top of page

నిజం చెప్పాలంటే


'Nijam Cheppalante' New Telugu Story

Written By Sujatha Thimmana

నిజం చెప్పాలంటే తెలుగు కథ

రచన: సుజాత తిమ్మన


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

“టీ తీసుకోండి అత్తయ్యగారు” అంటూ వేడివేడి పొగలు కక్కుతున్న టీ కప్పుతో ఇచ్చింది కోడలు అవంతిక. మరో కప్పు “మావయ్యగారు మీరు కూడా టీ..”అంటూ శ్రీవారికి అందించింది.


చిరునవ్వుతో తల ఊపుతూ కళ్ళతోనే థాంక్స్ చెప్పాను. టీ సిప్ చేస్తూ శ్రీవారు “టీ చాలా బాగుందమ్మా..” అంటూ మెచ్చుకున్నారు కోడలిని.. నా వైపు చిలిపిగా చూస్తూ.

టీ ని ఆస్వాదిస్తూ కళ్ళముందు గుండ్రాలు తిప్పుకుంటున్నా ఆరునెలల గతంలోనికి....


ట్రింగ్.... ట్రింగ్..అంటూ కాలింగ్ బెల్ మ్రోగుతూ ఉంది. హేమంతం చలిలో మునగదీసుకుని ఒకరిలో ఒకరిగా పడుకున్న జంట లో నుండి “అశ్విన్ ఎవరో బెల్ కొడుతున్నారు. వెళ్ళి తలుపు తియ్యి.” గోముగా అంటూ దుప్పటి లాక్కుంది ప్రియ. ‘యు...’ అని విసుక్కుంటూ లేచి వెళ్ళి తలుపు తీసిన అశ్విన్ ఎదురుగుండా అమ్మ నాన్నలని చూసి అవాక్కయిపోయాడు.


‘మమ్మీ...!’ నోట మాట రాలేదు.

“ఏంటి నాన్నా! అంతగా షాక్ అవుతావు” అంటూ లోపలికి వచ్చారు ఇద్దరు. అంతలోనే “ హూఈజ్...” అంటూ చిన్న షాట్ వేసుకున్న ప్రియ నిద్ర కళ్లని నులుముకుంటూ బయటికి వచ్చింది. ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు తల్లితండ్రులు.


“మమ్మీ! ఈ అమ్మాయి ప్రియ. మేమిద్దరము కలిసి ఉంటున్నాము..” ఒకటే కంగారు లోపల... అయినా కప్పిపుచ్చుకుంటూ అన్నాడు అశ్విన్.


తండ్రి ఏమీ మాట్లాడలేక వాష్ రూమ్ లోకి వెళ్లిపోయాడు. కోపంతో ఎర్రబడ్డ ముఖంతో మాటలు రానిదానిలా కూర్చుండిపోయింది తల్లి.


కిచెన్లోకి వెళ్ళి ప్రియ ‘ఆహా నాచురల్ బ్రాండ్ టీ’ చేసి తీసుకుని వచ్చింది. వేడి వేడి పొగలు కక్కుతూ అల్లం, తులసిల మేళవింపుల సువాసనలతో తీసుకొచ్చిన టీ చూడగానే ఆవిడ కొంచం శాంతించింది. కప్పు అందుకుని సిప్ చేసి మెచ్చుకోలుగా ఆ అమ్మాయి వైపు చూసింది. తండ్రి కూడా వచ్చి ‘ ఆహా నాచురల్ బ్రాండ్ టీ ‘ తీసుకుని త్రాగుతూ అశ్విన్ ని, ప్రియాని ఎంతో ఇష్టంగా చూసాడు.

రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, మనసుకు హద్దుకునే ఆహ్లాదం అందించేది “ఆహా నాచురల్ బ్రాండ్ టీ” అన్న కాప్షన్ తో ఆడ్ ముగుస్తుంది.


