. ఆ వ్యవస్థకు మొదటినుండీ అండగా ఉండి, చాలా తరచుగా అక్కడికి వచ్చే బోసుగారికి ఎందుకో తెలియదు, నేనంటే ప్రత్యేక అభిమానం!

కార్యక్రమం అయిపోయిన తరువాత ఆశ్రమ విషయాలు మాట్లాడుతూ “ఇప్పటివరకు మన ఆశ్రమంలో ఉన్నవారిలో, 30 మంది బాలికలకు వున్నత విద్య పూర్తి చేసిన తరువాత పెళ్లిళ్లు జరిగాయి. కానీ ఇప్పటికీ 25 ఏళ్లనాటి చాలీ చాలని వసతులే! పిల్లల సంఖ్య పెరిగిపోయి ప్రస్తుతం 250 మంది అయ్యారు. ఎంత స్వచ్ఛందం అయినప్పటికీ కొంత మందికి.. ముఖ్యంగా ఆయాలు మొదలైన వాళ్లకి జీతాలు ఇవ్వక తప్పటం లేదు. మిత్రులు, శ్రేయోభిలాషులు ఇచ్చే విరాళాలు, సామానులు పిల్లల నిత్యావసరాలకే సరిపోతున్నాయి. పిల్లలకైతే మూడు పూటలా భోజనం పెట్టగలుగుతున్నాం కానీ, వాళ్ళకి అందించే శిక్షణ ఇంకా మెరుగ్గా ఉండాలంటే ఫుల్ టైం టీచర్స్ కావాలి. వాళ్ళకు జీతాలు ఇవ్వాలి. మెరిట్ స్టూడెంట్స్ కు కాలేజీల్లో కొంతైనా ఫీజు కట్టాలి. ఈ పాటికి మీకు అర్ధం అయి వుంటుంది రామంగారూ ! పెద్దమనసు చేసుకొని మీరు నెలకో రెండు రోజులు ఈ ఆశ్రమం నిమిత్తం కేటాయించండి. నాకు చాలా ప్రణాళికలు వున్నాయి. వాటికి మీ సహాయ సహకారాలు చాలా అవసరం” అని బోసుగారు నాతో అన్నారు.

“ నేను రిటైర్ అయ్యానుగానీ ఇంకా చదవవలసినవి చాలా ఉన్నాయ”ని వారితో అని, “అయినా చెప్పండి! నాదగ్గర నుండి ఏమి ఆశిస్తున్నారు?” అని అడిగాను .

“ఇప్పటి వరకూ మనము సహాయం కోసం ఈ మహానగరంలో మన చుట్టుపక్కల వున్న దాతల వద్దకు వెళ్లడం మన ఆనవాయితీ అయింది. ఈ సారి ఒక క్యాంపైన్ లో చుట్టుపక్కల గ్రామాల్లోని దాతలను కలుద్దాం. మన పిల్లల అదృష్టం కొద్దీ ఎవరైనా సహాయ పడక పోతారా! నాకు అయితే ఎందుకో సహాయం అందుతుందని గట్టిగా నమ్మకం కలుగుతోంది. మీరు కూడా నా ఈ ప్రయత్నంలో భాగంగా వుండాలి” అన్నారాయన.

ఆ తరువాతి ఆదివారం జహీరాబాద్ సమీపంలోని ఒక గ్రామానికి వెళ్ళాం. బోసుగారికిగాని, నాకు గాని ఆ గ్రామంలో తెలిసినవాళ్ళు ఎవరూ లేరు. అక్కడ రచ్చబండ దగ్గర వున్న కొంతమంది వ్యక్తులు మమ్మల్ని చూసి “ఎందుకు వచ్చారు.. ఎవరు కావాలి?” అనగానే మేము వచ్చిన పని చెప్పాము. అప్పుడు వాళ్ళు అక్కడకు దగ్గరలో వున్న వీరేష్ గారి దగ్గరికి వెళ్ళమని సలహా ఇచ్చారు.