“ఛీ! వెధవ సంత... భక్తి ప్రథానమయిన సినిమా కదా అని తగుదునమ్మా అని మిమ్మల్ని తీసుకుని వస్తే... ఈ అడ్వటయిజ్ మెంట్లు ఒకటి ప్రాణాలు తియ్యటానికి. అబ్బాయి, అమ్మాయి కలిసి ఉండటం ఒక ఫాషన్ అయిపోయింది. పెళ్లి గిళ్లి అవసరం లేదు. అబ్బాయితో కలిసి ఉన్నదట.. దీనికి ఈ అమ్మగారు టీ త్రాగగానే ఆమోదముద్ర వేస్తారన్నమాట. ఇలా ఆడ్ చేయటానికి వాళ్ళకి ఎలా అయిడియా వచ్చిందో? అంటే సహజీవనాన్ని ప్రోత్సహిస్తున్నట్టా... ఇలా అయితే మన సాంప్రదాయాలు మంట గలిసిపోవలసిందేనా..” విసుగు కోపం కలగలిపిన గొంతుతో కొంచం బిగ్గరగానే అంటున్న నా చెయ్యి అందుకుని ఆపమన్నట్టు చూస్తూ.


‘అబ్బా మళ్ళీ మొదలెట్టావా నీ ఉపోద్ఘాతాలు..ఆడ్ ని ఆడ్ లా.. సినిమాని సినిమాలా చూడు. ఎంజాయ్ చెయ్యి. లేకపోతే చూడకు, అంతేగాని మనం ఏం అనుకున్నా అక్కడ జరిగేది జరగక మానదు. యువతలో పెరిగిపోతున్న విదేశీ వ్యామోహం తీరదు... కూల్ సుశీలా..’ అంటూ అనునయించారు శ్రీవారు.


శ్రీవారి మాటలు నిజమే అయి ఉండవచ్చు కానీ సహజీవనం అనే కాన్సెప్ట్ ని సమర్థించటం మాత్రం తప్పు తల్లితండ్రులదే అవుతుంది. బ్రష్టుబట్టి పోతున్న ఈ సమాజానిదీ అవుతుంది. రాను రాను న్యూక్లియర్ ఫామిలిస్ కూడా పోయి ఎవరు బడితే వాళ్ళు కలిసి ఉండటం, వద్దు అనుకుంటే విడిపోవడం, మళ్ళీ వేరే వాళ్ళతో కలిసి ఉండటం, ఇక దాన్ని బ్రతకటం అనరు. మద్యలో పిల్లలు పుడితే వాళ్ళ గతి ఎంగాను. ఇలాగే అనాథ పిల్లలు తయారవ్తున్నారు. పెంపకాలు సరిగ్గా లేక లేనిపోని అలవాట్లు నేర్చుకుని, డబ్బు కోసం చెయ్యని పనులన్నీ చేస్తూ నేరస్తులు అవుతున్నారు.

మన భారతీయ సంస్కృతికి విదేశీయులు ఎంతో ముచ్చట పడుతూ వివాహ వ్యవస్త ఇలా ఉండాలి అంటూ వాళ్ళు వచ్చి ఇక్కడ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు కుటుంబం అంటే మన ఉమ్మడి కుటుంబం లాగా ఉండాలి అనుకుంటూ...

సంప్రదాయ దుస్తులను గౌరవిస్తూ.. మన కళలను ప్రోత్సహిస్తూ..మన పండుగలలో వారు ఎంజాయ్ చేస్తున్నారు..


మనవాళ్లు మాత్రం అమ్మానాన్నలు ఏది చెప్పినా పెడచెవిన పెడుతున్నారు. దుస్తుల దగ్గరినుంచి, అలవాట్ల వరకూ అన్నీ పోకడలే.. ఉద్యోగాలలో ఆడా మగా తేడా లేకుండా రాత్రి పగలు పని చేస్తున్నారు, ఫరవాలేదు కానీ అమ్మాయిలు ఎప్పటికయినా వారి సహజత్వాన్ని మరచిపోకూడదు కదా! ప్రకృతి పరంగా స్త్రీ ఎంతైనా బలహీనురాలే. అందుకనే మన పూర్వీకులు ఈ వివాహ వ్యవస్థను స్తృష్టించి అమ్మాయిలకు రక్షణ కల్పించి పురుషుడి జీవితానికి ఆలంబనను కలిగింపజేసారు. నూరేళ్ళ వీరి జీవితమే కాక మెట్టినింటి మర్యాదను కాపాడే గృహిణిగా.. ఆ ఇంటికి వారసులను ఇచ్చే కల్పవృక్షంగా స్త్రీని మలిచారు.