వీరేష్ గారి ఇంటికి తేలికగానే చేరాము. ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేసారు. అది వేసవి సాయంత్రం. తలుపు తట్టగానే ఒక 60 ఏళ్ల వ్యక్తి , మంచి ఆరోగ్యంతో వున్న ఆయన సగం తలుపు తీసి “ఏంటి? చందాకు వచ్చారా..? ‘నేను పిసినారివోడిని’. ఆ పనికిమాలినోళ్లు మిమ్మల్ని మా ఇంటికి వెళ్ళమనుంటారు! నా దగ్గర చందాలు ఇవ్వడానికి ఏమీ లేదు. వున్నా ఇవ్వను!” అని ముఖం మీద కొట్టినట్లు మాట్లాడి, తలుపు వేసుకోబోయారు.

అప్పుడు నేను “అయ్యా! మేము హైదరాబాద్ నుండి వచ్చాము. కొంచెం మంచినీళ్లు ఇప్పించండి. చాలా దాహంగా వుంది” అన్నాను. ఆ సమయంలో నాకు నిజంగా దాహం వేస్తోంది కూడా!

ఏమనుకున్నారో ఏమో... మా వయసు కూడా ఇంచుమించు ఆయన వయసు ఉండటం వల్లనో ఏమో, కొంచెం మెత్తబడి లోనికి రమ్మని, ముందు వరండాలోని కుర్చీలలో కూర్చోమని, లోపలినుండి మంచినీళ్లు తీసుకురమ్మని ఆయన భార్యతో ఓ కేక లాంటిది వేశారు. కాస్సేపటికి వారి భార్య ఎంతో మర్యాదగా మాకు మంచినీళ్లు ఇచ్చి, ‘మేమెవరం?’ అని సైగలతో వీరేశం గారిని అడిగారు.

ఆయన, “వీళ్ళు హైద్రాబాదు నుంచి వచ్చారట! ఎందుకు వచ్చారో తెలియదు. మనం ‘పిత్తనాసి వాళ్ళం’ అని, మనింట్లో పెళ్ళిళ్ళకి కూడా ఎవరూ లేరని చెప్పాను. కొంచెం సేపు ఉండి వెళ్ళిపోతారు” అని చెప్పారు. ఈ లోపు ఇంటర్ చదివే వాళ్ళ మనుమడు పెరట్లో స్కూటర్ స్టాండ్ వేసి లోపలికి వచ్చాడు. ఆ అబ్బాయి మమ్మల్ని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయాడు .

అంతలో ఆయన కూడా మా ఎదురు కుర్చీలో కూర్చుని , ఇంతకీ మీరు చూస్తే పెద్దమనుషుల్లా వున్నారు. ఏం చేస్తుంటారు? మా వూరికి ఎందుకు వచ్చారు?” అని అడిగారు. అప్పుడు బోసుగారు తాను పెద్ద పెద్ద రోడ్డు కాంట్రాక్టులు చేసేవాడినని, ఇప్పుడు వ్యాపారం వాళ్ళ అబ్బాయికి అప్పచెప్పి, రిటైర్ అయ్యి తోటివారికి చేతనైన సహాయం చేస్తూ వుంటాను” అని అన్నారు

నేను కూడా “ప్రైవేట్ వుద్యోగం చేసి రిటైర్ అయ్యాను. పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు” అని చెప్పి “బోసుగారి కార్యక్రమాల్లో సహాయం చేస్తుంటాను” అన్నాను.


మా గురించి సావకాశంగా విన్న తరువాత ఆయనలో కొంచెం స్థిమితం కనబడి, తన గురించి ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టారు. తనకు ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడ పిల్ల అని, మనుమలు మనవరాళ్లు ఆరుగురని చెప్పారు.

"మీ పిల్లలు ఏం చేస్తున్నారు? మనవలు,మనవరాళ్లు ఏం చదువుతున్నారు?" అని అడిగాను నేను.

“పెద్దబ్బాయి బ్యాంకులో మేనేజర్. చిన్నబ్బాయి ప్రైవేట్ కంపెనీలో సూపర్ వైజర్. అమ్మాయికి పెళ్లి అయిన తరువాత అమెరికాలో వుంటున్నారు. నాకు యాభై ఎకరాల మాగాణి భూములు, ఉండటానికి ఇల్లు ఉన్నాయి” అని చెప్పి మనవలు, మనవరాళ్లు ఏం చదువుతున్నారో వివరంగా చెప్పారాయన.