ఇది తెలుసుకోలేని అమ్మాయిలు యవ్వనంలో అడుగిడగానే రంగులలోకం లోని రంగులన్నీ మావే అన్న మత్తులో ఉండి పెద్దల మాటలను పెడచెవిన పెడుతున్నారీనాడు. జీవితం విచ్చిన్నం అయిన తరువాత ఇటు తల్లితండ్రులను ఎదిరించామనే బాధ ఒకవైపు, బయటికి మొఖం చూపించుకోలేక తాము ఉన్న స్థితిని తట్టుకోలేని మానసిక దౌర్బల్యంతో ఆత్మహత్యలు చేసుకుంటూ కన్నవారికి కడుపు శోకం మిగిలిస్తున్నారు’ ఆవేదనతో నాలో నేనే అనుకున్నా అంతలో సినిమా టైటిల్స్ పడటంతో సినిమా చూడటంలో లీనం అయ్యాను.

****

మా అబ్బాయికి చెన్నయ్ లో ఉద్యోగం వచ్చింది. తప్పనిసరిగా తన ఫ్రెండ్ నివాస్ తో కలిసి ఫ్లాట్ అద్దెకు తీసుకుని షేర్ చేసుకుంటున్నాము అని చెప్పాడు వరుణ్. నేను మా వారు వెళ్ళి అన్నీ కావలిసినవి కొని పెట్టి జాగ్రత్తలు చెప్పి వచ్చాం.


ఇంటికి వచ్చామే గాని నేను ‘ఆహా నాచురల్ బ్రాండ్ టీ ‘ ఆడ్ ని మరచి పోలేకపోతున్నా.. ఎందుకంటే ప్రతి అరగంట కోసారి టీవీలో వస్తూనే ఉంటుంది ఆ ఆడ్. మా అబ్బాయి గురించి నాకు భయం వేస్తుంది ఒక్కోసారి. అదే విషయం శ్రీవారితో అంటూ ఉంటే.. ‘నీవు అలాంటి భయాలు పెట్టుకోకు. మన వాడు అలా ఏం చెయ్యడు. ఏదైనా ఉంటే చెపుతాడు. మనం వాడికి ఆంత ఫ్రీడం ఇచ్చాం కదా! మన పెంపకంలో పెరిగిన వాడు సుశీ..’ అంటూ శాంతపరుస్తూ ఉంటారు.


ఒకరోజు పొద్దున్నే కాలింగ్ బెల్ మ్రోగుతుంటే ఎవరా అనుకుంటూ తలుపు తీసి చూసాను. ఎదురుగా నవ్వుతూ మా అబ్బాయి వరుణ్, ఆ వెనుకనే ఒక అమ్మాయితో..


“అమ్మా! ఈ అమ్మాయి అవంతిక, నా కొలీగ్, మాకు కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంది త్వరగా రడి అయి వెళ్ళాలి..”అంటూ

‘కం అవంతి..’ అంటూ ఆ అమ్మాయిని లోనికి తీసుకుని వచ్చాడు..


లైట్ బ్లూ కలర్ చూడిదార్ తో పొందికైన తీరుగల అమ్మాయిని చూడగానే నా గుండె జారిపోయింది. వెంటనే ‘ఆహా నాచురల్ బ్రాండ్ టీ’ ఆడ్ గుర్తుకు వచ్చింది.

లోలోనే ఒకలాంటి గుబులుతో ఆలోచిస్తూ వాళ్ళకి కాఫీ టిఫిన్స్ ప్రిపేర్ చేసాను..


ఆ అమ్మాయి చక్కగా ఉంది. జంట బాగుంది. ముందు నేనే చొరవచెయ్యలి. ఈ అమ్మాయినే కొడలిగా తెచ్చుకోవాలి అన్న ఆలోచనకి బలాన్ని చేకూర్చుకుంటూ. అవంతికని వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాను. వాళ్ళు తెలుగువాళ్లే. చెన్నైలో సెటిల్ అయ్యారు. తెలుగు బాగా మాట్లాడుతుంది.

ఆ తరువాత వాళ్ళ అమ్మగారి సెల్ నంబర్ అడిగాను.. ‘ఎందుకు ఆంటీ’ అన్నట్టుగా చూసింది కానీ అనలేదు. మౌనంగా ఇచ్చింది.


వాళ్ళ అమ్మగారితో మాట్లాడాను. వాళ్ళు కూడా మా అబ్బాయిని చూసారట. పెళ్లి ప్రపోజల్ పెడితే సంతోషంగా ఒప్పుకున్నారు.


ముందు మా అబ్బాయి “అమ్మా! మాకు ఇంతవరకు ఆ ఉద్దేశం లేదమ్మా! మేము ఒక్కచోట వర్క్ చేస్తాము. మంచి స్నేహితులం. నీవు ఇలా ఎలా అనుకున్నావు..” అంటూ ఎదురు ప్రశ్న వేశాడు.

‘స్నేహితులు అయితే ఏమవుతుంది నాన్నా! జీవితం పంచుకుంటే ఒకరికి ఒకరు మంచిగా అర్ధం చేసుకుంటారు. మా ఇద్దరికీ అమ్మాయి బాగా నచ్చింది. ఎలాగూ నీకు పెళ్లీడు వచ్చింది కదా..” వరుణ్ ని బుజ్జగించాను.


అప్పుడు మా శ్రీవారు..”అమ్మకి ‘ఆహా నాచురల్ బ్రాండ్ టీ’ ఆడ్ భయం రా..” అంటూ పడి పడి నవ్వారు.

బిత్తర పోవడం మా అబ్బాయి వంతయింది.

****

గుండ్రాల్లోనుంచి బయిటికి వచ్చి నాలో నేను నవ్వుకుంటూ అనుకున్నాను.. మొత్తానికి మా అబ్బాయి పెళ్ళికి నేను ఎక్కువ శ్రమ పడకుండా... మంచి అమ్మాయిని కొడలిగా తెచ్చుకున్నాను.


ఈ తరం అమ్మాయిలు ఇలా కూడా ఉన్నారు అని మా అవంతికను చూస్తే తెలుస్తుంది. వినయం, విదేయత, పెద్దలపట్ల గౌరవం, ఉన్నత విద్యలను అభ్యసించినా కించిత్ గర్వం కూడా లేదు, అంతటి సంస్కార వంతురాలిగా తీర్చిదిద్దారు వియ్యంకులు వాళ్ళ ఒక్కగానొక్క అమ్మాయిని.

నిజం చెప్పాలంటే ‘ఆహా నాచురల్ బ్రాండ్ టీ’ మహిమ కదూ మరి.


***సమాప్తం***


సుజాత తిమ్మన గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఇక్కడ క్లిక్ చేయండి.

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: పేరు సుజాత తిమ్మన.

https://www.manatelugukathalu.com/profile/sujatha/profile

డిగ్రీ చదువుతుండగానే వివాహం... ఆ తరువాత ఇద్దరు అమ్మాయిలు.

చిన్నప్పటి నుంచీ మనసులో కలిగిన భావాలను నోటు పుస్తకంలో వ్రాసుకోవడం అలవాటు.

అలా కవితలు లెక్కకు మించి వ్రాసాను, వ్రాస్తూనే ఉంటాను.

ఆంధ్ర భూమి సచిత్ర వార పత్రికలో తరచుగా ప్రచురితం అయ్యేవి.

బహుమతులు, ప్రశంసా పత్రాలు రావడం సర్వ సాధారణం.

ముఖ పుస్తకంలో అనేక సమూహాలలో నేను కనిపిస్తూనే ఉంటాను.

30 కథల వరకు వ్రాసాను. ఇక ఈ కథ "అర్థాంగి" నమస్తే తెలంగాణ వీక్లీ లో అచ్చయిన కథ.

మన తెలుగు కథలు లో నన్ను చేర్చుకున్నందుకు ధన్యవాదాలతో...

సుజాత తిమ్మన.


45 views1 comment
bottom of page