తరువాత తన గురించి చెబుతూ “ఇప్పటివరకు నేను ఎవ్వరికీ ఏమీ ఇవ్వలేదు. వాళ్లకు ఏదో చదువులు చెప్పించాను.. పిల్లలకు పెళ్లిళ్లు చేశాను! వాళ్ళ మానాన వాళ్ళు బ్రతుకుతున్నారు. అంతే తప్ప నేను ఎవరికీ ఏమీ చేయలేదు. ఎందుకో ఏమో.. ఏమీ చేయటానికి కూడా నా మనసు అంగీకరించదు. అందుకే ‘నేను పిసినారోణ్ణి’. అందరూ నన్ను అలాగే అంటారు” అని చెప్పటం ఆపేశారు.

అంతవరకూ ఆయన భార్య పార్వతమ్మగారు మేము మాట్లాడుకునేది వింటూనే వున్నారు. అంతలో బోసుగారు వారిచేతులు ఆప్యాయంగా పట్టుకొని “వీరేశంగారూ! మీరు ఏ విధంగానూ పిసినారి కాదు. మీరు మీ పిల్లల్ని చక్కగా చదివించి, వాళ్ళను ప్రయోజకుల్ని చేశారు. అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. వాళ్ళు అందరూ మంచి వృద్ధిలో వున్నారు. ఇప్పుడు మీ అబ్బాయి పిల్లలు మీతోనే వుంటున్నారు. వాళ్లకు కావలసినవి మీరు సమకూరుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మీరు పిసినారి అని ఎందుకు అనుకుంటున్నారు? పిసినారి అంటే ఎప్పుడూ తన గురించే ఆలోచిస్తూ, తన వారి గురించయినా, పరాయి వారి గురించయినా ఏమాత్రం స్పందన లేకుండా, ఒక అనాగరిక జీవితం గడిపేవాడిని మాత్రమే పిసినారి అని అంటారు. నా ఉద్దేశం ప్రకారం మీరు మాత్రం పిసినారి కాదు. మీరు మీవాళ్లందరి క్షేమం గురించి ఎంతో శ్రమ పడి వాళ్ళను పైకి తీసుకు వచ్చి మీ బాధ్యత నిర్వర్తించారు!” అన్నారు.

“అప్పుడు వీరేశంగారు, “అయితే నేను ఎవ్వరికీ ఏమీ ఇవ్వనప్పటికీ పిసినారిని కానా? మరి అందరూ నన్ను పిసినారి అంటుంటే నేను కూడా నన్ను నేను పిసినారి వాడిననే భావనలో వున్నాను. మీరొక్కళ్ళే నేను పిసినారిని కాదు అంటున్నారు!” అని అన్నారు. ఆయనకు కలిగిన భావావేశానికి పక్కనే వున్న పార్వతమ్మగారి కళ్ళ నుండి రెండు కన్నీటి బొట్లు రాలాయి.

ఇప్పటి వరకూ పిసినారి భార్యనే అనుకుంటూ ఇరుగుపొరుగు వారి సూటిపోటి మాటలను వింటూ కుమిలిపోతున్న ఆమె మనసులో ‘ఆ భావన పూర్తిగా నిజం కాదు’ అన్న విషయం తెలియగానే, తనూ అందరిలాంటి దానినే అని మనస్సు తేలిక పడిందో ఏమో, కంటి నుండి నీటి బొట్లు రాలాయి. అది చూసి వీరేశంగారు కూడా చలించిపోయి ఉద్వేగానికి లోనయ్యారు. కొంచెం సేపటికి తమాయించుకొని మామూలు మనిషి అయ్యి, చిన్న పిల్లవాడిలా ఇలా అన్నారు

“అయితే నేను కూడా మనసున్న మనిషినేనా ? కానీ ఇప్పటివరకు నేను అందరిలాంటి వాడిని కానేమో.. అనుకుంటూ ఎవ్వరితోనూ సంబంధం పెట్టుకొనే వాడిని కాదు” అని చెప్పారు.

అప్పుడు నేను అన్నాను , “వీరేశంగారూ! ప్రపంచంలో ఇంకొకళ్ళని విమర్శించే వ్యక్తుల్లో చాలా మంది విమర్శింపబడే వ్యక్తి కంటే ఎంతో నీచ ప్రవృత్తి కలవాళ్ళు అయివుంటారు. మిమ్మల్ని ఒకటి అడుగుతాను. మిమ్మల్ని పిసినారి అన్న వాళ్ళలో ఎంతమంది తోటి సమాజానికి ఉపయోగపడే పనులు చేశారు? మీ వూరి బడి ఇంత

అధ్వాన్నంగా వుంది. రోడ్లు బాగోలేవు. చదువుకోవడానికి ఒక లైబ్రరీ లేదు. మరి మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు ఏ విధంగా మీకంటే వున్నత స్థానంలో వున్నారు?” అనగానే

మాటలలోని భావాన్ని అర్ధం చేసుకున్నవారై, మనస్సు పులకరింతతో అప్పటివరకు అనుభవంలోకి రాని సంతోషం లో మునిగి పోయారు.

“ఇక వెళ్ళొస్తాము” అని మేము అనగానే ఆయన మమ్మల్ని ఆ రాత్రికి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి, రాత్రికి అక్కడే ఉండమని బలవంతం చేశారు. మేము ‘మరోసారి వస్తాం’ అన్నా కూడా ‘నేను పిసినారిని కాదు అని నిరూపించటానికి మీరు మా ఆతిధ్యం తీసుకోవడమే సాక్ష్యం’ అన్నారు. మేం కాదనలేక ఆ రాత్రికి వాళ్ళ ఇంట్లోనే వున్నాం. పార్వతమ్మగారు చక్కటి భోజన ఏర్పాట్లు చేశారు. మరుసటి రోజు వీడ్కోలు తీసుకుంటున్న సమయంలో ‘ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు?’ అని అడిగితే ఆశ్రమంలో జరిగే కార్యక్రమాల గురించి, అనాధ పిల్లల బాగోగులు ఏ విధంగా చూడబడుతున్నాయో వివరంగా చెప్పగానే అనూహ్యంగా మాతోపాటు హైదరాబాద్ కు బయలుదేరి ఆశ్రమానికి వచ్చారు.

మేము ఆశ్రమానికి చేరిన కొద్దిసేపటికే, భోజన సమయం అవ్వగానే, అందరు పిల్లలు సామూహికంగా ప్రార్ధన చేసి ఎంతో క్రమశిక్షణతో భోజనం ముగించుకొని, వాళ్ళ పనుల్లోకి వాళ్ళు వెళ్ళటం గమనించారు. వాళ్ళు ఆశ్రమ బాలికలు, టీచర్స్ మరియు ఇతర సిబ్బందితో కలిసి భోజనం ముగించుకుని, మాతో “మీకు అభ్యంతరం లేకపోతే మేం ఇక్కడ రెండు రోజులు ఉండవచ్చా?” అన్నారు.

దానికి బోసుగారు “మహత్ భాగ్యం” అని వారు ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేశారు. రెండో రోజు మధ్యాహ్నం వారి ఊరికి తిరుగు ప్రయాణానికి బయలుదేరుతూ దగ్గరలో వున్న బస్టాండ్ లో దింపమని అడిగినప్పుడు, బోసుగారు ఆయన కారులో వాళ్లకు తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు.

నేను, బోసుగారు వాళ్ళిద్దరిలో కలిగిన మార్పుని నిశితంగా గమనిస్తూనే వున్నాం. వాళ్ళు ఆశ్రమంలో వున్న రెండు రోజుల్లో ఆశ్రమ నిర్వహణ ఎలా జరుగుతోందో పరిశీలించారు. ఎంతో మంది ఉదారంగా సహాయం చెయ్యడం, అలా అందిన సహాయాన్ని ఎంతో పొందికగా పిల్లలకు వినియోగించడం గమనించారు. ఇక్కడ చదువుకొని ఎంతో రాణించిన, రాణిస్తున్న పిల్లల గురించి అడిగి తెలుసుకున్నారు. వాళ్ళు వెళ్ళిన వారం రోజులకు బోసుగారికి వీరేశం గారి నుండి ఫోన్ వచ్చింది. మా ఇద్దరిని వీలు చూసుకొని వెంటనే వారి వూరికి రమ్మన్నది సారాంశం.

మేం మరుసటి రోజు వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి వారి ఇద్దరు అబ్బాయిలు, కోడళ్ళు వచ్చి ఉన్నారు. అనుకోకుండా అదే సమయానికి వేసవి సెలవులకు పిల్లలతో కలిసి వాళ్ళ అమ్మాయి కూడా వచ్చి వుంది. మేం వెళ్ళగానే మమ్మల్ని ఎంతో ఆదరించారు. వారి అందరి ముఖాల్లో ఏదో తెలియని ఆనందాన్ని మేము గమనించాం.

అల్పాహారం అన్నీ అయ్యాక వీరేశంగారు అన్నారు “బోసుగారూ, రామంగారూ! నా అరవైఏళ్ల జీవితంలో ఏనాడు మీ ఆశ్రమమంలో గడిపినంత ప్రశాంతంగాను , ఆనందంగాను ఎప్పుడూ లేను. ఈ విషయం చెప్పగానే మా పిల్లలందరూ ఎంతో సంతోషించారు. ఇన్నాళ్ళు బయటి వాళ్ళు ఎంత చులకనగా చూస్తున్నారన్న విషయం నాతో చెప్పడానికి భయపడి, వాళ్లలో వాళ్ళే కుమిలిపోతున్నారని తెలిసింది.

నేను ఆశ్రమానికి నాకున్న పొలంలో ఒక ఇరవై ఎకరాలు విరాళంగా ఇద్దామని నిశ్చయించుకున్నాను. మిగిలిన ముప్పై ఎకరాల్లో వచ్చే ఆదాయంతో మా ఇద్దరి జీవితాలు వెళ్లిపోతాయి. మా తదనంతరం ముగ్గురు పిల్లలకు తలో పది ఎకరాలు చెందుతాయి. ఈ నా నిర్ణయాన్ని మా కుటుంబ సభ్యులందరూ ఎంతో సంతోషంతో ఒప్పుకున్నారు. వాళ్లకు మేము కూడా సమాజంలో భాగమనే గుర్తింపు వస్తుందని ఎంతో సంతోషపడుతున్నారని చెప్పి, ఈ భూమి ఇప్పుడు ఎకరా ముప్పై లక్షలు దాకా పలుకుతుంది అంటున్నారు. దాన్ని కౌలుకి ఇచ్చి దాని మీదొచ్చే కొద్దిపాటి ఆదాయంతో ఆశ్రమానికి పెద్దగా మార్పుండదు. అందుకని దాన్ని ఆశ్రమానికి దానంగా ఇస్తాను. దాన్ని మీరు అమ్మేసి శాశ్వత నిధి ఏర్పాటు చేసి దాని మీద వచ్చే ఆదాయంతో ఆశ్రమ పిల్లలకు ఇంకా మంచి ఏర్పాట్లు చెయ్యండి. ఆదాయంలో మిగిలిన సొమ్ముతో ఆశ్రమంలో ఇంకా వసతులు ఏర్పరచండి” అని మా ముందే దానపత్రం తయారు చేయించారు. వారి కుటుంబ సభ్యులందరూ సంతకం చేసి మనస్ఫూర్తిగా మా చేతికి ఇచ్చారు.

ఈ విషయం ఎలా తెలిసిందో ఊరి జనం అందరూ వీరేశంగారి ఇంటిముందు చేరి, వారిని పూలమాలలతో సత్కరించటానికి ఊరి ప్రెసిడెంట్, మిగతా పెద్దలు అందరూ కూడా సమావేశమయ్యారు.

ఈ కథ అప్పటితో ఆగలేదు. వారిద్దరూ ఇప్పుడు ఆశ్రమంలో భాగమై, పిల్లలతో మమేకమై ఎంతో చేదోడుగా వున్నారు. వారిరువురిలో ఇప్పుడు " పిసినారి వాళ్ళం కాదు. మనసున్న మనుషులం " అనే విశ్వాసం పూర్తిగా ఏర్పడింది.

***శుభం***


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.




423 views0 comments

Comments


bottom of page